భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, June 21, 2009

మన సంస్కృతి

మనలో చాలా మంది అబ్బో తెలుగు చచ్చిపోతుంది. బాబోయ్ తెలుగు చచ్చిపోతుంది. లబో దిబో లబో దిబో అంటూంటారు. అలాంటి వారికి నాకో ప్రశ్న మీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో ఎందుకు వేశారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయేది పూర్తిగా వేఱే అంశం గుఱించి. అది చెప్పిన తఱువాత మీరు వేంటనే మీ పిల్లల బడికి వెళ్ళి వాళ్ళ ప్రినిసిపాలునితో "మా కిడ్సు ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ లో చదవడం మాకు లైకింగా లేదు. ఇప్పుడే డిస్‌కణ్టిఞూ చేసి, ఒక గుడ్ టెల్గు మీడియమ్ స్కూలులో చేరుస్తున్నాము" అని అంటారు, మాది పూచి.

ఇక మన 'మన సంస్కృతి' గుఱించి
నేనీ మధ్యన పూర్తి స్థాయి తెలుఁగు గ్రామజీవనావిధానవిశ్లేషకునిగా మారాను. అందులో నాకు దొరికిన ఒక మచ్చుతునక మన అనే మన భాషకు ప్రత్యేకమైన మాట. మీ మా లతో బాటుఁ మన అనేది మన భాషకు ప్రత్యేకం. మనలా (బ్లాగర్లలా) ఆంగ్ల భాష నేర్చి తెలుఁగు నుడికారం మీద పట్టు కోల్పోయిన వారు కాకుండా, గ్రామాల్లో అచ్చంగా తెలుఁగు మాత్రమే ఎఱిఁగిన వారు వుంటారుగా, వాళ్ళ మాట తీఱులో చాలా చమత్కారాలుంటాయి, అందులో మన అనేది ముఖ్యమైనది.

ఉదా ౧
మా చిన్నాన్న పొలం వెళ్ళాను ఒక సారి, పంచుకున్నాక అదే మొదటి సారు అనుకోవచ్చు. ఆయన "ఈ పొలం మనకు వచ్చిందిరా" అన్నడు. దానర్ధం ఆయనిదనా, మా నాన్నదనా? ఆయనిదనే ఎందుకంటే, వేంటనే "ఆ కంచవతలిది మీ నాన్న కొచ్చింది" అనన్నాడు కాబట్టి.

ఆస్తి హక్కులు అనేది విశ్వమానవ చరిత్రలోనే అతి ముఖ్యమైన కట్టుబాట్లలో ఒకటి అని ఎంబియే చదివిన మీ మిత్రుడు అనవచ్చు. అప్పుడే అర్ధమవుతుంది మనము ఎంబియే చదవకూడదని, చదివినా మన పిల్లల్లి చేతఁ జదివించకూడదని, చదివిన వారి జట్టు కట్టకూడదని. మనలో కొందఱు ఇప్పటికే ఆ తప్పు చేసివుంటారు, వారికి నా సహానుభూతి. ఆస్తి హక్కులు అనేది మనము గతిలేక గొడవలు తగ్గించుకోవడానికి ఏర్పఱచుకున్నవి. అనాదర్శ ప్రపంచంలో అదోక ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. కాబట్టి ఆదర్శాన్ని కోఱుకునే ఏ మనిషైనా ఆ అంశాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడు. అందుకే మనకుంది మన అనే పదం.

ఉదా ౨
మా అన్నయ్య (పెదమామ్మ మనఁవఁడు) నాతో అన్నాడు "ఎప్పుడైనా రారా మన పొలం, ఆ పోతారం రోడ్డు వుందిగా అక్కడే, బాబాయి పొలం దాటిన తరువాత". ఆయని పొలం ఆయనిదే, మాది మాదే, కానీ ఇలాంటి సందర్భాలలోఁ, మా అనే పదం పైన చెప్పుకున్న కారణాల వలన, అంత సంస్కారవంతమైన పదము కాదు.

కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాల్సివుంటుంది.
మనకు ఎన్ని సాల్తీలు వున్నాయేంటి?
ఎనభై, గిత్తలు ఇంకో ఇఱవై వుంటాయి. జొన్న చే౨ను ప్రక్కన కొబ్బిరి తోట వుందిగా అందులో జాడేసి వీటిని కూడా అక్కడే కట్టేస్తాం.
ఊఁహూఁ.. కొబ్బిరి తోట అంటే, మా నాన్న కొబ్బిరి తోట ఉంది దాని ప్రక్కనేన.
అవును మీ నాన్నగారి చేను ప్రక్కనే.

అలా మా, మీ అనే పదాలు వీలైనంత తక్కు వాడి మాట్లాడాలి. ఒక వేళ ఎవరైనా మీ అని వాడినా, మనము మాత్రం మన అనే వాడాలి.

ఉదా ౩
చిన్నాన్న బిడ్డడు "అన్నయ్య కారు నేర్పవా"
మనం "సరే వెళదాం పద"
వాడు "ఉండు నాన్నకు చెప్పేసి వస్తాను"
మనం "పర్లేదు రా మన కారులో వెళ్తున్నాంగా నాన్నని అడగక్కరలేదు. నాన్న కారులో వెళ్తే చెప్పాలిగాని మనకారులో వెళ్తే చెప్పనక్కరలేదు"

అదన్నమట మనకు ప్రత్యేకమైన మన సంస్కృతి. ఇది ఒక పళాన అలవాటు అయ్యేది కాదు. దీనికి ఒక రకమైన ఆలోచనా తీరు అవసరం. డబ్బులు, ఆస్తిపాస్తుల్లో ఏముంది మన జనాలు మనకు ముఖ్యంగాని అనే ధోరణిలోఁ వుండాలి. బాగా అలవాటు చేసుకుంటే అవతలివారికి మన గుఱించి, చదువుకంటే సంస్కరముందని తెలిపే మంచి అలవాటు యిది.

మా సంస్కృతి
మా అమ్మ, మా నాన్న అంటాము మనము తల్లిదండ్రులకు ఒకే బిడ్డ అయినా సరే. అదే వేఱే భాషల్లోనయితే, నా అమ్మ, నా నాన్న అంటారు. ఇది అందఱికీ తెలిసిన విషయమే. ఇక్కడ మఱీఁ మన అమ్మ మన నాన్న అని పరాయివాళ్ళతో అనలేము కాబట్టి, కనీసం మా అనాలి.

దేనినైనా నలుగురితోఁ పంచుకోమని చెప్పే మన సంస్కృతికి అద్దం పట్టే మన భాష మనకు ముద్దు.

రేపు నేను ఒక టపా వేయబోతున్నాను

నా గణినిలోని రాకేశ్వర సంచయం చూస్తూండగా, అందులో ఒక పదో ఇఱవయ్యో అముద్రిత టపాలు చిట్టీయట్ట (నోటుప్యాడు) పత్రులు కనిపించాయి.

శ్రీశ్రీ అముద్రితాలు, చలం అముద్రితాలు అంటే బాగుంటుంది, ఆ మాటకు వస్తే ఓంకార్ అముద్రితాలు అన్నా బాగానేవుంటుంది కానీ రాకేష్ అముద్రితాలు అంటే అస్సలు బాగోదు, దానికి మొదటి కారణం రాకేశ్ అనేది సరైన వాడుక అవడం. రెండవది నా పేరును వాళ్ళు సరిగా వేస్తారో లేదో నమ్మకం లేకపోవడం.

అందుకే నేనే నా అముద్రితాలను త్వరగా అచ్చువేసి, నా పుస్తకం వ్రాయడం ప్రారంభించుదామని నిశ్చయించుకున్నాను. పుస్తకం అంటే అచ్చంగా పుస్తకం కాదు. బ్లాగు టపాల పరంపర (విశృంఖలము) అనమట. కాబట్టి రేపే నా అముద్రితాల నుండి ఒక టపా వేద్దామని నిశ్చయించుకున్నాను. దాని పేరు ""మన" సంస్కృతి".

ఏం భయపడవద్దు. ఇది వేశ్యల గుఱించి కాదు, దూరదర్శని కార్యక్రమాల గుఱించి కాదు, మన చలనచిత్రాల గుఱించి అంత కంటే కాదు. అయినా నేను వేసే టపా పేరు ""మన" సంస్కతి "లేమి"" కాదు. మన సంస్కృతి కలిమి గుఱించినదది.

అన్నట్టు వేశ్యల విషయమై, మొన్న ఎవరితోనో మాట్లాడుతుంటే అంటున్నారు "నేను మీ పెద్ద అభిమానినండి, అంటే మీరు ఏం జెప్పినా ఖఱాఖండిగా చెబుతారు, బ్లాగులో వ్రాసే దాని గుఱించి కాదు, మామూలుగా, అంటే బ్లాగులో ఏదో వ్రాస్తూంటారు, వాటి గుఱించి కాదు, మామూలుగా.." అని. బ్లాగు ద్వారా తప్ప వేఱే పరిచయమే లేదు మాకు. నాకు అప్పుడే అర్ధమయ్యింది ఈయనకు వడనవనితల మీద బొత్తగా కరుణ లేదని. బుద్ధునికి అన్నింటి మీదనా కరుణ వుండేదఁట - అదుగో మళ్ళీ బుద్ధుడికీ వాళ్ళకీ లంకె వేస్తున్నావంటారు ఎందుకొచ్చింది లెండి అసలే బ్లాగ్లోకం వెనకటిలా లేదు. మన అభిమానుల్లో అలాంటి రాములు, మంచి బాలురు, కౌశల్యాదులు ఎక్కువే వున్నారని, వారి కోసం మనల్ని మనం కొంత సంభాళించుకోవాలనీ నిర్ణయించుకోవడం జరిగింది.

సామాజిక వర్గములు, సామాజిక వర్గముల అంతఃసంబంధములు, లైంగిక సామాజిక వర్గములు, లైంగిక సామాజిక వర్గముల అంతఃసంబంధములు, మన దేశంలోని కొన్ని సామాజిక వర్గాలకు తీఱని లైంగిక తృష్ణ, మన దేశంలో కొన్ని ప్రచార మాధ్యములుఁ జూపు లైంగిక మృగతృష్ణ, వాటి సంబంధించిన వివిధ ఇతర అంశాల గుఱించి బ్లాగడం మానేసి; అందుకు బదులుగా వాటిని నా గణినిలో(గణికతోఁ సంబంధంలేదు - అంటే ఇద్దరూ గణిస్తారు ఆ సామీప్యం వుంది కానీ మిగిలిన ఏ సామీప్యమూ లేదు - ఈ యాదృచ్ఛిక సామీప్యతకు ప్రకాశకులు పెక్కు చింతిస్తున్నారు) వాటిని నా గణినిలో పత్రులుగా భద్రపఱచి, వాటిని ఆ మంచి బాలుర తదనంతరం రాకేష్ అముద్రితాలుగా అచ్చువేయించుదామనుకుంటున్నాను.

కొసమెఱుపు
అచ్చువేయించుదామనుకుంటున్నాను = accuvēyiñcudāmanukuṇṭunnānu (ఇఱవై ఏడక్షరాలు)
మనది పలు-అగ్లుటినేటివ్ భాష (poly-agglutinative language)
ఆంగ్లంలో అగ్గ్‌లుటినేటివ్ కి బదులు అగ్లుటినేటివ్ అంటారు. వారిది తలతిక్క భాష (non-geminative language).
ఈ టపాలోని లంకెలు లంకెబిందెలు, రేపటికి బాగా చదివి అర్ధం చేసుకోండి.


అన్నట్టు ట్విట్టరు పేజీ మొదలు పెడదామనుకుంటున్నాను, దనీ మీద మీ కేమైనా సలహాలు వున్నాయా?
ఇన్ని చోట్ల సోది వేస్తున్నావుగా, మళ్ళీ అది కూడానా అంటారా?