భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, June 21, 2009

మన సంస్కృతి

మనలో చాలా మంది అబ్బో తెలుగు చచ్చిపోతుంది. బాబోయ్ తెలుగు చచ్చిపోతుంది. లబో దిబో లబో దిబో అంటూంటారు. అలాంటి వారికి నాకో ప్రశ్న మీ పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో ఎందుకు వేశారు అని. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనవసరం లేదు. ఎందుకంటే నేను చెప్పబోయేది పూర్తిగా వేఱే అంశం గుఱించి. అది చెప్పిన తఱువాత మీరు వేంటనే మీ పిల్లల బడికి వెళ్ళి వాళ్ళ ప్రినిసిపాలునితో "మా కిడ్సు ఇంగ్లీష్ మీడియమ్ స్కూల్ లో చదవడం మాకు లైకింగా లేదు. ఇప్పుడే డిస్‌కణ్టిఞూ చేసి, ఒక గుడ్ టెల్గు మీడియమ్ స్కూలులో చేరుస్తున్నాము" అని అంటారు, మాది పూచి.

ఇక మన 'మన సంస్కృతి' గుఱించి
నేనీ మధ్యన పూర్తి స్థాయి తెలుఁగు గ్రామజీవనావిధానవిశ్లేషకునిగా మారాను. అందులో నాకు దొరికిన ఒక మచ్చుతునక మన అనే మన భాషకు ప్రత్యేకమైన మాట. మీ మా లతో బాటుఁ మన అనేది మన భాషకు ప్రత్యేకం. మనలా (బ్లాగర్లలా) ఆంగ్ల భాష నేర్చి తెలుఁగు నుడికారం మీద పట్టు కోల్పోయిన వారు కాకుండా, గ్రామాల్లో అచ్చంగా తెలుఁగు మాత్రమే ఎఱిఁగిన వారు వుంటారుగా, వాళ్ళ మాట తీఱులో చాలా చమత్కారాలుంటాయి, అందులో మన అనేది ముఖ్యమైనది.

ఉదా ౧
మా చిన్నాన్న పొలం వెళ్ళాను ఒక సారి, పంచుకున్నాక అదే మొదటి సారు అనుకోవచ్చు. ఆయన "ఈ పొలం మనకు వచ్చిందిరా" అన్నడు. దానర్ధం ఆయనిదనా, మా నాన్నదనా? ఆయనిదనే ఎందుకంటే, వేంటనే "ఆ కంచవతలిది మీ నాన్న కొచ్చింది" అనన్నాడు కాబట్టి.

ఆస్తి హక్కులు అనేది విశ్వమానవ చరిత్రలోనే అతి ముఖ్యమైన కట్టుబాట్లలో ఒకటి అని ఎంబియే చదివిన మీ మిత్రుడు అనవచ్చు. అప్పుడే అర్ధమవుతుంది మనము ఎంబియే చదవకూడదని, చదివినా మన పిల్లల్లి చేతఁ జదివించకూడదని, చదివిన వారి జట్టు కట్టకూడదని. మనలో కొందఱు ఇప్పటికే ఆ తప్పు చేసివుంటారు, వారికి నా సహానుభూతి. ఆస్తి హక్కులు అనేది మనము గతిలేక గొడవలు తగ్గించుకోవడానికి ఏర్పఱచుకున్నవి. అనాదర్శ ప్రపంచంలో అదోక ఆచరణాత్మక ప్రత్యామ్నాయం. కాబట్టి ఆదర్శాన్ని కోఱుకునే ఏ మనిషైనా ఆ అంశాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించడు. అందుకే మనకుంది మన అనే పదం.

ఉదా ౨
మా అన్నయ్య (పెదమామ్మ మనఁవఁడు) నాతో అన్నాడు "ఎప్పుడైనా రారా మన పొలం, ఆ పోతారం రోడ్డు వుందిగా అక్కడే, బాబాయి పొలం దాటిన తరువాత". ఆయని పొలం ఆయనిదే, మాది మాదే, కానీ ఇలాంటి సందర్భాలలోఁ, మా అనే పదం పైన చెప్పుకున్న కారణాల వలన, అంత సంస్కారవంతమైన పదము కాదు.

కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాల్సివుంటుంది.
మనకు ఎన్ని సాల్తీలు వున్నాయేంటి?
ఎనభై, గిత్తలు ఇంకో ఇఱవై వుంటాయి. జొన్న చే౨ను ప్రక్కన కొబ్బిరి తోట వుందిగా అందులో జాడేసి వీటిని కూడా అక్కడే కట్టేస్తాం.
ఊఁహూఁ.. కొబ్బిరి తోట అంటే, మా నాన్న కొబ్బిరి తోట ఉంది దాని ప్రక్కనేన.
అవును మీ నాన్నగారి చేను ప్రక్కనే.

అలా మా, మీ అనే పదాలు వీలైనంత తక్కు వాడి మాట్లాడాలి. ఒక వేళ ఎవరైనా మీ అని వాడినా, మనము మాత్రం మన అనే వాడాలి.

ఉదా ౩
చిన్నాన్న బిడ్డడు "అన్నయ్య కారు నేర్పవా"
మనం "సరే వెళదాం పద"
వాడు "ఉండు నాన్నకు చెప్పేసి వస్తాను"
మనం "పర్లేదు రా మన కారులో వెళ్తున్నాంగా నాన్నని అడగక్కరలేదు. నాన్న కారులో వెళ్తే చెప్పాలిగాని మనకారులో వెళ్తే చెప్పనక్కరలేదు"

అదన్నమట మనకు ప్రత్యేకమైన మన సంస్కృతి. ఇది ఒక పళాన అలవాటు అయ్యేది కాదు. దీనికి ఒక రకమైన ఆలోచనా తీరు అవసరం. డబ్బులు, ఆస్తిపాస్తుల్లో ఏముంది మన జనాలు మనకు ముఖ్యంగాని అనే ధోరణిలోఁ వుండాలి. బాగా అలవాటు చేసుకుంటే అవతలివారికి మన గుఱించి, చదువుకంటే సంస్కరముందని తెలిపే మంచి అలవాటు యిది.

మా సంస్కృతి
మా అమ్మ, మా నాన్న అంటాము మనము తల్లిదండ్రులకు ఒకే బిడ్డ అయినా సరే. అదే వేఱే భాషల్లోనయితే, నా అమ్మ, నా నాన్న అంటారు. ఇది అందఱికీ తెలిసిన విషయమే. ఇక్కడ మఱీఁ మన అమ్మ మన నాన్న అని పరాయివాళ్ళతో అనలేము కాబట్టి, కనీసం మా అనాలి.

దేనినైనా నలుగురితోఁ పంచుకోమని చెప్పే మన సంస్కృతికి అద్దం పట్టే మన భాష మనకు ముద్దు.

16 comments:

 1. మన పోస్టు బలేగా ఉందండీ! (అదియునూ మొదటిపేరా దక్క :-)

  ReplyDelete
 2. రాకేశ్వరా, మన కామేశ్వరరావుగారి మాటే నాదీను. కానీ అరసున్నాలూ, బండీరాలూ కూడా చక్కగా రాసే మీరు టైపోల విషయంలో మాత్రం కొంచం జాగ్రత్త వహించాలి. లేకపోతే నాలాంటి వక్రబుద్ధులు మీ టైపోల్ని జోకులుగా పదిమందికీ ప్రచారం చేసే అవకాశం ఉంది. ఉదాహరణ: ఈ టపాలో -
  ’గ్రామాల్లో అచ్చంగా తెలుఁగు మాత్రమే "ఏఱిఁగిన" వారు వుంటారుగా’. మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇలా రాసి ఉంటారని అనుకోడం లేదు లెండి!!

  ReplyDelete
 3. తెలుగులో ఈ ’మన’ ప్రయోగం గురించి కొన్ని మొరటు జోకులున్నాయి. మా తాతగారు చెప్పేవారు. ఆయన పనిచేసే పల్లెటూళ్ళో ఒకతను అందరికీ అతి మర్యాద ఇచ్చి మాట్లాడేవాట్ట. అంటే, ప్రతిమాటకీ ’మన’ ముందు చేర్చేవాడన్నమాట. అతన్ని మరొకతను వేళాకోళం చేసేవాట్ట ’ఒరే, మన పెళ్ళాం, మన పిల్లలు ఎలా ఉన్నార్రా?’ అని.

  ReplyDelete
 4. కొంచం సబ్జక్టులోకి వస్తే, భాషల గురించి మాట్లాడ్డానికి నా జ్ఞానం సరిపోదుగానీ, నేను చదివిన ముక్కొకటి మీతో పంచుకుంటాను. ’మన’ గురువుగారు స్టీవెన్ పింకర్ గారు చెప్పిన ముక్క ఇది. ఒక భాషలో ఒక భావానికి ప్రత్యేక పదం ఉన్నంతమాత్రాన, మిగతా భాషల్లో ఆ భావం లేదని అర్థం కాదు. ఆ భావానికి మిగతా భాషల్లో ప్రత్యేకమైన పదం లేదు అని మాత్రమే. ఉదాహరణకి జర్మన్ భాషలో ’అవతలి వ్యక్తికి కలిగే కష్టానికి మనకు కలిగే సంతోషానికి’ ఒక ప్రత్యేకమైన పదం ఉందిట. ఆ సంగతి మరో భాష వాడికి తెలిసిందనుకోండి, ’అహా దానికి ఒక ప్రత్యేక పదం ఉందా మీ భాషలో’ అంటాడు. అంతే. కానీ, ‘ఏమిటీ, అవతలి వాడికి కష్టం కలిగితే మనకి సంతోషం కలగడమా? అంటే ఏమిటో నాకు అర్థం కావడం లేదే’ అనడు.

  ఆ సంగతి అలా ఉంచితే, ఏది ఏమైనా ఒక్కొక్క భాషలో ఉండే ప్రత్యేకమైన పదాలు ఆ భాష యొక్క ప్రత్యేక సంస్కృతిని ప్రతిబింబిస్తాయి అనే నేనూ అభిప్రాయపడుతున్నాను.

  ’మన’ విషయానికొస్తే మిగతా భాషల్లో ఈ ప్రత్యేక పదం లేకపోయినా సందర్భాన్ని బట్టి ’మేము/మాది’ అనేవి ’మనము/మనవి’గా ధ్వనిస్తాయి అనే నా అభిప్రాయం. ఉదాహరణలు చాలానే ఇవ్వచ్చనుకోండి, అయినా ఇక్కడితో ’మన’ అజ్ఞానాన్ని బయటపెట్టుకోడం ఆపేద్దామనిపిస్తోంది.

  ReplyDelete
 5. @ కామేశ్వర రావు గారు
  పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో వేసినట్టున్నారు. పరదేశంలో వుంటే ఆ పాట్లు తప్పవులెండి. దక్క అంటే తప్ప అనే అర్థంతో వాడారా? నేను ఎప్పుడూ ఆ వాడుక ఎఱఁగను. ఏదో మాట వఱసకి అంటాము గానీ నేను మాత్రం రేపు మా పిల్లల్ని తెలుఁగు బడిలో వేస్తానంటే శ్రీమతి వూరుకుంటుందా. నా కొడుకుని పాలేరు చేసేస్తున్నావు అని ఎత్తుకోదు.

  @ నాగమురళి గారు,
  టైపోల నుండి విముక్తి లేదండి ఈ జనమకు. నాల్గేసి సార్లు చదివినా నాకు కనిపించవవి. ప్రతి టపా నాలుగు సార్లైనా చదువుతాను. మీరు చూపించాక కూడా ఏదబ్బా టైపాటు అని చాలా సేపు వెదికాక గానీ కనిపించలేదు. నాది రైట్ బ్రెయిన్ బుఱ్ఱ అవడం వలన అనుకుంట :)

  ప్రత్యేక పదం వుంటే, ఆ అంశానికి ఆ సంస్కృతిలో ప్రత్యేకత వున్నట్టు.
  ఉదా -
  ఆస్ట్రియా దేశం చాలా వఱకూ మంచుపర్వతాల్లో మునిగి వుంటుంది. వాఱికి ఉత్త గడ్డమంచుకి పదమూడు పదాలు వున్నాయఁట. ఆంగ్లంలో ice, snow, fog, dew అని మూణ్ణాల్గు పదాలువున్నాయి. మనమయితే అదే మంచు పదాన్ని అన్నిటికీ సరిపెట్టేస్తాము. పొగ మంచు, గడ్డ మంచు అనుకుంటూ. Dew ని కూడా మంచనేస్తాం.

  కొన్ని కొండజాతి భాషల్లో హత్యకు పదమే వుండదఁట. జర్మను భాషలో ఒక రకమైన కుళ్ళుకోవడానికి ప్రత్యేక పదం వుండడం ఆశ్చర్యమేమీకాదు :) కిడ్డింగ్.

  ReplyDelete
 6. నాగమురళి గారు: ఆ జర్మన్ పదం: Schadensfreude (సుమారుగా ఇలా పలుకుతారు: షాడెన్స్-ఫ్రాయ్‌డ).

  రాకేశ్వర-గారు: మంచుగడ్డల విషయంలో ఆస్ట్రియన్లకు 13 పదాలున్నాయని, ఎస్కిమోలకు కొన్ని దజన్ల పదాలున్నాయని తరచుగా అందరూ అనే మాట. చాలా వివాదం వుంది ఈ విషయంపైన ... కాదని వాదించే సాహిత్యం కూడా చాలానే వుంది. గూగుల్‌ని గాలించండి.

  ఇంక మీ "మన" "నా" చర్చకొస్తే, ఏది collectively owned, individually owned అనే విభజన తెలుగులో వుంది. వెల్చేరు నారాయణరావు గారు చాలా వివరంగా ఈ విషయంపై చెప్తారు.

  -- శ్రీనివాస్

  ReplyDelete
 7. "పిల్లల్ని ఆంగ్ల మాధ్యమం బళ్ళలో వేసినట్టున్నారు"

  మనం చదువుకున్నదీ ఆ ఆంగ్ల మాధ్యమమే (స్వదేశంలోనే ఉండి), అదీ అసలు సంగతి :-) But there is more to it.
  "తక్క" సరళంగా "దక్క" అన్నా. ఇది మీరు వినలేదంటే ఆశ్చర్యంగా ఉంది, బహుశా చప్పున గుర్తొచ్చి ఉండదు. లేకపోతే "యమ" యీజీగా పోల్చుకొనేవారు :-)

  ReplyDelete
 8. @ శ్రీనివాసు గారు
  పోనీలెండి ఆస్ట్రియా మాట వదేలేసిన మనము fog, due, snow, ice అన్నిటికీ ఒకటే మాట వాడతాంగా. అది పాయింటు.

  collectively owned అయిన వాటిలో కూడా, కొందఱు చిన్నాన్నలు కొందఱు అన్నయ్యలే మన అంటారు చాలా మంది మా మీ అనేస్తారు.

  @ కామేశ్వర రావు గారు
  మీ విషయంలో కూడా ఘోరం జరిగిపోయిందనమట. కానీ మీరు పూర్తిగా కోలుకున్నారు. నేను కోలుకోలేకపోతున్నాను. ఎప్పటికి కోలుకోలేనుకూడాననుకుంట. :(
  కానీ ఎప్పుడో ఇఱవై ఏళ్ళనాడే, కాలు సెంటర్లు వస్తాయని వూహించి ఆంగ్లమాధ్యమంలో ఎల్‌కేజీ లో చేర్చిన మా అయ్య, బడి పెట్టిన మా లక్ష్మణ స్వామి పంతులూ గొప్పవారు.

  ReplyDelete
 9. "మన" అనేది తెలుగులోనే కాక మిగిలిన భారతీయ భాషల్లోనూ ఉన్నట్లుంది. నా బీహారీ మిత్రుడొకడు, మాటకు ముందు "హం" "హమారా" అని వాడతాడు.

  జపనీసు భాషలో నెనర్లు (కృతజ్ఞతలు) అని చెప్పడానికి "అరిగతో గొజైమాసు" అంటారు. ఆ వాక్యానికి అర్థం, "మంచితనం బాగా కఱువైపోయింది" ... ఇలాంటిదేదో. అలానే వాళ్ళకు భోంచేసిన తర్వాత మన "వాతాపి జీర్ణం" లా ఓ ఎక్స్ ప్రెషను ఉంది.

  ReplyDelete
 10. మన పోస్టు చాలా బాగుందండీ! ఐతే ఇది చదవగానే అందరూ పిల్లల్ని తెలుగు బడుల్లో చేర్పించేస్తారని మీరెందుకు అనుకున్నారో అర్థం కాలేదు.

  రవి గారు,

  మన - అన్న పదం ద్రవిడ భాషలకు ప్రత్యేకం అనుకొంటాను. హిందీ 'హమ్' ఇంగ్లీషు 'We' లాంటిదే. 'మన' ఐనా అనుకోవచ్చు, 'మా' అనైనా అనుకోవచ్చు.

  ReplyDelete
 11. రవి గారు,

  చిన్న సవరణ. కన్నడ భాషలో కూడా 'మన' లేదు. 'నమ్మ' అంటే మన, మా అని కూడా .

  ReplyDelete
 12. పాత కన్నడంలో వుండేదఁట ఈ మధ్యన ఎవరూ వాడట్లేదఁట.

  ReplyDelete
 13. ఏవిఁటేవిఁటో ఊహించేస్కుని చదివేఁను రాకేశ్వరులవారూ ఈ ఠపా శీర్షిక చూశి. మన భాషా, మన సంస్కృతీ. ఉఁ. నేన్కూడా కామేశ్వరరావుగారికీ, మురళిగారికీ ఇద్దరికీ ఊఁ కొడుతున్నాను. ఏదో ఈ మజ్ఝ మన భాష(ల) మీద మమకారం ఎక్కువైపోయింది కానీ, నేనూ చిన్నప్పణ్ణించీ (అంటే రెండో తరగతినుంచీ అని) ఇంగ్లీసు మీడియంలో అఘోరించినవాణ్ణే.

  ReplyDelete
 14. ఇందులొ ఇంత గందరగొళం ఏముందో నాకు అర్ఠం కావట్లేదు.

  ReplyDelete
 15. మంచి విషయం చెప్పారు..కానీ పిల్లల్ని తెలుగు మాధ్యమం బళ్ళల్లో వేద్దామంటే మంచి బళ్ళే లేవండీ..మేం చదుకున్న తెలుగు బళ్ళు అలానే ఉంటే ఎంత బాగుణ్ణో..

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం