భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, April 23, 2009

వోటరు నెంబరు ౫౦౦ - రానారె

రాకేశ్వర నాయిడు రెడ్డి...
ఉరఫ్ రానారె, ఇవాళ వోటు వేశాడు. దూరదేశాల్లో వున్న ప్రవాస తెలుఁగు వారు తమ వోటు హక్కు బాధ్యతా మఱియు సంబరాల్లో పాల్గొనలేక పోయినవారికి ఆ అనుభూతి కలుగఁజేయడానికి ఇదిగో నేను నా అనుభూతి పంచుకుంటున్నాను. ఈ రోజుల్లో తెలుఁగు నాట నాలుగు పార్టీల వఱకూ వున్నాయి, సగటున ౧౦ అభ్యర్ధుల వఱకూ ఎన్నికల్లో నిలబడుతున్నారు.


అనుభూతి అంటే పెద్ద అనుభూతి ఎం వుంటుంది లెండి. ఎవరికి వోటేశావు ఎలా వేశావు అనేది చెప్పాలి. మీకు తెలుసో తెలియదోగాని గత రెండు నెలల పాటుగాఁ టీవీల ద్వారా, పత్రికల ద్వారా జనాలకు చిత్రవధ పెట్టారు పలు పక్షాలవారు.

నేను పుట్టినరోజున ఇలానే సార్వత్ర ఎన్నికలు సర్వత్రా జరిగాయి. అది ౧౯౮౩. నేను పుట్టి, ఎంటీవోణ్ణి గెలిపించాను. తెలుఁగు ఆత్మగౌరవం సంబడం చేసుకుంది. తెలుఁగులో లుగులకు మధ్యలోనున్న అఱసున్నా పునర్జీవితఁపు కలలు కంది. అఱసున్నాలోని అసులకు మధ్యనున్న ఱ కూడా కొత్త కలలు కంది. ప్రజాస్వామ్యంలోని సగటు కలలవలెఁ సదరు కలలు నెఱవేఱలేదనుకోండి అది వేఱేవిషయం. (అఱసున్నాలోఁ ఱవాడాలో రవాడాలో నాకు స్పష్టంగా తెలియదు. ఏదో అత్యుత్సాహాన్ని మన్నించగలరు.)

ఇంతకీ చెప్పవచ్చేదేంటంటే, మేము ఎప్పుడూ తెలుఁగు దేశానికే వేస్తాం. వేంటనే చంద్రబాబు నాయిడు మా పార్టీని లక్ష్మీపార్వతి నుండి రక్షించినప్పుడు మీరు ఎవరికివేశారు అని సందేహపడవచ్చు. అప్పుడు బాలయ్యబాబులాగా మేము కూడా సైకిల్ గుర్తుకే వోటేశాం. ఇలా తరతరాలుగా, అతిశయోక్తులు ఎందుకులెండి, ఇలా ఒక తరంగా సైకిలు గుర్తుకు ఓటు బ్యాంకై వెలసినాము మేము నాయిడ్రెడ్లం. కాని క్రితం సారి మాలో కొందరు - అంటే మా ఉమ్మడి కుటుంబంలో కొందరు - ఉమ్మడి కుటుంబం అనగా వూరిలో కొందరు ఉచిత విద్యుత్తు కోసం కాంగ్రేసోడికి వోటేశారు. అసలే మా రైతులకు ధనదాహం ఎక్కువ, మా దాహాన్ని దీర్చే పోగాకు తోటకి జలదాహం ఎక్కువ, అ జలానికి విద్యద్దాహం ఎక్కువ, విద్యుత్తునకు ధనదాహం ఎక్కువ, మొత్తానకి లెక్క సరిపోయి గుండు సున్నా అయ్యిందిగా. కానీ ఉచిత విద్యుత్తు అనేది తప్పుడు పద్ధతి, ఒక రకమైన అన్యాయం, దీని వల్ల కర్చులు బాహ్యమౌతాయని ఎఱిఁగిన మా అయ్యలాంటి వాళ్లు, అలా ఎఱుఁగని తెలుఁగు దేశం కార్యకర్త అయిన మా అమ్మలాంటి వాళ్ళు, ఎఱిఁగీ ఎఱఁగకున్న బెంగుళూరిలో ఉద్యోగంలో మునిగివుండి తెలుగుదేశం ఎలాగూ నగ్గుతుందిలే అనుకున్న నాలాంటి వాళ్ళు తప్ప మిగిలిన చాలా మందిలో కొంత మంది సైకిలుకి హ్యాండిచ్చారు. హ్యాండుకి బ్రహ్మరథం పట్టారు. (బ్రహ్మరథం పట్టడం అంటేఁ జంపి స్వర్గానికి పంపడం అని అసలర్థం వుందని మీరు ఎఱుఁగుదురా?) అలా హస్తానికి కుర్చీ వేసిన మావూరి జనాన్ని ఈనాడు చదివేవాళ్ళు క్షమిస్తారనీ, సాక్షి చదివే వారు కీర్తిస్తారనీ భావిస్తున్నాను. వెల్ మొత్తానికి జరగాల్సినది జరిగింది, ఆ బాబు శేఖర నాయిడ్రెడ్ల ప్రారబ్ధ కర్మలకు జరిగిన ఆ సంగ్రామంలో, మా వరి కొబ్బర్ల నాయిడ్రెడ్లు విద్యుల్లంచం తీసుకొని ఇచ్చిన తీర్పు అందరికీ ఎఱుఁకే.

ఐదేండ్ల తరువాత....
ధర్మం కలికాలంలో ఒక పాదం మీద నడుస్తుందంట. ఎనకెప్పుడో నాలుగు పాదాల మీద నడిచేదఁట. అలా నలుగు కాళ్ళుండే ధర్మగర్దభం ఈనాటికి పరమకుంటిదయ్యింది, మిగిలియున్న యా ఒంటికాలి మీద కూడా మన ముఖ్య మంత్రి గారు కత్తెత్తారని గత ఐదేండ్లుగా పత్రికలవారు మొత్తుకుంటూనేవున్నారు. వారి ప్రతాపానికి నీరసఁబడ్డ నాలాంటి పాత అభిమానులకు ఆక్రోశం పుట్టింది. మార్పు కోరాం. అలా మాలాగ ఆలోచించిన చిరంజీవి, చంద్రశేఖర రావు, జైప్రకాశ్ నారాయణ్ వంటి వారు నాట్సో-కొత్త పార్టీలకు కొత్త ఊపు తెచ్చారు. ఇలా ఎన్నికల పెళ్లి భోజనంలో విస్తరి నిండా వడ్డించి ఏదో ఒక్కటి మాత్రమే తినాలని విన్న పెళ్ళిపెద్దలాగా మేము కూడా బిక్కమొహం వేశాం. కానీ సమయానికి మా బాబు యువగర్జన అని గర్జించాడు. అలా మాకు విస్తరిలో పసుప్పచ్చగా వుండే రెండు చక్రాల జిలేబీనే తినాలి అని గుర్తుకొచ్చింది.

కొంత సేపు గర్జన గుఱించి చెప్పుకుందాం. మొన్నొక రోజు నేనూనొక బ్లాఙ్మిత్రుడూను గోదావరి పర్యాటనకై బైకేసుకుని వెళుతున్నాం. ఇద్దరం మహామేధావులం కాబట్టి. నాలుగు గర్దభాల వయస్సొచ్చినా, సజ్జోగోజ్జోగాలు లేక ఇలా బైకుల మీద తిఱిగి గర్వపడేవారిని మేధావులే అనాలిగా. అలా మేం మేధావులం బైకు మీద వెళుతూ, కనిపించిన లోకాన్ని అవహేళన చేస్తూ ఆనందిస్తుంటే, ఒక చోటఁ మాల గర్జననో, కావుంటి గర్జన నో ఎదో గర్జన చూసాం. మందకృష్ణ బొమ్మ వుందనుకుంట, రాజమండ్రిలో మాదిగ గర్జన అయుంటుంది. మొత్తానికి గర్జన అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం, ఏ కులపుటోరిదైతేనే గర్జన. (అన్నట్టు సామాజిక వర్గం, దళిత, వైశ్య, ఇలాంటి సాంస్కరిత సంస్కృత పదాలు వాడలేదని మీకు అభ్యంతరం కలుగవచ్చు, మేము ఏదో పాతకాలపుటోరం, అంత ఓపిక లేక సాంస్కరిత సాంస్కృతిక పత్రికలకు పంపుకోలేక ఇలా బ్లాగుల్లో వ్రాసుకుంటున్నాం. క్షతహృదయులు క్షమించగలరు.)
మొత్తానికి గర్జన గురించి గద మనం మాట్లాడుకుంటున్నాం, ఇలా యువ గర్జన, మాదిగ గర్జన వంటి గర్జనల పేర్లు చూసి ఒకటో రకం మేధావినైన నేను "హహ, మన జాతికింత మానసిక అభద్రతాభావం దేనికో, ప్రతిదానికీ తమనుతాము ఎప్పుడూ సింహాలతో పులులతోనూ పోల్చుకుంటూ వుంటారు. ప్రక్కవాళ్ళిని చంపుకుతినే కౄర మృగాలతో పోలిక ఏంటో, ప్రతీవాడు రాజుతో పోలికే. అలాగే ఐపియల్లో కూడా సగం జట్ల పేర్లో రాయల్సనో కింగ్సనో లయన్సనో వుంటుంది" అని అపహాస్యం చేసాను.
మేలు రకం మేధావి అయిన మన బ్లాఙ్మిత్రుడు (బ్లాగ్ + మిత్రుడు = బ్లాఙ్‌మిత్రుడు అనునాసిక సంధి) ఇంకా మేలురకంగా ఇలా "మాట్లాడితే మనుషులకు అర్థమవుతుంది గాని, వీడు గర్జిస్తాడఁట. హహహ" అని అపహాస్యం చేసాడు. మొత్తానికలా బ్లాగుల ద్వారా మీరెంత విడ్డూరమైన మనిషైనా, అంతకు మించిన విడ్డూరమైన మనిషి దొరుకుతాఁడు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అని తెలుఁగువారంటే, అతనికంటే ఇంగా ఘనుడు బట్టురాజు బాల అనిపిస్తుంది బ్లాగ్లోకం.

మొత్తానికలా ఎవరికి ఓటేయాలా అని ఆలోచిస్తున్న నాకు, గాలిపటం మీదకు తుఫానులా ఈ పథకాలు వచ్చిపడ్డాయి. నగదు బదిలీ అనీ, ఉచిత టీవీ అనీ, పసుపుకుంకుమలనీ, తొలిసూళ్ళని (గొడ్లకేనండోయ్), వడగండ్ల వర్షంలా వచ్చిపడ్డాయీ పాతకాత్మకములైన పథకాల. అప్పటికే ప్రపంచంలో లోభం ప్రసరిస్తుందని విలపిస్తున్న నాకు, కర్చులను బాహ్యింపజేసే వ్యవస్థ మీద వున్న కోపం వలన, ఉచితంగా వస్తువులు కావలని ఆశించిన వారి మీదఁ జుగుప్స, వాటిని ఇస్తామన్న వారి మీద విజుగుప్స హెచ్చించాయి. అప్పటి వఱకూ ఒక పద్ధతిలో రాజకీయం చేసుకుంటూ ముందుకు పోతావున్న చంద్రబాబు ఇలా పథకాలతో పతనమైపోవడం నాకు చాలా ఇబ్బంది కరంగా అనిపించింది. అలానే అప్పటి వఱకూ ఒక పద్ధతిలో పాత్రికేయం చేసుకుంటూ ముందుకు పోతావున్న ఈనాడు పత్రిక కూడా మఱీ ఇంత దారుణంగా కాంగ్రెసు మీద కసి కట్టడం, రోజూ చెడు వార్త మీద చెడువార్త అందించి వృత్తిధర్మాన్ని విస్మయించిన వారి మీద కాస్త జుగుప్స కలిగింది. ఇలా ఒకరి ప్రచారం చూసి ఇంకొకరి మీద జుగుప్స కలిగింది. అయినా తతో న విజుగుప్సతే అని స్మరించుకుంటూ ఆశా కిరణాలకై చూశాను. అలాంటి నాకు ఈల గోల వినిపించింది. జయప్రకాశు పథకాల మీద డబ్బు పంపిణీల మీదఁ జేస్తున్న వ్యాఖ్యలు నచ్చి, ఈ నా వోటు లోకసత్తాకేనని అనుకున్నాను. నిన్నటి వఱకూ.

కానీ మావారందఱూ తెదేపాకే నని ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎంతగా నంటే, మా మాజీ ఎమ్మల్లే మా కార్లు చూస్తే, ఆయని కారు మెల్లగా నడిపిస్తూ, మాకు కనబడేలా దణ్ణం పెడతాడు. మా కార్లంటే మా రెండు మూడు వూళ్ళలో రెడ్డినాయిళ్ళెవరికైనా సరేఁ. ఎంతైన ఊపిరితిత్తులకు పొగఁబట్టించి సంపాయించిన రైతు వర్గం కదా, అసలే అనాదిగా ఎస్సి నియోజకవర్గం, ఆయనేమో మాలాయన, కాబట్టి డబ్బు పంచినా ప్రచారం చేసిన మాలాంటోళ్ళేనని తెలుసుఁ. అలానే ఈ సారి ఎన్నికల్లో తెలుగుదేశం పేరిట నిల్చున్న ఆయని కుమార్తె కూడా మా చెల్లాయి పెళ్లిరోజు ప్రొద్దుట మా పెళ్ళింటికి వచ్చి, మరీ అందరినీ ఓటు అభ్యర్ధించింది. మేము పిలవలేదనుకోండి ప్రత్యేకించి, కానీ వచ్చింది ఎలాగైనా. ఊరు చిన్నూరై లోపలికున్నా దిట్టలని చెప్పి, గ్రహాల భారానికి కాంతి కణాలు వంగినట్లు వీరూ డబ్బు భారానికి వంగుతారు. మొత్తానికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మా అభ్యర్థిని బాగా చదువుకున్న ఆవిడ, వృత్తిరీత్య ఉపాధ్యాయిని, డాక్టరు పెండ్లాము. వోటుకు అర్హురాలు. కానీ కౌరవ పక్షానున్న భీష్ముడిలా, ఈవిడకూ ఓటు వేయదలచుకోలేదు నేను. నిన్నటి వఱకూ.

అలాగే మా లోకసభ అభ్యర్థి మురళీ మోహన్. మురళీ మోహన్ మంచి వాడు అనిపించేది నాకెప్పుడూ. కాబట్టి ఓటేద్దామనుకున్నాను. అప్పుడెప్పుడో తెలుపునలుపు చిత్రం జ్యోతిలో ఈయన జయసుధతో పాటు సైకిలు మీద వెళుతూ పాడుకున్న పాట చూసి, నేను సైకిలు గుర్తుకు ఆ ఓటు కేటాయించుదామనుకున్నాను.

నిన్నేం జరిగిందంటే...
మా లోకసత్తా అభ్యర్థి గుఱించి వాకబు చేసాను. వట్టి వెధవ అని తేలింది. ఎమ్మర్వోగా పనిచేసి, సరిగా వేయీ ఐదొందలకు కావలసిన పత్రం ఇచ్చేవాడు, ధర్మానికి న్యాయానికి సంబంధంలేకుండానని తేలింది. ఈ విషయం నాకు చెప్పింది ఒక తెలుగుదేశం కార్యకర్త అనుకోండి, కాని బుల్లిబాబు మాట నమ్మాలిగా. నమ్మాను.

ఇవాళ రోజూకంటే నాలుగు గంటలు ముందుగానే లేచాను. నిక్కరు వేసుకొని, సైకిలు మీద ఎక్కి మరీ వెళ్ళాను పోలింగి స్టేషనీకి, అరగంట లైనులో నించుంటే, వూరోళ్ళందరూ వచ్చి కొంత పిచ్చాపాటీ చెప్పుకుంటూ, ఆడవాళ్ళూ ముసలివాళ్ళూ వస్తే వాళ్ళని లోనికి రానిస్తూ, చిన్న చిన్న గొడవలు పడుతూ మొత్తానికి రెండు సైకిళ్ళకి ఓటేశాను. సరదా తీరలేదు. ప్రక్కనే మా నానమ్మ ఇంటికి వెళ్ళి ఆవిడను తీసుకువచ్చి, లైను మొత్తం తప్పించి, సంతకం చేయించి, ఇంకు పూయించి, డబ్బా వరకూ తీసుకువెళ్ళి వోటువేయించాను. మీకో విషయం తెలుసా, ముసలి వాళ్ళు వుంటే వారికి సరిగా కనబడకపోయినా, కనపడదన్న వంకనయినా, మీరు వారిని బూతు దగ్గరికి తీసుకువెళ్ళి ఇదిగో ఇక్కడ నొక్కు అని చూపించవచ్చని.

ఎనకయితే ఇన్ని పార్టీలు లెనప్పుడు ఒక్కొక్కళ్ళూ నాలుగయిదు వోట్లేశేవారు. ఇంకు అంటించగానే తలకు రాసేసుకోవాలి, అలా అది కొబ్బిరి నూనెలో కలసిపోతుంది. ఆ తరువాత హైదరాబాదో పరదేశమో వలసఁబోయిన మీ అన్నదమ్ముల పేర్ల మీదఁ, అక్కజెళ్ళల్ల పేర్ల మీదనో ఓటు గుద్దేయవచ్చు. కానీ ఈరోజుల్లో నాయిడ్రెడ్ల ఐక్యత తగ్గింది. కొందరు పెజారాజ్యం వంటి పార్టీల్లో కెళ్ళి అలా చేయనీయట్లేదు. పైగా ఫోటోలు చూపించమంటున్నారు.

అదన్న మాట నా ఎన్నికల అనుభూతి, అసలయితే మా పక్క నియోజక వర్గంలో మా మావయ్యే ఎన్నికల్లో నిలబడ్డాడు. లెక్క ప్రకారం ఆయని ప్రచారానికి వెళ్ళాలి. కానీ ఇక్కడ నాకు ఇతర ముఖ్యమైన పనులు వుండీ, చంద్రబాబు చంద్రుణ్ణి తెంపియిస్తానని చేస్తున్న హామీలు నచ్చక మొత్తానికి అంత ఉత్సాహం లేక వెళ్ళలేదు. హామీలు నచ్చకపోవడం ఎలా వున్నా ముందు ఇంటర్నెట్ పని వుండింది. ఆ మాత్రం దానికి మా బుల్లి బాబే అన్నాడు వాడు అన్న హామీలన్నీ పూర్తి చేస్తే ఎవడూ పనిలోకి రాడు, రైతు *&$# చిరిగిపోతుంది, కాబట్టి చెయ్యడెః అని. అది మన రాజకీయాల పరిస్థితి. మన పార్టీకి మనం వోటేసుకోవాలి అన్నది వేదవాక్కు.

వెల్, మొత్తానికలా ఓటైతే వేసి వచ్చాం. పనసగింజల కూరా, గెడ్డ పెరుగూ తిన్నాం. నా ఒక్క వోటు వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం ఏదైనా ఒకింతైనా మారుతుందా అంటే, యూగాట్టాబీ కిడ్డింగ్ మీ. పోనీ మా వూళ్ళో ౩౦౦ వోట్లు, అందులో ౧౦౦ ప్రవాసులు, వాటివల్లా పెద్దేం మారదు. కానీ అందరం ఓటేస్తే, ఎవరో ఒకరి ఓటు కీలకం అవుతుందిగా. ఆస్తలవీస్త (అలాగే లగెత్తుతా అని అర్థం)

కం. పలుపలు వరములు జనులుకుఁ
గలుపుదుమనుచును గలగలఁ గడు కపటములన్

బలుకుచు గెలుపుల కలలలొఁ

గులుకుచుఁ గదిలె డల శునక/గణిక కొడుకులఁ గనుమా


* పై పద్యంలో తమని రాజకీయనాయకులతో పోల్చామని భంగపడ్డ శునకములను/గణికలను క్షమించమని సవినయంగా మనవిచేసుకుంటున్నాను. ఏదో పద్యవరసకు అన్నాను గానీ, ఆ దానవమూర్తుల ముందు జంతు/మనావ మాత్రులమైన మనమేపాటి.