భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, January 22, 2009

మదినెమిలి


అల్లో నేరేళ్ళ
నీ కళ్ళ నీలాల్లో
ఎగురనీ నా ఊహా విహఁగాలని

తెలినుఱుగుటలల
నీ వొడి సుడిగుండాల్లో
తిఱుగనీ నా కోరికల నౌకలని

అరుణ కిరణముల
నీ ఆశా జ్యోతులలో
కరుగనీ నా కలతల కారు యిరులని

విమల సిత కమల
నీ హృదాలవాలములో
ఒదగనీ నా పసిడి వన్నె కలలని

అల్లి తెమ్మెరల
నీ శ్వాస నిశ్వాసల్లో
చెరగనీ నా చేదు జ్ఞాపకాలని

సూన్యేందు అర్ధేందు రాకేందు
వలయమున భ్రమరింప లేకున్న
నీ ప్రేమతోఁ
విముక్తి నొసంగి, భానుగా
నిత్యము నీ వింట విహరింపని

గగన రతనమై, నీ నీలాలను చీఁకటి గానీను
తరఁగ హేతువై, నీ వలపుటలలకలుపు రానీను
ఆది జ్యోతినై, నీ ఆశా జ్యోతి నారిపోనీను
కమల నాథునై, నీ తమ్మిరేకులఁ ముడువనీను
మకర సూర్యునై, నీ అల్లిగాడ్పుల నుష్ణింపనీను

ఓసి చికాగోపురపు వయ్యారి
నా మదిన నాట్యమాడు మయూరి
నీకిదే నా నుడి!

12 comments:

  1. కవిత బాగుందిగానీ, ఈ స్థాయిలో చెబితే అమ్మాయి ఝడుసుకుంటుందేమో!

    ReplyDelete
  2. పడతులు రారు కవీశుడ
    పరికించరు భావమొకటి తెలుగున చెప్పన్‌
    గడుసుగ తెలుపెడి విధములు
    తెలియకనెట్లుండగలరు ? అకటా ఇలలో

    ReplyDelete
  3. బాగుందండి.........
    మహేష్ గారు అన్నట్లు జడుసుకోక పోయిన కాస్త తిక మక పడుతుంది.

    ReplyDelete
  4. రాకేశ్వరులవారూ

    శూన్యేందు అర్ధేందు రాకేందు వలయమున— ప్రయోగం బావుంది.

    కమలనాథునై మకరసూర్యునై వంటి పదప్రయోగాలు చేయొచ్చునో లేదో నాకు తెలియదు. పెద్దవారెవరైనా చెప్తే తెలుసుకోవాలి.

    (దీన్నేమంటారో నాకు పారిభాషికపదాలు తెలియవు కానీ) మొదట ప్రతిపాదించిన కంటి నీలాలు వలపుటలలు ఆశాజ్యోతులు తమ్మిరేకులు అల్లిగాడ్పులను తిరిగి చివర్లో సమీకరించిన తీరు బావుంది.

    సాధారణంగా వెచ్చని శ్వాసనిశ్వాసల గురించి చెప్తారు కదా. మీరేమిటి అల్లి తెమ్మెరలు అని, పైగా దానికి కొనసాగింపుగా మకరసూర్యుడనై దూరంగానే ఉన్నాను అన్న అర్థాన్ని ధ్వనింపజేస్తున్నారు?

    ReplyDelete
  5. @ ఆత్రేయ గారు,
    మీ ప్రాస లేని కందం నాకు పూర్తిగా బోధపడలేదు. సగం సగం అర్థమయినట్టు అనిపిస్తుంది (అదస్సలు మంచిది కాదనుకుంట)!

    @ రాఘవ,
    కమలనాథుడు, మకరసూర్యుడని ఎందుకు వాడరాదు? కొందరు పెద్దవారు అభ్యంతరం తెలుపలేదు. కానీ చాలా మంది పెద్దవారు దానికంటే అభ్యంతరం తెలుపవలసిన విషయాలు చాలావున్నాయని భావించివుంటారు!

    నేను ముందు వ్రాసిన అసలు కవితలో తెమ్మరలు లేవు. కానీ చతుర్భూతములను ప్రస్తావించి, గాలి నొక్కదానినే వదిలేస్తే బావుండదని, అది కూడా ఎలాగోలా ఇఱికించాను. (మకర సూర్యుడైతే చల్లగా వుంటాడని - అప్పుడప్పుడ ఆడవారికి దూరంగా నుండైనా వారికి వారి పెర్సనల్ స్పేస్ ఇవ్వాల్సివస్తుంది ;-)

    రాకేశ్వర

    ReplyDelete
  6. కమలనాథుడనై మకరసూర్యుడనై గుఱించి కాదు నేనంటున్నది, కమలనాథునై మకరసూర్యునై గుఱించి.

    పెర్సనల్ స్పేస్ అంటున్నారూ... ఏమైనా న్యూసు ఉందా మాకు?

    ReplyDelete
  7. "కమలనాథునై మకరసూర్యునై...."

    ఈ ప్రయోగాలు సరి కావు. అంతగా ఛందోనిర్బంధాన్ని అనుభూతి చెందుతూంటే వాటి బదులు (తన గురించే అయినా సరే) "కమలనాథుడై మకరసూర్యుడై...." అని వాడ్డమే సరైనది.

    ReplyDelete
  8. @ తాలబాసు గారు,
    సరిఁజెప్పినందుకు నెనర్లు.
    నేను మొదటఁ డై అనే వాడాను, కానీ అది తప్పేమో అని ఎవరో అంటే, నై కి మార్చాను. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి, ప్రామాణికంగా భావిస్తున్నాను.

    @ రాఘవ,
    ఏదైనా న్యూసు వుంటే అది మా అమ్మ దగ్గర నుండి నాకు ముందు రావల్సివుంటుంది. అంతటి విషాద పరిస్థితి ఈ సగటు టెక్కీది ;)
    అయినా న్యూసు వుంటే ఇలా తికమక కవితలు ఎందుకు వ్రాసుకుంటాను :s

    ReplyDelete
  9. గ్రాంథికంలో "కమలనాథుడై..." మొదలైనవిఆత్మార్థకంగా (తనని గుఱించి తాను చెప్పుకొనేటప్పుడు) చిట్టచివరి ఎంపికే (last prefernce). గుంటూరు, గోదావరిలాంటి మధ్యకోస్తా తెలుగులో వాడరు గానీ వ్యావహారికంలో ఇటువంటి ప్రయోగాలు రాయలసీమ ప్రాంతంలో చాలా విఱివిగా వినొచ్చు.

    ReplyDelete
  10. పై వ్యాఖ్యలో preference వర్ణక్రమంలో టైపాటు దొర్లింది. మన్నించగలరు.

    ReplyDelete
  11. సూన్యేందు -> రాఘవ గారు
    చెప్పినట్టు ఇది శూన్యేందు అనుకుంటా
    బావుంది పరస్పరం చీకట్లను పారద్రోలుకొనే ప్రయత్నం
    ఇంతకీ
    నీ నీలాలను చీఁకటి గానీను - అంటే కవిభావమేమీటీ

    ReplyDelete
  12. నీలాలు - నీ కళ్ళ నీలాలకు back reference. సూర్యుడు నీలాకాశాలను మసిబారనీయ్యని చందమున అని ఉద్ధేశ్యము.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం