భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, April 20, 2010

జల్లిసీమ


సీ।
సర్కారు నేనెక్కి ౘక్కగాఁ బోతుంటే,
భీమవరానెక్కెఁ భామయొకతె
అప్పటి వఱకును యక్కడే కూర్చున్న
అమ్మాయి కంటెను యందగర్తె
బీటేయు వయసిక దాటిపోయిందని
అఱచెనాత్మారాముడంతలోన
ధర్మసంకటమొచ్చెఁ కర్మయనుచు కిటి-
-కీఁ దెఱచిన్ జూడఁబోతె బయటఁ
గీ।
గాలి కూగేటి రెల్లుల కైకలూరు
బల్లపరుపుగా వరిచేల జల్లిసీమ
కోటి చెరువుల కలల కొల్లేటిసీమ
ఆడఁబడచుల కంటెను యందఁగర్తె

Saturday, April 10, 2010

అమ్మమ్మ కబుర్లు ౨ - భారతమంతా బొంకూ రామయణమంతా రంకూను

"ఎరా విదురుడంటే ఎవర్రా? "
- "దృతరాష్ట్రుని తమ్ముడే।"
"దాసీకొడుకేనా? "
- "అవును।"
"అదే మహర్షి వచ్చినప్పుడు పెద్దదేమో కళ్ళు మూసుకుంటుంది। అప్పుడు దాసీకి పుట్టినోడేనా?"
- "ఊఁ"
"ఇప్పుడు వ్యాసుడికి ఏమవుతాడు "
- "మహర్షి వ్యాసుడేకద। "
"ఊహూఁ। నేను శంతన మహారాజు కథ చదివాను। "
- "శంతన మహారాజుకి ఇద్దరు కొడుకులుకదా సత్యవతి కడుపున। "
"చిత్రవిచిత్రులు"
- "అవును, మరి వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా। అప్పుడు వ్యాసమహర్షి గర్భదానం చేయడానికి పిలుస్తారు। అన్నగారి వరస అవుతాడుగా।"
"అదేంట్రా, శంతన మహారాజుకిద్దరు కొడుకులుగా। "
- "కానీ శంతన మహారాజు భార్య సత్యవతీ దేవికి పెళ్ళికాకముందే పిల్లవాడుంటాడే। "
"పెళ్ళి కాకుండా ఎలాగురా"
- "అదే చెబుతున్నానుగా విను। ఒక రోజు సత్యవతీ దేవి అంటే .."
"అదే పడవనడుపుకునేది। "
- "అవును ఆవిడ పడవమీద జనాల్ని నదికి అవతల దాటవేస్తుందిగా, మహా అందగత్తె అన్నమట, అక్కడికి ఒకరోజు ఒక ముని వస్తాడు।"
"అవును అదే శంతన మహారాజు కథలో నేను చదివాను, శంతన మహారాజు గంగాదేవిని పెళ్ళి చేసుకుని ప్రశ్నలేమీ అడకూడదంటుందికదా। అప్పుడేమో..."
- "ఇదంతా దాని ముందే। పరాశరముని వుంటాడు।"
"అదే నేను శంతన మహారాజు"
- "చెబుతావా వింటావా?"
"చెప్పు"
- "శంతన మహారాజు సత్యవతీదేవిని కలవక ముందురే , భారతం మొదట్లో, పరాశర ముని సత్యవతీదేవి వుండే రేవు కాడకు వస్తాడు, మన కొవ్వూరి రేవులాగ। ఆవిడేమో పడవదాటేస్తుంటుంది ఇతనిని। మధ్యలో మునికి ఆమెను చూసి కోఱిక కలుగుతుంది। మధ్యలో ఒక దీవిలో పడవ ఆపిస్తాడు, గోదారి మధ్యలో దీవులుంటాయిగా, అక్కడ వాళ్ళు ఏదోచేసుకుంటారు। "
"ఊఁహూఁ"
- "అదే మఱి నాకు పెళ్ళి కాలేదుగా, వాళ్ళ అక్కడ ఏం చేశారో నాకెలా తెలుస్తుంది, నీ పెళ్ళి ఎప్పుడో స్వతంత్రంరాక ముందు అయ్యిందిగా నీకే తెలియాలిలే। "
"ఊఁ నీకు తెలియదంటే నమ్మాలి। దేశాలన్నీ తిఱిగివచ్చావు కదరా ఇంచక్కా।"
- "అలా అక్కడ ఆ ద్వీపం మీద అప్పటికప్పుడే వాళ్ళకు పిల్లాడు పుడతాడు। అందుకే ఆయనకు ద్వీపం మీద పుట్టాడు పైగా నల్లగావుంటాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు, ఇంకా బాదరాయణుడు, పరాశరుని కొడుకు కాబట్టి పారాశరుడు అని పేర్లువున్నాయి వ్యాసమహర్షికి।"
"అయితే శంతన మహారాజు కలిసిందెప్పుడు? "
- "నువ్వూనూ మీ శంతన మహారాజూనూ। విను। అప్పుడేమో ఆవిడ ఇలా కన్యను నా కన్యత్వం పోగొట్టారు మహర్షీ అంటే, పరాశరుడు, ఏదో మాయచేసో మంత్రం వేసో, ఆమె కన్యత్వాన్ని వెన్నక్కి ఇచ్చేస్తాడు। అది కూడా నీకే తెలియాలి। అవన్నీ। "
"ఊఁ"
- "ఆ పిల్లాణ్ణోమో ఆవిడి చిన్నప్పుడే ఋషులదగ్గరకు పంపించేస్తుంది, ఆయన వ్యాసముని అవుతాడు। మీ శంతన మహారాజు వచ్చేసరికి మళ్ళీ సిద్ధంగా వుంటుంది ఈమె। "
"ఓహో"
- "శంతన మహారాజుని పెళ్ళిచేసుకున్నాక, చిత్రవిచిత్రులు పుడతారుగా। "
"అవును"
- "వాళ్ళిద్దరూ చచ్చిపోతారుగా పిల్లలు పుట్టకుండా। అప్పుడు వాళ్ళకి అన్నవరసయ్యేవారు వీర్యదానం చెయ్యాలన్నమట పెళ్ళాలకి। "
"ఆన్? "
- "అదే మరి భీష్ముడు మొగుళ్ళకు అన్నగారు కదా, అంటే బావగారి వరస కదా? "
"అయితే, ఛిఛీ మఱీ అదేంటిరా, ఎంత మొగుడు చచ్చిపోతే మాత్రం। బావగారితోనేంటిరా"
- "అదే రాజులకు వంశం ఆగిపోకుండా అన్నగారు వీర్యదానం చెయ్యవచ్చన్నమట।"
"అందుకేనేమో జనాలంటారు భారతమంతా బొంకూ రామాయణమంతా రంకూ అని। "
- "అదేనే మఱి క్షత్రియులు కదా, రాజులు లేకపోతే రాజ్యం ఏమయిపోతుందే, అందుకే వాళ్ళ అలాచేయవచ్చని అప్పటిలో నియమం వుంది।" (ఇంత అలౌకివాదం నేను జనమలోనెప్పుడూ గుప్పించలేదు) " ఇంతకీ ఏమంటారూ జనాలూ? "
"రామాణమంతా రంకూ భారతమంతా బొంకూ అంటారు। అదే మఱి సీతాదేవిని ఎత్తుకెళ్ళి అన్నాళ్ళు అక్కడవుంచుకున్నాక అప్పుడు వెనక్కి తీకుకొచ్చాడగా రాముఁడు। అదే జనాలకు తెలియక అలా అంటారులే। "
- "అవునా, బానేవుంది। మొత్తానికలా వంశవృద్ధికోసం వీర్యదానానికి భీష్ముణ్ణి అడుగుతారు। కానీ అయనేమో భీష్మప్రతిజ్ఞ చేస్తాడుగా నా వారసులు రాజ్యమేలరని। సత్యవతీదేవి వారసులే ఏలతారని। వీళ్ళు సత్యవతీదేవి వారసులయిననా ఈయన వారసులు కూడా అవ్వకూడదని అయన ససేమిరా వల్లకాదంటారు। అప్పుడేమో ఆవిడ ఇలా నా పెళ్ళికాకముందు ఇలా జరిగింది కథ అనిచెబితే వ్యాసుణ్ణి పిలుస్తారన్నమట।"
"ఆయనేమో భయం కరంగా వుంటాడంట కదరా"
- "అవును, అందుకే పెద్దది అంబా అంబాలికా దానిపేరు అది కళ్ళు మూసుకుంటుంది"
"ఒకత్తేమో తెల్లమోతుంది కావోల్సు అందుకే దానికి తెల్లగా పాండురాజు పుడతాడు"
- "రెండోదేమో తెల్లబోయి చమట్లు కక్కేస్తే దానికి పాండురాజు పుడతాడు। "
"అప్పుడు దాసీని పంపిస్తారనుకుంట।"
- "మఱి పెద్దోడు గుడ్డోడు, రెండోవోడు పాండుజబ్బువుందికాబట్టి, పెద్దదానికి నచ్చజెప్పి మళ్ళీ పంపుతారు। అదేమో భయపడిపోయి దాసిని పంపిస్తుంది। దాసేమో మహర్షి నా అదృష్టం ఈయనకు సేవచేయడం అని చెప్పి..."
"అదేమో మహర్షిని మంచి చేసుకుంటే విదురుడు పుడతాడన్నమట, కానీ రాజు అవ్వడుగా। "
- "ఆ దాసేమో మహర్షికి సకల సేవలూ చేసి సంతోష పెడితే, ఆయన విదురుణ్ణి కలుగఁజేస్తాడు, కానీ మఱి దాసి కొడుకు కాబట్టి రాజుకాలేడు। అదన్న మట కథ। ఇప్పుడేమో ఆరణ్య పర్వంలో దృతరాష్ట్రుడు వాడి మీద కోపం వచ్చి అడవికి పంపేశాడు ధర్మరాజుదగ్గరకు। ఊఁ చూడు చెబుతున్నారు।"

Tuesday, April 06, 2010

అమ్మమ్మ కబుర్లు ౧ - మాఁవయ్య వరస

"ఏంట్రా అది?"
- "ఇదిగోనే గోదారి, తిను అచ్చం చాక్లేటులా వుంది। "
"చిచ్చీ అదేం తినడంరా, అందంగా పళ్ళెంలో పెట్టుకుని తినడం మానేసి।"
- "చాలా బాగుందే, నెయ్య చాలా బాగా అంటుకుంది, బాగా మాడ్చకుండా లేతగా వుంది। ఇదే కొట్టులో కొంటే ఎంతో తెలుసా, ఈ మాత్రం ముక్కకి ఒంద రూపాయలంటాడు। అంతిచ్చినా దొరుకుతుందని లేదే।"
"నేను ఎంగిలి తిననురా।
ఒక సారి ఏమయిందంటే, నా పెళ్ళికి నేను చాలా చిన్నదాన్నిరా।
మా చింతాత అదే మా మాంగారు వచ్చి, మా అమ్మతోనే, అమ్మా మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి చెయ్యమ్మా, ఐదోవోడికి దీన్ని చేస్తే ఆరోవోడికేమో మా మనవరాలిని చేస్తాము। అన్నాడు।
మా అమ్మేమో ఇప్పుడే పెద్ద దాని పెళ్ళి చేశామండి మా తమ్ముడికి ఇంకా ఇదీ చిన్నపిల్లే దీనికి ఇప్పుడే చెయ్యమండీ అని మా అమ్మకేమో ఇంకా పెళ్ళి చేయడం ఇష్టం లేదు।
ఆయనేమో, లేదండి పెద్దదాన్ని మాఁవయ్యకిచ్చి చేసారు కాద, దీన్ని కూడా మాఁవయ్యకిస్తే సుఖపడతుంది। అన్నాడు।
మా అమ్మే అన్నీ చూసుకునేది మా పెళ్ళి విషయాలూ గట్టా, మా అయ్య కేమో పెద్ద తెలిసేది కాదూఽఽ।
అప్పుడేమో మా తాత ..."
- "అంటే మీ మాంగారు.."
"అపుడేమో ఆయన, మా అన్నమనవరాలు వుంది దాన్ని కూడా మాఁవోడికిచ్చి చేస్తామంటున్నారు, మాకేమో మీరైతేనే బాగుంటుందనుకుంటున్నాము। "
- "అంటే తాత పెదబాబు కూతురి కూతురు। "
"అవును। "
- "అంటే తాతకి నువ్వేమో పెత్తల్లి కూతిరి కూతురు, ఆవిడేమో పెదబాబు కూతిరి కూతురు। "
"అవును।"
- "ఇద్దరూ మేనగోడళ్లే।"
"అవును।
మా గంగరాజు మాఁవయ్యకేమే నన్ను వీళ్ళకిచ్చి చేసేద్దామనుండేది, మా అమ్మకేమో అప్పుడే ఎందుకనుకునేది।
గంగరాజు మాఁవయ్యంటే, అదే మా అమ్మ మార్టు తమ్ముడు, పెద్దవాడు। "
- "అంటే వెంకటరత్నంగారి అన్నయ్య।"
"అవును। "
- "అంటే మీ బావగారి అన్నయ్య।"
"అవును।
ఆయనేమో మా పిన్ని కూతుర్ని చేసుకున్నాడు। అంటే సొంత అక్కకూతుర్ని చేసుకున్నాడు। "
- "అయితే ఇప్పుడు మీ అమ్మ పెద్ద తమ్ముడేమో సొంత అక్క కూతుర్ని, మీ అమ్మ రెండో తమ్ముడు మీ అక్కని, అంటే మార్టక్క కూతుర్ని చేసుకున్నారు, మళ్ళీ తాతేమో మీ అమ్మకి పింతల్లికొడుకు నిన్నుచేసుకున్నాడు। దేశమ్మీద ఎవరూ లేనట్టు అందరూ అక్క కూతుళ్ళనేనన్నమట।"
"ఇంకా వుంది విను।
మా తాత, అదే మా మాంగారు ఇలా పలానా తారీఖున బల్లిపాడులో దినం వుంది మఱి, ఆనాడు వాళ్ళు, అందే మీ తాత పెదబాబు ఆళ్ళు అక్కడికి వస్తున్నారు, తాంబూలాలు పట్టుకొని, వారికంటే మీరు ముందు వచ్చి ఇస్తే మీకే ఇస్తాము। లేకపోతే సంబంధం వారికెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు।
మా గంగరాజు మాఁవయ్య ఆనాడు బల్లిపాడు వెళ్ళాడు, వాళ్ళు కూడా వచ్చారు, ఒక పక్క దినం జరుగుతుంటేనే, వాళ్ళు వీధి గుమ్మమమ్మటా వస్తుంటే, మా గంగరాజు మాఁవయ్య దొడ్డి గుమ్మమంటా వెళ్ళి తాంబూలం ఇచ్చేసి పెళ్ళి కాయం చేసేశాడు।
ఆ తరువాత వాళ్ళేమో ఆ పిల్లని చిడిపి ఇచ్చారు। "
- "అంటే గోదారి గట్టు మీద వూరు కదా?
అవును। వాళ్లూ బాగానే వుండేవారులే। ఇప్పుడు కాస్త చితికారు గాని।
ఆ తరువాత మా మరిదికి మా ఆడబడుచు కూతుర్ని అనుకున్నారన్నానుగా। "
- "అదే మీ మరిదంటే మీ మాఁవయ్య కూడా, తాత తమ్ముడు చివరతను కదా। "
"ఊఁ"
- "మీ ఆడబడుచంటే మీ పిన్ని, మీ పిన్ని కూతురు అనసూయత్తని ఆఖరు తాతకనుకున్నారా? "
"కానీ జరగలేదుగా, వీరమ్మమామ్మతో అయ్యింది ఆయన పెళ్ళి।
వీరమ్మ నాకంటే పెద్దదేగాని, కాపరానికి మాత్రం నా తరువాతే వచ్చింది, అదీ మా చుట్టమే అంతకు ముందే। "
- "అయితే మీ మాఁవయ్యలందరూ వరుసగా మీ అప్పాజెళ్ళెళ్ళని చేసుకున్నారు, మీ తమ్ముళ్ళేమో మీ కూతుళ్ళని చేసుకున్నారన్న మట। "
"అప్పట్లో మఱి మా అమ్మ ఆఱుగురి పెళ్ళిళ్ళు చేసింది, అందరం సుబ్బరంగా కాపురాలు చేసుకున్నాము। ఈ రోజుల్లో ఒకటి రెండు పెళ్ళిళ్ళకే కష్టపడిపోతున్నారు, చేసినా అయ్యి నిలవట్లేదు।
మా అప్పుడు ఇన్ని చూసేవారేంటి, మేమంటే జనాలు మంచోళ్ళని, అందరూ ఎగబడి చేసుకునేవారు। తాతాళ్ళు మంచోళ్ళని మా మాఁవయ్య కూడా మా పెళ్ళి కుదిర్చేశాడు।
ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడేమో నాకు ఎందేళ్ళో ఎంతోరా, పెళ్ళయ్యాక గుడికి తీసుకెళ్తే గంట అందకపోతే, మా తాత "
- "అదే మాంగారు "
"ఆయన ఎత్తుకుని గంట అందించాడు।
అప్పుడు తాతకి పట్టించిన పానకం నాకిచ్చారు తాగమని, నాకేమో అసలు ఎంగిలి ఇష్టముండదు। నెత్తిమీదఁ సుడుపుడుకాయ వేసిందన్నమట, మా తాత దాన్ని ముట్టుకుంటే, కందిపోయిందని ఏడేసి మారాం జేసి తాగలేదు। అప్పుడెంత నేను, మీ బుజ్జక్క పిల్లలంత వుండేదాన్ని, తాతేమో నీలాగ వుండేవాడు, నీకంటే చిన్నోడేగాని, అంత పెద్దగా పొడుగ్గావుండేవాడు, నేనేమో ఇంతే వుండేదాన్ని। "
- "ఇంచక్కా నీ పెళ్ళయ్యి ఢబ్బై యేళ్ళయ్యాయి, నాకింకా అవ్వలేదే! "
"చేసుకోఽఽ, ఎవరొద్దన్నారు। ఎప్పుడూ పెళ్ళిపెళ్ళంటావు చేసుకోరాదా। "
- "ఊఁఽఽ ఎనిమిదయ్యింది పద టీవీలో భారతం వస్తుంది।"