భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, March 27, 2009

సింహరాశి అనానిమిషులు - 'సింహవిరోధి' సపోర్టు గుంపు

నేను ఏదో పుస్తకాల కొట్టు కెళ్లి ఏవో పుస్తకాలు కొంటే వాడు పోనీలే పాపం అని నాకు ఒక పంచాంగం బహుకరించాడు. అది తిఱగవేస్తూ ఈ ఏఁడు ఏ రాశి వారికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత అవమానం ఎంత అని చూస్తూండగా. నా రాశి అయిన సింహరాశికి వచ్చే సరికి వ్యయానికి(౫) రెండితల ఆదాయం(౧౧), అవమానానికి(౩) రెండితల రాజపూజ్యం(౬) చూసి తెగ సంబర పడిపోయాను. అలాగే మేష రాశివారి ఫలితాలు జూసి చాలా జాలివేసింది. ఆదాయం రెండయితే వ్యయం ఎనిమిదఁట, రాజపూజ్యం ఒకటైతే అవమానం ఏడఁట! అయ్యోపాపం అనుకుని వారి ఫలితాలు చదవగా "ఈ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలము" అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓహో ఈ అంఖెల్లో ఏం లేదన్నమట! అయితే ఒక సారి సంహిరాశిలోకి వెళ్ళి మన ఫలితాలు ఎలా వున్నాయో సువివరంగా తెలుసుకుందా అని చదవడం మొదలు పెట్టాను.


ఈ రాశి వారికి గురుడు 30-7-09 వరకు షష్టస్థానమైన మకరమునందు తదుపరి సప్తమస్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగాను, 30-7-09 నుండి 19-12-09 వరకు వక్రనడకతో షష్టమరాశియైన మకరరాశిలోను తదనంతరము సప్తమస్థానమైన సహింహరాశిలోనూ పిమ్మట ద్వితీయ రాశియైన కన్యరాశి యందు రజితమూర్తిగాను సంచారము. రాహువు 19-11-09 వరకు షష్టమస్థానమైన మకరరాశి యందు తదనంతరము పంచమస్థానమైన ధనస్సునందు లోహమూర్తి గాను, కేతువు 19-11-09 వరకు వ్యయస్థానమైన కర్కాటకరాశియందు, అనంతరం లాభస్థానమైన మిథునరాశి యందు లోహమూర్తి గాను సంచారము.

ఈ రాశివారికి ఏలినాటిశని ప్రభావము ప్రబలముగా వుంటుడ వలన, గురుని యెక్క బలము సామాన్యముగా యుండుట వలన ఈ సంవత్సరము ఇబ్బందికరముగా యుండును.
ఆర్థికముగా వెనుకబడుట, అనారోగ్యము, మానసికంగా బలహీనత, కోర్టువ్యవహారములలో చిక్కుకొనుట, ప్రమాదము ఏర్పడుట, నిస్త్రాణనిరాశలు, మిత్రులు శత్రువులగుట, స్థిరాస్తుల విక్రయము, ఋణములు చేయుట జరగే అవకాశములు గలవు.

వ్యపార రంగమలోని యీ రాశివారికి జాయింటు వ్యాపారము వలన నష్టపోవుట జరిగే అవకాశము గలదు. ఆర్థక లావాదేవీలతో సమస్యలు ఏర్పడును.
రాష్ట్ర కేంద్ర ప్రయివేటు రంగములలోని ఉద్యోగస్తులకు వత్తిడి ఎక్కవగుట, కొన్ని పరిస్థితులలో సస్పెండు అయ్యే అవకాశములున్నవి. కావున అతిజాక్రత్తగా మసలు కొనుట మంచిది.
విద్యార్థులకు మొదటి ఛాన్సులో కంటే రెండవ ఛాన్సులో చక్కని ఫలితం లభిస్తుంది.
రైతులకు పంటల దగుబడి తక్కువగా వచ్చును. తద్వారా ఆర్థిక పరమైన నష్టము కలుగును.
కాంట్రాక్టుదారులకు టెండర్లు కలసివచ్చనప్పటికీ, ప్రభుత్వపరమైన ఒత్తిడుల వలన కష్టనష్టముల పాలగుట జరుగును. ఫైనాన్సు వారికి లాభదాయకము.
వృత్తిపనివారలకు, టీవి మఱియు సినీకళాకారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు.
ఆదాయము కంటే ఖర్చు తక్కువగా వున్నప్పటికి అప్పుడప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు కలుగును.
రాజకీయనాయకులైన యీ రాశివారికి తగినంత ప్రోత్సాహకరమైన కాలముకాదు.
ఈ రాశి స్త్రీలకు తమమాట చెల్లుబాటుకాదు. వ్యతిరేకత ఎక్కువ. చోరభయం, ఉదర సంబంధమగు వ్యాధులు, తలపోటు, జ్వరములు వచ్చుట సంభవించును.
అవివాహితులకు వివాహము జాప్యమగును.

ఈ రాశివారి అదృష్టసంఖ్య ౧. అనుకూల సంఖ్యులు ౨,౩,౯. రాశ్యాధిపతి రవి గావున కెంపు ధరించుట, మఖానక్షత్రమువారు వైఢూర్యము పుబ్బవారు వజ్రము ను ధరించుట మంచిది. ఈ రాశి వారు గురు శనులకు జపదానములు చేయుంటకొనుట, నలమహారాజు చరిత్ర పఠించుట మంచిది. నీలిరంగు పువ్వులు నల్లని వస్తువులు నువ్వులనూనె దానంగా ఇవ్వండి. ఎఱుపురంగు పూలమొక్కలను తూర్పుదిశలలో పెంచండి. శుభం జరుగుతుంది.

===========================================

"*&^) మ్యాన్, ఈ ఏఁడు బాగా *&^% పోయినట్టున్నాం" అనుకున్నాను. వీడు ఇంత సువివరంగా వ్రాయడం మానేసి, "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.

వ్యాపారం చేద్దామంటే నష్టపోతామంట. ఉద్యోగం చేయబోతే అది కాస్తా ఊడిపోతుందఁట. పోనీలే మళ్ళీ పైచదువులకు పోదామంటే, అవీ కుదరవఁట. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం కళారంగం అబ్బే ఎక్కడా లాభం లేదు. పోనీలే పెళ్ళి చేసుకుంటే పోతుంది అని అనుకుంటే, ఆ భాగ్యమూలేదు. పెపెచ్చు అనారోగ్యం కూడానఁట. కాబట్టి ఈ ఏఁడు కూడా ఇలా నిస్త్రాణ నిరాశలతో గడిపేయాలఁట. (నిస్త్రాణ nis-trāṇa. n. Weakness.).
పోనీలెండి, ఈయనెవరో ముందే చెప్పి మనల్ని మానసికంగా సిద్ధంగా వుంచాడు. ఇప్పుడు నాకు ఏంజరిగినా, "అఱె ఆ రోజు పలానా నామాని వారి పంచాంగంలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని వ్రాసారే" అనుకోవచ్చు. అలానే అడ్డమైన ప్రయత్నాలలో శ్రమ, డబ్బు ఖర్చు మానుకోవచ్చు. ఇంచక్కా కాళీగా కూర్చుని బ్లాగులు చదువుకోవచ్చు.

===========================================


ఏమిటి రాకేశ్, ఇంతా చదువుకొని నువ్వు కూడా ఇలాంటి మూడనమ్మకాలు పెట్టుకంటావా?
ఆఖరికి ఇంతకి దిగజారిపోయావా?
ఇవన్ని సోది మాటలు రాకేశ్, పొట్టగడుపుకోవడానికి వ్రాస్తారు, వాటిని నమ్మకూడదు.
అసలే స్టాటిస్టికల్ అనలిష్టువి, వెయ్యమందిలో ఒకఁడికి పది సార్లు టాసు వేస్తే వరుసగా పదిసార్లూ బొరుసే రావడం సహజం అని తెలిసినవాడివి. మానవకృషి యొక్క విలువ తెలియకపోవడమేమిటి?
ఇలాంటి మాటలు మీరు అంటూవుండవచ్చు.

అవును నిజమే, నేను చాలా చదువుకున్నాను. లెక్కల నుండి ఛందస్సు వఱకూ, ఆర్థిక శాస్త్రం నుండి మానసిక శాస్త్రం వఱకూ. ఆచార్యుని అద్వైతం దగ్గర నుండి ఐనిస్టీను రిలేటివిటీ వఱకూ చాలా విషయాలు చూచాయిగా పరిచయం కూడా వున్నాయి. ఏన్నో పరీక్షలు కష్టపడి వ్రాసాను, పలుదేశాల్లో పలు రంగాల్లో పనికూడా చేశాను.

నేనూ రెండేండ్ల క్రితం వఱకూ మీలాగానే ఆలోచించాను. తుస్ ఈ జాతకాల్లో ఏం లేదని. ఇదే ఏలినాటి శని గుఱించి మీరు నాకు రెండేళ్ళ క్రితం అనగా ౨౦౦౭ ఉగాదిలో చెప్పుంటే. "తుస్ శనీ లేడు గినీ లేడు, నా రాశిలో కొస్తేనేం, వెనుకభాగం మీద తంతే, వీధవతల పడతాడు" అనేవాడిని. అలా ౨౦౦౮ ఉగాదిలో చెబితే, "వెల్... అంటే... ఇలాంటివి నమ్మకూడదనుకో... కానీ చెప్పలేం.. ద యీనివర్స్ కెనోన్లీ బీ సో రేణ్డమ్ కదా... దానీకీ దీనికీ స్టాటిస్టికల్ కోరిలేషన్ వుండడం పెద్ద ఆశ్చర్యమేముంది. గత ఏఁడాది నేను అనుకున్నట్టుగా ఒక్కటీ జరగలేదు చూడండి. మా బామ్మ కూడా 'జాతకం బాలేదురా అందుకే అమెరికానుంచి వచ్చేసావు' అనంది" అని అనేవాడిని.

ఇక ఈ ఏటికి వచ్చేసరికి పంచాంగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. "శని ఎలా వున్నాడు, అతనికి అన్ని మర్యాదలూ జరుగుతున్నాయా, ఇంకెన్నాళ్ళుంటాడు మన రాశిలో" వంటివి తెలుసుకుందామని. వాళ్ళు "పర్వాలేదు, ఈ ఏఁడు బానేవుంటుంది" అనంటే నా పనులు నేను చూసుకుందామని, లేకుంటా - ప్రస్తుతం ఉన్నట్లుగా కాళీగానే వుందామని నిర్ణయించుకున్నాను.

మొన్నటి వఱకూ ఎవరైనా "వూళ్లోనేం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు?" అనడిగితే మార్చనో మాఘమనో ఏదో చెప్పేవాడిని. ఇప్పుడేమో ఆ శ్రమంతా లేక "ఇక్కడే వుంటున్నా ఎక్కడికీ వెళ్ళట్లేదు" అని చెబుతున్నాను. ఇఁక మొన్నొకసారి ఒక హస్తజ్యోతిష్యుని దగ్గర చెయ్య చూపించుకుంటే, "అఱ్ఱె ఈపాటికే నువ్వు ఆసుపత్రిలోనుండాలే" అన్నాడు. "వెల్ డ్యూడ్ యు గాటే పాయింట్" అనుకున్నాను మనసులో. అలా ఆ డ్యూడ్ పాయింటుతో అప్పటికే బలంగానున్న నా నమ్మకం ఇంకా బలపడింది.

పోనీ లెండి నల్లమబ్బుకి తెల్లంచు అన్నట్టు. ఫైనాన్సులో వున్నవారికి లాభదాయకం అన్నాడు. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ . కొనసాగిస్తే సరిపోతుందిదేమో. అసలే రెండు నెలలుగా లాభాలువస్తున్నాయి. అలలే ఇవాళ అచ్చంగా నా కోసమే అన్నట్టు నిఫ్టీ 3050 పైన ఆగింది. కాని నా స్నేహితురాలు తన తరఫున కూడా పెట్టుబడి పెట్టమంటుంది. "నా పంచాంగంలో జాయింటు వ్యాపారం వల్ల నష్టాలు వస్తాయనుంది, కాబట్టి నీ రెండు లక్షల పెట్టుబడీ నువ్వే వుంచుకోవమ్మా" అని చెప్పేశాను.

===========================================

"ఈ టపా చదువుతున్న సింహరాశి సోదరసోదరీమణులు, బావమరిది మరదలాదులు, నిస్త్రాణ నిరాశ పడవలసిన అవసరం లేదు" అని నేనంటే, నేను మీ సగటు తెలుఁగు రాజకీయవెత్త కంటే దుష్టుడనైపోతాను. కాబట్టి నిస్త్రాణ నిరాశ పడదాం, కానీ అది ఉమ్మడిగా పడదాం. యద్భవిష్యులమై కూర్చోకుండా, మనం సింహరాశి అనానిమిషులు అని ఒక సపోర్టు గుంపు ఏర్పఱచుకుందాం.

ప్రతి శని వారం, అలానే ప్రతి నెలలోనూ మన అదృష్ట సంఖ్యలైన ౧, ౨, ౩, ౯ అలానే ౧౧, ౧౨, ౧౩, ౧౯, ౨౧, ౨౨, ౨౩, ౨౯, ౩౧ తేదీలలో కూడలి వారి కబుర్ల గదిలోఁ కలసి మన దగ్గరున్న వజ్రవైడూర్యకెంపులను పంచుకుందాం. మఱి నాలాంటి నిరుద్యోగులకు వజ్రం కొనుక్కోవాలంటే కష్టమేకదా. శని గురువులకు జపదానం చేద్దాం, వాళ్ళైనా పాపం ఇంటింటీకీ ఏం వెళతారు. మన రాశి లోకి శని అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాడు. కానీ పాపం శనిని శని ఎప్పుడూ పీడిస్తూనేవుంటుంది. అలానే నేను నలమహారాజు చరిత్ర కాపీ చేస్తాను మీరు పేస్టు చేసుకోండి.

మీరందఱూ నాకు తలో ఐదువేలు నగదు పంపండి, నేను మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయంలో శనిత్రయోదశినాడు మీ పేర్ల మీదఁ లక్షనామజపదానం చేయిస్తాను. సరేనా మఱి. అప్పటి వఱకూ ఈ బరాకేశ్వర మంత్రం గుర్తుపెట్టుకోండి.
ఆ॥
కద్దు కటిక రాత్రి పొద్దు పొడుపు ముందు
ఇట్టు యీసు గోన గెట్టు వర్సు
బీఫొరిట్టు గెట్సు బెటరు! సో టేక్కేరు
విశ్వదాభిరామ వినుఁ బరాక!

Monday, March 23, 2009

ఇంసోమ్నియపు పద్యాలు

రోజూ రాత్రి పడుకునేముందు ప్రొద్దుటే ఆఱింటికి లేవాలి అనుకొని తొందరగా పడుకోవడం జరుగుతుంది. కానీ నిద్రపట్టిచావదు - వేడనో దోమలనో ఆలోచనలనో. అలా నిద్రకోసం వేచిచూస్తున్నంతసేపు, ప్రపంచ పరిస్థితిని బాగుచేయాలనే ఆలోచనల ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి నిన్న రాత్రి రెండు వృత్తాలు వ్రాయఁబూనుకున్నాను. కాగితం కలం కంప్యూటరు కీబోర్డు లేకుండా బుఱ్ఱలోనిలా ..
చం॥
కవితలు మాని యీ యువత కాసులె లెక్కలు వేసుకొంటిరే ।
అవతల పేదజీవితము లాకలి కేకలు పట్టవేవి । పై
స విలువ యైన లేని జలసాలకు బోతిరి నాగరీకులై ।
సుమిమల సౌమ్య సుందరతఁ జూడక పోతిరి కామచారులై ॥

చంపకమాలంటే నజభజజజర అని కాకుండా తననన తాన తాన తన తానన తానన తానతానతా అని గుర్తు పెట్టుకంటే మంచిదని విని అలా పట్టాను. కాబట్టి ఈ పద్యంలో పదాల విఱుపులు కూడా అలానే వస్తాయి.


మ॥
కడుపా? అయ్యది ఖండవల్లి మడుగా? కాజాలు, లడ్డూలు, మీ
గడ బొబ్బట్లును, పప్పుచారు, పెరుగూ, కారాల పచ్చళ్ళు, మా
మిడి పళ్ళేమిటి, పాయసాలిఁక యిలా మీరెంత వడ్డించినా
మిడతంభొట్ల గణేశు గాడికసలేమీ చాలదంటే నిజం॥

కడుపా అయ్యది ఖండవల్లి మడుగా అన్నది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారనే కవి వ్రాసిన "బొబ్బిలి యుద్ధం" నాటకం లోనిదఁట. ఖండవల్లి మడుగు ఇప్పుడో జాతీయంగా మారినా (ఖండవల్లిలోని ప్లాస్టిక్ చెత్తకి అది ఒక ముఱికి కూపంలా కూడా మాఱివుంటుంది లెండి అది వేఱే విషయం) ఆ మిగిలిన పద్యం ఎవరికీ తెలియదు. ఆ మత్తేభ విక్రీడితమెలా వుంటుందో నాకు తెలియదు గాని, ఇలావుంటుందేమో అన్నట్టుగా మీకోసం అచ్చమైన వాడుక తెలుఁగులో పూరించాను. ఆస్వాదించండి.

Sunday, March 08, 2009

బృహన్ముంబయి - ౧వ భాగము

ప్యాంటులో పాసు పోస్తూ స్కూలు నుండి వీధిలోనికి పెరుగెడుతున్న ఆరేళ్ళ కుఱ్ఱాడిలా, కంగారు కంగారు గా బంబాయి వీధులలో పరుగెడుతున్న నీళ్ళ లారీ పై బృహన్ముంబయి మహానగర పాలికా, అని వ్రాసివుండడం చూస్తే మీకు మొదట అనిపించేదేఁవిటంటే,
బృహత్ + ముంబయి = బృహన్ముంబయి
, అనునాసిక సంధి బాగుంది అని.

ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి వీరు ఇంత టాం వేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ రోజు గడిచేలోపు బృహద్బృహన్ముంబయి అతిమహానగరం అని మీకు రూఢీగా తెలియవస్తుంది.

ముంబయి నగరానికి వెళ్ళడం ఒక త్రీడి వెర్చుయల్ రియాలిటి సినిమా చూడండలాంటిది. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే, సినిమాలో పాత్రలు మీతో సంభాషించడం. మీ చేయి పట్టుకున్ని మిమ్మల్ని సినిమాలోపల నడిపించడం. నాకు ముంబయిలో పని పడింది. దానికి రెండు రోజులు ముందు వెళ్లి , పని అయన ఒక రోజు తరువాత వెనక్కి వచ్చాను. నేను అక్కడవున్నన్నాళ్ళూ వర్షం పడుతూనేవుంది. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల అంత కసిగా అంత సుధీర్ఘకాలం వర్షం పడడం సహజంగా పరిగణించబడుతుంది. నగరంలో కంపు చూసి దాన్ని శుభ్రం చేయబూనిందేమో వర్షం అని మీకు అనుమానం కలుగవచ్చు. ఆ అనుమానం బహుసహజం. కానీ సహ్యాద్రులకు పశ్చిమ పక్క నివసించిన ఎవరికైనా, ఈ వర్షం ఈ ప్రాంతాలలో ఈ కాలంలో ఇలానే పుడుతుందని తెలుసు. కేరళలో రవి నేల కానలేని కారడవులనుండి, కొంకణి నిర్మానుష్య సముద్రాల మీద వాన పడడం కోసం మాత్రమే పడుతూవుంటుంది. పడుతూనేవుంటుంది.

అలాంటి ఒక వాన ఆదివారం నాడు, రెండు కోట్ల జనులపై దయలేకుండా నగరంపై విరుచుకు పడ్డ వానలో ఉదయాన్నే ఆరున్నరకి బయలుదేరా నగరం మీదకు, నగరం లోనికి. సరిగా గంటన్నరలో చాలా దూరం వెళ్ళాలి.
వెళ్లాను రైలుమందిరానికి. పూజారి గారి పలుకుకోసం పడిగాపులుగా పురజనులు ప్రక్రమాలు కట్టారు. అక్కడ నించుంటే గంటన్నర కాస్త గట్టెక్కేస్తుంది, దానితోఁ బాటు నా అరవై వేలు కూడా, వెంటనే ఆటో కోసం వెదకి, ఇంకో రైలు స్టేషను దగ్గర దింపమన్నా, ఎక్కడ నుండి నేను వెళ్ళాల్సిన చోటుకు రైళ్ళు దొరుకుతాయో అలాంటి స్టేషను ఇంకొకటి కడ దింపమన్నాను. అతను ఎక్కించుకొని, కొంత దూరంలో ఉన్న ఒక కూడలి దగ్గర వదలి. అదిగో అక్కడ నీకు కావలసిన బస్సు దొరుకుతుంది అని చెప్పి డబ్బు తీసుకొని తుఱ్ఱుమన్నాడు. అక్కడికి వెళ్ళి నించున్నాను. నలుగురునీ అడగసాగాను పలానా స్టేషనుకు బస్సు వస్తుందా అని.

సకుటుంబ సమేతంగా బస్సు కోసం వేచివున్న ఒకాయన మీరు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు, కాందివిలి అని చెప్పాను. అరె మేమూ అక్కడికే. ఇక్కడనుండి నేఱుగా బస్సులు దొరుకుతాయి, ట్రెయిను అవసరం లేదు. అన్నాడాయన. మాతోఁ బాటు రండి బస్సులో వెళ్దాం అన్నాడు. సరే బస్సు ఎప్పుడు వస్తుంది ఎంత సేపు పడుతుంది అని అడిగాను. ఇప్పుడు వస్తే గంటన్నర పడుతుంది అన్నాడు. నాకు నా అరవై వేలూ, దానితోఁబాటూ ఎన్నో చదువుతూ గడిపిన అర్థరాత్రులూ గుర్తుకువచ్చాయి.
సరె బస్సురావడానికో అనడిగితే.. "మేము ఇక్కడే అరగంట నుండి చూస్తున్నాము రాలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు". హూఁ... అవునా, నాకు పదేళ్ళగా లాటరీ తగలలేదు కాబట్టి ఇవాళ తగలవచ్చు అన్నట్టుగానుంది జవాబు. గత్యంతరం లేక నేను నా అరవై వేలూ ఆయన బుట్టలో పెట్టాను. ఆ సమయంలో నేను మార్కావ్ ప్రాసెస్ల గురించీ, ఎక్సుపోనెన్షియల్ డిసట్రిబ్యూషణ్ల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను. ఆయనట్టుగానే యాండ్రే మార్కావ్ ని వెక్కిరిస్తున్నట్టుగా బస్సు వచ్చింది. నా కొత్త మిత్రులు పెట్టెలతోఁ బస్సువైపు పరుగెడుత్తడానికి పూనుకున్నారు. వారికి ఒక సమాను ఎక్కువయ్యేసరికి. భయిసాబ్ కాస్త ఈ పెట్టి మోసుకెళ్ళండి అని నాకు ఒక పెట్టి పారేసారు. మొత్తానికి బస్సు ఎక్కి కూర్చున్నా. కాళీగానే వుంది. గంటన్నర ప్రయాణమట, టికెట్టు మాత్రం పద్నాలుగు రూపాయిలే. బస్సు వెళుతూ వుంది. నేను ఏ పరివారంలో భాగమయ్యానో వారు నాకు అభయ-చూపులు ఇస్తూండడంతో లేని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. నా అఱవై వేల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నిస్తూ.

తడిచి ముద్దైన ముంబయి రోడ్ల మీద చక్రాలున్న పడవా యిది, లేదా నీట ప్రయాణించే బస్సా ఇది అన్నట్టుగా శర వేగంతో దూసుకుపోతుంది బస్సు. మధ్యలో నాకెందుకో నేను వెళ్ళాల్సిన చోటు నుండి కొంత దూరంగా వెళుతున్నానేమో అని అనుమానం కలిగింది. మా కొంగ్రొత్త ఇంటిపెద్దకి చూపించా నేను వెళ్ళవలసిన చిరునామా ఇది అని. ఆయన దాన్ని కొంత బాధగా చూసి, నువ్వు వెళ్ళాల్సింది కాందివిలి తూర్పు, మేము పడమర. మన దార్లు త్వరలోనే విడిపోతాయి, అని చెప్పాడు. పుంతలు విడిపోయిన చోట నేను దిగాను. మా పెద్దాయిన నన్ను ఎంతో బాధతో చూస్తూనే వీడ్కోలు చెప్పారు. గంటన్నర పాటూ ఒక కుటుంబంలో భాగమై, వాళ్లు దిగేటప్పుడు వాళ్ళ పెట్టెలు ఎవరు దించుతారో అన్న సంశయంతోనే నేను దిగి కిటికోలోనుండి వీడ్కోలు చెప్పి ఆటోకోసం వెదక సాగాను.

ఒకళిద్దరు ఆటోవాళ్లు నేను రానన్ననారు. మూడో ఆయన ఎక్కు అన్నాడు. కానీ అతని ముఖంలో 'నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది, దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం' అంటున్నప్పడు ఒక ఆత్మవిశ్వాసం గల వైధ్యుని ముఖంలో కనిపించే చూపు అతని ముఖంలో నాకు కనిపించింది. ఆటో కొంత కాలం తోలాక తీఱికగా అన్నాడు. ఇప్పుడు భారీవర్షాలవలన అవతలకు (తూర్పుకు) వెళ్ళవలసిన సురంగ రోడ్డు నీట మునిగింది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నేను నిన్ను రైల్వేటేషను ఇవతల వదులు తాను. నువ్వు దాన్ని దాటి అవతలకు వెళ్ళు. ఆవతలి పక్క షేర్డు ఆటో నీ కోసం ఉంటుంది అన్నాడు. నాకు మళ్ళీ నా అరవై వేలు నా దగ్గర నుండి దూరంగా పోతున్నట్టు అనిపించింది.

కొంత సేపటికి అలానే ఒక స్టేషను ఇవతల వదిలాడు. అవతల కెళడానికి దారి అదిగో అటు అని చూపి. అటు పోయి చూడగా, చాలా మంది రైలు పట్టాల ప్రక్కన దాట కూడని గేటు క్రింద నుండి దాటి, అవతలి ప్రక్కకు వెళ్ళడం చేస్తున్నారు. నేనూ అదే పని చేయబోయేటప్పుడు సరిగ్గా రైలు వచ్చింది. హూఁ జపానులో మూకుమ్మడి ఆత్మహత్యలంటారు, ఇలానే వుంటాయేమో.. అనుకున్నాను.

చివరకు ఎప్పుడో నేననుకున్న రైల్వేష్టేషను యొక్క అనుకున్న ప్రక్కకు రావడంతో నా జీవితం నేను వేసిన ప్లానుకు అనుగుణంగా వచ్చి చేరింది. మన నిజ జీవితాలలో కూడా ఇంతే, మీరు ఇఱవైకి నేను చదువు చించి పారేశ్తా, పాతికకి పెళ్ళాడతా, ముప్పైకి మూడు కోట్లు పోగుజేస్తా, నలభైకి నలుగురు పిల్లల్ని కంటా అని లెక్కలేస్తారు గదా. కానీ నిజంగా అలా ససేమిరా జరగదు. మీరు ఎంత తక్కువ అంచనాలు వేసినా అవి అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదు. మీరు అనుకోనట్టు మాత్రం జరుగుతుంటాయి, అంటే మీరు పాతికకు పెళ్ళి చేసుకుంటాననుకున్నారనుకోండి. అది పాతిక బదులు ముప్పై అవుతుంది. అలాగే నేను నలభైకి నలుగురు పిల్లల్ని కంటా ననుకున్నారనుకోండి, అది ముప్పైకే జరిగిపోవచ్చు. నాకూ అలానే జరిగింది, నేను పావుతక్కువ ఎనిమిదింటికి కాందివ్లి స్టేషను బయట (తూర్పు పక్క సుమీ) ఉంటానని లెక్క వేశానా, కానీ నేను అక్కడికి చేరుకునే సరికి ఎనిమిది అయ్యింది.

ఏఁవైతేనే అవతలి ప్రక్కకు చేరుకొని ఆటోకోసం చూస్తుంటే, నాలాంటి ఇంకో నలుగురు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు.
కుఱ్ఱాళ్ళు అంటే ఒక మాట గుర్తుకువచ్చింది. ఇది అప్పుడు ఆ కుఱ్ఱాళ్ళని చూసినప్పుడు గుర్తుకురాలేదనుకోండి, కానీ ఇప్పుడిలా ఆ మాటని అక్షరాల్లో చూస్తుంటే నాకు గుర్తుకువచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ ఊళ్ళోకి పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చారఁట. ఆయన కుఱ్ఱాళ్ళోయ్ కుఱ్ఱాళ్ళూ అన్న పాట పడారట. చాలా బాగా పాడరు అని ఇప్పటికీ చెబుతూంటుంది. నేను ఆ పాట వినక పోయిన, నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏఁవనిపిస్తుందంటే, నాకు ఆ పాట నచ్చడానికి గల కారణం కుఱ్ఱాళ్ళు అనే మాటలో వరుసా వచ్చే బండి ర క్రింద బండి ర దాని వెనకే వచ్చే అళ క్రింద అళ. వాటిని బండి ర, అళ అనడం మంచిది కాదనుకోండి. ఱ ని ఱ అనాలి గాని బండి ర అంటే ఏం బాగుంటుంది. చూడడానికి ఎంత బండిలా వుంటే మాత్రము. ఉదాహరణకు మీ పేరే అయినాపురం కోటీశ్వరరావు అనుకోండి. మీరు బండగా వుంటారనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా బండ కోటి అంటే ఏం బాగుంటుంది. మీ వూళ్ళో వీదికో కోటీశ్వరరావు ఉన్నాడనుకోండి, అందులో ఇప్పటికే చాలా మందిని కోటి అనే అంటున్నారనుకోండి. అయినా మీమ్మల్ని బండ కోటి అనడం మిమ్మల్ని నొప్పిస్తుందిగా. అందుకే ఱని బండీ-ర అనకుండా ఱ అనాలి. ళని అళ అని ఎందుకనకూడదో చెప్పాలంటే, మీ పేరు సత్తుపల్లి సీతాలు అనుకోండి, మీవూళ్ళో ఇంకా చాలా మంది సీలాళ్ళు వున్నారనుకోండి, ఇంతమంది సత్తుపల్లి సీతాళ్ళున్న ఈ సచ్చుపల్లి సత్తుపల్లిలో ఎన్నాళ్ళుంటామనిఁ దలచి, మీరు కన్నడనాడు వలస వెళ్ళారనుకోండి. అక్కడ మిమ్మల్ని అందరూ సత్తుహళ్ళి సీతాళు అనిపిలుస్తున్నారనుకోండి. అది చాలా భావ్యమే అయినా - ఎందకంటే కన్నడవారికి ళ అంటే మమకారం ఎక్కువ, పైగా వారికిఁ ను, వు, ళు, గళు ప్రథమా విభక్తి - అయినా మీకు మనసు నొచ్చుతుంది కాదా. అందుకనే ళ ని అళ అనకూడదు. అలానే ఙకి తమిళ కథ, ఞకి మలయాళీ కథ వున్నాయి, అవి మరెప్పుడైనా చెప్పుకుందాం. అప్పటివఱకూ ఱ,ళ,ఙ,ఞ లను ర,ల,న,న లగా పలక రాదని బండ గుర్తు మాత్రం పెట్టుకోండి.

ఇంతకీ టేషనీకి అవతల ప్రక్క ఏఁవ్ జరిగిందో నేను చెప్పనేలేదు కదా. అవతల ప్రక్కకు వెళ్ళగానే అక్కడ కొందరు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు. వారు కూడా పరీక్ష వ్రాయడానికి వచ్చిన వారల్లే వుంటే నేను వెళ్ళి అడిగాను ఫలానా కాలేజీకి వెళుతున్నారా అని. వారు వేంటనే అవునన్నారు. నలుగురం కలసి ఆటో వెదకబోయాం. చాలా ఆటోలు వున్నాయి గానీ ఎవరూ రామన్నారు. ఒకతను పాతిక ఇస్తే వస్తాను అన్నాడు. సరే అయితే రెండు ఆటోలు తీసుకుంటాం చెరో ఇద్దరూ అన్నాడితను. ఆటోవాడికి అలాగైతే వాడికి పజ్ఞెండు రూపాయలే చిక్కుతానుకున్నాడో ఏఁవోగాని వాడు మనాచేశాడు. ఇంతకీ ఇతని ఉద్ధేశం మాత్రం ఇద్దరికే పాతిక ఇస్తామని. అక్కడ అరవై వేలు గాలిలో వ్రేలాడుతూంటే, ఇక్కడ వీడు పాతికలకు బేరాలేఁవిటా అనుకొని వుంటాడతను.

తరువాత ఇంకొకతను నలుగురినీ ఎక్కుంచుకుంటా కానీ నలభై ఇవ్వాలి అన్నాడు. కాస్త ఎక్కువ అడుగుతున్నాడన్న సిగ్గు ముగంలే కనిపించేడట్టే. పాపం వానికేం తెలుసు ఎక్కువ అడగడం గుఱించి. మీ మనీ మేనేజర్‌ని పరిచయం చేయండి అతనికి కొంతైనా బుద్ధివస్తుంది, మీ మనీ మేనేజర్ కి కాదు, ఈ ఆటోవాడికి.

----------------------------------------------
నేను ముంబయి వెళ్ళింది 6, జూను, 2008
పై టపా వ్రాసింది 8, జూలై, 2008 (అప్పటికి ఇంకా పేళుళ్ళు వంటివి జరగలేదు).
కథ ఇంకా సగం బాకీ వుంది. కానీ అది ఎప్పటికి వ్రాస్తానో తెలియదు. వ్రాసిన అందులో ఎంత నాకు బాగా గుర్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాకేశ్వర-రావు-అముద్రితాలు లోనికి వెళ్ళిపోకుండా కపాడడానికి దీనిని ఇక్కడే ఇప్పుడే టపా చేస్తున్నాను. త్వరలో వీలైతే తఱువాయి భాగం ప్రచురిస్తాను.
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం