భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, January 25, 2011

పంబోతులారా ఆంబోతులారా

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

ముంగాలు మడవండి దండాలు పెట్టండి
బంగారునగలెంత బుసనాగు మణిచెంతఁ
సింగారమీ కెంపు సీమేను నెత్తురు
పొంగారుఁ మా ఱేటి మహిమ నేలంతఁ

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

పోతులన్నిటికన్న నీడి పోతే మిన్న
తెల్లనీ గంగడోలు తళతళా మెఱిసేను
తోకసప్పిటితోన దులిపేను దిక్కుల్ని
సూది కొమ్ములతోన సంపేను కామణ్ణి

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

అమ్మోరి వాకిటా ఆగేడు సూడండి
బెమ్మోడి పుఱ్ఱెనే సాసేడు సూడండి
కమ్మనీ పెరుగన్న మేసింది మాయమ్మ
గుమ్మనే మారేడు పువ్వోటి నావంతు

పంబోతులారా ఆంబోతులారా
అడిగోనయ్యా ఆదిమహాశివయ్య

Saturday, January 01, 2011

పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం

ఆశ. విద్యలేనివాఁడు వింత పశువు అన్నారు గాని, ఆశ లేని వాడిని గుఱించి ఏమీ చెప్పలేదు.
బుద్ధినాశాత్ ప్రనశ్యతి అన్నారు గాని, ఆశనాశాత్ కిం నశ్యతి అన్నదీ చెప్పలేదు.

చిన్నప్పుడు గుర్తుందా, ఏమీలేకపోయినా ఆశ వుండేది.
వెనకఁబడిన దేశమైనా, దిక్కుమాలిన విద్యావ్యవస్థ అయినా, హక్కులు లేని పిల్లలైనా, డబ్బు దైవమని నమ్మింపజేసినా, పరాయివారు పాలించి దోచుకున్నారని చెప్పినా, స్వపాలకులు సైతం దోచుకున్నారని చెప్పినా, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఆశ వుండేది.

"తరలిరాద తనే వసంతం తనదరికి రాని వనాల కోసం" అన్నంత ఆశ వుండేది.
వానాకాలపు వరదలకుకొట్టుకుపోయిన చెఱువు గట్టు మీద అప్పుడే తాత్కాలికంగా వేసిన ఇసుకబస్తాల ప్రక్కననుండి జాగ్రత్తగా బడికి బయలుదేరి మెటడారులో వెళుతుంటే, డ్రైవరు చిన్నబ్బాయికి దక్కిన ఒకే ఒక్క పాటల క్యాసెట్టు గీతాంజలి వేయవసారి మ్రోగిస్తుంటే, ఇళయరాజా సంగీతానికి వేటూరి పాటకు బాలు గొంతు తోడుగా పంపి, ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈవేళ అని వినిపిస్తుంటే, బళ్ళో లెక్కలపంతులు భయము, ఇంట్లో పెద్దవాళ్ల బుద్ధిచెప్పుళ్ళూ, అన్నీ మాయమయ్యి, ఒక నాడు మనమూ ఒక జీపుని ఒక మంచుతాకే మట్టిరోడ్డు ప్రక్కన నిలిపి అడవిలో పాటలు పాడుకుంటూ వెళ్ళవచ్చునేమోననుకునేవారం. పంతుళ్ళ బెత్తాలనుండి, పెద్దాళ్ళ నీతిబోధలనుండి దూరంగా పోవచ్చనుకునేవారం. లేకపోతే వర్షంలో గొడుగు ప్రక్కనపాడవేసి పచ్చటి దిబ్బల మీద వళ్ళంత త్రుళ్ళేట్టు ఆడవచ్చని అనుకునైవారం గుర్తుకువుందా.

ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,హిమానీ నిబిడ హేమంతములు,చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల క్రీడలాడుతవి మీ నిమత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,లనేక వర్ణా, లనంత రోచులు దిక్కు దిక్కులా దివ్యగీతములు మీరూ వాటికి వారసులే!
అని శ్రీశ్రీ అంటే అర్థంకాకపోయినా తలనడ్డంగా ఊపేవారిమే!

ఎన్ని పచ్చి అబద్దాలు !!! సుందరయ్య సచ్చివూరుకున్నాడుగాని లేకపోతే బోనులో నిలదీసేవాడినే! చేతదక్కితే మణిరత్నం కెమెరాని వెయ్యముక్కలు చేసేవాడినే!

ఏదో ఒక చోటుని ఆ వేటురి పాటగా ఊహించుకొని,
పరుగుపెట్టి అక్కడకు వెళ్ళి, అదింకా దూరంగా జరుగుతుంటే,
ఎండమావిలాగ దానిని వేటాడి వేటాడి అలసిపోయి
ఎడారిలో పడివున్ననాడు, అప్పటివఱకూ అభివృద్ధి చెందిన జ్ఞానం
నడినత్తిన పొద్దు మల్లే వళ్ళు కాల్చివేస్తుంటే,
తెలుసుకొన్న ఒక్కొక్క విషయం,
చిల్లరగాలిలా ఒక్కొక్క ఆశని ఆర్పేస్తుంటే.
వైరాగ్యపు ఇసుకతిన్నెలు అన్నిదిక్కులూ మూసివేస్తే,
బ్రతికివుండడానికి ప్రతినాడూ బ్రతికివుండడమే గొప్పయని గుర్తుచేసుకుంటూ,
గంటకోగుదిబండ దింపినట్లు నెట్టుకువస్తుంటే,
ఏమైపోయింది ఆ అమాయకత్వం, ఎవర్రెత్తుకెళ్ళిపోయారు.
ఎవడా బేహారి గులాబీలు తీసుకొని గుచ్చుకొనే ముళ్ళు ఇచ్చిపోయినాడు.

చంపినవాడికే బ్రతుకు ద్రక్కుతుందని తెలుకొని బ్రతకగడమా,
తిండి పెట్టే తోటలకై నేలకొఱిగిన చెట్లలో పిట్టల గోల వినపడుతుంటే తినగలమా,
జగాలకు పాలుపోసి పెంచిన తల్లిమెడలో పుఱ్ఱెలు చూసినవాడికి పాలమీద ఆశవుంటుందా
పిల్లల పాలకోసమై రక్తం త్రాగే కాళిక జుట్టు పట్టుకొని వేళ్ళాడుతూ ఈ జీవుఁడు
జారిపోయి మృత్యువను అఖాతంలోనికి పడి మాయమైపోతాడనే భయంతో పట్టు బిగించి,
వెఱ్ఱిది విలయతాండవం చేస్తుంటే,
పైగసి కొంత సేపు, పైనున్నానని భ్రమించి మురిసి,
క్రిందికి జారి కొంతసేపు క్రిందనున్నాని ఏడిచి,
ఇటు ప్రక్కకూగి అటు ప్రక్కకూగి ఇంకా గట్టిగా పట్టుకొని,
ఇంతా చేసి ఆఖరుకి వయస్సు మళ్ళినపుడు, పట్టుసడలుతుందని తెలిసినా బుద్ధిరాదే,
పుఱ్ఱెలు కాళిక కాళ్ళక్రింద పఠ్ఠు పఠ్ఠు మని ప్రేలుతున్నా ఆ చప్పుటికి మేలుకువరాదే.

మాయమోహించి ముట్టుకుంటే బూడిదచేస్తుందని ఎఱుఁగకా,
తానైన ఈ మిథ్యాజగత్తులో తన మగని ఉనికి నిలుపుటకోసమై
ఎంతవారలనైనా కాంతదాసులని చేస్తుందని ఎఱుఁగకా,
కూడు దొరకక మనివేస్తే కడుపులో మంటై మండుతుందే,
ఆశ తీఱక అలసిపోయినపుడు మదిలో క్రోధమై రగులుతుందే,
కష్టపడి కూడు పోసిన వాడిని కొన్ని గడియలకు మరలా కాల్చనుందే,
ఎంతటెంతటికోనోర్చి ఆశ దీర్చిన వాడిని ఇంకా పెను యాశయై తోసిందే,
సత్తువున్న వాడిచేత నీరసుణ్ణి సంపించిందే, వాడి మాంసాని కూటిగా వీడికి పెట్టిందే,
ఇన్నీ చూసినా ఎంత చెప్పినా ఇంకా దాని వెంటే పోయిందే వెఱ్ఱి దేహము.

వైరాగ్యమను వికారముతో తిండి నప్పనినాడు
బండలని మ్రోసిమ్రోసి వీపు బ్రద్దలైననాడు
మాయలోఁబడి ఏది కానుకో ఏది కత్తివేటో తెలియనినాడు
బట్టకూడా పెట్టక కాడులమ్మట త్రిప్పే తన తిక్కమగని
ఈ ప్రక్కకు పంపుతుందని నమ్మి ఆగేదా
లేదా
ఏలాగూ వాడు గుడిసె వేసి కాసే కాటికేగా
కడకు పోయేదని తెలిసి అందాకా ఓర్చేదా?

అంకితం- ప.నా.రా
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం