భాషందం, భువనందం, బ్రతుకందం

Showing posts with label భారతీయ జీవన శైలి. Show all posts
Showing posts with label భారతీయ జీవన శైలి. Show all posts

Saturday, April 10, 2010

అమ్మమ్మ కబుర్లు ౨ - భారతమంతా బొంకూ రామయణమంతా రంకూను

"ఎరా విదురుడంటే ఎవర్రా? "
- "దృతరాష్ట్రుని తమ్ముడే।"
"దాసీకొడుకేనా? "
- "అవును।"
"అదే మహర్షి వచ్చినప్పుడు పెద్దదేమో కళ్ళు మూసుకుంటుంది। అప్పుడు దాసీకి పుట్టినోడేనా?"
- "ఊఁ"
"ఇప్పుడు వ్యాసుడికి ఏమవుతాడు "
- "మహర్షి వ్యాసుడేకద। "
"ఊహూఁ। నేను శంతన మహారాజు కథ చదివాను। "
- "శంతన మహారాజుకి ఇద్దరు కొడుకులుకదా సత్యవతి కడుపున। "
"చిత్రవిచిత్రులు"
- "అవును, మరి వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా। అప్పుడు వ్యాసమహర్షి గర్భదానం చేయడానికి పిలుస్తారు। అన్నగారి వరస అవుతాడుగా।"
"అదేంట్రా, శంతన మహారాజుకిద్దరు కొడుకులుగా। "
- "కానీ శంతన మహారాజు భార్య సత్యవతీ దేవికి పెళ్ళికాకముందే పిల్లవాడుంటాడే। "
"పెళ్ళి కాకుండా ఎలాగురా"
- "అదే చెబుతున్నానుగా విను। ఒక రోజు సత్యవతీ దేవి అంటే .."
"అదే పడవనడుపుకునేది। "
- "అవును ఆవిడ పడవమీద జనాల్ని నదికి అవతల దాటవేస్తుందిగా, మహా అందగత్తె అన్నమట, అక్కడికి ఒకరోజు ఒక ముని వస్తాడు।"
"అవును అదే శంతన మహారాజు కథలో నేను చదివాను, శంతన మహారాజు గంగాదేవిని పెళ్ళి చేసుకుని ప్రశ్నలేమీ అడకూడదంటుందికదా। అప్పుడేమో..."
- "ఇదంతా దాని ముందే। పరాశరముని వుంటాడు।"
"అదే నేను శంతన మహారాజు"
- "చెబుతావా వింటావా?"
"చెప్పు"
- "శంతన మహారాజు సత్యవతీదేవిని కలవక ముందురే , భారతం మొదట్లో, పరాశర ముని సత్యవతీదేవి వుండే రేవు కాడకు వస్తాడు, మన కొవ్వూరి రేవులాగ। ఆవిడేమో పడవదాటేస్తుంటుంది ఇతనిని। మధ్యలో మునికి ఆమెను చూసి కోఱిక కలుగుతుంది। మధ్యలో ఒక దీవిలో పడవ ఆపిస్తాడు, గోదారి మధ్యలో దీవులుంటాయిగా, అక్కడ వాళ్ళు ఏదోచేసుకుంటారు। "
"ఊఁహూఁ"
- "అదే మఱి నాకు పెళ్ళి కాలేదుగా, వాళ్ళ అక్కడ ఏం చేశారో నాకెలా తెలుస్తుంది, నీ పెళ్ళి ఎప్పుడో స్వతంత్రంరాక ముందు అయ్యిందిగా నీకే తెలియాలిలే। "
"ఊఁ నీకు తెలియదంటే నమ్మాలి। దేశాలన్నీ తిఱిగివచ్చావు కదరా ఇంచక్కా।"
- "అలా అక్కడ ఆ ద్వీపం మీద అప్పటికప్పుడే వాళ్ళకు పిల్లాడు పుడతాడు। అందుకే ఆయనకు ద్వీపం మీద పుట్టాడు పైగా నల్లగావుంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, ఇంకా బాదరాయణుడు, పరాశరుని కొడుకు కాబట్టి పారాశరుడు అని పేర్లువున్నాయి వ్యాసమహర్షికి।"
"అయితే శంతన మహారాజు కలిసిందెప్పుడు? "
- "నువ్వూనూ మీ శంతన మహారాజూనూ। విను। అప్పుడేమో ఆవిడ ఇలా కన్యను నా కన్యత్వం పోగొట్టారు మహర్షీ అంటే, పరాశరుడు, ఏదో మాయచేసో మంత్రం వేసో, ఆమె కన్యత్వాన్ని వెన్నక్కి ఇచ్చేస్తాడు। అది కూడా నీకే తెలియాలి। అవన్నీ। "
"ఊఁ"
- "ఆ పిల్లాణ్ణోమో ఆవిడి చిన్నప్పుడే ఋషులదగ్గరకు పంపించేస్తుంది, ఆయన వ్యాసముని అవుతాడు। మీ శంతన మహారాజు వచ్చేసరికి మళ్ళీ సిద్ధంగా వుంటుంది ఈమె। "
"ఓహో"
- "శంతన మహారాజుని పెళ్ళిచేసుకున్నాక, చిత్రవిచిత్రులు పుడతారుగా। "
"అవును"
- "వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా పిల్లలు పుట్టకుండా। అప్పుడు వాళ్ళకి అన్నవరసయ్యేవారు వీర్యదానం చెయ్యాలన్నమట పెళ్ళాలకి। "
"ఆన్? "
- "అదే మరి భీష్ముడు మొగుళ్ళకు అన్నగారు కదా, అంటే బావగారి వరస కదా? "
"అయితే, ఛిఛీ మఱీ అదేంటిరా, ఎంత మొగుడు చచ్చిపోతే మాత్రం। బావగారితోనేంటిరా"
- "అదే రాజులకు వంశం ఆగిపోకుండా అన్నగారు వీర్యదానం చెయ్యవచ్చన్నమట।"
"అందుకేనేమో జనాలంటారు భారతమంతా బొంకూ రామాయణమంతా రంకూ అని। "
- "అదేనే మఱి క్షత్రియులు కదా, రాజులు లేకపోతే రాజ్యం ఏమయిపోతుందే, అందుకే వాళ్ళ అలాచేయవచ్చని అప్పటిలో నియమం వుంది।" (ఇంత అలౌకివాదం నేను జనమలోనెప్పుడూ గుప్పించలేదు) " ఇంతకీ ఏమంటారూ జనాలూ? "
"రామాణమంతా రంకూ భారతమంతా బొంకూ అంటారు। అదే మఱి సీతాదేవిని ఎత్తుకెళ్ళి అన్నాళ్ళు అక్కడవుంచుకున్నాక అప్పుడు వెనక్కి తీకుకొచ్చాడగా రాముఁడు। అదే జనాలకు తెలియక అలా అంటారులే। "
- "అవునా, బానేవుంది। మొత్తానికలా వంశవృద్ధికోసం వీర్యదానానికి భీష్ముణ్ణి అడుగుతారు। కానీ అయనేమో భీష్మప్రతిజ్ఞ చేస్తాడుగా నా వారసులు రాజ్యమేలరని। సత్యవతీదేవి వారసులే ఏలతారని। వీళ్ళు సత్యవతీదేవి వారసులయిననా ఈయన వారసులు కూడా అవ్వకూడదని అయన ససేమిరా వల్లకాదంటారు। అప్పుడేమో ఆవిడ ఇలా నా పెళ్ళికాకముందు ఇలా జరిగింది కథ అనిచెబితే వ్యాసుణ్ణి పిలుస్తారన్నమట।"
"ఆయనేమో భయం కరంగా వుంటాడంట కదరా"
- "అవును, అందుకే పెద్దది అంబా అంబాలికా దానిపేరు అది కళ్ళు మూసుకుంటుంది"
"ఒకత్తేమో తెల్లమోతుంది కావోల్సు అందుకే దానికి తెల్లగా పాండురాజు పుడతాడు"
- "రెండోదేమో తెల్లబోయి చమట్లు కక్కేస్తే దానికి పాండురాజు పుడతాడు। "
"అప్పుడు దాసీని పంపిస్తారనుకుంట।"
- "మఱి పెద్దోడు గుడ్డోడు, రెండోవోడు పాండుజబ్బువుందికాబట్టి, పెద్దదానికి నచ్చజెప్పి మళ్ళీ పంపుతారు। అదేమో భయపడిపోయి దాసిని పంపిస్తుంది। దాసేమో మహర్షి నా అదృష్టం ఈయనకు సేవచేయడం అని చెప్పి..."
"అదేమో మహర్షిని మంచి చేసుకుంటే విదురుడు పుడతాడన్నమట, కానీ రాజు అవ్వడుగా। "
- "ఆ దాసేమో మహర్షికి సకల సేవలూ చేసి సంతోష పెడితే, ఆయన విదురుణ్ణి కలుగఁజేస్తాడు, కానీ మఱి దాసి కొడుకు కాబట్టి రాజుకాలేడు। అదన్న మట కథ। ఇప్పుడేమో ఆరణ్య పర్వంలో దృతరాష్ట్రుడు వాడి మీద కోపం వచ్చి అడవికి పంపేశాడు ధర్మరాజుదగ్గరకు। ఊఁ చూడు చెబుతున్నారు।"

Tuesday, April 06, 2010

అమ్మమ్మ కబుర్లు ౧ - మాఁవయ్య వరస

"ఏంట్రా అది?"
- "ఇదిగోనే గోదారి, తిను అచ్చం చాక్లేటులా వుంది। "
"చిచ్చీ అదేం తినడంరా, అందంగా పళ్ళెంలో పెట్టుకుని తినడం మానేసి।"
- "చాలా బాగుందే, నెయ్య చాలా బాగా అంటుకుంది, బాగా మాడ్చకుండా లేతగా వుంది। ఇదే కొట్టులో కొంటే ఎంతో తెలుసా, ఈ మాత్రం ముక్కకి ఒంద రూపాయలంటాడు। అంతిచ్చినా దొరుకుతుందని లేదే।"
"నేను ఎంగిలి తిననురా।
ఒక సారి ఏమయిందంటే, నా పెళ్ళికి నేను చాలా చిన్నదాన్నిరా।
మా చింతాత అదే మా మాంగారు వచ్చి, మా అమ్మతోనే, అమ్మా మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి చెయ్యమ్మా, ఐదోవోడికి దీన్ని చేస్తే ఆరోవోడికేమో మా మనవరాలిని చేస్తాము। అన్నాడు।
మా అమ్మేమో ఇప్పుడే పెద్ద దాని పెళ్ళి చేశామండి మా తమ్ముడికి ఇంకా ఇదీ చిన్నపిల్లే దీనికి ఇప్పుడే చెయ్యమండీ అని మా అమ్మకేమో ఇంకా పెళ్ళి చేయడం ఇష్టం లేదు।
ఆయనేమో, లేదండి పెద్దదాన్ని మాఁవయ్యకిచ్చి చేసారు కాద, దీన్ని కూడా మాఁవయ్యకిస్తే సుఖపడతుంది। అన్నాడు।
మా అమ్మే అన్నీ చూసుకునేది మా పెళ్ళి విషయాలూ గట్టా, మా అయ్య కేమో పెద్ద తెలిసేది కాదూఽఽ।
అప్పుడేమో మా తాత ..."
- "అంటే మీ మాంగారు.."
"అపుడేమో ఆయన, మా అన్నమనవరాలు వుంది దాన్ని కూడా మాఁవోడికిచ్చి చేస్తామంటున్నారు, మాకేమో మీరైతేనే బాగుంటుందనుకుంటున్నాము। "
- "అంటే తాత పెదబాబు కూతురి కూతురు। "
"అవును। "
- "అంటే తాతకి నువ్వేమో పెత్తల్లి కూతిరి కూతురు, ఆవిడేమో పెదబాబు కూతిరి కూతురు। "
"అవును।"
- "ఇద్దరూ మేనగోడళ్లే।"
"అవును।
మా గంగరాజు మాఁవయ్యకేమే నన్ను వీళ్ళకిచ్చి చేసేద్దామనుండేది, మా అమ్మకేమో అప్పుడే ఎందుకనుకునేది।
గంగరాజు మాఁవయ్యంటే, అదే మా అమ్మ మార్టు తమ్ముడు, పెద్దవాడు। "
- "అంటే వెంకటరత్నంగారి అన్నయ్య।"
"అవును। "
- "అంటే మీ బావగారి అన్నయ్య।"
"అవును।
ఆయనేమో మా పిన్ని కూతుర్ని చేసుకున్నాడు। అంటే సొంత అక్కకూతుర్ని చేసుకున్నాడు। "
- "అయితే ఇప్పుడు మీ అమ్మ పెద్ద తమ్ముడేమో సొంత అక్క కూతుర్ని, మీ అమ్మ రెండో తమ్ముడు మీ అక్కని, అంటే మార్టక్క కూతుర్ని చేసుకున్నారు, మళ్ళీ తాతేమో మీ అమ్మకి పింతల్లికొడుకు నిన్నుచేసుకున్నాడు। దేశమ్మీద ఎవరూ లేనట్టు అందరూ అక్క కూతుళ్ళనేనన్నమట।"
"ఇంకా వుంది విను।
మా తాత, అదే మా మాంగారు ఇలా పలానా తారీఖున బల్లిపాడులో దినం వుంది మఱి, ఆనాడు వాళ్ళు, అందే మీ తాత పెదబాబు ఆళ్ళు అక్కడికి వస్తున్నారు, తాంబూలాలు పట్టుకొని, వారికంటే మీరు ముందు వచ్చి ఇస్తే మీకే ఇస్తాము। లేకపోతే సంబంధం వారికెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు।
మా గంగరాజు మాఁవయ్య ఆనాడు బల్లిపాడు వెళ్ళాడు, వాళ్ళు కూడా వచ్చారు, ఒక పక్క దినం జరుగుతుంటేనే, వాళ్ళు వీధి గుమ్మమమ్మటా వస్తుంటే, మా గంగరాజు మాఁవయ్య దొడ్డి గుమ్మమంటా వెళ్ళి తాంబూలం ఇచ్చేసి పెళ్ళి కాయం చేసేశాడు।
ఆ తరువాత వాళ్ళేమో ఆ పిల్లని చిడిపి ఇచ్చారు। "
- "అంటే గోదారి గట్టు మీద వూరు కదా?
అవును। వాళ్లూ బాగానే వుండేవారులే। ఇప్పుడు కాస్త చితికారు గాని।
ఆ తరువాత మా మరిదికి మా ఆడబడుచు కూతుర్ని అనుకున్నారన్నానుగా। "
- "అదే మీ మరిదంటే మీ మాఁవయ్య కూడా, తాత తమ్ముడు చివరతను కదా। "
"ఊఁ"
- "మీ ఆడబడుచంటే మీ పిన్ని, మీ పిన్ని కూతురు అనసూయత్తని ఆఖరు తాతకనుకున్నారా? "
"కానీ జరగలేదుగా, వీరమ్మమామ్మతో అయ్యింది ఆయన పెళ్ళి।
వీరమ్మ నాకంటే పెద్దదేగాని, కాపరానికి మాత్రం నా తరువాతే వచ్చింది, అదీ మా చుట్టమే అంతకు ముందే। "
- "అయితే మీ మాఁవయ్యలందరూ వరుసగా మీ అప్పాజెళ్ళెళ్ళని చేసుకున్నారు, మీ తమ్ముళ్ళేమో మీ కూతుళ్ళని చేసుకున్నారన్న మట। "
"అప్పట్లో మఱి మా అమ్మ ఆఱుగురి పెళ్ళిళ్ళు చేసింది, అందరం సుబ్బరంగా కాపురాలు చేసుకున్నాము। ఈ రోజుల్లో ఒకటి రెండు పెళ్ళిళ్ళకే కష్టపడిపోతున్నారు, చేసినా అయ్యి నిలవట్లేదు।
మా అప్పుడు ఇన్ని చూసేవారేంటి, మేమంటే జనాలు మంచోళ్ళని, అందరూ ఎగబడి చేసుకునేవారు। తాతాళ్ళు మంచోళ్ళని మా మాఁవయ్య కూడా మా పెళ్ళి కుదిర్చేశాడు।
ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడేమో నాకు ఎందేళ్ళో ఎంతోరా, పెళ్ళయ్యాక గుడికి తీసుకెళ్తే గంట అందకపోతే, మా తాత "
- "అదే మాంగారు "
"ఆయన ఎత్తుకుని గంట అందించాడు।
అప్పుడు తాతకి పట్టించిన పానకం నాకిచ్చారు తాగమని, నాకేమో అసలు ఎంగిలి ఇష్టముండదు। నెత్తిమీదఁ సుడుపుడుకాయ వేసిందన్నమట, మా తాత దాన్ని ముట్టుకుంటే, కందిపోయిందని ఏడేసి మారాం జేసి తాగలేదు। అప్పుడెంత నేను, మీ బుజ్జక్క పిల్లలంత వుండేదాన్ని, తాతేమో నీలాగ వుండేవాడు, నీకంటే చిన్నోడేగాని, అంత పెద్దగా పొడుగ్గావుండేవాడు, నేనేమో ఇంతే వుండేదాన్ని। "
- "ఇంచక్కా నీ పెళ్ళయ్యి ఢబ్బై యేళ్ళయ్యాయి, నాకింకా అవ్వలేదే! "
"చేసుకోఽఽ, ఎవరొద్దన్నారు। ఎప్పుడూ పెళ్ళిపెళ్ళంటావు చేసుకోరాదా। "
- "ఊఁఽఽ ఎనిమిదయ్యింది పద టీవీలో భారతం వస్తుంది।"

Sunday, June 21, 2009

మన సంస్కృతి

మనలో చాలా మంది అబ్బో తెలుగు చచ్చిపోతుంది. బాబోయ్ తెలుగు చచ్చిపోతుంది. లబో దిబో లబో దిబో అంటూంటారు. అలాంటి వారికి నాకో ప్రశ్న మీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో ఎందుకు వేశారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయేది పూర్తిగా వేఱే అంశం గుఱించి. అది చెప్పిన తఱువాత మీరు వేంటనే మీ పిల్లల బడికి వెళ్ళి వాళ్ళ ప్రినిసిపాలునితో "మా కిడ్సు ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ లో చదవడం మాకు లైకింగా లేదు. ఇప్పుడే డిస్‌కణ్టిఞూ చేసి, ఒక గుడ్ టెల్గు మీడియమ్ స్కూలులో చేరుస్తున్నాము" అని అంటారు, మాది పూచి.

ఇక మన 'మన సంస్కృతి' గుఱించి
నేనీ మధ్యన పూర్తి స్థాయి తెలుఁగు గ్రామజీవనావిధానవిశ్లేషకునిగా మారాను. అందులో నాకు దొరికిన ఒక మచ్చుతునక మన అనే మన భాషకు ప్రత్యేకమైన మాట. మీ మా లతో బాటుఁ మన అనేది మన భాషకు ప్రత్యేకం. మనలా (బ్లాగర్లలా) ఆంగ్ల భాష నేర్చి తెలుఁగు నుడికారం మీద పట్టు కోల్పోయిన వారు కాకుండా, గ్రామాల్లో అచ్చంగా తెలుఁగు మాత్రమే ఎఱిఁగిన వారు వుంటారుగా, వాళ్ళ మాట తీఱులో చాలా చమత్కారాలుంటాయి, అందులో మన అనేది ముఖ్యమైనది.

ఉదా ౧
మా చిన్నాన్న పొలం వెళ్ళాను ఒక సారి, పంచుకున్నాక అదే మొదటి సారు అనుకోవచ్చు. ఆయన "ఈ పొలం మనకు వచ్చిందిరా" అన్నడు. దానర్ధం ఆయనిదనా, మా నాన్నదనా? ఆయనిదనే ఎందుకంటే, వేంటనే "ఆ కంచవతలిది మీ నాన్న కొచ్చింది" అనన్నాడు కాబట్టి.

ఆస్తి హక్కులు అనేది విశ్వమానవ చరిత్రలోనే అతి ముఖ్యమైన కట్టుబాట్లలో ఒకటి అని ఎంబియే చదివిన మీ మిత్రుడు అనవచ్చు. అప్పుడే అర్ధమవుతుంది మనము ఎంబియే చదవకూడదని, చదివినా మన పిల్లల్లి చేతఁ జదివించకూడదని, చదివిన వారి జట్టు కట్టకూడదని. మనలో కొందఱు ఇప్పటికే ఆ తప్పు చేసివుంటారు, వారికి నా సహానుభూతి. ఆస్తి హక్కులు అనేది మనము గతిలేక గొడవలు తగ్గించుకోవడానికి ఏర్పఱచుకున్నవి. అనాదర్శ ప్రపంచంలో అదోక ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. కాబట్టి ఆదర్శాన్ని కోఱుకునే ఏ మనిషైనా ఆ అంశాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడు. అందుకే మనకుంది మన అనే పదం.

ఉదా ౨
మా అన్నయ్య (పెదమామ్మ మనఁవఁడు) నాతో అన్నాడు "ఎప్పుడైనా రారా మన పొలం, ఆ పోతారం రోడ్డు వుందిగా అక్కడే, బాబాయి పొలం దాటిన తరువాత". ఆయని పొలం ఆయనిదే, మాది మాదే, కానీ ఇలాంటి సందర్భాలలోఁ, మా అనే పదం పైన చెప్పుకున్న కారణాల వలన, అంత సంస్కారవంతమైన పదము కాదు.

కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాల్సివుంటుంది.
మనకు ఎన్ని సాల్తీలు వున్నాయేంటి?
ఎనభై, గిత్తలు ఇంకో ఇఱవై వుంటాయి. జొన్న చే౨ను ప్రక్కన కొబ్బిరి తోట వుందిగా అందులో జాడేసి వీటిని కూడా అక్కడే కట్టేస్తాం.
ఊఁహూఁ.. కొబ్బిరి తోట అంటే, మా నాన్న కొబ్బిరి తోట ఉంది దాని ప్రక్కనేన.
అవును మీ నాన్నగారి చేను ప్రక్కనే.

అలా మా, మీ అనే పదాలు వీలైనంత తక్కు వాడి మాట్లాడాలి. ఒక వేళ ఎవరైనా మీ అని వాడినా, మనము మాత్రం మన అనే వాడాలి.

ఉదా ౩
చిన్నాన్న బిడ్డడు "అన్నయ్య కారు నేర్పవా"
మనం "సరే వెళదాం పద"
వాడు "ఉండు నాన్నకు చెప్పేసి వస్తాను"
మనం "పర్లేదు రా మన కారులో వెళ్తున్నాంగా నాన్నని అడగక్కరలేదు. నాన్న కారులో వెళ్తే చెప్పాలిగాని మనకారులో వెళ్తే చెప్పనక్కరలేదు"

అదన్నమట మనకు ప్రత్యేకమైన మన సంస్కృతి. ఇది ఒక పళాన అలవాటు అయ్యేది కాదు. దీనికి ఒక రకమైన ఆలోచనా తీరు అవసరం. డబ్బులు, ఆస్తిపాస్తుల్లో ఏముంది మన జనాలు మనకు ముఖ్యంగాని అనే ధోరణిలోఁ వుండాలి. బాగా అలవాటు చేసుకుంటే అవతలివారికి మన గుఱించి, చదువుకంటే సంస్కరముందని తెలిపే మంచి అలవాటు యిది.

మా సంస్కృతి
మా అమ్మ, మా నాన్న అంటాము మనము తల్లిదండ్రులకు ఒకే బిడ్డ అయినా సరే. అదే వేఱే భాషల్లోనయితే, నా అమ్మ, నా నాన్న అంటారు. ఇది అందఱికీ తెలిసిన విషయమే. ఇక్కడ మఱీఁ మన అమ్మ మన నాన్న అని పరాయివాళ్ళతో అనలేము కాబట్టి, కనీసం మా అనాలి.

దేనినైనా నలుగురితోఁ పంచుకోమని చెప్పే మన సంస్కృతికి అద్దం పట్టే మన భాష మనకు ముద్దు.

Friday, May 22, 2009

గాడిద స్వామ్యం

అనగా అనగా ఓ గాడిద
దానికున్న ఆస్తల్లా కాస్త బూడిద

ఐతేనేం, పట్టింది దాని కదృష్టం
ఎన్ని దేవుళ్ళని మోసిందో దాని పృష్టం!

ఉత్సవాల్లో దేవతా విగ్రహాలని మోసింది
ఊరిజనం కైమోడ్పులు తనకేనని భ్రమసింది.

ఇంతమంది భక్తులు తనకుండగా
ఎన్నికలకి నిలబడకపోవటం దండగ

అని తలపోసి నామినేషన్‌ పడేసింది;
ఐతే, ఇక్కడ ఈసప్‌ కథ అడ్డంగా తిరిగేసింది.

గార్దభాన్ని మక్కలిరగ తన్నక పోగా
జనమంతా గాడిదలయారు చిత్రంగా.

గాడిదకి ఓటు వేసి గెలిపించుకున్నారు.
గాడిదస్వామ్యం తమదని నిరూపించుకున్నారు.

- ఇస్మాయిల్ యొక్క "రాత్రి వచ్చిన రహస్యపు వాన" నుండి (ఈమాట వారి సౌజన్యంతోఁ)

Thursday, May 14, 2009

చెవిటి వాని ముందు శంఖం

చెవిటివాని ముందు శంఖం వూదితే, దాన్ని కొఱకడానికి నీ తాతలు దిగిరావాలన్నాట్ట! బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు. అనామిషులూ ముక్కూ మొఖం లేని నెలతక్కువ బడుద్దాయిలు ఎక్కువయ్యారు. ఏ పుంతలోనుండి ఏ చెంబు పట్టుకొని ఎవడు వచ్చి విసర్జించి పోతాడో తెలియకుండా వుంది. అందుకే క్రిందటి టపా తీసేయడమైనది.

త.క- మీ అసౌకర్యార్ధం, భావి తరాలా సమాచారార్ధం ఇక్కడ దాన్ని జత చేస్తున్నాను. దయచేసి చదవద్దు. ఇది భావితరాలకు మాత్రమే.

------------
లంజాకొడుకు అద్వైతం
మీకు టపా శీర్షిక పరుషంగా అనిపించి కోపం వచ్చి, కూడలిజల్లాడాదులధిపతులకు నా బ్లాగును లంకించడం మానేయాలని అభ్యర్ధిస్తే, మీరు బుద్ధుడు కదన్నమట. ఆయనీపాటికే నా బ్లాగుకు రావాలి, వచ్చాడేమోనని ఇలా శీర్షిక పెట్టాను. కానీ పాడు విధి వక్రించింది ఆయన రాలేదు. ఈ విధి ఎప్పుడు వక్రిస్తుందేగానీ ఒక్కసారైనా అవక్రిస్తుందేమో చూద్దాం అనుకుంటే, అబ్బే లాభం లేదు, విధి విధి ఎప్పుడూ వక్రించేవుంటుంది.

మీరు ఏ గౌతమబుద్ధుడో, ఆదిశంకరాచార్యుడో అయితే మీకు కోపం వచ్చేది కాదు. ఎందుకంటే వారికి అద్వైతం ఎఱుక. మనకి ఎఱుక కాదు. అద్వైతం అంటే అందరికీ తెలిసు. ఏముంది, అన్నీ ఒకే పదార్ధం నుండి పుట్టాయి, మళ్ళీ అన్ని ఒకే పదార్ధంలోనికి వెళిపోతాయి. ఈ మాత్రం విషయం మీ బామ్మగారినడిగితే చెబుతుంది, "ఏముందిరా, మట్టిలోంచి పుట్టాం మట్టిలోకే పోతాం". మీ బామ్మగారు ఆమె మాట మీద నిలబడి ఇప్పటికే మట్టిలో కలసిపోయుంటే , ఎనిమిదో తరగతి చదివే మీ మనఁవరాలినడగండి చెబుతుంది, "తాత్‌గరూ, మన సన్ను మూడో జనరేషన్ స్టార్ అంట. అంటే ఇంతకు ముందు ఒక స్టార్ క్రియేట్ అయ్యి, అది డిస్ట్రాయ్ అయ్యి, మళ్ళీ క్రియేట్ అయ్యి... అలా త్రీ టైమ్స్ జరిగి ఇప్పుడు సాలార్ సిస్టమ్ అయితే మనం దాని మీద లివ్ చేస్తున్నామఁట". మీరు లోలోపల మీ మనఁవరాలి ఆంగ్ల చదువులకు ముఱిసిపోతూనే, బయటకు కోపం అభినయిస్తూ, "నువ్వేమయినా చూసొచ్చావా మూఁడు సార్లు జరగడం" అని అడుగుతారు. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. ఒక లక్ష కోట్ల ఏండ్ల క్రితం మీ ప్రస్తుత శరీరంలోని పరమాణువులన్నీ ఏదో ఎక్కడో అంతరిక్షంలో తిరుగుతూవుండేవని మీరు ఒప్పుకోక తప్పదు.

కాబట్టి, ఒక విషయం తెలియడం తేలికే, అది తెలిసినట్టు ప్రవర్తించడం వేఱే పని. మనందరికీ అద్వైతం తెలిసినా, అది నిత్యం ఎఱింగి అలా నడుచుకోవడం వేఱే. ఉదా- మీకు తెలుసుఁ ప్లాస్టిక్కు ఐదు లక్షల ఏండ్లు భూమ్మీదనలానే శనిలా పడుంటుందని, కానీ పెళ్ళిల్లో రైళ్ళలో వాటిల్లోంచే నీళ్ళు తాగుతాం. కాబట్టి మనకు అద్వైతం తెలిసినా మనల్ని ఎవరైనా లంజాకొడకా అంటే మనకు కోపమే వస్తుంది.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, నేను క్రిత టపాలో ఒక కందం పద్యం వ్రాసాను. నా మొదటి సర్వలఘుకందం. దాంట్లో ఒక బూతు పదం అవసరమైంది. నేను బూతుపదాల్లో నమ్మను. కొందరు "దేవుడు లేడు, ఉంటే ఏడి చూపించి" అన్నట్టు, నేను "బూతుపదం లేదు, వుంటే ఏది చూపించు" అని అడుగే బాపతు. కానీ దేవుణ్ణి చూపమనేవారు కూడా తిరుపతి వెళ్ళివచ్చినట్టు, నేను కూడా క్రిత టపాలో గణికకొడుకులు అనే మాటవాడాల్సివచ్చింది.
కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్
బలుకుచు గెలుపుల కలలలొఁ
గులుకుచుఁ గదిలె డల గణిక కొడుకులఁ గనుమా
లంజాకొడకా అని ఎందుకు వాడలేదని మీరడగవచ్చు. దానికి రెండు కారణాలు. నేను వ్రాసింది సర్వలఘు కందం. కాబట్టి జా,లం వంటివి వాడకూడదు. అదే తెనాలి రామలింగడు వ్రాసిన గంజాయి తాగి పద్యం లోనయితే ముచ్చటగా వాడుకోవచ్చు.
కం. గంజాయి త్రావి తురకల
సంజాతము చేసికల్లు చవి గొన్నావా
లంజల కొడకా ఎక్కడ
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్
రెండవ కారణం, నేను వ్రాసిన పద్యంలో క,గ,ల,లు అనుప్రాస. గణికకొడుకులు లో క,గ,లలు ఐదు వచ్చాయి. కూల్ కదా.

మొత్తానికి అలా "అల గణికకొడుకులని రాజకీయనాయకులతో పోల్చి చెప్పినందుకు" వారికి క్షమాపణ చెప్పుకోవడం కుదరలేదు క్రిత టపాలోఁ. అందుకే ఇంకో టపా వ్రాయాల్సివచ్చింది. అసలు లంజాకొడుకులు అవడంలో వారి తప్పేముంది? మీ నాన్నగారు ఫలానా కారు సేల్సుమానో, అడ్వర్టైజింగు మేనేజరో, రాజకీయనాయకుడో, బాక్సైటు గనుల గుత్తేదారో, ఇతరత్రా ద్రోహచింతనాత్మక వ్యాపరస్థులో అవడంలో మీ తప్పేముంది. మీరు వారిని కన్నారా, పెంచారా, కేవలం మీ విధి తన అలవాట్లు మానుకోలేక వక్రించడం వల్ల మీరు వారి కడుపున పుట్టారు. లంజతండ్రి అనేది తిట్టుగాని లంజకొడుకు తిట్టుఎలా అవుతుంది?

అయినా మీరు వేశ్యాంగనకు జన్మించారే అనుకుందాం, వారి వృత్తిలో తప్పేముంది. వారు ఎవరినైనా మోసం చేశారా? లేదు. కాయకష్టం పడి సంపాదించారు. కాయకష్టం పడకుండా బోలెడంత సంపాదించే సాఫ్టువేరోళ్ళ కన్నా వీరు ఏమాత్రం హీనులు కారు. శరీరావసరాలకు వాళ్ళని వాడుకొని, సంఘంలో నొక మూలకు తోసిన మీ పేరు బూతు. సంఘం అనే మాట బూతు. అయినా నేను ఇందాక చెప్పినట్టు బూతుల్లో నమ్మను, "ఏదీ ఈ సంఘం ఎక్కడుంది? చూపీ నాకు". నాలుగు గాడిదల వయస్సు వచ్చినా మీరు పెళ్ళి చేయని మీ అబ్బాయి ఆరాటం ఏట్లోకట్ల కిందా మీదా పడి మాన్పించే స్త్రీయోత్తములు, నీరాటవనాటములు పోరాటపడ్డప్పుడు భద్రకుంజరపు ఆరాటము ఘోరాటవిలోన మాన్పిన పురుషోత్తముని సమానులు కారా? ఏరి మాట్లాడరే ఎవరూను? నోరు పడిపోయిందా?

గుఱజాడ కన్యాశుల్కం (Girls for Sale) చదివి కూడా, మధురవాణిగా సావిత్రిని చూసికూడా వారిని చిన్నచూపు చూసే మీరు
+ చేసేది మనోలంజరికం. ఇది కూడా బూతు కాదు, తప్పుడు పనీకాదూ, అయినా మీ దయాత్మక సమాచారం కోసం చెబుతున్నాను. <+ ఇక్కడ మీరు అంటే కొన్ని సామాజిక వర్గాలని హీనంగా చూసేవారు మాత్రమే>

మీమల్ని ఎవరైనా పలానా తలారి సుబ్బయ్య కొడుకు అని పరిచయం చేయబోతే, మీరు అబ్బే కాదండి, ఫోన్లు, మైకు సెట్లు వంటి వున్న ఈ రోజుల్లో ఇక తలారితనం ఎవరు చేస్తున్నారండి, మా అయ్యకూడా కూలి పనిలోకే వెళ్తున్నాడు, అని వివరిస్తారా లేదా. అలాగే ఎవరైనా మనల్ని లంజాకొడకా అంటే, మనం కూడా అబ్బే కాదండి, టీవీ, సినిమాలు, ఐటెం సాంగులు, ఇంటర్నెట్టు వంటి వున్న ఈ రోజుల్లో ఇక లంజరికం ఎవరు చేస్తున్నారండి, మా అమ్మకూడా కూలి పనిలోకే వెళ్తుందండి. అని వివరించుకోవాలి. అలా కాకపోతే, ఏ రిప్రడక్టివ్ థెరపిస్టు అనో, నాన్ లీనియర్ ఎడిటర్ అనో, స్పేస్ షటిల్ ప్రోగ్రామర్ అనో వివరించుకోవాలి.

అలా మొత్తానికి బుద్ధుణ్ణి మనం వేశ్యాసుతుఁడని స్తుతించినా ఆయనకు తేడావుండదు (చాలా రాజకీయనాయకులుకు చేతినిండా పని చిక్కుతుందనుకోండి). ఎందుకంటే అద్వైత స్వరూపుణ్ణి ఏమని పిలిచినా ఒకటేగా. చేపగా పుట్టినోడు, పందిగా పుట్టినోడు, తాబేలుగా పుట్టినోడు, రాజుగా పుట్టినోడు, గొల్లవానిగా పుట్టినోడు, బ్రాహ్మణపిల్లవాడిగా పుట్టినోడు, అలానే వడ్రంగిగా ఖండాంతరంలో పుట్టిన వాడు. పిల్లిగా వేరేదో దేశంలో పుట్టిన వాడు. అలగే ఇతర పశు పక్ష జంతాదులుగా పుట్టిన వాడు. స్త్రీగా పుట్టినది. వేశ్యగానే పుట్టినది. అసలు పుట్టనేపుట్టనిది. అట్టిదానిని ఏమని పిలిస్తేనేం. అట్టిది వేశ్యకడుపున పుడితేనేం?

అసలు బూతు అనేది వినేవాడి చెవిలోనుంది. ఉదా- మీరు ఎవరినో ఒకరిని సరదాకి "రండి రాజశేఖర రెడ్డిగారు" అని మర్యాద చేస్తే; అతను కాంగ్రేస్ కార్యకర్త అయితే సంబరపడిపోతాడు. తెలుఁగుదేశం కార్యకర్త అయితే, మిమ్మల్ని మళ్ళీ ఏ లంజాకొడుకనో అంటాడు. అతని దృష్టిలోనది బూతు కాబట్టి.

అర్థమయ్యిందనుకుంట వేదాంతం. అయితే మనకు ఇప్పుడో చిక్కువచ్చిపడింది. నా పద్యంలో అల గణికకొడుకుల గనుమా అని అంటే రాజకీయనాకులను మెచ్చుకున్నట్టుంటుంది గాని తిట్టినట్టు వుండదు. అయితే ఇప్పుడేం చేద్దాం. యు నో వాట్... తఱించి చూస్తే మనమెవ్వరం బుద్ధులం గాము. ఆచార్యులమూ కాము. కాబట్టి పద్యాన్ని అలానే వదిలేస్తే సరిపోతుంది.

<ఇక్కడింకా వుంది సోది .. కానీ నేను భద్రపఱచుకున్న దానిలో ఇంతవఱకే యుంది. క్షమించగలరు>

జై యల్లమ్మ తల్లి.

Thursday, April 23, 2009

వోటరు నెంబరు ౫౦౦ - రానారె

రాకేశ్వర నాయిడు రెడ్డి...
ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.


అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు అనేది చెప్పాలి. మీకు తెలుసో తెలియదోగాని గత రెండు నెలల పాటుగాఁ టీవీల ద్వారా, పత్రికల ద్వారా జనాలకు చిత్రవధ పెట్టారు పలు పక్షాలవారు.

నేను పుట్టినరోజున ఇలానే సార్వత్ర ఎన్నికలు సర్వత్రా జరిగాయి. అది ౧౯౮౩. నేను పుట్టి, ఎంటీవోణ్ణి గెలిపించాను. తెలుఁగు ఆత్మగౌరవం సంబడం చేసుకుంది. తెలుఁగులో లుగులకు మధ్యలోనున్న అఱసున్నా పునర్జీవితఁపు కలలు కంది. అఱసున్నాలోని అసులకు మధ్యనున్న ఱ కూడా కొత్త కలలు కంది. ప్రజాస్వామ్యంలోని సగటు కలలవలెఁ సదరు కలలు నెఱవేఱలేదనుకోండి అది వేఱేవిషయం. (అఱసున్నాలోఁ ఱవాడాలో రవాడాలో నాకు స్పష్టంగా తెలియదు. ఏదో అత్యుత్సాహాన్ని మన్నించగలరు.)

ఇంతకీ చెప్పవచ్చేదేంటంటే, మేము ఎప్పుడూ తెలుఁగు దేశానికే వేస్తాం. వేంటనే చంద్రబాబు నాయిడు మా పార్టీని లక్ష్మీపార్వతి నుండి రక్షించినప్పుడు మీరు ఎవరికివేశారు అని సందేహపడవచ్చు. అప్పుడు బాలయ్యబాబులాగా మేము కూడా సైకిల్ గుర్తుకే వోటేశాం. ఇలా తరతరాలుగా, అతిశయోక్తులు ఎందుకులెండి, ఇలా ఒక తరంగా సైకిలు గుర్తుకు ఓటు బ్యాంకై వెలసినాము మేము నాయిడ్రెడ్లం. కాని క్రితం సారి మాలో కొందరు - అంటే మా ఉమ్మడి కుటుంబంలో కొందరు - ఉమ్మడి కుటుంబం అనగా వూరిలో కొందరు ఉచిత విద్యుత్తు కోసం కాంగ్రేసోడికి వోటేశారు. అసలే మా రైతులకు ధనదాహం ఎక్కువ, మా దాహాన్ని దీర్చే పోగాకు తోటకి జలదాహం ఎక్కువ, అ జలానికి విద్యద్దాహం ఎక్కువ, విద్యుత్తునకు ధనదాహం ఎక్కువ, మొత్తానకి లెక్క సరిపోయి గుండు సున్నా అయ్యిందిగా. కానీ ఉచిత విద్యుత్తు అనేది తప్పుడు పద్ధతి, ఒక రకమైన అన్యాయం, దీని వల్ల కర్చులు బాహ్యమౌతాయని ఎఱిఁగిన మా అయ్యలాంటి వాళ్లు, అలా ఎఱుఁగని తెలుఁగు దేశం కార్యకర్త అయిన మా అమ్మలాంటి వాళ్ళు, ఎఱిఁగీ ఎఱఁగకున్న బెంగుళూరిలో ఉద్యోగంలో మునిగివుండి తెలుగుదేశం ఎలాగూ నగ్గుతుందిలే అనుకున్న నాలాంటి వాళ్ళు తప్ప మిగిలిన చాలా మందిలో కొంత మంది సైకిలుకి హ్యాండిచ్చారు. హ్యాండుకి బ్రహ్మరథం పట్టారు. (బ్రహ్మరథం పట్టడం అంటేఁ జంపి స్వర్గానికి పంపడం అని అసలర్థం వుందని మీరు ఎఱుఁగుదురా?) అలా హస్తానికి కుర్చీ వేసిన మావూరి జనాన్ని ఈనాడు చదివేవాళ్ళు క్షమిస్తారనీ, సాక్షి చదివే వారు కీర్తిస్తారనీ భావిస్తున్నాను. వెల్ మొత్తానికి జరగాల్సినది జరిగింది, ఆ బాబు శేఖర నాయిడ్రెడ్ల ప్రారబ్ధ కర్మలకు జరిగిన ఆ సంగ్రామంలో, మా వరి కొబ్బర్ల నాయిడ్రెడ్లు విద్యుల్లంచం తీసుకొని ఇచ్చిన తీర్పు అందరికీ ఎఱుఁకే.

ఐదేండ్ల తరువాత....
ధర్మం కలికాలంలో ఒక పాదం మీద నడుస్తుందంట. ఎనకెప్పుడో నాలుగు పాదాల మీద నడిచేదఁట. అలా నలుగు కాళ్ళుండే ధర్మగర్దభం ఈనాటికి పరమకుంటిదయ్యింది, మిగిలియున్న యా ఒంటికాలి మీద కూడా మన ముఖ్య మంత్రి గారు కత్తెత్తారని గత ఐదేండ్లుగా పత్రికలవారు మొత్తుకుంటూనేవున్నారు. వారి ప్రతాపానికి నీరసఁబడ్డ నాలాంటి పాత అభిమానులకు ఆక్రోశం పుట్టింది. మార్పు కోరాం. అలా మాలాగ ఆలోచించిన చిరంజీవి, చంద్రశేఖర రావు, జైప్రకాశ్ నారాయణ్ వంటి వారు నాట్సో-కొత్త పార్టీలకు కొత్త ఊపు తెచ్చారు. ఇలా ఎన్నికల పెళ్లి భోజనంలో విస్తరి నిండా వడ్డించి ఏదో ఒక్కటి మాత్రమే తినాలని విన్న పెళ్ళిపెద్దలాగా మేము కూడా బిక్కమొహం వేశాం. కానీ సమయానికి మా బాబు యువగర్జన అని గర్జించాడు. అలా మాకు విస్తరిలో పసుప్పచ్చగా వుండే రెండు చక్రాల జిలేబీనే తినాలి అని గుర్తుకొచ్చింది.

కొంత సేపు గర్జన గుఱించి చెప్పుకుందాం. మొన్నొక రోజు నేనూనొక బ్లాఙ్మిత్రుడూను గోదావరి పర్యాటనకై బైకేసుకుని వెళుతున్నాం. ఇద్దరం మహామేధావులం కాబట్టి. నాలుగు గర్దభాల వయస్సొచ్చినా, సజ్జోగోజ్జోగాలు లేక ఇలా బైకుల మీద తిఱిగి గర్వపడేవారిని మేధావులే అనాలిగా. అలా మేం మేధావులం బైకు మీద వెళుతూ, కనిపించిన లోకాన్ని అవహేళన చేస్తూ ఆనందిస్తుంటే, ఒక చోటఁ మాల గర్జననో, కావుంటి గర్జన నో ఎదో గర్జన చూసాం. మందకృష్ణ బొమ్మ వుందనుకుంట, రాజమండ్రిలో మాదిగ గర్జన అయుంటుంది. మొత్తానికి గర్జన అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం, ఏ కులపుటోరిదైతేనే గర్జన. (అన్నట్టు సామాజిక వర్గం, దళిత, వైశ్య, ఇలాంటి సాంస్కరిత సంస్కృత పదాలు వాడలేదని మీకు అభ్యంతరం కలుగవచ్చు, మేము ఏదో పాతకాలపుటోరం, అంత ఓపిక లేక సాంస్కరిత సాంస్కృతిక పత్రికలకు పంపుకోలేక ఇలా బ్లాగుల్లో వ్రాసుకుంటున్నాం. క్షతహృదయులు క్షమించగలరు.)
మొత్తానికి గర్జన గురించి గద మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా యువ గర్జన, మాదిగ గర్జన వంటి గర్జనల పేర్లు చూసి ఒకటో రకం మేధావినైన నేను "హహ, మన జాతికింత మానసిక అభద్రతాభావం దేనికో, ప్రతిదానికీ తమనుతాము ఎప్పుడూ సింహాలతో పులులతోనూ పోల్చుకుంటూ వుంటారు. ప్రక్కవాళ్ళిని చంపుకుతినే కౄర మృగాలతో పోలిక ఏంటో, ప్రతీవాడు రాజుతో పోలికే. అలాగే ఐపియల్లో కూడా సగం జట్ల పేర్లో రాయల్సనో కింగ్సనో లయన్సనో వుంటుంది" అని అపహాస్యం చేసాను.
మేలు రకం మేధావి అయిన మన బ్లాఙ్మిత్రుడు (బ్లాగ్ + మిత్రుడు = బ్లాఙ్‌మిత్రుడు అనునాసిక సంధి) ఇంకా మేలురకంగా ఇలా "మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది గాని, వీడు గర్జిస్తాడఁట. హహహ" అని అపహాస్యం చేసాడు. మొత్తానికలా బ్లాగుల ద్వారా మీరెంత విడ్డూరమైన మనిషైనా, అంతకు మించిన విడ్డూరమైన మనిషి దొరుకుతాఁడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తెలుఁగువారంటే, అతనికంటే ఇంగా ఘనుడు బట్టురాజు బాల అనిపిస్తుంది బ్లాగ్లోకం.

