భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, July 01, 2012

కోతిసరసం { శ్రీమద్రామాయణమ్ సున్దరకాణ్డ ౭.౧౪.౧౨-౨౦ }

రామాయణములోని సుందరకాండ పారాయణము జోరుగా సాగుతుంది। నేనూ మా అమ్మా కలసి చదువుకొని లంక వైభవం గాలి జనార్ధన రెడ్డి వైభవములా వున్నదని నవ్వుకున్న సందర్భాలు కూడా వున్నాయి। 

కావ్యములో నవరసాలూ పండించాలి, కానీ రసరాజు శృంగారమును బ్రహ్మచారి హనుమంతుఁడు అందునా కోతితో ఎలా పండించాలి అని సమ్మోహపడడం సహజం। ఆ సమస్యను మహాకవి వాల్మీకి ఇదిగో  ఇలా ఛేదించాడు।

సూచిక
సంస్కృతపదము - తెలుఁగుమాట (విభక్తి వచనము లింగము)
ppp - past passive participle
gerund

దిశస్సర్వాః ప్రధావన్తం వృక్షషణ్డగతం కపిమ్ ।
దృష్ట్వా సర్వాణి భూతాని వసన్త ఇతి మేనిరే ॥ ౧౨

దిశః - దిక్కులు      (౨ బ స్త్రీ)
సర్వాః - అన్నిటినీ       (౨ బ స్త్రీ)
ప్రధావన్తమ్ - పరుగెట్టువానిని      (౨ ఏ)
వృక్ష-షణ్డ-గతమ్ - వృక్షసమూహాలపైనుండి వెళుతున్నవాణ్ణి      (౨ ఏ)
కపిమ్ - కోతిని      (౨ ఏ)
దృష్ట్వా - చూచి      (gerund)
సర్వాణి భూతాని - అన్ని ప్రాణులు      (౧ బ నపుం)
వసన్తః - వసంతుఁడు      (౧ ఏ)
ఇతి మేనిరే - అని అనుకొన్నాయి      (दिवादि आत्मनेपदि मन् - लिट् प्रथमपुरुष बहुवचनम्)

దిక్కులన్నీ పరుగులు తీస్తున్న హనుమంతుణ్ణి చూసి, ఆ ఆశోకవనజీవరాశులు సాక్షాత్తూ వసంతుడే వచ్చాడేమే అని అనుకున్నాయఁట॥

---

నిర్ధూతపత్రశిఖరాశ్శీర్ణపుష్పఫలా ద్రుమాః ।
నిక్షిప్తవస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః ॥ ౧౫

నిర్ధూత-పత్ర-శిఖరాః - రాల్చబడిన ఆకులుగల శిఖరాలుగలిగినవి (అయిన)      (౧ బ బహువ్రీహి)
శీర్ణ-పుష్ప-ఫలాః - త్రుంచబడ్డ పూపండ్లుగలిగినవి (అయిన)      (౧ బ బహువ్రీహి)
ద్రుమాః - చెట్లు      (౧ బ)
నిక్షిప్త-వస్త్ర-ఆభరణాః - ఓడిన వస్త్రాభరణములుగలవారు (అయిన)      (౧ బ బహువ్రీహి)
పరాజితాః - ఓడిపోయినవారు (అయిన)      (౧ బ ppp)
ధూర్తాః - జూదరులు      (౧ బ)
ఇవ (సన్తి) - వలెఁ (ఉన్నవి)

ఆకులూ పువ్వులూ పండ్లూ రాలిపోయిన ఆ వృక్షాలు జూదంలో వస్త్రాభరణాలు సైతం పోగొట్టుకున్న జూదరులవలెనున్నాయి॥

---

నిర్ధూతకేళీ యువతిర్యథా మృదితవర్ణికా ।
నిష్పీతశుభదన్తోష్ఠీ నఖైర్దన్తైశ్చ విక్షతా ॥ ౧౮
తథా లాఙ్గూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా ।
బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపా ॥ ౧౯

నిర్ధూత-కేళీ - (రతి)కేళిలో బొత్తిగా నలుపఁబడ్డ           (౧ ఏ స్త్రీ)
మృదితవర్ణికా - నలిపి రాల్చబడ్డ వంటిపూతలు గల       (౧ ఏ స్త్రీ బహువ్రీహి)
నిష్పీత-శుభ-దంత-ఓష్ఠీ - దంతక్షతములతో పీల్చివేయఁబడ్డ పెదవలు గల       (౧ ఏ స్త్రీ బహువ్రీహి)
నఖైః-దన్తైః-చ విక్షతా - గోళ్ళతోనూ దంతములతోనూ గాయింపఁబడ్డది (అయిన)       (౧ ఏ  స్త్రీ ppp)
యువతి - పడచు       (౧ ఏ స్త్రీ)
యథా - వలెఁ
లాఙ్గూల-హస్తైః చ - తోకతో హస్తములతో       (౩ బ)
చరణాభ్యాం చ - చరణములతోనూ       (౩ ద్వి)
మర్దితా - మర్దింపఁబడ్డ       (౧ ఏ స్త్రీ ppp)
ప్రభగ్న-వర-పాదపా - దెబ్బదిన్న శ్రేష్టమైన చెట్లు గల       (౧ ఏ  స్త్రీ బహువ్రీహి)అశోకవనికా - అశోకవనము       (౧ ఏ స్త్రీ)
తథా - (పై చెప్పబడ్డ యువతి) వలెనే
బభూవ - అయినది       (भ्वादि परस्मैपदि - भू  - लिट् प्रथमपुरुष एकवचनम्)
(నిర్ధూత, మృదిత, నిష్పీత, విక్షత, భగ్న - ppp)

రతికేళిలో నలిగిపోయిన యువతి, రాలిపోయిన వంటిపూతలతో పీల్చిపిప్పిచేయఁబడ్డ పెదవితో, గోళ్ళతోనూ పళ్ళతోనూ చేయఁబడ్డ గాయాలతోఁ ఎలా వుంటుందో, హనుమంతుని తోకతోనూ కాళ్ళుతోను మఱియు చేతులతోనూ మర్దింపఁబడి కొమ్మలు విరిగిన చెట్లతో అశోకవనము అలా వుంది।

---

మహాలాతానాం దామాని వ్యధమత్తరసా కపిః ।
యథా ప్రావృషి విన్ధ్యస్య మేఘజాలాని మారుతః ॥ ౨౦

మహాలతానాం - గొప్పతీగల      (౬ బ)
దామాని - దండలను      (౨ బ)
కపిః - కోతి      (౧ ఏ)
తరసా - వేగముగా      (తరస్ ౩ ఏ)
వి-అధమత్ - తుత్తునియలు చేసాడు      (दिवादि परस्मैपदि - व्यध् - लङ् प्रथमपुरुष एकवचनम्)
యథా - ఎటులనగా
ప్రావృషి - వానాకాలంలో      (ప్రావృష్ ౭ ఏ)
విన్ధ్యస్య - వింధ్యపర్వతము యొక్క      (౬ ఏ)
మేఘజాలాని - మేఘసమూహాలను      (౨ బ నపుం)
మారుతః - (తండ్రి అయిన) వాయువు (చెల్లాచెదరు చేయునట్లే)      (౧ ఏ)

వర్షర్తువులో వింధ్యశిఖరాలను ఆశ్రయించిన మేఘజాలాలను వాయువు చెల్లాచెదరు చేయునట్లే హనుమంతుఁడు ఈ అశోకవనంలోని దట్టమైన తీవెలగుంపులను వేగంగా తుత్తునియలు చేశాడు।

1 comment:

  1. अये राकेश कथं शक्योऽहं कर्णाटकभाषामवगन्तुम् ? यदि तु गीर्वाचा (गीर्वाच् इति प्रातिपदिकम् , "ब्राह्मी तु भारती भाषा गीर्वाग्वाणी सरस्वती" इत्यमरकोशः) लिख्यते, तदा किल साधु प्रतिवक्ष्यामि ।

    ReplyDelete