భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, August 26, 2009

సాయం సమయాన స్నేహితులతోఁ సెx (రానారె టపాకు వ్యాఖ్య)

ఈ టపా రానారె వేసిన "సాయం సమయం సెక్సు" అనే టపాకు వ్యాఖ్య. ముందు అది చదివితేనే గాని మీకీ సెక్సు విషయం అర్థంకాదు. నాకది చదివిన పిదపఁ గూడా అర్థం కాలేదన్నది వేఱే విషయం.

నేనెవరడిగినా వేంటనే సాయం చేస్తూంటాను, కానీ ప్రక్కవారిని అడగడానికి చచ్చేంత మొహవాటం. ఎందుకులే పాపం వారి పని పోగొట్టడం అని నేను భావిస్తూంటాను. కానీ తరువాత ఫలానా వ్యక్తి సాయం చేస్తానన్నాడే నేను వద్దన్నానే, ఇప్పుడు చచ్చేంత చావొచ్చిందే అనుకుంటాను. ఇది చాలా తప్పుడు పద్ధతి.

చందమామ కథ (A)
నా ఇంజనీరింగు రోజుల్లో నా గది పై కప్పు పెచ్చులూడి అవి అచ్చులచ్చులుగా రాలడం మొదలయ్యింది. నా ప్రక్కగదిలోనే రానారె (రాకేశ్వర నాయిడు రెడ్డి (పేరు స్వల్పంగా మార్చబడినది)) వుండేవాడు. వాడి సాయం కోఱకుండా నేనే ఒకటొకటీ గోధుమరంగు కాగితాలు పెద్దపెద్దవి గది పైగోడకు అంటించడం మొదలు పెట్టాను. మెడకాయ వున్న ఎవడికైనా ఇది ఎంత మెడలో బాధో అర్థమవుతుంది. ఆ మెడకాయ పైన తలకాయ వున్న పలువురికైతే ఇది ఎంత బుఱ్ఱ తక్కువ పనో కూడా అర్థమవుతుంది.

కొంత సేపటకి ఆ రెడ్డిగాడు ఆ ప్రక్క పోతూ నా అవస్థ చూసి, నేను అడగకుండానే వచ్చి నాకు సాయం చేయడం మొదలు పెట్టాడు. మావాడు చాలా మంచి వాడు అడగకుండానే సాయం చేస్తాడు. కానీ వాడికి అవసరం వచ్చినప్పుడు మాత్రం మనమేదో వాడి పాలేళ్ళమన్నట్టు తోడుకొనిపోతాడు. మొత్తానికి నిమిషాలలో నా గది పైకప్పు పూర్తిగా కాగితాలతో అతికించబడ్డది.

నా గదిలో పెచ్చులు రాలుతున్నాయంటే, నా సరాసరి ప్రక్కగదిలో పెచ్చులు రాలే అవకాశాలు, కండిషనల్ ప్రాబబిలిటీ ప్రకారం ౯౪.౩౨ శాతం. అలా కొన్ని రోజుల గడిచాక, వాడి గది పైకప్పుకే గాక, ఐదు గోడలకూ సరిపడా కాగితాలు తెచ్చాడు మావాడు. గోడలు కూడా పెచ్చులూడేవి పరశురామక్షేత్ర వర్షానికి! మేమిద్దరం కలసి ఐదు గోడలకీ చకచకా కాగితాలు అంటించి తీర్చిదిద్దాము.

ఆ తరువాత నేను నా మిగిలిన నాలుగు గోడలకీ కాగితాలు తెచ్చాను. అప్పుడు మేమిద్దరం ఇంకో ఐదు నిమిషాల్లో వాటిని అంటించాము. ఇక పట్టభద్రులమయిన తరువాత మేమిద్దరం ఒక కంపెనీ కూడా పెట్టాము, దాని పేరే గూగుల్. ఇప్పుడు ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీలలోనే ఒకటి. కాబట్టి ఎప్పుడూ కలసికట్టుగా సమిష్టిగా పనిచేయాలి. అని మీరు ముందుగానే తదుపఱి కథని వూహించివుంటారు. అలా జరిగితే అదొక మాంచి చందమామ కథ అయ్యేది. "మిత్రులు ఒకరికొకరి సాయం వీలయినంత తీసుకోవాలి .. సెక్సు లాగ"అన్న విశిష్ట నీతి వుండేదాకథలో.

కానీ నిజజీవితంలో అలా జరగదూ జరగలేదూ, ఎందుకంటే అంతకు మునుపే నేను ఎన్నో అవస్థలు పడి నా మిగిలిన నాలుగు గోడలకీ కాగితాలు ఒంటరిగా అంటించేసుకోవడం అయిపోయింది. అప్పుడు మావాడు ఆ ప్రక్కగా రాలేదు పోలేదు, కాబట్టి వాడు చూడలేదు.

చివఱకు నా గది కంటే ఎంతో అందంగా వున్న ఆ రెడ్డిగాడి గది చూసినప్పుడు నాకు తటస్థించింది కథలోని నీతి "ఈ నాయిడ్రెడ్ల నెప్పుడూ నమ్మకూడదు" మనకి ఒక సాయం చేసి వాళ్ళు మనచేత ఐదు గోడలకు కాగితాలు అంటించుకుంటారని". కాబట్టి మనము కూడా మన మిత్రులనుండి వీలైనంత సెక్స్.. యఱ్.. సాయం తీసుకోవాలని అర్థమయ్యింది.

అది కథ.

త.క -
చెప్పానా శీర్షిక మీకు అర్థంకాదని. పైపెచ్చు ఈ శీర్షిక వల్ల చందమామ వారు నా ఈ కథని నిరాకరిస్తారని భయంగా వుంది.
కాబట్టి నా గాద పిల్లల వఱకూ చేఱక, ఈ నాయిడ్రెడ్ల చేతుల్లో ఇలానే ఇంకెంతో మంది మోసపోతూవుండాల్సిందే (నేను చెప్పేది టపా శీర్షికల విషయాల్లో కాదు). అన్నట్టు మా మిత్రుడి అసలు పేరు మార్కు రెడ్డి, ఇది యదార్ధ గాద.

7 comments:

 1. హేమిటో - ముందుది చదివి ఇది చదివినా
  హేమిటీ అర్ధం కాలేదు . నేను మాత్రం
  అందరినీ సాయమడుగుతూనే ఉంటా :-)

  ReplyDelete
 2. :-)
  మిత్రులనుండి అని గిరిగీసుకోకూడదు. సురక్షితసాయం ఎవరినుంచైనా పొందడమే మనిషి పని. ఈమాట వేమారెడ్డి చెప్పాడని పుకారు. ఐనా ఎవరు చెబితే ఎవరు వింటారుగనగక?!

  ReplyDelete
 3. :))
  పై కప్పుకే గాక "ఐదు" గోడలకీ..??

  ReplyDelete
 4. :)

  ఇక్కద కూడా ఐదో గోడా! హ హ హ.

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం