భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, January 22, 2009

మదినెమిలి


అల్లో నేరేళ్ళ
నీ కళ్ళ నీలాల్లో
ఎగురనీ నా ఊహా విహఁగాలని

తెలినుఱుగుటలల
నీ వొడి సుడిగుండాల్లో
తిఱుగనీ నా కోరికల నౌకలని

అరుణ కిరణముల
నీ ఆశా జ్యోతులలో
కరుగనీ నా కలతల కారు యిరులని

విమల సిత కమల
నీ హృదాలవాలములో
ఒదగనీ నా పసిడి వన్నె కలలని

అల్లి తెమ్మెరల
నీ శ్వాస నిశ్వాసల్లో
చెరగనీ నా చేదు జ్ఞాపకాలని

సూన్యేందు అర్ధేందు రాకేందు
వలయమున భ్రమరింప లేకున్న
నీ ప్రేమతోఁ
విముక్తి నొసంగి, భానుగా
నిత్యము నీ వింట విహరింపని

గగన రతనమై, నీ నీలాలను చీఁకటి గానీను
తరఁగ హేతువై, నీ వలపుటలలకలుపు రానీను
ఆది జ్యోతినై, నీ ఆశా జ్యోతి నారిపోనీను
కమల నాథునై, నీ తమ్మిరేకులఁ ముడువనీను
మకర సూర్యునై, నీ అల్లిగాడ్పుల నుష్ణింపనీను

ఓసి చికాగోపురపు వయ్యారి
నా మదిన నాట్యమాడు మయూరి
నీకిదే నా నుడి!

Tuesday, January 20, 2009

నీచమానవులు

కార్యసాధన విషయంలో మనుషులు మూఁడు రకాలుగా ఉంటారని చెబుతూ ఉదరహించే పద్యం ఆరంభింపరు నీచమానవులు. భర్తృహరి రచించిన ప్రారభ్యతే న ఖలు అనే సంస్కృత పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెనిగించారిలా

శా|
ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాససంత్రస్తులై

యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్థము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైనా పని మొదలుపెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెరవక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి నైజం. అలాంటి వారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యో అడ్డంకులను తలచుకుని ఏ పని చేపట్టని వారు అధములు. ఏదో చేయలన్న తపనతో మొదలుపెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములని ఊ పద్యభావం.

-
ఈ పద్యం నాకు నిన్న కంటఁబడింది. బాగా నచ్చి బ్లాగులో పెట్టుకుందాం ఇంబలువురి కంటఁబడుతుందని ఇలా పెడుతున్నాను. సువాస భారతీయులు ఎవరో ఈ పద్యాన్ని నిన్న చూసేవుంటారు, ఎక్కడ చూసారో చెప్పఁగలిగితే, పుణ్యం (గుడ్ కార్మా) వస్తుంది.