మొత్తానికలా ఎవరికి ఓటేయాలా అని ఆలోచిస్తున్న నాకు, గాలిపటం మీదకు తుఫానులా ఈ పథకాలు వచ్చిపడ్డాయి. నగదు బదిలీ అనీ, ఉచిత టీవీ అనీ, పసుపుకుంకుమలనీ, తొలిసూళ్ళని (గొడ్లకేనండోయ్), వడగండ్ల వర్షంలా వచ్చిపడ్డాయీ పాతకాత్మకములైన పథకాల. అప్పటికే ప్రపంచంలో లోభం ప్రసరిస్తుందని విలపిస్తున్న నాకు, కర్చులను బాహ్యింపజేసే వ్యవస్థ మీద వున్న కోపం వలన, ఉచితంగా వస్తువులు కావలని ఆశించిన వారి మీదఁ జుగుప్స, వాటిని ఇస్తామన్న వారి మీద విజుగుప్స హెచ్చించాయి. అప్పటి వఱకూ ఒక పద్ధతిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు పోతావున్న చంద్రబాబు ఇలా పథకాలతో పతనమైపోవడం నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అలానే అప్పటి వఱకూ ఒక పద్ధతిలో పాత్రికేయం చేసుకుంటూ ముందుకు పోతావున్న ఈనాడు పత్రిక కూడా మఱీ ఇంత దారుణంగా కాంగ్రెసు మీద కసి కట్టడం, రోజూ చెడు వార్త మీద చెడువార్త అందించి వృత్తిధర్మాన్ని విస్మయించిన వారి మీద కాస్త జుగుప్స కలిగింది. ఇలా ఒకరి ప్రచారం చూసి ఇంకొకరి మీద జుగుప్స కలిగింది. అయినా తతో న విజుగుప్సతే అని స్మరించుకుంటూ ఆశా కిరణాలకై చూశాను. అలాంటి నాకు ఈల గోల వినిపించింది. జయప్రకాశు పథకాల మీద డబ్బు పంపిణీల మీదఁ జేస్తున్న వ్యాఖ్యలు నచ్చి, ఈ నా వోటు లోకసత్తాకేనని అనుకున్నాను. నిన్నటి వఱకూ.

కానీ మావారందఱూ తెదేపాకే నని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎంతగా నంటే, మా మాజీ ఎమ్మల్లే మా కార్లు చూస్తే, ఆయని కారు మెల్లగా నడిపిస్తూ, మాకు కనబడేలా దణ్ణం పెడతాడు. మా కార్లంటే మా రెండు మూడు వూళ్ళలో రెడ్డినాయిళ్ళెవరికైనా సరేఁ. ఎంతైన ఊపిరితిత్తులకు పొగఁబట్టించి సంపాయించిన రైతు వర్గం కదా, అసలే అనాదిగా ఎస్సి నియోజకవర్గం, ఆయనేమో మాలాయన, కాబట్టి డబ్బు పంచినా ప్రచారం చేసిన మాలాంటోళ్ళేనని తెలుసుఁ. అలానే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పేరిట నిల్చున్న ఆయని కుమార్తె కూడా మా చెల్లాయి పెళ్లిరోజు ప్రొద్దుట మా పెళ్ళింటికి వచ్చి, మరీ అందరినీ ఓటు అభ్యర్ధించింది. మేము పిలవలేదనుకోండి ప్రత్యేకించి, కానీ వచ్చింది ఎలాగైనా. ఊరు చిన్నూరై లోపలికున్నా దిట్టలని చెప్పి, గ్రహాల భారానికి కాంతి కణాలు వంగినట్లు వీరూ డబ్బు భారానికి వంగుతారు. మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అభ్యర్థిని బాగా చదువుకున్న ఆవిడ, వృత్తిరీత్య ఉపాధ్యాయిని, డాక్టరు పెండ్లాము. వోటుకు అర్హురాలు. కానీ కౌరవ పక్షానున్న భీష్ముడిలా, ఈవిడకూ ఓటు వేయదలచుకోలేదు నేను. నిన్నటి వఱకూ.

అలాగే మా లోకసభ అభ్యర్థి మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి వాడు అనిపించేది నాకెప్పుడూ. కాబట్టి ఓటేద్దామనుకున్నాను. అప్పుడెప్పుడో తెలుపునలుపు చిత్రం జ్యోతిలో ఈయన జయసుధతో పాటు సైకిలు మీద వెళుతూ పాడుకున్న పాట చూసి, నేను సైకిలు గుర్తుకు ఆ ఓటు కేటాయించుదామనుకున్నాను.

నిన్నేం జరిగిందంటే...
మా లోకసత్తా అభ్యర్థి గుఱించి వాకబు చేసాను. వట్టి వెధవ అని తేలింది. ఎమ్మర్వోగా పనిచేసి, సరిగా వేయీ ఐదొందలకు కావలసిన పత్రం ఇచ్చేవాడు, ధర్మానికి న్యాయానికి సంబంధంలేకుండానని తేలింది. ఈ విషయం నాకు చెప్పింది ఒక తెలుగుదేశం కార్యకర్త అనుకోండి, కాని బుల్లిబాబు మాట నమ్మాలిగా. నమ్మాను.

ఇవాళ రోజూకంటే నాలుగు గంటలు ముందుగానే లేచాను. నిక్కరు వేసుకొని, సైకిలు మీద ఎక్కి మరీ వెళ్ళాను పోలింగి స్టేషనీకి, అరగంట లైనులో నించుంటే, వూరోళ్ళందరూ వచ్చి కొంత పిచ్చాపాటీ చెప్పుకుంటూ, ఆడవాళ్ళూ ముసలివాళ్ళూ వస్తే వాళ్ళని లోనికి రానిస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తానికి రెండు సైకిళ్ళకి ఓటేశాను. సరదా తీరలేదు. ప్రక్కనే మా నానమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడను తీసుకువచ్చి, లైను మొత్తం తప్పించి, సంతకం చేయించి, ఇంకు పూయించి, డబ్బా వరకూ తీసుకువెళ్ళి వోటువేయించాను. మీకో విషయం తెలుసా, ముసలి వాళ్ళు వుంటే వారికి సరిగా కనబడకపోయినా, కనపడదన్న వంకనయినా, మీరు వారిని బూతు దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ నొక్కు అని చూపించవచ్చని.

ఎనకయితే ఇన్ని పార్టీలు లెనప్పుడు ఒక్కొక్కళ్ళూ నాలుగయిదు వోట్లేశేవారు. ఇంకు అంటించగానే తలకు రాసేసుకోవాలి, అలా అది కొబ్బిరి నూనెలో కలసిపోతుంది. ఆ తరువాత హైదరాబాదో పరదేశమో వలసఁబోయిన మీ అన్నదమ్ముల పేర్ల మీదఁ, అక్కజెళ్ళల్ల పేర్ల మీదనో ఓటు గుద్దేయవచ్చు. కానీ ఈరోజుల్లో నాయిడ్రెడ్ల ఐక్యత తగ్గింది. కొందరు పెజారాజ్యం వంటి పార్టీల్లో కెళ్ళి అలా చేయనీయట్లేదు. పైగా ఫోటోలు చూపించమంటున్నారు.

అదన్న మాట నా ఎన్నికల అనుభూతి, అసలయితే మా పక్క నియోజక వర్గంలో మా మావయ్యే ఎన్నికల్లో నిలబడ్డాడు. లెక్క ప్రకారం ఆయని ప్రచారానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఇతర ముఖ్యమైన పనులు వుండీ, చంద్రబాబు చంద్రుణ్ణి తెంపియిస్తానని చేస్తున్న హామీలు నచ్చక మొత్తానికి అంత ఉత్సాహం లేక వెళ్ళలేదు. హామీలు నచ్చకపోవడం ఎలా వున్నా ముందు ఇంటర్నెట్ పని వుండింది. ఆ మాత్రం దానికి మా బుల్లి బాబే అన్నాడు వాడు అన్న హామీలన్నీ పూర్తి చేస్తే ఎవడూ పనిలోకి రాడు, రైతు *&$# చిరిగిపోతుంది, కాబట్టి చెయ్యడెః అని. అది మన రాజకీయాల పరిస్థితి. మన పార్టీకి మనం వోటేసుకోవాలి అన్నది వేదవాక్కు.

వెల్, మొత్తానికలా ఓటైతే వేసి వచ్చాం. పనసగింజల కూరా, గెడ్డ పెరుగూ తిన్నాం. నా ఒక్క వోటు వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏదైనా ఒకింతైనా మారుతుందా అంటే, యూగాట్టాబీ కిడ్డింగ్ మీ. పోనీ మా వూళ్ళో ౩౦౦ వోట్లు, అందులో ౧౦౦ ప్రవాసులు, వాటివల్లా పెద్దేం మారదు. కానీ అందరం ఓటేస్తే, ఎవరో ఒకరి ఓటు కీలకం అవుతుందిగా. ఆస్తలవీస్త (అలాగే లగెత్తుతా అని అర్థం)

కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్

బలుకుచు గెలుపుల కలలలొఁ

గులుకుచుఁ గదిలె డల శునక/గణిక కొడుకులఁ గనుమా


* పై పద్యంలో తమని రాజకీయనాయకులతో పోల్చామని భంగపడ్డ శునకములను/గణికలను క్షమించమని సవినయంగా మనవిచేసుకుంటున్నాను. ఏదో పద్యవరసకు అన్నాను గానీ, ఆ దానవమూర్తుల ముందు జంతు/మనావ మాత్రులమైన మనమేపాటి.

Sunday, August 19, 2007

పైసా విలువ, ప్రాణం విలువ

నేను క్రిత నెల హైదరాబాదులో ఉన్నప్పుడు, ఒక ప్రయాణం చెయ్యాల్సివచ్చింది. నిజాంపేట రహదారి నుండి మాధాపూరం పోలిసు కార్యాలయానికి వెళ్ళాల్సివచ్చింది. ఆ ప్రయాణం మీకోసం విఫులంగా వివరింపబడినది దిగువున.

ఎందుకు, ఏమిటి, ఎలా

అది శనివారం సాయంత్రం, నేను తరువాతి రోజే నగరం విడిచి మాపల్లెకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మా సీనియర్ ఒకతను నన్ను రాత్రి భోజనానికి కలవమని చెప్పాడు. మామూలుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలసినా 'ముందు చిన్న ఉద్యోగంలో చేరి తరువాత పెద్ద దాంట్లోకి మారితే బాగుంటుంద'ని రిస్కు హెడ్జింగ్ చేసే మహదుపాయం ఒకటి పారేస్తున్నారు ఆర్యులు. అట్లాంటా నుండి ఆంధ్రా వరకూ ఇదే ఉపాయం. బ్లాగర్ల నుండి అమ్మలక్కల వరకూ ఇదే సలహా. నేనూ చేసేదదే అని వారికి అర్థం అవ్వదు. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒ ౧౫౦ (150) వేల డాలరుల ఉద్యోగం ఒకటి చూసుకొని ఆ తరువాత పెద్ద అవతారం దాల్చుదామన్నదే నా ఉద్ధేశం కూడానూ. అందుకే ఉద్యోగం ఉన్నోళ్ళ దగ్గర ఉద్యోగ సలహాలు తీసుకోకూడదు.

ఏది ఏమైనా నా సీనియరు కూడా అదే ఉపదేశిస్తాడేమోనని భయపడుతూ బయలుదేరా. అతను ఫోను చేసి నన్ను పోలీసు స్టేషనుకు రమ్మన్నాడు. సమయం కూడా ఇచ్చాడు. వచ్చే పద్దతి కూడా వివరించాడు. మా ఇంటి ముందు ఆటో ఎక్కితే అతను మాధాపురం పోలీసు స్టేషను దగ్గరకు తీసుకుపోతాడంటా.
"ఆటోనా అంటే ఎంటి ?" అని నోరు జారా. "నాకైతే బస్సుల,సర్వీసు ఆటోలు మాత్రమే తెలుసే" అన్నాను. అతను "కాబోయే గోడ వీధి ఉద్యోగివి, అంత పేదరికంగా ఆలోచిస్తావా?" అని ఆడిపోసుకున్నాడు. "పేదరికం పాపం కాదు బాబూ, శాపం" అని నేను వాపోయినా అతని ఐఐఎం బుర్రకి అర్థంకాలేదు. అందుకనే డబ్బున్నోళ్ళ దగ్గర ప్రయాణ సలహాలు తీసుకోకూడదు.

సర్వీసు ఆటో
నేను కూకట్‌పల్లి ముఖ్యరహదారి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సర్వీస్ ఆటోకోసం వెతక సాగా, చాలా ఉన్నాయి, అన్నిటి మోటర్లు తిరుగుతున్నాయి. కాని తెలివిగా ఏది ముందు బయలుదేరుతున్నదో చూసుకొని ఎక్కాలి, నేను ఆ పనే చేసా. డ్రైవర్ సీటు పక్కన ఒక డబ్బా ఉంది, మీరు అమాయకులైతే అది ప్రథమ చికిత్స డబ్బా అనుకుంటారు, కానీ కాదు, అది extra seating! నా కన్ను దాని మీదే పడ్డాది, దాని మీదకెక్కి కూర్చున్నా. ఆ డబ్బా మీద కూర్చుంటే మీకు ప్రయాణంతో బాటు ప్రమాదం ఉచితం. అక్కడ పట్టుకోవడానికి ఎఁవీ లేవు! నాకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళ గుండె గుబేలు మనేది, కానీ నేను భయపడలేదు. కాలుని గట్టిగా ముందుకేసి నొక్కి, పిఱ్ఱని గట్టిగా వెనక్కేసి నొక్కాను. న్యూటన్ లా వల్లో ఘర్షన వల్లో నేను ఆటోలోనే ఉన్నా, శరవేగంతో అది అతిశరముచేసుకుంటూ ముందుకు వెళ్ళింది!

హృదయభాను
అలా ముందుకి ఓ ౨౦౦ మీటర్లు వెళ్ళగానే ట్రాఫిక్ జాం. మన ఆంధ్రలు గొడ్డుల్లాగా పనిచేసి జీవితాన్ని ఆశ్వాదించరని ఎవరైనా అంటే, వారికి నచ్చజెప్పండి, "చూడు మా రాజధానిలో శనివారం రాత్రి రద్దీ, అందరూ వారాంతంలో మస్తీ కొట్టడానికి నగరంమీద పడ్డారు, నేనిలాంటి వింత విలాశదేశాలయిన అమెరికా, కెనడాలలో కూడా చూడలే"దని.

అలా రద్దీలో ఆటో ఆగినప్పుడు అప్పటిదాకా నా ప్రాణం మీద ఉన్నధ్యాసంతా రోడ్డుపక్కన పడ్డది. రహదారికి మీటరు దూరంలో గుడిసెలున్నాయి. భారతావనిలో రోడ్డకు అటూఇటూ రెండు మీటర్లు వాహనాలు వెళతాయన్న విషయం జగమెరిగిన సత్యం. అంటే వారిల్లు రోడ్డుమీదే ఉన్నట్టు. ఇంటి ముందు ఆడవాళ్ళు, ఇళ్ళ యజమానురాళ్ళు కలసి ముచ్చటించుకుంటున్నారు. ఊహించుకోండి, ట్రాఫిక్కు జాం, రోడ్డుకు అవతలా ఇవతలా మనవాళ్ళు రెండు మీటర్లవరకూ వహనాలని పోనిస్తూనేవుంటారు.
అటువంటి చోట, లారీ చక్రాలకి మీటరు దూరంలో రాళ్ళ సమూహం మీద గుడిసెలు, వాటి ముందే సాయంకాలం ముచ్చట్లు. ఏవూరి నుంచి వచ్చారో పాపం, ఎ పల్లెటూరిలో ముచ్చటించే అలవాటుని ఇలా నగరానికి తెచ్చారో ! ఎక్కడ అప్పుతీరక బ్రతుకు తెరువు కోసం ఇలా నగరానికి మూటముడి సర్దుకొని, పిల్లల్ని చంకనెత్తుకొని ఇలా బయలుదేరారో! ఈ పొగకి వీరి ఊపిరితిత్తులు ఎంత కాలం పనిచేస్తాయి? వీరి ఆయిష్షు ఎంత తగ్గిపోతుందో!
"ఓ కమాన్ నాట్ నౌ!" అనుకొని నేను అప్పుడే ఆ శనివారం రాత్రి, ఆగోలలో ప్రశాంతంగా ఉదయిస్తున్న నా హృదయభానుని నెత్తి మీద సుత్తికో ఒ నాలుగుసార్లు కొట్టి, పాచిమూఖానే వాణ్ణి అస్తమింపజేసాను.

"జెయన్‌టీయు వరకూ ఇలానే ఉంది, మీరు నడిచి వెళ్ళిపోతే తొందరగా చేరుకుంటారేమో" అని డ్రైవరు బాబు సలహా, సరే అతని మూడు రుపాయలూ అతనికిచ్చి నేను బయలుదేరదామనుకున్నా. అతని దగ్గర యాభైకి చిల్లర లేక, ఏమీ ఇవ్వకుండానే బయలుదేరాను. జెయన్‌టీయు దగ్గర రోడ్డు దాటాల్సి వచ్చింది. ఆ గండం గట్టెక్కాక, మహాతాంత్రిక నగరానికి (హైటెక్ సిటీ) సర్వీసు ఆటో వెతకడం మొదలు పెట్టా. అక్కడ అవి దొరుకుతాయని, మా మహాతాంత్రిక నగరంలో పనిచేసే అల్పతాంత్రిక బావ చెప్పాడు. కాని అలాంటివేమీ కనబడలేదు. నేను నా పేదరికానికి అన్యాయం చెయ్యలేక, మామూలు ఆటో తీసుకోలేదు.

షేరింగ్ ఆటో
అక్కడ ఐదుగురు జనాభా ఎక్కికూర్చున్న ఒక మామూలు ఆటో చూసా, వావ్ అనుకున్నా! సర్వీసు ఆటోలు కోసం చూస్తున్నా, ఎం కనబడలేదు. ఆ ఐదుజనాల ఆటో నాదగ్గరకు వచ్చి "సార్ ఎక్కడికి" అన్నాడు, "హైటెక్" అన్నాను. "ఎక్కండి" అన్నాడు. "ఎక్కడ" అన్నాను. "ఇదిగో ఈ పక్కన" అని తన పక్కన కూర్చోమన్నాడు. నేను గతిలేక ఎక్కాను. దాన్ని షేరింగ్ ఆటో అంటారు. నాకు ఎందుకో మా బావ సర్వీస్ అటో అన్నట్టు బాగా గుర్తు! అందుకే సర్వీసు ఆటోలకీ షేరింగ్ ఆటోలకీ తేడా తెలియని బావలని సలహాలు అడగకూడదు.
నేను ఎక్కాను, అంటే నా ఒక పిఱ్ఱ ఆటోలో ఉంది, ఒక కాలు వేళ్ళు లోపల ఉన్నాయి, ఒక చేతి వేళ్ళు పైన ఎదో రాడ్డుని గట్టిగా పట్టుకున్నాయి. డబ్బై ఐదు కేజీల ప్రాణం ఆ గుప్పెట్లో ఉంది అచ్చంగా. ఆటో మళ్ళీ దూసుకుపోతుంది. అలా అర ప్రాణాలు గుప్పెటికి అందించి, అర దీపం గాలికొదిలి ప్రయాణం సాగుతుండగా, రోడ్డు మధ్యన రెండడుగులు ఎత్తున్న డివైడరు పై ఒ నలుగురు స్త్రీపురుషులు వెల్లకిలా పడుకొని వున్నారు. వారిని ఒ ఫోటోగ్రాఫరు ఫొటో తీస్తున్నాడు. అలానే ఓ ఇద్దురు పోలీసులు కూడా వున్నారు. ఆకాశం లో ఎగురుతున్న అనుభూతి వస్తున్ననాకు దాని మీదకు పెద్ద ధ్యాస పోలేదు.

అలా చాలా సేపు ప్రయాణించగా నగరం వదిలి, భుధ గ్రహాన్ని తలపించే ఒ ప్రాంతం గుండా వెళ్ళగా, చివరికి మహాతాంత్రిక నగరం రానేవచ్చింది. అక్కడ ఇంకో షేరింగ్ ఆటో ఎక్కి మాధాపురం పోలిసు కార్యాలయానికి వెళ్ళా. అది ISO 2000 certified పోలిసు కార్యాలయం అంట. అంటే ఎంటో మరి? నిందుతులకు బదులు బాధితులను ఖైదు చేస్తారా ఎంటి?

