భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, October 30, 2007

అట్లాంటాలో అప్పుడెప్పుడో

కొత్తపాళీ గారి టపాలో నృత్య ఫోటోలు చూసి నాకు అప్పుడెప్పుడో అట్లాంటాలో నే వెళ్ళిన ఒక నృత్య ప్రదర్శన గుర్తొచ్చింది.
అవి ఆడుతూ పాడుతూ తిరిగే రోజులు, లెక్క ప్రకారం ఉద్యోగం వెతుక్కోవలసిన రోజులు. కానీ వీసాలు రెండు రోజులలో అయ్యిపోయేసరికి, నాలా ఆదర్శాలెక్కువా చొ౨రవ తక్కువా వున్న వారికి, అనంతమైన శెలవలు వీసా లేమి రూపంలో నాఱుమళ్లపై వర్షంలా వచ్చి పడ్డాయి.

అలాంటి రోజుల్లో ఎక్కడ ఉచిత భోజనం దొరికితే అక్కడికి పరుగెత్తుకెళ్లడం చేసేవారం. అలానే కొన్నేళ్ల క్రితం మాహాచొ౨రవుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర కొద్దిగా చదివా. ఆయన కూడా కాలేజీ మానేసి కాళీగా కూర్చున్న రోజుల్లో ఎక్కడ ఉతిచ భోజనం దొరికితే అక్కడికి వెళ్ళేవాడంట. మనలా నాలుగూ పాయింట్ సున్నాల వెంట పడక, చ౨దువు సగంలో లోనే ఆపేశాడు. ఆలా అన్నదానభక్షణలో భాగంగా ప్రతి శనివారం దగ్గరలో వున్న హరేకృష్ణ మందిరానికి ఐదు మైళ్లు నడిచి వెళ్లేవాడంట. ఆయన అడుగుజాడల్లో నేను కూడా మా దగ్గరో వున్న హరేకృష్ణ మందిరంలో ఆనాడు అన్నదానం వుందని తెలిసి, నడుచుకు వెళ్దామని మా మిత్రులకు సూచించా. మా మిత్రులు "ఆఁ ఎంత గ్రాడ్ స్టూడెంట్లైతే మాత్రం ఒక రెండు డాలర్లు పెట్టి బస్సెక్కి వెళ్లలేమా" అన్నారు ఎయిడ్ వుందన్న గర్వంతో.

సరే అని అందరం బస్సు స్టాండుకు వెళ్లాం. అందరం బస్సుకూడా ఎక్కాం. నేను టికెట్టు డబ్బులు కట్టా. కానీ మా మిత్రులకు దేశీ చొ౨రవ ఎక్కువే, కాబట్టి టికెట్టు లేకుండా ప్రయాణం చేసే విధానం ఒకటి కనుగొని గమ్మున కూర్చున్నారు. ఎంట్రా అంటే, "నీలా మాకు ఆదర్శాలు లేవురా" అని మంచిగా మనవి చేసారు. తెలుగు సినామా హీరోయిన్ వంటిపై వుండీ-వుండని అంగ వస్త్రాల్లాగా నన్ను కప్పీ-కప్పని నా ఆదర్శాలను చూసి నాకు సిగ్గేసింది. అంతలో వారిలో తెలివైన వాడు, "ఆదర్శఁవనేది వుత్త భ్రమ" అని నన్ను భ్రమింప జేసి, హఠాత్ పవన వీచికతో అటే తొలగింపజేసాడు నా ఆదర్శాంగవస్త్రాలను.

ఇంతకూ గుడికి వెళ్లాం, ప్రార్థన చేసాం. "ఏంటీ ఇంకా ఘుమఘుమలు ఎక్కడ తగలట్లే"దని విచారిస్తే. భక్తులు దగ్గరలోని 'పీడుమాంటు పార్కు'లో జగన్నాథుని రథచక్రాలు కదిలిస్తున్నారని చెప్పారు. మొయిల్ దారిన బయల్ దేరిన జగన్నాథ రథచక్రాల్‌ని ఇలా పార్కులలో నిర్బంధించారని దుఃఖించినా, వాటినసలు అమెరికాలో దింపినందుకు సంతోషించాము.
రథచక్రాల్ లాగిన భక్తులు, వాల్వో చక్రాలపై రానేవచ్చారు. మంచి సాత్విక భోజనం పెట్టనే పెట్టారు. వారికి పుణ్యం బాగా అందాలనే సదుద్దేశంతో మేము రెండురెండు సార్లు పెట్టుంచుకొని మరీ తిన్నాము.

ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. వారు రాక్ మఱియు రోల్ శైలిలో భక్తి పాటలు పాడారు. పర్వాలేదని పించాయి. ఆ తరువాత ఒక ఉత్తర భారతాది తల్లితండ్రులు తమ బిడ్డల నాట్య ప్రావిణ్యాన్ని చూపించడానికి ఇదే అవకాశమని చెప్పి, ఆ పిల్లల్ని బలివితర్ది ఎక్కించారు, కానీ బలైంది మాలో కొందరు. కానీ పిల్లలు కదా నేర్చుకోవడానికి ఇంకా సమయం వుందిలే.

ఆ తరువాత వచ్చారు. ముగ్గురు అప్సరసలు.
వారిలో ముందు పొడుగమ్మాయి వచ్చింది. పొడుగ్గా చాలా బాగుంది. ఆమే ఒంటరిగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. తరువాత ముగ్గురూ కలిసి నర్తించారు. సాల్సానో రుంబానో ఖచ్చితంగా కనిపెట్టగలను గానీ, భరతనాట్యమో కదక్కో అంత ఖచ్చితంగా చెప్పలేను. కానీ తెల్ల బట్టలు వేయలేదు కాబట్టి మా మలయాళ మోహన 'మోహినీ ఆట్టం' అయితే కాదు. పళ్ళాలూ, చెం౨బులూ లేవు కాబట్టి మన కూచుపూడీ కాదు. ఇక తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత పాటలకు నర్తించారు కాబట్టి కదక్ మఱియూ ఒడెస్సీ అవ్వవు. "ఇది భరతనాట్యమే అయ్యివుండాలి" అని నిర్దారించాను.

నృత్యం అత్యద్భుతంగా వుంది. అప్పుడప్పుడూ మనకి అనిపిస్తుందిగా "వామ్మో వీళ్లు చాలా బాగా నర్తిస్తున్నా"రని, అలా అనిపించింది నాకు కూడా. ఇక ఇద్దరు చిన్న కవల పిల్లలైతే వేదిక ముందు బుడతనాట్యం చేయడం మొదులు పెట్టారు. ఎంతైనా చాలా మఱపు రాని అనుభవం. మీతో పంచుకోవాలని ఫోటోలు కూడా తీసాను. కాని అవి మా స్నేహితుడి కెమరా ఫోనులో వున్నాయి ఖండాంతరాన. కాబట్టి ప్రస్తుతనానికి నా అద్వితీయమైన వర్ణనా ప్రతిభ మీదే మీరు ఆధారపడి సరిపెట్టుకోవాలి.

సాంప్రదాయమైన భరతనాట్య దుస్తుల్లో వున్న వారు దేశీయులా అమెరికన్లా అని చాలా సేపు అనుమానపడ్డా. చూడడానికి పదహారణాల తెలుగమ్మాయిల్లావున్నారు. కానీ ఆఖరుకి వారు ఇద్దరు తెల్ల అమ్మాయిలూ, ఒక నల్ల అమ్మాయీ అన్న కఠువు నిజాన్ని దిగమింగుకున్నా. ఎంటో వోణీ వంటివి వేస్తే ఎవరైనా మన తెలుగమ్మాయిల్లానే వుంటారు. వారి గురువు ఓ తెల్ల ఆయన, ఆయన నిక్షేపంగా నిక్కరేసుకొచ్చారు, పైగా నెత్తిమీద బ్లాండు జుట్టు వుంది, కాబట్టి ఈయన నూరు సెంట్ల అమెరికన్ అని కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. వారి పాఠశాల ఫ్లారిడాలో వుందిట.

అంతా అయ్యిపోయాక దక్షిణం(సరైన పదం తెలియదు) అడగడానకి దోసిళ్లతో ప్రేక్షకుల మధ్యకి వచ్చారు. చేతులు చాచని అమెరికాలో ఇలా అహంకారాన్ని చంపుకోవడం చాలా అభినందించవలసిన విషయం. ఆ అమ్మాయి దగ్గరకొచ్చి అడిగే సరికీ, 'ఆః' లో వున్న నేను జోబులో వున్న డబ్బంతా చేతికిచ్చేసా. మాజీ విధ్యార్థి, కొత్త నిరుద్యోగిని కాబట్టి, చిల్లరతో కలిపి ఐదు డాలర్ల కంటే ఎక్కువేం లేదు. కానీ ఇచ్చిన తరువాత తెలిసింది ఇంటి కెళ్ళడానికి బస్సు టికెట్ డబ్బులు కూడా లేవని.

మా మిత్రులేమో, భోజనం అయ్యిందిగా అని, నృత్య ప్రదర్శన కోసం ఆగక బస్సుకోసం రోడ్డు మీద నించున్నారు. అవకాశవాదులూ, దురదృష్టవంతులూ ఏం చేస్తాం. ప్రదర్శన అయ్యిన సమయానికి నాకు ఫొను చేసి "నీ కోసం బస్సు ఆపాం, తొందరగా రా" అని ఫొను చేసారు. నేను పరిగెత్తుకు వెళ్లి, షూలు ధరించి, మైదానాలు దాటి, అగడ్తలు దూకి, రోడ్లు లంఘించి, సిగ్నల్లు లక్ష్యపెట్టక, ప్రాణాలు పణంగా పెట్టి, నా కోసం ఆగిన బస్సెక్కి, నా కోసం ఆపిన బస్సారథికి ధన్యవాదాలు తెలిపి, ఊపిరందుకుని, తీఱికగా నా దగ్గర టికెట్టుకి డబ్బు లేదన్న విషయాన్ని గ్రహించాను.

డబ్బు లేని చోట ఆదర్శాల లేమి టిక్కెట్టు పెడుతుంది. అవి రెండూ లేనప్పుడు చొ౨రవ టిక్కెట్టు పెడుతుందన్నది వేదవాక్కు. కానీ అది కూడ లేని వాడికో? సిగ్గు లేమి టికెట్టు పెడుతుంది! తమ కోసం కూడా టికెట్టు తీసుకోని మా మిత్రులు నా కోసం రెండు డాలర్లు వెచ్చించారు. ఆ అనుభవం కూడా ఎంతో మఱపురానిది.

13 comments:

  1. "తెలుగు సినామా హీరోయిన్ వంటిపై వుండీ-వుండని అంగ వస్త్రాల్లాగా నన్ను కప్పీ-కప్పని నా ఆదర్శాలను చూసి నాకు సిగ్గేసింది."
    --బాగుంది,బాగుంది.
    రాకేశా మీ కలాపోసన బాగుంది :)
    -నేనుసైతం

    ReplyDelete
  2. మీ అంగవస్త్ర వర్ణన నాకూ నచ్చింది. అది సరే, దేశీ చొరవ అనే వింత పేరు పెట్టి, మిత్రుల్ని బానే వెనకేసుకొచ్చారు.

    ReplyDelete
  3. నువ్వు చదువుతున్న పుస్తకాల ప్రభావం కూడా తోడైంది. This is, certainly, one of the most charming posts I've ever read in this బ్లాగోళం!

    ReplyDelete
  4. కఠువు నిజం... ఏంటో,వోణీల్లాంటివేస్తే ఎవరైనా తెలుగమ్మాయిల్లానే ఉంటారు - నిఝంగా ?!?!!!
    చాలా బాగా రాశారు,బావుంది. :)

    ReplyDelete
  5. చాలా బాగా వర్ణించావు రాకేశా! ఫోటోలు లేకున్నా వర్ణనే బాగుంది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  6. నీ వర్ణనశక్తికి పోలిక ఎక్కడ తీసుకురాను? అద్వితీయం కదా! :-))
    బాగుంది అట్లాంటాలో కలాపోసన ..

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. మీరింతగా పొగుడుతుంటే,
    కాపీకొట్టి తీసిన పోకిరి సినిమా హిట్టయ్యినప్పుడు అందరూ తనను పొగుడు తుంటే పూరి జగన్నాథ్ ఎలా ఫీలయ్యేవాడో నాకూ అలానే వుంది.

    కాబట్టి కొన్ని క్రెడిట్స్
    ------------------------
    ఆశయాలూ ఆదర్శాలూ అంగవస్త్రాల లాంటివి
    హఠాత్ పవన వీచిచకి అటే తొలగిపోతవి

    - 'మైనస్ యింటూ ప్లస్' లో 'దేవరకొండ తిలక్'

    మొయిల్దారిని
    బయల్దేరిన
    రథచక్రాల్‌, రథచక్రా
    లోస్తున్నా యొస్తున్నాయి !
    ....
    మీ కోసం కలం పట్టి ,
    ఆకసపు దారులంట
    అడావుడిగ వెళిపోయే,
    అరుచుకుంటు వెళిపోయే
    జగన్నాథుని రథచక్రాల్‌,
    రథచక్ర ప్రళయఘోష
    భూమార్గం పట్టిస్తాను !

    - 'జగన్నాథుని రథచక్రాలు' లో 'శ్రీశ్రీ'

    పట్టణాలలో, పల్లెటూళ్లలో,
    బట్టయబలునా, పర్వతగుహలా,
    ఎడారులందూ, సముద్రమందూ,
    అడవుల వెంటా, అగడ్తలంటా,
    ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తూ
    గంటలు! గంటలు! గంటలు! గంటలు!

    - 'గంటలు' లో 'శ్రీశ్రీ'

    రానారె అన్నట్టు ఇది ముమ్మాటికీ నే చదివిన పుస్తకాల పుణ్యవేఁ!

    ReplyDelete
  9. caalaa baagundi. nI nighanTuvu telugu bhalE giligintalu peDutundi :)

    ReplyDelete
  10. అలో అలో అలో శ్రీరామ్ గారు,
    నిఘంటువు తెలుగని తోసిపారేయొద్దు.
    శ్రీశ్రీ తిలక్ గురజాడ భానుమతి వంటి వారి దగ్గర నుండి నేర్చుకున్న తెలుగు నాది :)

    ReplyDelete
  11. తప్పు లేదు...
    అవసరానికి ఆదుకోని స్నేహితులెందుకు ? అక్కరలేనప్పుడు పారేయలేని ఆదర్శాలెందుకు ?

    బాగా రాశావు. కళ్ల ముందు జరిగినట్టే ఉంది.

    ReplyDelete
  12. పరీక్షా వ్యాఖ్య

    ReplyDelete
  13. రాకేశ్వర రావు గారూ....మన కూచిపూడిని అలా తేలిగ్గా చెంబులూ,పళ్ళాలూ అని తీసిపారేశారేంటండీ..అభినయం కూచిపూడిలోనే ఎక్కువండీ,భరతనాట్యం కంటే..

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం