భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, July 25, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

రంగము ౫
కూడలిలో చొఱవ బ్లాగరుతో అమెరికా బ్లాగర్ల సంఘం (అబ్లాస) పెద్దలైన హ్యారీ బ్లాగరు, వికీ బ్లాగరు, కొత్త జెర్సీ బ్లాగరు.
చొఱవ బ్లాగరు – నమస్కారం, బ్లాగర్లు సినిమా నిర్మాణ వ్యయాన్ని భరించడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ఆదర్శ నవ’తరం’గ సినిమా కాబట్టి, నిర్మతాలుగా మీరు దర్శకరచయితలకు పూర్తి స్వాతంత్రం ఇస్తారని అనుకున్నాం. కానీ ఒక రకంగా ఆలోచిస్తే, కష్టమొచ్చినా నష్టమోచ్చినా భరించేది మీరే కాబట్టి, కథ వినే హక్కు ఎంతైనా మీకుంది.
వికీ బ్లాగరు – మేము మీరనుకునేలా, కథని ఖూనీ చేసే నిర్మాతలు కామండి. మేము డబ్బు పెడతాము తప్ప, దానినుండి ఏ విధమైన ఆర్థిక లబ్ధినీ ఆశించము. సినిమా ఒక కళండి, దానిని వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకునేంత నీచానికి మేమింకా దిగజార లేదు.
చొఱవ బ్లాగరు – అమోఘం. ప్రవాసులై, మీ పిల్లలకు అఆఇఈ లు రాకపోయినా, మీ అర్ధాంగులు ఋౠఌౡ లు పలుకలేకపోయినా, మీరు మాత్రం తెలుగులోనే బ్లాగుతున్నారంటే, తెలుగు పట్ల మీకు గల అభిమానం, తెలుగు కళామతల్లి పై గౌరవం కొట్టొచ్చినట్లు తెలుస్తూనే వున్నాయి. ఇక కథ చెబుతా వినండి.. మన బ్లాగర్ల గుంపు ఒకటి ఉంటుంది, వారిని అనామిషుడు వేదిస్తూవుంటాడు, కూడలిలో కబుర్లు చెప్పుకుంటుంటే వచ్చి చిల్లర చిల్లర కమెంట్లు పెడుతూంటాడు ౬౬౬, ౯౯౯ వంటి పేర్లతోఁ. ...
...
....
అలా చివరకి ఇఱవై ఏళ్ల తరువత కలసిన మన బ్లాగు హీరోలనిద్దరినీ ఆ అనామిషుడు చంపేస్తాడు(బ్లాగుపరంగా). ఎడారిగా మారిన బ్లాగలోకాన్ని చూసి “ఇక నేనే ఏకైక బ్లాగర్ని” అని వికృతంగా ఒక నవ్వునవ్వుతాడు. అప్పుడే మొదటి సారిగా మనం వేవిన్ని అనామిషుడిగా చూపిస్తాం. ప్రేక్షకులు అఱ్ఱే బ్లాగుల వ్యాప్తికి ఇంత తోడ్పడ్డ వీవేనేనా ఆ అనామిషుడు అని నివ్వెర పోతారు. తెర పైన “ఇంకా వుంది” అని పడుతుంది.
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది. చాలా బాగుంది కథ. ఈ సినిమాకి ఎంత ఖర్చవుతుందన్నారు.
చొఱవ బ్లాగరు – పది కోట్ల వఱకూ అవ్వొచ్చు.
కొత్త జెర్సీ బ్లాగరు – పది కోట్లంటే రెండున్నర మిలయన్ డాలర్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. సినిమా అనే ఆదర్శానికని ఆ మాత్రం ఖర్చు పెట్టగలము. కళ మూలమిదం జగత్ అని అననే అన్నారు ఆర్యులు.
చొఱవ బ్లాగరు – చిన్న మనవి... పది కోట్లంటే... పది కోట్ల డాలర్లని మా ఉద్దేశం, మీరు డాలర్లలో ఆలోచిస్తారుగా అందుకని మొత్తాన్ని డాలర్లలోనే చెప్పాను. ఏ హాలీవుడ్ చిత్రం తీసుకున్నా, కనీసం వంద మిలియన్లైనా ఖర్చు వుంటుందిగా. మన తెలుగు వారు ఎవ్వరికీ తీసిపోకూడదని, మనము ఆ స్థాయిలో చిత్రాలు తీయగలమని ప్రపంచానికి చాటి చెప్పడానికి.... అప్పటికీ మన ముగ్గరు హీరోలూ మన బ్లాగుమిత్రుల కోసమని చెప్పి తలా పది మిలియను డాలర్ల నామమాత్ర మొత్తానికే సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇంక ఉన్న ఒకే ఒక్క అమ్మాయీ యాభై మిలియన్లు ఇస్తేనే చేస్తానంటుంది. కాబట్టి వ్యయంలో ౮౦ శాతం ముఖ్యతారాగణానికే ...
హ్యారీ బ్లాగరు – మేమన్నట్లు. డబ్బులు పెద్ద విషయం కాదు. అదీ అమెరికాలోని అతి సంపన్న వర్గం అయిన మన తెలుగువారికి అదో లెక్క కాదు. కానీ అంత పెద్ద మొత్తాని పెడుతున్నందుకు గాను, కథకి చిన్న చిన్న సూచనలు చేద్దామని.
చొఱవ బ్లాగరు – కథ ఇప్పటికే ఫ్రీజ్ చేసేసాం.
హ్యారీ బ్లాగరు – కథ ఫ్రీజైతేనేం? ఎండలో పెట్టండి అదే కఱుగుతుంది. అంటే మీకు కథ రాయడం రాదని కాదు. కానీ అమెరికాలో మన సినిమా సరిగా ఆడాలనే తపనతో కొన్ని చిన్న సూచనలంతే.
చొఱవ బ్లాగరు – చెప్పండి
హ్యారీ బ్లాగరు – మొన్న హ్యాపీడేస్ వచ్చింది కాదా. అది పెద్ద హిట్ కాబట్టి, ఇప్పటి ట్రెండ్ అంతా సూడెంట్ గ్యాంగులుగా నడుస్తుంది. కాబట్టి మన కథలో కూడా ఇద్దరు ముఖ్య హీరోల బదులు, ఒక నలుగురు అమ్మాయిలూ, నలుగురు అబ్బాయిలూ ఉన్న గ్యాంగ్ ఒకటి ఉండాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుందండి. కథని స్వల్పంగా మారిస్తే సరిపోతుంది.
హ్యారీ బ్లాగరు – అలానే నాలుగు ప్రేమకథలను నడిపించాలి. అందులో ఒకతను రాయలసీమ నుండి వస్తాడు. అతనికి పెద్ద ప్లాష్ బ్యాక్ ఉంటుంది.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మన రానేరా పాత్రకి అది చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – తరువాత, ఇంకొకతను, దేశంలో నేడు చెలరేగుతున్న లంచం, బంధుప్రీతి వంటి సంఘవిద్రోహ శక్తులను రూపుమాపడానికి ఒక రహస్య వ్యవస్థ నడుపుతుండాలి.
చొఱవ బ్లాగరు – దానిదేఁవుందండి. మా పురాణ్ పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
హ్యారీ బ్లాగరు – ఇక మూడో హీరో చాలా లావుగా చాలా పొట్టిగా అందవిహీనంగా మనిషా గుండ్రాయా అన్నట్టు వుండాలి. చివరకు నిజమైన ప్రేమ గుడ్డిదని తన హీరోయిన్ గ్రహించడంచేత అతని ప్రేమ విజయవంతం అవ్వాలి.
చొఱవ బ్లాగరు – దాని దేఁవుంది. మా కేకేశ్వర పాత్ర దానికి చాలా బాగా నప్పుతుంది.
వికీ బ్లాగరు – కానీ అలాంటి ఆదర్శ ప్రేమను మన మాస్ ప్రేక్షకులు జీర్ణించుకోలేరు, కాబట్టి అతను ఆఖరికి తన మిత్రులను మీరన్న ఆ అనామిషుని దగ్గర నుండి కాపాడు కోవడానికి, ప్రాణాలు వదిలేస్తాడు.
చొఱవ బ్లాగరు – భళి భళి. సరిగ్గా సరిపోతాయి మీ సూచనలు.
వికీ బ్లాగరు – ఇక ఇది బ్లాగర్ల సినిమాలానే కాకుండ. అందరూ వీక్షించి ఆనందించేలా చిన్న చిన్న మార్పులు చేయాలి. బ్లాగర్ల బదులు కాలేజీ విద్యార్థులు ఉంటే చాలా బాగుంటుంది. రోజురోజుకీ దిగజారిపోతున్న ప్రవాసుల పిల్లల్లోని తెలుగు సినిమా పై అభిప్రాయాన్ని ఏమైనా మార్చాలంటే అలాంటి కథలూ అలాంటి సినిమాలూ ఎంతైనా అవసరం.
కొత్త జెర్సీ బ్లాగరు – అవును, ఇప్పటికే హ్యాపీ డేస్ వల్ల ఇక్కడి పిల్లలు, హైదరాబాదులో బీటెక్ చేయడానికి పరుగులు తీస్తున్నారు. తెలుగు నేర్చుకోవల్సిన అవసరమూ లేదు, అలానే ఎప్పుడూ చదవవలసిన అవసరమూ లేదు. నాలుగేళ్ళు అయ్యేసరికి చోకిరీ-నౌకరీ రెండూ వుంటాయి, ఇక్కడైతే అవన్నీ సాధించాడానికి తల ప్రాణం తోక్కు వస్తుంది అని ఆలోచిస్తున్నారు.
హ్యారీ బ్లాగరు – మా అన్నయ్య గారి అబ్బాయి హార్వాడు వదిలేసి ఖమ్మంలోని ఏదోఐటిలో చేరడం వల్ల మా అన్నకు కాలేజీ ఫీజుల రూపంలో లక్ష డాలర్లు అంటే దగ్గర దగ్గర నలభై లక్షల రూపాయలు కలసివచ్చాయి!
చొఱవ బ్లాగరు – మీరన్నది నిజం. యువ తరాల ఆలోచనల్లో మార్పులు తేవలన్నదే మా నవ’తరం’గం సినిమాల ఆశయం కూడాను.
వికీ బ్లాగరు - అయితే కథను ఇలా మారుద్దాం, కాలేజీ విద్యార్థుల గ్యాంగ్ ఒకటి ఉంటుంది. అందులో ఒకరికి రాయలసీమ కక్షలతో కూడుకున్న గతం ఉంటుంది. ఇంకొకతను కాలేజీలో విద్యార్థిగా ఉంటూనే, రహస్యంగా భ్రష్టాచారాలను రూపుమాపే వ్యవస్థను నడుపుతూవుంటాడు. ఇంకొక జంట ప్రేమ కథ వచ్చేసి, చిన్నప్పటి నుండీ మిత్రులైవుంటారు, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి మాత్రం అందవిహీనంగా వున్న అతన్ని ప్రేమించలేక సీనియర్ ఒకతన్ని ప్రేమిస్తుంది, అదీ అబ్బాయి సహాయంతోనే. అబ్బాయి ఆ సీనియర్ తో ఫుట్బాల్ ఆడి గెలిచి, అమ్మయి మనసు చొరగొంటాడు. ఇక నాలుగో జంట కథేమో, వారి ప్రేమకు హైదరాబాదులో పెద్ద మాఫియా అధిపతైన అమ్మాయి తండ్రి ఒప్పుకోడు, కానీ అంతిమ విజయం ప్రేమలదే...
కొత్త జెర్సీ బ్లాగరు – బాగుంది కథ. ఒక్క కథతో మీరు సమరసింహా రెడ్డి వంటి అన్ని బాలకృష్ణ, చిరంజీవి సినిమాలూ, అన్ని శంకర్ సినిమాలూ, నువ్వే కావాలీ, హ్యాపీ డేస్ వంటి అమ్మమ్మలు సైతం చూసే యూత్ సినిమాలూ, పోకిరీ వంటి హింసాత్మక సినిమాలూ కలగలిపేశారు. సినిమా దురద వున్న ఏ తెలుగోడూ మన సినిమా చూడక మానడు.
హ్యారీ బ్లాగరు - కానీ ఈ కథకు వంద మిలయన్లు అవసరం ఉందా? ముందు ఒక మిలియన్ తో తీయండి, అది హిట్టయితే చూద్దాం.
చొఱవ బ్లాగరు– మిలియన్ అంటే నాలుగు కోట్లన్నమట. చిన్నమొత్తం కాదనుకోండి, అలా అని పెద్ద పెద్ద మొత్తం కూడా కాదు. మన భారీ కథకి ...
కొత్త జెర్సీ బ్లాగరు – మిలియన్ అంటే పది లక్షలు. పది లక్షల రూపాయలు చాలని మా ఉద్ధేశం. మీరు రూపయల్లో ఆలోచిస్తారని మొత్తాన్ని రూపాయల్లో చెప్పాము. ప్రస్తుతం అంతటితో తీయండి, అది విజయవంతమైతే చూద్దాం.
హ్యారీ బ్లాగరు – ఇదే మా ఆఖరి మాట.
వికీ బ్లాగరు – అవును. ఇదే మా ఆఖరి మాట.
అందరూ నిష్క్రమింతురు.
చొఱవ బ్లాగరు – డామిట్. కథ అడ్డం తిరిగింది!


కృతజ్ఞతలు

౧) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧
౨) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨
౩) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩
౪) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪
౫) తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

ప్రముఖ బ్లాగర్ల పేర్లు వాడుకొని వారినోట కోణంగి పులకులు పలికించినా పెద్ద మనసుతో టాపా ప్రచురణ మనఃస్ఫూర్తిగా వారు అంగీకరించినందుకు కృతజ్ఞడను. వీరిని ఈ విధంగా ప్రస్తుతించడం బ్లాగ్లోకంలో వారి ప్రాముఖ్యతకు నిదర్శనము మాత్రమే (ఉదా ఈ నాటకానికి నాయకుడు మఱియు ప్రతినాయకుడూ కూడా అయిన వీవెన్ పాత్ర)

ముఖ్య తారాగణ చదువరి, జ్యోతి, త్రివిక్రమ్, రానారె, ప్రవీణ్, రాకేశ్వర, వేంకట్ సిద్ధరెడ్డి, కొత్త పాళీ, వీవెన్, వైజాసత్య, విహారి, ఇస్మైల్

అలానే పేర్లు స్తుతింప ఇతర తారాగణానికి కూడా నా కృతజ్ఞతలు. రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, స్వాతి, రాధిక, వెంకటరమణ, సీబీరావు, చావా కిరణ్, తాబాసు, పప్పు నాగరాజు

మూల కథ అప్పుడెప్పుడో కూడలి కబుర్లలోఁ జరిగిన చర్చ.

ప్రత్యేక కృతజ్ఞతలు బ్లాగులోకాన్ని ఎగతాళి చేసి వ్రాసినా, మమ్మల్ని దూషించకుండా, చాలా బాగుంది అని వ్యాఖ్యలు వదిలిన పాఠకమహాశయులకు సర్వదా ఋణపడివుంటాను.

Thursday, July 24, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

రంగము ౪
కూడలి కబుర్లలో, రానేరా, పురాణ్, దర్శక బ్లాగరు
దర్శక బ్లాగరు కథ వివరింతురు. (కథను పెద్దగా మార్చకుండానే...)
దర్శక బ్లాగరు – అలా చివరికి ఇఱవై ఏళ్ల తరువాత ఆ ఇద్దరు మిత్రులూ మూత బడిన కూడలి కబుర్ల బయట కలుసుకుంటారు. మంచి బ్లాగరు, ఆ చెడ్డ బ్లాగరే అనామిషుడని గ్రహించి, అతన్ని అక్కడ వుండమని, కూడలి పెద్దలను పిలిచి అతన్ని పట్టిస్తాడు. అదీ కథ
పురాణ్ – కథ బానేవుంది గానీ, నేను మల్టీ స్టారర్లలో నటించను. నా అభిమన సంఘాలు ఒప్పుకోవు.
రానేరా – నీకు అభిమాన సంఘాలెక్కడ? తెలుగు గడ్డ మీద ఏ బిడ్డ నడిగినా చెబుతాడు, మేము తొడ గొడితే రికార్డులూ, మీసం తిప్పితే రివార్డులూ అని.
పురాణ్ – హూఁ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం తొడ! ఆ మాటకొస్తే ... డైలాగులు మాకూ వచ్చు బాబు... మొక్కే కదా అని పీకేస్తే పీక తెగుతుంది.
రానేరా - నట్టింటికొచ్చి నటరాజు రూపం చూపించి వెళుతున్నాడు, వీడెవడా అని బ్రెయిను బద్దలయి చావకు
నా పేరు ఎస్ ఎస్ ఎస్ భవాని ప్రసాద్, శివ శంకర సత్య భవాని ప్రసాద్. ఊరు కారంపూడి ఏరియా పల్నాడు. మా వూరికి నీళ్ల మీద రావచ్చు, నేల మీద రావచ్చు, ఆకాశంలో రావచ్చు, రైల్లో రావచ్చు. ఏ టైపులో వచ్చినా సరే. నా ఇంటికి రెండు గుమ్మాలుంటాయి. పెరటి గుమ్మం వీధి గుమ్మం . ఏ సైడు నుంచి వచ్చినా సరే. హాలీడే ఆర్ వర్కింగ్ డే. సండే టూ సాటర్డే. ఎనీ డే ఎనీ టైమ్. అయామ్ రెడీ. సుడిగాలి చెప్పకుండా వస్తుంది నేను చెప్పి వస్తాను. దట్ ఈస్ మై క్యారెక్టర్!
పురాణ్ - రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలేగాని ఆశ్చర్యపోతారేఁవిటి? రాననుకున్నారా? రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయం మనిషైపోయాడనుకున్నారా. వారణాశిలో బ్రతుకుతున్నాడు తన వరస మార్చుకున్నాడనుకుంటున్నారా? అదే రక్తం అదే పౌరుషం.
రానేరా – ఊఁ...హూఁ.. నా అడ్రస్ చెబుతా రాసుకో. ఇంటి నెంబర్ వన్. వీధి నెంబర్ వన్. ఎంటీఆర్ కాలనీ. వినిపించిందా? ఇంటి నెంబర్ వన్. వీధి నెంబర్ వన్. ఎంటీఆర్ కాలనీ.
పురాణ్ – (నిజమైన ఆశ్చర్యంతో) వావ్ సూపర్ వుంది డైలాగ్. నేనెప్పుడూ వినలేదే. ..
రానేరా – రెట్రో బాబు రెట్రో. ఏఁవనుకున్నావ్ ?
పురాణ్ – ఎంతైనా రెట్రో రెట్రోనే. ఆ రోజుల్లో నటీనటులకు చిన్న అహాలూ పెద్ద మనసులూ వుండేవి. అంత గొప్ప వారు మల్టీ స్టారర్లలో నటించగాలేనిది. మనం నటించకూడదా?
రానేరా – అవును మనమూ నటించవచ్చు. దర్శక బ్లాగరు గారు మీ సినిమాకి మేఁవ్ సిద్ధం.
పురాణ్ – ఎక్కడీయన? మన సంభాషణకి తట్టుకోలేక పారిపోయినట్లున్నాడు.

అదే సమయానికి ప్రక్కన దర్శక బ్లాగరుకీ వేవిన్‌కీ ప్రయివేటు చాటు.
దర్శక బ్లాగరు – వేవిన్, మేము బ్లాగర్ల సినిమా తీద్దామనుకుంటున్నాం. ప్రముఖ బ్లాగరుగా మీరు మా సినిమాలో కీలక పాత్ర పోషించాలని మా కోరిక.
వేవిన్ – సరె
దర్శక బ్లాగరు – మీకు హీరో పాత్రే ఇస్తున్నాం.
వేవిన్ – …
దర్శక బ్లాగరు – కథేఁవిటంటే...
ఇప్పటి వఱకూ మీ నిజజీవిత కథే కానీ దానికి పొడిగింతగా భవిష్యత్తులో తెలుగు బ్లాగ్లోకంలో ఏ తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది కథాంశం.
ఒక బ్లాగరుంటారు (మీరే), అతను చెల్లా చెదురుగా వున్న తెలుగు బ్లాగర్లందరినీ ఒక చోటుకి పోగేసి. అంతర్జాలంలో తెలుగును ఒక శక్తిగా తీర్చిదిద్దుతారు. అలా కొంత కాలం తెలుగు సంస్కృతీ సాహిత్యాలు అంతర్జాలంలో వెలుస్తాయి. తెలుగు బ్లాగర్ల సంఖ్య లక్షల్లో, తెలుగు అంతర్జాల వాడకులు కోట్లలో వుంటారు.
కానీ దానిని స్వప్రయోజనాలకు కొందరు దుష్టులు ఉపయోగించుకుంటుంటారు. వాళ్లు ఎలాంటివారంటే... చేతగానివారు, సగటాతి సగటు జనాలు. నిజజీవితంలో వారికి ఎటువంటి ఆరాధనా లేక, తీవ్ర అబధ్రతా భావానికి గుఱైన వారు. వారు బ్లాగులు మొదలు పెట్టి సగటాతి సగటు దినచర్య బ్లాగులు వ్రాసి, మసాలా సఱకు నింపి, హిట్లు సంపాదించుకుంటూ వుంటారు. పవిత్రమైన బ్లాగ్లోకాన్ని కంపు చేస్తుంటారు.
వారి చేతగానితనానికి సిగ్గు పడడం మానేసి, పైపెచ్చు సత్తావున్నవారు వారి సత్తా చూసి సిగ్గు పడాలనీ, దానిని వీలైనంత త్వరలో విడచి సగటు జనాలలో కలవాలనీ వాదిస్తూంటారు.
ఇప్పటికే తెలుగు సినిమాలను పట్టి పీడిస్తున్న మాస్ తత్వం, మెల్లగా బ్లాగుల్లోకి వ్యాపిస్తూవుంటుంది. అప్పటివఱకూ హిట్లతో పనిలేకుండా మంచి టపాలందించిన కొత్తపాళీ వంటి ఆదర్శ బ్లాగర్లు కూడా హిట్ కౌంటర్లు వాడడం మొదలుపెడతారు.
అప్పుడు మన బ్లాగ్లోక రూపకర్త అయిన మీరు, అనామిషుడి అవతారం దాల్చుతారు. చెత్త పోష్టు పడగానే మీరు సృష్టించిన కూడలి బాటు, ఆ టపా మీదకు వెళ్లి, డెస్పికబుల్ అని ఒక వ్యాఖ్య వేస్తుంది.
బ్లాగ్లోకమంతా భయం తో కిక్కిరిసి పోతుంది. అలా మెల్లగా, కవితల బ్లాగులూ, పద్యాల బ్లాగులూ, సమీక్షల బ్లాగులూ అన్నీ మూసుకు పోతూవుంటాయి.
అప్పటికీ లొంగని వారికి మీరు వారి పేరుతోనే అనుకరణ బ్లాగులు ఏర్పరచి, అడ్డమైనా చెత్తా వారి పేరు మీద వ్రాస్తూంటారు. కబుర్లులో వారి పేరుతో వున్న బాటులు చెడుగా పరుషముగా మాట్లాడి, వారికి పరువు నష్టం కలుగజేస్తాయి. ఆఖరికి వారు కూడా తలొగ్గుతారు.
అలా చివరకు ఆఖరి బ్లాగు మూసివేసిన తరువాత, అనామిషుడే వేవిన్ అని మొదటి సారి చూపిస్తాం. ప్రేక్షకులు నివ్వెర పోతారు. ద్వంద్వ వ్యక్తిత్వం (స్పిట్ పెర్సనాలిటీ) గా మిమ్మల్ని అద్భుతంగా చూపిస్తాం.
ఇక అప్పుటి వఱకూ అజ్ఞాతంలో వుంటున్న నిజాయితీ, ఇంటెగ్రిటీ గల బ్లాగర్లు కొత్తగా కొత్త కూడలిని ఏర్పరచుకొని, మళ్లీ గొప్ప బ్లాగులు వ్రాయడం మొదలు పెడతారు. బ్లాగులకు పూర్వ వైభవం నాణ్యతా సంతరిస్తారు.
వేవిన్ – అట్లస్ ష్రగ్డ్ లో హీరో జాన్ గాల్టు పాత్రో లేదా అపరిచితుడిలో విక్రమ్ పాత్రో అని చెబితే సరిపోయేదిగా! సరే...
దర్శక బ్లాగరు – మంచిది నేను వెంటనే స్కరిప్టు వ్రాయడం మొదలు పెడతాను.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౫

Wednesday, July 23, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

రంగము 3
కబుర్లు గదిలో దర్శక బ్లాగరు, పిల్ల బ్లాగరు, చొఱవ బ్లాగరు.
చొఱవ బ్లాగరు విషయం చెప్పి కథ వివరించడం మొదలు పెట్టును.
చొఱవ బ్లాగరు – అనగనగా బ్లాగ్లోకంలో ఇద్దరు ఆప్త మిత్ర బ్లాగర్లు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక వ్యాఖ్యలు వదలుతూంటారు ఎప్పుడూ. ఎంత చెత్త టపా వేసిన ‘చాలా బాగుంది, కానీయండి’ అని వ్యాఖ్య వదిలేవారు. అలా గోదావరిలో పడవ ప్రయణంగా సాగిపోతున్న వారి జీవితాలలోకి ఒక రోజు అనుకోకుండ ఒక పిల్ల తుఫాను వస్తుంది. ఒక బ్లాగరు టాపాకి ఇంకో బ్లాగరు అస్సలు బాలేదని వ్యాఖ్య వదులుతాడు. అలా వారిద్దరికి గొడవ వచ్చి విడిపోయి ఇఱవై సంవత్సరాల తరువాత కలసుకోవాలని నిర్ణయించుకుంటారు. అలా విడిపోయిన కాలంలో వారిలో ఒకరు విప్లవాత్మక బ్లాగరు గానూ, ఇంకొకరు కూడలి అభిమాన బ్లాగరుగానూ పైకి ఎదుగుతారు. ఇద్దరికీ తెలియకుండా ఆ చెడ్డ విప్లవాత్మక బ్లాగరు మంచి బ్లాగరు చెల్లిని ప్రేమిస్తాడు.
ఇఱవై ఏళ్ల తరువత కలసినప్పుడు, మాటల్లో ఆ కమెంటు వదిలింది అతను కాదని వారు గ్రహిస్తారు. తన పేరుతో ఆ వ్యాఖ్య వదిలిన అనామిషుడు ఎవరా అని తెలుసుకోవడానికి వారు ఒక అపరాధ పరిశోధకుణ్ణి నియమిస్తారు. అలా ఆఖరికి మన కథానాయకులు ముగ్గురూ కలసి, ఆ అనామిషుణ్ణి పట్టుకుంటారు. ఆపై ట్విస్టు ఏంటంటే.. చెడ్డ బ్లాగర్ని మంచి బ్లాగరు కూడలి పెద్దలకు అప్పగిస్తాడు. ఆ ట్విష్టు కూడా సరిపోక పోతే ఇంకో ట్విష్టు ఏంటంటే, ఆ మంచి బ్లాగరు చెల్లెలు అపరాధ పరిశోధకుడూ ప్రేమించుకోవడం మొదలు పెడతారు, చివరకు పెళ్లి కూడా చేసుకుంటారు. అది తెలిసిన చెడ్డ బ్లాగరు బ్లాగుజైల్లో కసితో మండిపోతూవుంటాడు. అదండీ కథ.
దర్శక బ్లాగరు – అద్భుతం, నేను ఈ సినిమా తీయడానికి సంసిద్ధం.
బుడ్డ బ్లాగరు – నేను సహాయ దర్శకుడిగా వుంటానని ఇప్పుడే చెప్పేస్తున్నా.
చొఱవ బ్లాగరు – సరే. అంతకన్నానా.
దర్శక బ్లాగరు – అచ్చంగా ఇలాంటి కథకే నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ వుంది.
చొఱవ బ్లాగరు – చెప్పండి.
దర్శక బ్లాగరు – కెమరా సౌరకుటుంబం అవతల, పాలపుంత దాటి ఆండ్రోమడా గాలక్సీలో వుంది. అక్కడి నుండి మనము దాన్ని పాలపుంత మీదకు జూమ్ చేస్తాం.
బుడ్డ బ్లాగరు – ఎంత సమయంలో జూమ్ చేయనున్నారు
దర్శక బ్లాగరు – పది సెకనులనుకో...
బుడ్డ బ్లాగరు – పది సెకనుల్లో కాంతి కూడా అంత దూరం పయనించలేదు, మన కేమరా ఎలా వస్తుంది అంత దూరం. కాంతికే పాతిక కోట్ల సంవత్సరాలు పట్టే దూరాన్ని మనము పది సెకనుల్లో ఎలా లంఘించగలము?
దర్శక బ్లాగరు – సహాయ దర్శకత్వం అంటే తేలికనుకున్నావా. నీ పని కేమరాని అక్కడికి పంపించి, దాన్ని పది సెకనుల్లో మన పాలపుంతకు తీసుకురావాలి. ఆ పని మీద ఉండు, ఈవాళ నుండి. ఇక పాలపుంతలో ఇతర నక్షత్రాలను దాటి, మన కేమరా, సౌరకుటుంబంలో ప్రవేశిస్తుంది.
బుడ్డ బ్లాగరు – పాలపుంతలోని డార్క్ మేటర్ ద్వారా కూడా తీసుకురావాలా.
దర్శక బ్లాగరు – అవును అవన్నీ తప్పించుకొని, సౌర కుటుంబంలో యముడిని దాటి, కుజుని దాటి, అంగారకుణ్ణి దాటి. ఊహించుకోండి, కెమెరా గురు గ్రహం చుట్టూ ఒక్క చుట్టు చుట్టి, మన భూమి మీదకు చంద్రుణ్ణి పక్కకు తన్నుకుంటూ వస్తుంది. భూమికి దగ్గరగా వచ్చాక మనము గూగులు పఠాలు చూపిస్తాం. అందులో జూమ్ అవుతూ, మన కెమెరా, అప్పటికి ఎడారిగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ప్రాంతానికి తీసుకెళ్తాం. అక్కడ ఒక గుత్తేదారూ, రాజకీయనాయకుడూ మాట్లాడుకుంటూవుంటారు. వారి నెత్తిమీదనుండి షాటు కదలి, ప్రక్కనే తవ్వుతున్న గోతిలో కార్మికులు కనిపిస్తారు. వారు త్రవ్వుతుంటే, టఙ్‌ఙ్ అని శబ్దం వస్తుంది. మన కేమరా దానికి అణుగుణంగా వెనక్కి వెళ్లి మళ్లీ క్రిందకు వస్తుంది. ఇంకో కూలీ గుణపం దింపుతాడు, మళ్లీ టఙ్‌ఙ్ అని శబ్దం, మళ్లీ కేమరా అలానే కదులుతుంది. ఏదో పెట్టె తగిలింది. పెట్టెని తెఱచి చూస్తే, వికృతంగా సగం కుళ్లిన కళేబరంతో ఒక శవం కాని శవం. జీవం కాని జీవం. జీవచ్చవం కాని జీవచ్చవం. నడవని నడపీనుగు ఒకటి ...
కట్ చేస్తే...
మన బ్లాగర్ హీరో అప్పుడే “PUBLISH POST” మీద నొక్కి.. వేచియుండమని తిరిగుతున్న ఐకాను చూసి “చత్త్, ఈ దేశం ఎప్పటికీ బాగుపడదు. సరైన బ్రాడ్ బాండ్ కనెక్షన్ కూడా ఇవ్వలేరు, నేను రేపే కొరియన్ ఎంబసీని ఆశ్రయిస్తున్నా“ అనుకుంటుండగా, టపా వేయబడింది అనే సందేశం వస్తుంది.
“VIEW POST” మీద నొక్కగానే. టపా క్రిందే. “Despicable” అని వ్యాఖ్య అప్పటికే వేసి వుంటుంది !
మన హీరో “నో…” అని గట్టిగా అరుస్తాడు. హీరోయిన్ వచ్చి ఏమిటని విచారించగా, హీరో ఆ అనానిమిషుడి కమెంటు చూపిస్తాడు! వారి ముఖాలమీద పడే వెలుతురు ఎఱుపు నుండి పచ్చుకు మారుతుంది. కెమెరాని వారి ముఖాల మీద మూడు సార్లు జూమిన్ జూమౌట్ చేస్తాం! నేపథ్యంలో సంగీతం బిషూ బిషూ బిషూ అని మూడు సార్లు వినబడుతుంది.
చొఱవ బ్లాగరు – అద్భుతం
బుడ్డ బ్లాగరు – అమోఘం. ఇంతకీ ఆ శవ పేటికలో ఉన్నది ఎవరు.
దర్శక బ్లాగరు – అదేగా మరి సస్పెన్సు, అది సినిమా ఆఖరి వరకూ చెప్పం. నేనూ ఇప్పుడు చెప్పలేను. చెబితే కథ లికైపోతుంది. ఇంకెవరైనా సినిమా తీసేస్తారు.
చొఱవ బ్లాగరు – సరే ఐతే ఇక తారాగణం, చర్చించుకుందామా.
దర్శక బ్లాగరు – చెప్పండి. ఎవరెవర్ని పెడదాం.
చొఱవ బ్లాగరు – హీరోలుగా రానేరా, పురాణ్ అనుకున్నాం. ఇక అప్పటికే అనామిశుడి ధాటికి తట్టుకోలేక, బ్లాగులు మూశేసిన వారి జాబితా... చాలా పెద్దదే వుంది. చీమలమఱ్ఱి, శీను, వగైరా వగైరా. వీరికి సినిమాలో పాత్రలు లేక పోయినా, వారి బ్లాగు తెరపట్టుకు దండేసి బొట్టు పెట్టి చూపిస్తాం.
దర్శక బ్లాగరు – బాగుంది. ఇక మన అనానిమిషుడు హింసించి బ్లాగులు మూసేయింప జేసేది ?
చొఱవ బ్లాగరు – మనము ప్రేక్షకుల్లో చాలా బలమైన ఎమోషన్లు రేకెత్తగలగాలి కాబట్టి, అతను అమాయకమైన పిల్ల బ్లాగుల మీదా, అణ్ణెం పుణ్ణెం ఎఱుగని పద్యాల బ్లాగుల మీద అనానిమిషు వ్యాఖ్యలు వదలడం చూపించాలి. ఆ పాత్రలలో మన రాఘవ, గిరి, బ్లాగేశ్వరుడు, ఊకదంపుడు, శ్రీరాం, నన్ను వగైరా చూపిస్తాం.
దర్శక బ్లాగరు – అద్భుతం.
చొఱవ బ్లాగరు– ఇక, పాటల కోసమై స్వాతిగారినీ స్నేహమా రాధికగారినీ, గ్రాఫిక్స్ మఱియూ స్పెషల్ అఫెక్ట్స్ కోసం వెంకటరమణ గారిని, నిర్మాణ నియంత్రణ కోసం తాబాసు గారిని, ఆర్థిక వ్యవహారాల నియంత్రణ కోసం సీబీరావుగారినీ, ప్రచారానికి చావా కిరణ్ణి, క్యాటరింగ్ కోసం జ్యోతిగారిని, సంగీత దర్శకులుగా పప్పు నాగరాజు గారు, నృత్య దర్శకులుగా కొత్తపాళీ. ఇక మిగిలిన బ్లాగర్లందరూ నిర్మాతలు.
దర్శక బ్లాగరు – సరే అయితే వెంటనే అందరినీ సంప్రదించి, కాల్షీట్లు అడగండి. నేను ముఖ్య నటులతో మాట్లాడతాఁ.
బుడ్డ బ్లాగరు – కానీ సార్. ఆ కథ చూస్తుంటే, ‘ఇఱవై ఏళ్ళ తరువాత’ అనే ‘ఓ హెన్రీ’ కథను అనుకరించిన మన తెలుగు సినిమా ‘కృష్ణార్జునులు’ అనే సినిమా యొక్క అనుకరణలా లేదూ? మన నవ’తరం’గ సిద్ధాంతాలకు ఇది వ్యతిరేకం కాదా?
దర్శక బ్లాగరు – అదేం లేదు. అలా ఆలోచించినంత కాలం నువ్వు సహాయ దర్శకుడిలానే మిగిలిపోతావు. ఎవరో గొప్ప వ్యక్తి అన్నట్లుగా, అనుసరించడం తప్పుగాని అనుకరించడంలో ఎటువంటి తప్పూ లేదు.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౪

Tuesday, July 22, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧

రంగము ౨
కూడలి కబుర్లు గదిలో అమాయక బ్లాగరి, చొఱవ బ్లాగరు, పరాక్రమ బ్లాగరు.
చొఱవ బ్లాగరు – మీరందరూ ‘గొప్ప బ్లాగరు’ గారు సినిమా యజ్ఞానికి పిలుపిచ్చినప్పుడు ఆ మిగిలిన వారందరిలో వున్నారా..
మిగిలిన ఇద్దరూ – ఓ లేకే ఉన్నాం.
చొఱవ బ్లాగరు – అయితే ఇంకేంటి ఆలస్యం వెంటనే సినిమా కథాంశాన్ని నిర్ణయించుదాం.
అమాయక బ్లాగరి – ఒక హీరో వుంటాడు. అతనికి కష్టాలు ఎదురవుతాయి.
పరాక్రమ బ్లాగరు – మీరు మరీ పాత తరహాగా ఆలోచిస్తున్నారు. మనమంతా హీరోయిజానికి వ్యతిరేకం. ఏం సగటు వ్యక్తిని ప్రధాన పాత్రలో చూపిస్తే తప్పేంటి ?
చొఱవ బ్లాగరు – అవును. మనది కొత్త తరం సినిమా. ‘సీ ద చేంజ్ యు వాంటు బీ’ అన్నారు పెద్దలు.
పరాక్రమ బ్లాగరు – అంటే?
చొఱవ బ్లాగరు – అంటే మనం తీసే సినిమా బ్లాకండ్వైట్ కాదు కాబట్టి మన పాత్రలు కూడా తెలుపు నలుపూ కాకుండా అన్ని రంగులలోనూ వుండాలి అని అర్థం.
పరాక్రమ బ్లాగరు - అవును. అంటే దానర్థం మన సినిమాలో పూర్తిగా నలుపు స్వభావంగల ప్రతినాయకుడు వుండడన్నమాట.
చొఱవ బ్లాగరు – నవ’తరం’గం సినిమాలో విలన్ ఒక వ్యక్తి కాదు. ఒక అంశం. ఆ అంశఁవే మన బ్లాగర్లను అతి కరవల పెట్టే అంశం. అనానిమిషుడు.
పరాక్రమ బ్లాగరు – అద్భుతం. మన బ్లాగరు సగటు బ్లగరు. అతనికి తెలుగు సరిగ్గా రాదు, అన్నీ అచ్చు తప్పులే! వ్రాసే రాతలో కూడా అర్థం పర్థం వుండదు.
అమాయక బ్లాగరి – మఱీ బాగుండదేమో. అంటే మామూలుగా హీరోలందరూ చాలా ప్రతిభావంతులు అయివుంటారుగా.
పరాక్రమ బ్లాగరు – అదే నండి మనము మన నవ’తరం’గం సినిమాతో వ్యతిరేకిస్తుంది. ప్రతిభని అందరూ ఎందుకు అలా పూజిస్తారు? చేతగానితనము కూడా ఒక కళే. ప్రతిభకైనా హద్దులుంటాయిగానీ, వెఱ్ఱికి హద్దులుండవని చరిత్ర చెబుతుంది. నన్నడిగితే ప్రతిభావంతులు తమ ప్రతిభని చూసి సిగ్గుపడాలి, దాని చాటుకోవడం మానేసి సర్వదా దాచుకోవడానికి ప్రయత్నించాలి. నలుగురిలో ఒకరిగా బ్రతకలేనివారిది కూడా ఒక బ్రతుకేనా..
అమాయక బ్లాగరి – అవును.
చొఱవ బ్లాగరు – అవును నిజం. ఇంతకీ కథ ఏఁవిటంటే. ఒక సగటాతి సగటు బ్లాగరు, అతని బ్లాగులో ఒక అనానిమిషుడు ‘డెస్పికబుల్’, ‘డిప్లోరబుల్’ వగైరా అని వ్యాఖ్యలు వదులుతూవుంటాడు. అప్పుడతను ఒక అపరాధ పరిశోధకుడని నియమించుకొని ఆ అనానిమిషుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అమాయక బ్లాగరి – ఆ అపరాధపరిశోధకుడిగా పురాణ్ ని పెట్టవచ్చు. ఆ అమాయక బ్లాగరుగా రానేరా ని పెట్టవచ్చు.
పరాక్రమ బ్లాగరు – అద్భుతం. అంతే! మరి ఆ అనానిమిషుడిగా విలన్ని.
చొఱవ బ్లాగరు– విలన్‌కి చాలా సాంకేతిక పరిజ్ఞానం వుండాలి. అప్పుడే మన అపరాధ పరిశోధకుడికి దొరక్కుండా చాలా కాలం తప్పించు కోగలడు.
అమాయక బ్లాగరి – అయితే, ఆ పాత్రకి వేవిన్నే నియమించాలి.
పరాక్రమ బ్లాగరు – వేవిన్ పెద్దగా మాట్లాడరు కాబట్టి, సైలెంట్ సినిస్టర్ విలన్ గా చాలా బాగా సూట్ అవుతారు.
చొఱవ బ్లాగరు– దానికి తోడు, వేవిన్‌ని ముందంతా చాలా మంచి వాడిగా చూపిస్తాం. కొత్త బ్లాగర్లని ప్రోత్సహించి వారి కోసం కష్టపడే వేవిన్ విలన్ అని తెలిసే సరికి ప్రేక్షకులకు కలిగే ఆశ్చర్యం, తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా వుంది!
చొఱవ బ్లాగరు – ఇంత మంచి ఉపాయం మీకు రావడం చూస్తే నాకూ ఆశ్చర్యంగానే వుంది !
ఇంతలో కోపపు బ్లాగరు ప్రవేశింతురు.
అమాయక బ్లాగరి – కోపపు బ్లాగరు గారు, మేమిప్పుడే బ్లాగు సినిమాకి కథ తయారు చేస్తున్నాం.
కోపపు బ్లాగరు – కథా! ఇంకేమీ చెప్పవద్దు. నా దగ్గరో అద్భుతమైన బ్లాగు కథ వుంది. కానీ కథ చెప్పాలంటే ఒక షరతు, నేను చెప్పినవారినే కథానాయకులుగా పెట్టాలి.
చొఱవ బ్లాగరు– ఆ విషయమై...
కోపపు బ్లాగరు – సరే, మీరు పెడతానని మాటిచ్చారు కాబట్టి చెబుతున్నా. ఇద్దురు స్నేహితులుంటారు. వారు గతంలో కలసి బ్లాగేవారు. ఒకరి బ్లాగులో ఒకరు తప్పక "చాలా బాగుంది, కేక, ఇరగదీశారు, ఇలాగే కనీయ్యండి" వంటి వ్యాఖ్య వదిలేవారు, కానీ ఒక రోజు వారిలో ఒకరు ఎడ్డెం బ్లగుకు తెడ్డం అని వ్యాఖ్య వదిలే సరికి వారికి కలహం ఏర్పడుతుంది. విడిపోదలచుకుంటారు. సరిగ్గా ఇఱవై సంవత్సరాల తరువాత, కూడలి కబుర్లలో కలుసుకుందామను కుంటారు. కానీ మధ్యలో ఒకడు మంచి బ్లాగరు గానూ, ఇంకొకడు పరుష పదాలు వాడే సభా మర్యాద తెలియని చెడ్డ బ్లాగరుగానూ మారిపోతారు. ఇఱవై ఏళ్ల తరువాత కలసినప్పుడు మంచి బ్లాగరు, చెడ్డ బ్లాగర్ని స్నేహితుడని కూడా చూడకుండా, హిట్ల కోసం, కూడలి పెద్దలకు పట్టిస్తాడు.
పరాక్రమ బ్లాగరు – సార్ మేము కాపీ కథలను వద్దను...
కోపపు బ్లాగరు – కథ మీకు చాలా బాగా నచ్చింది అంటున్నారు కాబట్టి. ఆ ఇద్దరు హీరోలుగా, రానేరా నీ కేకేశ్వర నీ పెట్టాలి.
కోపపు బ్లాగరు నిష్క్రమింతురు .
అమాయక బ్లాగరి – ఈయని కథ కూడా బాగానే వుంది. పెట్టకపోతే బాధ పడతారు. కాబట్టి దీన్ని కూడా మన కథకు కలిపేసుకుందామా.
చొఱవ బ్లాగరు– బాగానే అంటారేఁవిటండీ! కథ అద్భుతుంగా వుంటేనూ. మనకు ఒక హీరో రానేరా ఎలాగూ వున్నారు కాబట్టి, కేకేశ్వరుణ్ణి కూడా కలిపేసుకుంటే హిట్టే హిట్టు. ఇక పురాణేమో, అపరాధ పరిశోధకుడిగా నటిస్తాడు, అంతే...
పరాక్రమ బ్లాగరు – ఇది నవ’తరం’గానికి వ్యతిరేకం. నేను ఖండిస్తున్నాను.
చొఱవ బ్లాగరు – సరే అయితే మీరు చూడవద్దు సినిమా. మేము కథ పట్టుకుని దర్శకుడి దగ్గరకు వెళ్తాం.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౩

Monday, July 21, 2008

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧

ఇది టాపా కాదు. ఇది కథ కాదు. ఇది సినిమా కాదు. ఇది ఒక ప్రహసనం!

గమనిక: ఈ కథలో వ్యక్తులూ, సందర్భాలూ, సంభాషణలూ అన్ని కేవలం కల్పితం. వాటిలో వేటితోనైనా మీకు నిజ జీవితంలో పోలికలు కనిపిస్తే అది కేవలం కాకతాళీయం కాకపోయినా అది నా కల్పనా శక్తి యొక్క గొప్పతనం మాత్రమేనని గమనించగలరు.

తెలుగు బ్లాగర్లకు కళాభిమానం ఎక్కువ. వారు అన్ని విషయాలలోనూ గొప్ప తనాన్ని కోరుకుంటారు. ఎంతో నాణ్యత వుంటేనే గానీ ఏ కళాఖండమూ వారి మెప్పు పొందలేదు. ఇప్పుడు వచ్చే మతి లేని సినిమాలకు తట్టుకోలేక, మంచి సినిమాలు కావాలంటే వారే సొంతంగా తీసుకోవాలి అని గ్రహించారు. ఆ ప్రయత్నంలో వారు పడ్డ అపసొపాల సారమే ఈ టపా క్షమించాలి, కథ అయ్యో కాదు కాదు ప్రహసనం!

అది ౨౦౦౮ వ సంవత్సరం, కూడలికి కొత్త లాంఛనాలు కలుపుకుంటూ పోయారు కూడలి కర్త వీవెన్. దానిలో భాగంగా కూడలి కబుర్లు పూర్తిగా వీడియో వెర్చుయల్ రియాలిటీ ఆధారిత చాట్ సౌకర్యంగా మార్చబడ్డది. అలా...

రంగము ౧

కూడలి కబుర్లలో ఒక సాయంత్రం ఒక సూపరు స్టార్ బ్లాగరు, ఒక వంద ఎక్ట్రా బ్లాగర్లూ (జూనియర్ ఆర్టిస్టు స్థాయి వారు) గుమిగూడారు అకారణంగా (అచ్చు మన సినిమాల్లో జరిగినట్లు). కాబట్టి సంభాషణతో తదేక మవ్వాలంటే మీరు, ఎంటీవోడితో పాటు ఒక వంద మంది ముక్కూ మొఖం తెలియని జూనియరు ఆర్టిస్టులను ఊహించుకోండి.

ఇక సంభాషణ ప్రారంభం.

గొప్ప బ్లాగరు: బడా బాబుల కాలం చెల్లిన ఈ రోజుల్లో కూడా ఎవరో పెద్ద పెద్ద నిర్మాతలు సినిమాలూ తీస్తారనుకోవడం, వాటి కోసం ఎదురు చూడడం వట్టి మూర్ఖత్వం. అంతర్జాలం వచ్చింది, దానితో పాటు సామాన్య మానవులకు ఎన్నో సుదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు, మనమందరం కలసి వికీపీడియా ఏర్పరచుకున్నాం. దాని వెనక పెద్ద వ్యాపార వ్యవస్థలూ లేవు, డబ్బున్నవారూ లేరు. సమాచారం కావలసినవారందరూ తమకి కావలసిన సమాచారాన్ని అక్కడ వ్రాస్తున్నారు, అందరూ అలా వ్రాయబట్టి ఈనాడు వికీపీడియా, శత కోట్లలో నిఖర లాభం వున్న గూగుల్ వంటి గూళ్ళకంటే కూడా ముందుకు దూసుకు పోయింది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : ఇక సినిమా గురించి చెప్పుకోవాలంటే...

అది ఒక కళ, దాన్నుండి సొమ్ము చేసుకోవాలనుకోవడం పెద్ద పాపం. కళను అమ్ముకోవడం పాపం అని శాస్త్రం చెబుతుంది. ఆలాంటి కళని స్వప్రయోజనాలకోసం అమ్ముకునేవారిని క్షమించరాదు. వారికి వ్యతిరేకంగా మనం సమ్మె లేపాలి, వారి సినిమాలని బహిష్కరించాలి. పోనీలే చిరంజీవి తనయుడు వున్నాడుగా అనుకుంటూ అలాంటి సినిమాలు చూడడం క్షమించరాని నేరం మఱియూ కళావారసత్వాన్ని పెంపొందించే పాపమే అవుతుంది.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : దానికి నేనేమి ప్రతిపాదిస్తున్నానంటే...

మన బ్లాగర్లలో అనేక మంది ప్రతిభావంతులు వున్నారు. మనమందరం పూనుకొని కృతజ్ఞతలు అనే పదానికే వాత పెట్టి దాన్ని నెనర్లుగా మార్చేశాం. మనం తలచుకుంటే ఏదైనా చేయగలం. అంతటి ప్రతిభావంతులం కూడా భక్తికీ బక్తికీ తేడా తెలియని అలగా సినిమా జనం నుండి మనోరంజనం ఆశించడం మూర్ఖత్వం. మన బ్లాగర్లలో డబ్బున్నవాళ్లూ వున్నారు.

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : సినిమాలోని సాంకేతిక విషయాలు తెలిసినవారున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : అందగాళ్లున్నారు

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఇక అందగర్తెల విషయం నాకు తెలియదు. ఏ విషయానికావిషయం చెప్పుకుంటే, మన బ్లాగులోకంలో అందగర్తెలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఆ మాట కొస్తే ఆంధ్రాలోనే పెద్దగా అందమైన అమ్మయిలు లేరు.

మిగిలిన వారందరూ : అవును లేరు

గొప్ప బ్లాగరు : అందమైన అమ్మాయిలందర్ని వెనక పరశురాములవారు, తీసుకెళ్లి సముద్రాన్ని వెనక్కి నెట్టి, వారి కోసం పరశురామక్షేత్రమును సృష్టించి వారందరికీ ఆ భూలోక స్వర్గాన నివాసం కల్పించారు. అందుకే ఇప్పటికీ శోభన నుండి గోపిక వరకూ మనము అక్కడ నుండే తెచ్చుకున్నాము. మనఁవే కాదు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆదర్శాంగన (మోడల్) పద్మాలక్షి కూడా మలయాళీ అవ్వడం దీనికి ఋజు౨వు.

మిగిలిన వారందరూ : అవును నిజం.

గొప్ప బ్లాగరు : కానీ అలా అని మనం మలయాళీ అమ్మయిలను ఆశ్రయించలేం. మనమే ఎక్కడునుండైనా నటీమణులను తెచ్చుకోవాలి.

మిగిలిన వారందరూ : ఇప్పుడెలా?? అవును ఇప్పుడెలా??

గొప్ప బ్లాగరు : అది పెద్ద సమస్యకాదు. మన దేశాన నాటికలకున్న అనుపమాన చరిత్రను పరీక్షిస్తే మనకు కొట్టొచ్చేట్టు అర్థమయ్యేదేఁవిటంటే, అందమైన మగవాళ్లు స్త్రీల పాత్రలు కూడా వేయగలరు. స్త్రీల పాతలు స్త్రీల కంటే కొందరు మగవాళ్లకే బాగా నప్పుతాయి. అంతటి జగన్మోహనులు మన బ్లాగర్లలో కూడా వున్నారు .

మిగిలిన వారందరూ : అవును ఉన్నారు

గొప్ప బ్లాగరు : ఎవరు ఉన్నారు?

మిగిలిన వారందరూ : అవును ఎవరు ఉన్నారు ?

గొప్ప బ్లాగరు : మీకూ తెలియాదా? అది పెద్ద సమస్యకాదు. ఒకరి దస్తూరి చూసి వారు అందంగా వుంటారో లేదో ఎలా చెప్పాలనేది మన వేదాలలో వ్రాసి వుంది. వేదాలన్నీ ఆపోసన పట్టినవాడిగా నాకది పెద్ద సమస్యకాదు.

మిగిలిన వారందరూ : అవును మీకది పెద్ద సమస్య కాదు.

గొప్ప బ్లాగరు : నా లెక్కల ప్రకారం, రానేరా బ్లాగులో ఖతీ, కేకేశ్వర బ్లాగులో ఖతీ చూస్తే వారిద్దరూ చాలా అందంగా వుంటారని అనిపిస్తుంది. కాబట్టి వారిద్దరినీ మనము స్త్రీల పాత్రలు వేయమని అడగవచ్చు.

మిగిలిన వారందరూ : అవును అడగవచ్చు

గొప్ప బ్లాగరు : కానీ వారు నిరాకరిస్తేనో..

మిగిలిన వారందరూ : అవును నిరాకరిస్తేనో.

గొప్ప బ్లాగరు : హూఁ.. నిరాకరించకూడదు. ఎందుకు నిరాకరిస్తారు. మనము బ్రతికేదే నలుగురి కోసమూ. ఆ నలుగురూ లేనిదే, మన జీవితాలకు అర్థఁవే వుండదు. మన ఇష్టాయిష్టాలు భ్రమ మాత్రమే, నలుగురికీ కావలసినది చేయడమే మన ధర్మం. నలుగురూ పండించిన తిండి తింటూ, వారు కట్టిన మఱుగుదొడ్లలోనే దాని వికృతంగా మార్చి విసర్జిస్తూ, వారికి సంతృప్తినిచ్చేవి చేయకపోవడం దారుణం.

మిగిలిన వారందరూ : అవును దారుణం

గొప్ప బ్లాగరు : ఇక రచయితలంటారా, బ్లాగులలో కథలు రాసేవారికి కొదవ లేదు. వద్దన్నా కథలు వ్రాసి చదవమంటూ మన మీదకు తోయడం ఎప్పుడూ జరిగేదేగా. కాబట్టి రచయితలుగా మిగలిన వారందరూ పోటీ పడతారు.

మిగిలిన వారందరూ : అవును మిగిలిన వారందరూ!

గొప్ప బ్లాగరు : డబ్బుల విషయానికొస్తే.. ఇందాక మనం అనుకున్నట్టు కళకు డబ్బు వ్యతిరేకం. కాబట్టి ఈ సినిమా తీయడానికీ, నటించడానికీ, చూడడానికీ దేనికీ డబ్బులు తీసుకోకూడదు. డబ్బు తీసుకోవడం మహాపాపం, వారు కళామతల్లి సరస్వతీ దేవి ఆగ్రహానికి లోనవుతారు. వారి సంతతికి లెక్కలూ, అనెలెటికల్ రీజనింగ్ రాకుండా పోతాయ్, అలా అవడం చేత వారు మృదులాంతకకర్తలు కాలేరు! సాఫ్టువేరోడిని లేదా సాఫ్టువేరుదాన్ని కనని పాపానికి వారికి మృదులాంతక నరకం తప్పదు.

మిగిలిన వారందరూ : అవును నిజం. అలాంటి వాళ్లు మట్టికొట్టుకు పాతారు.

గొప్ప బ్లాగరు : ఇంకేఁవిటి ఆలస్యం, వెంటనే మన డబ్బుతో మన దర్శకరచయితలతో మన నటీనటులతో సినిమా తీద్దాం.

మిగిలిన వారందరూ : అవును వెంటనే సినిమా తీద్దాం. పదండి, పదండి.

తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౨
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం