భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, August 17, 2007

హృదయభాను: చిరు పరిచయం

ఉపోద్ఘాతం (సంబంధంలేని సుత్తి)
నేను చాలా కాలం నుండి బ్లాగలేదని అభిమానసంఘాలు చాలా గోల పెడుతున్నాయి. ఆ విషయం తెలియఁగానే, అభిమాన సంఘాలున్నాయని తెలిసి చాల సంతోషించాను, కానీ వారి అభిమానం ఎక్కడనుండి వస్తుందన్నది నాకర్థమయి, సంతోషం సల్లారింది. జీవితంలో డెస్పయ్యి నా బ్లాగు చదివి నా పరిస్థితి కంటే వారి పరిస్థితి చాలా బాగుందనుకొని సంతోషపడే వారి కూడలే ఈ అభిమానసంఘాలు.
నేను దేశాటనలో ఉండడం వల్ల అంతర్జాలాని అత్యవసర పనులకు తప్ప రాలేకపోయాను. భాగ్యనగరం నుండి మా ఇంటికి వచ్చాను, మాది పల్లటూరు కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ రాదు. ఇంకో వారం రోజుల తరువాత ఉత్తరాఖండం వెళ్ళి వచ్చా. ఇంటికొచ్చాక తెలిసింది, మీరు ఎంత కొండల్లోకి వెళ్ళినా, మిమ్మల్ని టీవీ, అంతర్జాలం రూపంలో మిమ్మల్ని నూతన జీవన విధానం వెంటాడుతూనే ఉంటుందని. ప్రపంచకంపు నుండి అతి దూరంగా ఎప్పటికీ పారిపోలేరని! ఐతే ఇప్పుడు కారు హారను కూడా రాని మా ఇంటికి ఇంటర్నెట్ వస్తుందని తెలుసు కొని, అభిమానులకోసం బ్లాగుతున్నా.

ఎవరీ హృదయభాను?
నాకూ ఆధునిక జీవన విధానానికి అస్సలు పడదని ఈ పాటికే మీకు అర్థమయ్యిండాలి. అందులో నాకు నచ్చని విషయాలు కొన్ని చెప్పవలసి వస్తే: రెసిడెంషియల్ పాఠశాలలు, హారన్ మోగించే కార్లు, భద్రత కరువైయ్యే సర్వీసు ఆటోలు, పోగ బట్టిపోయిన కాలనీలు, వగైరా వగైరా.

సిటీలో చిన్న పిల్లల్ని చూస్తే .......
"ఎందుకు? వీళ్ళు కష్టపడి ఈ పొగలో, ఈ భద్రత లేని ఆటోలలో ఎక్కి, లెక్కలు మాత్రమే నేర్పి, మనుషులను యంత్రాలుగా మార్చే బళ్ళకు వెళ్తున్నారే!
ఇంత కష్టపడీ వీళ్ళు పెద్దయి సాఫ్టువేరు ఇంజనీర్లయి, ప్రాణం, మనసు లేని ఓ మూర్ఖ డబ్బా ముందు కూర్చుని జీవితాన్ని వృధాగా గడపడానికేనా?
లేదు వీరికి దీనికంటే మంచి బాల్యం అవసరం, అటువంటి బాల్యం పై వారికి హక్కు ఎంతైనా ఉంది. నేను వీరికోసం పాటు బడతాను.
Materialism (తెలుగులో ఎమంటారో) ని జయించిన నాగరితను సాధించిన మహాన్మహిత దేశం లో పుట్టాను. మానవ జీవితం లో అందాలను నింపి, మనిషి మనస్సును ఆనందంతో పొంగి పొర్లేడట్టు చేసే చైతన్యం సాధించిన దేశమిది.
నా దేశం కోసం, దాని భవిత కోసం, దాని పెద్దలకోసం నేను పాటుపడతాను"
అని ఒక పద్ద లెక్చరు వినపడుతుంది. ఇంతలో మీకేమో, ఛాతీలో వేడిగా అనిపిస్తుంది, ఇంకొంత సేపు ఆ భాషణ వింటే ఛాతీ పేలేదేమో అని పిస్తుంది. ఇంతకీ ధర్మసందేశాలని ప్రబోధిస్తున్నది ఎవారా అని అటూ ఇటూ చూస్తే, అటువంటి వారెవూ కనిపించరు, చుట్టూవున్నవారంతా దైనందిత జీవితంతో రాజీపడడానికి ఉపాయాలాలోచిస్తున్నవారేగాని, ఉపదేశాలు చేసేవారు కారే.

అవును అతనే హృదయ భాను!
మీ గుండెలోనే గూడు కట్టుకొని, దుష్టరాజకీయనాయకులనీ, భ్రష్టప్లాస్టిక్కునీ చూసినప్పుడల్లా మీకు కోపం తెప్పించి, మనశ్శాంతి లేకుండా చేసి, మీకు మీరే ప్రబోధించేలా చేసే, ఆ అంతఃతేజస్సే ఈ హృదయభాను.

హృదయభాను వ్యాఖ్యానాలు
హృదయభాను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, అతని వ్యాఖ్యానాలు సర్వత్ర సర్వదా వ్యాపించి ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు
"భాషని బ్రతికించుకోవడమేమిటి నీబొంద?" రానారె వారి హృదయభాను.
"అవునా .. నిజమేనా .." కొత్త పాళి వారి హృదయభాను.
"టెల్గూ అంత వీజీయా…!" శ్రీరాం వారి హృదయభాను.
"ఎదో ఉండబట్టలేక... రాస్తున్నాను" సౌమ్య వారి హృదయభాను.
నా హృదయభాను ఇతర వ్యాఖ్యానాలు.

మీ హృదయభాను ఎమంటున్నాడో(న్నదో) తప్పక తెలుపండి !

6 comments:

  1. పునః స్వాగతం.

    ఉదయ...ఊప్సు...హృదయభానుని కాస్త కప్పి ఉంచడం, మరీ ఎక్కువ ఎక్స్పోజ్ చెయ్యకపోవడమే మంచిదేమో :)

    ReplyDelete
  2. ఇలా ఆత్మలతో మాట్లాడే వాళ్ళు బ్లాగుల్లో ఎక్కువయిపోయారు :-)

    కొందరికి సిద్ధ విద్యలు బాగా వంటబట్టినట్టు వుంది. అవసరమనుకున్నప్పుడు బయటికి తీసి ఓ చొక్కా వేసి లేకపోతే చీర కట్టేసి పేరు పెట్టి మాట్లాడేసి మళ్ళీ లోపలి పెట్టి జిప్పు వేసేస్తున్నారు. అయినా మీ అత్మ కి హృదయ భాను పేరే దొరికిందా? నాకేమో సాహసం చెయరా డింభకా అని ఉదయ భాను గుర్తొచ్చి అవేవో కీటకాలు పాకినట్టు వుంది :-)

    -- ఆత్మాలోచనా విహారి
    blog.vihaari.net

    ReplyDelete
  3. "జీవితంలో డెస్పయ్యి నా బ్లాగు చదివి నా పరిస్థితి కంటే వారి పరిస్థితి చాలా బాగుందనుకొని సంతోషపడే వారి కూడలే ఈ అభిమానసంఘాలు." ఈ సంఘాల నాయకుణ్ణి నేనే. డెస్పయితే తప్ప నీ బ్లాగు చదవబుద్ధి కాదు మరి. ;-)

    ReplyDelete
  4. హబ్బ, ఏవి టపా రాసినావు తమ్మీ.
    నా హృదయభాను మురిసి ముక్కలయ్యాడనుకో!
    నా టపాల్లో హృదయభాను వాచాలత చాలా వాటిల్లో కనిపిస్తుందనుకుంటా, కానీ నువ్వు ఉటంకించినది మాత్రం హృదయభాను ఉవాచ కాదనుకుంటున్నాను. ఆ టపా చాలా ఆలోచించి చాలా నిగ్రహంతో రాశాను :-)

    శ్రీరాముడు నీకంటే ఒక ఆకు ఎక్కువ చదివాడు - ఆయన హృదయభానుకి రెండు నాలుకలొచ్చాయి ఇప్పుడు :-))

    ఈ హృదయభాను గోల సరేగానీ .. నీ యాత్రా స్పెషల్ .. ఒకాతి కాపోతే .. పది రాయకూడదూ? బోలెడు కుతూహలంతో, కూసింత అసూయతో కూచుండ లేకపోతున్నా.

    ReplyDelete
  5. బాగుంది... మీ హృదయభాను డెఫినిషను. ఆ టపా నిజంగా నేను రాయలేదు...నా హృదయభాను రాసినదే. ఎటొచ్చీ దానికో వర్డ్ ప్రెస్ ఐడీ లేదని నా ఐడీ లో రాసింది....అంతే.... :)

    ReplyDelete
  6. రాకేశ్వర, నా విన్నపాన్ని మన్నించి నాకోసం బ్లాగినందుకు చాలా ఆనందంగా ఉన్నది. కూడలి లో రోజు చూస్తుండే వాడిని అచ్చులనుండి టపా వస్తందేమో అని, చాలా రోజులు రాకపోయేటప్పటికి వీవెన్ గారి కూడలి లొ లోపం ఉన్నదేమో అని మీ పల్లె కి వచ్చి చూశాను, బ్లాగ్బెంగ కలిగి బ్లాగమన్నాను. బ్లాగినందుకు ధన్యవాదాలు, ఎలాగు మీ అచ్చులకు ఉన్న సృజనాత్మక శక్తి నా మాటలకు లేదు కదా..

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం