భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, November 18, 2009

'మాడ'ష్టీ - నిజమా? కలా?

మాడష్టీ అనే మాడు పదం నన్ను చాలా టీజు చేసింది అనడం ఏ మాత్రం హైపరుబోల్ కాదు.

అసులు ఏంటి ఈ మాడష్టీ అనేది? ఎలా వుంటుంది? సంతలో అమ్ముతారా? ష్టాకు మార్కెట్టులో అమ్ముతారా? కొనవచ్చా కొనలేమా? నీలా వుందా నాలా వుందా? నీలో వుందా నాలో వుందా? నిజమా? కలా?తలచుకుంటే మాడ పేలిపోతుండి కృష్ణా!

అసలు అందం అంటే ఏఁవిటి? అద'లది' నిజమా కలా? నీలో వుందా నాలో వుందా?
'తెల్ల'వాళ్ళు తేల్చి చెప్పారు, బ్యూటీ వుండి బిహోల్డరు కళ్ళలోనని.
'మన'వాళ్ళు కూడా తేల్చి చెప్పేవుంటారు, కానీ నాకు సంస్కృత శ్లోకాలు పెద్దగా గుర్తుండవు, పెద్దగా గుర్తులేవూ కాబట్టి, ఇప్పుడేమీ ఉదహరించలేను కానీ.. నాకైతే మనవాళ్ళు ‘లోకోః భిన్నాభిప్రాయః’ అని ఉద్బోధించివుంటారని అనిపిస్తుంది.


* * *

గరికపాటి నరసింహారావు గారు చెప్పడం ప్రకారమైతే ప్రపంచం నీలోవుంది, నువ్వు దాన్ని ఎలా చూస్తే అలా వుందని వ్యాసుడు, ఓషో, రవిశంకర్ గురుజీ అన్నారఁట. ఆయనైతే దానికి సంస్కృత శ్లోకాలు కూడా చెబుతారు.

ఓషో అంటే గుర్తుకువచ్చింది. ఓషో అంటే గుర్తుకు వచ్చేది సామాన్య ప్రజానీకానికి విచ్ఛలవిడి శృంగార వైభోగాలఁట. మొన్ననే తెలిసివచ్చింది. ఎవరినో భగవాన్ రజనీశ్ తెలుసా అంటే, అతనా నగ్నాశ్రమాన్ని పెట్టాడంటగా అన్నారు. వెల్.. అవన్నీ నాకు తెలియదు గానీ, ఓషో కొన్ని మంచి పాయింటులు లేవనెత్తాడని నా నమ్మకం - ఆయన గుఱించి తెలిసిన కూస్తా కాస్తాలో. మాంచి పాయింటులు లేవనెత్తే ఎవరికైనా మంచి కాలం కలసిరావడం తప్పనిసరి కాదని చాలా మంది అభిప్రాయం.

అభిప్రాయమంటే గుర్తుకువచ్చింది.
ఓషో మీద మీకో అభిప్రాయం వుంటే, అది ఓషో గుఱించి కంటే, మీ గుఱించే ఎక్కువ చెబుతుందఁట.
అంటే ఒకరికి ఓషోలో మహా గొప్ప తత్త్వవేత్త కనబడితే, మఱి కొందఱికి ఆయన మంచి పాయింటులు లేవనెత్తాడని అనిపిస్తే, ఇంకొందఱికి ఆయన బూతుని మతం చేసి సొమ్ము చేసుకున్న ఠక్కరి అనిపించవచ్చు, ఇంకొందరికి దేశ బహిష్కరణ చేయవలసివచ్చేటంతటి తీవ్రవాది అనిపించవచ్చు (అమెరికా ప్రభుత్వం లాగ).

ఇంత మందికి ఇన్ని విభిన్న అభిప్రాయాలున్న వారిమీద అభిప్రాయం ఎవరి గుఱించి ఎక్కువ సమాచారం ఇస్తుందన్నది ఇప్పటికే తెలియవస్తుందనుకుంట.

శివోఽహం

ఓషో లాంటోడే శివుఁడు. ఓషో ప్రకారం ఆయనే శివుఁడు. (ఇక్కడ కూడా ఎవరి అభిప్రాయాలు వారివి).

శివుఁడి మీద కూడా ఎవరి అభిప్రాయాలు వారివి. లోకంలో చూడబోతే అన్నిటి మీదా భిన్నాభిప్రాయాలు వున్నట్టు కనబడుతుంది. భిన్నాభిప్రాయాలు వుండడం మీద తప్ప. మార్పు దక్క అన్నీ మారతాయిఁట. దానీ తస్సాగొయ్య. అలాగే భిన్నాభిప్రాయం మీద దక్క అన్నిటిఁ మీదా లోకులకు భిన్నాభిప్రాయాలుఁట.

శివుణ్ణినేనే అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. నేనేశివుణ్ణి అన్నదాని మీద కూడా భిన్నాభిప్రాయాలు. ఈ భిన్నాభిప్రాయల ప్రపంచంలో, చెడు అభిప్రాయాల బాధ్యత ఎవరు వహించాలి? అభిప్రాయం మోసేవాడిదా, దానికి ఆధారమైన వాడిదా, లేదా ప్రభుత్వానిదా?

* * *

గొప్పవారందరికీ ఇదే చిక్కువుంటుంది. ఉదా- శివుఁడు, ఓషో, రాజశేఖర రెడ్డి, కత్తి మహేశ్ కుమార్.

శివుఁడు గుఱించి మనకైతే పర్వాలేదు మంచి అభిప్రాయం వుంది గాని. పాశ్చాత్య దేశాల్లో ఆయని గ్రాండ్ కాంసెప్టుని వారు అర్థంచేసుకోలేకపోతున్నారు. అతనిని నకారాత్మక భావాలతో అసోసియేట్ చేస్తున్నారు.

ఓషో గుఱించి చెప్పనక్కఱలేదు.

రాజశేఖర రెడ్డి అంటారా, పోయినోళ్ళు అందరూ మంచివాళ్లు అని మనం గుర్తు పెట్టుకుందాం, లేకపోతే భిన్నాభిప్రాయాల వరద రావచ్చు. ఈయన పోయినప్పుడు ఈనాడు వాడిలా నేనూ ఎంతో కలతచెందాను గానీ, (నేను వార్తలకై నమ్ముకున్న ఏకైక స్రవంతి అది! ) అంతకు ముందు నాకు ఈయన పద్ధతులు పెద్దగా నచ్చేవి కావు, ఖజానా కాళీ చేసే తత్త్వం అని నా నమ్మకం. కానీ నిన్ననే ఒకతను రాజానగరం నుండి మావూరొచ్చి, “రాజశేఖర రెడ్డి వుంటే ఈ పాటికి చేలు కలకలలాడతావుండేవండి, ఇలా వుండేయేటండి అసలు” అన్నాడు. లోకోః భిన్నాభిప్రాయః అనుకొని సరిపెట్టుకున్నాను నేను.

* * *

అలానే ఇప్పుడు కత్తిగారి సంగతికి వద్దాము.

ఈయననే ఎందకు ఎంచుకున్నానంటే, అందరికీ తెలిసిన పేరు, పేరు వాడుకున్నా తప్పుగా భావించని విశాలహృదయుడు. ఇతర ప్రముఖ బ్లాగర్లు వివాధాలలో చిక్కుకున్నా, వాటిని గుఱించి సరిగా తెలియక ఈయనని ఎంచుకోవడం జరిగింది (ఈనాడు ఆ కథనాలను ప్రచురించినగాని, వాటిని నేను చదవుట జరుగలేదు).

ఈయనని గుఱించి చాలా మంది బ్లాగర్లను అడిగాను. వారిలో చాలా మంది, పెద్ద అన్నీ ఆయనకే తెలిసినట్టు వ్రాస్తాడు, అందుకే నాకు నచ్చుతుంది/నచ్చదు అంటారు. అదే తత్త్వం కొందఱికి నచ్చడం కొందరికి నచ్చకపోవడం జరుగుతుందే! ఈ విషయం నాకెప్పుడూ అర్థంకాదు. అంటే ఈయనకు మాడెష్టీ లేనట్టా? అసలు ఏంటి ఈ మాడష్టీ?

నేను ఒక అభిప్రాయం వ్రాసాననుకోండి. ఉదా- "హిట్లరు చేసింది ఏమంత పెద్ద తప్పుకాదు, అతను ప్రేరేపించబడ్డాడు, ఒక దేశ ప్రజ అతనికి వత్తాసు పలికింది"... దానికి నేను ఈరెంటిలో ఏదైనా జతచేయవచ్చుఁ
(చాయిస్ ఎ) దీనిని మీరు అంగీకరించకపోతే మీరు మూర్ఖులు
(చాయిస్ బి) ఇది నా అభిప్రాయం మాత్రమే.

ఇప్పుడు చాయిస్ ఎ ఉంచితే అతనికి మాడష్టీ లేనట్టు, చాయిస్ బి వుంచితే అతను మాడెష్టోడూ అని అర్థమా? ఇక్కడి అసలు విషయం హిట్లరుని మంచి వాడు అనడం (నా సహవాసి ఒకడు నిజంగా హిట్లరు గుఱించి అన్నమాటలవి) అలా అన్నవాడు మాడెష్టోడు అయితేనేం కాకపోతేనేం?

* * *

నేను ఒక టపా వ్రాసాను. ఆ మాటకు వస్తే, ఎవరైనా ఏదైనా టపా వ్రాసారు, దాని క్రిందఁ, “ఇది నా అభిప్రాయం మాత్రమే”, అని పెడితే వాడు మాడెష్టోడు లేదా కన్విక్షణులేనోడూ అని అనాలా?ఎవరైనా వ్రాసేవి వారి అభిప్రాయాలేగా, నేను మీ అభిప్రాయాలూ, మీరు నా అభిప్రాయాలూ వ్రాయముగా?

పోనీ అభిప్రాయాలతోఁబాటూ నేను ఉదాహరణలూ, పలువురి పెద్దల అభిప్రాయాలు కూడా ఊటంకించాననుకోండి. అవి కూడా 'నా' దృష్టిలో మంచి అభిప్రాయాలు, 'నా' దృష్టిలో మంచి ఉదాహరణలే అవుతాయి గానీ, మీ దృష్టిలో కాకపోవచ్చునుగా. ఇది నా అభిప్రాయం మాత్రమే అన్న ఉత్త పుణ్యానికి అతని మీద సదాభిప్రాయం ఏర్పరచుకోవచ్చా. ఆ మాత్రం దానికి నేను నా బ్లాగు శీర్షికని నా అభిప్రాయం మాత్రమే అని మార్చి ఏదైనా వ్రాయవచ్చాఁ అని.

* * *

నాణానికి ఇంకో ప్రక్క చూద్దాం. నా స్వానుభావంలో ఏం జరిగిందంటే, నన్ను వివిధ పర్యాయాలు చాలా మాడెష్టోడు అబ్బే అస్సలు చాలా ప్రౌడెష్టోడు అనీ అన్నరు. రెండు సార్లూ నేను చాలా ఖంగుతిన్నాను. ఏదీ నా నెత్తి మీదఁ వ్రాసుందా, ప్రొద్దుట అద్దం చూసుకోవడం మరచానే అనుకునేవాడిని.

అసలు చెప్పాలంటే నేను చాలా గొప్పోణ్ణి. (ఇది పూర్తి నిజం కాదు, ఎందుకంటే నేను అసలుకి చాలా చాలా గొప్పోణ్ణి అంటారు అందరూ).
ఇప్పుడు పై మాటన్నాక నేను మాడెష్టోడినా కాదా? చాలా చాలా గొప్పవాడినైన నేను, ఉత్త గొప్పోణ్ణి అన్నందుకు మాడెష్టోడి నౌతాను, లేదు నా గొప్పని నేను చెప్పుకోవడం అమాడెష్టత్వం అవుతుందా. అంతెందుకు అమెరికాలో జాబింటర్వూకి వెళ్ళి నేనూ మీరూ మన భారతీయ సాంప్రదాయ మాడెష్టత్వం చూపితే వాడు మనకి మహాద్వారం చూపిస్తాడు.

* * *

ఇప్పుడు మాడెష్టిత్వంతో వచ్చిన ఇంకో చిక్కు. మాడెష్టత్వం మంచి లక్షణం అయినప్పుడు నేను మాడెష్టు అని చెప్పుకోవడం అమాడెష్టిత్వం అవుతుందా? అనడం ప్రక్కన పెట్టండి, ప్రదర్శిస్తే?

"నేను గొప్పవాడిని, కానీ నేను మాడెష్టువాడిని కాను". సరేఁ, బాగుంది, మాడెష్టు కాదని మాడెష్టుగా చెప్పుకున్నాడు బాగుంది వీడి పద్ధతి.

* * *

మొత్తానికి మిమ్మల్ని మాడెష్టు అని కొందరు. గర్విష్టు అని ఇతరులూ నంటే, అది వారిలోనే వుందని పిస్తుంది. మిమ్మల్ని మాడెష్టు అనడం వారి మాడెష్టీ, మిమ్మల్ని గర్విష్టు అనడం వారి గర్విష్టీ!

అంతెందుకు మీరు గొప్ప అన్నభావం వారిలో లేనప్పుడు మీరు గొప్పలు చెప్పుకుంటున్నారని వారికి ఎలా అనిపిస్తుంది? నేను , అంటే అహం, అంటే శివుఁడు, అంటే బ్రహ్మ, గొప్ప వాడినని మీకు తెలుసు కానీ మీరు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు, అందుకే మీకు కోపం వస్తుంది.

* * *

ఉదా – గీతలో కృష్ణుడు (కొందరి అభిప్రాయంలో భగవంతుడు), "నేను" అనడానికీ "భగవంతుడు" అనడానికీ పెద్ద తేడా చూపించడు, ఛందస్సులో ఏం సరిపోతే అది వాడుతుంటాడు అనిపిస్తుంది. ఇది చూసి నన్నో గూదోడు (మా తమ్ముడౌతాడు వరసకు కాబట్టి అభిప్రాయాలు జాగ్రత్త) "భగవద్గీతలో కృష్ణుడు డబ్బాకొట్టుకున్నట్టుంటుంది" అని అన్నాడు.
వెల్.. దాని పేరే అది కదా మరి భగవత్ గీత (జస్త్వసంధి షష్టీతత్పురుష సమాసం). చెప్పేవాడు భగవంతుడు కాబట్టి, కృష్ణుని ‘డబ్బా’నే అవుతుంది?

కృష్ణుడు అలా నేను అంటే భగవంతుడు అనకపోతే ఇక భగవద్గీతకు విలువేంటి?
కృష్ణుడు బోధించేది మనలోని బ్రహ్మతత్త్వాన్ని వెదికితీయమని.
ఆయనే "అబ్బే లేదండి నాదేఁవుంది, ఎదో రథం నుడుపుకునే అనస్కిల్డు లేబరుని" అని మాడెష్టీ చూపితే, ఇక బ్రహ్మత్వానికి ఆధారం ఏది?
కాలః కలయతామ్’అహం’ అనక పోతే అది అద్వైతం ఎలా అవుతుంది ?

కాబట్టి నేను శివుణ్ణి మహేశ్వరుణ్ణి నేను ఎంత డబ్బా కొట్టుకున్నా అది తక్కువే. మీరూ అలానే భావించండి.
"అతడంతే అంతా అతడికే తెలిసినట్టు చెబుతాడు" అని కృష్ణుణ్ణి కూడా విమర్శించేవుంటారు పురజనులు. తత్త్వం తెలియని వారి వ్యాఖ్యల గుఱించి జంకవద్దు! మీలో శివత్వాన్ని చూడనప్పడు ప్రక్కవాడిలో ఎలా చూడగలరు?

