భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, December 16, 2008

ఇంటి పేర్లలో చివరి అక్షరం గణాంకాలు

మీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది? తరువాయి.


అ 30.5% (ప్రతి 10 లో మూఁడు)

ఆ 4.9% (ప్రతి 20 లో ఒకటి)

ఇ 41.6% (ప్రతి 5 లో రెండు)

ఈ 0.2% (ప్రతి 450 లో ఒకటి)

ఉ 16.1% (ప్రతి 6 లో ఒకటి)

ఊ 0.02% (ప్రతి 3000 లో ఒకటి)

ఎ,ఏ 1.5% (ప్రతి 66 లో ఒకటి)
అం 5.1% (ప్రతి 20 లో ఒకటి)ఇంటిపేర్లలో చివరి అక్షరంకొన్ని ఉదాహరణలు

ఎ, ఏలు
అందే, అన్నె, అన్నే, గద్దె, గాదె, ఆదె, ఆరె, ఏగే, కళువె, కామిరె, కాసె, దివిటె, దుట్టె, నార్నె, ---పల్లె (మునిపల్లె, రెడ్డిపల్లె మొ||), లాదె, వడ్డె ...
ఎ,ఏలని వేఱేగా చూడడం నాకైతే అనవసరమనిపిస్తుంది, ఉదా - అందె అన్నా అందే అన్నా తేడా వుండదు కదా ? ఇక పల్లె అని వచ్చేవాటిని పల్లి అని మార్చేయవచ్చు, ఉదా - మునిపల్లి, రెడ్డిపల్లి.


కాశీ, తాపీ, దబ్బిడీ, బహిరీ.
ఇందులో కూడా చాలా సార్లు ఉన్న ఇ కే దీర్ఘం ఇవ్వచ్చు. ఉదా- కాశీ అన్నా కాశి అన్నా పెద్ద అర్థం మారదుగా. కానీ తాపీ మాత్రం ఈ తోనే ముగించాలి. కాబట్టి ఈ లెక్క కూడా వివాదాస్పదం.


అమ్మూ
నాకు ఇదొక్కటే తారసపడ్డాది. కానీ క్రిత టపాలో శృతిగారు వారి ఇంటి పేరు బొమ్ము అన్నారు, దాన్ని బొమ్మూ అనీ వ్రాసుకోవచ్చు మఱి. కాబట్టి ఉ,ఊ లను వేఱు వేఱుగా భావించడం నాకు ఒప్పట్లేదు.


రోమనులో వ్రాసినపుడు. a,i,u,e,m (అ,ఇ,ఉ,ఎ,అం) లతో ముగిస్తున్నాయని భావించి ఈ ఐదిటికే లెక్క కడితే, అన్నిటికన్నా అఱుదైనవి ఎ తో ముగిసే ఇంటిపేర్లు. ఆ పంచాంతాలలోఁ గూడా ఎ, అం లకు చివర పు చేర్చేయవచ్చు. ఉదా- ధర్మవరం - ధర్మవరపు, మన్నె - మన్నెపు.

కాబట్టి ఇంతా చేస్తే తెలుగింటిపేర్లు అ, ఇ, ఉ లోనో ముగుస్తాయని భావించవచ్చు! (నేను మొన్నటి వఱకూ అలానే అనుకున్నాను - ఈ పరిశోధన తరువాతే ఎఅంతాలు, ఈఅంతాలు తారసపడ్డాయి)

తెలుఁగు భాష అజంతం
తెలుఁగు పాట అమృతం

Thursday, December 11, 2008

మీ ఇంటి పేరు ఎంత తీవ్రమైనది?

మన తెలుగు వారికి మన గతంతో వున్న అది పెద్ద సంబంధం, మన ఇంటిపేర్లు. ఎప్పటినుండో మాఱకుండా వున్న మన ఇంటి పేర్లలో ఎంతో సమాచారం వుంది. వాటిని విశ్లేషిస్తే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తు, అలాంటి పరిశోధనలు ఏమీ జరుగట్లేదు. నా వంతు నేను, మీ ఇంటి పలకడానికి ఎంత తీవ్రంగా వుంటుంది అనేదానికి ఒక పరిమాణం ఏర్పాటు చేసాను. ఈ క్రింద ఇవ్వబడ్డ లెక్క ప్రకారం మీ యింటి పేరుకి ఎన్ని మార్కులు వస్తాయో లెక్కకట్టుకోవచ్చు.


మీ ఇంటి పేరుని అక్షరాలుగా విడదీయండి. ప్రతి అక్షరంలో అచ్చుకీ హల్లుకీ మార్కులు వేయండి.
నలుపు - పాజిటివ్ నెంబరు, ఎఱుపు - నెగటివ్ నెంబరు.

1) అచ్చులకు (చివరి అక్షరం పై వచ్చే అచ్చుకు ప్రత్యేకించి వేఱే చోట మార్కులు వేద్దాం)
 • 01
 • 01
 • 01
 • -10-20
 • -50-100
 • 123
 • 123
 • అఁ 10 అం 3 అః -10

2) హల్లులు
 • అల్పప్రాణులు (క గ, చ జ, త ద, ట డ, ప బ ) 0
 • మహాప్రాణులు (ఖ ఘ, ఛ ఝ, థ ధ, ఠ ఢ, ఫ భ) -10
 • అనునాశికాలు (ఙ ఞ ణ న మ ) 0
 • అవర్గీయములు
 • య ర ల వ స 0
 • -5-10-557

2.2) చ౨ జ౨ (ౘ ౙ)
 • రెండో చ 5 (చారు, చేప మొదలైనవాటిలా)
 • రెండో జ 5 (మోజు, జారు మొదలైనవాటిలా)

3) ద్విత్వాలు 2

4) సంయుక్తాలు
 1. య ర ల వ శ స ష హ కలిగిన సంయుక్తాలు -5 (త్ర, ట్ల వంటివి)
 2. పైవి లేని సంయుక్తాలు -10 (ట్న, క్త వంటివి)

5) అంత్యాక్షరం
మీ ఇంటి పేరులోని ఆఖరి అచ్చు బట్టి మీకు ఇంకొన్ని పాయింట్లు వస్తాయి.
1, ఆ 5, ఇ 0, ఈ 20, 2, ఊ 50, 10, ఏ 10, అం 5
(గమనిక - మీ ఇంటి పేరు గుంతకల్, కుకునూర్, పలాస్ వంటివైతే వాటిని బద్ధిగా గుంతకల్లు, కుకునూరు, పలాస వంటి ముచ్చటైన పేర్లుగా మార్చుకోండి, వర్నా మీరు డిస్క్వాలిపైడ్! హూఁ అంతే!)

ఉదా -
అడివి (aḍivi) 0 0 0 = 0
పుడి (puḍi) 0 0 0 = 0
దండు (daṇḍu) 0 3 2 = 5

పఱిమి (paṟimi) 0 7 0 = 7
గఱగ (gaṟaga) 0 7 1 = 8

కాజా(kāzā) 1 5,5 = 11
చావా (cāvā) 1 0,5 = 6

ఆచంట (āṭsṇṭa) - ఆ1 చం5,3 ట 0,1 = 10
వజ్జల (vazzala) 0 5,5,2 0,1 = 13
జుజ్జవరపు (jujjavarapu) 0 2 0 0 2 = 5

సరిఁగొప్పల (sarĭgoppala) 0 10 1 2 1 = 14
తఱిఁగొండ (taṟĭgoṁḍa) 0 7,10 1,3 1 = 22

తాళ్ళపాక (tāḷḷapāka) 1 5,5,2 1 0,1 = 15
పిల్లలమఱ్ఱి (pillalamaṟṟi) 0 2 0 0 7,7,1 = 17
యఱ్ఱపురెడ్డి (yaṟṟapureḍḍi) 0 7,7,2 0 1 2 = 19
చీమలమఱ్ఱి (ṭsīmalamaṟṟi) 5,1 0 0 0 7,7,2 = 22
జెఱ్ఱులమఱ్ఱి (zeṟṟulamaṟṟi) 5,1 7,7,2 0 0 7,7,2 = 38

ముక్కు (mukku) 0 0 2 2 = 4
బొజ్జా (bozzā) 0,1 5,5,5 = 16
కోలా (kōlā) - 3 5 = 8
పోలం (pōlaṁ) - 2 5 = 7

సూర్యదేవర (sūryadēvara) 1 -5 2 0 1 = -1
కాశీపట్నపు (kāśīpaṭnapu) 1 -10,1 0 -10 2 = -16
ఏలేశ్వరపు (ēlēśvarapu) 2 2 -5,-5 0 2 = -4
భైరవభట్ల (bhairavabhaṭla) -10,3 0 0 -10 -5 1 = -21
శ్రీరంగం (śrīraṅgaṁ) -5,-5,1 0,3 0,5 = -1
ఋగ్వేదం (r̥gvēdaṁ) -10 -5,2 0,5 = -8
ఝంఝూమారుతము(jhañjhūmārutamu) -10,3 -10,1 1 0 0 2 = -13
ఘటశాస్త్రి (ghaṭaśāstri) -10 0 -5,1 -5,-5 = -24
శృంగవృక్షపు (śr̥ṁgavr̥kṣapu) -5,-10,3 0 0,-10 -5,-10, 2 = -35

గద్దె (gadde) 0 0,2,10 = 12
మన్నే(mannē) 0 0,2,10 = 12
తాపీ (tāpī) 1 20 = 21
అమ్మూ(ammū) 0 0,2,20 = 52

0 నుండి 5 మధ్యలో వస్తే మీది పదారణాల.. యఱ్‌ఱ్.. మూడుమార్కుల జానతెనుగు ఇంటిపేరు, అందునా కొత్తా పాతా అందరి నోటా తియ్యగా నలిగేది అని.

5 నుండి 15
మధ్యలో అయితే, పది మార్కుల జానతెనుగు ఇంటి పేరు అచ్చతెలుఁగువారు స్వచ్ఛంగా పలికే పేరు.

-10 నుండి 0
మధ్యలో వుంటే మీది కాస్త సంస్కృత ఇంటి పేరు, మంచి తెలుగువానికి నోరు తిఱిగినా అప్పుడప్పుడూ కొన్ని వర్గాల పాతవారు, కొన్ని అభిమతాల సరిగొత్త కుఱ్ఱకార్లు పలకలేకపోవచ్చు. మీకా ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోగలరు.

15 పైన
వుంటే మీది సరిగా పలికే వారు చాలా తక్కువ, కానీ పలికిన వారి నోట వింటే మీ ఇంటి పేరే వినాలి అన్నట్టుంటుంది! ఉదా - చీ౨మలమఱ్ఱి అనడానికి కూడా చీమలమర్రి అనేస్తారు. చ కాదు చ౨ అని చెప్పే సరికి తల ప్రాణం తోకకువస్తుంది. మూగమనసులు చిత్రంలో "నా పాట నీ నోట పలకాలే చి౨లక" అనే పాటలో ఘంటశాల/నాగేశ్వర రావు , "యహే చి కాదు ట్సి" అని చెబుతాడే ఆ మాదిరి అన్నమట. కానీ అందరమ్మాయిలూ సుశీల/సావిత్రిలా తొందరగా గ్రహించలేరు సుమీ.

-10 కి క్రింద వుంటే, మీ ఇంటి పేరు కాస్త తీవ్రమైనదని భావించగలరు! ఉదా - భైరవభట్ల, శృంగవృక్షపు వంటివి. ఇవి నేటి తెలుగు జీవికి సరిగా పలకటం చాలా కష్టమౌతాయి. శృంగవృక్షం అనడానికి మహా అయితే చాలామంది స్రుంగవ్రుక్షమ్ అని అంటారు. అలానే భైరవభట్ల అనడానికి బైరవబట్ల అని సరిపెడతారు.

వచ్చే వచ్చే రోజుల్లో -8 నుండి +12 బయట వుండే ఇంటి పేర్లకు చాలా గడ్డు కాలం రానుంది. (దీనికి మినహాయింపు అంత్యాక్షరి ప్రత్యేకాలు గద్దె తాపీ అమ్మూ వంటివి - అసలయితే అంత్యక్షరి నియమం వుండకూడదు, కానీ వచ్చే రోజుల్లో జరగబోయే పరిశోధనల గుఱించి చిన్ని సూచన ఇద్దామని దాన్ని ఉంచేసాను.)

ఇంకెందుకు ఆలస్యం, మీరూ మీ ఇంటి పేరుకి మార్కులు కట్టండి, మాకు తెలియజెప్పండి. మా మార్కుల పద్ధతి మంచిదయితే, మార్కులు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో వుండాలి. దానికి సగటు 5, సగటు డీవియేషన్ కూడా 5 వుంటుందని మా అంచనా. వీలైతే పూర్తి వివరాలు త్వరలో :)


నెనర్లు
౧) అన్నిటికంటే ముఖ్యమైన ఇంకో విషయం, మీ ఇంటి పేరు గనక ఈ చిట్టాలో లేకుంటే అక్కడ వేంటనేఁ జేర్చగలరు.
౨) లిప్యంతరీకరణ - కొలిచా౨ల(8) గారి ఈమాట సౌజన్యం.

Monday, November 17, 2008

బరాకేశ్వర అవతారం

ఉపోద్ఘాతం - చిన్నప్పుడు వినే వుంటారు, what makes a road broad? అని. అప్పటినుండీ మీకు ర ముందు వచ్చే బ యొక్కఁ బవరేఁవిటో అర్థమయ్యేవుంటుంది. నేను కూడా నా సంకుచిత మనస్తత్వం నుండి విశాల దృక్పదం ఏర్పరచుకోవాలని చెప్పి నా ర ముందు ఒక బ చేర్చుకుంటున్నాను. ఇంతకీ పాత రాకేశ్వరానికీ ఈ బరాకేశ్వరానికీ తేడా ఏంటంటారా? రాకేశ్వరం పార్వతీశంలాగా విదేశాలలో ఉన్నత విద్య చదువుకుని వెనక్కి వచ్చి ఇక్కడ ఇంటి కాడా కాళీగా కూర్చునే ఒక సాధారణ పాత్ర పేరు. సగటు కంచు పాత్ర లాగ వీరికి మ్రోత ఎక్కువ. ఇక బరాకేశ్వరమా, బరాకేశ్వరం నారాయణేశ్వరుల అవతారం. అలానే ఇతర మతస్తులు కలియుగంలో వారి కష్టాలు తీర్చడానికి వచ్చే దేవుడని ఎవరిని భావిస్తున్నారో వాడే ఈ బరాకేశ్వరం. నిఞ్జా అప్పులివ్వడం మీకు, వాటిని తీర్చడం ఈ ఆపద మొక్కుల బరాకేశ్వరానికీ అలవాటైపోయింది. ఇక నేను మిమ్మల్ని శిష్యులుగాను భక్తుల గాను చేరమని, మతం మార్చుకోమనీ, బలవంతంగా మతం మార్చడంగానీ చేయను, కనీసం మతం మారితే మీ కష్టాలు తీరతాయనీ చెప్పనూ. ఎందుకంటే నేను సృష్టించిన మీరు, నా వెంట బరాకపోతే, ఇంకవరివెంటఁ బోతారు.

అయితే మీ చెవినీ ఈ కంప్యూటర్ స్క్రీనుకు అంటి పెట్టండి,
మీకు అతి రహస్యమైన బరాఙ్మంత్రము చెబుతా.
ఓం చేఞ్జాయ నమః
క్రీం హోపాయ నమః

చేంజే సర్వస్వం. చేంజనంతం. చేంజమేయం. చేంజచింత్యం.
హోపజేయం. హోపచ్యుతం. హోపప్రమేయం. హోపనునిత్యం.

మారుతున్న కాలానికి
కాలుతున్న వ్యవస్థలుకి
వ్యాపిస్తున్న మార్పే ఈ బరాకేశ్వరం.

కమ్యూనిష్టులూ పోయారు
కాపిటలిష్టులూ పోయారు
పంచి ఇచ్చేవారు పోయారు
ఇచ్చింది మించి లాక్కునేవారు పోయారు

రేసిస్టులూ పోయారు
లిబరలిస్టులూ పోయారు
అల్పసంఖాకులు రాజ్యమేలేరు
విశాల దృక్పదులు ఆవుట్ సోర్సింగు ఆపారు

కంజ్యూమరిస్టుల దగ్గర డబ్బులేదు
ఎన్వియాన్మెంటలిష్టుల దగ్గర ఓపికలేదు
భూమినుండి లాక్కోవడానికి పెట్టుబడిలేదు
ఏసీనుండి బయటకు వచ్చే సత్తువా లేదు.

వసుధైక కుటంబమన్నారు
వీసా పాస్పోర్టు చూపించమన్నారు
ప్రపంచీకరణ నైసర్గికమంట
ప్రాణికి ప్రాణంటే మంట నైకర్గికమ్

మార్పుకోరేవారందఱూ మారిపోయారు.

పాలు విషమించిననాడు
నీరు కలుపుకోవడం సరుచితం
పొదుపు పనిచేయనినాడు
అప్పులు తెచ్చుకోని ఖర్చు పెట్టడం ఆదర్శం

సర్వమతాలు సర్వశాస్త్రాలు
సర్వసాంప్రదాయాలు సర్వవిద్యలూ
ఎందుకూ పనికి రాకుండా పోయనపుడు
సర్వత్రా కావాలి మార్పు

మార్పుకోసం వేడుకున్న మానవులు
మతం మఱచి వేడుకున్నారు
మార్పుకోసం ప్రాణాలిచ్చిన పుణ్యాత్ములు
మతమివ్వలేని స్వర్గాల్ని చేరుకున్నారు
మఱి మార్పేగద మన కొత్త మతం

బానిసత్వం నుండి స్వాతంత్రానికి మారాం
ఆశయం నుండి అసహాయతకూ మారాం
పంటతోటల నుండి ఐటీలకు మారాం
మలయమరుతాల నుండి విషవాయిలకూ మారాం

ఎన్నో మార్పులు వచ్చాయి
ఎన్నో మర్పులు ఆశిస్తున్నాం
వచ్చిన మార్పులు తెచ్చిన స్థితి ఇది
వచ్చే మార్పులు తెచ్చే స్థితి ఏమిటి
ఈ మార్పుల ప్రభావం మారుతుందా ?

మారుతుంది. అంతా మారుతుంది !
ప్రకృతి నియమాలన్నీ మారతాయి.
మీరు నాకు ఓటేస్తే అన్నీ మారతాయి.
నన్ను మీరు దైవంగా కొలుస్తే అన్నీ మారతాయి.

నేను అధికారంలోనికి వస్తే పై విలువ మారుస్తాను ౩.౧౪ నుండి ౩ కి
నేను అధికారంలోనికి వస్తే ఈ విలువ మారుస్తాను ౨.౧౭ నుండి ౨ కి
మీ వూరు చుట్టు తిరగడానికి పట్టే సమయం తగ్గిపోతుంది ఐదు శాతం
మీ ఋణాలకి కట్టాల్సిన వడ్డీ కూడా తగ్గిపోతుంది ఎన్నో రెట్లు

నాకు ఓటు వేసి చూడండి.
తస్సాదియ్యా మిమ్మల్నే ఒక బరాకేశ్వరం తయారు చేసి వదులుతాను.

Monday, September 29, 2008

ఈ లోకం


అమయాకమైన వరి చేనులో
అబద్ధాలాడే బిల్లుబోర్డు పాతి,
నిజానిజాలకు పెళ్ళి చేసింది.

అతిరద్దీవున్న ఆర్టీసిబస్సులో
ఆడ కండక్టర్ని పనిలోకి పెట్టి,
అందానికి అసభ్యాన్నంట గట్టింది.

అభయమిచ్చే దేవుడి గుడికి
అర్ధరాత్రి తాళం బిగించి,
నమ్మకాన్ని అనుమానించింది.


Friday, September 19, 2008

కూనలమ్మకు కోపం తెప్పించిన పదాలు


నేనీమధ్య కూనలమ్మ పదాలు చదవడం మొదలు పెట్టాను. పుస్తకం మొదట్లో ఆరుద్ర గారు కూనలమ్మ పదాల ఛందస్సు, వాటిని ఎలా వ్రాయవచ్చు అన్నది వివరించారు. కావాలంటే పుస్తకం కొనుక్కొని చదవండి. టూకీగా చెప్పాలంటే మొదటి మూడు పాదాల్లో పది మాత్రలు వుండాలఁట. అవి ౫-౫ గాగాని, ౩-౪-౩ గాగానీ వ్రాసుకోవచ్చు, అలా మూడు-నాలుగు-మూడుగా వ్రాసినప్పుడు, మధ్యలోని నాలుగు మాత్రల గణం జగణం అవ్వకూడదఁట. అలా అయితే బాగుండదఁట.
నాకు చిన్నప్పటినుండి ఒక చెడలవాటు. ఎవరైనా ఏదైనా చేయవద్దంటే నేను దాన్ని చేసి మఱీ ఎందుకు చేయకూడదో నిర్దారించుకుంటా. తెలుగు భాషలో నాకు నచ్చని ఏకైక పదం 'అదంతే'. కాబట్టి ఇవిగో మధ్య జగణం గల మూడు కూనలమ్మ పాదలు నాలుగు మీ కొఱకున్ కైఁ .

హిమశిఖరాల పైన
మహనగరాల లోన
ఇలఁ కొలువైన దాన
ఓ కూనలమ్మ

పంట పొలాల పూత
వాడి హలాల చేత
పైడి వరాల ధాత
ఓ కూనలమ్మా

ఆ జగణంబు తోడి
ఈ జగడంబు లాడి
వ్రాయిఁ పదంబు వేడి
ఓ కూనలమ్మ
ఇప్పుడు చెప్పండి ఎందుకు వ్రాయకూడదోఁ? నాకైతే ఔనేమో నిజంగానే ఇలా వ్రాస్తే బాగుండదేఁవోనని పిస్తుంది. మీకేమనిపిస్తుంది?

త.క - అన్నట్టు పొలాలు, హలాలు అంటే మీకేమైనా గుర్తొచ్చిందా?

Monday, August 25, 2008

అందములోఁ పోతరాజుల కందములోః బొమ్మల చందములోఁ

కం. అందములొఁ పోతరాజుల
కందములోహొ సువివరముగఁ దెలుప బొమ్మల్
చందములోనన్ మీకై
పొందుపరచితి మరి నేర్చి పులకితులౌరీ

కందము గుఱించి నేర్చుకునే ముందు మనం గురులఘువుల గుఱించి తెలుసుకుందాం.

లఘువు(గుర్తు I)
సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు.
ఉదా: అ, ఇ, ఌ, ఎ, ఘి, చె, పు, తృ, వఁ, ళొ మొదలైనవి.
ఇంకో మాటలో చెప్పాలంటే గురువులు కానివి లఘువులు.

గురువు (గుర్తు U)
క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి.
ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, కౄ, చా, డం, నః, రై మొదలైనవి.
ధీర్ఘాచ్చులు లేదా వాటిని ధరించే హల్లులు గురువులౌను, అలానే ఒక అక్షరం తరువాత పొల్లక్షరం (సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం) వస్తే అది కూడా గురువౌతుంది.ఉదా: అక్, విశ్, ముల్, నెన్ మొదలైనవి.

ఒక ఉదాహరణాత్మక పాదం మఱియు దాని గురులఘువిశ్లేషణ
"శారికా కీరపంక్తికిఁ జదువు సెప్పు"
శాU రిI కాU కీU రI పంక్U తిI కిఁI జI దుI వుI సెప్U పుI
గమనించ వలసిందేంటంటే సెప్పులో సె గురువు ప్పు లఘువు!

కందం
పైన చెప్పినట్టు పలకడానికి గురువుకు రెండు మాత్ర(లిప్త)ల కాలం, లఘువుకు ఒక మాత్రాకాలం పడుతుంది. అంటే లఘువుకు రెండింతల కాలం పడుతుంది గురువుకి. కందపద్యాన్ని నాలుగేసి మాత్రలగా విడగొట్టవచ్చు. నాలుగు మాత్రలంటే ఒక గణం క్రింద లెక్క. ఆ గణాలు ఈ రకంగా కలువు - నల IIII, భ UII, జ IUI, స IIU, గగ UU (U = ౨ I = ౧ మాత్ర కాబట్టి)

కందపద్యం ఉదా:
కం. ఎప్‌పటి కెయ్‌యది ప్రస్‌తుత
UII UII UII (భ భ భ)
మప్‌పటి కామా టలాడి - యన్‌యుల మనముల్
UII UU IUI - UII IIU (భ గగ జ - భ స)
నొప్‌పిం పకతా నొవ్‌వక
UU IIU UII (గగ భ భ)
తప్‌పిం చుకు తిరుఁగువాడె - ధన్‌యుడు సుమతీ
UU IIII IUI - UII IIU (గగ నల జ - భ స)

కందంలో ౩, ౫, ౩, ౫ గణాలతో నాలుగు పాదాలు రాస్తే చాలు. కానీ అలా వుంటే మఱీ కందంలో అందం పాళ్ళు తగ్గుతాయని కొన్ని నియమాలు విధించబడ్డాయి. ఉదా- పై పద్యంలో ప్రతి పాదానికి రెండో అక్షరం 'ప్ప' వుంది. దీనిని ప్రాస నియమం అంటారు (ఇంకా ఇలాంటి నియమాలు చాలా ఇక్కడ ఉన్నాయి). యత్రి పాస్ర నియమాలే కాకుండా కందంలో ఇంకా కొన్ని నియమాలున్నాయి - అవి ఏ గణం (నల,భ,జ,స,గగ లలోఁ) ఎక్కడ పెట్టవచ్చో ఎక్కడ పెట్టకూడదో నిర్ధేశిస్తాయి.

పైదంతా మనం ఇంతకుముందే మన అందమైన అందం బడిలో నేర్చుకున్నవే, కానీ మీరెవ్వరూ తమ తమ హోం వర్కులు చేయలేదు కాబట్టి తిరిగి చెప్పవలసివస్తుంది. ఇలా మరల మరల ఎవరు చెబుతారని చెప్పి నేను ఈ సాఱి కాస్త మెఱుగైన పద్ధతి వాడి మీకు కందం బోధింపదలచాను.

బొమ్మలతోఁ
కందంలో నాలుగు నాలుగు గణాలు వస్తాయన్నమాట నిజమే గాని, పైనచెప్పినట్టు, ఆ ఒక్క నియమాన్ని మాత్రం పాటిస్తే సరిపోదు. ఉదాహరణకు, బేసి సంఖ్య గణం జ గణం (IUI) అవడానికి వీలు లేదు. వికీలు ఏడుగా ఇవ్వబడ్డ నియమాలను నేను ఇక్క ఒక్క బొమ్మలో బంధించడానికి ప్రయత్నించాను. ఆ బొమ్మలను చూద్దాం.

క్రింద ఇవ్వబడ్డ బొమ్మల్లో,
౧) ఒక సమచతురస్రము(square) ఒక మాత్రతోఁ సమానము. అంటే లఘువుకు ఒక డబ్బా సరిపోగా గురువుకు మాత్రం రెండు ప్రక్క ప్రక్క డబ్బాలను కలపవలసివస్తుంది.
౨) రెండు డబ్బాల మధ్య డాటెడ్ లైన్ వుంటే వాటని కలుపుకోవచ్చు, అదే గట్టి లైను వుంటే వాటని కలపడానికి వీలు లేదు, గీతే లేకుంటే వాటిని కలిపి తీరాలి.పై బొమ్మలో మీకు కందంలో వాడదగ్గ గణాలు ఏవి అని తెలిసివచ్చివుండాలి. ఇప్పుడు ఏ గణం ఎక్కడ వాడవచ్చు అన్నది చూద్దాం.పై బొమ్మ నుండి మీకు అర్థమవ్వాల్సిందేటంటే,
౧) మొదటి పాదంలో మొదటి గణంలో రెండు మఱియు మూడు మాత్రలను (డబ్బాలను) కలపడానకి లేదు కాబట్టి అక్కడ జ గణం తప్ప వేరేదైనా పడాలని.
౨) రెండవ పాదంలోని ఆఖరు గణంలో గగ లేదా స నే వుండాలి (ఎందుకంటే ఆఖరు రెండు మాత్రల స్థానంలో గురువు మాత్రమే రాగలదు కాబట్టి).
3) సరిపాదాల్లో మధ్య గణంలోని డబ్బాల మధ్యఁ గీతల వైనం వల్ల అవి జగణం లేదా నల మాత్రమే అయివుండాలి.
పై బొమ్మ గుర్తుంటే వికీలో ఉన్న అన్ని నియమాలు మీకు వాటంతట అవే గుర్తుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవసిందల్లా మొదటి పాదం గురువుతో మొదలైతే అన్ని గురువుతో మొదలవ్వాలి (అలానే లఘువుతో మొదలైతే అన్నీ లఘువుతోనే) అని.

ఈ బొమ్మ మీకు బాగా గుర్తుకు వున్న నాడు మీకు కందం వ్రాయడం తేలిక అవుతుందనడం రాజకీయనాకుని వాగ్దానం అవుతుంది. కానీ మీకు కందాలను చదివి వాటిని ఆస్వాదించే భాగ్యం మాత్రం తప్పక కలుగుతుంది!

కొన్ని కందాలు
దేవతలు దానవులు కలసి సముద్రాన్ని చిలికి అమృతం పొందారు అన్నది వట్టి కట్టు కథ అని ఆధునికి విద్యాబోధన చేసిన వారంటూంటారు. ఆ విషయం నాకు తెలియదు కానీ, కందాలు రూపంలో మన పోతన అమృతాన్ని సృజించి, పీనపయోధరములుగల అర్ధనగ్న అమ్మాయల చేత మనకు వడ్డించినంత పని చేసాడు. (ఇదే వాఖ్యాన్ని మీరు 'అమృతాన్ని దృఢకాయులైన అర్ధనగ్న అబ్బాయల చేత మనకు వడ్డించాడు అని చదువుకోండి - మీరు స్త్రీవాదులైతే - ఎవరినీ నొప్పించకూడదనేది కవులకు పరమపవిత్రమైన ఆచారం).

పోతన గారి నాలుగు కంద పద్యాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాను.

మొదటిది
మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో రెండు గురువుల మినహా అన్నీ లఘువులేఁ! అలా ఉండడం నియమం కాదుఁగదా పైపెచ్చు అలా వ్రాయడం బహుకష్టం. మన బ్లాగర్లోలో ఆ అద్భుతాన్ని సాధించిన వారు లేకపోలేరు. మీ కోసం వారు వ్యాఖ్యలలో వారు వ్రాసిన 'సర్వలఘు'కందాలని మరల మనకు వినిపిస్తారనుకోండి సహృదయులు.
కం.
అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిరిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
(అనుప్రాస అద్భుతంగా వుందికదు)
రెండవది
మా రాఘవ ఇష్టకందం ఇది. కొన్ని రోజులు పోతే కందం ఎలా వ్రాయాలి అన్నది రాఘవ మీకు సువివరంగా వివరించనున్నాడు. ఇది దానికి టీౙరు మాత్రమే!
కం.
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయ గదే
మూడవది
ఇది పోతన గారి గజేంద్రమోక్షము నుండి తీసుకోబడ్డది. గజేంద్రమోక్షములో మొదటి పద్యంగా ప్రసిద్ధి.
కం.
నీరాట వనాటములకు
పోరాటం బెట్టు గలిగెఁ బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్
నాల్గవది
ఇది కూడా గజేంద్రమోక్షములోనిదే. ఇది చాలా క్లిష్టమైన కందం. అనుప్రాసగా విశ్వ అని వచ్చేసరికి దీనిని వేగంగా చదవడం చాలా కష్టమవుతుంది. ఇలానే దీన్ని గణాలుగా విడగొట్టడం కూడా చాలా కష్టం.
కం.
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజుబ్రహ్మ ప్రభు
నీశ్వరునిన్ బరమపురుషు నే సేవింతున్ఐదవది
బొమ్మలేకున్నా గజేంద్రమోక్షం నుండి ఇలాంటిదే ఇంకో మంచి కందం.
కం.
కలఁడందురు దీనులయెడఁ
కలఁడందురు పరమయోగి గణముల పాలన్
కలఁడందురన్ని దిశలన్
కలఁడు కలండనెడివాఁడు కలడో లేడో


ఇప్పుడు హోం వర్కు
౧) ఒక శుభదినాన పోతనగారు బ్లాగ్లోకాన్ని చూడడానికి వచ్చారు. పలు బ్లాగులు చూసారు ఆ తరువాత నవతరంగం చూసారు. ఆయన గుఱించి మంచిగా వ్రాసిన నా బ్లాగును చూసి, ఆ తరువాత ఆయనకి అసులు అర్థంకాని నా నవతరంగం వ్యాసాలు చూసారు (సినిమా అంటే ఆయనకు తెలియదుగాదా పాపం). ఆపై అనామిషుల గోల చూసి, అఱె ఈ రాకేశెవరు? రాకేశ్వర రావు ఎవరు? అనుకొని ఆయన సందేహాన్ని కందంలో వ్రాస్తే అది ఎలావుంటుంది.
జ) ఇవి లెక్కలు కాదు గాబట్టి ఎవరు జావాబు వారిది వుంటుంది. పక్కవారి నుండి చూచి వ్రాయడానికి లేదు. కాబట్టి నేను నా జవాబు ఇక్కడే ఇచ్చేస్తున్నాను !
కం.
రాకేశ్వరుఁడందమునన్
రాకేశ్వర రావుఁ నవతరంగమునతడేఁ
రాకేశ్వరుండు రాకేశ్
రాకేశ్వరుననెడివాఁడు రాకేశేనా?

లంకెలు:
౧) కందం, మందం, మొ||
౨) వికీ కందం
౩) పోతన భాగవతము
౪) వృత్తాల బొమ్మలు
౬) కందము పై బ్లాగ్చర్చ

Friday, August 01, 2008

భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ

శ్రీ పురందర దాసు గారి కీర్తన "భాగ్యద లక్షీ బారమ్మ". తెలుగు కన్నడ లిపులలోఁ, నాకు చేతనైన తెలుగనువాదముతోఁ.

భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ (ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ನೀ) భాగ్యపు లక్ష్మీ రావమ్మ మాయమ్మ నూ
సౌభాగ్యద లక్ష్మీ బారమ్మ (ಸೌಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ) సౌభాగ్యపు లక్ష్మీ రావమ్మ

హెజ్జెయ మేలె హెజ్జెయనిక్కుత (ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯನಿಕ್ಕುತ) హజ్జ పైనొక హజ్జ వేస్తు
గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత (ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ) గజ్జెల కాళ్ల ధ్వని వినిపిస్తు
సజ్జన సాధు పూజెయ వేళెగె (ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) సజ్జన సాధు పూజల వేళకి
మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె (ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ) మజ్జిగ లోపల వెన్నలాగ

కనకవృష్టియ కరెయుత బారె (ಕನಕವೃಷ್ಟಿಯ ಕರೆಯುತ ಬಾರೆ) కనకవృష్టిని పిలుస్తు రావె
మనకె మానవ సిద్ధియ తోరె (ಮನಕೆ ಮಾನವ ಸಿದ್ಧಿಯ ತೋರೆ) మనసుకు మానము సిద్ధింప రావె
దినకర కోటి తేజది హొళెయువ (ದಿನಕರ ಕೋಟಿ ತೇಜದಿ ಹೊಳೆಯುವ) దినకర కోటి తేజమున మెఱయు
జనకరాయన కుమారి బేగ (ಜನಕರಾಯನ ಕುಮಾರಿ ಬೇಗ) జనకరాయుని కుమారి బేగ

అత్తిత్తగలదె భక్తర మనెయలి (ಅತ್ತಿತ್ತಲಗದೆ ಭಕ್ತರ ಮನೆಯಲಿ) ప్రక్కకు తొలగక భక్తుల యింటన
నిత్య మహోత్సవ నిత్య సుమంగలి (ನಿತ್ಯ ಮಹೋತ್ಸವ ನಿತ್ಯ ಸುಮಂಗಲಿ) నిత్య మహోత్సవ నిత్య సుమంగళి
సత్యవ తోరువ సాధు సజ్జనర (ಸತ್ಯವ ತೋರುವ ಸಾಧು ಸಜ್ಜನರ) సత్యముఁ జూపగ సాదు సజ్జనుల
చిత్తది హొళెయువ పుత్థళి బొంబె (ಚಿತ್ತದಿ ಹೊಳೆಯುವ ಪುತ್ಥಳಿ ಬೊಂಬೆ) చిత్తనఁ మెఱయుచు పుత్థడి బొమ్మ

సంఖ్యెయిల్లద భాగ్యవ కొట్టు (ಸಂಖ್ಯೆಯಿಲ್ಲದ ಭಾಗ್ಯವ ಕೊಟ್ಟು) సంఖ్యలేని భాగ్యమునిచ్చెడి
కంకణ కైయ తిరువుత బారె (ಕಂಕಣ ಕೈಯ ತಿರುವುತ ಬಾರೆ) కంకణము జేతఁ దిప్పుతు రావె
కుంకుమాంకిత పంకజలోచనె (ಕುಂಕುಮಾಂಕಿತ ಪಂಕಜಲೋಚನೆ) కుంకుమాంకిత పంకజలోచన
వెంకటరమణన బింకద రాణి (ವೆಂಕಟರಮಣನ ಬಿಂಕದ ರಾಣಿ) వేంకటకమణుని బింకపు రాణి

సక్కరె తుప్పద కాలువె హరిసి (ಸಕ್ಕರೆ ತುಪ್ಪದ ಕಾಲುವೆ ಹರಿಸಿ) చక్కెర నేతుల కాలువ పాఱగ
శుక్రవారద పూజెయ వేళెగె (ಶುಕ್ರವಾರದ ಪೂಜೆಯ ವೇಳೆಗೆ) శుక్రవారపు పూజల వేళకు
అక్కరెవుళ్ళ అళగిరి రంగన (ಅಕ್ಕರೆವುಳ್ಳ ಅಳಗಿರಿ ರಂಗನ) అక్కర యున్న అళగిరి రంగడు
చొక్క పురందర విఠ్ఠలన రాణి (ಚೊಕ್ಕ ಪುರಂದರ ವಿಠ್ಠಲನ ರಾಣಿ) చక్క పురందర విఠ్ఠలుని రాణి

సుబ్బలక్ష్మి (సీతారాముల కల్యాణము చూతము రారండి చందమునఁ)భీమ సేన జోషి
(హిందుస్థానీ బాణిలోఁ)సుధా రఘునాథ
ఆడియో మాత్రమే


లంకెలు
౧) కన్నడ వికీ
౨) ఈమాట లిప్యంతరీకరణి

Friday, July 25, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

రంగము ౫
కూడలిలో చొఱవ బ్లాగరుతో అమెరికా బ్లాగర్ల సంఘం (అబ్లాస) పెద్దలైన హ్యారీ బ్లాగరు, వికీ బ్లాగరు, కొత్త జెర్సీ బ్లాగరు.
చొఱవ బ్లాగరు – నమస్కారం, బ్లాగర్లు సినిమా నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఆదర్శ నవ’తరం’గ సినిమా కాబట్టి, నిర్మతాలుగా మీరు దర్శకరచయితలకు పూర్తి స్వాతంత్రం ఇస్తారని అనుకున్నాం. కానీ ఒక రకంగా ఆలోచిస్తే, కష్టమొచ్చినా నష్టమోచ్చినా భరించేది మీరే కాబట్టి, కథ వినే హక్కు ఎంతైనా మీకుంది.
వికీ బ్లాగరు – మేము మీరనుకునేలా, కథని ఖూనీ చేసే నిర్మాతలు కామండి. మేము డబ్బు పెడతాము తప్ప, దానినుండి ఏ విధమైన ఆర్థిక లబ్ధినీ ఆశించము. సినిమా ఒక కళండి, దానిని వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకునేంత నీచానికి మేమింకా దిగజార లేదు.
చొఱవ బ్లాగరు – అమోఘం. ప్రవాసులై, మీ పిల్లలకు అఆఇఈ లు రాకపోయినా, మీ అర్ధాంగులు ఋౠఌౡ లు పలుకలేకపోయినా, మీరు మాత్రం తెలుగులోనే బ్లాగుతున్నారంటే, తెలుగు పట్ల మీకు గల అభిమానం, తెలుగు కళామతల్లి పై గౌరవం కొట్టొచ్చినట్లు తెలుస్తూనే వున్నాయి. ఇక కథ చెబుతా వినండి.. మన బ్లాగర్ల గుంపు ఒకటి ఉంటుంది, వారిని అనామిషుడు వేదిస్తూవుంటాడు, కూడలిలో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చి చిల్లర చిల్లర కమెంట్లు పెడుతూంటాడు ౬౬౬, ౯౯౯ వంటి పేర్లతోఁ. ...
...
....
అలా చివరకి ఇఱవై ఏళ్ల తరువత కలసిన మన బ్లాగు హీరోలనిద్దరినీ ఆ అనామిషుడు చంపేస్తాడు(బ్లాగుపరంగా). ఎడారిగా మారిన బ్లాగలోకాన్ని చూసి “ఇక నేనే ఏకైక బ్లాగర్ని” అని వికృతంగా ఒక నవ్వునవ్వుతాడు. అప్పుడే మొదటి సారిగా మనం వేవిన్ని అనామిషుడిగా చూపిస్తాం. ప్రేక్షకులు అఱ్ఱే బ్లాగుల వ్యాప్తికి ఇంత తోడ్పడ్డ వీవేనేనా ఆ అనామిషుడు అని నివ్వెర పోతారు. తెర పైన “ఇంకా వుంది” అని పడుతుంది.
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది. చాలా బాగుంది కథ. ఈ సినిమాకి ఎంత ఖర్చవుతుందన్నారు.
చొఱవ బ్లాగరు – పది కోట్ల వఱకూ అవ్వొచ్చు.
కొత్త జెర్సీ బ్లాగరు – పది కోట్లంటే రెండున్నర మిలయన్ డాలర్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. సినిమా అనే ఆదర్శానికని ఆ మాత్రం ఖర్చు పెట్టగలము. కళ మూలమిదం జగత్ అని అననే అన్నారు ఆర్యులు.
చొఱవ బ్లాగరు – చిన్న మనవి... పది కోట్లంటే... పది కోట్ల డాలర్లని మా ఉద్దేశం, మీరు డాలర్లలో ఆలోచిస్తారుగా అందుకని మొత్తాన్ని డాలర్లలోనే చెప్పాను. ఏ హాలీవుడ్ చిత్రం తీసుకున్నా, కనీసం వంద మిలియన్లైనా ఖర్చు వుంటుందిగా. మన తెలుగు వారు ఎవ్వరికీ తీసిపోకూడదని, మనము ఆ స్థాయిలో చిత్రాలు తీయగలమని ప్రపంచానికి చాటి చెప్పడానికి.... అప్పటికీ మన ముగ్గరు హీరోలూ మన బ్లాగుమిత్రుల కోసమని చెప్పి తలా పది మిలియను డాలర్ల నామమాత్ర మొత్తానికే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంక ఉన్న ఒకే ఒక్క అమ్మాయీ యాభై మిలియన్లు ఇస్తేనే చేస్తానంటుంది. కాబట్టి వ్యయంలో ౮౦ శాతం ముఖ్యతారాగణానికే ...
హ్యారీ బ్లాగరు – మేమన్నట్లు. డబ్బులు పెద్ద విషయం కాదు. అదీ అమెరికాలోని అతి సంపన్న వర్గం అయిన మన తెలుగువారికి అదో లెక్క కాదు. కానీ అంత పెద్ద మొత్తాని పెడుతున్నందుకు గాను, కథకి చిన్న చిన్న సూచనలు చేద్దామని.
చొఱవ బ్లాగరు – కథ ఇప్పటికే ఫ్రీజ్ చేసేసాం.
హ్యారీ బ్లాగరు – కథ ఫ్రీజైతేనేం? ఎండలో పెట్టండి అదే కఱుగుతుంది. అంటే మీకు కథ రాయడం రాదని కాదు. కానీ అమెరికాలో మన సినిమా సరిగా ఆడాలనే తపనతో కొన్ని చిన్న సూచనలంతే.
చొఱవ బ్లాగరు – చెప్పండి
హ్యారీ బ్లాగరు – మొన్న హ్యాపీడేస్ వచ్చింది కాదా. అది పెద్ద హిట్ కాబట్టి, ఇప్పటి ట్రెండ్ అంతా సూడెంట్ గ్యాంగులుగా నడుస్తుంది. కాబట్టి మన కథలో కూడా ఇద్దరు ముఖ్య హీరోల బదులు, ఒక నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ ఉన్న గ్యాంగ్ ఒకటి ఉండాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుందండి. కథని స్వల్పంగా మారిస్తే సరిపోతుంది.
హ్యారీ బ్లాగరు – అలానే నాలుగు ప్రేమకథలను నడిపించాలి. అందులో ఒకతను రాయలసీమ నుండి వస్తాడు. అతనికి పెద్ద ప్లాష్ బ్యాక్ ఉంటుంది.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మన రానేరా పాత్రకి అది చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – తరువాత, ఇంకొకతను, దేశంలో నేడు చెలరేగుతున్న లంచం, బంధుప్రీతి వంటి సంఘవిద్రోహ శక్తులను రూపుమాపడానికి ఒక రహస్య వ్యవస్థ నడుపుతుండాలి.
చొఱవ బ్లాగరు – దానిదేఁవుందండి. మా పురాణ్ పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – ఇక మూడో హీరో చాలా లావుగా చాలా పొట్టిగా అందవిహీనంగా మనిషా గుండ్రాయా అన్నట్టు వుండాలి. చివరకు నిజమైన ప్రేమ గుడ్డిదని తన హీరోయిన్ గ్రహించడంచేత అతని ప్రేమ విజయవంతం అవ్వాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మా కేకేశ్వర పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
వికీ బ్లాగరు – కానీ అలాంటి ఆదర్శ ప్రేమను మన మాస్ ప్రేక్షకులు జీర్ణించుకోలేరు, కాబట్టి అతను ఆఖరికి తన మిత్రులను మీరన్న ఆ అనామిషుని దగ్గర నుండి కాపాడు కోవడానికి, ప్రాణాలు వదిలేస్తాడు.
చొఱవ బ్లాగరు – భళి భళి. సరిగ్గా సరిపోతాయి మీ సూచనలు.
వికీ బ్లాగరు – ఇక ఇది బ్లాగర్ల సినిమాలానే కాకుండ. అందరూ వీక్షించి ఆనందించేలా చిన్న చిన్న మార్పులు చేయాలి. బ్లాగర్ల బదులు కాలేజీ విద్యార్థులు ఉంటే చాలా బాగుంటుంది. రోజురోజుకీ దిగజారిపోతున్న ప్రవాసుల పిల్లల్లోని తెలుగు సినిమా పై అభిప్రాయాన్ని ఏమైనా మార్చాలంటే అలాంటి కథలూ అలాంటి సినిమాలూ ఎంతైనా అవసరం.
కొత్త జెర్సీ బ్లాగరు – అవును, ఇప్పటికే హ్యాపీ డేస్ వల్ల ఇక్కడి పిల్లలు, హైదరాబాదులో బీటెక్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. తెలుగు నేర్చుకోవల్సిన అవసరమూ లేదు, అలానే ఎప్పుడూ చదవవలసిన అవసరమూ లేదు. నాలుగేళ్ళు అయ్యేసరికి చోకిరీ-నౌకరీ రెండూ వుంటాయి, ఇక్కడైతే అవన్నీ సాధించాడానికి తల ప్రాణం తోక్కు వస్తుంది అని ఆలోచిస్తున్నారు.
హ్యారీ బ్లాగరు – మా అన్నయ్య గారి అబ్బాయి హార్వాడు వదిలేసి ఖమ్మంలోని ఏదోఐటిలో చేరడం వల్ల మా అన్నకు కాలేజీ ఫీజుల రూపంలో లక్ష డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు కలసివచ్చాయి!
చొఱవ బ్లాగరు – మీరన్నది నిజం. యువ తరాల ఆలోచనల్లో మార్పులు తేవలన్నదే మా నవ’తరం’గం సినిమాల ఆశయం కూడాను.
వికీ బ్లాగరు - అయితే కథను ఇలా మారుద్దాం, కాలేజీ విద్యార్థుల గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అందులో ఒకరికి రాయలసీమ కక్షలతో కూడుకున్న గతం ఉంటుంది. ఇంకొకతను కాలేజీలో విద్యార్థిగా ఉంటూనే, రహస్యంగా భ్రష్టాచారాలను రూపుమాపే వ్యవస్థను నడుపుతూవుంటాడు. ఇంకొక జంట ప్రేమ కథ వచ్చేసి, చిన్నప్పటి నుండీ మిత్రులైవుంటారు, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి మాత్రం అందవిహీనంగా వున్న అతన్ని ప్రేమించలేక సీనియర్ ఒకతన్ని ప్రేమిస్తుంది, అదీ అబ్బాయి సహాయంతోనే. అబ్బాయి ఆ సీనియర్ తో ఫుట్బాల్ ఆడి గెలిచి, అమ్మయి మనసు చొరగొంటాడు. ఇక నాలుగో జంట కథేమో, వారి ప్రేమకు హైదరాబాదులో పెద్ద మాఫియా అధిపతైన అమ్మాయి తండ్రి ఒప్పుకోడు, కానీ అంతిమ విజయం ప్రేమలదే...
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది కథ. ఒక్క కథతో మీరు సమరసింహా రెడ్డి వంటి అన్ని బాలకృష్ణ, చిరంజీవి సినిమాలూ, అన్ని శంకర్ సినిమాలూ, నువ్వే కావాలీ, హ్యాపీ డేస్ వంటి అమ్మమ్మలు సైతం చూసే యూత్ సినిమాలూ, పోకిరీ వంటి హింసాత్మక సినిమాలూ కలగలిపేశారు. సినిమా దురద వున్న ఏ తెలుగోడూ మన సినిమా చూడక మానడు.
హ్యారీ బ్లాగరు - కానీ ఈ కథకు వంద మిలయన్లు అవసరం ఉందా? ముందు ఒక మిలియన్ తో తీయండి, అది హిట్టయితే చూద్దాం.
చొఱవ బ్లాగరు– మిలియన్ అంటే నాలుగు కోట్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. మన భారీ కథకి ...
కొత్త జెర్సీ బ్లాగరు – మిలియన్ అంటే పది లక్షలు. పది లక్షల రూపాయలు చాలని మా ఉద్ధేశం. మీరు రూపయల్లో ఆలోచిస్తారని మొత్తాన్ని రూపాయల్లో చెప్పాము. ప్రస్తుతం అంతటితో తీయండి, అది విజయవంతమైతే చూద్దాం.
హ్యారీ బ్లాగరు – ఇదే మా ఆఖరి మాట.
వికీ బ్లాగరు – అవును. ఇదే మా ఆఖరి మాట.
అందరూ నిష్క్రమింతురు.
చొఱవ బ్లాగరు – డామిట్. కథ అడ్డం తిరిగింది!


కృతజ్ఞతలు

౧) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧
౨) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨
౩) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩
౪) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪
౫) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

ప్రముఖ బ్లాగర్ల పేర్లు వాడుకొని వారినోట కోణంగి పులకులు పలికించినా పెద్ద మనసుతో టాపా ప్రచురణ మనఃస్ఫూర్తిగా వారు అంగీకరించినందుకు కృతజ్ఞడను. వీరిని ఈ విధంగా ప్రస్తుతించడం బ్లాగ్లోకంలో వారి ప్రాముఖ్యతకు నిదర్శనము మాత్రమే (ఉదా ఈ నాటకానికి నాయకుడు మఱియు ప్రతినాయకుడూ కూడా అయిన వీవెన్ పాత్ర)

ముఖ్య తారాగణ చదువరి, జ్యోతి, త్రివిక్రమ్, రానారె, ప్రవీణ్, రాకేశ్వర, వేంకట్ సిద్ధరెడ్డి, కొత్త పాళీ, వీవెన్, వైజాసత్య, విహారి, ఇస్మైల్

అలానే పేర్లు స్తుతింప ఇతర తారాగణానికి కూడా నా కృతజ్ఞతలు. రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, స్వాతి, రాధిక, వెంకటరమణ, సీబీరావు, చావా కిరణ్, తాబాసు, పప్పు నాగరాజు

మూల కథ అప్పుడెప్పుడో కూడలి కబుర్లలోఁ జరిగిన చర్చ.

ప్రత్యేక కృతజ్ఞతలు బ్లాగులోకాన్ని ఎగతాళి చేసి వ్రాసినా, మమ్మల్ని దూషించకుండా, చాలా బాగుంది అని వ్యాఖ్యలు వదిలిన పాఠకమహాశయులకు సర్వదా ఋణపడివుంటాను.

Thursday, July 24, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

రంగము ౪
కూడలి కబుర్లలో, రానేరా, పురాణ్, దర్శక బ్లాగరు
దర్శక బ్లాగరు కథ వివరింతురు. (కథను పెద్దగా మార్చకుండానే...)
దర్శక బ్లాగరు – అలా చివరికి ఇఱవై ఏళ్ల తరువాత ఆ ఇద్దరు మిత్రులూ మూత బడిన కూడలి కబుర్ల బయట కలుసుకుంటారు. మంచి బ్లాగరు, ఆ చెడ్డ బ్లాగరే అనామిషుడని గ్రహించి, అతన్ని అక్కడ వుండమని, కూడలి పెద్దలను పిలిచి అతన్ని పట్టిస్తాడు. అదీ కథ
పురాణ్ – కథ బానేవుంది గానీ, నేను మల్టీ స్టారర్లలో నటించను. నా అభిమన సంఘాలు ఒప్పుకోవు.
రానేరా – నీకు అభిమాన సంఘాలెక్కడ? తెలుగు గడ్డ మీద ఏ బిడ్డ నడిగినా చెబుతాడు, మేము తొడ గొడితే రికార్డులూ, మీసం తిప్పితే రివార్డులూ అని.
పురాణ్ – హూఁ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం తొడ! ఆ మాటకొస్తే ... డైలాగులు మాకూ వచ్చు బాబు... మొక్కే కదా అని పీకేస్తే పీక తెగుతుంది.
రానేరా - నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి వెళుతున్నాడు, వీడెవడా అని బ్రెయిను బద్దలయి చావకు
నా పేరు ఎస్ ఎస్ ఎస్ భవాని ప్రసాద్, శివ శంకర సత్య భవాని ప్రసాద్. ఊరు కారంపూడి ఏరియా పల్నాడు. మా వూరికి నీళ్ల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు. ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. పెరటి గుమ్మం వీధి గుమ్మం . ఏ సైడు నుంచి వచ్చినా సరే. హాలీడే ఆర్ వర్కింగ్ డే. సండే టూ సాటర్డే. ఎనీ డే ఎనీ టైమ్. అయామ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది నేను చెప్పి వస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్!
పురాణ్ - రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలేగాని ఆశ్చర్యపోతారేఁవిటి? రాననుకున్నారా? రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడనుకున్నారా. వారణాశిలో బ్రతుకుతున్నాడు తన వరస మార్చుకున్నాడనుకుంటున్నారా? అదే రక్తం అదే పౌరుషం.
రానేరా – ఊఁ...హూఁ.. నా అడ్రస్ చెబుతా రాసుకో. ఇంటి నెంబర్ వన్. వీధి నెంబర్ వన్. ఎంటీఆర్ కాలనీ. వినిపించిందా? ఇంటి నెంబర్ వన్. వీధి నెంబర్ వన్. ఎంటీఆర్ కాలనీ.
పురాణ్ – (నిజమైన ఆశ్చర్యంతో) వావ్ సూపర్ వుంది డైలాగ్. నేనెప్పుడూ వినలేదే. ..
రానేరా – రెట్రో బాబు రెట్రో. ఏఁవనుకున్నావ్ ?
పురాణ్ – ఎంతైనా రెట్రో రెట్రోనే. ఆ రోజుల్లో నటీనటులకు చిన్న అహాలూ పెద్ద మనసులూ వుండేవి. అంత గొప్ప వారు మల్టీ స్టారర్లలో నటించగాలేనిది. మనం నటించకూడదా?
రానేరా – అవును మనమూ నటించవచ్చు. దర్శక బ్లాగరు గారు మీ సినిమాకి మేఁవ్ సిద్ధం.
పురాణ్ – ఎక్కడీయన? మన సంభాషణకి తట్టుకోలేక పారిపోయినట్లున్నాడు.

అదే సమయానికి ప్రక్కన దర్శక బ్లాగరుకీ వేవిన్‌కీ ప్రయివేటు చాటు.
దర్శక బ్లాగరు – వేవిన్, మేము బ్లాగర్ల సినిమా తీద్దామనుకుంటున్నాం. ప్రముఖ బ్లాగరుగా మీరు మా సినిమాలో కీలక పాత్ర పోషించాలని మా కోరిక.
వేవిన్ – సరె
దర్శక బ్లాగరు – మీకు హీరో పాత్రే ఇస్తున్నాం.
వేవిన్ – …
దర్శక బ్లాగరు – కథేఁవిటంటే...
ఇప్పటి వఱకూ మీ నిజజీవిత కథే కానీ దానికి పొడిగింతగా భవిష్యత్తులో తెలుగు బ్లాగ్లోకంలో ఏ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కథాంశం.
ఒక బ్లాగరుంటారు (మీరే), అతను చెల్లా చెదురుగా వున్న తెలుగు బ్లాగర్లందరినీ ఒక చోటుకి పోగేసి. అంతర్జాలంలో తెలుగును ఒక శక్తిగా తీర్చిదిద్దుతారు. అలా కొంత కాలం తెలుగు సంస్కృతీ సాహిత్యాలు అంతర్జాలంలో వెలుస్తాయి. తెలుగు బ్లాగర్ల సంఖ్య లక్షల్లో, తెలుగు అంతర్జాల వాడకులు కోట్లలో వుంటారు.
కానీ దానిని స్వప్రయోజనాలకు కొందరు దుష్టులు ఉపయోగించుకుంటుంటారు. వాళ్లు ఎలాంటివారంటే... చేతగానివారు, సగటాతి సగటు జనాలు. నిజజీవితంలో వారికి ఎటువంటి ఆరాధనా లేక, తీవ్ర అబధ్రతా భావానికి గుఱైన వారు. వారు బ్లాగులు మొదలు పెట్టి సగటాతి సగటు దినచర్య బ్లాగులు వ్రాసి, మసాలా సఱకు నింపి, హిట్లు సంపాదించుకుంటూ వుంటారు. పవిత్రమైన బ్లాగ్లోకాన్ని కంపు చేస్తుంటారు.
వారి చేతగానితనానికి సిగ్గు పడడం మానేసి, పైపెచ్చు సత్తావున్నవారు వారి సత్తా చూసి సిగ్గు పడాలనీ, దానిని వీలైనంత త్వరలో విడచి సగటు జనాలలో కలవాలనీ వాదిస్తూంటారు.
ఇప్పటికే తెలుగు సినిమాలను పట్టి పీడిస్తున్న మాస్ తత్వం, మెల్లగా బ్లాగుల్లోకి వ్యాపిస్తూవుంటుంది. అప్పటివఱకూ హిట్లతో పనిలేకుండా మంచి టపాలందించిన కొత్తపాళీ వంటి ఆదర్శ బ్లాగర్లు కూడా హిట్ కౌంటర్లు వాడడం మొదలుపెడతారు.
అప్పుడు మన బ్లాగ్లోక రూపకర్త అయిన మీరు, అనామిషుడి అవతారం దాల్చుతారు. చెత్త పోష్టు పడగానే మీరు సృష్టించిన కూడలి బాటు, ఆ టపా మీదకు వెళ్లి, డెస్పికబుల్ అని ఒక వ్యాఖ్య వేస్తుంది.
బ్లాగ్లోకమంతా భయం తో కిక్కిరిసి పోతుంది. అలా మెల్లగా, కవితల బ్లాగులూ, పద్యాల బ్లాగులూ, సమీక్షల బ్లాగులూ అన్నీ మూసుకు పోతూవుంటాయి.
అప్పటికీ లొంగని వారికి మీరు వారి పేరుతోనే అనుకరణ బ్లాగులు ఏర్పరచి, అడ్డమైనా చెత్తా వారి పేరు మీద వ్రాస్తూంటారు. కబుర్లులో వారి పేరుతో వున్న బాటులు చెడుగా పరుషముగా మాట్లాడి, వారికి పరువు నష్టం కలుగజేస్తాయి. ఆఖరికి వారు కూడా తలొగ్గుతారు.
అలా చివరకు ఆఖరి బ్లాగు మూసివేసిన తరువాత, అనామిషుడే వేవిన్ అని మొదటి సారి చూపిస్తాం. ప్రేక్షకులు నివ్వెర పోతారు. ద్వంద్వ వ్యక్తిత్వం (స్పిట్ పెర్సనాలిటీ) గా మిమ్మల్ని అద్భుతంగా చూపిస్తాం.
ఇక అప్పుటి వఱకూ అజ్ఞాతంలో వుంటున్న నిజాయితీ, ఇంటెగ్రిటీ గల బ్లాగర్లు కొత్తగా కొత్త కూడలిని ఏర్పరచుకొని, మళ్లీ గొప్ప బ్లాగులు వ్రాయడం మొదలు పెడతారు. బ్లాగులకు పూర్వ వైభవం నాణ్యతా సంతరిస్తారు.
వేవిన్ – అట్లస్ ష్రగ్డ్ లో హీరో జాన్ గాల్టు పాత్రో లేదా అపరిచితుడిలో విక్రమ్ పాత్రో అని చెబితే సరిపోయేదిగా! సరే...
దర్శక బ్లాగరు – మంచిది నేను వెంటనే స్కరిప్టు వ్రాయడం మొదలు పెడతాను.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

Wednesday, July 23, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

రంగము 3
కబుర్లు గదిలో దర్శక బ్లాగరు, పిల్ల బ్లాగరు, చొఱవ బ్లాగరు.
చొఱవ బ్లాగరు విషయం చెప్పి కథ వివరించడం మొదలు పెట్టును.
చొఱవ బ్లాగరు – అనగనగా బ్లాగ్లోకంలో ఇద్దరు ఆప్త మిత్ర బ్లాగర్లు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక వ్యాఖ్యలు వదలుతూంటారు ఎప్పుడూ. ఎంత చెత్త టపా వేసిన ‘చాలా బాగుంది, కానీయండి’ అని వ్యాఖ్య వదిలేవారు. అలా గోదావరిలో పడవ ప్రయణంగా సాగిపోతున్న వారి జీవితాలలోకి ఒక రోజు అనుకోకుండ ఒక పిల్ల తుఫాను వస్తుంది. ఒక బ్లాగరు టాపాకి ఇంకో బ్లాగరు అస్సలు బాలేదని వ్యాఖ్య వదులుతాడు. అలా వారిద్దరికి గొడవ వచ్చి విడిపోయి ఇఱవై సంవత్సరాల తరువాత కలసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా విడిపోయిన కాలంలో వారిలో ఒకరు విప్లవాత్మక బ్లాగరు గానూ, ఇంకొకరు కూడలి అభిమాన బ్లాగరుగానూ పైకి ఎదుగుతారు. ఇద్దరికీ తెలియకుండా ఆ చెడ్డ విప్లవాత్మక బ్లాగరు మంచి బ్లాగరు చెల్లిని ప్రేమిస్తాడు.
ఇఱవై ఏళ్ల తరువత కలసినప్పుడు, మాటల్లో ఆ కమెంటు వదిలింది అతను కాదని వారు గ్రహిస్తారు. తన పేరుతో ఆ వ్యాఖ్య వదిలిన అనామిషుడు ఎవరా అని తెలుసుకోవడానికి వారు ఒక అపరాధ పరిశోధకుణ్ణి నియమిస్తారు. అలా ఆఖరికి మన కథానాయకులు ముగ్గురూ కలసి, ఆ అనామిషుణ్ణి పట్టుకుంటారు. ఆపై ట్విస్టు ఏంటంటే.. చెడ్డ బ్లాగర్ని మంచి బ్లాగరు కూడలి పెద్దలకు అప్పగిస్తాడు. ఆ ట్విష్టు కూడా సరిపోక పోతే ఇంకో ట్విష్టు ఏంటంటే, ఆ మంచి బ్లాగరు చెల్లెలు అపరాధ పరిశోధకుడూ ప్రేమించుకోవడం మొదలు పెడతారు, చివరకు పెళ్లి కూడా చేసుకుంటారు. అది తెలిసిన చెడ్డ బ్లాగరు బ్లాగుజైల్లో కసితో మండిపోతూవుంటాడు. అదండీ కథ.
దర్శక బ్లాగరు – అద్భుతం, నేను ఈ సినిమా తీయడానికి సంసిద్ధం.
బుడ్డ బ్లాగరు – నేను సహాయ దర్శకుడిగా వుంటానని ఇప్పుడే చెప్పేస్తున్నా.
చొఱవ బ్లాగరు – సరే. అంతకన్నానా.
దర్శక బ్లాగరు – అచ్చంగా ఇలాంటి కథకే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ వుంది.
చొఱవ బ్లాగరు – చెప్పండి.
దర్శక బ్లాగరు – కెమరా సౌరకుటుంబం అవతల, పాలపుంత దాటి ఆండ్రోమడా గాలక్సీలో వుంది. అక్కడి నుండి మనము దాన్ని పాలపుంత మీదకు జూమ్ చేస్తాం.
బుడ్డ బ్లాగరు – ఎంత సమయంలో జూమ్ చేయనున్నారు
దర్శక బ్లాగరు – పది సెకనులనుకో...
బుడ్డ బ్లాగరు – పది సెకనుల్లో కాంతి కూడా అంత దూరం పయనించలేదు, మన కేమరా ఎలా వస్తుంది అంత దూరం. కాంతికే పాతిక కోట్ల సంవత్సరాలు పట్టే దూరాన్ని మనము పది సెకనుల్లో ఎలా లంఘించగలము?
దర్శక బ్లాగరు – సహాయ దర్శకత్వం అంటే తేలికనుకున్నావా. నీ పని కేమరాని అక్కడికి పంపించి, దాన్ని పది సెకనుల్లో మన పాలపుంతకు తీసుకురావాలి. ఆ పని మీద ఉండు, ఈవాళ నుండి. ఇక పాలపుంతలో ఇతర నక్షత్రాలను దాటి, మన కేమరా, సౌరకుటుంబంలో ప్రవేశిస్తుంది.
బుడ్డ బ్లాగరు – పాలపుంతలోని డార్క్ మేటర్ ద్వారా కూడా తీసుకురావాలా.
దర్శక బ్లాగరు – అవును అవన్నీ తప్పించుకొని, సౌర కుటుంబంలో యముడిని దాటి, కుజుని దాటి, అంగారకుణ్ణి దాటి. ఊహించుకోండి, కెమెరా గురు గ్రహం చుట్టూ ఒక్క చుట్టు చుట్టి, మన భూమి మీదకు చంద్రుణ్ణి పక్కకు తన్నుకుంటూ వస్తుంది. భూమికి దగ్గరగా వచ్చాక మనము గూగులు పఠాలు చూపిస్తాం. అందులో జూమ్ అవుతూ, మన కెమెరా, అప్పటికి ఎడారిగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్తాం. అక్కడ ఒక గుత్తేదారూ, రాజకీయనాయకుడూ మాట్లాడుకుంటూవుంటారు. వారి నెత్తిమీదనుండి షాటు కదలి, ప్రక్కనే తవ్వుతున్న గోతిలో కార్మికులు కనిపిస్తారు. వారు త్రవ్వుతుంటే, టఙ్‌ఙ్ అని శబ్దం వస్తుంది. మన కేమరా దానికి అణుగుణంగా వెనక్కి వెళ్లి మళ్లీ క్రిందకు వస్తుంది. ఇంకో కూలీ గుణపం దింపుతాడు, మళ్లీ టఙ్‌ఙ్ అని శబ్దం, మళ్లీ కేమరా అలానే కదులుతుంది. ఏదో పెట్టె తగిలింది. పెట్టెని తెఱచి చూస్తే, వికృతంగా సగం కుళ్లిన కళేబరంతో ఒక శవం కాని శవం. జీవం కాని జీవం. జీవచ్చవం కాని జీవచ్చవం. నడవని నడపీనుగు ఒకటి ...
కట్ చేస్తే...
మన బ్లాగర్ హీరో అప్పుడే “PUBLISH POST” మీద నొక్కి.. వేచియుండమని తిరిగుతున్న ఐకాను చూసి “చత్త్, ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. సరైన బ్రాడ్ బాండ్ కనెక్షన్ కూడా ఇవ్వలేరు, నేను రేపే కొరియన్ ఎంబసీని ఆశ్రయిస్తున్నా“ అనుకుంటుండగా, టపా వేయబడింది అనే సందేశం వస్తుంది.
“VIEW POST” మీద నొక్కగానే. టపా క్రిందే. “Despicable” అని వ్యాఖ్య అప్పటికే వేసి వుంటుంది !
మన హీరో “నో…” అని గట్టిగా అరుస్తాడు. హీరోయిన్ వచ్చి ఏమిటని విచారించగా, హీరో ఆ అనానిమిషుడి కమెంటు చూపిస్తాడు! వారి ముఖాలమీద పడే వెలుతురు ఎఱుపు నుండి పచ్చుకు మారుతుంది. కెమెరాని వారి ముఖాల మీద మూడు సార్లు జూమిన్ జూమౌట్ చేస్తాం! నేపథ్యంలో సంగీతం బిషూ బిషూ బిషూ అని మూడు సార్లు వినబడుతుంది.
చొఱవ బ్లాగరు – అద్భుతం
బుడ్డ బ్లాగరు – అమోఘం. ఇంతకీ ఆ శవ పేటికలో ఉన్నది ఎవరు.
దర్శక బ్లాగరు – అదేగా మరి సస్పెన్సు, అది సినిమా ఆఖరి వరకూ చెప్పం. నేనూ ఇప్పుడు చెప్పలేను. చెబితే కథ లికైపోతుంది. ఇంకెవరైనా సినిమా తీసేస్తారు.
చొఱవ బ్లాగరు – సరే ఐతే ఇక తారాగణం, చర్చించుకుందామా.
దర్శక బ్లాగరు – చెప్పండి. ఎవరెవర్ని పెడదాం.
చొఱవ బ్లాగరు – హీరోలుగా రానేరా, పురాణ్ అనుకున్నాం. ఇక అప్పటికే అనామిశుడి ధాటికి తట్టుకోలేక, బ్లాగులు మూశేసిన వారి జాబితా... చాలా పెద్దదే వుంది. చీమలమఱ్ఱి, శీను, వగైరా వగైరా. వీరికి సినిమాలో పాత్రలు లేక పోయినా, వారి బ్లాగు తెరపట్టుకు దండేసి బొట్టు పెట్టి చూపిస్తాం.
దర్శక బ్లాగరు – బాగుంది. ఇక మన అనానిమిషుడు హింసించి బ్లాగులు మూసేయింప జేసేది ?
చొఱవ బ్లాగరు – మనము ప్రేక్షకుల్లో చాలా బలమైన ఎమోషన్లు రేకెత్తగలగాలి కాబట్టి, అతను అమాయకమైన పిల్ల బ్లాగుల మీదా, అణ్ణెం పుణ్ణెం ఎఱుగని పద్యాల బ్లాగుల మీద అనానిమిషు వ్యాఖ్యలు వదలడం చూపించాలి. ఆ పాత్రలలో మన రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, నన్ను వగైరా చూపిస్తాం.
దర్శక బ్లాగరు – అద్భుతం.
చొఱవ బ్లాగరు– ఇక, పాటల కోసమై స్వాతిగారినీ స్నేహమా రాధికగారినీ, గ్రాఫిక్స్ మఱియూ స్పెషల్ అఫెక్ట్స్ కోసం వెంకటరమణ గారిని, నిర్మాణ నియంత్రణ కోసం తాబాసు గారిని, ఆర్థిక వ్యవహారాల నియంత్రణ కోసం సీబీరావుగారినీ, ప్రచారానికి చావా కిరణ్ణి, క్యాటరింగ్ కోసం జ్యోతిగారిని, సంగీత దర్శకులుగా పప్పు నాగరాజు గారు, నృత్య దర్శకులుగా కొత్తపాళీ. ఇక మిగిలిన బ్లాగర్లందరూ నిర్మాతలు.
దర్శక బ్లాగరు – సరే అయితే వెంటనే అందరినీ సంప్రదించి, కాల్షీట్లు అడగండి. నేను ముఖ్య నటులతో మాట్లాడతాఁ.
బుడ్డ బ్లాగరు – కానీ సార్. ఆ కథ చూస్తుంటే, ‘ఇఱవై ఏళ్ళ తరువాత’ అనే ‘ఓ హెన్రీ’ కథను అనుకరించిన మన తెలుగు సినిమా ‘కృష్ణార్జునులు’ అనే సినిమా యొక్క అనుకరణలా లేదూ? మన నవ’తరం’గ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకం కాదా?
దర్శక బ్లాగరు – అదేం లేదు. అలా ఆలోచించినంత కాలం నువ్వు సహాయ దర్శకుడిలానే మిగిలిపోతావు. ఎవరో గొప్ప వ్యక్తి అన్నట్లుగా, అనుసరించడం తప్పుగాని అనుకరించడంలో ఎటువంటి తప్పూ లేదు.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

Tuesday, July 22, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧

రంగము ౨
కూడలి కబుర్లు గదిలో అమాయక బ్లాగరి, చొఱవ బ్లాగరు, పరాక్రమ బ్లాగరు.
చొఱవ బ్లాగరు – మీరందరూ ‘గొప్ప బ్లాగరు’ గారు సినిమా యజ్ఞానికి పిలుపిచ్చినప్పుడు ఆ మిగిలిన వారందరిలో వున్నారా..
మిగిలిన ఇద్దరూ – ఓ లేకే ఉన్నాం.
చొఱవ బ్లాగరు – అయితే ఇంకేంటి ఆలస్యం వెంటనే సినిమా కథాంశాన్ని నిర్ణయించుదాం.
అమాయక బ్లాగరి – ఒక హీరో వుంటాడు. అతనికి కష్టాలు ఎదురవుతాయి.
పరాక్రమ బ్లాగరు – మీరు మరీ పాత తరహాగా ఆలోచిస్తున్నారు. మనమంతా హీరోయిజానికి వ్యతిరేకం. ఏం సగటు వ్యక్తిని ప్రధాన పాత్రలో చూపిస్తే తప్పేంటి ?
చొఱవ బ్లాగరు – అవును. మనది కొత్త తరం సినిమా. ‘సీ ద చేంజ్ యు వాంటు బీ’ అన్నారు పెద్దలు.
పరాక్రమ బ్లాగరు – అంటే?
చొఱవ బ్లాగరు – అంటే మనం తీసే సినిమా బ్లాకండ్వైట్ కాదు కాబట్టి మన పాత్రలు కూడా తెలుపు నలుపూ కాకుండా అన్ని రంగులలోనూ వుండాలి అని అర్థం.
పరాక్రమ బ్లాగరు - అవును. అంటే దానర్థం మన సినిమాలో పూర్తిగా నలుపు స్వభావంగల ప్రతినాయకుడు వుండడన్నమాట.
చొఱవ బ్లాగరు – నవ’తరం’గం సినిమాలో విలన్ ఒక వ్యక్తి కాదు. ఒక అంశం. ఆ అంశఁవే మన బ్లాగర్లను అతి కరవల పెట్టే అంశం. అనానిమిషుడు.
పరాక్రమ బ్లాగరు – అద్భుతం. మన బ్లాగరు సగటు బ్లగరు. అతనికి తెలుగు సరిగ్గా రాదు, అన్నీ అచ్చు తప్పులే! వ్రాసే రాతలో కూడా అర్థం పర్థం వుండదు.
అమాయక బ్లాగరి – మఱీ బాగుండదేమో. అంటే మామూలుగా హీరోలందరూ చాలా ప్రతిభావంతులు అయివుంటారుగా.
పరాక్రమ బ్లాగరు – అదే నండి మనము మన నవ’తరం’గం సినిమాతో వ్యతిరేకిస్తుంది. ప్రతిభని అందరూ ఎందుకు అలా పూజిస్తారు? చేతగానితనము కూడా ఒక కళే. ప్రతిభకైనా హద్దులుంటాయిగానీ, వెఱ్ఱికి హద్దులుండవని చరిత్ర చెబుతుంది. నన్నడిగితే ప్రతిభావంతులు తమ ప్రతిభని చూసి సిగ్గుపడాలి, దాని చాటుకోవడం మానేసి సర్వదా దాచుకోవడానికి ప్రయత్నించాలి. నలుగురిలో ఒకరిగా బ్రతకలేనివారిది కూడా ఒక బ్రతుకేనా..
అమాయక బ్లాగరి – అవును.
చొఱవ బ్లాగరు – అవును నిజం. ఇంతకీ కథ ఏఁవిటంటే. ఒక సగటాతి సగటు బ్లాగరు, అతని బ్లాగులో ఒక అనానిమిషుడు ‘డెస్పికబుల్’, ‘డిప్లోరబుల్’ వగైరా అని వ్యాఖ్యలు వదులుతూవుంటాడు. అప్పుడతను ఒక అపరాధ పరిశోధకుడని నియమించుకొని ఆ అనానిమిషుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అమాయక బ్లాగరి – ఆ అపరాధపరిశోధకుడిగా పురాణ్ ని పెట్టవచ్చు. ఆ అమాయక బ్లాగరుగా రానేరా ని పెట్టవచ్చు.
పరాక్రమ బ్లాగరు – అద్భుతం. అంతే! మరి ఆ అనానిమిషుడిగా విలన్ని.
చొఱవ బ్లాగరు– విలన్‌కి చాలా సాంకేతిక పరిజ్ఞానం వుండాలి. అప్పుడే మన అపరాధ పరిశోధకుడికి దొరక్కుండా చాలా కాలం తప్పించు కోగలడు.
అమాయక బ్లాగరి – అయితే, ఆ పాత్రకి వేవిన్నే నియమించాలి.
పరాక్రమ బ్లాగరు – వేవిన్ పెద్దగా మాట్లాడరు కాబట్టి, సైలెంట్ సినిస్టర్ విలన్ గా చాలా బాగా సూట్ అవుతారు.
చొఱవ బ్లాగరు– దానికి తోడు, వేవిన్‌ని ముందంతా చాలా మంచి వాడిగా చూపిస్తాం. కొత్త బ్లాగర్లని ప్రోత్సహించి వారి కోసం కష్టపడే వేవిన్ విలన్ అని తెలిసే సరికి ప్రేక్షకులకు కలిగే ఆశ్చర్యం, తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా వుంది!
చొఱవ బ్లాగరు – ఇంత మంచి ఉపాయం మీకు రావడం చూస్తే నాకూ ఆశ్చర్యంగానే వుంది !
ఇంతలో కోపపు బ్లాగరు ప్రవేశింతురు.
అమాయక బ్లాగరి – కోపపు బ్లాగరు గారు, మేమిప్పుడే బ్లాగు సినిమాకి కథ తయారు చేస్తున్నాం.
కోపపు బ్లాగరు – కథా! ఇంకేమీ చెప్పవద్దు. నా దగ్గరో అద్భుతమైన బ్లాగు కథ వుంది. కానీ కథ చెప్పాలంటే ఒక షరతు, నేను చెప్పినవారినే కథానాయకులుగా పెట్టాలి.
చొఱవ బ్లాగరు– ఆ విషయమై...
కోపపు బ్లాగరు – సరే, మీరు పెడతానని మాటిచ్చారు కాబట్టి చెబుతున్నా. ఇద్దురు స్నేహితులుంటారు. వారు గతంలో కలసి బ్లాగేవారు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక "చాలా బాగుంది, కేక, ఇరగదీశారు, ఇలాగే కనీయ్యండి" వంటి వ్యాఖ్య వదిలేవారు, కానీ ఒక రోజు వారిలో ఒకరు ఎడ్డెం బ్లగుకు తెడ్డం అని వ్యాఖ్య వదిలే సరికి వారికి కలహం ఏర్పడుతుంది. విడిపోదలచుకుంటారు. సరిగ్గా ఇఱవై సంవత్సరాల తరువాత, కూడలి కబుర్లలో కలుసుకుందామను కుంటారు. కానీ మధ్యలో ఒకడు మంచి బ్లాగరు గానూ, ఇంకొకడు పరుష పదాలు వాడే సభా మర్యాద తెలియని చెడ్డ బ్లాగరుగానూ మారిపోతారు. ఇఱవై ఏళ్ల తరువాత కలసినప్పుడు మంచి బ్లాగరు, చెడ్డ బ్లాగర్ని స్నేహితుడని కూడా చూడకుండా, హిట్ల కోసం, కూడలి పెద్దలకు పట్టిస్తాడు.
పరాక్రమ బ్లాగరు – సార్ మేము కాపీ కథలను వద్దను...
కోపపు బ్లాగరు – కథ మీకు చాలా బాగా నచ్చింది అంటున్నారు కాబట్టి. ఆ ఇద్దరు హీరోలుగా, రానేరా నీ కేకేశ్వర నీ పెట్టాలి.
కోపపు బ్లాగరు నిష్క్రమింతురు .
అమాయక బ్లాగరి – ఈయని కథ కూడా బాగానే వుంది. పెట్టకపోతే బాధ పడతారు. కాబట్టి దీన్ని కూడా మన కథకు కలిపేసుకుందామా.
చొఱవ బ్లాగరు– బాగానే అంటారేఁవిటండీ! కథ అద్భుతుంగా వుంటేనూ. మనకు ఒక హీరో రానేరా ఎలాగూ వున్నారు కాబట్టి, కేకేశ్వరుణ్ణి కూడా కలిపేసుకుంటే హిట్టే హిట్టు. ఇక పురాణేమో, అపరాధ పరిశోధకుడిగా నటిస్తాడు, అంతే...
పరాక్రమ బ్లాగరు – ఇది నవ’తరం’గానికి వ్యతిరేకం. నేను ఖండిస్తున్నాను.
చొఱవ బ్లాగరు – సరే అయితే మీరు చూడవద్దు సినిమా. మేము కథ పట్టుకుని దర్శకుడి దగ్గరకు వెళ్తాం.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

Monday, July 21, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧

ఇది టాపా కాదు. ఇది కథ కాదు. ఇది సినిమా కాదు. ఇది ఒక ప్రహసనం!

గమనిక: ఈ కథలో వ్యక్తులూ, సందర్భాలూ, సంభాషణలూ అన్ని కేవలం కల్పితం. వాటిలో వేటితోనైనా మీకు నిజ జీవితంలో పోలికలు కనిపిస్తే అది కేవలం కాకతాళీయం కాకపోయినా అది నా కల్పనా శక్తి యొక్క గొప్పతనం మాత్రమేనని గమనించగలరు.

తెలుగు బ్లాగర్లకు కళాభిమానం ఎక్కువ. వారు అన్ని విషయాలలోనూ గొప్ప తనాన్ని కోరుకుంటారు. ఎంతో నాణ్యత వుంటేనే గానీ ఏ కళాఖండమూ వారి మెప్పు పొందలేదు. ఇప్పుడు వచ్చే మతి లేని సినిమాలకు తట్టుకోలేక, మంచి సినిమాలు కావాలంటే వారే సొంతంగా తీసుకోవాలి అని గ్రహించారు. ఆ ప్రయత్నంలో వారు పడ్డ అపసొపాల సారమే ఈ టపా క్షమించాలి, కథ అయ్యో కాదు కాదు ప్రహసనం!

అది ౨౦౦౮ వ సంవత్సరం, కూడలికి కొత్త లాంఛనాలు కలుపుకుంటూ పోయారు కూడలి కర్త వీవెన్. దానిలో భాగంగా కూడలి కబుర్లు పూర్తిగా వీడియో వెర్చుయల్ రియాలిటీ ఆధారిత చాట్ సౌకర్యంగా మార్చబడ్డది. అలా...

రంగము ౧

కూడలి కబుర్లలో ఒక సాయంత్రం ఒక సూపరు స్టార్ బ్లాగరు, ఒక వంద ఎక్ట్రా బ్లాగర్లూ (జూనియర్ ఆర్టిస్టు స్థాయి వారు) గుమిగూడారు అకారణంగా (అచ్చు మన సినిమాల్లో జరిగినట్లు). కాబట్టి సంభాషణతో తదేక మవ్వాలంటే మీరు, ఎంటీవోడితో పాటు ఒక వంద మంది ముక్కూ మొఖం తెలియని జూనియరు ఆర్టిస్టులను ఊహించుకోండి.

ఇక సంభాషణ ప్రారంభం.

గొప్ప బ్లాగరు: బడా బాబుల కాలం చెల్లిన ఈ రోజుల్లో కూడా ఎవరో పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలూ తీస్తారనుకోవడం, వాటి కోసం ఎదురు చూడడం వట్టి మూర్ఖత్వం. అంతర్జాలం వచ్చింది, దానితో పాటు సామాన్య మానవులకు ఎన్నో సుదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు, మనమందరం కలసి వికీపీడియా ఏర్పరచుకున్నాం. దాని వెనక పెద్ద వ్యాపార వ్యవస్థలూ లేవు, డబ్బున్నవారూ లేరు. సమాచారం కావలసినవారందరూ తమకి కావలసిన సమాచారాన్ని అక్కడ వ్రాస్తున్నారు, అందరూ అలా వ్రాయబట్టి ఈనాడు వికీపీడియా, శత కోట్లలో నిఖర లాభం వున్న గూగుల్ వంటి గూళ్ళకంటే కూడా ముందుకు దూసుకు పోయింది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే...

అది ఒక కళ, దాన్నుండి సొమ్ము చేసుకోవాలనుకోవడం పెద్ద పాపం. కళను అమ్ముకోవడం పాపం అని శాస్త్రం చెబుతుంది. ఆలాంటి కళని స్వప్రయోజనాలకోసం అమ్ముకునేవారిని క్షమించరాదు. వారికి వ్యతిరేకంగా మనం సమ్మె లేపాలి, వారి సినిమాలని బహిష్కరించాలి. పోనీలే చిరంజీవి తనయుడు వున్నాడుగా అనుకుంటూ అలాంటి సినిమాలు చూడడం క్షమించరాని నేరం మఱియూ కళావారసత్వాన్ని పెంపొందించే పాపమే అవుతుంది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : దానికి నేనేమి ప్రతిపాదిస్తున్నానంటే...

మన బ్లాగర్లలో అనేక మంది ప్రతిభావంతులు వున్నారు. మనమందరం పూనుకొని కృతజ్ఞతలు అనే పదానికే వాత పెట్టి దాన్ని నెనర్లుగా మార్చేశాం. మనం తలచుకుంటే ఏదైనా చేయగలం. అంతటి ప్రతిభావంతులం కూడా భక్తికీ బక్తికీ తేడా తెలియని అలగా సినిమా జనం నుండి మనోరంజనం ఆశించడం మూర్ఖత్వం. మన బ్లాగర్లలో డబ్బున్నవాళ్లూ వున్నారు.

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : సినిమాలోని సాంకేతిక విషయాలు తెలిసినవారున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : అందగాళ్లున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఇక అందగర్తెల విషయం నాకు తెలియదు. ఏ విషయానికావిషయం చెప్పుకుంటే, మన బ్లాగులోకంలో అందగర్తెలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఆ మాట కొస్తే ఆంధ్రాలోనే పెద్దగా అందమైన అమ్మయిలు లేరు.

మిగిలిన వారందరూ : అవును లేరు

గొప్ప బ్లాగరు : అందమైన అమ్మాయిలందర్ని వెనక పరశురాములవారు, తీసుకెళ్లి సముద్రాన్ని వెనక్కి నెట్టి, వారి కోసం పరశురామక్షేత్రమును సృష్టించి వారందరికీ ఆ భూలోక స్వర్గాన నివాసం కల్పించారు. అందుకే ఇప్పటికీ శోభన నుండి గోపిక వరకూ మనము అక్కడ నుండే తెచ్చుకున్నాము. మనఁవే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆదర్శాంగన (మోడల్) పద్మాలక్షి కూడా మలయాళీ అవ్వడం దీనికి ఋజు౨వు.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : కానీ అలా అని మనం మలయాళీ అమ్మయిలను ఆశ్రయించలేం. మనమే ఎక్కడునుండైనా నటీమణులను తెచ్చుకోవాలి.

మిగిలిన వారందరూ : ఇప్పుడెలా?? అవును ఇప్పుడెలా??

గొప్ప బ్లాగరు : అది పెద్ద సమస్యకాదు. మన దేశాన నాటికలకున్న అనుపమాన చరిత్రను పరీక్షిస్తే మనకు కొట్టొచ్చేట్టు అర్థమయ్యేదేఁవిటంటే, అందమైన మగవాళ్లు స్త్రీల పాత్రలు కూడా వేయగలరు. స్త్రీల పాతలు స్త్రీల కంటే కొందరు మగవాళ్లకే బాగా నప్పుతాయి. అంతటి జగన్మోహనులు మన బ్లాగర్లలో కూడా వున్నారు .

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఎవరు ఉన్నారు?

మిగిలిన వారందరూ : అవును ఎవరు ఉన్నారు ?

గొప్ప బ్లాగరు : మీకూ తెలియాదా? అది పెద్ద సమస్యకాదు. ఒకరి దస్తూరి చూసి వారు అందంగా వుంటారో లేదో ఎలా చెప్పాలనేది మన వేదాలలో వ్రాసి వుంది. వేదాలన్నీ ఆపోసన పట్టినవాడిగా నాకది పెద్ద సమస్యకాదు.

మిగిలిన వారందరూ : అవును మీకది పెద్ద సమస్య కాదు.

గొప్ప బ్లాగరు : నా లెక్కల ప్రకారం, రానేరా బ్లాగులో ఖతీ, కేకేశ్వర బ్లాగులో ఖతీ చూస్తే వారిద్దరూ చాలా అందంగా వుంటారని అనిపిస్తుంది. కాబట్టి వారిద్దరినీ మనము స్త్రీల పాత్రలు వేయమని అడగవచ్చు.

మిగిలిన వారందరూ : అవును అడగవచ్చు

గొప్ప బ్లాగరు : కానీ వారు నిరాకరిస్తేనో..

మిగిలిన వారందరూ : అవును నిరాకరిస్తేనో.

గొప్ప బ్లాగరు : హూఁ.. నిరాకరించకూడదు. ఎందుకు నిరాకరిస్తారు. మనము బ్రతికేదే నలుగురి కోసమూ. ఆ నలుగురూ లేనిదే, మన జీవితాలకు అర్థఁవే వుండదు. మన ఇష్టాయిష్టాలు భ్రమ మాత్రమే, నలుగురికీ కావలసినది చేయడమే మన ధర్మం. నలుగురూ పండించిన తిండి తింటూ, వారు కట్టిన మఱుగుదొడ్లలోనే దాని వికృతంగా మార్చి విసర్జిస్తూ, వారికి సంతృప్తినిచ్చేవి చేయకపోవడం దారుణం.

మిగిలిన వారందరూ : అవును దారుణం

గొప్ప బ్లాగరు : ఇక రచయితలంటారా, బ్లాగులలో కథలు రాసేవారికి కొదవ లేదు. వద్దన్నా కథలు వ్రాసి చదవమంటూ మన మీదకు తోయడం ఎప్పుడూ జరిగేదేగా. కాబట్టి రచయితలుగా మిగలిన వారందరూ పోటీ పడతారు.

మిగిలిన వారందరూ : అవును మిగిలిన వారందరూ!

గొప్ప బ్లాగరు : డబ్బుల విషయానికొస్తే.. ఇందాక మనం అనుకున్నట్టు కళకు డబ్బు వ్యతిరేకం. కాబట్టి ఈ సినిమా తీయడానికీ, నటించడానికీ, చూడడానికీ దేనికీ డబ్బులు తీసుకోకూడదు. డబ్బు తీసుకోవడం మహాపాపం, వారు కళామతల్లి సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనవుతారు. వారి సంతతికి లెక్కలూ, అనెలెటికల్ రీజనింగ్ రాకుండా పోతాయ్, అలా అవడం చేత వారు మృదులాంతకకర్తలు కాలేరు! సాఫ్టువేరోడిని లేదా సాఫ్టువేరుదాన్ని కనని పాపానికి వారికి మృదులాంతక నరకం తప్పదు.

మిగిలిన వారందరూ : అవును నిజం. అలాంటి వాళ్లు మట్టికొట్టుకు పాతారు.

గొప్ప బ్లాగరు : ఇంకేఁవిటి ఆలస్యం, వెంటనే మన డబ్బుతో మన దర్శకరచయితలతో మన నటీనటులతో సినిమా తీద్దాం.

మిగిలిన వారందరూ : అవును వెంటనే సినిమా తీద్దాం. పదండి, పదండి.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

Friday, June 27, 2008

ಮಹಾ ಯೋಗಿ ವೇಮನ ರಸ್ತೆ - ఎందుకు ఏఁవిటీ ఎలా


యోగి వేమన గారి మీద టపా కాబట్టి ఈ టపా చదవడానికి మీకు వేమన ఖతి (ఫాంటు) అవసరం. దాన్ని ఇక్కడ నుండి దింపుకోగలరు.
బెంగుళూరులో మహా యోగి వేమన రస్తె అని ఒక రస్తె వున్నది. అది కోరమంగలం అనే మోస్టు హాపెనింగు ప్లెసులోఁ. అది ఎందుకుంది ఎలావుంది అన్నదాని మీద నా సిద్ధాంతం. మహా యోగి వేమన రస్తె అని చూసి మా బఘరోబ్లాస (బన్నేరుఘట్టా రోడ్డు బ్లాగర్ల సంఘం) మిత్రులు చాలా మంది సంతోషపడడం జరిగింది. అలానే వారు ఆ పేరు ఎలావచ్చింది అని అడగడం కూడా జరిగింది. వారి కోసం ఈ సమాధానం.

ఊరికే నాలుగు లైన్లలో సమాధానం ఇస్తే అది నా టపా ఎదుంకౌతుంది. అసలే, తెలుగు బాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం కౢప్తం దీనికి రెండు కారణాలున్నాయి.
౧) ఇందులో ఌ వుంటుంది. దాన్ని వ్రాయడం చాలా కష్టమవుతుంది కంప్యూటర్లలో. దాన్ని నాలా తాపత్రయ పడి వ్రాసినా అది సరిగా కనబడి చావదు.
౨) నాకెందుకో ఏదైనా కౢప్తంగా చెప్పాలంటే ఇష్టముండదు. నాకూ తెలియదు ఎందుకో.

కానీ మీకు చాదస్తం కాస్త ఎక్కువ అవడఁవో, లేదా మీకు అనుభవాహ్వానాత్మకత తక్కువవడఁవో లేదా తెలుగు భాషలో మీకు నచ్చని ఒకేఒక్క పదం నివిడి అయితేనో, లేదా ఌ మీ ఇష్టాక్షరమైతేనో, మీకు నా కౢప్త సమాధానం.
మహా యోగి వేమన రస్తె కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కోరమంగల రెడ్డిజన సంఘ వారు తెవికీ చదవలేదు కాబట్టి.


ఇంతకీ అసలు విషయానికొస్తే,
బెంగుళూరులో ఉత్తరం వైపు వెళితే, మన అనంతపురం వస్తుంది. వీళ్లు దాన్నే అనంతపుర అంటారు సిరిగన్నడంలోఁ. అలానే ఇక్కడి నుండి తూర్పు వేపు వెళితే మన కుప్పాం వస్తుంది. దీన్ని వీరు కుప్పావు, లేదా కుప్ప అని అనాలి సిరిగన్నడంలో, కానీ మామూలు కన్నడం లో దీన్ని కుప్పాం అనే అంటారు, పలకడం మాత్రం కుప్పామ్ అని పలుకుతారు. ఆగ్నేయం వైపు వెళితే, మీకు హోసూరు వస్తుంది. దీన్ని అరవంలో హోసూర్ అంటారు. తెలుగన్నడాల్లో హోసూరు అంటారు. అసలైతే సుందరతెలుఁగులో దీన్ని కొత్తూరు అనాలి. కానీ తెలుగులో హోసూరు అనే అంటారు. హోసూరులో కూడా తెలుగు జనాభా బాగా హెచ్చు. సుందరతెలుఁగులో పెచ్చు అనాలి, ప బదులు హ వస్తుంది సరికన్నడంలో కాబట్టి వారు హెచ్చు అంటారు. కానీ మూములు తెలుఁగులో హెచ్చు అనడం పర్వాలేదు.

అన్నట్టు నేను చాలా నాళ్ళ నుండి హ తెలుగు అక్షరమా లేదా సంస్కృతం నుండి తెచ్చుకున్నదా అని ఆలోచించసాగాను. కన్నడిగులకైతే కచ్చితంగా హ వుంది బాషలోఁ, కనీ నాకింత వఱకూ హ కలిగిన అచ్చ తెలుగు పదం ఒక్కటి కూడా కనబడలేదు. హవ్వ హవ్వ ఎంత అపచారం! హూఁ .. ఆలోచించకుండానే హవ్వ మఱియూ హూఁ అనుకుంటూ హెచ్చు తెలుగు పదాలు తగలనే తగిలాయనుకోండి. మీకు హవ్వ మఱియు హూఁ తప్ప వేరే ఏఁవైనా హ గలిగిన తెలుగుపదాలు కనబడితే చెప్పగలరు.

ఇంతకీ మనం ఎక్కడున్నాం హోసురులో గద. మొత్తానికి ఉత్తరాన అనంతపురం, తూర్పున కుప్పం, ఆగ్నేయాన హోసురు కలగడం వల్ల బెంగుళూరులోని తూర్పు, ఉత్తర, ఆగ్నేయ, దక్షిణ, ఈశాన్య, వాయువ్య దిక్కులలో తెలుగు జనాభా చాలా ఎక్కువ. వెనకటికి రాయలసీమ నుండి ఇక్కడికి చాలా మంది వచ్చి స్థిరపడ్డారు. వారి కిప్పుడు తెలుగు వచ్చుగాని, మాట్లాడితే మీలాంటి వారికి కోపం వస్తుంది. నా మాతృభాషని వీడిట్లా హింసిస్తున్నాడేంటని. కానీ వారిది కూడా అది మాతృభాషని మరువకూడదు మీరు. ఇప్పటికీ ఇక్కడ తెలుగు వారమంటే, రెడ్డవరా, నాయిడవరా అని అడుగుతారు. దానికి మీరు బేరవరం అని సమాధానం చెప్పవచ్చు. లేదా సాఫ్టుబేరవరం అనైనాఁ జెప్పవచ్చుఁ.

అందుకే ఇక్కడ పేర్లు వేంకట రెడ్డి నగర, ఆలపాటి వేంకయ్య రస్తె, రామలింగారావు ఉద్యానవన వంటివి తఱచుగా వినబడతాయి. అలాంటి ఒక రస్తెనే మన మహా యోగి వేమన రస్తె.


ఇక ది మోస్టు హాపనింగ్ ప్లేస్ ఇన్ బెంగుళూరైన మన కోరమంగలకి తిరిగవస్తే, (అన్నట్టు దీన్ని కూడా అచ్చ తెనుగులో కోరమంగలం అనాలని గుర్తుపెట్టుకోగలరు) ఇక్కడ రెడ్లు జాస్తి. మన యోగి వేమన రస్తెలో రెడ్డి జన సంఘ (రెడ్డి జనాల సంఘం) కూడా వుంది. (ఇప్పుడు ఆ భవనం మఱియూ దాని చుట్టు ప్రాంగణం మొత్తం శతకోట్లలో వుంటింది ఖరీదు. కానీ నాలుగు తరాల క్రితం మన రెడ్డి జనరు సంఘ హాకినప్పుడు, ఆ భూఁవి వారికి ఊరకునే వచ్చినా వ్చచియుండవచ్చుఁ. )

ఇప్పటికే మీలో కొందరు పిల్లలు, నాకు తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, నేను చెబుతా, నేను చెబుతా అని గాలిలో చేతులు ఆడిస్తున్నారు. అందరూ మీ అంత చూఱుకు గాదు గావట్టి నేనే మెల్లగా అందరికీ అర్థఁవయ్యేట్టు చెబుతా ఆ యోగి వేమన రస్తె ఎలా వచ్చిందో. యోగి వేమనగారు భోగిగావున్న నాళ్ళు ఆయన పేరు ... పేరూ... ఒక్క నిమిషం - అక్కడే ఉండడి నేను వెళ్ళి వికీ చూసి వస్తాను.. వెల్ ... హూఁ ... వికీ పెద్దగా ఉపయోగపడలేదు! ఏదో రెడ్డిగారు మొత్తానికి. కాబట్టి కోరమంగలంలోని అంత పెద్ద సంఘం వున్న మన రెడ్డి జనరు. వారు ఉన్న వీధికి తమ వాడైన, మన వాడైన యోగి వేమన గారి పేరు పెట్టుకున్నారు. ఔరా అద్భుతము గదా రాకేశ్వరుండి ప్రతిభ అనుకుంటున్నారా.
ఏదో నా దయా మీ ప్రాప్తం.. అసలే మొహవాటస్తుడని మఱీ పొగిడి వేయవద్దు. (మొహవాటం - ఇది సంస్కృతం నుండి వచ్చింది, లేదా వచ్చిన దానిఁవల్లే వుంది కాబట్టి నా 'హ ప్రశ్న'కు ఈ పదం సూచించరాదు).

మీ యోగి వేమన ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తూ శలవు.
--------------------------------


ఇప్పుడే అందిన తాజా౨ వార్త. కోరమంగలంలోని హోసురు రోడ్డులో నున్న ఫోరం మాల్లో రెడి సినిమా రెండో సారి చూడడానికి వెళ్ళి, "సినిమాకి రెండువందలా నిష్టూరంగానూ" అనుకుంటూ నోరు తెఱుచుకుబెట్టి జనీలీయా పోస్టురుకేసి చూస్తూ సంతృప్తి పడుతున్న మా రిపోర్టర్ రానారె లైవ్ రిపోర్టింగ్... కాస్కోండి!

రానారె బెంగుళూరులో అతిప్రభావవంతులు (influential కి వచ్చిన తిప్పలు) మఱియు అతిసంపన్నులైన నాయిడురెడ్డివారిలో ఒకరిగా ఈ విషయమై మీ అభిప్రాయం ?

అతి సంపన్నులు - ఆ మాతు తుంబ సక్కగా సెప్పి యుండారు సదువరిగారు. మామూల్గా మా అంతవరిగె మనేల్లో (ఇండ్లల్లో) తినేదానికి కూడా సరిగా తిండి సిక్కేదిలేదు. హైహెచ్చు సినిమాకి ఇరడునూరు రూపాయిలంటావుండారు. సెప్పటిదేంటంటే, మన జగనన్నుండలే, ఆయన దగ్గర తుంబా కాసులు ఉండాయ్, కోరమంగలలో తుంబ జమీనూ కూడా ఉండాది అవరిగె, ఒక మాలు కూడా వుండాది అవరిగె ఈకడ. మిక్కిలిన రెడ్డి జనరదంతా కూడగట్టినా ఆయనలో అర్ధ కూడా జేయలేం. కాబట్టి ఆయన ఒక్కవన వల్ల మన రెడ్డవరిక్కడ సగటున ఇందాక మీరు అంటాండారే బాళా కాసవరని, అదన్న మాట. ఇక మన నాయిడురెడ్డి వారి బగ్గె సెప్పాలంటే, ..


రానారె గారు, ఇప్పటికే కార్యక్రమం నివిడి ఎక్కువైపోతుందని ప్రేక్షకులు అంటున్నారు. కాబట్టి మహా యోగి వేమన రస్తె విషయానికి వస్తే..

ఆ రస్తె ఇషయమై, వికీలో సూడంగా గొత్తయ్యిందేంటంటే,
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1650 - 1750 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వాడు అని, గండి కోట దుర్గాధిపతులకు సంబంధం కలిగినవాడని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు.కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించాడని అంటున్నారు. ఇతని జన్మస్థలం పేరు "మూగచింతపల్లె" కావచ్చును.
అన్నట్టు మీకో ఇషయం గొత్తా సదువుఱ్ఱిగారు మా మనె వుండాది ఆ రస్తె పక్కదల్లే, మేఁవు.. <బీఈఈప్>

విన్నారుగా కోరమంగలం నుండి మా రిపోర్టర్ రాకేశ్వర నాయిడు రెడ్డి లైవ్ రిపోర్ట్. క్లుప్తంగా చెప్పాలంటే,
మహా యోగి వేమన రస్తె కి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కోరమంగల రెడ్డిజన సంఘ వారు తెవికీ చదవలేదు కాబట్టి.

Sunday, June 22, 2008

కాపలాదారు

కాపలాదారు కాఁవుడు కుర్చీలో కూర్చున్నాడు
కాపలా కాస్తున్న కార్యాలయం కాళీగానే వుంది
కఛేరి కాళీ చేస్తున్న జనాలకు రోజు ముగిసింది
కాఁవుడికి కొత్తగా వచ్చిన రాత్రితోఁ రోజు మొదలైంది

ఆఫీసు పనిని అక్కడే విడువలేక
బుఱ్ఱవెనుక పదిలంగా బధ్రపరచి
ఇంటికి తమగూడా ఎత్తుకెళ్ళారు
వారు వదిలిన కాళీకి కాఁవుడు కాపల

రేపు వచ్చే వారం వచ్చే మాసం వచ్చే ఏఁడూ
వస్తాయో రావో తెలియని వాటి కోసం
ఉద్యోగుల దగ్గర వున్నాయి ప్రణాళికలు
పిలవని వారు పిలిస్తే పలకడానికున్నాడు కాఁవుడు

అంతరాళంలోనికి ఎగిరిపోవాలని నిత్యం
ప్రాకులాడే వారి బ్రతుకులు ఇసుకలో
కూరుకుపోకుండా కాపాడడానికి అలికిన
చలనం లేని మైదానం వాడి జీవితం

కాఁవుడి తండ్రి మైసయ్య కాపలాదారు
మైసయ్య అయ్య సిద్దప్ప కాపలాదారు
మైసయ్య మైసూరు బ్యాంకును కాసాడు
సిద్దప్ప మహారాజ అరమనె కాసాడు

కాఁవుడికి వాడితాత కాసింది రాజుగార్నని తెలుసు
సిద్దప్పకి వాడి తాత కాసింది నంజుండేశ్వరుణ్ణననీ తెలుసు
వీరిద్దరికీ తెలియని కాపలాలు వేలల్లో వున్నాయి
వందలేండ్లుగా వీరి తాతలు కాస్తూనే వున్నారు

దేవాలయాలను దరిద్రులనుండి కాసారు
పరమేశ్వరుణ్ణి కాసారు వీరు నిష్ప్రయోజకత్వం నుండి
మహారాజభవనాల్ని మన్నుకాపుల నుండి కాసారు
రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి

బ్యాంకుల్ని బడుగుబ్రతుకుల నుండి కాసారు
ధనవంతుడిని కాసారు వీరు దానధర్మం నుండి
ఇన్‌ఫోసిస్ని ఇతరులనుండి కాఁవుడు కాసాడు
సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి

బ్రాహ్మల్ని కాసారు వైశ్యుల్ని కాసారు
దేవుణ్ణి కాసారు దానవుల్నీ కాసారు
డబ్బుగా దాయబడ్డ అక్రమాల్ని కాసారు
నీతిగా ముసుగు దాల్చిన అత్యాచారాన్ని కాసారు

తమని తాము సమానత్వం నుండి
తమ పిలల్ని చదువు సంస్కారం నుండి
తమవారిని ఐకమత్యం నుండి
తమ భయాల్ని ధైర్యం నుండీ కాసారు

ఒడాయారు రాజుగారు సిద్దప్పనెఱుగడు
ఆయని గుమస్తా ఎఱిగిన వంటవాడు మాత్రం ఎఱుగును
నారాయణ మూర్తిగారు కాఁవుడినెఱుగడు
ఆయన నియమించిన పెదకాపలాదారు మాత్రం ఎఱుగును
వీరి తాతలను వీరు సైతం ఎఱుగరు
ఆయనకే తెలియాలి ఆ నంజుండేశ్వరుడైనా ఎఱుగునో లేదో

తమనెరుగని వారిని తామెరగని వాటినుంచి కాసారు
మెదడులో వారికీ వీరికీ మధ్యలో గీతలు గీసారు
రూపును బట్టి వారికిచ్చే చూపులు మార్చారు
వేషం బట్టి వారితో సంభాషించే భాషను మార్చారు

కాసి కాసి కాలం కట్టిన గోడలలో ఇటకలైపోయారు
వేచి వేచి వానలో తడిసారు ఎండలో ఎండారు
సంస్కరణతో కూలిన గోడలతో పడుతూనే
కౌటిల్యం కట్టిన గోడలతో పైకి లేచారు

గోడవతలివారికి వీరు కానరారు
గోడివతలివారికి వీరు నచ్చరారు
ఆదర్శవాదులకు వీరు శత్రువులు
ఆచరణాత్ములకు వీరెందరైనా సరిపోరు

టోపీ పెట్టినా టై కట్టినా వీరు మాత్రం నిర్విరామంగా కాసారు
జీవితాలు గడచినా వ్యవస్థలు కూలినా వీరు ఇంకా కాస్తారు
మారుతున్న మార్పులో మారనిది వీరి కాపలా మాత్రఁవే
ఎవరిని ఎప్పుడు ఎందుకు కాసినా వీరు కాసింది వ్యవస్థను

తమని లోనికి రానివ్వని వ్యవస్థను
తమ ఉనికి ఎరుగని గాఢ నిద్రలను
తమను ప్రతిష్టించిన నిధులను
తమ ప్రాణంకంటే పదిలంగా
తమనుండి తమలాంటి
తమవారినుండి కాసారు

తమ నీడ అంతఃకొలనుపైఁ బడకుండా
తమ శబ్దం సెన్సెక్సు శ్రుతి తప్పించనీకుండా
తమ అభిమానం గోడెత్తుకు ఎదగకుండా

కాపలాదారు పై అనివార్యంగా ఆధారపడ్డ వ్యవస్థను
కాపలాదారు కులం నుండి కాపలాదురు కాస్తాడు


-------------
౧) అరమనె - మైసూరు ఒడయారు రాజుల ప్రఖ్యాతిగాంచిన రాజభవనం
౨) నంజుండేశ్వరుడు - మైసూరు దగ్గరలో నంజనగాడులో వెలసిన నీలకంఠేశ్వరుడు
౩) ఇన్ఫోసిసు - మైసూరువాసి నారాయణమూర్తిగారి ఇన్ఫోసిసు
సుందరమైన క్యాంపసు సుప్రసిద్ధం

ౘ ౙ ( చ౨ జ౨ ) ౩౦ ఏప్రిలు ౨౦౦౮ నాటికి

గూగులు గుంపులకు నా వేగు

నమస్కారం,

నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడ్డాది. నేను రెండో చ౨ మఱియు రెండో జ౨ వ్రాయాలనుకుంటున్నాను (రెళ్ళు నెత్తిమీదవుండాలి వాటిని ప్రక్కన పెట్టవలసివచ్చింది - అదే సమస్య). దానికి ఉన్న పరిష్కార మార్గాల గుఱించి.

౧) కొలిచాల (కొలిౘాల) గారు అవి యూనీకోడుకు జతచేశారు అని ఒక మెయిలు పంపారు.
అందులో ఒక పీడీఎఫ్ కూడా వుంది. అందులో చ౨ కి 0C58 మఱియు జ౨ కి 0C59 కేటాయించారని వుంది.
ఆ మెయిలు వచ్చి ఏఁడున్నర అయినా ఇప్పటికీ వాటిని ఎక్కడా వాడడం చూడలేదు. వాటిని పూర్తిగా చూపించగల ఖతులు కూడా లేవనుకుంట. గౌతమి వాడే వారికి ౘ ౙ కనిపించడం వారి కంప్యూటరులో పోతన, వేమన ఖతులు వున్నవాలేవా అన్నదాని మీద ఆధార పడివుంటుంది. అలానే వాటి గుణింతాలు ఉదా - ౘు ౙు.పోతన వాడే వారికి ౘ ౙ బానే కనిపిస్తాయి గాని, వాటికి గుణింతాలు చేర్చినపుడు సరిగా కనబడవు. ఉదా - ౘు ౙు. వేమన వాడే వారికి ౘ ౙ బానే కనిపిస్తాయి గాని, వాటికి గుణింతాలు చేర్చినపుడు సరిగా కనబడవు. ఉదా - ౘు ౙు.మీరు వేంటనే పోతన మఱియు వేమన ఖతులు తెచ్చుకోండ ఇక్కడి నుండి. అలానే మంటనక్క మూడులోఁ ఇవి ఇతర విహరుణులకంటే బాగా కనబడతాయి.

౨) టైపు చేయడానికి నేను inscript వాడతాను కాబట్టి, నా కీబోర్డులో Alt Gr + చ = చ౨ (ౘ) గా మార్చగలను అది పెద్ద సమస్య కాదు. మిగిలిన వారు ఈ సమస్యను ఎలా అధిగమించగలరో తెలియదు.

౩) ముఖ్యమైన విషయఁవై, బ్రౌణ్యంలో జ౨ / ౙ ని చూపించడానికి వారు 0C5B (0C59 కి భిన్నంగా) వాడుతున్నారు. ఉదా - ఈ పేజీచూడండి. అది ఎందుకు అలా వాడారు అన్నది మీకు అర్థమవ్వాలంటే దానికి అదే పేజీని దేవనగరిలోచూడండి. దేవనగరి ज़ 095B కడ వుండండచేత అలా చేశారు.

ఇంతకీ దీని గుఱించి మనము ఏమి చేయగలము ? నేను చ౨, జ౨ (ౘ ౙ) లు గలిగిన ఒక టపా వేయాలను కుంటున్నాను. నేనే చేసే భాషా పరిశోధనకి అది చాలా అవశ్యం. ఇప్పటికే నా భాషా పరిశోధనకు తెలుగు భాష మీద నాకు పట్టు లేక పోవడం పెద్ద అవరోధంగా మాఱింది, దానికి తోడు ఇలా సాంకేతిక ఇబ్బందులు రావడం గోరిచుట్టుపై రోకటిపోటే అవుతుంది. ఇక ఆచం౨ట కఌప్త (ఆౘంట కౢప్త) అని పరు ఉన్నవారైతే తమ పేరుని కంప్యూటరులో చూసుకునే
భాగ్యానికి కూడా నోచుకోలేరు పాపం!

ఈ అంశం మీద మీకు తెలిసింది, అది కాని పక్షాన తోచింది వ్రాయగలరు.
ముఖ్య గమనిక - "పాత అక్షరాలను ఎందుకు వాడడం", "ఈ కాలంలో వాటికి స్థానం లేదు" మొదలైన అంశాలను లేవనెత్తవద్దని మనవి. నా సందేహాలు సాంకేతికాంశాల గుఱించి అని గుఱుతుపెట్టుకోగలరు.

మీ,
రాకేశ్వర

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యంగారి జవాబు
రాకేశ్వర గారి సమస్యకు పరిష్కారం నాకూ తెలియదు. అయితే ఆయన సమస్యే నా సమస్య కూడా. ప్రస్తావన వచ్చింది కాబట్టి రాస్తున్నాను.
వేటినీ పాత అక్షరాలు అనడం సరికాదు. అభ్యుదయవాదులమనుకుంటున్నవారు పాత అక్షరాలని ప్రచారం చేస్తున్నవన్నీ లక్షణంగా లక్షలాదిమంది యొక్క ఉచ్చారణలో నిండుగా బతికే ఉన్న అక్షరాలు. పైగా భాషకు అప్పుడూ అప్పుడూ ఖచ్చితంగా అవసరమైన అక్షరాలు కూడాను. వ్యర్థంగా అకారణంగా సంప్రదాయాన్నీ ద్వేషించడం మంచిది కాదు. తెలుగు విషయంలో ఇలా ప్రవర్తించేవారు ఇంగ్లీషు దగ్గరికొచ్చేసరికి 17 వ శతాబ్దంనాటి చెత్త స్పెల్లింగులు వాడుతున్నారని గమనించాలి. వారు ఇంగ్లీషులో ఉన్న silent letters గుఱించి గానీ ఒకే అక్షరంతో అనేక ఉచ్చారణల్ని సూచించాల్సి ఉన్న దుఃస్థితి గుఱించి గానీ ఏ
విధమెన విప్లవాలూ లేవదీయరు. అలాగే, తెలుక్కి సంబంధించి వీర వ్యావహారికవాదులైనవారు ఇంగ్లీషు దగ్గరికొచ్చేసరికి మాత్రం పరమప్రౌడ శైలి ప్రయోగించి ఇంటా బయటా సెబాస్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారు. తెలుగంటేనే ఎందుకింత చులకన భావం ? ఈ ధోరణి వెనుక నిజంగా ఉన్నది అభ్యుదయం కాదు. తెలుగు పనికిమాలిన భాష. నేర్చుకోదగని భాష. ఎవడిష్టమొచ్చినట్లు వాడు కంపు చెయ్యడానికి వీలైన భాష.
ప్రతివాడూ "నేనీ అక్షరం పలకలేను. తీసిపారెయ్యండి" అంటే చివరికి భాషలో అక్షరాలే ఉండకుండా పోతాయి. ఇది అభ్యుదయం కాదు. ఇది విధ్వంసవాదం. మనం నిజంగా భాషాభిమానులమే అయితే మన ప్రేమ selective గా conditional గా ఉండదు. మన భాషకు సంబంధించిన అన్ని విషయాల్నీ బేషరతుగా నిర్నిబంధంగా ప్రేమిస్తాం. భాషని ఇంకా బాగా నేర్చుకోవాలనే తహతహ లేకపోగా, తామేదో భాష
పాలిట అవతారపురుసులైనట్లు దాన్ని సంస్కరించాలని డిమాండు చెయ్యదం మిక్కిలి అబ్బురం. ఈ జబ్బు మన తెలుగువారికి తప్ప ప్రపంచంలో మఱింకే జాతికీ లేదని కూడా అర్థం చేసుకోవాలి. చెయ్యి వెయ్యకూడని విషయాలు కొన్నున్నాయి మానవ నాగరికతలో.

కొలిౘాల సురేశ్ గారి జవాబు

> ౧) [snip] పోతన వాడే వారికి ౘ ౙ బానే కనిపిస్తాయి గాని, వాటికి గుణింతాలు చేర్చినపుడు
> సరిగా కనబడవు. ఉదా - ౘు ౙు

మేము యూనికోడ్ కు జతచేసిన సంకేతాలనుగుణగంగా డా. కృష్ణ దేశికాచారిగారు పోతన ఫాంట్లు ఆ రోజుల్లోనే సరిదిద్దారు[1]. అయితే, ఆ అక్షరాల గుణితాలు సరిగా పనిచేయకపోవటానికి కారణం మైక్రోసాఫ్ట్ యూనిస్క్రైబ్ ఆయా
సంకేతస్థలాలను తెలుగు హల్లులుగా గుర్తించకపోవడమే. ఈ కొత్త అక్షరాలను యూనికోడ్ 5.1 లో ప్రమాణీకరించారు. మైక్రోసాఫ్ట్ విస్టా లోని యూనిస్క్రైబ్ కూడా యూనికోడ్ 5.0 ను మాత్రమే పూర్తిగా సపోర్ట్ చేస్తుంది.

> ౨) టైపు చేయడానికి నేను inscript వాడతాను కాబట్టి, నా కీబోర్డులో Alt Gr + చ =
> చ౨ (ౘ) గా మార్చగలను అది పెద్ద సమస్య కాదు. మిగిలిన వారు ఈ సమస్యను ఎలా
> అధిగమించగలరో తెలియదు.

పద్మ (లేఖిని)లో ~c, ~j అని రాస్తే సరిపోతుంది.

> ౩) ముఖ్యమైన విషయఁవై, బ్రౌణ్యంలో జ౨ / ౙ ని చూపించడానికి వారు 0C5B (0C59 కి
> భిన్నంగా) వాడుతున్నారు.

We did discuss about using 0C5B for /dz/ when we wrote this proposal.
But note that the devanagari code point '095B' is used to represent /z/ voiced alveolar fricative, which is different from voiced affricate /dz/ that we use in Telugu[2]. I tried to argue that 'z' and
'dz' are allophonic in Telugu, but we finally decided to go with separate codepoints, given that there is no corresponding devanagari codepoint for 'ts' (voiceless affricate).

Regards,
Suresh.
--
[1] http://groups.yahoo.com/group/digitaltelugu/message/645
[2] What is interesting about these sounds is that besides Telugu, their usage is found in Kannada (Dravidian), Marathi (I-A), Oriya (I-A) and Korku (Munda) languages. Actually, the phonology of Marathi also includes the two extra aspirated consonants that corresponding
to /ts/ and /dz/. Emeneau, hypothesizing that these languages form a geographical band across central India, says these affricates must have diffused across this area, but their source is unknown (cf. Emeneau, MB 'India as a linguistic area.' Linguistics 32: 3-16)వెన్న నాగార్జునగారి జావాబు

> > ౩) ముఖ్యమైన విషయఁవై, బ్రౌణ్యంలో జ౨ / ౙ ని చూపించడానికి వారు 0C5B (0C59 కి
> > భిన్నంగా) వాడుతున్నారు.

> We did discuss about using 0C5B for /dz/ when we wrote this proposal.
> But note that the devanagari code point '095B' is used to represent /
> z/ voiced alveolar fricative, which is different from voiced
> affricate /dz/ that we use in Telugu[2]. I tried to argue that 'z' and
> 'dz' are allophonic in Telugu, but we finally decided to go with
> separate codepoints, given that there is no corresponding devanagari
> codepoint for 'ts' (voiceless affricate).

I vaguely remember one other reason for not using 0C5B. 095B comes to Devanagari from Urdu and there was a rumor that the voiced alveolar fricative /z/ was used in Telugu with a dot under జ just like in Devanagari. I heard that it was used in some publications from the Nizam era. Of course, I have not seen any evidence of it so far. This and Suresh's technical description of the difference between /z/ and /dz/ convinced us that we don't have to stick to 0C5B.
Regards,
Nagarjuna

Saturday, May 10, 2008

Kantri Ante NTR anI

పోకిరి సినిమా ఎందుకు హిట్టయిందో తెలియదు గానీ, ఈ సినిమాని కూడా అదే తీరులో తీసారు మన దర్శకులు. ఈ సినిమాలో రెండు పోకిరిలు ఉన్నాయి. మొదటి సగం ఒక పోకిరి, రెండో సగం ఇంకో పోకిరి. మీరు పోకిరి సినిమా చూడకపోయినచో (అంటే మీ నివాసం అంటార్కుటికా అయినచో), ఈ సినిమా చూసి ఆ పాపాన్ని కడిగేసుకోవచ్చు. ఈ సినిమా చూస్తే రెండు పోకిరిలు చూసినట్టు లెక్క. మొదటి సగం చివరిలో కథలో మెలిక ఉంటుంది, అప్పుడు మీ మతి భ్రమిస్తుంది. అలా మిమ్మల్ని భ్రమింపజేసి రెండో సగం గడిపించాక, రెండో సగం చివరిలో ఆ మెలికను తిన్నం చేస్తాడు మన దర్శకుడు.
దీనితో మనకు Every twist has an equal and opposite twist అని తెలుస్తుంది. ఇలా ఇంటర్ పిల్లలకు భౌతికశాస్త్రాన్ని నేర్పూతూ అదే సమయంలో, చెత్త చెత్త ట్విస్టులతో సినిమాలు తీసే పూరీ జగన్నాథం వంటి దర్శకులను తన తిన్నాలోతో(untwistలతో) ఖండించిన దర్శకుణ్ణి ఎంతైనా అభినందించాలి.


నేను నిన్న కత్తిలాంటి సినిమా కంత్రి చూసాను. ఈ సినిమా గొప్పతనానికి ముగ్ధుడనై వెంటనే మీరు ఈ సినిమాలో ఎంత చూడాలో ఎందుకు చూడాలో వివరంగా వ్రాసాను. తప్పక చదవండి నవతరంగంలోఁ.

Sunday, May 04, 2008

ఐపిఌ IPL

క్రికెట్‌నే మతంగా భావించిన మన దేశంలో, బ్లాగించడాన్నే కళాపోషణగా భావించే మన బ్లాగరులలో ఎవరైనా ఒకరు ఐపిఎల్ గురించి వ్రాయకమానరా అని ఇన్నాళ్ళూ ఎదురు చూశాను. కానీ లాభం లేకపోయింది. హాకీ మఱియు కాలుబంతులాటలా ఈ ఆట తన అభిమానులలో అంత తీవ్రమైన అభిమానాన్ని లేవనెత్తలేదేమో అని అనిపించి, నేనా నా అభిమానాన్ని కొంత అప్పుఇచ్చి టపా వ్రాయడం మొదలు పెట్టాను.

ఈ మధ్య నేను నా జీవిత సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేశాను. అందరూ అంటూ వుంటారుగా టీవి చెత్త దాని జోలికి పోకూడదు అని. అలా ఎందుకు అనకోవాలి. టీవీనే సర్వం అనిఁ దలచి, అక్కడఁ జెప్పినవాటినన్నిటినీ నమ్మి ఆ నమ్మకాలమీద మన జీవిన గూడు నిర్మించుకుంటే ఆ పొదరిల్లు పదిలంగా వుంటుందని నాకు అర్థమయ్యింది. కాబట్టి వారు ఏది చేయమంటే నేను అది చేస్తున్నాను.
ఉదా - సున్నపు గోడలా తెల్లగా లేకపోతే ఫెయిర్‌నెస్‌క్రీమ్ ఫర్ మెన్ వ్రాసుకోవాలంటే, అదే చేస్త్తున్నాను.
ఇక షారుక్ చెప్పినదైతే వేదవాక్కే! కాబట్టి నేను ఈ మధ్య ఐపిఎల్ చూడడం మొదలు పెట్టాను. టీవీలో అన్ని మాచిలు రోమాంచికంగా వుంటాయంటేను, అన్నీ చూడవలసి వస్తుంది. అలానే అన్ని చూసిన తరువాత అందర్ని చూడమని చెప్పడం ధర్మఁవట. కాబట్టి ఆ పని కూడా నేనే తలకెత్తుకున్నాను.
ఐపిఎల్ ఎందుకు చూడాలంటే..

౧) చీరు గరలుసు
పై రెండు పదాల్లో మీకు ఏది అర్థం కాలేదని వివరణ చదువుతున్నారు? చీరు గరలుసు అనగానే, కళ్లు పెద్దవి చేసి, నోరు చాచి, నాలిక బయట పెట్టి, ట్స్చూఁ అనుకొని ముందుకు సాగిపోవాలి గాని, ఇలా రాకేశ్వరుఁడు ఏదో వ్రాస్తాడు దానిని చదువుదాము అనుకోవడం, పసితనమే అవుతుంది.

౨) చీరు గరలుసు
పై రెండు పదాల్లో మీకు ఏది అర్థం కాలేదని వివరణ చదువుతున్నారు? చీరు గరలుసు అనగానే, కళ్లు పెద్దవి చేసి, నోరు చాచి, నాలిక బయట పెట్టి, ట్స్చూఁ ట్స్చూఁ అనుకొని ముందుకు సాగిపోవాలి గాని, ఇలా రాకేశ్వరుఁడు ఏదో వ్రాస్తాడు దానిని చదువుదాము అనుకోవడం, పసితనమే అవుతుంది.

౩) చీరు గరలుసు
పై రెండు పదాల్లో మీకు ఏది అర్థం కాలేదని వివరణ చదువుతున్నారు? చీరు గరలుసు అనగానే, కళ్లు పెద్దవి చేసి, నోరు చాచి, నాలిక బయట పెట్టి, ట్స్చూఁ ట్స్చూఁ ట్స్చూఁ అనుకొని ముందుకు సాగిపోవాలి గాని, ఇలా రాకేశ్వరుఁడు ఏదో వ్రాస్తాడు దానిని చదువుదాము అనుకోవడం, పసితనమే అవుతుంది.

౪) ఇఱవై౨౦
అందురూ అంటూంటారు, ప్రత్యేకించి మన తెలుగు వారు, ఇలా ఇఱవై ఇఱవై అయితే లాభం లేదు, అందరూ చెత్త క్రికెట్టు ఆడతారు, ఆటోలో అందం లోపిస్తుంది అని. అలా ఎందుకంటారంటే మన ఏకైక క్రికెట్టు రత్నం వివిఎస్ లక్షణ్ణ, టెస్ట్ క్రికెటర్ కాబట్టి. అతని ఆట చీరలు కట్టిన అమ్మయిలా చాలా అందంగా వుంటుంది కాబట్టి. కానీ ఇది నవీన యుగం, ఇక్కడ అంతటి మృదులందాలకు స్థానం లేదు. నేను టీవిలో అంతా ఫాస్టు ఫాస్టుగా అయిపోవాలని లేక పోతే జీవితంలో మజా లేదని విన్నాను. అప్పుడ అర్థఁవయ్యింది టీ౨౦ క్రికెట్టు చూడడం ఈ యుగానికి మంచిదని. ఈ యుగ పురుషులు సేవాగు, గంభీరు వంటివారు. ధోని దేవుడన్న విషయం మీరు ఒక్క పూటలో ఒక్క గంట టీవీ చూసినా మీకు తెలిసిపోతుంది.

౫) లీగాట
నేను ఎప్పుడూ అంటూవుంటాను, మాచిలందు లీగు మాచి లెస్స అని, కానీ ఊఁహూఁ లేదు. ఇండియా పాకిస్థాన్ మాచి వస్తే అందులో మజానే వేరు అంటారు మిగిలిన వారందరు. అలాంటి వాళ్ళని చూస్తే , "నీ యమ్మ, ఉరేయ్ ఎల్-కొడక, మొన్నటి వఱకూ ఒకటిగా ఉన్న రెండు దేశాలు, విడిపోయి అర్థరహితంగా కొట్టుకుంటుంటే, ఎంతో మంది జీవితాలు దాని వలన నాశనమౌతుంటే, ఆ దుర్భర విషయాన్ని నువ్వు నీ క్రికెట్ మాచిని రోమాంచికం చేసుకోవడానికి వాడుకుంటున్నావా? నీకు బుద్ధివుందా, లజ్జవుందా, ఇసుమంత బుఱ్ఱవుందా? ఇదేనేరా గాంధీ గారి స్వప్నం. ఇదే నేరా క్రికెట్ లాంటి ఆటను గౌరవించే ఆశ్వాదించే విధానం. నీ క్రికెట్ అభిమానం ఎంత అథమం అయితే నువ్వు దాన్ని ఇలాంటి చిల్లర పద్ధతుల్లో ఉత్తేజపరచి ఆశ్వాదిస్తావు" అని రెచ్చిపోతాడు నా సహవాసి భాను.
కానీ నేను అలాంటి వాడిని కాను. "ఉరేయ్ బుఱ్ఱలేని గాడిద, భారతీయులు, పాకిస్థాను వారు కలసి మెలసి ఆడి, బాగా ఆడినప్పుడు ఆలింగనం చేసుకుంటే, చూస్తే ఎంతో కొంత ఆనందం కలుగుతుందిగా, అలాగే ప్రపంచ శాంతిని పెంపొందించనవారమౌతాముగా" అంటాను.
ఉదా - మొన్న నా రూమీ కూడా, లేదు దేశానికి సేవ చేయాలి, ముందు దేశానికి ఆడాలి, తరువాతే దేనికైనా అంటూ వాదించడం మొదలు పెట్టాడు. ప్రపంచ "సాధుసత్వపు సోదరత్వపు స్వాదుతత్వం" గుఱించి వీడి బుఱ్ఱకు అర్థంకాదులే అని మానేశా. ప్రపంచ శాంతి, ఆలింగనం, ఆటను గౌరవించడం అని నాలుగు మాటలు వాడినా వాడికవి, కిచ్‌కున్‌చా, తాన్‌కో‌తాప్, తిల్‌తిష్‌పల్ వంటి ZWNJ కలిగిన మ గాణాలు వినిపించాయంతే.
ఐపిఎల్ మొదలయిన నాలుగు రోజలకు వాడు, "బలే వుందిలా ఇలా సిమండ్స్ అఫ్రిది కలవడం అసలే పాకిస్థాన్ కి ఆస్టరేలియాకి పడదు" లేదా "వార్న్‌ని మిగిలిన యువ ఆటగాళ్ళు ఎత్తడం బాగుంది" అని ఒప్పుకున్నాడు. పోనీలే వీడికి బ్రహ్మాండోపాయాలు అర్థంకాకపోయినా, వాటిని అమలుచేసి చూపినప్పుడు మాత్రం గుర్తుపట్టగలడు అని తృప్తిపడ్డాను. నాకు మేధస్సు నిచ్చి దానికి బదులు సిక్సరు కొట్టే స్థోమతని తీసుకుపోయిన భగవంతుణ్ణి కొంత సేపు తిట్టుకొని ముందుకు నడిచా.

౬) పేదల దేశం ప్రజా రాజ్యం భువన విజయం
ఇప్పటి వఱకూ మనది పేద దేశం అని మనం భావించాం. అందుకనే మనలో సగం మంది ఇతర దేశాలకు వెళ్ళిపోయాం, మిగిలిన సగం మంది ఆ ప్రయత్నంలో విఫలమై మన పిల్లల్ని అక్కడకు పంపే ప్రాయాసలో నిమఘ్నమై ఉన్నాం. కానీ అదంతా యుగపరుషుడు ధోనీ రాక ముందు. ధోనీ వచ్చి మనల్ని జగజ్జేతలను చేశాడు. అదేదో చిన్న టోర్నమెంటులో. ఆ ఊపుతో ఒక వంద కొట్లమందికి వచ్చిన ఉత్సాహంతో, మన వాళ్ళు ఐపిఎల్ అనే ఆటని మొదలు పెట్టి, ప్రపంచంలో ని అగ్రరాజ్యాల్లోని దిగ్గజాలందరిని మనము రప్పించి, మన క్రింద పనిచేయిస్తున్నాము.
ఉదా - గంగీలి క్రింద పాంటింగు, లక్ష్మణ్ క్రింద గిల్లి, యువి క్రింద సంగకార, బజ్జీ క్రింద పొల్లాక్ ఇలా.
ఇంతకు ముందు ఎవర్ని చూసి "వీళ్ళ వల్లే మన దేశంలో ఆటల పరిస్థితి ఇంత చెండాలంగా వుంది" అని మనం తిట్టుకునేవాళ్ళమో, ఉదా - మగ్రాత్, జాఫర్, సిమండ్సు, హేడన్, గ్రేమ్ స్మిత్ వంటి వాళ్ళు, వాళ్ళని ఇప్పుడు మనం సంతలో గేదలను కొన్నట్టు కొని .. "ఈ గిత్త తొలి సూడిది తల్ల్#&% దీనికి ఒక నాలుగు కోట్లు పారేయొచ్చు" ... మన ఊళ్ళలో గంగిరెడ్ల ఆట ఆడిస్తున్నాం. మనమీద రాజ్యం ఏలిన తెల్లవాళ్ళ దగ్గరనుండి, వాళ్ళ మీద హిప్ హాప్ రాజ్యమేలే నల్ల వాళ్ళ వరకూ అందర్ని మనం ఆడిస్తున్నాం. అంతర్జాతీయ ఫుట్బాలులో మన ఆచూకి లేకపోతేనే, అలానే హాకీకి మన జట్లు పనికిరాకపోయినా, ఉండనే వుందిగా క్రికెట్టు.
చిన్న అంబాని "నాన్న నాకు ఈ పుట్టినరోజుకు సచిన్ కావాలి", అంబాని "సచిన్ ఏఁవ్ కర్మ చిన్నా, ఇదిగో మొత్త టీంనే కొని ఇస్తున్నా"!
అలానే "నాన్నా హేడన్ ఏంటి ఇంత ఉతుకుడు వుతుకుతున్నావు దు దు దు ఇదిగో మూడు కోట్ల బిస్కెట్టు వచ్చి మా మద్రాసుకు ఆడు".

౭) రుద్దుడు
మన భారతదేశ మహారుద్దుడుకి ఇంకో సాకు దొరికింది. మొన్నటి దాక, అదిగో చూడు ఆ రాము అన్న ఎంత బాగా చదువుకొని, అమెరికాలో ఎంత డబ్బు సంపాదిస్తున్నాడో అన్న మీ వాళ్ళందరూ, ఇప్పుడు, "ఆ దొడ్డపనేని కల్యాణ కృష్ణ అన్న చూడు, ఇంచక్కా క్రికెట్టు బాగా ఆడి, ఆడుతూ పాడుతూ బొలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు" అని కాళీ సమయంలో కూడా రుద్దవచ్చు. ఒక్క క్షణం, ఈనాటి పిల్లలకు కాళీ సమయంలేదుగా! ఎప్పుడు లెక్కల రుద్దుడేగా. హూఁ కానీ అప్పుడప్పుడు ఏ కాలో చేయో విరిగి క్లాసుకు వెళ్ళలేకపోయినప్పుడు ఇదిగో ఇలా "క్రికెట్ ఆడు, క్రికెట్ అడు" అని రుద్దవచ్చు.
రుద్దుడు ఎలా వున్నా పాపం కొందరు మన ఆటగాళ్ళకైనా మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. మొన్నటి వఱకూ క్రికెట్టు పది మంది ఆటగాళ్ళని, పదివేలమంది రాజకీయనాయకులనూ పోషించేది. పరిస్థితి మారిన తరువాత నాలాంటి వాళ్ళు కూడా క్రికెట్ చూడడం మొదలు పెట్టారు.

౮) అమెరికా అత్తగారి అబ్బాయితోఁ
మీకు అమెరికాలో చుట్టాలున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడైనా మాటల్లో "నువ్వు ఇష్టపడ్డ గుజరాతి అమ్మాయి ఎవరో తెల్ల అబ్బాయితో వెళ్ళిపోయిందటగా, అతను ఏం చేస్తాడు" అని అడిగినప్పుడు, తను అవమానం భరించలేక, ఎలాగోలా తేరుకుని, బదులుగా తెలివిగా "అతనా అతను కాలేజీ ఫుట్బాలు బేసుబాలు బాస్కెట్టుబాలు జట్టుల్లో వున్నాడులే మంచి స్టడ్డు" అని, దానిని తోడు కసి తీఱ్చుకోవడానికి "అవును భారతదేశంలో ఎవరూ ఏం ఆటలు ఆడరే, అందరూ అంత చేతగానివాళ్ళ" అని అర్థఁవచ్చేడట్లు ఏదో అన్నప్పుడు, మీరు వెనకటిలా తడుముకోకుండా, "భారతదేశం క్రికెట్లో అగ్రరాజ్యం, మాదే క్రికెట్ క్యాపిటల్, ప్రపంచం నలుమూలనుండి క్రికెటైరావతాలు, క్రిక్కంగారూలు వచ్చి మాకే ఆడతారు", అని మీరు మీ పరువు మఱియు దేశం పరువు కాపాడవచ్చు.

౯) సర్వేజనా సుఖినో భవంతు
మొన్న బెంగుళూరులో మ్యాచి జరుగుతుంటే అందరూ అఫ్రిదీని చీయర్ చేస్తున్నారు, ఇంతకీ అతను బెంగుళూరు జట్టులో లేడు, అలానే కన్నడనాటికి సంబంధంలేని పాకిస్థాను నుండి వచ్చాడు. ఇంతకీ విషయం ఏంటంటే, ఎవరు సిక్సులు కొడతాడనిపిస్తే వాడికే జైజైలు! నెగ్గడం ఓడిపోవడం అసందర్భం. బ్యాట్సుమాను కొట్టాడా, బౌలర్ కొట్టించుకున్నాడా అన్నదే చాలు. కాబట్టి మీరు ఏ దేశంలోవున్న క్రికెట్ అభిమాని అయినా, మీరు ఐపిఎల్ ని తప్పకుండా ఆశ్వాదించగలరు. మగ్రాత్ అన్నట్టు "ఇది ఒక క్రికెట్ మహాపండుగలాగ వుంది".
ఇది చాలామందికి వర్తిస్తుంది కానీ, మీరు హైదరాబాదు జట్టు అభిమానులైతే, వారి వరుస పరాజయాలను తట్టుకొని, దిగమింగుకొని, ఇలాంటి ఆధ్యాత్మిక సోపానమెక్కి క్రికెట్ని ఆశ్వాదించడం మీరు పరమయోగిలైతేనేగాని మీకు సాధ్యపడదు. అన్నట్టు మీ జట్టుకు డక్కన్ అనే తొక్కలో పేరు పెట్టినప్పుడే మీకు సంతోష పడే అవకాశం పూర్తిగా పోయింది.

౧౦) ఇంకా ఎన్నో
ఇంకా ఒకటా రెండా ఎన్నో ఎన్నెన్నో ఉపయోగాలు వున్నాయి.
ఉదా - మీరు ప్రేమించే అమ్మాయి రాహుల్ ద్రావిడ్‌ని ప్రేమిస్తుందనుకోండి, ఒక్క బెంగుళూరు మ్యాచికి తీసుకువెళితే చాలు, ఆమె కళ్ళు తెరుచుకుంటాయి. అంత ఖర్చుచేయనక్కరలేదు కూడా, ఐపిఎల్ స్టాండిగ్సు చూపిస్తే చాలు, మీరే అతనికంటే గొప్పవారని గ్రహిస్తుంది.
ఉదా - మీరు ప్రేమించే అమ్మాయి ధోనిని ప్రేమిస్తుందనుకోండి, ఒక్క మద్రాసు మ్యాచికి తీసుకువెళితే చాలు, ఆమె కళ్ళు తెరుచుకుంటాయి. ఈ ఇంటరు పాసు కానివాడు దేశాన్ని ఏలుతుంటే, నేను కష్టపడి డిగ్రీ చేయడం ఎందుకని మానేస్తుంది. ఆ తరువాత మీ మీద ఆధార పడక తప్పదు.
ఉదా - మీరు ప్రేమించే అమ్మాయి, షారుఖ్ ఖాన్‌ని ప్రేమింస్తుందనుకోండి, కొలకొత్తా వారి పాట, వారి ఆట, పాంటింగ్ స్కోరు కార్డు వంటివి చూపించండి. మ్యాచికి తీసుకెళితే, షారుఖ్‌ని వదిలేసి ఇశాంత్ శర్మ మీద పడవచ్చు.
ఇలా ఐపిఎల్‌ని ప్రేమని విజయవంతం చేసుకోవడానికి వాడుకోవచ్చు.

కొసమెఱుపు పేర్ల గుఱించి
అన్నట్టు నాలుగు జట్లుకు (రాయల్ చాలెంజర్లు, రాయల్స్, సూపర్ కింగ్స్, కింగ్స్) అని పేరు పెట్టనప్పుడే మన దేశంలో ప్రజాస్వామ్యం ఎంత అఘోరించిందే తెలుస్తుంది. రాజులు పోయినా వారి బానిసలు పోలేదు దేశంలో. ఈ విషయంలో నాకు రాహుల్ గాంధీ బాగా నచ్చాడు.
రాయల్ చాలెంజర్స్ బదులు విస్కీ తాగే వారు అనిపెడితే సరిపోయేది. డెక్కన్, ఇక్కడ చెప్పడానికేముంది. డెల్లి పేరు ప్రస్తావించకపోవడమే మంచిది. ముంబయి ఇండియన్స్ అంట. వారి ఆట చూసి, బాబోయ్ ఈ జట్టుకు మా పేరు ఎందుకు పెట్టారు అని భారతీయులందరూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు.
ఇక మన బెంగాలీ బాబులు నైట్ రైడర్సు అని పేరు పెట్టుకుంటే, అమెరికాలో సిన్సిన్నాటి వారు బెంగాల్స్ (బెంగాల్ పులులు) అని పేరు పెట్టుకున్నారు! పొరుగుంటి పిచ్చి పేరు కూలు.
విశాఖ ఉక్కుడేగలు, మైసూరు మహారాజులు కోసం మీరందరూ ఎదురు చూస్తూవుండండి. ఇంతో నేను వెళ్ళి కావలిసిన డబ్బులు పోగు జేసుకొస్తా. మీ చందా పంపవలసిన చిరునామా - పట్టుకుంటే పట్టుచీర, C/O ఈనాడు టివి, సోమాజిగూడా, హైదరాబాదు.