భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 26, 2007

నా దృష్టిలో "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం"

రవీయం అనే బ్లాగులో గడ్డం రవీంద్రనాథగారు వ్రాసిన "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం" టాపా చదివి దానికి నేను వ్రాయదలచిన వ్యాఖ్య మరీ పెద్దదయ్యే సరికి ఇలా ఇక్కడ టాపాగా వెస్తున్నా, ఎప్పటికైనా వుంటుందని. బ్లాగుల్లో ఇలాంటి 'విలువైన' టపా చదివి చాలా రోజులైంది. చదివిన తరువాత మనల్ని స్వల్పంగా ఆలోచింపజేసే టాపా (ఎక్కువ ఆలోచన మంచిది కాదు అ.నా.అ). ఒక నిర్దేశిత ఆలోచనా విధానంలో ఒక తాత్విక అంశం మీద బాగా వ్రాసారు. అలాంటి అంశాలమీద, ఎవరైన చర్చిస్తుంటే, నాకు చాలా సార్లు అర్థంలేని ప్రేలాపన అనిపించి ఎక్కువగా చర్చకి దిగను. ఈ టాపా అర్థంకావాలంటే అది చదవాలి మీరు.

"మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది."
ఈ విషయం నాకు తెలియనిది. నాకు స్వతహాగా మరణంలో వున్న బాధంటేనే భయం ఎక్కువ. నాకు పెద్ద మంచి జ్ఞాపకాలూ, అనుభవాలూ లేకపోవడం కారణం కావచ్చు. పెళ్లయిన వాళ్లు, పిల్లలున్న వాళ్లు, లేక తల్లిదండ్రుల పట్ల పెద్ద పెద్ద బాధ్యతలున్నవారికి ఇది బాగా వర్తిస్తుందనుకుంట.

"చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి .....ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం... కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు."
నాకైతే మనం శాశ్వతంకదా అనే నమ్మకం వలనే మరణభయం తగ్గింది. అంటే, ఆ ప్రక్రియ నాకు బగా పనిచేస్తుంది.


"శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. "

ఒక జన్మతో ఇంకోదానికి భౌతికంగా నిమిత్తం లేకపోవడం వలన, కొత్తదనం వస్తూనేవుంటుందనవచ్చు. ఇక జన్మ జన్మకీ ఆత్మ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మనం 'నిష్కామంగా' ధర్మాన్ని ఆచరించవచ్చు. అంటే ఎలాగూ పోయేదానికి నిజాయితీగా వుండి ఏం లాభం, లేక భగవంతుడు ఉన్నాడో లేడో తెలియనపుడు నిజాయితీగా వుండి ఏం లాభం అనుకోకుండా. ధర్మబద్దంగా వుండడం నిర్వాణసోపానమధిరోహణముగా భావించవచ్చు. భౌతిక వస్తువులు మఱియూ అంశాలూ శాస్వతమని నమ్మడం మూర్ఖత్వం అని వివేకులకు ఎఱుకే. కానీ ఆత్మ శాశ్వతమనీ, అది పురోగమిస్తుందనీ నమ్మడం చెడు కాదు!

"మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది"
చాలా బాగా చెప్పారు. చాలా మతాల్లా, పై ఆదర్శాన్ని సాధించడానికి ఒకే విధానం వుంది అని చెప్పడం కంటే, ఎవరి విధానం వారినే చూసుకోమనడం ఇంకా గొప్ప!
ఇక ప్రతి రోజూ మరణించే విషయమై..
నేటి జీవితంలో, ప్రజలు పనిచేసేదంతా ఎప్పటీకీ రేపుగా మిగిలిపోయే రేపు కోసమే! పిల్లలు పుట్టినప్పటినుండీ వారు విశ్వసంపన్నులు కావాలన్న కలను వారిలోనికి పెద్దలు ఎక్కించి దాని వెనుక పరిగెత్తించుచున్నారు. ప్రతి దినం ఒకేలా వుండే వ్యవసాయం, పౌరోహిత్యం, ఉపాధ్యాయం వంటి అందమైన వృత్తులంటే, జనులకు ఆకర్షణ లేకపోగా చిన్నచూపు వుంది. ఇక ఠాగూరు మార్గాన శాంతినికేతనాలకూ, థోరో మార్గాన వాల్డెనులకూ ఎంతమంది వెళ్తున్నారు, అలా వెళ్లడం అభినందనీయమని ఎంతమంది భావిస్తున్నారీనాడు?

తిలక్ అమృత వాక్కు
అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

Friday, November 23, 2007

కవితలు వ్రాయడం ఎలా

నాలుగు కవితల అనుభవం వున్న నేను, మీ అందరికీ కవితలు వ్రాయడం ఎలాగో బోధింపదలచాను.
"అదేఁవిటీ, నీలాంటి పిల్ల కవి దగ్గరా మేము నేర్చుకోవలసింది?" అన్న ధర్మసందేహం మీకు కలుగవచ్చు.
తప్పులేదు, డబ్బులు కట్టారు కాబట్టి మీ గురువు అర్హతలు తెలుసుకునే హక్కు "సమాచార హక్కు చట్టం" మీకు కలుగజేస్తుంది. పెద్ద కవులు దగ్గర నేర్చుకుంటే, భావం ఛందస్సు, ఎలగెన్సు, వగైరా వగైరా ఉండాలి, ఉండకూడదు, ఉండీవుండనట్టువుండాలి వగైరా వగైరా అని చాలా క్లిష్టంగా చెబుతారు. కాబట్టి నాలాంటి చిన్న కవి దగ్గర నేర్చుకుంటే, మూడంచెల్లో మీరు కవితాస్వర్గద్వారతీరాలకు ఎలా లంఘించగలరో సునాయాసంగా తెలుసుకోవచ్చు. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

ఉపోద్ఘాతం ("ఇప్పుడు వఱకు జరిగిన సుత్తేంటి మరి?" అంటారా)
నేను క్రిత శనాదివారాలు(వారాంతం అనడం నాకంతగా నచ్చుదు) బెంగుళూరు వెళ్లాను. ఈ సారి మంగతాయార్ల వెంట పడలేదు. అలానే మన బ్లాగర్లనూ కలవలేదు. పనులలో భాగంగా నేను బెంగుళూరులో దోమలూరి నుండి బనశంకరి బస్సులో వెళ్తున్నప్పుడు బెంగుళూరి మీద ఒ కవిత వ్రాసిపారేశాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి). దాన్ని విశ్లేషిస్తూ మీకు కవిత ఎలా వ్రాయాలో చెబుతా.

బస్సెక్కే ముందు
బెంగుళూరు వెళ్తున్నాని తెలిసి మా స్నేహితులు ఉచిత సలహా పారేశారు "అక్కడ దోమలూరులో వున్న పలానా కంపెనీ ఆఫీసులోకెళ్లి, అమెరికా యాసతో మాట్లాడి, హెచ్చార్ అమ్మాయికి రెజ్యుమే ఇచ్చిరా" అని. ఆ పని చేయడానికి ప్రయత్నించాకాని, రిసెప్షన్ పిల్ల "మా ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయండి, ఇంత దూరం రావాల్సిన శ్రమ తగ్గుతుంది" అని చెప్పి నన్ను తోలేసింది. అప్పుడు నాకు తట్టింది, బెంగుళూరు మనకంటే చాలా ముందు కెళ్ళిపోయింది, ఈ గాజు౨ మేడల్లో మనకు చోటు లేదని. దాని మీద కవిత రాయాలని పించింది. టెక్ పార్కు బయటకెళ్లి బస్సుకోసం నించున్నా. చూస్తే జోబులో ఐదువందలు తప్ప ఏం లేదు. కొట్టు కొట్టు కూ వెళ్లి చిల్లర అడుకున్నా(ఈ సంగతి గుర్తుపెట్టుకోండి). చివరకు ఎవరో ఇచ్చారు, తరువాత బస్సొచ్చింది బస్సెక్కా.

మెదటి పద్యం
నా దగ్గర అంకోపరిసంచిలో అంకోపరి బదులు 'శ్రీశ్రీ జీవిత చరిత్ర' మఱియూ తిలక్ 'అమృతం కురిసిన రాత్రి' వున్నాయి. (గమనించవలసిన విషయం, ముందు కవితలు వ్రాయడానికి స్ఫూర్తి ముఖ్యం. కాబట్టి మీరు నా కవితలు అచ్చు చేసుకుని, వాటిని మీ జేబులో పెట్టుకుని బస్సెక్కండి).
బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!
తిలక్ వ్రాసిన "నగరంలో హత్య" కవిత ఇలా మొదలవుతుంది.
హైదరాబాద్ నన్ను గుర్తించలేదు పలకరించలేదు.
పెద్ద పెద్ద వీధుల్లాంటి పైట సవరించుకుంటూ
తప్పుచేసిన ఆడదానిలా తప్పించుకు తిరిగింది
దీనికీ నా కవితకీ వున్న పోలిక కేవలం కాకతాళీయమే; అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్టే. మొదటి పద్యాన్ని తిలక్‌లా మొదలు పెట్టి, అప్పుడే చూసిన టెక్పార్కు గురించి, బెంగుళూరి లోని ఇఱుకు రోడ్ల గురించి అదే రూపకంలో వ్రాసా. ఒకప్పుడు బెంగుళూరు లో చెట్లెక్కువుండేవి, ఇప్పుడు వాటిని నరికేసి అద్దాల మేడలూ, మెట్రోలూ కడుతున్నారు. అక్కడినుండి 'సెక్సీ' వచ్చింది. (దీని మీద మరింత వివరణ తరువాత)

రెండో పద్యం
అందని ద్రాక్షలు పుల్లన. మనకెలాగూ ఉద్యోగం ఇవ్వట్లేదు కాబట్టి, "ఏవరికి కావాలి మీ బోడి ఉద్యోగం" అన్నదాన్ని కొద్దిగా ఉత్ప్రేక్షిస్తే ఇలా తయారవుతుంది.
అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
అలాగే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే సరిపోదు, పేదలని నిజంగా అభివృద్ధి పరచడం గొప్ప (ఇది అసాధ్యం కాబట్టి)...
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
అదే ధొరణిలో
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.
బస్సెక్కేముందు జరిగింది ఎలావుంది అలానే వ్రాసేయండి. దాని తరువాత... బస్సులో టికెట్లన్నీ రూపాయల్లోనే వుంటాయి. నా జేబులో యాభై పైసుల బిళ్లవుంది. అది చూపిస్తే నిజంగానే అవతలకి పొమ్మంటారు. కాబట్టి అదికూడా వ్రాయండి.

మూడో పద్యం
నేను కుటుంబం పని మీద ఎవరినో రైలు ఎక్కించడానికి స్టేషను వెళ్లా. అక్కడొకమ్మాయి, మన భీమవరంమే అయినా, మా బామ్మాళ్లతో ఆంగ్లం యాసతో తెలుగు మాట్లాడింది. బెంగుళూరులో ఇంలాంటి వారికి కొదవలేదు. కాబట్టి ఇది వ్రాయడం కూడా తేలికే.
ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!

నాల్గో పద్యం
బస్సులో నా వెనుక సీటులో ఒక తెలుగతను "ఎరా ఐడోన్ట్‌నో సిస్టంస్ లో సి అడుగుతున్నాడా, జావా అడుగుతున్నాడా" అని ఫోనులో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకో తమిళతను "మచ్చా చావరియా పటమ్ నోకియా" అని మాట్లాడుతున్నాడు. ఆ రెండిటినీ ఇక్కడ.
జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
బెంగుళూరు నిండా పార్కులే, అలాగే జేపీ నగర్ లో ఒకటి కనిపించింది. అప్పటివరకూ తెలుగు, తమిళ, అరవ కుఱ్ఱాళ్లతో ఏఁవ్ చేయ్యాలో అర్థంకాని నాకు. బల్బు ఎలిగింది. ఇక..
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.
ఇది బెంగుళూరు బస్సుల్లో ఎప్పుడూ జరిగేదే. ఆడామగా కండెక్టర్లిఱువురూ చేసేదే.

ఐదే పద్యం
నిజంగానే బెంగుళూరులో నాకు కావాల్సిన ఉద్యోగాలు లేవు. న్యూయార్కో, లండనో, హాఙ్ కాఙ్‌గో వెళ్లాలి (అంటే వాళ్లు రానిస్తే). అదీ ఇక్కడ పారేశా.
ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
ఒకప్పుడు నేను జీవితంలో డబ్బు, పెట్టుబడిదారు వ్యవస్థ వంటి వాటిలో నమ్మేవాడిని, అప్పటిలో "అదృష్టవంతుడను నేను, వడ్డించిన విస్తరి నా జీవితం". బెంగుళూరేఁవీ మారలేదు. రెండేళ్ల క్రితం ఎటు పోతుందో, ఇప్పుడూ అంతే, మారిందల్లా నేనే అన్న విషయం ఇక్కడ వ్రాసా.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.

రూపకం
ఈ ఒక్క అలంకారం తెలిస్తే చాలు మీర ఒక మోస్తరు నుండి భారీ కవి కావచ్చు. నా పేరే ఒక రూపకం కాబట్టి, అక్కడ నాది కొద్దిగా ముందంజ. (పేరుకు అర్థం అడగకండి).
నవ్యసమాజం ఎప్పుడూ "ఖండాంతర వాసులతో సంభాషిస్తున్నాం, గ్రహాంతర వాసులకు సంకేతాలు పంపిస్తున్నాం" అని ప్రగల్బాలు(?) పలకడమేగానీ, పెద్ద మనిషైన పదేళ్లకు కూడా కుఱ్రవాళ్లకు పెళ్లి చేయలేకపోతున్నది. అలాంటి కుఱ్ఱవాళ్లకి ఇంకేంచూసినా అమ్మాయే కనిపిస్తుంది. మామూలు అమ్మాయి కాదు సంప్రదాయాన్ని విడిచి సెక్సీగా తిరిగే అమ్మాయి, పార్కులలో చెట్టాపట్టాలేసుకు తిరిగే అమ్మాయీ, బావా అని పిలిచే అమ్మాయీ కనిపిస్తూంటారు. అద్దంపద్దం(అర్థంపర్థం?) లేని బెంగుళూరు నగరాల్ని చూసినా అంతే! అలాగే, మీకు అప్పడాలంటే భ్రమ అనుకోండి, మీరు లిబర్టీ విగ్రహాన్ని అప్పడంగా భావించి ఓ కవిత వ్రాయండి. ఉదాః
గేసు పొయ్యలాగా కాగుతున్న వేడి న్యూయార్కు దినాన,
లిబర్టీ విగ్రహం అప్పుడే వేసిన అప్పడం లా కాగిపోతుంది.
తాకడానికి వేడిగా, తినడానికి కరకరలాడేట్టుంది.
శబ్ద మఱియు ఇతర అలంకారాలు
నేను వ్రాసిన నిరుద్యోగులు పద్యాన్ని పైవిధంగా విశ్లేషించడం అంత తేలిక కాదు. పైది తిలక్ శైలి, ఇది మాత్రం శ్రీశ్రీ శైలి.
విశ్లేషణ కష్టం కానీ, శ్రీశ్రీ శైలి లో వ్రాయడం మాత్రం చాలా తేలిక. మీకు తోచినట్లు వ్రాయండి. కొద్దిగా మాత్రాఛందస్సు వాడండి. రూపకాలం'కారాల'తో రెచ్చిపోండి. కొంత కాన్సొనెన్సు(తెలుగులో?) వాడండి.
ఉదాహరణకు
అసమర్థ చితులుండే శ్మశానాల్లో,
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు
***
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !
జనులు "అసమర్థ చితులు కాకపోతే సమర్థ చితులుంటాయా ఎక్కడైనా?", "కళేబరం కాలనప్పుడు పుఱ్ఱైనా ఇంకోటైనా ఎలా పేలుతుంది?", 'నత్తకెవరైనా మంగళారతి పడతారా?" అని ప్రశ్నించరు! దాని బదులు అద్భుతమనీ, పత్రికలకు పంపాలనీ అంటారు. ఇక...
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !
ఆ రోజు నిజంగా మా అక్క గులాబ్జామూఁలు చేసి వాటికి పాకం పట్టలేదు. కానీ ఇలాంటివి కవనవ్యాపార రహస్యాలు. వీటిని బయటకు చెప్పకూడదు. నేను నా గురువృత్తి ధర్మానికి అన్యాయం చెయ్యలేక మీకు చెబుతున్నాను. (ఈ వాక్యం చదివిన తరువాతైనా మీకు నా సామర్థ్యం మీద అపోహలు తొలగిపోవాలి).

త.రా: ఇంకేముంది కష్టమైన వృత్తాలు విడచి, అభ్యుదయపూరిత బావ కవిత్వం వ్రాయండి!

Monday, November 19, 2007

బెంగుళూరు మారిపోయింది

బెంగుళూరుని నేను గుర్తుపట్టలేదు!
మేడ కాంక్రీట్లారని అందానికి
బట్టలుగా సన్నని రోడ్లు చుట్టి
ఫ్లయ్యోవర్ల ఊక్సులు బిగించింది!
సాంప్రదాయం వదలి
సెక్సీగా తయారయ్యింది!

అద్దాల మేడలలోని చీకటిగదులలో
ఉక్కు సంకెళ్ళతో బందింపబడ్డ ఆత్మలు
నాక కనబడవనుకుంది.
వంతెనల క్రింద గుడిసెలకూ
ముఱికి కాల్వల ప్రక్క మకాఁలకూ
ఋజువులు చూపించమంది.
ఐదువందలకు చిల్లరడిగితే అవతలికి పొమ్మంది.
ఐద్దమ్మిడీల బిళ్ల చూపిస్తే అదేఁవిటనడిగింది.

ఆంగ్లం యాసలో కన్నడమూ
అజంత యాసలో ఆంగ్లమూ మాట్లాడి
అప్పుడే అమెరికా తిఱిగొచ్చిన
అచ్చతెలుగమ్మాయిలా, లేని
ఆత్మ విశ్వాసం నటించింది!

జాబుకీ జావాకీ ముడివేసే తెలుగబ్బాయిలతో,
'చ'కీ 'శ'కీ తేడా తెలియని తమిళ తంబీలతోనూ,
సిరిగన్నడం సిరులకోసం హతమార్చిన కన్నడిగులతోనూ
పబ్లిక్ పార్కులలో పట్టపగలు చెట్టాపట్టాలేసుకు తిరిగింది!
అందేఁవిటని మందలిస్తే
డబ్బుతీసుకొని టికెట్టివ్వని
బె.మ.సా.సం. బస్సామెలా
వినీ విననట్టు వూరుకుంది.

ఉద్యోగఁవిమ్మంటే, "మీ స్థాయికి మేఁతూగగలమా
సింగపురమో సికాగోనో పొమ్మ"ని ఎగతాళి చేసింది.
సరే వెళ్లోస్తానంటూ వెనుతిఱగబోతే,
"నువ్వు చాలా మారిపోయావు బావా" అని
భుజం మీద వాలి బోరున యేడ్చింది.

Thursday, November 15, 2007

రానారె తో ముఖాముఖి

ఉపోద్ఘాతం
ఒక నెల రోజుల క్రితం, ఓ వేడి ఆంధ్రా మధ్యాహ్నం వేళ, సృజనాత్మకత పేగుల్లో కొట్టుకొచ్చినప్పుడు, రెండు పాత్రలను కల్పించి వ్రాసిన సంభాషణ ఇది. ఒక యువ విలేకరి, ఒక పెద్ద రాజకీయవేత్తని ఇంటర్వ్యూ చేస్తుంది. రాజకీయనాయకుడి పాత్ర నా నుంచి జనించినదైనా, అతను వ్యక్తపరిచే అభిప్రాయాలు నావి కావు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది, 'ది డైలీ షో'లో ఒక స్కిరిప్టు అనుకోండి.

ముఖాముఖి

నమస్కారం రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి) గారు.

నమస్కారఁవమ్మా.

మీరు శ్రీశ్రీ కవిత్వాన్ని మీ రచనల్లో ఖూనీ చేస్తారు అని ప్రజాభిప్రాయం, మీరేమంటారు ?

నేనే మంటాను, ఎవరి అభిప్రాయం వారిది. ఇతర రాజకీయనాయకులలా నేను అన్యుల అభిప్రాయాలను ఖండించను, నాది విశాల దృక్పదం.

మీరలా వ్రాయడం శ్రీశ్రీ అభిమానులూ, గాంధీ అభిమానలూ తీవ్రంగా ఖండిస్తారోమో ?

శ్రీశ్రీ అభిమానులకు - ఇక్కడ శ్రీశ్రీ కవిత్వం గురించి, తెలుగు కవిత్వం గురించి పలువురికి ఆసక్తి కలుగుతుందాలేదా అన్నది ముఖ్యం. ఏ ఉద్యమంలోనైనా కొందరు పాలికాపుల బలి అవడం జరుగుతుంది కామ్రేడ్! మీలాంటి వారికి లేడి నెత్తురు కావల్సినప్పుడు మాలాంటి పులిలకు ఖూనీ చెయ్యక తప్పదు!
గాంధీవాదులకు - లోక కల్యాణం కోసం నలుగుర్ని చంపినా పర్వాలేదన్న వితండవాదం చేసి హింసఖాండని సమర్ధించుకునే '*కామీ'గాళ్లతోనా మీకు సహవాసం. అయినా గాంధేయులంటే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలి కాని, ఇలా ప్రశ్నించకూడదు. ఉదాహరణకు, "శ్రీశ్రీని ఖూనీ చేసారు, ఇదిగో తిలక్" అని చూపించాలి.

మీ ఈ మాటలు వారిని ఇంకా బాధకలిగిస్తాయేమో?

మీరు ఇంటర్‌వ్యూ చేస్తున్నారా? పుల్లలు పెడుతున్నారా? అయినా వారి భాషలోనే, వారికి నేను చెప్పదలచుకుంది ఒక్కటే "పతితులారా, బ్రష్టులారా, దగాపడిన దమ్ములారా, ఏడవకండి"!

ఎం సార్ జగన్నాథ రథచక్రాల్ వస్తున్నాయా?

రావట్లేదమ్మా, అయినా ఎవరో ఒకళ్లు వెళ్లి వాటిని తీసుకొస్తారనుకోవడం మూర్ఖత్వం. ఒక వెయ్యి మంది లాగితేనే గాని కదలనిది, ఎవరో వెళ్ళి నీ కోసం తీస్కొస్తానంటే నమ్మేయడమే? అయినా, అవి వచ్చినా ఎఁవ్ చేస్తావఁమ్మా, వాటి కింద తలపెట్టి చావడం కంటే ఎం చెయ్యలేవు? ఇదే నమ్మా ఈ దేశానికి వచ్చిన చిక్కు, ఎప్పుడూ ఎవరో అవతార పురుషుడు వచ్చి తమ బ్రతుకుని ఉద్దరిస్తారని చేతులు దులుపుకుని ఎదురు చూస్తుంటారు. దాన్ని ఉపయోగించుకుని జనాలు జగన్నాథుడని కవితలు వ్రాసో లేదా శివాజీ, ఠాగుర్, రామయణం అని సినామాలను డబ్ చేసో సొమ్ము చేసుకుంటున్నారు.

అయితే ఎఁవ్ చేయమంటారు సార్ ?

అలాంటి సినిమాలు పరభాషలలో వచ్చిన తరువాత వాటిని డబ్ చేయడం కంటే, మీరే సొంతంగా తీయండమ్మా! ఆ సెంటిమెంట్‌ని మీరే సొమ్ము చేసుకోండి! ఎవడో అరవోడు వచ్చి సినిమా తీస్తాడు అని ఎదురుచూడడం మానేయండి.

మరి రామాయణ ప్రస్తావన ?

అదేనమ్మ, ఎవరో సంస్కృత కవి ఎదో మన ద్రావిడులని ప్రతినాయకులు చేసి రాసిన నవలను, మనము ముగ్గురు మహాకవులని నియమించుకొని డబ్ చేసుకున్నాముగా. అలాంటి పనులు మానేసి, మన మాస్‌ని హీరోగా, ఆర్యుడూ, ఉత్తరదేశస్తుడూ ఐన రాహుల్ దేవ్‌ని విలన్‌గా పెట్టి మాస్ అని సినిమాలు తియ్యమంటున్నాను.

కవిత్రయం వ్రాసింది మహాభారతం సార్! మీకు తెలియనిదేఁవుంది గాని! ఇంతకీ మీరు కూడా రామాయణం నమ్మరా సార్?

షీర్ నాన్సెన్స్! మనల్ని దానవులు చేసి రాసిన పుస్తకం. అందునా నమ్ముకొచ్చిన ఆలిని క్షణం సుఖపెట్టలేని వాడమ్మా మీకు దేవుడు ?

అయ్యో రామా !

అఱే చెప్తుంటే నీకు కాదు? ఆ పేరు ఎత్తొద్దంటే!

మరేమనాలి సార్ ?

ఎంకన్న అనుకో, యాదన్న అనుకో, అప్పన్న అనుకో!

అన్నీ ఆ పురుషోత్తముని నామాలేగా సార్?

ఎంటమ్మా నీ పోలిక? మీ కాలం పిల్లలందరూ ఇంతే! ఆంగ్ల చదువులు నేర్వడంకాదు, అమ్మమ్మ దగ్గర రామాయణం వినాలి.

మీరే కద సార్ మన కథలు మనమే రాసుకోవాలి ఎఱువు తెచ్చుకోకూడదన్నారు? ఇప్పుడేమో వాటినే వినాలంటున్నారు!

పక్కవారివి చదివితే అందులో తప్పులు పట్టొచ్చమ్మ. ఏమో ఎవరికి తెలుసు, కొంత పుణ్యం కూడా రావచ్చు, ఆ విషయంలో రిస్క్ తీసుకోవడం ఎందుకు?

అప్పన్నకీ సీతాపతికీ పోలిక గురించి ఏదో అంటున్నారు?

అవును పొట్ట చీల్చి పేగులు తినే సింగముఖుడు మన అప్పన్నకీ, చెట్లు వెనకాల దాగి బాణాలు వేసే కౌశలేయునికా నీ పోలిక? అఖిలస్ ఎవఁన్నాడో తెలుసా, బాణాలు పిరికివారి ఆయుధాలఁట. అఖిలస్ అంటే తెలుసుగా?

తెలుసు సార్, అఖిలస్ అంటే బ్రాడ్ పిట్, ఎంత హాట్‌గా వుంటాడో. హెక్టర్ గా ఎరిక్ బానా కూడా చాలా హాట్‌గా వుంటాడు. మా కాలేజీ బ్రాడ్ పిట్ ఫాన్ క్లబ్‌కి నేనే అధ్యక్షురాలిని. ఇక ఒర్లాండో బ్లూమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు ఒకే సినిమాలో ముగ్గురు హంక్సు. ట్రాయ్ ఎన్నిసార్లు చూసానో రెక్కలేదు.
మీతరం అమ్మయిలందరూ ఇంతేనమ్మ, ఆంగ్ల సినిమాలు ఆపోశన పడతారు. రామాయణభారతాలు తెలిసీ తెలియనట్టు వుంటారు. అందుకే దేశం వెనక బడిపోతుంది. ఆడ యువతకి వారి బాధ్యత తెలిసిరావట్లేదు.

ఏంటి సార్ వినిపించుకోలేదు, ట్రాయ్ గురించి ఆలోచిస్తూ వుండి పోయా...

అందుకేనమ్మా నేను కూడా ఎవరైనా కుఱ్ఱాడిని పంపమన్నాను.

మీరామాటంటే గుర్తొచ్చింది. మీకు స్త్రీల సామర్థ్యం మీద నమ్మకం లేదని, మీరు మగాధిపత్యవాదులని ఆరోపణలు వున్నాయి, వాటి మీద మీ వ్యాఖ్యానం?

స్త్రీల సామర్థ్యం మీద నాకు చాలా మంచి అభిప్రాయం వుంది. జనాబాలో సగం మంది వారే కాబట్టి, ప్రభుత్వాన్ని నిలబెట్టగల, కూల్చగల సత్త ఉంది వారికి.

అంటే జనాబా ఎక్కువ కాని, వారు చేతగాని వారనా మీ అభిప్రాయం ?

ఆడవారు ఎంత తెలివైన వారంటే, వారు ఆలోచించడం మొదులు పెడితే మగ వారికే ముప్పు. అయినా ఆడవారంటే అందానికి ప్రతిరూపం, ఆ అందాన్ని ఆస్వాదించడానికే భగవంతుడు వారిని సృష్టించాడు. అలాంటి అందం పని చేయవలసి రావడం, ఆలోచించవలసి రావడం నాగరికతకే అవమానం. తెల్లవారు స్త్రీ అభ్యుదయం పేరుతో, ఆడవారి చేత అన్ని పనులూ చేయిస్తుంటారు. శాస్త్రం, సాంప్రదాయం, ఆచారం, సంస్కృతి, పరంపర లేని వాళ్లు వారికేం తెలుసు. నేను చెప్పొచ్చేదేంటంటే, ఆడదాని తెలివితేటలు నమ్ముకున్న వాడికంటే వెఱ్ఱివాడు లేడు.

మీరు ఎంత తెలివిగా మాట్లాడినా, మీ మాటల్లో ద్వందత్వం, అవకాశవాదం, మీ కుటిల ఆలోచన, ఇఱుకు దృక్పదం కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మీలాంటి దిగజారిన రజకీయవేత్తని ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నా. ఇక్కడితో ఇంటర్‌వ్యూ సమాప్తం ఉంటా.

శీఘ్రమేవ కల్యాణప్రాప్తిరస్తు!

Monday, November 12, 2007

రెండు కులాలు, దీపావళి, మహాకవి, మంగతాయారు

స్కంధము ౧
గురువారం కుటుంబం పనిమీద బెంగుళూరు వెళ్లవలసివచ్చింది. అసలు పని గంట మాత్రమే. ఎలాగూ వెళ్లానుగా అని చెప్పి "ఈ డాకుమెంటు ప్రపంచంలో నాకు ఇంకా మంచి స్థానం కల్పించే నాలుగు డాకుమెంట్లు పోగేసుకుందా"మని నేను ఒక రాత్రికి బెంగుళూరులోనే వుండిపోయాను. గురువారం బెంగుళూరుకు శెలవు. ఇక్కడ (తమిళ, మలయాళ నాడుల కూడా) నరక చతుర్ధశి నాడు దీపావళి జరుపుకుంటారు! నేను ఆ రాత్రి బెంగుళూరులో వుండి తరువాతి రోజు అంటే శుక్రవారం కావలసిన డాకుమెంట్లు సంపాదించాలని నిశ్చయించాను.

శుక్రవారం అమావాశ్య నాడు ప్రొద్దుటే మా పాత కంపెనీకి వెళ్లా. పాత మిత్రులని కలిసా. ఎం చేస్తున్నావన్న ప్రశ్నని ధీటుగా ఎదురు కొని, ఏఁవీ చెయ్యట్లేదని చెప్పా, ఒక అందమైన మళయాలీ భామకైతే అంతర్ముఖుణ్ణయ్యా అని చెప్పా. ఎం చేయబోతున్నావని అడిగినవారికి, ఏదో పెద్ద ప్లాను చెప్పి, అది చాలా కష్టం అని వివరించాను. కొంత సేపు నేను ఈశ్వరవాదినా నిరీశ్వరవాదినా అన్న చర్చ జరిపారు మావాళ్లు, మొత్తానికి నాస్తికుణ్ణని తేల్చారు! కలికాలం! సంవత్సరం నుండి మహిషాసురమర్దిని గోడకాగితం వున్న నన్ను నాస్తికుణ్ణి చేసేశారు.
అందుకే నేనంటా. రెండేకులాలండి. ఈశ్వరవాదులు, నిరీశ్వరవాదులూ.

స్కంధము ౨
మధ్యాహ్నానికల్లా డాకుమెంటు పనులన్నీ అయ్యిపోయాయి. ఖండాతరాన నాకు అప్పిచ్చిన నా ఫ్రెండుకు అప్పు తీర్చుదామని, వాడి తల్లదండ్రుల ఇంటికి బయలుదేరాను. అప్పుడెప్పుడో అమెరికాలో నాకు నాలుగు నెలల్లో ఉద్యోగమొస్తుందన్న నమ్మకంతో నాకు ఓ రెండు వేలు అప్పిచ్చాడు. నేను కాస్తా 'నాన్ పెర్ఫామింగ్ అసెట్' అయ్యి కుర్చున్నా. తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు! డాలరు విలువ పడిపోయింది. వడ్డీ కలుపుకున్నా రూపాయిల్లో వాడిచ్చినదానికన్నా తక్కువయ్యింది. మా మిత్రుడి అమ్మానాన్నా మామూలు తెలుగింటి తల్లిదండ్రులు. మాదేవూరని అడిగారు, నేను "రాజమండ్రి దగ్గరండి, పశ్చిమ గోదావరి జిల్లాలో" అని చెప్పా. పశ్చిమ గోదావరి జిల్లానా అయితే "మీరు రాజులా? కమ్మోరా?" అని అడిగారు ఆంటీ. నాకు నవ్వచ్చింది. పాత కాలపు మనషులులే అని చెప్పి నేను సమాధానం ఇచ్చా. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో తిప్పికొడితే ఆ రెండు కులాల జనాభా కలిపి పది శాతం కూడా వుండదు.

నేను రాష్ట్రం బయట చదివా కాబట్టి, అక్కడ మన ఆంధ్రులంటే, కట్నం ఎక్కువ తీసుకునే పెద్ద రైతులని అపోహ. వివాహ మహాసంతలో వారి ధర పెంచుకోవడానికే వారు ఇంజనీరింగు చేస్తారని వారి నమ్మకం. కాబట్టి వారు మామూలుగా, "మీరు తెలుగా? రెడ్లా, కమ్మోరా?" అని అడుగుతారు! ఈ రెండు కులాల జనాభా కూడా తిప్పికొడితే ఆంధ్ర జనాభాలో ౧౫శాతం కూడా వుండదు. ఎంటో మిగితా వాళ్లందరూ లేనట్టే! ఇలాంటి సమాధానాలకి నేను అడిగిన వారి బట్టి సమాధానమిస్తూవుంటా. చిరాకేసుంటే, "అదంత అవసరమా?" అని అడుగుతా, లేక పోతే ఏ బుట్టలల్లేవారో, కుమ్మరులో, అయ్యరికపాత్రులో, రాములోరి వంశంలో పుట్టిన క్షత్రియలమో, ఎఱుకలవారో, లేకపోతే ఇంకేమైనా మహత్తర కాంబో పాక్ అనో చెబుతా (మొన్నే ఒకడికి మా అమ్మ పాములు పట్టేవారు, మా అయ్య చేపలు పట్టేవారు అని చెప్పా).

కానీ నా అంత అభూతకల్పన లేని నా మిత్రుడొకడ్ని, మా మొదటి సంవత్సరం ఇంజనీరింగులో, వాడి పంతులు క్లాసులో అడిగాడు "నాకు తెలుసు మీ ఆంధ్రావాళ్లు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతారో.. కట్నం కోసం.. బీటెక్ చేస్తే ఐదు లక్షలు, ఎమ్‌టెక్ చేస్తే పది లక్షలు ఇస్తారు మీకు. ఇంతకీ నువ్వే కులం రెడ్లా, కమ్మొరా" అని. "రెండూ కాదు" అనడానికి వాడి అమాయకత్వమో, కమ్మత్వమో అడ్డుపడ్డాది. అసలే నందమూరు వాడి వూరికి చాలా దగ్గర. ప్రఫెసర్ వాడిని కొంత సేపు ఆడుకున్నాడు. ఇంకా నయ్యం, "చీపుగా ఐదు పది లక్షలేంటి సార్, వ్యవహారం కోట్లలో నడుస్తుంటే" అని సవరణ ఇవ్వలేదు. వాడికిప్పటికీ అర్థంకాదు వాడు ఆ సబ్జెక్టు ఏ కారణం చేత తప్పాడో. అదే కేరళ బదులు విజయవాడైతే మావాడు వాడిని యేస్సేవాడు! "కమ్మ కేరళందు కొంచమై యుండదా" అని సద్దుమణిగాడు.
అందుకే నేనంటా. రెండే కులాలండీ. పాసయ్యే వాళ్లు, ఫేలయ్యేవాళ్లు.

నేను చెప్పిన సమాధాని బట్టి ఆంటీగారు, మా ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారనుకుంటా. చెప్పడం మరిచా. వారు కడప నుండి బెంగుళూరు వచ్చిన, స్వచ్ఛమైన రెడ్లు. కానీ మా వాడికి బెంగుళూరత్వం ఎంత ఎక్కువంటే, వాడికి 'ర'కి ఎకారం, 'డ'కి ఇకారం పెట్టడం రాదు. అలా పెట్టినా వాడు అది రెడీ అనుకుంటాడు కానీ, రెడ్డి అని వాడికి గోచరించదు. పెళ్లి సమయానికి వాడికి అర్థమవుతుంది వాడి సిలికాన్-లోయ ఉద్యోగం కంటే వాడి రెడ్డత్వమే విలువైందని!
అందుకే నేనంటా. రెండే కులాలండీ. ప్రేమించి పెళ్లిచేసుకునేవారు, ఆరీసీలో చదివినవారు.

అంతా అయ్యాక ఆంటీ నాకు ఉచిత సలహా ఇచ్చారు. "తొందరగా ఉద్యోగం చూసుకొని, పెళ్లి చేసుకొని, ఇల్లు కొనుక్కో నాయనా. అసలే బెంగుళూరులో ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి" అని. అంకులు "ఎం మాట్లాడాలో తెలియదు" అంటూ దూషించడం మొదులు పెట్టారు. ఎంటో ఏ ఆంధ్రా తల్లిదండ్రులను చూసినా ఒకేలా వుంటారు. బాస్టనైనా బెంగుళూరైనా. ఎవరికైనా "మా అమ్మానాన్నే అనుకున్నా ఎవరైనా ఇంతేనేమో" అనిపిస్తుంది.
ఆంటి ఆమె ఆత్మసమర్ధనలో "అందుకే గదండి సామెత ఉంది 'ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసి చూడు' అని" అన్నారు. నేను దాన్ని ఈ తరానికి తగినట్టుగా "వీసా పట్టిచూడు, పిల్ల పటాయించి చూడు" అని అర్థంచేసుకున్నా.

స్కంధము ౩
ఆ పని అయ్యాక నేను అక్కడికి దగ్గరలో వున్న ITPL కి వెళ్లాలనకున్నా. అది ఒక పెద్ద ఆఫీసు కాంప్లెక్సు. భారతదేశంలోనే అతి పెద్దది కావచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కడ పని చేసా. చాలా మధురానుభూతులున్నాయక్కడ. అవి నేను పూర్తిగా పెట్టుబడిదారువాదిగా (కాపిటలిష్టుగా) ఉండే రోజులు, భారతదేశం ఇంకా బీదగా వున్న రోజులు. కాబట్టి ఆ చోటును ఒక దేవాలయంగా భావించేవాడిని. ఇద్దరు ముగ్గురు యోగ్యులైన పరశురామక్షేత్రాంగనలు కూడా వుండేవారు. మొత్తం మీద నాకు చాలా ఇష్టమైన చోటు.

నా స్నేహితురాలొకమ్మాయి ఇంకా అక్కడే పని చేస్తుంది. ఆమెని కలసినట్లూ వుంటుంది, టెక్ పార్క్ చూసినట్టూ వుంటుంది అని చెప్పి నేను బయులుదేరాను. ఆమెకి ఫోను చేస్తే ఎత్తలేదు. మెసేజ్ వచ్చింది "నేను పనిలో వున్నాను, మీటింగ్ వుంది తరువాత పిలుస్తా" అని. "సరే నేను టెక్ పార్కు మాల్ లో కూర్చుంటా, నీ పనయ్యాక రా" అని మెసేజ్ పెట్టా. సరేనంది.

టెక్ పార్కుకి వెళ్లా. హెబ్బాగిలు(ముఖద్వారం) దగ్గర సెక్యూరిటసురుడు కనిపించాడు. నేనసలే నా అంకోపరి(లాప్టాప్) సంచితో, క్రెడిట్ కార్డు సేల్సుమాన్ లా వున్నాను. వాడు నన్ను ఐడీ చూపించమన్నాడు. ఎక్కడినుండి వస్తున్నావు? ఏ కంపెనీ? అని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టాడు. బాడ్జి చూపించమన్నాడు. నాదగ్గర లేదు. ప్రవేశం లేదన్నాడు. అప్పుడెప్పుడో అలమేలుమంగాపురంలో ఒక మహాభక్తుడు సూద్రుడు అవ్వడంచేత తాయారు గుడిలోనికి ప్రవేశం నిరాకరించరంట. కాని అతను భక్తిని ఆపుకోలేక లోనిక ప్రవేశించి, జైలు పాల్యాయడట. ఆఖరుకి రాజగోపాలాచారి అతని తరఫున వాదించి కాపాడారంట. రాజగోపాలాచారి ఎప్పుడో పోయారు కాబట్టి నేను అంత సాహసించలేదు.
అందుకే నేనంటాను. ఈ కాలంలో రెండే కులాలండి నిరుద్యోగులు, బాడ్జివున్న ఉద్యోగులూ.

ఆఖరుకి సెక్యూరిటీ అతనితో నా అమెరికా ఆంగ్లంలో వేడుకున్నా, వచ్చీ రాని కన్నడంలో వేడుకున్నా. అతను చలించక వచ్చీ రానీ ఆంగ్లలో "నో సార్. హౌ డు ఐ నో. యూ కాల్ కన్‌సరన్‌డ్ పార్టీ" అన్నాడు. నా తాయారుచూస్తే ఎవరో ఖండాతరం ఆస్వామితో టెలికాన్లో వుంది. వీడేమో ఆమెతో మాట్లాడందే లోనికి పోనియ్యనంటున్నాడు. కొంత సేపు అక్కడే నుంచుని దుఃఖించా. దేశానికి డబ్బులొచ్చి ఏం లాభం? మనిషిని మనిషి సేల్సుమాన్ కంటే హీనంగా చూడడానికా అని. అలా కొంత సేపు ఆదర్శ ప్రపంచానికి ఉపాయాలు ఆలోచించి, ఏమీ తట్టక ఇంకొంత దుఃఖించా. ఆఖరికి ధైర్యం తెచ్చుకొని, బుద్ధి కూడా తెచ్చుకుని, మా తాయారుకి ఫోను చేయమని సందేశం పంపా. ఎండలో ఎం నిలబడతాంలే అని, "ఆమె ఫోను చేస్తుంది, అప్పటివరకూ మీ ఆఫీసులో కూర్చుంటా" అని వాడినడిగా. వాడు సరేనన్నాడు.

రానారె-ఆదులు నా బ్లాగు చదివి తమ గురించి తాము సంతోషపడినట్లు, నేను "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!" అన్న శ్రీశ్రీ జీవిత చరిత్ర చదువుతూ "వీడికంటే నా పరిస్థితి నయ్యం" అని సంతోషించడం మొదలుపెట్టా. ఓ గంటసేపు చదివా. నా ముందున్న సెక్యూరిటీ అతను. "కాల్ సెయ్యొచ్చునుగా" అని అడిగాడు బెంగుళూరు తెలుగులో. ఆమె మీటింగులో వుంది, పదైదు నిమిషాల తరువాత ఫోనుచేస్తుంది అన్నా. సరే బ్యాగ్లో ఏముంది అన్నాడు. చూపించా, వీసా పాసుపోర్టు, ఇతరత్రా డాకుమెంట్లు, రెండు దేశాల డ్రైవరు లైసెన్సులూ వగైరా. మహా కవి శ్రీశ్రీ జీవితచరిత్ర చదువుతున్నాడు. సేల్సుమాను స్థాయికి దిగజారివుండడనుకొని నన్నులోనికి పొమ్మన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. కవిత్వం చదివేవారు. క్రెడిట్ కార్డులు అమ్మేవారు.
(అన్నట్టు మీకు తెలుసా శ్రీశ్రీని రెండుసార్లు పిచ్చాసుపత్రిలో చేర్చారని !)

స్కంధము ౪
లోపలికి వెళ్లి అలా అలా ఒక గంటసేపు తిరిగా. ఎంత సేపుకూ నా అలమేలుమంగ తాయారు ఫోను చెయ్యట్లేదు. ఇంతలో ప్రాంగణం అంతా ఒక రెండు సార్లు తిరిగిన నేను, వెళ్లిపోదామా లేదా అని అలోచిస్తూవున్నా. అసలే నేను మైసూరు వెళ్లాలి. దీపావళి రోజు, మా ఇంట్లో వాళ్లు ఎం సంబరాలు చేసుకుంటున్నారో ఏఁవో. కానీ మా తాయారుని కలవకుండా వెళ్లడానికి మనసొప్పలేదు. ఆవిడేమో, ఎవరితోనో టెలికాన్ లో వుంది. నేనైనా వేచివున్నా.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన అమ్మాయిలూ, చాలా అందంగా వున్న ఆ విషయం ఎరుగక వారి కోసమే చూసే బుద్ధిమంతులైన అబ్బాయిలూ.

ఆఖరికి ఆమె ఫోను చేసి నేను ఇంకొంత సేపులో వచ్చేస్తున్నా అని చెప్పింది. నేను మైసూరు వెళ్లాలన్న విషయం ఆమెతో చెప్పలేదు. ఇంకో గంటైనా ఇంకా అత్తా పత్తా లేదు. ఈ సారి నేనే ఫోను చేసా, ఏడవ్వచ్చు అంది. నాకు లేటవుతుందని నేను బయలు దేరతానని అన్నాను. పోనీలే తాయారుని కలవకపోయినా, మంగాపురం వచ్చాగా అని ఆత్మసంతాపం చేసుకొని వెనక్కి బయలు దేరా. బస్సు స్టాండులో నించుని. మెజెస్టిక్ వెళ్లే బస్సులు వస్తాయా అని అడిగా. వస్తాయన్నాడు. కొంత సేపటికి వాల్వో ఒకటి వచ్చింది. అది మహాతాంత్రిక బెంగుళూరులో మహాతాంత్రిక సిటీబస్సు. నా ప్రక్కతను, అదిగో బస్సన్నావుగా వచ్చింది అన్నాడు వెటకారంగా. వాల్వో సిటీ బస్సులలో రేటు రెండింతలుంటుంది. నేను అతనిని, సిగ్గు విడిచి, నా నిర్జీతాన్ని దాచుకోకుండా, టికెట్ ఎంతుంటుంది అనడిగా. తెలియదన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. డబ్బున్నవారు మఱియు లేనివారు, తమ దగ్గర డబ్బుందో లేదో తెలియని వారూ.

స్కంధము ౫
ఎక్కనే ఎక్కా. అట్లాంటాలో బస్సెక్కినట్టుంది అచ్చంగా. బయటేమీ కనిపించట్లేదు. అద్దాలకి నిండా పొష్టరుండడం వలన బయటేఁవీ కనిపించట్లేదు. దూరం పాతిక కిమీలు. టికెట్టు పదిహేనంట. మీకు కూడా పదిహేనని వినిపించిందా. కాదు యాభై. ఫిఫ్టీ! పోనీలే అని ఇచ్చా.
ఈ అమ్మాయిలని నమ్ముకోకూడదు, ఎప్పుడూ ఇలా నమ్మించి వంచిస్తారు.
ఉ. అంగన నమ్మరాదు తన యంకకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు... భాస్కరా
అదీను, నన్ను మానేసి నా పాత రూమ్మేటుని ప్రేమించిన వారిని అస్సలు నమ్మకూడదు!
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన పరశురామక్షేత్రాంగనలను ప్రేమించిన మనము, వారిని షారూఖ్ ఖాన్ శైలిలో బుట్టలో పెట్టిన మన వంగదేశ రూముమేటులు.

ఇంతలోకే ఫోను మోగింది. "హలో ఎక్కడున్నావ్ ? నా టెలికాన్ అయ్యిపోయింది" అంది తాయారు. "అయ్యో నేను బస్సెక్కాసానే" అన్నా. అలా కొంత సేపు నేను నా పది దేశాలు తిఱిగిన యాసవున్న ఆంగ్లంలో; ఆమె తన బండీ ఱలతో, ళలతో అప్పుడప్పుడూ ೞలతో కూడుకున్న మలయాళీ యాసలో మాట్లాడుకున్నాం. ఇంతకీ అమెకి వాళ్ల దీపావళి అయిన గురువారం నరక చతుర్దశినాడూ, మనకు దీపావళి అయిన శుక్రవారం అమావాశ్య నాడూ రెండు రోజులూ శెలవులేనంట. కానీ పనుండి ఆఫీసులోనే వుండవలసి వచ్చిందంట.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. నిరుద్యోగులు, మన పండుగనాడు తెల్లవాళ్లకు బానిసలయ్యేవారూ.

తరువాత ఎఱ్ఱగౌడ బస్ స్టాండులో మైసూరు బస్సెక్కి, బెల్టు పెట్టుకున్నా. వాడు ౯౦కిమీ ప్రతిగంట వేగంతో తోలి రెండు గంటలలో ౧౩౦ కీమీలు దాటాడు. ప్రయాణంతో ప్రమాదం ఉచితంగా ఇచ్చి నన్న మైసూరులో దించాడు. అప్పటికే మావారందరూ దీపావళి జరుపుకుని నిద్రపోవడానికి సిద్ధవఁయ్యారు. నేను వరుసగా లెక్క మఱచి పోయినన్నేళ్లు దీపావళి జరుపుకోనందుకు సంతోషించి, నాలుగేళ్ల క్రితం అదే ITPLలో పని చేసే వేరే పరశురామక్షేత్రాంగని తో దీపావళి నాడు బ్ససులో తిరగడం గుర్తుతెచ్చుకొని, నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నించా.

జీవితం మొత్తం మీద మూడ నాలుగు దీపావళులకన్నా ఎక్కువ ఎప్పుడూ జరుపుకోలేదేమో. దానికి తోడు ఈ మధ్య భూవాతావరణ ప్రేమ ఒకటి అపారంగా పుట్టుకువచ్చింది. అప్పుడెప్పుడో దగ్గర దగ్గర పన్నెండేళ్ల క్రితం దీపావళికి మందులులేవేంటి అని అడిగితే, మా అమ్మ డబ్బులిచ్చి, మాలపల్లి పంపించి, కొనుక్కు తెచ్చుకోమన్న విషయం గుర్తొచ్చి, తెలియన బాధ చాలా వేసింది. చాలా దీపావళులతో పోలిస్తే ఈసారి దీపావళి బాగానే అయినట్టే.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. దీపావళిని సంతోషంగా జరుపుకునే వారు, మానసిక వైద్యుల అవసరం వున్నవారు.

గుఱజాడ వాక్కుః రెండే కులాలు. వివేకులు, అవివేకులు.

Wednesday, November 07, 2007

కందం, మందం, బావతో సరసం

కందం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. తెలియదా ?
అయితే ఇక్కడ కందం గురించి చూడండి. కందానికి ముందు మీరు గురు లఘువుల గురించి నేర్చుకోవాలి. వాటికి లంకె. అబే లాభంలేదు, లంకెలిస్తే మాత్రం ఎవరు చదువుతారు అంటే, ఇకనేనే విన్నవించుకుంటా.

లఘువు (గుర్తు I)
సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు ఉదా: అ, ఌ, ఎ, ఘి, పు, తృ, వఁ, ళొ వగైరా

గురువు (గుర్తు U)
క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి. ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, కౄ, చా, డం, నః, రై వగైరా
ఒక అక్షరం తరువాత పొల్లక్షరం వస్తే అది కూడా గురువౌతుంది. ఉదా: అక్, విశ్, ముల్, నెన్ వగైరా

ఒక పాదం మఱియు దాని గురులఘువిశ్లేషణ
"శారికా కీరపంక్తికిఁ జదువు సెప్పు"
శాU రిI కాU కీU రI పంక్U తిI కిఁI జI దుI వుI సెప్U పుI
గమనించ వలసిందేంటంటే సెప్పులో సె గురువు ప్పు లఘువు!

కందం
పైన చెప్పినట్టు గురువులకు రెండు మాత్ర(లిప్త)ల కాలం, లఘువుకు ఒక మాత్రాకాలం పడుతుంది. అంటే లఘువుకి రెండింతల కాలం పడుతుంది గురువుకి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ నిష్పత్తి ౧.౪౬౧౨౫ కి దగ్గరలో వుంటుంది. మీకు తెలుగు అంకెలు చదవటం రాదు కాబట్టి రెండని అనుకుందా.

కందం పద్యాన్ని నాలుగేసి మాత్రలగా విడగొట్టవచ్చు. నాలుగు మాత్రలంటే ప్రతి గణం
నల IIII
భ UII
జ IUI
స IIU
గగ UU
గణాలలో ఒకటై వుండాలి.

ఉదా:
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
UII UII UII (భ భ భ)
మప్పటి కామాటలాడి - యన్యుల మనముల్
UII UU IUI - UII IIU (భ గగ జ - భ స)
నొప్పిం పక తా నొవ్వక
UU UII UII (గగ భ భ)
తప్పించుక తిరుఁగువాడె - ధన్యుడు సుమతీ
UU IIII IUI - UII IIU (గగ నల జ - భ స)

కందంలో ౩, ౫, ౩, ౫ గణాలతో నాలుగు పాదాలు రాస్తే చాలు.
కానీ అలా వుంటే మఱీ అందరూ వ్రాసేస్తారు, ఇక కవిత్వం అందరికీ వచ్చేస్తుంది, సమాజం బాగుపడిపోతుందని, కొందరు ఛాందసవాదులు ఇంకా చాలా అనవసర నియమాలు పెట్టారని కొందరి అభిప్రాయం. నేను దానితో ఏకీభవిస్తానా లేదా అన్నది అప్రస్తుతం, అప్రముఖం.
ఉదా- పై పద్యంలో ప్రతి పాదానికి రెండో అక్షరం 'ప్ప' వుంది. దీనిని ప్రాస నియమం అంటారు (ఇంకా ఇలాంటి నియమాలు చాలా ఇక్కడ వున్నాయి)

భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు, అరసం
వెనకటి రోజుల్లో చదువుకునే కాస్త మందీ, తెలుగొక్కటే చదువుకునే వారు. కాబట్టి వారికి క్లిష్టమైన ఛాందస నియమాలు పెద్ద లెక్కకాదు. కానీ తెల్లవాళ్లు లెక్కలు, తుపాకులూ చదువుకుని ఇతరులపై రాజ్యం చెయ్యడం చూసి, మనవారు కూడా తెలుగుని పక్కన పెట్టి లెక్కలూ, లైంగిక మనస్తత్వ శాస్త్రాలూ చదవడం మొదలు పెట్టారు. కాబట్టి నియమాలు పాటించడం కష్టమయ్యింది, భావాలకి ఛందస్సు అడ్డు పడడం మొదలయ్యింది.
అందుకే ౧౯వ శతాబ్ధం మొదట్లో భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు వంటి ఉపాయాలు వేసారు కవులు రచయితలూ కనుగొన్నారు. ఆ కవుల సంఘాలే అరసం, విరసం వగైరా! నేను ఆఱునెలల క్రితమే తెలుగు చదవటం మొదులు పెట్టాను, కాబట్టి నాకు పెద్దగా వాటితో సంపర్కం(టచ్చి) లేదు. అందుకే మీరు తెలియ జెప్పుతారని లంకెలిచ్చా.

మాత్రా ఛందస్సు
ఇది మాత్రలమీద ఆధారపడి వుంటుంది. కందంలోని గణాల నియమాలు తప్ప ఇతర నియమాలు తీసేస్తే ఒక విధంగా మాత్రాఛందస్సు వర్తిస్తుంది.
ఇందులో గురువు U = ౨, లఘువు I = ౧ అని వూహించుకొని, ఒక పాదం పలకడానికి ఎన్ని మాత్రలు పడతాయే లెక్కవేసి, అన్ని పాదాలకూ ఒకే మాత్రా బరువుండేట్టు చూడాలి.
ఉదా:
ప్రతిజ్ఞ (పాదానికి నాలుగు నాలుగు మాత్రల గణాలు, అంటే పదహారు మాత్రలు)
పొలాలనన్నీ, హలాలదున్నీ, (జ గగ జ గగ)
ఇలాతలంలో హేమం పిండగ (జ గగ జ భ)
జగానికంతా సౌఖ్యం నిండగ (జ గగ జ భ)
విరామమెరుగక పరిశ్రమించే, (జ నల జ గగ)
బలం ధరిత్రికి బలికావించే, (జ భ భ గగ)
కర్షక వీరుల కాయం నిండా (భ భ గగ గగ)
కాలువకట్టే ఘర్మజలానికి, (భ గగ భ భ)
ఘర్మజలానికి ధర్మజలానికి, (భ భ భ భ)
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌! (భ భ ద గగ)

బావ కవిత్వం
కొత్త సహస్రాబ్ధిలో తెలుగు నేర్చుకునేవారు బాగా తగ్గిపోవడంతో, కవిత్వాలు రాయడం కష్టఁవవ్వడ్డంతో, నేను కొత్త కవితా విధానం కనుగొన్నాను. ఇది ఒక శతాబ్ధం క్రితం గుఱజాడ కనిపెట్టిన మాత్రాఛందస్సుకు అక్రమ సంబంధాల ద్వారా కలిగిన సంతానం. దాని పేరే

మందం
ఇందులో నాలుగు పాదాలు పాదానికి నాలుగు గణాలు గణానికి నాలుగు మాత్రలు! ౪ x ౪ x ౪= ౬౪
అఱవై నాలుగు మాత్రల అఱుదగు
నీలారవింద హారం మందం!
(స భ భ నల; గగ జ గగ గగ)
రెండు పాదాలున్న దీని అరమందం అంటారు. కావాలంటే మందం ఇంకా తగ్గించి పావు మందాలు కూడా వ్రాసుకోవచ్చు!

మందం ఉదా:
చదువెందుకు సంక నాకడానికి !
గురువెందుకు గుద్ద నాకడానికి !
పదిగోవులు కాసుకున్న, పాశము
దొరుకును గదరా ధరిలో సుమతీ!
(స స జ భ; స స జ భ; స స జ భ; స స స స)
దీని కన్నా పరమ సత్యం వుందా? ఎంత అద్భుతంగా వుంది పద్యం! చూశారా ఛందస్సుని కొద్దిగా తగ్గించి బావం మీద బుఱ్ఱపెడితే వజ్రాలు రాలతాయి!
వివరణ: ఇది వ్యవసాయ పొలాల్లో తరతరాలుగా వినబడుతున్న పద్యం. భూమిని నమ్ముకోవడంలోని ఆనందాన్ని, చదువు యొక్క అప్రయోజనాన్ని తెలిపే చాటువు.

గొప్ప తగ్గింపు
ఇంతకీ భావ కవిత్వానికీ బావ కవిత్వానికీ వున్న ముఖ్య వ్యత్యాసం చెప్పనేలేదు కదా. మా బావ కవిత్వంలో మీకు నియమాలు ఇష్టమైతేనే పాటింటవచ్చు. లేక పోతే మానేయ్యవచ్చు.
కాబట్టి, పైన చెప్పబడిన ౪x౪x౪ నియమాన్ని పాటించకపోయినా మీరు దాన్ని మందం అనిపిలుచుకోవచ్చు. కానీ మందం కొద్దిగా తగ్గుతుంది.

బుద్ధి మందం ఉదా:
చెండాలం చెంబులవాద్యం
సాయంత్రం సాంబారన్నం
పిల్లి తినని పిండాకూడూ
బల్లి వదిలిన తెల్ల తోకా
పందిఁ చంపిన పిల్ల బంటూ
కంది పప్పులో గుండ్రాయీ
- వద్దోయీ నవకవనానికి
(ప్రతి పాదానికి పద్నాలు మాత్రలు)

ప్రశంస
మా మందానికొచ్చిన ప్రశంసలు కొన్ని
"మందం is the modern day scalable alternative to మత్తేభం" - సాయంకాలం.నెట్
"మందం మన శతాబ్ధ కవిత్వానికే మేకప్ ఆర్టిష్టు" - ఆమాట.కామ్
"మందమా మందగామినా" - సృజనభంజని.ఆర్గ్
"మందగిస్తున్న మాడరన్ కవిత్వాన్ని మందాగ్నిలా తాకిందీ మందం" - పాతపెన్ను.బ్లాగుస్పాటు.కామ్
"మందమా! చాటంత దానందమా!" - కోడలి.ఆర్గ్
"సుమతీ పక్కకి తప్పుకో వచ్చేసింది మందమతీ" - చల్లెద.కామ్

బావతో సరసం
మీరూ మాలాగే మందాల అందాల అర్ణవాల లోతులు తీయ్యాలని ఆరాట పడుతున్నారా? ఆగలేకున్నారా? అయితే వెంటనే చేరండి "బావకవుల తోవలో సరదా రాసేవారి సంఘం" (బావతో సరసం)!

Saturday, November 03, 2007

ఆర్కుట్ లో తెలుగు

"సినిమాలలో హ్యాపీడేస్ ఎలాగో, అంతర్జాలంలో ఆర్కుట్ అలా" అనేది మీలో ఆర్కుట్ అకౌంటు వున్నవారికి తెలిసిన విషయమే ! అకౌంటు లేని వారు ముందు హ్యాహీ డేస్ చూసి తరువాత ఆర్కుట్ అకౌంటు తెరవండి ! అప్పుడు అర్థమవుతుంది! అప్పటికీ అర్థమవ్వకపోతే, అక్కడ వున్న హ్యాపీ డేస్ అనే కమ్యూనిటీలో చేరండి ! అప్పుడు అర్థమవుతుంది బ్లాగులకంటే పెద్ద వ్యసనం, వాటికంటే చెత్త టైం పాస్ ఇంకోటి వుందని !

ఇంతకీ మంచి మాటేంటంటే,
బ్లాగులు తెలుగులో వచ్చి నట్లు ఆర్కుట్ కూడా తెలుగులో వచ్చింది.
మీ హోమ్ కి వెళ్లి అందులో ఎడమ పక్క పట్టీలో సెట్టింగులు లో Display Language ని తెలుగు లోకి మార్చుండి. మీ ఆర్కుట్ అనుభవం తెలుగులోకి అనువదించబడుతుంది.

ఆర్కుట్ నుండి కొన్ని అనువాదాలు
Home హోమ్
Settings సెట్టింగులు
Album ఆల్బమ్
Scrapbook స్క్రాప్బుక్
Communities కమ్యూనిటీలు
State స్టేట్
Add Stuff స్టఫ్ చేర్చుట

Passions - transliterate passions as is to telugu, ఇష్టాలు
Activities కార్యకలాపాలు
Email ఇమెయిల్, e- చిరునామా
Relationship Status సంబంధ స్థితి
Single ఒంటరి (How true!)
Here for ఇక్కడ ఎందుకోసం
Children: None పిల్లలు: లేదు

Edit సవరించు
Sexual Orientation లైంగిక దృక్పదం (మరిన్ని వివరాలు ఇవ్వదలచుకోలేదు, మీరే చూసుకోండి)

కొన్ని సవరణల అవసరం వున్ననూ, తెలుగులో వారి గూడును ప్రవేశపెట్టినందుకు ఆర్కుట్ మఱియు గూగుల్ వారిని నిజంగా అభినందించాలి!

ఇప్పుడే గమనించిన విషయం :
ఆర్కుట్ లో మీ ప్రోఫైలుకి మీ బ్లాగు చేర్చవచ్చు, పైన పోర్కొన్న స్టఫ్ చేర్చు లో స్టఫ్ అంటే బ్లాగులు ఫీడులు వగైరా అంటా! ఇంకేంటి అగ్నికి పెట్రోలు తోడైనట్టే!
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం