తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨
రంగము 3
కబుర్లు గదిలో దర్శక బ్లాగరు, పిల్ల బ్లాగరు, చొఱవ బ్లాగరు.
చొఱవ బ్లాగరు విషయం చెప్పి కథ వివరించడం మొదలు పెట్టును.
చొఱవ బ్లాగరు – అనగనగా బ్లాగ్లోకంలో ఇద్దరు ఆప్త మిత్ర బ్లాగర్లు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక వ్యాఖ్యలు వదలుతూంటారు ఎప్పుడూ. ఎంత చెత్త టపా వేసిన ‘చాలా బాగుంది, కానీయండి’ అని వ్యాఖ్య వదిలేవారు. అలా గోదావరిలో పడవ ప్రయణంగా సాగిపోతున్న వారి జీవితాలలోకి ఒక రోజు అనుకోకుండ ఒక పిల్ల తుఫాను వస్తుంది. ఒక బ్లాగరు టాపాకి ఇంకో బ్లాగరు అస్సలు బాలేదని వ్యాఖ్య వదులుతాడు. అలా వారిద్దరికి గొడవ వచ్చి విడిపోయి ఇఱవై సంవత్సరాల తరువాత కలసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా విడిపోయిన కాలంలో వారిలో ఒకరు విప్లవాత్మక బ్లాగరు గానూ, ఇంకొకరు కూడలి అభిమాన బ్లాగరుగానూ పైకి ఎదుగుతారు. ఇద్దరికీ తెలియకుండా ఆ చెడ్డ విప్లవాత్మక బ్లాగరు మంచి బ్లాగరు చెల్లిని ప్రేమిస్తాడు.
ఇఱవై ఏళ్ల తరువత కలసినప్పుడు, మాటల్లో ఆ కమెంటు వదిలింది అతను కాదని వారు గ్రహిస్తారు. తన పేరుతో ఆ వ్యాఖ్య వదిలిన అనామిషుడు ఎవరా అని తెలుసుకోవడానికి వారు ఒక అపరాధ పరిశోధకుణ్ణి నియమిస్తారు. అలా ఆఖరికి మన కథానాయకులు ముగ్గురూ కలసి, ఆ అనామిషుణ్ణి పట్టుకుంటారు. ఆపై ట్విస్టు ఏంటంటే.. చెడ్డ బ్లాగర్ని మంచి బ్లాగరు కూడలి పెద్దలకు అప్పగిస్తాడు. ఆ ట్విష్టు కూడా సరిపోక పోతే ఇంకో ట్విష్టు ఏంటంటే, ఆ మంచి బ్లాగరు చెల్లెలు అపరాధ పరిశోధకుడూ ప్రేమించుకోవడం మొదలు పెడతారు, చివరకు పెళ్లి కూడా చేసుకుంటారు. అది తెలిసిన చెడ్డ బ్లాగరు బ్లాగుజైల్లో కసితో మండిపోతూవుంటాడు. అదండీ కథ.
దర్శక బ్లాగరు – అద్భుతం, నేను ఈ సినిమా తీయడానికి సంసిద్ధం.
బుడ్డ బ్లాగరు – నేను సహాయ దర్శకుడిగా వుంటానని ఇప్పుడే చెప్పేస్తున్నా.
చొఱవ బ్లాగరు – సరే. అంతకన్నానా.
దర్శక బ్లాగరు – అచ్చంగా ఇలాంటి కథకే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ వుంది.
చొఱవ బ్లాగరు – చెప్పండి.
దర్శక బ్లాగరు – కెమరా సౌరకుటుంబం అవతల, పాలపుంత దాటి ఆండ్రోమడా గాలక్సీలో వుంది. అక్కడి నుండి మనము దాన్ని పాలపుంత మీదకు జూమ్ చేస్తాం.
బుడ్డ బ్లాగరు – ఎంత సమయంలో జూమ్ చేయనున్నారు
దర్శక బ్లాగరు – పది సెకనులనుకో...
బుడ్డ బ్లాగరు – పది సెకనుల్లో కాంతి కూడా అంత దూరం పయనించలేదు, మన కేమరా ఎలా వస్తుంది అంత దూరం. కాంతికే పాతిక కోట్ల సంవత్సరాలు పట్టే దూరాన్ని మనము పది సెకనుల్లో ఎలా లంఘించగలము?
దర్శక బ్లాగరు – సహాయ దర్శకత్వం అంటే తేలికనుకున్నావా. నీ పని కేమరాని అక్కడికి పంపించి, దాన్ని పది సెకనుల్లో మన పాలపుంతకు తీసుకురావాలి. ఆ పని మీద ఉండు, ఈవాళ నుండి. ఇక పాలపుంతలో ఇతర నక్షత్రాలను దాటి, మన కేమరా, సౌరకుటుంబంలో ప్రవేశిస్తుంది.
బుడ్డ బ్లాగరు – పాలపుంతలోని డార్క్ మేటర్ ద్వారా కూడా తీసుకురావాలా.
దర్శక బ్లాగరు – అవును అవన్నీ తప్పించుకొని, సౌర కుటుంబంలో యముడిని దాటి, కుజుని దాటి, అంగారకుణ్ణి దాటి. ఊహించుకోండి, కెమెరా గురు గ్రహం చుట్టూ ఒక్క చుట్టు చుట్టి, మన భూమి మీదకు చంద్రుణ్ణి పక్కకు తన్నుకుంటూ వస్తుంది. భూమికి దగ్గరగా వచ్చాక మనము గూగులు పఠాలు చూపిస్తాం. అందులో జూమ్ అవుతూ, మన కెమెరా, అప్పటికి ఎడారిగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్తాం. అక్కడ ఒక గుత్తేదారూ, రాజకీయనాయకుడూ మాట్లాడుకుంటూవుంటారు. వారి నెత్తిమీదనుండి షాటు కదలి, ప్రక్కనే తవ్వుతున్న గోతిలో కార్మికులు కనిపిస్తారు. వారు త్రవ్వుతుంటే, టఙ్‌ఙ్ అని శబ్దం వస్తుంది. మన కేమరా దానికి అణుగుణంగా వెనక్కి వెళ్లి మళ్లీ క్రిందకు వస్తుంది. ఇంకో కూలీ గుణపం దింపుతాడు, మళ్లీ టఙ్‌ఙ్ అని శబ్దం, మళ్లీ కేమరా అలానే కదులుతుంది. ఏదో పెట్టె తగిలింది. పెట్టెని తెఱచి చూస్తే, వికృతంగా సగం కుళ్లిన కళేబరంతో ఒక శవం కాని శవం. జీవం కాని జీవం. జీవచ్చవం కాని జీవచ్చవం. నడవని నడపీనుగు ఒకటి ...
కట్ చేస్తే...
మన బ్లాగర్ హీరో అప్పుడే “PUBLISH POST” మీద నొక్కి.. వేచియుండమని తిరిగుతున్న ఐకాను చూసి “చత్త్, ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. సరైన బ్రాడ్ బాండ్ కనెక్షన్ కూడా ఇవ్వలేరు, నేను రేపే కొరియన్ ఎంబసీని ఆశ్రయిస్తున్నా“ అనుకుంటుండగా, టపా వేయబడింది అనే సందేశం వస్తుంది.
“VIEW POST” మీద నొక్కగానే. టపా క్రిందే. “Despicable” అని వ్యాఖ్య అప్పటికే వేసి వుంటుంది !
మన హీరో “నో…” అని గట్టిగా అరుస్తాడు. హీరోయిన్ వచ్చి ఏమిటని విచారించగా, హీరో ఆ అనానిమిషుడి కమెంటు చూపిస్తాడు! వారి ముఖాలమీద పడే వెలుతురు ఎఱుపు నుండి పచ్చుకు మారుతుంది. కెమెరాని వారి ముఖాల మీద మూడు సార్లు జూమిన్ జూమౌట్ చేస్తాం! నేపథ్యంలో సంగీతం బిషూ బిషూ బిషూ అని మూడు సార్లు వినబడుతుంది.
చొఱవ బ్లాగరు – అద్భుతం
బుడ్డ బ్లాగరు – అమోఘం. ఇంతకీ ఆ శవ పేటికలో ఉన్నది ఎవరు.
దర్శక బ్లాగరు – అదేగా మరి సస్పెన్సు, అది సినిమా ఆఖరి వరకూ చెప్పం. నేనూ ఇప్పుడు చెప్పలేను. చెబితే కథ లికైపోతుంది. ఇంకెవరైనా సినిమా తీసేస్తారు.
చొఱవ బ్లాగరు – సరే ఐతే ఇక తారాగణం, చర్చించుకుందామా.
దర్శక బ్లాగరు – చెప్పండి. ఎవరెవర్ని పెడదాం.
చొఱవ బ్లాగరు – హీరోలుగా రానేరా, పురాణ్ అనుకున్నాం. ఇక అప్పటికే అనామిశుడి ధాటికి తట్టుకోలేక, బ్లాగులు మూశేసిన వారి జాబితా... చాలా పెద్దదే వుంది. చీమలమఱ్ఱి, శీను, వగైరా వగైరా. వీరికి సినిమాలో పాత్రలు లేక పోయినా, వారి బ్లాగు తెరపట్టుకు దండేసి బొట్టు పెట్టి చూపిస్తాం.
దర్శక బ్లాగరు – బాగుంది. ఇక మన అనానిమిషుడు హింసించి బ్లాగులు మూసేయింప జేసేది ?
చొఱవ బ్లాగరు – మనము ప్రేక్షకుల్లో చాలా బలమైన ఎమోషన్లు రేకెత్తగలగాలి కాబట్టి, అతను అమాయకమైన పిల్ల బ్లాగుల మీదా, అణ్ణెం పుణ్ణెం ఎఱుగని పద్యాల బ్లాగుల మీద అనానిమిషు వ్యాఖ్యలు వదలడం చూపించాలి. ఆ పాత్రలలో మన రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, నన్ను వగైరా చూపిస్తాం.
దర్శక బ్లాగరు – అద్భుతం.
చొఱవ బ్లాగరు– ఇక, పాటల కోసమై స్వాతిగారినీ స్నేహమా రాధికగారినీ, గ్రాఫిక్స్ మఱియూ స్పెషల్ అఫెక్ట్స్ కోసం వెంకటరమణ గారిని, నిర్మాణ నియంత్రణ కోసం తాబాసు గారిని, ఆర్థిక వ్యవహారాల నియంత్రణ కోసం సీబీరావుగారినీ, ప్రచారానికి చావా కిరణ్ణి, క్యాటరింగ్ కోసం జ్యోతిగారిని, సంగీత దర్శకులుగా పప్పు నాగరాజు గారు, నృత్య దర్శకులుగా కొత్తపాళీ. ఇక మిగిలిన బ్లాగర్లందరూ నిర్మాతలు.
దర్శక బ్లాగరు – సరే అయితే వెంటనే అందరినీ సంప్రదించి, కాల్షీట్లు అడగండి. నేను ముఖ్య నటులతో మాట్లాడతాఁ.
బుడ్డ బ్లాగరు – కానీ సార్. ఆ కథ చూస్తుంటే, ‘ఇఱవై ఏళ్ళ తరువాత’ అనే ‘ఓ హెన్రీ’ కథను అనుకరించిన మన తెలుగు సినిమా ‘కృష్ణార్జునులు’ అనే సినిమా యొక్క అనుకరణలా లేదూ? మన నవ’తరం’గ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకం కాదా?
దర్శక బ్లాగరు – అదేం లేదు. అలా ఆలోచించినంత కాలం నువ్వు సహాయ దర్శకుడిలానే మిగిలిపోతావు. ఎవరో గొప్ప వ్యక్తి అన్నట్లుగా, అనుసరించడం తప్పుగాని అనుకరించడంలో ఎటువంటి తప్పూ లేదు.
తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪
మీరో ఈ పుస్తకమ్ తయాచు చేయండి రాకేశ్వరరావు గారు, మీ ఓ పికకు జోహార్లు
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteఅనామిష బ్లాగుకి అనామిష కమెంటా నాయనా... ప్‌ట్‌చ్‌త్
ReplyDeleteరాకేశ్వరా, చాలా బాగుంది ఈ ప్రహసనం. అయితే మొదట బ్లాగర్ల పేర్లని మార్చి వాడినా (రానేరా, కేకేశ్వర), మళ్ళా ఇందులో రాఘవ, గిరి అంటూ అసలు పేర్లు వాడేశారు.
ReplyDeleteఅనానిమిషుడి గురించి మీరు చురకలెయ్యడం, ఎవరో భుజాలు తడుముకుని (లేకపోతే వారే వీరా?) ’డెస్పికబుల్’ కామెంటొకటి పడెయ్యడం - దానికదే ఒక ప్రహసనంలాగా నవ్వు తెప్పించింది.
మిగతా భాగాలకోసం ఎదురు చూస్తాను. కొనసాగించండి.
"అనామిష బ్లాగుకి అనామిష కమెంటా నాయనా... ప్‌ట్‌చ్‌త్"
ReplyDeleteఏం చేస్తాం చెప్పు .. The world is filled with cliches :)
@ నాగ మురళి గారు
ReplyDeleteనాకు ఆ పారాగ్రాఫు ఇచ్చి దాని చుట్టూ కథ వ్రాయమన్నారు. కాబట్టి నేను దాన్ని యథాతథం వదిలివేయవలసి వచ్చింది !!!
@ కొత్త పాళీ గారు
:) అవును ఏం చేస్తాం
rakesh, you rock! :)
ReplyDeleteఇక మిగిలిన బ్లాగర్లందరూ నిర్మాతలు - I object, your honor!! ;-)
ReplyDelete