వులవలు
నా సీనియర్ రానే వచ్చాడు, మేము మంచి భోజనశాలకు వెళ్ళి ఉలవచారు తిన్నాము. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. పెద్దలు, తోటివాళ్ళు, చిన్నలు గురించి మాట్లాడుకున్నాం. ఆశలు, అవరోధాలు లెక్కేసుకున్నాం. డబ్బు, సంతృప్తి, సేవ గురించి చర్చించుకున్నాం. జియ్యారి, జీమేట్, క్యాట్ లలో లోటుపాట్లు తెలుసుకున్నాం. రాజమండ్రి, బెంగుళూరు, కల్లికోట (కాలికట్) గుర్తుచేసుకున్నాం. బిల్ మాత్రం అతను కట్టాడు.

వెనక్కి వస్తున్నప్పుడు రాత్రి ఆటోలేమి దొరకక మేము పోలీసు కార్యాలయం వరకూ ఒక షేరింగ్ ఆటోలో ముందు డ్రైవరుకు అటూ ఇటూ కూర్చుని బయలుదేరాం. అతని ఐఐయమత్వం దానికి అడ్డుచెప్పలేదు. ఎదో మేమే గొప్పనుకున్నట్టు, మిగతా ఎవరికి అర్థంకాని మహాతాంత్రిక ఆంగ్లంలో మాట్లాడుకున్నాం.
"ఇది ఫోటో తీసుకుపో, నువ్వు గోడవీధి (వాల్ స్ట్రీట్) లో పెద్ద వ్యక్తి అయినప్పుడు ఇది గుర్తుచేసుకోవచ్చు" అన్నాడు. నవ్వుకున్నాం, ఈ సారి నా తలకూడా ఆటోలో ఉన్నందుకు నేను సంతోషించాను.

విలువలు
వెనక్కి ఇంచుమించుగా వెళ్ళిన రీతిలోనే వచ్చా, షేరింగ్ ఆటో, షేరింగ్ ఆటో, బస్సు, కాలి నడక. ఈ సారి సర్వీసు ఆటో ఎక్కలేదని గమనించాలి. మొత్తం ట్రిప్పుకు ముప్పై రూపాయలు కూడా అవ్వలేదు! అది మీరు అసాధ్యమనుకున్నారు, కాని ఉద్యోగం మాని చూడండి, చాలా అసాధ్యాలు సాధ్యాలవుతాయి.

దారిలో ఇంతకు ముందు డివైడరు పై పడుకున్న వ్యక్తులు ఉన్న స్థలం దగ్గరకు వచ్చాం. డ్రైవరు చెప్పసాగాడు.
"సర్వీసు ఆటో వస్తుంది, దానిని వెనకనుండి మామూలు కారు గట్టిగా గుద్దింది, నాలుగైదు పల్టీలు కొట్టింది ఆటో. అందులో ఉన్నవారందరూ చచ్చిపోయారు."
నేను హృదయ భాను ఎమంటాడో వినడానికి చెవులు సిధ్ధం చేసుకున్నాను. ఎం వినిపించలేదు. నాకు నేనే అనుకున్నా,
"పేదప్రాణాలు ఎక్కువే దేశంలో, అందుకే వాటికెక్కడా విలువలేదు. ప్రాణానికి విలువ ఇచ్చేది ఎవరు? ఎవరి ప్రాణానికి వారేగా ఇచ్చేది! పేదరికం పైసాకి ఇచ్చే విలువ ప్రాణానికి ఇవ్వదు! మరి మధ్య తరగతో? ఆటోలొస్తుంటాయ్ పోతుంటాయ్, ప్రాణాలు వస్తుంటాయ్ పోతుంటాయ్."

Sunday, May 20, 2007

May I have this dance


ఇది ఎంత సింపుల్ గా వీలైతే అంత సింపుల్ గా వ్రాస్తా. చదివినదాని బట్టి మీ తాత్పర్యాలు మీరు లాక్కోండి.

నేను స్వింగ్ మరియు సాల్సా డాన్సులకు కుదిరినప్పుడల్లా వెళుతూంటా. ఇంచక్కా అమ్మాయిలను కలసి నాట్యం చేయొచ్చు, రాక్ అండ్ రోల్ సింగీతం ఆడుతుండగా. అమెరికాలో జీవితం చాలా చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఉదాహరణకు నేనీ వాఖ్యం రాస్తుండగా బిపి 'మేము వాతావరణానిని కాపాడుతున్నాం' అని ప్రకటన ఇచ్చుకుంటుంది టీవీలో. కాని డాన్స్ ప్లోర్ మీద ఉన్నా ఆ రెండు నుండి ఆరు గంటలు మాత్రం ప్రపంచంలో అంతా మంచే అనిపిస్తుంది.

సాధారణ జీవితంలో అసంభవం అనింపిచేవన్నీ జరుగుతూంటాయి అక్కడ! ఉదాహరణకు,
ఆడవారు మగవారి పై పూర్తి నమ్మకంతో వారు ఎటు పంపితే అటు వెళ్తారు (leading - following అంటారు ఆ ప్రక్రియని) , అలాగే మగ వారు ఆడవారిని పూర్తిగా గౌరవించి వారిని సంతోష పెట్టడానికి సాయశక్తులా ప్రయత్నిస్తారు. 'డాన్స్ చేస్తారా నాతో' (May I have this dance?)అని అడిగితే ఎప్పుడు ఎవరూ 'నొ' అనరు; అదేదో ఒక చట్టవిరుధ్ధమైంది లాగా.

ఇంతకూ ఇవాళ ఏమైందంటే, ఒక అమ్మాయిని తో డాన్స్ చేసే ముందు సంగీతం మొదలవడానికి నిరీక్షిస్తూ, మాటల్లో, ఎప్పుడూ జరిగే సంభాషన ఇలా ఒ ఆశక్తి కరమైన మలుపు తిరిగింది.
నేను: మీరు విధ్యార్థినా?
ఆమె: అ.. మొన్నే పూర్తయ్యుంది కాలేజి.
ఎ శాస్త్రం అభ్యసించారు ?
Cognitive Science?.. మరి మీరో.. ?
నేను, ఇక్కడే టెక్ లో ఎంఎస్ చేసా విధ్యుత్ సాంకేతిక విధ్యలో, కాని మెన్న సెమిస్టర్ లో మీ సైకాలజీలో ఒ క్లాసు తీసుకున్నా..
Under Grad ( బిటెక్కు) ఎక్కడ చేసారు ?
భారతదేశంలో
భారతదేశంలో ఎక్కడ? నాకు తెలిసుండక పోవచ్చు కాని తూర్పా.. పడమరా ??
దక్షిణ భారతంలో ... కేరళ ?
ఒ కేరళ.. నాకు తెలుసు కేరళ .. అమ్మాచి అక్కడ ఉంటారు
అమ్మాచి ఉండేది నేను చదివిన చోటుకు దగ్గరే
అవునా మరి ఎప్పుడైనా దర్శనం చేసుకున్నారా.. ?
(దొరికి పోయారా దేవుడా) .. లేదు కుదరలేదు ..
నేను రెండు సార్లు చూసా .. అమ్మాచి రెండు సార్లు వచ్చారు అమెరికా.. రెండు సార్లూ చూసా..
(కప్పి పుచ్చుకోవడానికి) నేను సత్య సాయి దర్శనం చేసుకున్నా. సత్యసాయి తెలుసా?
ఒ తెలుసు మా మిత్రుల కుంటుంబం ఒక్కరు సత్యసాయి అపారమైన భక్తులు
మా చుట్టాలులో కూడ చాలా మంది ఉన్నారు, అందుకే నాకా అవకాశం దొరికింది. అంటే నేను పెరిగింది ఆంధ్రా అని వేరే రాష్ట్రంలో, సాయి అక్కడి వారు, అందుకే మాకు తెలిసిన వారు ఆయన భక్తులు ఎక్కువ. మాములు గా మనం ఎవూరిలో ఉంటే ఆవూరి దగ్గరలో ఉన్నగురువు ల దగ్గరకు వెళ్తూంటాం...
అ ఒహో..అవును ...

ఈలోగా డిజెకి ఎదో కొత్త ఐడియా వచ్చి, జంటలన్నిటి కలగా పులగం చేయాలని నిశ్చయించుకుంది. మా సంభాషణ ముగిసింది. మామూలుగా ప్లోర్ మీద ఆడవారితో ఎదోక చిరుసంభాషణ నడుపుతుండాలి. అప్పుడప్పుడూ అది ఇలాంటి అనుకోని సంభాషణలకు దారి తీసూంటుంది.

భారతదేశం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికతను ఇంకా ఎగుమతి చేస్తుంది, ఇది ఇలానే సాగాలని ఆశిద్దాం.

PS: ఆరు నెలల క్రితం ఒక సారి, ఒ వేరే తెల్లమ్మాయి డాన్స్ చేస్తూ మధ్యలో "आती क्या खंडाळा" అని పాట ఎత్తుకుంది. నాకు నిజంగా అశ్చర్యం వేసింది. ఎక్కడ నేర్చుకున్నావంటే, "నా హిందీ క్లాసులో" అని ఒ చిరు నవ్వు నవ్వినా హృదయంలో ఒ చిన్న కోత కోసింది :) ఆమె మీనాక్షాలు నాకింకా గర్తున్నాయి :) మామూలు గా మన దక్షిణ భారతదేశంలో ఉన్నంత పెద్ద కళ్ళు వేరే చోట్ల ఆడువారికి ఉండవు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

సవాలు పదాలు
simple, complex, conclusion, cognitive science, post graduate, under graduate, electrical engineering
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం