భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, June 21, 2009

రేపు నేను ఒక టపా వేయబోతున్నాను

నా గణినిలోని రాకేశ్వర సంచయం చూస్తూండగా, అందులో ఒక పదో ఇఱవయ్యో అముద్రిత టపాలు చిట్టీయట్ట (నోటుప్యాడు) పత్రులు కనిపించాయి.

శ్రీశ్రీ అముద్రితాలు, చలం అముద్రితాలు అంటే బాగుంటుంది, ఆ మాటకు వస్తే ఓంకార్ అముద్రితాలు అన్నా బాగానేవుంటుంది కానీ రాకేష్ అముద్రితాలు అంటే అస్సలు బాగోదు, దానికి మొదటి కారణం రాకేశ్ అనేది సరైన వాడుక అవడం. రెండవది నా పేరును వాళ్ళు సరిగా వేస్తారో లేదో నమ్మకం లేకపోవడం.

అందుకే నేనే నా అముద్రితాలను త్వరగా అచ్చువేసి, నా పుస్తకం వ్రాయడం ప్రారంభించుదామని నిశ్చయించుకున్నాను. పుస్తకం అంటే అచ్చంగా పుస్తకం కాదు. బ్లాగు టపాల పరంపర (విశృంఖలము) అనమట. కాబట్టి రేపే నా అముద్రితాల నుండి ఒక టపా వేద్దామని నిశ్చయించుకున్నాను. దాని పేరు ""మన" సంస్కృతి".

ఏం భయపడవద్దు. ఇది వేశ్యల గుఱించి కాదు, దూరదర్శని కార్యక్రమాల గుఱించి కాదు, మన చలనచిత్రాల గుఱించి అంత కంటే కాదు. అయినా నేను వేసే టపా పేరు ""మన" సంస్కతి "లేమి"" కాదు. మన సంస్కృతి కలిమి గుఱించినదది.

అన్నట్టు వేశ్యల విషయమై, మొన్న ఎవరితోనో మాట్లాడుతుంటే అంటున్నారు "నేను మీ పెద్ద అభిమానినండి, అంటే మీరు ఏం జెప్పినా ఖఱాఖండిగా చెబుతారు, బ్లాగులో వ్రాసే దాని గుఱించి కాదు, మామూలుగా, అంటే బ్లాగులో ఏదో వ్రాస్తూంటారు, వాటి గుఱించి కాదు, మామూలుగా.." అని. బ్లాగు ద్వారా తప్ప వేఱే పరిచయమే లేదు మాకు. నాకు అప్పుడే అర్ధమయ్యింది ఈయనకు వడనవనితల మీద బొత్తగా కరుణ లేదని. బుద్ధునికి అన్నింటి మీదనా కరుణ వుండేదఁట - అదుగో మళ్ళీ బుద్ధుడికీ వాళ్ళకీ లంకె వేస్తున్నావంటారు ఎందుకొచ్చింది లెండి అసలే బ్లాగ్లోకం వెనకటిలా లేదు. మన అభిమానుల్లో అలాంటి రాములు, మంచి బాలురు, కౌశల్యాదులు ఎక్కువే వున్నారని, వారి కోసం మనల్ని మనం కొంత సంభాళించుకోవాలనీ నిర్ణయించుకోవడం జరిగింది.

సామాజిక వర్గములు, సామాజిక వర్గముల అంతఃసంబంధములు, లైంగిక సామాజిక వర్గములు, లైంగిక సామాజిక వర్గముల అంతఃసంబంధములు, మన దేశంలోని కొన్ని సామాజిక వర్గాలకు తీఱని లైంగిక తృష్ణ, మన దేశంలో కొన్ని ప్రచార మాధ్యములుఁ జూపు లైంగిక మృగతృష్ణ, వాటి సంబంధించిన వివిధ ఇతర అంశాల గుఱించి బ్లాగడం మానేసి; అందుకు బదులుగా వాటిని నా గణినిలో(గణికతోఁ సంబంధంలేదు - అంటే ఇద్దరూ గణిస్తారు ఆ సామీప్యం వుంది కానీ మిగిలిన ఏ సామీప్యమూ లేదు - ఈ యాదృచ్ఛిక సామీప్యతకు ప్రకాశకులు పెక్కు చింతిస్తున్నారు) వాటిని నా గణినిలో పత్రులుగా భద్రపఱచి, వాటిని ఆ మంచి బాలుర తదనంతరం రాకేష్ అముద్రితాలుగా అచ్చువేయించుదామనుకుంటున్నాను.

కొసమెఱుపు
అచ్చువేయించుదామనుకుంటున్నాను = accuvēyiñcudāmanukuṇṭunnānu (ఇఱవై ఏడక్షరాలు)
మనది పలు-అగ్లుటినేటివ్ భాష (poly-agglutinative language)
ఆంగ్లంలో అగ్గ్‌లుటినేటివ్ కి బదులు అగ్లుటినేటివ్ అంటారు. వారిది తలతిక్క భాష (non-geminative language).
ఈ టపాలోని లంకెలు లంకెబిందెలు, రేపటికి బాగా చదివి అర్ధం చేసుకోండి.


అన్నట్టు ట్విట్టరు పేజీ మొదలు పెడదామనుకుంటున్నాను, దనీ మీద మీ కేమైనా సలహాలు వున్నాయా?
ఇన్ని చోట్ల సోది వేస్తున్నావుగా, మళ్ళీ అది కూడానా అంటారా?

4 comments:

 1. గణినీ గణికా ఇద్దఱూ గణిస్తారా? హన్నా.

  ReplyDelete
 2. రాఘవగారు,
  మొత్తానికి గణిక ప్రసక్తి మిమ్మల్ని మీ వైరాగ్యంనుంచి మళ్ళీ బ్లాగ్లోకంలోకి లాక్కొచ్చిందన్న మాట :-) రాకేశ్వరా, మీరు మంచెత్తే వేసారే!
  మీ వాగ్విలాస ద్వారాలు మళ్ళా ఎప్పుడు తెరుస్తున్నారు?

  ReplyDelete
 3. పాపం నోట్లో చెఱకు ముక్క పెట్టినా కొఱకని మా రాఘవయ్య మీద ఇంత పెద్ద అభాండం వేస్తారా .. అదీను నా బ్లాఙ్ముంగిట! ఇంగ్లీషు పదానికీ తెలుగు పదానికి అనునాసికసంధి వేసాను, could not resist. :)

  ReplyDelete
 4. అది అనునాసిక సంధి కాదనుకుంటానండీ..

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం