భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, August 24, 2007

నోటువెలది

ఎన్నాళ్ళ నుండో అనిపిస్తుంది
"ఆటవెలది చాలా తేలికే, మరి మనం అందులో ఒక పద్యం కూడా రాయలేదేంటి ఇప్పటి వరకూ?" అని.
దానికి ఒక కారణం, ఎక్కడో "ఆటవెలదిలోనూ తేటగీతిలోను ఒకటవ మరియు మూడవ పాదాలు ఒకేలా ఉంటాయి" అని చదవడం, కానీ అది తప్పని నాలుగు వేమన పద్యాలు ఒక వికీపీడియా చూడగా తెలిసింది.

ఏదేమైనా, ఈవాళ బస్సులో వస్తుంటే, సరైన inspiration లేక పద్యాం వ్రాయలేకపోతున్నాననుకుంటుండగా, కళ్ళ ముందు జిగేలు మని మెరిసింది ఒ పది రుపాయల నోటు, ఇంకే ముంది.
పదిలమైన నోటు పది రుపాయల నోటు
కోరుకున్న దెచ్చు కోకు హెచ్చు
బస్సువాని కివ్వు బైల్దేరు యిక నువ్వు
పట్టణంబు జూడు పల్లె జూడు
ఆటవెలది నిజంగా చాలా తెలికండి. ఎంత తేలికంటే కొద్దిగా సవాలు గా ఉంటుందని నేను యతినియమం తో బాటు ప్రతి పాదంలోనూ అంత్యనియమం కూడా పాటించా (నోటు-నోటు, దెచ్చు-హెచ్చు).

తెలుగులో ఎన్ని హ గణాలు ఉన్నాయంటే మీకు సుర్యగణాలకేం లోటు ఉండదు. అలానే సూర్యగణాలు కాని పద ప్రయోగాలలో ఇంద్రగణాలు చాలా ఉన్నాయి. ఇకనేం మీరు కూడా వ్రాయండో ఆట వెలది.

ఎంతైనా "దేశ బాషలందు దెలుగు లెస్స" అంది ఆటవెలదేగా. ఇవాళే దీన్ని బస్సులో చూసా... హుఁ... అర్థమయ్యింది! మీరు కూడా ఇది వ్రాసున్న బస్సెక్కి కూర్చుని ఆలోచించండి :)

Sunday, August 19, 2007

పైసా విలువ, ప్రాణం విలువ

నేను క్రిత నెల హైదరాబాదులో ఉన్నప్పుడు, ఒక ప్రయాణం చెయ్యాల్సివచ్చింది. నిజాంపేట రహదారి నుండి మాధాపూరం పోలిసు కార్యాలయానికి వెళ్ళాల్సివచ్చింది. ఆ ప్రయాణం మీకోసం విఫులంగా వివరింపబడినది దిగువున.

ఎందుకు, ఏమిటి, ఎలా

అది శనివారం సాయంత్రం, నేను తరువాతి రోజే నగరం విడిచి మాపల్లెకు వెళ్ళవలసి ఉంది. కాబట్టి మా సీనియర్ ఒకతను నన్ను రాత్రి భోజనానికి కలవమని చెప్పాడు. మామూలుగా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలసినా 'ముందు చిన్న ఉద్యోగంలో చేరి తరువాత పెద్ద దాంట్లోకి మారితే బాగుంటుంద'ని రిస్కు హెడ్జింగ్ చేసే మహదుపాయం ఒకటి పారేస్తున్నారు ఆర్యులు. అట్లాంటా నుండి ఆంధ్రా వరకూ ఇదే ఉపాయం. బ్లాగర్ల నుండి అమ్మలక్కల వరకూ ఇదే సలహా. నేనూ చేసేదదే అని వారికి అర్థం అవ్వదు. ప్రస్తుతానికి సంవత్సరానికి ఒ ౧౫౦ (150) వేల డాలరుల ఉద్యోగం ఒకటి చూసుకొని ఆ తరువాత పెద్ద అవతారం దాల్చుదామన్నదే నా ఉద్ధేశం కూడానూ. అందుకే ఉద్యోగం ఉన్నోళ్ళ దగ్గర ఉద్యోగ సలహాలు తీసుకోకూడదు.

ఏది ఏమైనా నా సీనియరు కూడా అదే ఉపదేశిస్తాడేమోనని భయపడుతూ బయలుదేరా. అతను ఫోను చేసి నన్ను పోలీసు స్టేషనుకు రమ్మన్నాడు. సమయం కూడా ఇచ్చాడు. వచ్చే పద్దతి కూడా వివరించాడు. మా ఇంటి ముందు ఆటో ఎక్కితే అతను మాధాపురం పోలీసు స్టేషను దగ్గరకు తీసుకుపోతాడంటా.
"ఆటోనా అంటే ఎంటి ?" అని నోరు జారా. "నాకైతే బస్సుల,సర్వీసు ఆటోలు మాత్రమే తెలుసే" అన్నాను. అతను "కాబోయే గోడ వీధి ఉద్యోగివి, అంత పేదరికంగా ఆలోచిస్తావా?" అని ఆడిపోసుకున్నాడు. "పేదరికం పాపం కాదు బాబూ, శాపం" అని నేను వాపోయినా అతని ఐఐఎం బుర్రకి అర్థంకాలేదు. అందుకనే డబ్బున్నోళ్ళ దగ్గర ప్రయాణ సలహాలు తీసుకోకూడదు.

సర్వీసు ఆటో
నేను కూకట్‌పల్లి ముఖ్యరహదారి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సర్వీస్ ఆటోకోసం వెతక సాగా, చాలా ఉన్నాయి, అన్నిటి మోటర్లు తిరుగుతున్నాయి. కాని తెలివిగా ఏది ముందు బయలుదేరుతున్నదో చూసుకొని ఎక్కాలి, నేను ఆ పనే చేసా. డ్రైవర్ సీటు పక్కన ఒక డబ్బా ఉంది, మీరు అమాయకులైతే అది ప్రథమ చికిత్స డబ్బా అనుకుంటారు, కానీ కాదు, అది extra seating! నా కన్ను దాని మీదే పడ్డాది, దాని మీదకెక్కి కూర్చున్నా. ఆ డబ్బా మీద కూర్చుంటే మీకు ప్రయాణంతో బాటు ప్రమాదం ఉచితం. అక్కడ పట్టుకోవడానికి ఎఁవీ లేవు! నాకన్నా తక్కువ అనుభవం ఉన్న వాళ్ళ గుండె గుబేలు మనేది, కానీ నేను భయపడలేదు. కాలుని గట్టిగా ముందుకేసి నొక్కి, పిఱ్ఱని గట్టిగా వెనక్కేసి నొక్కాను. న్యూటన్ లా వల్లో ఘర్షన వల్లో నేను ఆటోలోనే ఉన్నా, శరవేగంతో అది అతిశరముచేసుకుంటూ ముందుకు వెళ్ళింది!

హృదయభాను
అలా ముందుకి ఓ ౨౦౦ మీటర్లు వెళ్ళగానే ట్రాఫిక్ జాం. మన ఆంధ్రలు గొడ్డుల్లాగా పనిచేసి జీవితాన్ని ఆశ్వాదించరని ఎవరైనా అంటే, వారికి నచ్చజెప్పండి, "చూడు మా రాజధానిలో శనివారం రాత్రి రద్దీ, అందరూ వారాంతంలో మస్తీ కొట్టడానికి నగరంమీద పడ్డారు, నేనిలాంటి వింత విలాశదేశాలయిన అమెరికా, కెనడాలలో కూడా చూడలే"దని.

అలా రద్దీలో ఆటో ఆగినప్పుడు అప్పటిదాకా నా ప్రాణం మీద ఉన్నధ్యాసంతా రోడ్డుపక్కన పడ్డది. రహదారికి మీటరు దూరంలో గుడిసెలున్నాయి. భారతావనిలో రోడ్డకు అటూఇటూ రెండు మీటర్లు వాహనాలు వెళతాయన్న విషయం జగమెరిగిన సత్యం. అంటే వారిల్లు రోడ్డుమీదే ఉన్నట్టు. ఇంటి ముందు ఆడవాళ్ళు, ఇళ్ళ యజమానురాళ్ళు కలసి ముచ్చటించుకుంటున్నారు. ఊహించుకోండి, ట్రాఫిక్కు జాం, రోడ్డుకు అవతలా ఇవతలా మనవాళ్ళు రెండు మీటర్లవరకూ వహనాలని పోనిస్తూనేవుంటారు.
అటువంటి చోట, లారీ చక్రాలకి మీటరు దూరంలో రాళ్ళ సమూహం మీద గుడిసెలు, వాటి ముందే సాయంకాలం ముచ్చట్లు. ఏవూరి నుంచి వచ్చారో పాపం, ఎ పల్లెటూరిలో ముచ్చటించే అలవాటుని ఇలా నగరానికి తెచ్చారో ! ఎక్కడ అప్పుతీరక బ్రతుకు తెరువు కోసం ఇలా నగరానికి మూటముడి సర్దుకొని, పిల్లల్ని చంకనెత్తుకొని ఇలా బయలుదేరారో! ఈ పొగకి వీరి ఊపిరితిత్తులు ఎంత కాలం పనిచేస్తాయి? వీరి ఆయిష్షు ఎంత తగ్గిపోతుందో!
"ఓ కమాన్ నాట్ నౌ!" అనుకొని నేను అప్పుడే ఆ శనివారం రాత్రి, ఆగోలలో ప్రశాంతంగా ఉదయిస్తున్న నా హృదయభానుని నెత్తి మీద సుత్తికో ఒ నాలుగుసార్లు కొట్టి, పాచిమూఖానే వాణ్ణి అస్తమింపజేసాను.

"జెయన్‌టీయు వరకూ ఇలానే ఉంది, మీరు నడిచి వెళ్ళిపోతే తొందరగా చేరుకుంటారేమో" అని డ్రైవరు బాబు సలహా, సరే అతని మూడు రుపాయలూ అతనికిచ్చి నేను బయలుదేరదామనుకున్నా. అతని దగ్గర యాభైకి చిల్లర లేక, ఏమీ ఇవ్వకుండానే బయలుదేరాను. జెయన్‌టీయు దగ్గర రోడ్డు దాటాల్సి వచ్చింది. ఆ గండం గట్టెక్కాక, మహాతాంత్రిక నగరానికి (హైటెక్ సిటీ) సర్వీసు ఆటో వెతకడం మొదలు పెట్టా. అక్కడ అవి దొరుకుతాయని, మా మహాతాంత్రిక నగరంలో పనిచేసే అల్పతాంత్రిక బావ చెప్పాడు. కాని అలాంటివేమీ కనబడలేదు. నేను నా పేదరికానికి అన్యాయం చెయ్యలేక, మామూలు ఆటో తీసుకోలేదు.

షేరింగ్ ఆటో
అక్కడ ఐదుగురు జనాభా ఎక్కికూర్చున్న ఒక మామూలు ఆటో చూసా, వావ్ అనుకున్నా! సర్వీసు ఆటోలు కోసం చూస్తున్నా, ఎం కనబడలేదు. ఆ ఐదుజనాల ఆటో నాదగ్గరకు వచ్చి "సార్ ఎక్కడికి" అన్నాడు, "హైటెక్" అన్నాను. "ఎక్కండి" అన్నాడు. "ఎక్కడ" అన్నాను. "ఇదిగో ఈ పక్కన" అని తన పక్కన కూర్చోమన్నాడు. నేను గతిలేక ఎక్కాను. దాన్ని షేరింగ్ ఆటో అంటారు. నాకు ఎందుకో మా బావ సర్వీస్ అటో అన్నట్టు బాగా గుర్తు! అందుకే సర్వీసు ఆటోలకీ షేరింగ్ ఆటోలకీ తేడా తెలియని బావలని సలహాలు అడగకూడదు.
నేను ఎక్కాను, అంటే నా ఒక పిఱ్ఱ ఆటోలో ఉంది, ఒక కాలు వేళ్ళు లోపల ఉన్నాయి, ఒక చేతి వేళ్ళు పైన ఎదో రాడ్డుని గట్టిగా పట్టుకున్నాయి. డబ్బై ఐదు కేజీల ప్రాణం ఆ గుప్పెట్లో ఉంది అచ్చంగా. ఆటో మళ్ళీ దూసుకుపోతుంది. అలా అర ప్రాణాలు గుప్పెటికి అందించి, అర దీపం గాలికొదిలి ప్రయాణం సాగుతుండగా, రోడ్డు మధ్యన రెండడుగులు ఎత్తున్న డివైడరు పై ఒ నలుగురు స్త్రీపురుషులు వెల్లకిలా పడుకొని వున్నారు. వారిని ఒ ఫోటోగ్రాఫరు ఫొటో తీస్తున్నాడు. అలానే ఓ ఇద్దురు పోలీసులు కూడా వున్నారు. ఆకాశం లో ఎగురుతున్న అనుభూతి వస్తున్ననాకు దాని మీదకు పెద్ద ధ్యాస పోలేదు.

అలా చాలా సేపు ప్రయాణించగా నగరం వదిలి, భుధ గ్రహాన్ని తలపించే ఒ ప్రాంతం గుండా వెళ్ళగా, చివరికి మహాతాంత్రిక నగరం రానేవచ్చింది. అక్కడ ఇంకో షేరింగ్ ఆటో ఎక్కి మాధాపురం పోలిసు కార్యాలయానికి వెళ్ళా. అది ISO 2000 certified పోలిసు కార్యాలయం అంట. అంటే ఎంటో మరి? నిందుతులకు బదులు బాధితులను ఖైదు చేస్తారా ఎంటి?

వులవలు
నా సీనియర్ రానే వచ్చాడు, మేము మంచి భోజనశాలకు వెళ్ళి ఉలవచారు తిన్నాము. గతం, వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నాం. పెద్దలు, తోటివాళ్ళు, చిన్నలు గురించి మాట్లాడుకున్నాం. ఆశలు, అవరోధాలు లెక్కేసుకున్నాం. డబ్బు, సంతృప్తి, సేవ గురించి చర్చించుకున్నాం. జియ్యారి, జీమేట్, క్యాట్ లలో లోటుపాట్లు తెలుసుకున్నాం. రాజమండ్రి, బెంగుళూరు, కల్లికోట (కాలికట్) గుర్తుచేసుకున్నాం. బిల్ మాత్రం అతను కట్టాడు.

వెనక్కి వస్తున్నప్పుడు రాత్రి ఆటోలేమి దొరకక మేము పోలీసు కార్యాలయం వరకూ ఒక షేరింగ్ ఆటోలో ముందు డ్రైవరుకు అటూ ఇటూ కూర్చుని బయలుదేరాం. అతని ఐఐయమత్వం దానికి అడ్డుచెప్పలేదు. ఎదో మేమే గొప్పనుకున్నట్టు, మిగతా ఎవరికి అర్థంకాని మహాతాంత్రిక ఆంగ్లంలో మాట్లాడుకున్నాం.
"ఇది ఫోటో తీసుకుపో, నువ్వు గోడవీధి (వాల్ స్ట్రీట్) లో పెద్ద వ్యక్తి అయినప్పుడు ఇది గుర్తుచేసుకోవచ్చు" అన్నాడు. నవ్వుకున్నాం, ఈ సారి నా తలకూడా ఆటోలో ఉన్నందుకు నేను సంతోషించాను.

విలువలు
వెనక్కి ఇంచుమించుగా వెళ్ళిన రీతిలోనే వచ్చా, షేరింగ్ ఆటో, షేరింగ్ ఆటో, బస్సు, కాలి నడక. ఈ సారి సర్వీసు ఆటో ఎక్కలేదని గమనించాలి. మొత్తం ట్రిప్పుకు ముప్పై రూపాయలు కూడా అవ్వలేదు! అది మీరు అసాధ్యమనుకున్నారు, కాని ఉద్యోగం మాని చూడండి, చాలా అసాధ్యాలు సాధ్యాలవుతాయి.

దారిలో ఇంతకు ముందు డివైడరు పై పడుకున్న వ్యక్తులు ఉన్న స్థలం దగ్గరకు వచ్చాం. డ్రైవరు చెప్పసాగాడు.
"సర్వీసు ఆటో వస్తుంది, దానిని వెనకనుండి మామూలు కారు గట్టిగా గుద్దింది, నాలుగైదు పల్టీలు కొట్టింది ఆటో. అందులో ఉన్నవారందరూ చచ్చిపోయారు."
నేను హృదయ భాను ఎమంటాడో వినడానికి చెవులు సిధ్ధం చేసుకున్నాను. ఎం వినిపించలేదు. నాకు నేనే అనుకున్నా,
"పేదప్రాణాలు ఎక్కువే దేశంలో, అందుకే వాటికెక్కడా విలువలేదు. ప్రాణానికి విలువ ఇచ్చేది ఎవరు? ఎవరి ప్రాణానికి వారేగా ఇచ్చేది! పేదరికం పైసాకి ఇచ్చే విలువ ప్రాణానికి ఇవ్వదు! మరి మధ్య తరగతో? ఆటోలొస్తుంటాయ్ పోతుంటాయ్, ప్రాణాలు వస్తుంటాయ్ పోతుంటాయ్."

Friday, August 17, 2007

హృదయభాను: చిరు పరిచయం

ఉపోద్ఘాతం (సంబంధంలేని సుత్తి)
నేను చాలా కాలం నుండి బ్లాగలేదని అభిమానసంఘాలు చాలా గోల పెడుతున్నాయి. ఆ విషయం తెలియఁగానే, అభిమాన సంఘాలున్నాయని తెలిసి చాల సంతోషించాను, కానీ వారి అభిమానం ఎక్కడనుండి వస్తుందన్నది నాకర్థమయి, సంతోషం సల్లారింది. జీవితంలో డెస్పయ్యి నా బ్లాగు చదివి నా పరిస్థితి కంటే వారి పరిస్థితి చాలా బాగుందనుకొని సంతోషపడే వారి కూడలే ఈ అభిమానసంఘాలు.
నేను దేశాటనలో ఉండడం వల్ల అంతర్జాలాని అత్యవసర పనులకు తప్ప రాలేకపోయాను. భాగ్యనగరం నుండి మా ఇంటికి వచ్చాను, మాది పల్లటూరు కాబట్టి ఇక్కడ ఇంటర్నెట్ రాదు. ఇంకో వారం రోజుల తరువాత ఉత్తరాఖండం వెళ్ళి వచ్చా. ఇంటికొచ్చాక తెలిసింది, మీరు ఎంత కొండల్లోకి వెళ్ళినా, మిమ్మల్ని టీవీ, అంతర్జాలం రూపంలో మిమ్మల్ని నూతన జీవన విధానం వెంటాడుతూనే ఉంటుందని. ప్రపంచకంపు నుండి అతి దూరంగా ఎప్పటికీ పారిపోలేరని! ఐతే ఇప్పుడు కారు హారను కూడా రాని మా ఇంటికి ఇంటర్నెట్ వస్తుందని తెలుసు కొని, అభిమానులకోసం బ్లాగుతున్నా.

ఎవరీ హృదయభాను?
నాకూ ఆధునిక జీవన విధానానికి అస్సలు పడదని ఈ పాటికే మీకు అర్థమయ్యిండాలి. అందులో నాకు నచ్చని విషయాలు కొన్ని చెప్పవలసి వస్తే: రెసిడెంషియల్ పాఠశాలలు, హారన్ మోగించే కార్లు, భద్రత కరువైయ్యే సర్వీసు ఆటోలు, పోగ బట్టిపోయిన కాలనీలు, వగైరా వగైరా.

సిటీలో చిన్న పిల్లల్ని చూస్తే .......
"ఎందుకు? వీళ్ళు కష్టపడి ఈ పొగలో, ఈ భద్రత లేని ఆటోలలో ఎక్కి, లెక్కలు మాత్రమే నేర్పి, మనుషులను యంత్రాలుగా మార్చే బళ్ళకు వెళ్తున్నారే!
ఇంత కష్టపడీ వీళ్ళు పెద్దయి సాఫ్టువేరు ఇంజనీర్లయి, ప్రాణం, మనసు లేని ఓ మూర్ఖ డబ్బా ముందు కూర్చుని జీవితాన్ని వృధాగా గడపడానికేనా?
లేదు వీరికి దీనికంటే మంచి బాల్యం అవసరం, అటువంటి బాల్యం పై వారికి హక్కు ఎంతైనా ఉంది. నేను వీరికోసం పాటు బడతాను.
Materialism (తెలుగులో ఎమంటారో) ని జయించిన నాగరితను సాధించిన మహాన్మహిత దేశం లో పుట్టాను. మానవ జీవితం లో అందాలను నింపి, మనిషి మనస్సును ఆనందంతో పొంగి పొర్లేడట్టు చేసే చైతన్యం సాధించిన దేశమిది.
నా దేశం కోసం, దాని భవిత కోసం, దాని పెద్దలకోసం నేను పాటుపడతాను"
అని ఒక పద్ద లెక్చరు వినపడుతుంది. ఇంతలో మీకేమో, ఛాతీలో వేడిగా అనిపిస్తుంది, ఇంకొంత సేపు ఆ భాషణ వింటే ఛాతీ పేలేదేమో అని పిస్తుంది. ఇంతకీ ధర్మసందేశాలని ప్రబోధిస్తున్నది ఎవారా అని అటూ ఇటూ చూస్తే, అటువంటి వారెవూ కనిపించరు, చుట్టూవున్నవారంతా దైనందిత జీవితంతో రాజీపడడానికి ఉపాయాలాలోచిస్తున్నవారేగాని, ఉపదేశాలు చేసేవారు కారే.

అవును అతనే హృదయ భాను!
మీ గుండెలోనే గూడు కట్టుకొని, దుష్టరాజకీయనాయకులనీ, భ్రష్టప్లాస్టిక్కునీ చూసినప్పుడల్లా మీకు కోపం తెప్పించి, మనశ్శాంతి లేకుండా చేసి, మీకు మీరే ప్రబోధించేలా చేసే, ఆ అంతఃతేజస్సే ఈ హృదయభాను.

హృదయభాను వ్యాఖ్యానాలు
హృదయభాను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు, అతని వ్యాఖ్యానాలు సర్వత్ర సర్వదా వ్యాపించి ఉన్నాయి, కొన్ని ఉదాహరణలు
"భాషని బ్రతికించుకోవడమేమిటి నీబొంద?" రానారె వారి హృదయభాను.
"అవునా .. నిజమేనా .." కొత్త పాళి వారి హృదయభాను.
"టెల్గూ అంత వీజీయా…!" శ్రీరాం వారి హృదయభాను.
"ఎదో ఉండబట్టలేక... రాస్తున్నాను" సౌమ్య వారి హృదయభాను.
నా హృదయభాను ఇతర వ్యాఖ్యానాలు.

మీ హృదయభాను ఎమంటున్నాడో(న్నదో) తప్పక తెలుపండి !
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం