భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, July 17, 2007

వృత్తాలు నేర్వడానికి సోపానరేఖాచిత్రాలు

చిన్నప్పుడు మొదటిసారిగా వృత్తాల ఛందస్సు తెలుసుకున్నప్పుడు నాకనిపించిందేంటంటే,
"ఇన్ని నిబంధనలతో, ఎవరైనా పద్యం వ్రాయగలరా, అదీ వారూహించిన భావం పోకుండా?"
కాని నాకున్న సందేహాలన్నీ, పోతనగారి ఈ పద్యం చదివాక పోయాయి.
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై
చిన్నప్పుడు మా తెలుగు పంతులుగారు దీనిని మా క్లాసులో వివరించారు. అప్పట్నించి నా బుర్ర వెనకాలెక్కడో దీని భావం అలా మిగిలిపోయింది. మా తెలుగు మస్టారుకి తెలుగు అంటే చాలా అభిమానం దానిని నాలాంటి అమెరికా పిచ్చున్న వాడికి కూడా బాగా అందించారు. పిచ్చి తీరింది కాబట్టి దానికిందున్నది పైకి తేలుతుంది. అందాన్ని చూడడానికి మనోనేత్రం దుర్గమ్మ ఇచ్చినందుకు, అదృష్టం నాది.

ఏదేమైనా తెలుగు వృత్తాలు వ్రాయడం నాలాంటి వాళ్ళకు ఈ జన్మకు అసాధ్యమైనా, వాటిని చదివి ఆనందించే భాగ్యమైనా ఉండాలికదా? వచ్చే జన్మకి తెలుగు మాట్లాడే యోగ్యం కూడా ఉండదేమో :).
వృత్తాలను తేలికగా గుర్తుపెట్టకోవాలన్నా, వాటిని పాడుకోవాలన్నా వాటి లయ రావడం ముఖ్యం. అందుకనే వాటి లయ నేర్చడానికో విన్నూత్నమైన పద్ధతి వాడుతున్నాను, అది మీతో పంచుకోవడానికి ఈ టపా. లయలన్నీ శంకా రామకృష్ణగారివి.

బొమ్మలు
ఈ క్రింద ఉన్న సోపానరేఖాచిత్రాలలో(పదం నేర్పింది రానారె, తెలుగుపదం గుంపులో), ఆకు పచ్చ రంగులో పెద్దగా కనిపించే గళ్ళు గురువులు, వాటికి అరవైశాల్యమున్న చిలకపచ్చ గళ్ళు లఘువులు. ఎడమవైపు నుండి కుడి వైపుకు, క్రింది నుండి పైకి చదువుకుపోవాలి, ఉదాహరణకు, ఉత్పలమాల మొదటి గణం భ, కాబట్టి ఒక పెద్దడబ్బా దాని పైన రెండు చిన్నడబ్బాలు కనిపిస్తాయి, కాబట్టి వాటిని UII గా చదువుకోవాలి. ఇక లయ రావడానికి, 'తా','న' లను గురు లఘువులుగా వాడడమైనది. బొమ్మలో 'య' ఉన్న చోటు యతి స్థానం. ఎఱుపు రంగులో ఉన్న పాదాలకు ఇక్కడిచ్చిన నడక బాగా కుదురుతుంది. ఒక ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది అంతా. యతి ముందు చిన్న విరామం ఇవ్వడం మరువవద్దు.

ఉత్పలమాల
గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
యతి: ౧౦
నడక ౧ : తానన తాన తాన తన తానన తానన తాన తాన తా
నడక ౨ : ధీంతన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్
ఉదా ౨:
భండన భీముడార్త జన భాంధవుడుజ్వల బాణ తూణ కో
దండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామ మూర్తికిన్
రెండవ సాటి దైవమిక లేడనుచున్ కడ గట్టి భేరికా
డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వే
దండము నెక్కి చాటెదను దాశరధీ కరుణా పయోనిధీ !!
సోది: ఉత్పలమాల, చంపకమాల జంట వృత్తాలు. ఎందుకో మీకు బొమ్మలు పోల్చిచూస్తే అర్థమవుతుంది. అలానే శార్దూలము, మత్తేభమునూ.

చంపకమాల
గణాలు: న, జ, భ, జ, జ, జ, ర
యతి: ౧౧
నడక ౧ : న నన తాన తాన తన తానన తానన తాన తాన నా
నడక ౨ : ధిరనన ధీంన తోంన నన ధీంతక తోంతక ధిక్కు ధిక్కు ధా
ఉదా ౧:
అలుగుటయే యెరుంగని మహామహితాత్ము డజాతశత్రుడే
అలిగిననాడు సాగరము లన్నియు ఏకము కాక పోవు క-
ర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా-
పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరన్
ఉదా ౨:
అటజని గాంచె భూమి సురు డంబర చుంబి సురస్సర జ్ఝరీ
పటల ముహుర్ముహుర్లట దబంగ తరంగ మృదంగ నిస్వన
స్పుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
సోది: నాలుగో పాదం గుర్తుకులేదు, ఎప్పుడో ఎనిమిదో తరగతిలో విన్నా, పద్యం అర్థం కూడా తెలియదు, ఎవరో రాజు ఎవో జలపాతలను చూస్తున్నాడని తప్ప. కాని పద్యం వింటుంటే జలపాతాంలా అనిపించి ఈ పద్యం 'బాగా' గుర్తుంది.

శార్దూలం
గణాలు: మ, స, జ, స, త, త, గ
యతి: ౧౩
నడక ౧ : తానా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : ద్ధిత్తోం తక తోంన తోంన ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
జండాపై కపి రాజు ముందు సిత వాజిశ్రేణినిన్ గూర్చి నే
దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండు చున్నప్పు డొ
క్కండున్నీ మొర నాలకింపడు కురుక్ష్మా నాథ సంధింపగాన్
ఉదా ౨:
అంతా మిథ్య తలంచి చూచిన, నరుండట్లౌ టెరింగిన్, సదా
కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా
జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా !
సోది: రెండవదానిని ఎక్కడనుండో అతికించినా, ఇది నా ఎనిమిదో తరగతి నుండి గుర్తున్న ఒకే ఒక పూర్తి పద్యం. సరళ మైన తెలుగులో ఉండే వృత్తమిది.

మత్తేభం
గణాలు: స, భ, ర, న, మ, య, వ
యతి: ౧౪
నడక ౧ : ననా తానన తాన తాన తననా తానాన తానాన నా
నడక ౨ : కధిత్తోం తక తోంన తోంన ధిరనా ద్ధిక్కు తద్ధిక్కు తా
ఉదా ౧:
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్నః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభియై

ఉదా ౨:
సిరికిం జెప్పడు; శంఖ చక్ర యుగముంజేదోయి సంధింపడే
పరివారంబును జీర డభ్రగపతిం బన్నింప డాకర్ణికాం
తర ధమ్మిల్లము జక్క నొత్తడు వివాదప్రోత్థిత శ్రీ కుచో
పరిచేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహియై.
గురువులు:
బి.ఎ. రాంమోహనరావు (తెలుగు పంతులు, పేరులేని పాఠశాల), శంకా రామకృష్ణ (వ్యాసం ౧, వ్యాసం ౨), కొత్తపాళీ, తెవికీ, ఈమాట
లఘువు: రానారె :)

తప్పులుంటే, ఎప్పటిలానే, మన్నించి తెలుపుగలరు.

25 comments:

 1. రాకేశ్వరా నువ్వు నిజంగా అసాధ్యునివి. అవునూ టపా అర్థాంతరంగా ఆగినట్లు లేదూ? గురువులు అని కొన్ని చెప్పావు. లగువులు, పిల్లిమొగ్గలు చెప్పలేదు!? ;-)

  ReplyDelete
 2. నిజంగా అసాధ్యుడివే.
  ఈ అవిడియాని పేటెంటు జేసి ఏ తెలుగు యూనివర్శిటీ వాళ్ళకో తెలుగు అకాడెమీకో అమ్మచ్చునేమో కనుక్కో:-)

  ఈ వ్యాసంలో సాంకేతిక సోపాన పటాలొక ఎత్తైతే ఉపోద్ఘాతంలో నువ్వు వెలిబుచ్చిన తెలుగు భాషాభిమానం ఒక యెత్తు.

  నూరేళ్ళు చల్లగా బతుకు!

  ReplyDelete
 3. భలే... నేర్చుకోవడానికి ట్రై చేస్తా.
  ఈ వారాంతం లో చూస్తా.

  ReplyDelete
 4. @ రానారె
  మీరు చెప్పినట్టు లఘువులు కూడా పేర్కొన్నాను సంతోషమేనా :)
  @ కొ.పా
  నాకు సెంటి కొట్టడం మాబాగొచ్చులెండి, నేను లేడీస్ సెంటిమెంట్ పిక్చర్ ఒకటి తీస్తా అప్పుడు ఉంటుంది తస్సాదీయ్య, కన్నీరు యేరలై పారాల :)
  @ ప్రవీణ్
  మీలాంటి వారు ఒక్కరైనా ప్రయత్నిస్తారని కష్టపడి టపా రాసాను. నాకసలే ఎవరూ పట్టించుకోపోతే బాధేస్తుంది. :)
  నేను శంకా గారి వ్యాసం చదివి నేర్చుకుంటున్న రోజుల్లో, తానన తాన తాన తన ... అని ఎప్పుడూ పాడుకుంటూ ఉండేవాడిని, ఒ పది సార్లంటే అదే వచ్చేస్తుందిలేండి.

  ReplyDelete
 5. చాలా ఆనందాన్నిచ్చే వ్యాసం రాసారు. దుర్గమ్మ మిమ్మల్నే కాదు మమ్మల్నీ కరుణించింది అనిపించింది.

  గేంగాఫ్ ఫోర్ అంటూ కొ.పా గారు ముద్దుగా పిలిచే ఈ వృత్తాలు నాకు చాలా ఇష్టం. గురువుగారు మాత్రం తేటతెలుగు జాతులు, ఉపజాతులనే ఎక్కువ అభిమానిస్తారని నా అనుమానం. ఏమైతేనేం ఆయనచేత సెభాష్ అనిపించేసుకున్నారు!

  లఘువుగారు పోతన,మెగాస్టార్ అంటూ మీకు చెప్పగానే ఆయన పద్యాలనే ఎత్తుకుని చాలా చక్కగా వివరించేసారు. చాలా ధన్యవాదాలు.

  ఇక మనుచరిత్రలోని పద్యం, నాలుగో పాదం "కటక చరత్కరేణుకర కంపితసాలము శీతశైలమున్". ప్రవరుడు హిమాలయాల్ని చూసి ఆనందించే పద్యం. ఆయన రాజు కాదు ఒక గృహస్తు అంతే.

  ReplyDelete
 6. ఈ టపాను చూడటం 24 గంటల్లో ఇది నాలుగోసారి..అర్ధం చేసుకుందామని కాస్త ఎగా దిగా చూశా..కానీ యతి స్థానమంటే ఎంటో, లఘువేంటో, గురువేంటో తెలియని నాకు అర్ధమయ్యేట్టు కనిపించలేదు. ఒక సారి ఆ బేసిక్స్ చదివి మళ్లీ ఇక్కడికొస్తా చెప్పుకోవటానికి సిగ్గుగా ఉందికానీ హిందీ ప్రథమ భాష ప్రభావము మరి.

  ReplyDelete
 7. అబ్బా సంపేసినావ్‌బో, నేననిందొకటి నీకర్థమైంది ఇంగోటి :) లఘువులెవరో చెప్పమనిగాదు, లగువులు పిల్లిమొగ్గలు పల్లుటీలు ... ఇట్లా ఏదో కామెడీజేద్దామనుకున్న్యా. ఈ నెల సుజనరంజనిలో ఇచ్చిన సమస్యను ఎలా పూరించాలో నాకేం అర్థంగాకుండా ఉంది. వదిలేద్దామా అంటే పేరుజెప్పి శరణుకోరడానికి మనస్కరించడంలేదు.

  ReplyDelete
 8. పెద్దగా అర్థం కాకపోయినా, వణికేగుండులా (షేక్స్పియర్) అనిపించింది చదువుతుంటే... వామ్మో..

  ReplyDelete
 9. రాకేశ్వరరావు గారు,
  తెలుగు గురించి మీరు చేస్తున్న కృషి కి అభినందనలు.
  తెలుగు ఛందస్సును సులభ రీతి లో వివరించినందుకు ధన్యవాదములు.
  అటజని గాంచె అనే పద్యము అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర లోనిది.
  ప్రవరుడు హిమాలయ పర్వతమునకు వచ్చిన సందర్భం లో హిమవత్పర్వత వర్ణన చేస్తున్న ఈ పద్యము అల్లసాని వారి ధార కు నిదర్శనం.(ఇది మా 10వ తరగతి లో ఉన్నది).

  ఈ పద్యం యొక్క చివరి పాదము:

  గ(క)టక చరత్కరేణు కర కంపిత సాలము శీత శైలమున్.

  ReplyDelete
 10. సంరంభియ ->సంరంభియై ??

  కొనసాగింపేది స్వామి? మరిన్ని వృత్తాలు పరిచయం చేయవచ్చు కదా.
  -ఊదం.

  ReplyDelete
 11. గుర్తుచేసినందుకు కృతజ్ఞతలు...
  త్వరలో .. త్వరలో...
  ప్రస్తతానికీ కాఱడవిలోనుండి వెళుతుంది జీవితం..
  దాని బయటకి వచ్చాక, నా బ్లాగ్విశ్వరూపం చూస్తారు...

  రాకేశ్వర

  ReplyDelete
 12. ఇరగదీశారు. మీ ఋణం తీర్చుకోవాలంటే అర్జంటుగా ఇవి బట్టీ పట్టేసి పద్యాల్రాసెయ్యాల్సిందే... ఇంకా ఇటువంటి ఉపయోగకరమైన వ్యాసాలు రాయమని మనవి.

  ReplyDelete
 13. చాలా బాగుంది. ఈ మధ్యనే, కబుర్లలో ఈ విషయమై పెద్దలని అడిగితెలుసుకున్నాను కాని మీరు ఈ విషయమై ఎప్పుడొ వ్రాశారని నాకు తెలియదు. ఇంకా చాలా అనుమానాలున్నాయి నివృత్తిచేసుకోవడానికి. వీలు చూసుకుని అడగాలి


  నమస్కారలతో,
  సూర్యుడు :-)

  ReplyDelete
 14. ఎంత ప్రయత్నించినా అర్థం కాలేదు. సోపాన చిత్రాల దగ్గరే ఆగిపోయాను. భ, ర, న, భ, భ, ర, వ కూ, సోపాన చిత్రానికి వున్న సంభంధమేమిటో అస్సలు అర్థము కాలేదు. ప్చ్!

  ప్రసాదం

  ReplyDelete
 15. రాకేశా, ఒక సందేహం - రగణం UIU కదా, సోపానచిత్రాల్లో UI అని చూపించినట్లున్నావు?

  ReplyDelete
 16. రానారె, రగణపు తానతా లో 'తాన' ఒక చోట 'తా' ఒక చోట ఉండడంవల్ల అలా అనిపించి ఉండవచ్చు..

  రాకేశా, ఇంకా పృథ్వి, సరసాంకము, స్రగ్ధర, మహాస్రగ్ధర, స్రగ్విణి, తోవకము వంటి వృత్తాలను గురించి కూడా వ్రాయి..

  ReplyDelete
 17. థాంక్యూ గిరిగారూ, ఇప్పుడర్థమయింది. రాకేశుడు చెప్పిన 'నడక'ను గమనించలేదు నేను. వృత్తాలను వ్రాయడానికి ఈ టపా చాలా మంచి పరికరం. రాకేశ్వరునకు మరోమారు అభినందనలు.

  ReplyDelete
 18. @ నాగమురళి గారు,
  చాలా మంచిది, మీరలా చేస్తే (వృత్తాలు వ్రాస్తే) నేను తరువాత వ్రాసే పది పద్యల టపాలూ మీకే అంకితం :)
  ఈ బొమ్మలు పద్యాలు వ్రాయడానికే కాకుండా చదవడానికి కూడా ఉపయోగ పడతాయి.

  @ సూర్యుడు గారు,
  నాకు తెలిసిందంతా ఇక్కడ వ్రాసాను :). ఇది వృత్తాలు నేర్వడానికి సుళువైన పద్ధతి. మీ మిత్రులకు ఈ లంకె ఇవ్వగలరు.
  నేను నేర్చుకున్న పద్ధతి ఇదే...
  సందేహాలు తీర్చడానికి నాకంటే అర్హులు చాలామందే వున్నారు మన బ్లాగ్మిత్రులలోఁ...
  @ప్రసాదం గారు
  మీలాంటి తెలివైన వారికి అర్థం కాకపోవడం ఏఁవిటి చోద్యం ?
  ముందు మీకు గురులఘువులు అంటే ఏంటో తెలియాలి, అది పెద్ద పని కాదు. వికీ వుంది.
  ఆ తరువాత యమాతారాజభనస గణాలు తెలియాలి. అవి కూడా పెద్ద పని కాదు వికీలోవున్నాయి .
  ఆ పై, బొమ్మలు అర్థ చేసుకోవడం ఎలానో బొమ్మలు అనే ఉప శీర్షిక క్రింద వివరించాను.

  భ - UII కాబట్టి ఒక పెద్ద డబ్బా, రెండు చిన్న డబ్బాలూ వుంటాయి. కానీ బొమ్మలకు భరనభభరవతోనూ నజభజజజరలతోనూ సామీప్యం కంటే నేను ఇచ్చిన నడకతో సామీప్యం ఎక్కువ అన్నది ముఖ్య విషయం.
  ఉదా -
  చంపకమాల నజభజజజర అని అనుకోవడం కంటే
  తననన తాన తాన తన - తానన తానన తానతానతా
  అని గుర్తుపెట్టుకోవడం, పద్యాలు చదవడంలోనూ రాయడంలోనూ ఉపకరిస్తుంది.
  అంటే
  III IUI UII IUI IUI IUI UIU కంటే
  IIII UI UI II - UII UII UIUIU
  అని గుర్తుపెట్టుకోవడం మంచిది.

  @ గిరి గారు ,
  ఏంటి పరిహాసమా ?
  మీరు చెప్పిన పద్యరీతుల పేర్లైనా వినలేదు నేను! వికీలోనైనా లేదా ఏదైనా పుస్తకంలోనైనా వుంటే తప్పకుండా నాకు తెలిసినప్పుడు వ్రాస్తాను.
  అలానే మత్తకోకిల తరలం ఇక గీత పద్యాలకు కూడా ఇలాంటి బొమ్మలు వేద్దామని ఎప్పట్నుంటో అనుకుంటున్నాను.

  @ రానారె,
  ప్రసాదం గారితో చెబినట్టు గణాల వరుస కంటే నడక గుర్తుపెట్టుకోవడం ఆచరణీయం.
  ఉదా.
  భరనభభరవ కూ నజభజజజర కూ చాలా తేడా వున్నట్టున్నా, బొమ్మలూ మఱియూ నడకా బట్టి వాటికి మధ్య తేడా చాలా చిన్నదని అవగతఁవవుతున్నది!

  ReplyDelete
 19. వినూత్నపద్ధతి. బావుంది.

  ReplyDelete
 20. హాయ్
  నేను మూడు పద్యాలు రాసాను , అవి చందోబద్ధం గా ఉన్నాయో, లేవో చూసి అవసరమైతే స్వల్ప మార్పులు (అర్ధం మారకుండా) చేసి పంపగలరని
  మనవి.
  ఉత్పల మాల

  అయ్యల సోమయాజుల వధూ మహలక్ష్మివి, లక్షవత్తులన్
  వెయ్యగ, యగ్నికుండముల వెల్గెను కాంతులు సర్వలోకముల్
  తియ్యని భోజనంబులను తింటిరి, బంధువులందరూ జయం
  జేయమనేసినక్షతల జల్లుల, పల్కిరి పుణ్యవాక్యముల్

  కందం
  అరుణాచలమేం కోరెను ?
  పురసౌఖ్యములెన్నోవీడి ,పుట్టెడు చదువే
  వరమౌట, వీరి సంతతి ,
  కరములు జోడింత్రు బంధుగణములు భక్తిన్ .

  తేటగీతి
  అలుపెరుగని యర్ధాంగి , యాకలిని దీర్చు
  యన్నపూ ర్ణగా, దొడ్డ యిల్లాలు, కపట
  మునెరుగని దయామూర్తిగ మెప్పుబడసె,
  యమ్మయనెడి తీపిపలుకే '' లక్ష్మి '' మాకు .

  ReplyDelete
 21. @ u2222
  email address ఇవ్వగలరా? అక్కడికి జవాబు పంపుతాను.

  ReplyDelete
 22. sure, my email address is subhadrasista123@gmail.com

  ReplyDelete
 23. Master gaaru,

  sudden ga mee paataalu apesthe mee online maalanti vidyarthulu chaala kashtapadatharu, chukkani leni naavi laga. Mee paataalu malli modalupettalni korukuntunnamu

  ReplyDelete
 24. migilina vruthham mattha kokila, mariyu jaatulu vupajaathulu kuda iste inkaa baavuntundi

  mattakokila : ra sa ja ja bha ra
  ex: mathakokila mathakokila mathkokila kokila
  yathi: 1-14( i hope marchipoyaanandi edo 13 yrs mundu nerchukunna)

  ReplyDelete
 25. మరి ఆటవెలది కేమో ప్రతి వేమన పద్యం ఉదాహరణ తెసుకోవచును

  ఇనగణ త్రయంభు ఇంద్ర ద్వయంభు
  హంస పంచకంబు నాట వెలది

  మూడు ఇంద్ర గణములు రెండు చంద్ర గణములు రెండవ పాదం లో ఐదు చంద్ర గణములు ఉండును

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం