భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, September 06, 2009

మూడంచెల్లో లయగ్రాహి

క్రిత టపాలో లయగ్రాహి పద్య ఛందస్సు పరిచయం చేయడం జరిగింది. అందులో చెప్పినట్లు భ గణాలు తేలికదొరుకుతాయిగాని, భల అనేది కొద్దిగా కష్టమే. ఒక సారి పొద్దు కవిసమ్మెళనానికి ఒకరిద్దఱు సర్వ భగణ కందాలు కూడా వ్రాసారు (అలాంటి వారికి మానిని, వనమయూరి వంటివి బాగా పనికివస్తాయి). భగణాన్ని భల చేయడం అంత కష్టం కాదేమో, విభక్తులను సరిగా వాడుకుంటే చాలు. కి, కు, ని, ల, గ వంటివి చేరిస్తే సరిపోతుంది. ఉదా - పద్యము, పద్యముల.

సమస్య కాస్త రసవత్తరంగా వుండాలంటే, గట్టిదైన ప్రాసాక్షరం ఎంచుకోవడం బాగుంటుంది. మనము జ్ఞ ఎంచుకుందాం. ఇకిప్పుడు మీఱు చేయాల్సిందల్లా..

౧) ఒక excel sheet తీసుకొని అందులో గళ్ళు గీసుకోండి, ప్రాసాక్షరంగా ఎంచుకున్న 'జ్ఞ'ని ప్రాస పడవలసిన చోటట్లా నింపేయండి. ఆ ప్రాసపడవలసిన డబ్బాల రంగు కూడా మార్చు కోవచ్చు (ఇక్కడ లేతనీలం). ఆపై గురువు పడాల్సిన చోట్లల్లా డబ్బా రంగు మార్చండి. (ఇక్కడ పసుపు).౨) తరువాత బ్రౌణ్యం తెఱచి జ్ఞ కోసం వెదకగా వచ్చిన వాడదగ్గ పదాలన్నీ క్రింద చిట్టాగా వ్రాసుకోండి. జ్ఞా జ్ఞే అని దీర్ఘం వున్న జ్ఞలు పనికిరావుసుమా, కాబట్టి జ్ఞానం, జిజ్ఞాస వంటివి వదిలివేయండి. ప్రజ్ఞ, ఆజ్ఞ, అనుజ్ఞ, అవజ్ఞ, అజ్ఞ, రసజ్ఞ, మొదలైనవి.

౩) ఇంకా నానాయాతనా పడి పెట్టెని నింపండిలా..


లయగ్రాహి
"ప్రజ్ఞునకు వచ్చును, రసజ్ఞమగు పద్యమది - ఆజ్ఞ పలుకంగనె! మఱజ్ఞునకు రాదే
యజ్ఞములచే"ననుట, అజ్ఞతగుఁ! బ్రహ్మభవ - రాజ్ఞియగు భారతికి విజ్ఞపము చేయన్
ప్రజ్ఞుడవు నీవయి, మనోజ్ఞమగు పద్యమన-నుజ్ఞముగ వచ్చును! కృతజ్ఞతతొ విద్యా
రాజ్ఞికి సుపద్యఁపు ప్రతిజ్ఞఁగొని సాధనను యజ్ఞమును బూని కవితజ్ఞుడవు గావోయ్.

(విన్నపమునకు తత్భవము విజ్ఞపము వాడడం జరిగింది, ఆజ్ఞ = అనుజ్ఞ x అననుజ్ఞ).

కూల్ కదా.

Saturday, September 05, 2009

లల్లలల లల్లలల లయగ్రాహి

భ జ స న భ జ స న భ య ఛందస్సు గల వృత్తము/ఉద్ధురమాల లయగ్రాహి. భజసనభజసనభయ అంటే తెలియటలేదు గానీ, దీని ఛందస్సు చాలా తేలిక. UIII అని ఏడు సార్లు వచ్చి, చివఱిగా UU అని వస్తుంది. అంటే..

గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :-
లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా

ఒక గురువు నాలుగు లఘువులు వస్తూండాలి. ఇక ఇందులో యతి వుండదు. ప్రాసయతి మాత్రం వుంటుంది - పై క్రమములో i వున్న చోట, అంటే పాదానికి నాలుగు సార్లు ! సీసంలోలా కాకుండా ఇందులో ఆ నాలుగు సార్లూ ఒకే ప్రాస రావాలి. నాలుగు పాదాల్లోనూ ఒకే ప్రాస వుండాలి! కాబట్టి మీరు ప్రాసగా ఎంచుకున్న పదబంధానికి మీ దగ్గర కనీసం పదహారు ఉచిత ప్రయోగాలు వుండకపోతే, పద్యము వ్రాసే పనిని ఆ వాగమశాసనుడికి వదిలివేసుకోవాలి.


మహాభారతం ఆది పర్వములో నన్నయ్యభట్టు వసంత వర్ణనకి లయగ్రాహి వృత్తాని దివ్యంగా వాడారు అని నేనడం, సీమకోతి హనుమంతునికి సిపారసు ఇవ్వడంలాగుంటుంది. క్రిత వారం గరికిపాటి నరసింహారావుగారు, భక్తి దూరదర్శన స్రవంతిలో వసంత వర్ణనకి సంబంధించిన ఈ రెండు లయగ్రాహి పద్యాలను చాలా చక్కగా వినిపించి, అంత కన్నా చక్కగా వివరించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, "నన్నయ్య వ్రాసిన ఈ పద్యాలు వినడానికి, వాటిని నేను మీకు వివరించడానికి మీరెంతో అదృష్టవంతులు". మీరెలాగూ వినలేకపోయారు, కనీసం చదువుకొని ఆనందించండి.

లయగ్రాహి

గణములు:- భజసన భజసన భయ
గణములు:- UiII UIII UiII UIII UiII UIII UiII UU
నడక :- లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లాలలల లల్లా
సోపానరేఖాచిత్రం :-

లయగ్రాహి.
కమ్మని లతాంతములకు మ్మొనసి వచ్చు మధు-పమ్ముల సుగీత నినదమ్ములెసఁగెం జూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధిముకు-ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా

లమ్మలగు కోకిల కులమ్ముల రవమ్ము మధు-రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములను జంపకచ-యమ్ములును గింశుకవనమ్ములును నొప్పెన్


లయగ్రాహి
చందనతమాలతరులందు నగరుద్రుమము-లందుఁ గదళీవనములందు లవలీమా
కందతరుషండములయందు ననిమీలదర-విందసరసీవనములందు వనరాజీ

కందళితపుష్ప మకరంద రసముం దగులు-చుం దనువు సౌరభమునొంది జనచిత్తా
నందముగఁ బ్రోషితులడెందములలందురఁగ - మందమలయానిల మమంద గతి వీచెన్

తెలుఁగులో మీకు భ గణాలు చాలా చాలా తేలిక గా దొరుకుతాయి, కాబట్టి సీసపద్యాలు ఇతర గీత పద్యాలు చాలా తేలికగా వ్రాయవచ్చుఁ గానీ "భల" పదేపదే రావడం మాత్రం కష్టమే. పైపెచ్చు పదహారు సార్లు వాడవలసిన అదే ప్రాసాక్షరం.

త.క. ఈ పద్యాలను మా పెద్దమ్మ దగ్గరవున్న ఆదిపర్వం పుస్తకంలోనుండి ఎక్కించాను. ఆమె ౭౦లలో కొన్నప్పుడు దాని విలువ నాలుగు రూపాయిలు. నిన్న రాజమండ్రిలో వెదికితే, మా రాజమండ్రివాడు అని చెప్పుకునే నన్నయ్య గారి మహాభారతం లభించలేదు!!!

ఇంకా త.క...
పై టపా వ్రాసిన పిదపఁ అచ్చువేసేమునుపు నేను బెజ౨వాడ వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా నన్నయ్య గారి ఆదిపర్వం దొరకలేదు. ఇక విశాలాంధ్ర, ఎమెస్కో, నవోదయ, ప్రజాశక్తి , వీజియస్ వంటి వాటిలో నన్నయ్యగారి ఆదిపర్వం, లేదా కవిత్రయం భారతం దొరకక పోవడం దురదృష్టకరం. వారు నన్ను తెలుగు అకాడమీనో తెలుగు విశ్వవిద్యాలయాన్నో ఆశ్రయించమన్నారు.

ఎవరో అమెరికన్ అమ్మాయి సలహా మేరకు ఎమెస్కోలో కళాపూర్ణోదయం కొన్నాను. నేను చదివాను రాకేశ్వరా నువ్వు చదవలేదా తెలుఁగువాఁడివై యుండి అని అడిగేసరికి, అన్నగారి మాటలువిన్నవాడిలా ఆత్మగౌరవం తన్నుకొచ్చి పుస్తకం కొన్నాను. అసలైతే వాటిని రెండు భాగాలుగా ప్రచురించారు, ఎందుకో ఆ దేఁవుఁడికే తెలియాలి, ఒక్కొక్కటీ యాభై రూపాయలు. త్వరలో దాన్ని వంద చేసేస్తున్నాం మీరు అదృష్టవంతులు ఇదే ఆఖరి కాపీ అన్నారు ఎమెస్కో వారు. చూడబోతే అది ప్రక్కనే సభ్యులకు పది శాతం తగ్గింపు ఇచ్చే విశాలాంధ్రలో వుంది, తగ్గింపు ఇవ్వని ప్రజాశక్తి వారి దగ్గర కూడా వుంది.

ఇంతకీ పుస్తకం తిరగేస్తే ఒక్క ముక్క అర్థం కాలేదు. "చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము ..." అని ఎత్తుకున్నాడు పింగళి సూరన్న. ఇలాంటి పద్యాలు చదివి అర్థంచేసుకున్న ఆ తెల్లపిల్లమీద ఒక్క తడవ గౌరవం పదింతలయ్యింది. ఆ విషయం ప్రక్కన పెడితే పై పద్య నడక ఈ మధ్యనే ఎక్కడో విన్నట్టుందే అనిపించింది. లాలలల లాలలల లాలలల లాలలల .. లలలలల లాలలల లలలలల లాలలల హమ్మ్.


లయవిభాతి


చలువ గల నెన్నెలల చెలువునకు సౌరభము
- గలిగినను సౌరభముఁ జలువయుఁ దలిర్పం

బొలు పెసఁగు కప్పురపుఁ బలుకులకుఁ గోమలత
- నెలకొనిన సౌరభముఁ జలువ పసయుం గో

మలతయును గల్గి జగముల మిగులఁ బెంపెసఁగు
- మలయ పవనంపుఁ గొదమలకు మధురత్వం

బలవడిన నీడు మఱి కల దనఁగ వచ్చుఁ గడు
- వెలయఁ గల యూ సుకవి పులుకులకు నెంచన్


ఛందస్సు :- నసన నసన నసన నసగ
గణములు:- IiIII UIII IiIII UIII IiIII UIII IiIII UU
నడక :-
లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లాలలల లలలలల లల్లా


హోము వర్కు
రేపటి తరగతికల్లా అందరూ తలా ఒక లయగ్రాహి వ్రాసుకురండి. రేపటి తరగతిలో ఆధునిక పరికరాలతో లయగ్రాహిని తేలికగా ఎలా వ్రాయాలో చూద్దాం.

అడియోసమీగోసు.

లంకెలు - కావ్యాలంకారచూడామణి

తరువాయి - మూడంచెల్లో లయగ్రాహి