భాషందం, భువనందం, బ్రతుకందం

Saturday, February 16, 2013

మెటాస్వప్నాలు మూఁడు

స్వప్నజాగృత్సుషుప్తావస్థలు నాలుగు. నాలుగవ అవస్థ లేని అవస్థ కాబట్టి దానికి పేరు ఇవ్వడం లేదు. శాస్త్రం సాంఖ్యం, సాఙ్ఖ్యేశ్వరుఁడు స్వయం తురీయావస్థుడైనందున, లేనిదీ గణనంలోనికి వస్తుంది. సీ ప్రోగ్రాములు వ్రాసేవారికి ఈతరహా గణన అలవాటే. స్వప్నావస్థకూ జాగృదావస్థకూ తేడా ఏమిటంటే, ఒకదానిలో మనకు సంకల్పం వుంటుంది ఇంకోదానిలో వుండదు. జాగృదావస్థలో మనం ఒక వాణిజ్యప్రకటన చూసమనుకోండి లేదా, పక్కింటి పిన్నిగారు పలానా బుట్టయిడ్లీ చాలా బాగుంటుంది అని అన్నదనుకోండి, మనకు ఒక కోఱిక కలుగుతోంది. దీనికి స్వప్నాలలో ఆస్కారం లేదు. స్వప్నాలకూ జాగ్రత్తకూ ముఖ్యమైన తేడా అది. దీనిదే పర్యావసనమైన ఇంకో తేడా ఏమిటంటే, మనం స్వప్నాలలో సంకల్పించి ఏమీ చేయలేము. అంటే పౌరుషం వుండదు. మనకున్న సంస్కారాలను బట్టి మనస్సు కలలుకంటూంటుంది, తద్ద్వారా కర్మ మెల్లగా కాలుతుంటూంది. ఉదాహరణకు కలలో "ఛిఛీ ఇదేం పాడు బుద్ధి ఈ పట్టునుండి చెడు ఆలోచించకూడదు" అని సంకల్పించుకోలేము. 

ఆ రకంగా స్వప్నావస్థ మన కర్మకొలనునుండి బయలుఁదేరు బోదు లాంటింది. చాలా సన్నని బోదు. మేలుకొల్పులో ఈ బోదుని వ్యతిరేకంగా పాఱనియ్యవచ్చుఁ. అంటే బోదుద్వారా కర్మజలం లోనికైనా బయటికైనా పాఱగలదు. పాఱుదలజోరు సైతము మనము అదుపు చేయవచ్చుఁ. హెచ్చంటే హెచ్చు తగ్గంటే తగ్గు. ఆధ్యాత్మికచింతన బొత్తిగా లేని జీవులకు, కాలప్రవాహంలో మాయతో ఈదు ప్రాణులకు కొలనులో తఱిగేదికంటే ఒఱిగేదే ఎక్కువ. "స్వప్నావస్థలో కర్మ కఱుగడమే జరుగుతుంది కాబట్టి నేను యుగపర్యంతం నిదురించి జ్ఞానంలో మేల్కొంటా"నంటే కుదరదు. అది చాలా మూర్ఖపద్ధతి, దానికంటే ప్రేతావస్థ నయం. ప్రేతావస్థ త్రయావస్థలలోకి రాదు, త్రయావస్థలు జీవభూతాలకే. కాబట్టి మేల్కోమనే పిలుపు సాధువులు మనకు నిత్యం బోధించేటిది. మఱిన్ని వివరాలు, సద్గురు ద్వారా.

ఉదాహరణకు చిన్న యోగసాధన ఏదైనా తీసుకోండి. ఆత్మజ్ఞానం అతిసులభం అన్న రమణమహర్షి నీవెవరు అని ప్రశ్నించుకుంటే సరిపోతుందన్నారు. అలా సరిపోయే ఇంకో తెలికైన సాధన సాక్షీభావం. నిత్యం మనము చేస్తున్న పనులలో అంటీఅంటకుండా మునిగి, మనల్ని మనము సాక్షులుగా గమనించుకోవడం. ఇది మనకు జాగృదావస్థలోనే వీలువుతుంది. కానీ స్వప్నావస్థ ఇందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. స్వప్నాలలో మనపై సాంఘికజన్యమైన తప్పొప్పులవిచక్షణలు వుండవు, కాబట్టి మనస్సు నగ్నంగా బయటకు వస్తుంది, స్వప్నావస్థలో ఆ నిజాయితీ వుంది. ఆ రకంగా చూస్తే జాగృతముకంటే స్వప్నమే నిజమైనది. అలా స్వప్నావస్థలో మన మనస్సు కన్న కలల్ని సమీక్షించుకోవడంచే మన మనస్సునిజస్వరూపాన్ని మనము కన్నవారమవగలము. 

నాకు ఈ విషయంలో అదృష్టమో దురదృష్టమోగానీ దిష్ట్యా చాలా విచిత్రమైన కలలు వస్తూంటాయి, అందుకే పదేళ్ళక్రితమే ప్రాయిడ్ ఈ అంశంపై వ్రాసిన ప్రఖ్యాతపుస్తకాన్ని చదివాను.  ప్రాయిడ్ ఆధ్యాత్మికాంశాలలో కాస్త వెనుకబడ్డవాడు కాబట్టి, కలలన్నిటినీ కేవలం మానసికంగా విశ్లేషించి వాటిని కోఱికలుఁ దీర్చోకోడానికో సరళోపాయమని నిశ్చయించాడు. కలలఁగూర్చి ఆయన కన్న ఈ సమీక్షలో నిజము లేకపోలేదు. గతపదేళ్ళగా నాకు కలిగిన ఎన్నోసంకల్పాలు, బలమైన కోఱికలూ కలల ద్వారా నెఱవేరి, నిజజీవితంలో వాటిఁగూర్చి తలలవవలసిన అవసరాన్నీ అదనపు భారాన్నీ తగ్గించాయి. అలాగే సాక్షీభావసాధనచే కలలని పునరీక్షించుకొని నాగుఱించి - నా ఆత్మఁగూర్చి కాకున్నా నా కర్మాంశం గూర్చి - ఎన్నో విషయాలు తెలుసుకొనగలిగాను. సాధనాబలము పుంజుకున్నపిదపఁ ఈ సాక్షీభావం స్వప్నావస్థలో సైతం తనదైన శైలిలో వర్తించడం మోదలయ్యింది. ఈ విషయం గమనించి నేను ఆశ్చర్యపోయాను. దీనికి ప్రాయిడు అభ్యంతరించినా, ఆయన మేధావికానీ జ్ఞానికాడుకాబట్టి అభ్యంతరాన్ని లక్ష్యించనక్కఱలేదు. 

ఇప్పటివఱకూ సాగిన సుత్తిని భరించి ఇందాకా చదివారు, పైపెచ్చు రాకేశ్వరుఁడంటే కాసిన్ని బండీఱాలతోఁ కాసిన్ని అరసున్నాలతోఁ జోడించిన చమత్కారాన్ని ఆశిస్తారు. దానితోఁ బాటూ కాసిన్ని గమ్మత్తుసమాసాలూ, లక్ష్యించడం లాంటి చిత్రమైన సంస్కృతాన్ధ్రీకరణలూ ఆశించకున్నా అనుభవిస్తారు. కాబట్టి పైనిచ్చిన నేపథ్యాన్ని అంత తీవ్రంగా విమనర్శనాస్త్రాలతో వేధించకుండా, క్రింద రాబోయే వింతలకు వేదికగా భావించగలరు. స్వప్నాలు వెల్లడించడమనేది చాలా సాహసంతో కూడుకున్నపని. ఒక సారి తెలియక మా పిన్నమ్మ ఇలానే వచ్చిన స్వప్నాన్ని నాకు చెబితే, ప్రాయిడు చదివినవాడిని దానిని విశ్లేషించిన నాకు అవగతమైన విషయంచేత కాస్త భంగపాటుపడినది. కాబట్టి మీ సాయంకాలకాలక్షేపార్థం భంగఁబడ్డ నా చాటుకు మీరు కృతజ్ఞులైవుంటారని ఆశిస్తున్నాను. పైపెచ్చు మా చుట్టాలు కొందఱీ బ్లాగు చదువుతున్నారనే మాటకూడా నా చెవినబడ్డది. చుట్టాలకు విజ్ఞప్తి, మీరనుకుంటున్నట్టు, ఈ బ్లాగ్భర్త నేను కాదు, రాకేశ్వర రావు అని అతను వేఱు.

మొదటి మెటాస్వప్నం 
వయస్సులో వుండి పెళ్ళికానివాఱికి శారిరికంగా వుండే వాఞ్చలూ, తజ్జనితసంకల్పాలూ ఏమిటన్నది ఆ వయస్సుననుభవించినవారికి అభిజ్ఞాతమే. వాటిఁ గూర్చి విఫులంగా కావాలంటే ప్రాయిడాది శాస్త్రవేత్తల పుస్తకాలు చదువుకుంటే సరి, నా ఈ ప్రయత్నం దానికంటే ఒక మెట్టు ముందుకు వేయాలనే ఆశతో.

పెళ్ళి - మామూలుజనానికే పెళ్ళిసంబంధం కుదరడానికి నానావస్థలూ పడుతూంటారు. అందునా ఇలా స్వప్నాలఁగూర్చిఁ స్వప్నస్వప్నాలఁగూర్చి ఎవరూ వాడని చెడ్డసమాసలద్వారా, పదవిభజనకు ఎంతో శ్రద్ధనిచ్చి వ్రాసేనాలాంటి సగంసన్న్యాసికి ఈ విషయం క్లిష్టతరము. చాలా సంబంధాలు చూౘి, చాలా పిల్లల్ని స్వయం మెప్పించఁజూౘి విఫలమైన నాకు పెళ్ళి ఒక దైవనిర్ణీతాంశంగా కనబడడం మొదలయ్యింది. అలా కనబడడం సహజం. ఇక్కడ కనబడడం అన్న మాట కీలకం. ఇలనందేదీ దైవనిర్ణీతం కాదు. అయితే అన్నీ అయినవే అనాలి. లేదా ఏదీలేదనాలి. ఒకటి అవును ఇంకొకటి కాదు, అనుట అజ్ఞానం. మనకు కష్టమనిపించినవి దైవనిర్ణీతాలని మానవులు సర్దిచెప్పకోవడం కద్దు. 
కాబట్టి చలనచిత్రప్రేరేపితమైన నా సంకల్పాశలు ఏదైన దైవీకమైన చిహ్నం కాబోయే శ్రీమతిని గూర్చి కానవచ్చునేమోనని వెదికేను. అన్నిటిఁకంటే చవకగా వచ్చే దివ్యసదృశచిహ్నం 'కలలో కనిపించడం'. అలా కోఱిననాకు కోఱికకు అనుగుణంగా కలరానే వచ్చింది. 

కలలోనొక చాలా అందమయిన ముఖము కనిపించింది, చలనచిత్రప్రేరేపితానుగుణంగా. కలలను నేను విశ్లేషించుకున్నంతా విశ్లేషించనవారికి స్వప్నజాగృత్సంధిదేశంలో చాలా సేపు గడపవలసివుంటుంది. అలా ఆ అమ్మాయి ముఖము కన్ననాకు ఆ దేశస్థితి ప్రాప్తించింది. అదుగో ఒక ముఖము కలలో కనబడుతున్నది అని నేను కలలోనే గుర్తించాను. గుర్తించి, గుర్తుపెట్టుకోవాలి ఆ ముఖము గుర్తుపెటుటకోవాలి అని సంకల్పించి, ఆ ముఖము మీదనే ధ్యానించాను. ఆ ముఖము ఎన్నడూ జాగృతములో చూచినదిలేదు. అలా నా సంకల్పం జాగృతమునుండి స్వప్నంలో సైతం జోరఁబడినది. అలా అది మెదటి మెటాస్వప్నం. 
తా.క- ఆ స్వప్నసుందరి మాట ఏమైనది అని మీరు అడుగవచ్చుఁ. జాగృదావస్థయొక్క అతి పెద్ద ప్రయోజనం బుద్ధి. ఏతాభ్యాం బుద్ధినేత్రాభ్యాం ఈ కలను చూస్తే అది కేవలం పూర్వవాసనాప్రేరేపితమని విదితమై దానిని విసర్జించడం కద్దు. అయిననూ ఱంకుమాటలెవరికి చేదు? మీ కుతూహలం కోసం అమ్మయి మోము వివరాలు. అది సగటు పంజాబీ లేదా ఉత్తరభారతీయ లేదా హిస్పానిక్ లేదా దక్షిణైరోపా లేదా ఉత్తరాఫ్రికా ముఖము. అంటే సగటు అందకత్తె ముఖము అంతకు మించి ఏమీ లేదు. ఏదో తాంత్రించి ఆ ముఖాన్ని నా ముందుంచినా నేను దానిని గుర్తుపడతానని అనుకోవట్లేదు.

రెండవ మెటాస్వప్నం  

ఇంతకీ ఈ స్వప్నాల వరుస ఎలా అని మీరు సందేహపడవచ్చు. ఈ మూఁడు స్వప్నాలూ ఆశ్వయుజకార్తీకమాసాలలో వచ్చినవి, వాటిని అవి వచ్చిన వరుసలో ఇక్కడ ఇస్తున్నాను.

కామిఁగాక మోక్షకామిగడు అన్నాడు ఆటవెలదిలో కవి. మోక్షం కర్మవిసర్జనమైతే, ఆ మోక్షసంకల్పము సైతం కర్మహేతువవుతుంది. హేధిక్, మాయాగాఢమంతటిది.  అలా మోక్షగామియై సాక్షీభావనను స్వప్నాలకు సైతం ముట్టించిన నాకు మా గురువుగారిని భౌతికంగా కలావలనే కోఱిక చాలా బలంగా కలిగింది. ఆయనను అలా కలసుకోవడానికీ ముఖాముఖీ ప్రశ్నించడానికీ ఉపాయాలు ఏమిటి, అవకాశం దొరకగాఁ వేయవలసిన ప్రశ్నలు ఏమిటి అని ఎంతగానే తలచుకునే నాకు ఆ సంకల్పము బలఁబడింది.

నిద్రావస్థావస్థితస్వప్నావస్థ నా అవస్థను తప్పించడానికి అపుడపుడూ కలలో మా గురువుగారిని కలుసుకున్నట్టు భ్రమింపఁజేసి ఉపశమనం చేసేది. కానీ ఆ కలలమీదఁ మన అదుపు లేకపోవడం వలన ఆ కలయికలు నిరర్థకమయ్యేవి. ఉదాహరణకు - ఆయన ముందు వుండనే వుంటాడు, ఒక తరగతి జరుగుతూంటుంది ప్రక్కకు తిఱిగి చూస్తే అక్కడ ఒక కొలను వుంటుంది, అందులో చేపలు వుంటాయి, తిఱిగి చూస్తే సహాధ్యాయులంతా ఇప్పుడు నీటమునిగి వుంటారు, గురువుగారు జలగర్భితలిఙ్గాకారాన వుంటారు. ఇలా అర్థంలేని మలుపులు తిఱిగే స్వప్నాలు తెచ్చిన ఊరట ఊరటకాదే. అయిననిది కొన్ని నెలలు సాగిన పిదపనొక కలవచ్చింది. ఈసారి కూడా ఆయన కనిపించారు. ప్రణిపాతం పరిప్రశ్నం జరిగాయి. హమ్మయ్య, ఈ సారి అంతా బాగా జరిగింది. ఎప్పటినుండో కంటున్నకల నిజమయ్యింది. ఎప్పుడూ వచ్చే పిచ్చిపిచ్చి కలలు కాదిది. ఈ సారి నిజంగా కలిసాను. కోఱిక తీఱింది. అనుకున్నాను. అంతా కలలోనే.  ఇది రెండవ మెటాస్వప్నం. ఆనాడు మొదలు ఆ కోఱిక శమించింది. ఇంకనటువంటి కలలరాక తగ్గింది. 

మూఁడవ మెటాస్వప్నం
యోగాభ్యాసము రెండు పుటలుఁ జేసినవానికెవనికైనా విదితము ఇంద్రియనిగ్రహప్రాముఖ్యత. ఇంద్రియములున్న ఎవనికైనా విదితము వాటి ప్రతాపము. ప్రచండభానుతాపము సగటు ఇంద్రియతాపము చెంత శూన్యము. పలుశ్రీవేంకటపతి నా యాత్మన కలిగితివెక్కడి కలుషములయ్యా అని అడిగాడు అన్నమాచార్యులు. తనవునఁ బొడమిన తతినింద్రియములు పొనగి యెక్కడికి పోవునయా అన్నాడు. యదా సంహరతే చాయం కూర్మోఙ్గానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియారథేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా అన్నాడు కృష్ణుఁడు. 

నిన్నమొన్నటి గఱికపాటివారితోఁ నిన్నమొన్నటి భక్తిదూరదర్శనస్రవంతిలోనాంధ్రమహాభారతానికి సాగుతున్నసామాజికవ్యాఖ్యానం చూసిన వారికి కూడా ఈ విషయం పదే పదే గుర్తుచేయడమైనది. ఆయన విద్వాంసం మనకు ఆయువుపట్టై, ఏదో నాటకంలోని ఒక పాత్ర ఇంద్రియనిగ్రహానికై సూచించిన బృహదుపాయాన్ని చక్కని తెలుఁగు పద్యంలో ఆయన మనకు విన్నవించుకున్నారు. ఉపాయోత్సాహితుఁడనైననాకు ధారణాబ్రహ్మరాక్షసుని ధారణాశక్తి లేక కనీసం ఆ నాటకం పేరైనా అందులోని పాత్ర పేరైనా గుర్తులేదు. ఆ ఉపాయం మాత్రం పాత ఉపాయమే, దానికి ఈయనిచ్చిన ఉపమానం మాత్రం మాః గొప్పగానుంది. బ్లాగ్గవిదిగ్గజాలు వేంటనే ఆ పద్యాన్ని పట్టి తమ బ్లాగులో వేస్తారని ఆశిస్తున్నాను, పద్య సారాంశమిది. 

సాధనలోవున్న గృహస్థుని కడకు వేశ్య వచ్చి అర్థించగా, ఈయన అమ్మా తల్లీ కోఱికలు కడు బలమైనవి, రాతిగుడివంటి ఈ శరీరానికి ప్రక్కనే వున్న అశ్వత్థవృక్షానిపై కాకులు వాలి వాటి కాయలను పొడచుచుండగా, ఆ బీజాలు వచ్చి గుడిగోడలరాళ్ళమధ్యన నిక్షిప్తమవుతాయి, ప్రావృష్టరుణంలో (ష్+త =ష్ట?) మొలకలెత్తి కాలక్రమములో గోడల్నికూల్చేస్తాయి, అందకే కాకులు వాలగానే వాటిని పారద్రోలాలి, గోడబీట్లించేవఱకూ ఆగకుడదు. వేశ్యలు ఈ కాకులవంటి వారు. అని.

మనము జీవించే ఆధునికకాలం వేశ్యాభరితము. ఇక్కడ వేశ్య అంటే తన జీవనోపాధికోసం ఇతరులను మోహింపవలసిన అగత్యము కలదని అర్థము మాత్రమే. ఆధునిక వేశ్యలలో సినిమాలు, వాణిజ్యప్రకటనలూ ప్రముఖం. ఇక మా కాలిపోర్నియానాట వయస్సులోనున్న కుఱ్ఱకారు వ్యాయామం పేరిట సన్నవస్త్రాలలో పరుగులుతీయడం పరిపాటి. యోగిలకిది యమపాటి.

మా సహృద్దు ఎప్పుడో పదేళ్ళనాడే ఈ ఉపాయం నాకు చెప్పాడు. కోఱికలను మొదటిదశలోనే కలుపును పీకినట్టు పీకిపారవేయాలనేది బౌద్ధములోకూడా కీలకంగా చెప్పబడినదని. ఈ సాధన చాలా కష్టతరము కానీ శ్రద్ధగా ఆచరించిన  అద్భుతమైన ఫలితములిచ్చును. దీనితోనేను లోగిడి ఇంద్రియవిజయము సాధించిన మచ్చుకలు లేకపోలేవు. నిత్యము సూర్యునితో సురసుతోపములతో త్రుళ్ళు మా కాలిపోర్నియాలో ఇటువంటి కిటుకులు కీలకాలు. నా స్వానుభవాన ఈ దీక్షపూనిని మొదటినాళ్ళ కొన్నాళ్ళు గతంలోనంటిన వాసనాప్రభావమువలనో అమ్మవారి మాయాకౌటిల్యము వలనో కలలో పెను కామములు రగులును - కర్మజలము బోదునుండి బయటకు పాఱుట. ఆ స్థితిని దాటిన తరువాతి నాళ్ళు తేలికగును. ఈ నేపథ్యంలో నాకు వచ్చిన కల యేమిటంటే. 

మంచిగా మబ్బుగా వున్న నాడు (నాకు యెండపడకుండుటా నా స్వప్నానికి తెలిసినందున) ఒక నదీ తీఱాన ఒక భామ వ్యాయామోత్సాహియై అందుకు ఉచితమైన దుస్తులలో అటు పరుగిడుచున్నది. చూసిన నా మనస్సు ఒక్కక్షణం మోహించి వేంటనే అప్రమత్తమై, ఇదిగో అవకాశం ఆదిలోనే కలుపుతీసిపాఱవేయడానికనుకొని గుర్తుచేసుకునే లోపు ఆ నదీతీరము సాగరతీరముగా పరిణమించి చిత్తము పర్వతోపమానవల్గములైన ఊర్ములపైకి సోకినది. 

కామనిర్వర్త్మమగు స్వప్నదేశమందున ఆ కామాంతకకామమగు మోక్షకామము సైతము వర్తించినందున ఈ స్వప్నము స్వప్స్వప్ననమైనది.  అది మెటాస్వప్నము మూఁడు.

వచ్చేనాళ్ళ టపా - మెటాస్వప్నాలు రెండు - కలలో సినిమాలో కల

Thursday, February 07, 2013

దిగ్గజాలతో సమస్య



దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే

(హనుమంతుని సముద్రలంఘనఘట్టం వివరించవలెను)


నా పూరణ

వాఙ్నామాయుధవర్త్మవర్తిఁ జలదాపారంబు వాతాంశుఁ దాఁ
ప్రాఙ్నాసుండయి దూకగా చెలఁగి యీ బాలార్కభక్షుండు హే
ధిఙ్నూనం మము సైతముం దినుననే ధీభ్రాంతితో త్రుళ్ళెడా
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయె మేఘంబులున్

క్లూ - కాళిదాసుని మేఘదూతములో అమోఘమైన ద్వంద్వార్థములు
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం