భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, July 17, 2007

వృత్తాలు నేర్వడానికి సోపానరేఖాచిత్రాలు

చిన్నప్పుడు మొదటిసారిగా వృత్తాల ఛందస్సు తెలుసుకున్నప్పుడు నాకనిపించిందేంటంటే,
"ఇన్ని నిబంధనలతో, ఎవరైనా పద్యం వ్రాయగలరా, అదీ వారూహించిన భావం పోకుండా?"
కాని నాకున్న సందేహాలన్నీ, పోతనగారి ఈ పద్యం చదివాక పోయాయి.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
చిన్నప్పుడు మా తెలుగు పంతులుగారు దీనిని మా క్లాసులో వివరించారు. అప్పట్నించి నా బుర్ర వెనకాలెక్కడో దీని భావం అలా మిగిలిపోయింది. మా తెలుగు మస్టారుకి తెలుగు అంటే చాలా అభిమానం దానిని నాలాంటి అమెరికా పిచ్చున్న వాడికి కూడా బాగా అందించారు. పిచ్చి తీరింది కాబట్టి దానికిందున్నది పైకి తేలుతుంది. అందాన్ని చూడడానికి మనోనేత్రం దుర్గమ్మ ఇచ్చినందుకు, అదృష్టం నాది.

ఏదేమైనా తెలుగు వృత్తాలు వ్రాయడం నాలాంటి వాళ్ళకు ఈ జన్మకు అసాధ్యమైనా, వాటిని చదివి ఆనందించే భాగ్యమైనా ఉండాలికదా? వచ్చే జన్మకి తెలుగు మాట్లాడే యోగ్యం కూడా ఉండదేమో :).
వృత్తాలను తేలికగా గుర్తుపెట్టకోవాలన్నా, వాటిని పాడుకోవాలన్నా వాటి లయ రావడం ముఖ్యం. అందుకనే వాటి లయ నేర్చడానికో విన్నూత్నమైన పద్ధతి వాడుతున్నాను, అది మీతో పంచుకోవడానికి ఈ టపా. లయలన్నీ శంకా రామకృష్ణగారివి.

బొమ్మలు
ఈ క్రింద ఉన్న సోపానరేఖాచిత్రాలలో(పదం నేర్పింది రానారె, తెలుగుపదం గుంపులో), ఆకు పచ్చ రంగులో పెద్దగా కనిపించే గళ్ళు గురువులు, వాటికి అరవైశాల్యమున్న చిలకపచ్చ గళ్ళు లఘువులు. ఎడమవైపు నుండి కుడి వైపుకు, క్రింది నుండి పైకి చదువుకుపోవాలి, ఉదాహరణకు, ఉత్పలమాల మొదటి గణం భ, కాబట్టి ఒక పెద్దడబ్బా దాని పైన రెండు చిన్నడబ్బాలు కనిపిస్తాయి, కాబట్టి వాటిని UII గా చదువుకోవాలి. ఇక లయ రావడానికి, 'తా','న' లను గురు లఘువులుగా వాడడమైనది. బొమ్మలో 'య' ఉన్న చోటు యతి స్థానం. ఎఱుపు రంగులో ఉన్న పాదాలకు ఇక్కడిచ్చిన నడక బాగా కుదురుతుంది. ఒక ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది అంతా. యతి ముందు చిన్న విరామం ఇవ్వడం మరువవద్దు.

ఉత్పలమాల
గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
యతి: ౧౦
నడక ౧ : తానన తాన తాన తన తానన తానన తాన తాన తా
నడక ౨ : ధీంతన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
ఉదా ౨:
భండన భీముడార్త జన భాంధవుడుజ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ మూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడ గట్టి భేరికా
డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ !!
సోది: ఉత్పలమాల, చంపకమాల జంట వృత్తాలు. ఎందుకో మీకు బొమ్మలు పోల్చిచూస్తే అర్థమవుతుంది. అలానే శార్దూలము, మత్తేభమునూ.

చంపకమాల
గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
యతి: ౧౧
నడక ౧ : న నన తాన తాన తన తానన తానన తాన తాన నా
నడక ౨ : ధిరనన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
ఉదా ౨:
అటజని గాంచె భూమి సురు డంబర చుంబి సురస్సర జ్ఝరీ
పటల ముహుర్ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
సోది: నాలుగో పాదం గుర్తుకులేదు, ఎప్పుడో ఎనిమిదో తరగతిలో విన్నా, పద్యం అర్థం కూడా తెలియదు, ఎవరో రాజు ఎవో జలపాతలను చూస్తున్నాడని తప్ప. కాని పద్యం వింటుంటే జలపాతాంలా అనిపించి ఈ పద్యం 'బాగా' గుర్తుంది.

శార్దూలం
గణాలు: మ, స, జ, స, త, త, గ
యతి: ౧౩
నడక ౧ : తానా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : ద్ధిత్తోం తక తోంన తోంన ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్
ఉదా ౨:
అంతా మిథ్య తలంచి చూచిన, నరుండట్లౌ టెరింగిన్, సదా
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా !
సోది: రెండవదానిని ఎక్కడనుండో అతికించినా, ఇది నా ఎనిమిదో తరగతి నుండి గుర్తున్న ఒకే ఒక పూర్తి పద్యం. సరళ మైన తెలుగులో ఉండే వృత్తమిది.

మత్తేభం
గణాలు: స, భ, ర, న, మ, య, వ
యతి: ౧౪
నడక ౧ : ననా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : కధిత్తోం తక తోంన తోంన ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్నః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై

ఉదా ౨:
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.
గురువులు:
బి.ఎ. రాంమోహనరావు (తెలుగు పంతులు, పేరులేని పాఠశాల), శంకా రామకృష్ణ (వ్యాసం ౧, వ్యాసం ౨), కొత్తపాళీ, తెవికీ, ఈమాట
లఘువు: రానారె :)

తప్పులుంటే, ఎప్పటిలానే, మన్నించి తెలుపుగలరు.

Monday, July 16, 2007

తప్పక చదవవలసిన సాహిత్యం

నేను తెలుగు సాహిత్యం గుంపులో "'ఈ పుస్తకం అందరూ చదవాలి' అనుకునే మంచి పుస్తకాలు" సూచించమని అడిగితే మంచి చూచనలు చాలా వచ్చాయి. వాటన్నిటి సంగ్రహం ఇక్కడ ఒక టపా గా వేద్దామని అనుకున్నా.
అలాగే మన తెలుగు గుంపుల్లో అన్ని తీగల్లాగా ఇదికూడా కొద్దిగా పక్కదారి పట్టి, కొంత సేపటికి కథలు మాత్రమే సూచిచంచడం మొదలు పెట్టారు. కాబట్టి మీకు ఎఁవైనా మహా సాహిత్యం ఉండవలసినది ఈ క్రింది జాబితా లో లేదు అని అనిపిస్తే, వెంటనే ఆ గుంపులో చేరి మీరు కూడా చూచించగలరు, లేక పోతే ఈ టపాలో వ్యాఖ్యానించండి.
ఇంకా, జాబితా గురించి, గుంపులోని తీగలోనుండి పుస్తకాల పేర్లు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఇంకా వివరాలు చర్చలు, పరస్పర డబ్బాల:) కోసం అక్కడ చూడండి.

కొత్త పాళీ

"విజయవిలాసము" - చేమకూర వెంకటకవి (తాపీ ధర్మారావు వ్యాఖ్యతో)
"ఆముక్త మాల్యద" - శ్రీకృష్ణదేవరాయలు (వావిళ్ళ వారి వ్యాఖ్యతో)

కొడవగంటి కుటుంబరావు సాహిత్యం - 6 సంపుటలు
శ్రీపాద సుబ్రహ్మన్య శస్త్రి కథలు - 3 సంపుటలు
"సాక్షి వ్యాసాలు" పానుగంతి లక్ష్మి నరసింహం
కృష్ణ శాస్త్రి కవితలు
"అమృతం కురిసిన రాత్రి" - తిలక్
"మహా ప్రస్థానం, ఖడ్గసృష్టి" - శ్రీశ్రీ

katha annuals
"దృశ్యాదృశ్యం" చంద్రలత
"హిమజ్వాల, అనుక్షణికం" వద్దెర చందిదాస్

సౌమ్య
"సలాం హైదరాబాద్" – లోకేశ్వర్ (తెలంగాణ మాండలికం)

చరసాల
"పచ్చనాకు సాక్షిగా", "సినబ్బ కథలు", "మునికన్నడి సేద్యం", "పాల పొదుగు" ఒకే సంపుటంగా "మిట్టూరోడి కథలు" - నామిని సుబ్రమణ్యం నాయుడు (రానారె శైలి)

వెంకట రమణ
"ప్రళయ కావేరి కథలు" - సా.వెం.రమేశ్ (రానారె శైలి)

త్రివిక్రం
"పెన్నేటి కథలు" పి. రామకృష్ణారెడ్డి (కలం పేరు తులసీకృష్ణ)
కొన్ని రాయలసీమ కథల సంకలనాలు/సంపుటులు:
*సీమకథలు (VPH)
*రాయలసీమ కక్షల కథలు (పెన్నేటి ప్రచురణలు, కడప)
*పెన్నేటి కతలు (పెన్నేటి ప్రచురణలు)
*కడప కథ (నందలూరు కథానిలయం)
*చక్రవేణు కథలు (విరసం?)
*మొలకల పున్నమి (వేంపల్లి గంగాధర్, ఉషస్సు ప్రచురణలు)
ఆరవీటి శ్రీనివాసులు కథలు (VPH?)
పెన్నేటి మలుపులు (శాంతి నారాయణ)
సడ్లపల్లి చిదంబర రెడ్డి కథలు
నాలుగ్గాళ్ల మండపం
నామిని కథలు
కర్నూలు కథ
*చుక్కపొడిచింది (పాలగిరి విశ్వప్రసాద్, నేత్రం ప్రచురణలు, కడప)*
*కేతు కథలు (మూడు భాగాలు)*
*సొదుం జయరాం కథలు (విజేత కాంపిటీషన్స్, జనరల్ బుక్స్ సీరీస్)*
*మధురాంతకం కథలు (VPH)*
*సింగమనేని కథలు *
*రాతిఫూలు (నేత్రం ప్రచురణలు)*

రానారె
ముళ్లపూడివెంకటరమణ సాహితీ సర్వస్వం. (ప్రత్యేకించి "సినీరమణీయం")

నేను సైతం
"నూతిలో గొంతుకలు" ఆలూరి బైరాగి

పద్మ ఇంద్రగంటి
"మిట్టూరోడి కతలూ" - నామిని సుబ్రహ్మణ్యం నాయుడి (రాయలసీమ మాండలికం)
"ఇస్కూలు పిల్ల కాయల కథలు"
"దర్గామిట్ట కథలు" - మహమ్మద్ ఖదీర్ బాబు
"ఇల్లేరమ్మ కథలూ" -సోమరజు సుశీల
మధురాంతకం రాజారాం కథలు (రాయలసీమ మాండలికం)
శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తిరుమల రామచంద్ర, టంగుటూరి ప్రకాశం ల ఆత్మ కథలు.
(ఆధునిక సాహిత్యం కొనుక్కోవడానికి సూచనలు కావాలంటే, కొన్నాళ్ల క్రితం వెల్చేరు నారాయణ రావుగారు మరి కొందరు తయారు చేసిన "ఈ శతాబ్దపు రచనా శతం" చూడండి)

క.వ.గిరిధర రావు
ఖదీర్ బాబు గారి కథలు - దర్గామిట్ట కతలు, పోలేరమ్మబండ కతలు.
శంకరమంచి సత్యం గారి 'అమరావతి కథలు'.

నవీన్ గార్ల
"పోలేరమ్మబండ కథలు"- మహమ్మద్ ఖదీర్ బాబు
"మా పసలపూడి కథలు" - వంశీ

రాధికా రిమ్మలపూడి
"అత్తగారి కథలు" - భానుమతీ రామకృష్ణ


తప్పులుంటే మన్నించి, నాకు తెలుపగలరు.

Tuesday, July 10, 2007

మరుగుదొడ్ల వ్యవహారం

అన్నంత పనీ చెసే బాలకృష్ణ అభిమానిని కాబట్టి క్రిత బ్లాగులో ఇచ్చిన మాట ప్రకారం ఈ శీర్షికతో ఈ టపా. కాని పెట్టాలిగా అని పెట్టలేదు. శీర్షికకు టపా న్యాయం చేస్తుందంటే నమ్మండి. శీర్షికకు ఉన్న అన్ని అర్థాలుకూ టపా న్యాయం చేస్తుంది.

అర్థము ౧
మరుగుదొడ్లను మూత్ర'ఆలయాల'ని ఊరికే అనలేదు. అవి శుభ్రానికి ఎంతో అవసరం, పైగా శుభ్రం భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రం, కాబట్టి అలా అన్నారు. క్రిత టపాలో విసర్జన కొంత ఎక్కవయ్యింది కాబట్టి ముందుగా దానిని శుభ్రం చేద్దాం. ఉదాహరణకు హ999 అన్నారు కొందరైతే! దూషించడానికికూడా హద్దులు ఉండాలికదా, నాకు దాని అర్థం తెలియదుకాని, దానికి చాలా లోతైన అశ్లీలమైన అర్థం ఉంటుందని నా పేగుల భావన (gut feeling)! బ్లాగ్కుటుంబం మనది, తెలుగు తల్లి మనది. అది ఎంత క్లీషే అనిపించినా, మన శుభ్రానికి ఆ సెంటిమెంట్ ఎంతో అవసరం. అంటే తోటి బ్లాగరబ్లాగరీమణులు మనకు అయ్యల్లాగా, అమ్మల్లాగా, అన్నల్లాగ, మరదళ్ళాగా దాపురించాలే తప్ప, వారిని దూషించడం, వారి పరస్పర దూషణలను దూషించడం, చాలా దూషార్హితం. కాని నా దూషణా సిధ్ధాంతాలను ఉల్లంఘించలేను కాబట్టి వారిని దూషించలేను. అలాగే, ఎవరు ఎలాంటి వ్యాఖ్యానం చేసినా వారి వాక్స్వాతంత్రాన్ని గౌరవించి వాటిని తొలగించను, కాని ఆ ఘోరానికి కూడా ఒడిగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేనండి మా కుటుంబం, నేను ఒకసారి పక్కకు తిరిగితే, అందరూ కొట్టుకోవడం మొదలు పడతారు.
ఇంకో సవరణ: నేను నా బ్లాగులో ప్రస్తావించిన బ్లాగులన్నీ చాలా మంచివి. నేను హాస్యం కొరకే ఆ టపా వ్రాసాను. నాలాంటోళ్ళు ఎదో సందర్శకులను లెక్కేసుకుంటారు గానీ, నిజమైన బ్లాగర్లకు అది అసలు లెక్కుండదు. నాకు క్రితం టపా ఒ నాలుగొందల మంది దర్శించారన్న సంతోషంకన్నా ఒ నాలుగురు దూషించుకున్నారనే బాధే ఎక్కువ. (ఎదో పాత తెలుగు సినిమాలో వెన్నలాంటి మనసున్న కథానాయకుడి మాటలా లేదు?)

అర్థము ౨
నేను మొన్ననే అమెరికా నుండి వచ్చా. (ఎదో కొత్త తెలుగు సినిమాలో పొగరబోతు కథానాయిక మాటలా లేదు ?).
నాకున్న వ్యాపార దృక్పదం నాకు భారతదేశంలో ఎన్నో వ్యాపారావకాశాలు చూపించనది. అందులో ముఖ్యమైనది, మన రోడ్లు అమెరికాలోని రోడ్లతో పోల్చుకుంటే చాలా బాగుంటాయి కానీ, మన ఫ్లష్లు మాత్రం అక్కడి ఫ్లష్లకు ఎంతో వెనకబడి ఉన్నాయి. దానికి కారణం అక్కడ మలకలాచీల ముఖ్య గొట్టానికి ఒక తొండంలాంటి ఆకారం ఉండడం వల్ల suction బాగా కుదురుతుంది. కావాలంటే అమెరికాలో ఉంటున్న మన బ్లాగు మిత్రులను అడగండి, వారికి భాష నాకన్నా బాగా వచ్చు కాబట్టి ఇంకా మంచిగా వివరించగలరు.
ఇంతకీ విషయం ఎంటంటే, మనలో ఒకరు, అలా తొండం ఆకృతితో ఉన్న గొట్టాలని ఉపయొగించి, పింగాణీ మలకలాచి(toilet bowl)లను తయారు చేసి, వాటికి తొండందేవర పేరు పెట్టి (మన ఇన్సిపిరేషన్ ని ఎప్పుడు మరచిపోకూడదు), అమెరికా నుండి ఇప్పుడే దిగిన ఉపాయమని మార్కెట్ చేస్తే డబ్బే డబ్బు. మీరు నాకు రాయల్టీ పెద్దగా ఇవ్వక్కర్లేదు. కలాచికి పది పైసలిస్తే చాలు. మీకు సినిమా హీరో కష్టాలు ఉంటే అది కూడా మినహాయిస్తా.

అర్థము ౩
నేను ఉద్యోగం వెతుక్కోవాలి. హైదరాబాదు దుమ్ము పొగా చూసేసరికి, ఇంకా ప్రేరేపితమయ్యా. కాబట్టి నేను టపాలు వెయ్యడం బాగా తగ్గిచ్చేస్తున్నాను. ఇప్పటికే ఇంట్లోవాళ్ళు, నేను 'టాయిలెట్'కి 'మరుగుదొడ్డి' ఇంకా 'టైం'కి 'సమయం' అనేసరికి నన్ను వీలైతే మానసికవైద్యుల దగ్గరికి, కుదరకపోతే, భూతవైద్యుల దగ్గరకి తీసుకెళ్తామంటున్నారు. నాకు ఉద్యోగం లేకపోవడానికి అదే కారణమని భావిస్తున్నారు !

అర్థము ౪
నేను మొన్న రామోజి సినిమా నగరానికి వెళ్ళా. అక్కడ లోనికెళ్ళే ముందు ద్వారపాలకుణ్ణి అడిగా, "ఎవండి, లోపల మరుగుదొడ్లు ఉంటాయా" అని. అసలే నేను ఆరు జేబుల పాంటు, టెన్నిసు షూలు దరించి ఉన్నా, కాబట్టి అతనికి నేనేమడిగానో అర్థం కాలేదు. మళ్ళీ అడిగా మళ్ళీ అర్థంకాలేదు. మా అమ్మ, కన్నబిడ్డ పడుతున్న కష్టం చూడలేక, "టాయిలెట్ బాబు" అని వివరించింది. లోనికి వెళ్ళిన తరువాత కూడా ఇంకో ఉద్యోగితో ఇదే చిక్కు. ఈసారి పక్కన ఎవరూ లేక పోవడం వల్ల నేనే ఆ ఆరక్షరాల పదం అనవలసి వచ్చింది.

శ్రీరామచంద్రమూర్తికే తప్పలేదు కష్టాలు మనమెంత.

Wednesday, July 04, 2007

బ్లాగ్విజయానికి పది ఉపాయాలు

తెలుగు బ్లాగర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇది మంచి వార్త అని పెద్దలు మిమ్ము నమ్మింప జేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మనం తెలుగు వారం, మనకు పోటీ గురించి చిన్నప్పట్నుంచి మన పెద్దలు తెగ నూరిపోసారు. ఎనక ఉగ్గు పాలతో విధ్యలు పెట్టేవారు, కాని మనకిప్పుడు ‘పోటి అంటే భయం’ మాత్రమే పెడుతున్నారు. ఆపోటిని తట్టుకుని మీ బ్లాగు బ్లాగెంసెట్ లో వందలోపు రావాలంటే మా ఒకటో రకం బ్లాగు నుండి కొన్ని బ్లాగ్విజయ రహస్యాలు.

'కష్టే ఫలే' అన్నారు ఆర్యులు. కాని అవి అంతర్జాలం లేని రోజులు. అట్టి నిరాడంబర సూక్తులు ఇప్పుడు పనికి రావు. ఇప్పుడంతా ‘నెట్టే ఫలే’. ఈ జాబితా లో క్రిందకి వెళ్ళే కొద్దీ ఉపాయాల నాణ్యత పెరుగుతుంది. ప్రతి ఉపాయం క్రింద అది ఎంత కష్టమన్నది, దాని వల్ల ఎంత ఫలితమన్నది ‘ఞ’ల ద్వారా తెలుపబడ్డాయి. ఉపాయాలు బాగా వంట బట్టడానికి వాటిని వాడే వారి ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి.

ఉపాయం ౧౦ : మేధస్సు
“ఇది చాలా బాగా పనిచేస్తుంది” అనుకుంటే, అది మీ తప్పుకాదు. కానీ, అంతర్జాలంలో మీరింకా శిశువులే అని మాత్రం తెలుస్తుంది. మేధస్సులో చాలా వర్గాలున్నాయి. కొందరు చాలా చమత్కారంగా, హాస్యభరితంగా వ్రాసి ప్రఖ్యాతి గాంచారు. ఈ మేధస్సు వర్గంలోనే ఇంకో ఉపవర్గం తెలుగులో ప్రావీణ్యం. ఈ మేధస్సు మీద ఆధారపడినవారి జాబితా చాలా పెద్దదే, కానీ భయం నాస్తి, ఇది అన్నిటికంటే సార్థకము లేని ఉపాయం.
ఉదా - తోటరాముడు, విహారి, తాడేపల్లి, కొత్తపాళీ, జ్యోతి, రానారె, దీప్తి ధార, రాఘవ , నాగరాజా, వగైరా వగైరా
కష్టే - ఞఞఞఞఞ
ఫలే - ఞ

ఉపాయం ౯ - ఉత్ప్రేక్ష
“ఈ ప్రపంచంలో దేనినీ దేనితోనూ నిరూపించలేం, ఎ తత్వశాస్త్రం తీసుకున్నా అందులో లోపాలుండక తప్పవు” అని మీరు నమ్మే వారైతే, మీకు చాలా ఎక్కవ తెలుసు, కాబట్టి వెఱ్ఱి బాగుల వారు మీ బ్లాగు చదవరు. అంటే ఎవరూ మీ బ్లాగు చదవరు.
కాబట్టి ఒక పనికి మాలిన అంశం తీసుకోండి. దానికి మీ అభిప్రాయం తెలుపండి, దానకి మీ ఉపాయాలు కూడా తెలుపండి. ప్రస్తుతం వేడిగా ఉన్న అంశాలు ‘తెలుగు చచ్చిపోతుంది’, ‘భాషను బ్రతికించుకోండి’, ‘భాషను అధునీకరంచండి’, ‘భాషను మొత్తం చంపేయండి’, ‘భాష మీ-ఇష్టం-వచ్చింది-ఇక్కడ-పెట్టుకోండి’.
ఇలాంటి ఇంకా విషయాలే రాజకీయాలు, దేశపరిస్థితి, సాఫ్టవేరోళ్ళ జీవితం, మావవ హక్కులు, భూగోళ ఊష్ణీభవం, వగైరా వగైరా.
కాని మీరు ఎది వ్రాసినా మీకే అంతా తెలుసు అన్నట్టు వ్రాయాలి, వితండవాదం తప్పదు, ‘నేను తప్పుయ్యిండొచ్చు’ లాంటివి చెల్లవు.
ఉదా: మీ బ్లాగులో చాలా టపాలు, అంభానాథ్, మా గోదావరి, భట్టిప్రోలు, రాకేశ్వర, వగైరా వగైరా
కష్టే : ఞఞఞఞఞ
ఫలే: ఞఞ

ఉపాయం ౮ – రివ్యూలు
దీనికీ పైదానికీ పెద్ద తేడాలేదు. ఇక్కడ, మీరు “చదవకపోయినా నష్టంలేదు”, “చూడకపోతే పాపం కాదూ” అనిపించే పుస్తకాలూ, సినిమాలూ, ఎంచుకొని, వాటిని ‘కొద్దిగా’ చదివి. వాటిమీద “ఈ పుస్తకం చదవని వారి ఉద్యోగం పోతుంది”, “ఈ సినిమా చూడనివారు నరకానికెళతారు”, అన్నట్టుగా ఒక వ్యాసం వ్రాయాలి. అలా చేస్తే మీరు పెద్ద తోపు అనుకుని మీ బ్లాగుకి మళ్ళీ మళ్ళీ వస్తారు.
ఉదా: ౨౪ కళలు, కృష్ రేం, సౌమ్య , గార్లపాటి, వగైరా
కష్టే : ఞ నుండి ఞఞఞఞ (ఫుస్తకంలో ఎన్ని పేజీలు చదివారు అన్నదానిబట్టి )
ఫలే: ఞఞ

ఉపాయం ౭ – చావా లేదా వీవెన్
దీనికి మీరు చావా అయినా వీవెన్ అయినా అయి ఉండాలి. అంతే!
ఉదా : చావా కిరణ్ , వీవెన్ , వైజాసత్య, నేను. అంతే!
కష్టే : ఞఞఞఞఞ
ఫలే: ఞఞఞ

ఉపాయం ౬ – లంకెలు ఇవ్వండి
ఇందులో రెండు రకాలు, సింహ నైజం, నక్క నైజం.
సింహ నైజం, నాలాగా ఇలా బ్లాగు వ్రాసి ఒక పది మందికి బ్లాగులకి లంకె ఇవ్వండి. అలా అందరూ అందరికీ లంకె ఇస్తారు, అలా మంచి బ్లాగులు పైకి వస్తాయి.
నక్క నైజం, పక్కవారి బ్లాగుకి వెళ్ళి , “మీరు చెట్లపై టపా చాలా బాగావ్రాసారు, నేను చెట్ల క్రింద ఉండే ఆవులు వేసే పేడపై టపా వ్రాసాను తప్పక చదవగలరు” అని మీ టపాలకి లంకెలు అక్కడ ఇవ్వండి !
పోటీ గురించి తెలిసిన ఏ తెలుగింటి వెంకాయమ్మనైనా అడగండి మీకు రెండో ఉపాయం మే మంచిదని చెబుతుంది.
ఉదా : నేనూ, మీరు (ఇక్కడ ఒనమాలు లో వచ్చే క్రమంలో ప్రస్తావించా నంతే )
కష్టే : ఞఞఞఞ
ఫలే : ఞఞఞ

ఉపాయం ౫ – కూడలి పంచాంగం
మీ వూరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీ బాధ చెబితే , వారు పంచాంగం చదివి, మీకు మీ టపాలని ఎప్పుడు ప్రచురిస్తే శుభం కలుగుతుందో చెబుతారు. మీరు పంతుళ్ళలోనూ పంచాంగాలలోనూ నమ్మని రాకాలైతే, మీ వూరి మరాఠీ దగ్గరకి వెళ్ళి మీ బ్లాగుకి పోటివచ్చే బ్లాగుల యుఆర్ఎల్ అతనికి ఇవ్వండి, అతను చేతబడి చేసి వాటిని క్లిక్ చేసి చదివినా వారి గణాంకాలు పెరగకుండా చేస్తాడు.
ఉదా : నా బ్లాగుకి ఎవరో దుష్టులు చేతబడి చేసారు, కాబట్టి మీరు నా బ్లాగు గణాంకాలన్ని పదితో ‘మల్టిప్లైని తెలుగులో ఎఁవంటారో’ అది చేసి, అది అసలు సంఖ్యగా భావించండి, (అరె నేను మొన్ననే లక్షక్లిక్లాదికారుల సంఘంలో చేరానైతే, ఎదో మీ ఎముక లేని మూషికం ఒక్క దయా, నా ప్రాప్తి)
కష్టే : ఞఞఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౪ – కూడలి ఎత్తుపల్లాలు
చరసాలగారు పై ఉపాయం చదివి, ఎంటి ఈ చాదస్తం, జ్యోతిష్యులూ, చేతబడులూ చిరాకుగా అనుకుంటున్నారు, కాబట్టి ఇది ఆయన కోసం. మీరు వీవెన్ దగ్గరనుండి కూడలి లో జనాలు ఎప్పుడు టపాలు వేస్తున్నారు, ఎప్పుడు టాపాలు చదవడానికి వస్తున్నారు అన్నవిషయాల ‘గ్రాఫుకి తెలుగు ఎఁవైతే అది తీసుకుని’. వాటిని పరిసీలించండి.
ముందుగా మీకు అర్థమయ్యే విషయం ఎంటంటే, టపాలు వ్రాసే ప్రతి పది మందికీ చదివేవారు మాత్రం ఒక్కరే ఉంటారని. (కాబట్టి క్రింది పటంలో క్రింద ఉన్నది చదివేవారి సంఖ్య, పైనున్నది వ్రాసేవారి సంఖ్య).

స్టాకుల్లో పెట్టుబడులు ఉన్నవారు పటం చూసి చెప్పగలరు, "మిధునం, మకరం, వృషభం రాశులు అనుకూలించును బ్లాగర్లక"ని. అలాగే ఎవో తెలియని కారణాలవల్ల పారిస్, టోక్యో ల నుండి వ్రాసేవారికి గ్రహ సహకారం బాగా ఉంటుంది.
ఉదా : రాజ మల్లేశ్వర్(లంకె తెలియదు), వారణాశి, రేపట్నుండి మీరందరూ
కష్టే : ఞఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౩ – అబద్దాలు ఆడకూడదు
మీరు మీ గణాంకాలు లెక్కించే యంత్రాన్ని గానీ, వాటిని చూపించే అదృష్టాంశాన్ని (software కి తెలుగు) గాని అబద్దాలాడెడట్టు చెయ్యవచ్చు. వెంకాయమ్మ ఎంచెప్పినా ఇది మంచి పద్ధతి కాదు. కారణం:అబద్దాలు పక్క వారికే చెప్పగలం. కాని మీ బ్లాగుకు ౯౯శాతం మీరే వస్తారు కాబట్టి, మీ ఒత్తులను కూడా లెక్కించేటట్టు చెయ్యవచ్చు. ఇది వెంకాయమ్మకి బాగా నచ్చినా, మంచి పద్ధతైతే మాత్రం కాదు.
ఉదా : నేనైతే వాడను
కష్టే : ఞ
ఫలే:

ఉపాయం ౨ – శీర్షిక
మీరు "మరుగుదొడ్ల వ్యాపారం" అని శీర్షిక పెట్టి ఒక పసలేని అంశం మీద వ్యాసం వ్రాయండి. ఒత్తులే ఒత్తులు!
ఉదా : నా తరువాతి టపా
కష్టే : ఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౧ – అమ్మాయే చెత్తగా
‘శక్తి తార’ పవన్ కల్యాణుకి నేపధ్యగానం ఇచ్చిన ఉదిత నారాయణుడిని అడగండి చెబుతాడు.
"అమ్యాయే చెత్తగా అర బ్లాగే బ్లాగినా మత్తబ్బి కుర్రాళ్ళే మూషికాలపై పడ్డారే ". ఇంకేం చెప్పాలి.
పురుషోత్తముడు నందమూరి వెయ్యాగా మదనమోహినీ వేషం నిమిత్తమాత్రులం మనమెంత.
ఉదా : నాకు అమ్మాయిగా ఇంకో బ్లాగు ఉంది, అందున ఈ బ్లాగుకంటే పది రెట్లు ఎక్కువ ఒత్తులు ఉన్నాయి కూడా. కానీ అది ఎంటో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు.
కష్టే : ఞ
ఫలే: ఞఞఞఞఞ

ఉపాయం ౦ – ఆరంభసూరత్వం
ఆరంభంలో ఎవరో ఆంధ్రులు ఎంతో సూరత్వంతో అన్నారు “ఆంధ్రులకు ఆరంభసూరత్వం ఎక్కవ”ని. బ్లాగర్లు ఆ సూరత్వాన్ని కొత్త బ్లాగర్లని ప్రోత్సహింసించడంలో చూపిస్తారు.
ఆ రోజులు గుర్తున్నాయా మీకు? మీరేదో “అయ్యో నాకు సిగ్గు బాబూ, నేనెప్పుడూ ఇలా నలుగురు ముందు టపాలు విప్పలేదు” అని వ్రాసిన రెండు వాక్యాల మొదటి టపాకి, పది పేజీల వ్యాఖ్యానాలు వచ్చాయి ఇలా....
“బ్లాగ్లోకానికి బ్లాగ్-స్వాగతం, చాలా బ్లాగుంది మీ బ్లాగావరణ, బ్లాగావతారం ఎత్తి బ్లాగవతం బ్లాగండి. బ్లాగ్విజయీభవ” – బ్లాగావేశి
అని ఎదో బ్లాగ్వాంతి తెప్పిచ్చే వ్యాఖ్యానాలు ఒ ఇరవై వచ్చాయి.
అదే మీ బ్లాగ్జీవితంలోని మొదటి మరియు ఆఖరిసారి ఎవరైన మీ బ్లాగు చదవడం.

బ్లాగ్విజయ బహుబ్లాగోపాయాలు నే బ్లాగగా మీరు అబ్లాగారుగా, ఇకైతే బ్లాగండి మీ బ్లాగ్విస్వరూపం బ్లాగ్దరించగా.
(ఈ దెబ్బతో మాటలబాబు తో బాటు ఓ పది మందికి వాంతి రావడం కాయం)