* * *

ఇవి ఈ ముదనష్టపు మాడెష్టీ తెచ్చిన చిక్కులు. ఒకటా రెండా!

Monday, November 16, 2009

గూదరికం

నేను చూడ్డానికి నా వయస్సు కంటే చాలా చిన్నగా అనిపిస్తానఁట. అంటే చిన్నగా చిన్నగా కాదు, (Not small small కి తెలుఁగు అనువాదం) వయస్సులో చిన్నగా, మన అసలు ఒడ్డూ పొడుగూ కాస్తే ఎక్కువే.

నాలుగేళ్ళ క్రితం అమెరికాలో పీజీ (వాళ్ళ బాషలో వుత్త జీ) చేస్తున్నప్పుడు అందరూ అడిగేవారు నువ్వు ఎన్నో యేఁడు అని (అంటే యూజీలో ఎన్నోయేఁడని వాళ్ళ ఉద్ధేశం). ఒక నాడు యమరీ విశ్వవిద్యాలయంలో ఏదో ఆటపాటలకు వెళ్ళితే, అక్కడ నా నాట్య చాతుర్యం చూసిన ఒక కొత్త దేశీ విద్యార్థి, ముందు "నువ్వు మొదటి యేఁడా" అని అడిగాడు. అప్పటికే నాలుగేళ్ళు అయిపోయి, రెండేళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన నాకు లోలో కాస్త ఆనందం వేసినా, పైకి ఆశ్చర్యం నటిస్తూ, ఛీ కాదు అన్నాను. అవును నువ్వు స్వింగు నేర్చుకున్నవాడిలా కనబడుతున్నావు కాబట్టి రెండో యేఁడు అయివుంటావు అన్నాడు. వాడు అప్పడే అమెరికా వచ్చిన మొదటి యేఁడు విద్యార్థి. నేనౌనన్నానో కాదన్నానో గుర్తులేదు కానీ, మనల్ని జనాలు గూదవాడిగా పరిగణిస్తున్నారని నాకు తెలిసింది. ఇది అనుభవం చాలా సార్లు జరిగింది. ప్రత్యేకించి జంటనృత్యశాలల్లో.

అప్పటిలో నా సహవాసి కూడా అనేవాఁడు, మాఁవా నువ్వు ఇఱవైనాలుగేళ్ళ వాడిలా వుండవు, గూదవాడిలానే వుంటావు, కానీ.. (ఈ కానీ చాలా ముఖ్యమైన కానీ) .. నువ్వు ఫిలాసఫీ మొదలు పెట్టినప్పుడు మాత్రం చాలా చాలా పెద్ద వాడిలా మాట్లాడతావు అని. అప్పుడు కూడా నాకు కాస్త సంతోషం వేసింది కానీ, అది త్వరలోనే బాధగా మారింది. ఒక ప్రక్కనేమో గూడవాడిలా ఆటాపాటా చూసుకోవాలని వుండేది. ఇంకోప్రక్క ప్రంపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే తపన. తెలుసుకున్న కొద్దీ పెరిగే బాధ. ఏసు ప్రభువు బైబిలిలో చెప్పినట్టుగా , ఎంత జ్ఞానం పెంచుకున్నవాడికి అంత దుఃఖమఁట. ఇది జరిగి మూఁడేళ్ళయ్యింది.

కాల చక్రం తిఱగడంతో ఆట వెనక్కి వెళ్ళి బాధ ముందుకొచ్చింది. చాలా చాలా తీవ్రంగా. నా రచనలు కూడా ఇలానే మారాయి. అప్పటిలో తోటరాముడు తరువాత అంతటివాడు అన్నారు బ్లాగ్లోకులు. ఇప్పుడు కత్తి మహేశు తరువాత అంతటి వాడు అంటున్నారు! నా మటుకు నాకు అది ఒక రకంగా మంచి పరిణామమే అనిపించినా, కుమ్మరి పొయ్యలో కాలిన ఉక్కులా ఈ మెటమార్ఫసిస్సు చాలా నొప్పి అనిపించింది.

మొన్న విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాను. పది రోజుల్లో పది మంది నన్ను విద్యార్థి అనుకున్నారు.
వెళ్ళీ వెళ్ళగానే, చేఱడానికి వచ్చాననగానే, ఎంటెక్కా బీటెక్కా అని అడిగారు. బీటెక్కు అందామనుకున్నాను కానీ, లేదు లెండి పాకల్టీ అన్నాను. ప్రక్క డిపార్టుమెంటుకు వెళ్ళినప్పుడల్లా, "ఊఁహూఁ మాష్టారుగారి చుట్టానివా? ఎంటెక్కా బీటెక్కా" అని అడిగేవారు. రెండూ చెప్తాను అనే వాడిని. "ఓహో. రెండూ ఎలాగా" అని అడిగేవారు. రెండిటికీ పాఠాలు చెప్పే పాకల్టీ అన్నాను. వారు ఆశ్చర్యపడేవారు. కొన్ని సార్లు చర్చలు కూడా జరిగేవి. ఇతను బ్యాగు వేసుకోవడం వల్ల అనే తీర్మానించారు కొందరు. ఈ కొత్త లెక్చరర్లతో నింతే అనేవారు ఇంకొందరు.

దారుణమైన పరాభవాలు ఎక్కడంటే. మన సూడో-ఫ్యూడలిష్టు దేశంలో.
గ్రంథాలయం దగ్గర. "హలో ఎక్కడికి" అనడిగాడు, "ఇక్కడ కంప్యూటర్లు వున్నాయా? జర్నల్లు ఎక్కడ వున్నాయి?" అని సమాచారం అడుగుతుంటే, చెప్పి, "ఎంటెక్కా బీటెక్కా" అని అడిగాడు. నేను పాకల్టీ అన్నాను. తోక తొక్కిన తాచులా లేచి నిలబడ్డాడు గ్రంథాలయఁపు అటెండరు. అవునా అండీ మీరా అండీ ఎ డీప్రార్టుమెంటండీ పలానా సబ్జెక్టుకు ఏం పుస్తకమైతే బాగుంటుందండి. అని నానా వినయతా ప్రదర్శించి తప్పును సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తుంటే, ఫ్యూడలిష్టు అవశేషభావాలు చేస్తున్న తాండవాన్ని చూసి అనందించాను నేను.

ఇక క్యాంటీనులోనైతే, మొదటి రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు.
రెండవ రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు. లాభం లేదని నేను కోపం నటించాను.
మూడవ రోజు.. హలో సార్ రండి. బాగున్నారా. ఎం తీసుకుంటారు?

కొందరైతే నన్ను ర్యాగింగు చేయడానికి కూడా చూశారు. ఏటీయంలో లోపలికి రాకూడదని గుర్తుచేసినందుకు ఇంకొకఁడు గొడవ కూడా పెట్టుకున్నాడు.

ఇక కన్నడ దేశంలో ఓదిత్తిద్దారా, ఓదిత్తిద్దారా, ఏను ఓదిత్తాయిద్దారె? అని తెలుఁగు దేశంలో చదువుతున్నరా చదువుతున్నారా ఏం చదువుతున్నారు? అని అడిగేవారు. కొన్ని సార్లు ఎంటెక్కు అనే వాణి, ఎందుకొచ్చిందిలే అని. లేదంటే, ఎం చేస్తున్నావు. పురుషుఁడు కాళీగా వుండకూడదు అని క్లాసు పీకుతారు. తత్త్వం తెలియని దద్దమ్మలు.


మొన్న హైదరాబాదులో,
భక్తి టీవీ వారింటికి వెళ్ళాను, నరసింహారావుగారి ఆముక్తమాల్యద దొరుకుతుందేమోనని, వెళ్ళాను. కాసేపు కూర్చోబెట్టాక ఒకావిడ వచ్చింది. ఇంచు మించు నా వయస్సేవుంటుంది. తెలుఁగులో యం.యే చేసి భక్తి టీవీలో పనిచేస్తున్నట్టుంది. అదృష్టవంతురాలు, యమ్మేకింకా ఆశ మిగిలివుంది అనుకున్నాను.
ఆముక్తమాల్యద 50 డీవీడీలు - 4వేలు
పాండరంగమాహాత్మ్యము 40 డీవీడీలు - 3 వేలు
కాళహస్తీశ్వర మాహాత్మ్యము 20 డీవీడీలు - రెండు వేలు
అని ఏవో రేట్లు చెప్పింది.
నా కోసమే అంటే కొంటరా అని అడుగుతుంది,అందమైన అమ్మయి అందునా యమ్మేచేసినావిడ ముందు పరువు నష్టం ఎందుకని చెప్పి, నా మిత్రులు అమెరికాలో వుంటారు వాళ్ళకి భక్తి టీవీరాదుగా వారి కోసం అడిగి తెలుసుకుంటున్నాను అని చెప్పాను. లోలోపల ఇంతిలా ఐతే వాళ్ళు సైతం కొనలేరేమోననిపించింది. నూటపది డీవీడీలకు 200డాలర్లు అంటే పర్వాలేదేమో.
ఇంకేమున్నాయి మీ దగ్గర అని అడిగాను, (మన స్థాయిలో ఏవైనా వుంటాయేమోనని) ఆవిడ, భక్తి టీవీలో కృష్ణుడి పాటలు వస్తాయి అవి ఒక డీవీడి ఐదు వందలు అన్నది. కృష్ణుడి మీదా? ఎప్పుడు వస్తాయి? అని అడిగాను.
మీరు భక్తి టీవీ చూస్తారా? అంది.
చూస్తాను.
అంటే మీరు చూస్తారా భక్తి టీవి.?
చూడకే రోజూ చూస్తాం.
అంటే 'మీరు' చూస్తారా రోజూ?
ఓహ్ అర్థమయ్యింది , యమ్టీవీ చూడవలసిన వయస్సులో భక్త టీవీ ఏంటని, భక్తి టీవి లో పనిచేసేవారికే అనిపిస్తే, మన సంస్కృతి గట్టెక్కినట్టే అనుకున్నా.

ఇది బయటి ప్రపంచం.
బ్లాగ్లోకంలో.
నేను నవతరంగంలో వ్రాసిన వ్యాఖ్యకు ప్రతిగా ఒకతను. ఈ పెద్దవాళ్ళకు నేటి యువత భావాలు అర్థంకాదు. అనవసరంగా వారి మీద ఆడిపోసుకుంటారు అన్నాడో పెద్దమనిషి. పేరులో ఫ్యాషనబుల్ గా కుమార్ పెట్టుకున్న అసలు పెద్దవాళ్ళ కంటే నా పేరులో రావు వుండడం నన్ను పెద్దవాణ్ణి చేసిందనుకుంట.

భక్తి టీవీ అనుభవం తరువాతి రోజు ఇంకో చోటికి వెళ్లాను, అక్కడొక బ్లాగరుని కలవడానికి. బ్లాగరుతోబాటు ఆయన యేజెంటు కూడా వుంటారు అక్కడ. ఈవిడా బ్లాగరే, ప్రస్తుతానికి మూసేసినట్టున్నారు కానీ నేను, తెరుస్తారని మాట తీసుకొనివచ్చాను. ఈవిడ కూడా రాకేశ్వర రావు అంటే చాలా పెద్ద వారయ్యుంటారనుకున్నానండీ. అంది. అంతే నండీ పేరు చూసి పెద్దాయన అనుకుంటారు అన్నాను. లేదండి, మీరు వ్రాసేదానిని బట్టి నేను అలా అనుకున్నాను అంది.

హారి దేఁవుఁడా ఇదేం చింపుడారా బాబూ. ఒక ప్రక్క శ్రీశ్రీ బాధ ఇంకో ప్రక్క Joie de vivre. జరాసంధుడిలా వుంది పరిస్థితి.

ఈ బ్లాగు చదవడానికి కన్నడ నుండి ప్రెంచి వఱకూ పలు భాషలు రావలసిరావడానికి చింతిస్తున్నాము. కానీ కమ్ముల శేఖరాని డాలర్ డ్రీమ్స్ లా మీకు వర్తిట్ అని అనిపిస్తుందని.

Thursday, November 12, 2009

మేరీ మాతా వందనం

తెలుఁగు వారి ఆత్మాభిమానాన్ని (లేదా దాని లేమిని), వారి నిజాయితీని(లేదా దాని లేమిని) బయటపెట్టిన ఓ మేరీ మాతా వందనం.

అసలెవరీ మేరీ మాత?
స్కూల్ టీచరా? క్షమించాలి బడిపంతులా?
లెక్కలు చెబుతుందా? ఇంకేమైనా చెబుతుందా?
క్రైస్తవురాలా? మాలా? మాదిగా? మఱింకేమైనానా?
తెలుఁగింటామా? తెలుఁగు ద్వేషా?
ఆంగ్లింటామా? ఆంగ్లమసలు వచ్చా?
క్రూరురాలా? క్రమశిక్షణాపరురాలా?
క్రమశిక్షణాపరాయణురాలా?
అమాయకురాలా? దోషా?
బలిసిన బడిపంతులా? లేక, బతకలేక బడిపంతులా?
లేదా ప్రలోభమే మూలమైన ఈ బృహద్యంత్రంలో ఒక మఱ మాత్రమేనా?
తాము చేసే తప్పుకు తమను తాము నిందించుకోలేక, జాతి జాతి మొత్తమే వెదుక్కున ఒక బలిపశువా?
ఇలాంటి మేరీలను బ్రతకనియ్యాలా లేదా బలివ్వాలా?

* * *

అసలు ఈవిడ కొత్తగా చేసినదేఁవిటి? ఏఁవిటి ఈవిడ చేసిన తప్పు?
ఆంగ్లమాధ్యం బడిలో ఆంగ్లం మాట్లాడాలని చెప్పడమా?
మాతృభాషని అవమానించడమా?
క్రూరంగా ప్రవర్తించి వేయరాని శిక్ష పిల్లలకు వేయడమా?
లేదా పిల్లల తల్లిదండ్రుల ఆశయాలను ప్రాణం కంటే ఎక్కువగా పరిగణించడమా?

మెడలో పలకలు అనాదిగా ఈ నాట ఈ ప్రజ తగిలిస్తూవస్తున్నదే, తొలుత పశువుల మెడలలో. గత ఇఱవయ్యేండ్లగా పిల్లల మెడలలో. పిల్లల ఆత్మలకు శారీరికంగా మానసికంగా గొలుసులు అనాదిగా వేసిన కుటుంబ వ్యవస్థ సృష్టించిన బడిలో ఉద్యోగం చేయడమా ఈమె తప్పు? దానికి సంత జోసపు పేరుండడమా?

తెలుఁగులో మాట్లాడినందుకు దండించడమా ఈమె తప్పు?
తెలుఁగు బళ్ళు కాదనుకొని, ఆంగ్ల మాధ్యమం బళ్ళలో వేసి, అందులో పిల్లలను చేర్చి అందులో వారు నేర్చిన పరభాషా ప్రావీణ్యతని చూసి మురిసిపోయే తల్లిదండ్రులున్న రాష్ట్రాన ఏఁవిటి ఈవిడ తప్పు?
“ఉరేయ్ అసలు వాళ్ళ స్కూలులో తెలుఁగు మాట్లాడనీయ్యరులా, ఒక స్టిక్కువుంటుంది, అది ఎవరు తెలుఁగులో మాట్లాడితే వాడి చేతిలోకి వెళుతుందన్నమట.. అడిగో మావాడు.. ఓయ్ బేబీ యువ్వు కమ్ము హియరు.. ఓయ్ యువ్వోల్నీ అయామ్ టెల్లింగ్ నో...”

* * *

అవును ఈవిడ తప్పుచేసింది.
కార్తీక సోమవారం పౌర్ణమి వచ్చి మహాపవిత్రతను తెచ్చిపెట్టినట్టు.
ఈమె మెడలో పలకలను తగిలించి, దానికి కారణంగా తెలుఁగు మాట్లాడడం చూపించడం మహాపాపత్వం తెచ్చిపెట్టింది. అందునా ఉదయానే కలుషిత ప్రపంచంయొక్క మలిన వాసనలను పీల్చడానికి ఎంతో ఆత్రుతగా పత్రికలు తెఱిచే ప్రజలకై, ఆ మలినాన్ని సేకరించి సంపాదకీయమొనర్చి వారికందించి పొట్టగడుపుకునే ధన్యజీవుల కంట పడడము ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ఇంతకంటే పెద్ద తప్పు ఈమె సంత జోసపు పాఠశాలలో పనిచేయడం. దాని బదులు ఎమ్మెల్లే పెద్దయ్య రెడ్డినాయుడు గారి బావమఱిది నడిపే మై టెక్నో టాలెంట్ శ్రీ సిల్వర్ జూనియర్ ఛాంపియన్ యనర్జీ స్కూల్ లో పనిచేయకపోవడం ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ముప్పై వార్తా స్రవంతులను ఆదరించి వాటి రొచ్చు నెత్తిన గుప్పించుకునే రాష్ట్రంలో ఇంకా వీరిని కంపించేంతట పని చేసావంటే నువ్వు సామాన్యురాలివికావు.

* * *

ఈ ప్రలోభ జాతికి తమ తప్పును ఇంత అమాయకంగా చూపించేయడం ఈమె చేసిన తప్పు!

ఇంటర్ మీడీయెట్ హాస్టళ్ళలో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు, వీరి వీర్యం నిద్రపోయింది. అప్పుడు రెడ్డినాయుని డబ్బుకీ వాని బావ మబ్యపెట్టుడికీ లొంగిన పత్రికలవాడు నిద్రపోయాడు.
అంతేనా..
ఏఁవీ ఎఱఁగనట్టు మళ్ళీ అదే జూనియర్ ఐఐటి అకాడమీ విత్ యంసెట్ అండ్ ఎఐఇఇఇ కోచింగు అకాడమీలకు తమ పిల్లపశువులను తోలారు పురజనులు.

అయ్యో మొన్నే అదే హాస్టలులో ఒక అబ్బాయి అద్దంలోనుండి దూకి చచ్చిపోయాడుగా..
“అబ్బే మా అబ్బాయి బ్రతికేవున్నాడండీ.’
ఇంటిలో దొరకని అవాజ్యప్రేమకై కుఱ్ఱాళ్ళు అమ్మాయిల వెంట పడి వేదిస్తున్నారు కదండి. కాస్త వారి సక్సెస్ పేరిట వారిపై పెట్టే వత్తిడి తగ్గించవచ్చుకదండీ.
“అబ్బే మా అబ్బాయి మేము చెప్పిన సంబంధమే చేసుకున్నాడండీ, మా కాలనీలో ఎవరమ్మాయినో ఎవడో బాగా వేధించాడు కానీ, మాకు అమ్మాయిలు లేరులెండి బ్రతికిపోయాము”
ఆ రెసిడెంషియల్ పాఠశాలలో చదివిన మావాళ్ళు చాలామంది ఇప్పటికీ తీవ్ర మానసిక వత్తిళ్ళకూ ఇబ్బందులకూ లోనౌతున్నారండి. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు అబ్బట్లేదండీ.
“అబ్బే అక్కడే చదివిన మా అన్నయ్యగారి తోడల్లుడిగారబ్బాయి ఇప్పుడు అమెరికాలో సిస్కో కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడే.
అయినా అలాంటి వాటికి బయపడి , అబ్బాయిని బంగారు గుడ్లు పెట్టే కోడిగా మార్చడాన్ని మానుకుంటామా యేంటి. “
అంటే మీరు బంగారం కోసం కోడినే చంపుతున్నట్టుంటేను.
“వీడెక్కడ దొరికాడండీ, నాయనా నువ్వు ఈడి మాటలు వినకు, వీడు పూర్తిగా చదివేసుకుని ఇలా మట్లాడుతున్నాడు”

* * *

దేఁవుఁడు తమకు ఏటియమ్ముల బదులు రక్తమాంసాల ముద్దను ఇచ్చాడేయని బాధపడిన వీరు, వెంటనే అతని తప్పు సరిదిద్దడానికి ఏర్పరచుకున్న ప్రతిదేఁవుఁడే ఈ విద్యావ్యవస్థ. పిల్లలు లోపలికెళ్ళి బయటకు వచ్చేది కీలు గుఱ్ఱాలు. కనీసం సదుపాయాలు అందించలేని ఈ వాణిజ్య ప్రభువులు , తమ బావమరుదుల స్కూళ్ళ కోసం ప్రజల బళ్ళను గొడ్ల సావిళ్ళ కంటే హీనంగా తయారు చేశారే. ప్రభువుల అండతో యంత్రం పరుగులు తీసిందే.

మనిషన్నవాడెవడూ తమ తమ బిడ్డలను ఇంత ఘోరంగా శిక్షించుకోలేడు. అవునవును. కాబట్టే బడి వుంది.
అక్కడో మూర్ఖుడు విద్యాశిఖామణి, వాడి దృష్టిలో ఉదయం నుండి రాత్రి వఱకూ పిల్లల్ని రుద్దనిదే, వాడి టెల్గులో మాట్లాడితే శిక్షించనిదే వాడికి నిద్రపట్టదు. ఆత్మవంచనకు భయపడి స్వయానా తమ తమ పిల్లల్ని ఇలా దండించుకోలేక, ఆ పనిని ఎంతో డబ్బు కట్టబట్టి, ఆత్మ లేని ఒకడికి అప్పగిస్తారు వీరు.
“ఉరేయ్ మావాడు ఇంటికాడుంటే అస్సలు మాట వింటలేదురా, వీణ్ణి హాస్టలులో వేసేయాలి.”

* * *

తల్లీ మేరీ మాతా,
వీరి గుండెల్లోని విషాన్ని వీరికే ఇలా తొందరపాటులో ఎత్తిచూపడం ఎంత వెఱ్ఱిదనం.

వీరి భాషలో వాలుకి పెయింటు వేస్తారు.
వీరి భాషలో పేడెత్తి ఒళ్లో పెట్టుకుంటారు.
వన్నూ టూఊ త్రీయీ వీరి అంకెలు.
టూ డేస్ కోసారి షాప్ కెళతారు.
వీళ్ళ బేబీస్ థరడు మంతులో ఆడతారు,
ఎయిత్తు మంతులో పాకుతారు,
వన్నియఱ్లో నడుస్తారు.

వీరు గుడ్డుని అప్రిషియోట్ చేస్తారు.
వీరు అప్పుడప్పుడూ వెరయిటీగా చూస్తారు, ప్రవర్తిస్తూంటారు.

వీరు ఒకే దెబ్బతో అటు ఆంగ్లమధర్కి ఇటు తెలుఁగమ్మతల్లికీ నెత్తురు కక్కిస్తారు.

* * *
అయినా నువ్వు చేసిన తప్పు ఏఁవిటి నాకు ఇంకా అర్థం కాలేదు.

I NEVER SPEAK IN TELUGU. అని వారి చేత వ్రాయించి మెళ్ళకు కట్టావు. వీరికి దొరల భాష ఆంగ్లము సరిగా రాదు క్షమించమ్మా. వీరి భాషలో simple present tense అనేది ఎక్కడో నలిగి చచ్చిపోయింది.

దీని అర్థము. నాకు తెలుఁగులో మాట్లాడే అలవాటు లేదు. లేదా నేను తెలుగు గతమున, వార్తమానాన, భవిష్యత్తున మాట్లాడలేదు, మాట్లాడబోను. అని వారికి తెలియదు.

The Sun never rises in the west అని వీరికి చెప్పినా దాని అర్థము, “సూర్యుడు ఇంకెప్పుడూ పశ్చిమాన ఉదయించడు” అని కాదని వీరికి తెలియదు పాపం.

* * *
వీరు like this only. వీరు different different varieties ని try చేస్తూంటారు.

అయినా మేరీ మాతా నువ్వేమీ భయపడకమ్మా నీ భవిష్యత్తుకీ ఏఁ ఢోకా లేదు. ఇప్పుడు కూడా ఎవరో నలుగురు వారి బ్లాగుల్లో నీ మీద దుమ్మెత్తి పోసి, హిట్లు లెక్కేసుకోవడం తప్ప ప్రజానీకం చేసేదేంలేదు.
ఫలానా సంత జోసపు బడిలో తెలుఁగులో స్పీక్ చేసినందుకు ఇంత కఠినంగా శిక్షిస్తారని తెలిసిన ప్రజలు తండోపతండాలుగా మీ బడికి తమ పిల్లల్ని తోలకపోతే వట్టు. నా మాట విని నువ్వే సొంతగా ఒక బడి పెడితే ఎంతో ఆదరణ లభిస్తుంది. ఆత్మలేని అసురులు రాజ్యమేలే కాలాన నీవే తల్లి మహారాణివి. పూర్వం నీ పేరు పెట్టుకొన్నయోకావిడ ఎంతో దయఁజూపించిందఁట. ఇక నీ శ్రమ తప్పిందిగా!

అయినా నేను దేని గుఱించి మాట్లాడుతున్నాను. వార్తా స్రవంతుల వరద రొచ్చులో కొట్టుకుపోయిన వీరి బుఱ్ఱలకి ఇంకా నువ్వెవరో గుర్తుంటేనేగా...

Tuesday, November 03, 2009

Non-duality

A few tunes down the waltz
she will be him.
A few miles down the stream
flow will be calm.

A few degrees up the scale
ice will be water,
A few more up the same
liquid will be air.

Like rivers in the ocean
Like songs in the heart
The same joy manifests in
forms various transient

And...
A few tides down the time
land will be sea.
A few lives down the soul
you will be me.