భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 12, 2007

రెండు కులాలు, దీపావళి, మహాకవి, మంగతాయారు

స్కంధము ౧
గురువారం కుటుంబం పనిమీద బెంగుళూరు వెళ్లవలసివచ్చింది. అసలు పని గంట మాత్రమే. ఎలాగూ వెళ్లానుగా అని చెప్పి "ఈ డాకుమెంటు ప్రపంచంలో నాకు ఇంకా మంచి స్థానం కల్పించే నాలుగు డాకుమెంట్లు పోగేసుకుందా"మని నేను ఒక రాత్రికి బెంగుళూరులోనే వుండిపోయాను. గురువారం బెంగుళూరుకు శెలవు. ఇక్కడ (తమిళ, మలయాళ నాడుల కూడా) నరక చతుర్ధశి నాడు దీపావళి జరుపుకుంటారు! నేను ఆ రాత్రి బెంగుళూరులో వుండి తరువాతి రోజు అంటే శుక్రవారం కావలసిన డాకుమెంట్లు సంపాదించాలని నిశ్చయించాను.

శుక్రవారం అమావాశ్య నాడు ప్రొద్దుటే మా పాత కంపెనీకి వెళ్లా. పాత మిత్రులని కలిసా. ఎం చేస్తున్నావన్న ప్రశ్నని ధీటుగా ఎదురు కొని, ఏఁవీ చెయ్యట్లేదని చెప్పా, ఒక అందమైన మళయాలీ భామకైతే అంతర్ముఖుణ్ణయ్యా అని చెప్పా. ఎం చేయబోతున్నావని అడిగినవారికి, ఏదో పెద్ద ప్లాను చెప్పి, అది చాలా కష్టం అని వివరించాను. కొంత సేపు నేను ఈశ్వరవాదినా నిరీశ్వరవాదినా అన్న చర్చ జరిపారు మావాళ్లు, మొత్తానికి నాస్తికుణ్ణని తేల్చారు! కలికాలం! సంవత్సరం నుండి మహిషాసురమర్దిని గోడకాగితం వున్న నన్ను నాస్తికుణ్ణి చేసేశారు.
అందుకే నేనంటా. రెండేకులాలండి. ఈశ్వరవాదులు, నిరీశ్వరవాదులూ.

స్కంధము ౨
మధ్యాహ్నానికల్లా డాకుమెంటు పనులన్నీ అయ్యిపోయాయి. ఖండాతరాన నాకు అప్పిచ్చిన నా ఫ్రెండుకు అప్పు తీర్చుదామని, వాడి తల్లదండ్రుల ఇంటికి బయలుదేరాను. అప్పుడెప్పుడో అమెరికాలో నాకు నాలుగు నెలల్లో ఉద్యోగమొస్తుందన్న నమ్మకంతో నాకు ఓ రెండు వేలు అప్పిచ్చాడు. నేను కాస్తా 'నాన్ పెర్ఫామింగ్ అసెట్' అయ్యి కుర్చున్నా. తన్నితే బూరెల బుట్టలో పడ్డట్టు! డాలరు విలువ పడిపోయింది. వడ్డీ కలుపుకున్నా రూపాయిల్లో వాడిచ్చినదానికన్నా తక్కువయ్యింది. మా మిత్రుడి అమ్మానాన్నా మామూలు తెలుగింటి తల్లిదండ్రులు. మాదేవూరని అడిగారు, నేను "రాజమండ్రి దగ్గరండి, పశ్చిమ గోదావరి జిల్లాలో" అని చెప్పా. పశ్చిమ గోదావరి జిల్లానా అయితే "మీరు రాజులా? కమ్మోరా?" అని అడిగారు ఆంటీ. నాకు నవ్వచ్చింది. పాత కాలపు మనషులులే అని చెప్పి నేను సమాధానం ఇచ్చా. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో తిప్పికొడితే ఆ రెండు కులాల జనాభా కలిపి పది శాతం కూడా వుండదు.

నేను రాష్ట్రం బయట చదివా కాబట్టి, అక్కడ మన ఆంధ్రులంటే, కట్నం ఎక్కువ తీసుకునే పెద్ద రైతులని అపోహ. వివాహ మహాసంతలో వారి ధర పెంచుకోవడానికే వారు ఇంజనీరింగు చేస్తారని వారి నమ్మకం. కాబట్టి వారు మామూలుగా, "మీరు తెలుగా? రెడ్లా, కమ్మోరా?" అని అడుగుతారు! ఈ రెండు కులాల జనాభా కూడా తిప్పికొడితే ఆంధ్ర జనాభాలో ౧౫శాతం కూడా వుండదు. ఎంటో మిగితా వాళ్లందరూ లేనట్టే! ఇలాంటి సమాధానాలకి నేను అడిగిన వారి బట్టి సమాధానమిస్తూవుంటా. చిరాకేసుంటే, "అదంత అవసరమా?" అని అడుగుతా, లేక పోతే ఏ బుట్టలల్లేవారో, కుమ్మరులో, అయ్యరికపాత్రులో, రాములోరి వంశంలో పుట్టిన క్షత్రియలమో, ఎఱుకలవారో, లేకపోతే ఇంకేమైనా మహత్తర కాంబో పాక్ అనో చెబుతా (మొన్నే ఒకడికి మా అమ్మ పాములు పట్టేవారు, మా అయ్య చేపలు పట్టేవారు అని చెప్పా).

కానీ నా అంత అభూతకల్పన లేని నా మిత్రుడొకడ్ని, మా మొదటి సంవత్సరం ఇంజనీరింగులో, వాడి పంతులు క్లాసులో అడిగాడు "నాకు తెలుసు మీ ఆంధ్రావాళ్లు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతారో.. కట్నం కోసం.. బీటెక్ చేస్తే ఐదు లక్షలు, ఎమ్‌టెక్ చేస్తే పది లక్షలు ఇస్తారు మీకు. ఇంతకీ నువ్వే కులం రెడ్లా, కమ్మొరా" అని. "రెండూ కాదు" అనడానికి వాడి అమాయకత్వమో, కమ్మత్వమో అడ్డుపడ్డాది. అసలే నందమూరు వాడి వూరికి చాలా దగ్గర. ప్రఫెసర్ వాడిని కొంత సేపు ఆడుకున్నాడు. ఇంకా నయ్యం, "చీపుగా ఐదు పది లక్షలేంటి సార్, వ్యవహారం కోట్లలో నడుస్తుంటే" అని సవరణ ఇవ్వలేదు. వాడికిప్పటికీ అర్థంకాదు వాడు ఆ సబ్జెక్టు ఏ కారణం చేత తప్పాడో. అదే కేరళ బదులు విజయవాడైతే మావాడు వాడిని యేస్సేవాడు! "కమ్మ కేరళందు కొంచమై యుండదా" అని సద్దుమణిగాడు.
అందుకే నేనంటా. రెండే కులాలండీ. పాసయ్యే వాళ్లు, ఫేలయ్యేవాళ్లు.

నేను చెప్పిన సమాధాని బట్టి ఆంటీగారు, మా ఆర్థిక స్థితిగతులను అంచనా వేశారనుకుంటా. చెప్పడం మరిచా. వారు కడప నుండి బెంగుళూరు వచ్చిన, స్వచ్ఛమైన రెడ్లు. కానీ మా వాడికి బెంగుళూరత్వం ఎంత ఎక్కువంటే, వాడికి 'ర'కి ఎకారం, 'డ'కి ఇకారం పెట్టడం రాదు. అలా పెట్టినా వాడు అది రెడీ అనుకుంటాడు కానీ, రెడ్డి అని వాడికి గోచరించదు. పెళ్లి సమయానికి వాడికి అర్థమవుతుంది వాడి సిలికాన్-లోయ ఉద్యోగం కంటే వాడి రెడ్డత్వమే విలువైందని!
అందుకే నేనంటా. రెండే కులాలండీ. ప్రేమించి పెళ్లిచేసుకునేవారు, ఆరీసీలో చదివినవారు.

అంతా అయ్యాక ఆంటీ నాకు ఉచిత సలహా ఇచ్చారు. "తొందరగా ఉద్యోగం చూసుకొని, పెళ్లి చేసుకొని, ఇల్లు కొనుక్కో నాయనా. అసలే బెంగుళూరులో ఇళ్ల ధరలు పెరిగిపోతున్నాయి" అని. అంకులు "ఎం మాట్లాడాలో తెలియదు" అంటూ దూషించడం మొదులు పెట్టారు. ఎంటో ఏ ఆంధ్రా తల్లిదండ్రులను చూసినా ఒకేలా వుంటారు. బాస్టనైనా బెంగుళూరైనా. ఎవరికైనా "మా అమ్మానాన్నే అనుకున్నా ఎవరైనా ఇంతేనేమో" అనిపిస్తుంది.
ఆంటి ఆమె ఆత్మసమర్ధనలో "అందుకే గదండి సామెత ఉంది 'ఇల్లు కట్టిచూడు, పెళ్లి చేసి చూడు' అని" అన్నారు. నేను దాన్ని ఈ తరానికి తగినట్టుగా "వీసా పట్టిచూడు, పిల్ల పటాయించి చూడు" అని అర్థంచేసుకున్నా.

స్కంధము ౩
ఆ పని అయ్యాక నేను అక్కడికి దగ్గరలో వున్న ITPL కి వెళ్లాలనకున్నా. అది ఒక పెద్ద ఆఫీసు కాంప్లెక్సు. భారతదేశంలోనే అతి పెద్దది కావచ్చు. నాలుగేళ్ల క్రితం అక్కడ పని చేసా. చాలా మధురానుభూతులున్నాయక్కడ. అవి నేను పూర్తిగా పెట్టుబడిదారువాదిగా (కాపిటలిష్టుగా) ఉండే రోజులు, భారతదేశం ఇంకా బీదగా వున్న రోజులు. కాబట్టి ఆ చోటును ఒక దేవాలయంగా భావించేవాడిని. ఇద్దరు ముగ్గురు యోగ్యులైన పరశురామక్షేత్రాంగనలు కూడా వుండేవారు. మొత్తం మీద నాకు చాలా ఇష్టమైన చోటు.

నా స్నేహితురాలొకమ్మాయి ఇంకా అక్కడే పని చేస్తుంది. ఆమెని కలసినట్లూ వుంటుంది, టెక్ పార్క్ చూసినట్టూ వుంటుంది అని చెప్పి నేను బయులుదేరాను. ఆమెకి ఫోను చేస్తే ఎత్తలేదు. మెసేజ్ వచ్చింది "నేను పనిలో వున్నాను, మీటింగ్ వుంది తరువాత పిలుస్తా" అని. "సరే నేను టెక్ పార్కు మాల్ లో కూర్చుంటా, నీ పనయ్యాక రా" అని మెసేజ్ పెట్టా. సరేనంది.

టెక్ పార్కుకి వెళ్లా. హెబ్బాగిలు(ముఖద్వారం) దగ్గర సెక్యూరిటసురుడు కనిపించాడు. నేనసలే నా అంకోపరి(లాప్టాప్) సంచితో, క్రెడిట్ కార్డు సేల్సుమాన్ లా వున్నాను. వాడు నన్ను ఐడీ చూపించమన్నాడు. ఎక్కడినుండి వస్తున్నావు? ఏ కంపెనీ? అని ప్రశ్నలు వెయ్యడం మొదలు పెట్టాడు. బాడ్జి చూపించమన్నాడు. నాదగ్గర లేదు. ప్రవేశం లేదన్నాడు. అప్పుడెప్పుడో అలమేలుమంగాపురంలో ఒక మహాభక్తుడు సూద్రుడు అవ్వడంచేత తాయారు గుడిలోనికి ప్రవేశం నిరాకరించరంట. కాని అతను భక్తిని ఆపుకోలేక లోనిక ప్రవేశించి, జైలు పాల్యాయడట. ఆఖరుకి రాజగోపాలాచారి అతని తరఫున వాదించి కాపాడారంట. రాజగోపాలాచారి ఎప్పుడో పోయారు కాబట్టి నేను అంత సాహసించలేదు.
అందుకే నేనంటాను. ఈ కాలంలో రెండే కులాలండి నిరుద్యోగులు, బాడ్జివున్న ఉద్యోగులూ.

ఆఖరుకి సెక్యూరిటీ అతనితో నా అమెరికా ఆంగ్లంలో వేడుకున్నా, వచ్చీ రాని కన్నడంలో వేడుకున్నా. అతను చలించక వచ్చీ రానీ ఆంగ్లలో "నో సార్. హౌ డు ఐ నో. యూ కాల్ కన్‌సరన్‌డ్ పార్టీ" అన్నాడు. నా తాయారుచూస్తే ఎవరో ఖండాతరం ఆస్వామితో టెలికాన్లో వుంది. వీడేమో ఆమెతో మాట్లాడందే లోనికి పోనియ్యనంటున్నాడు. కొంత సేపు అక్కడే నుంచుని దుఃఖించా. దేశానికి డబ్బులొచ్చి ఏం లాభం? మనిషిని మనిషి సేల్సుమాన్ కంటే హీనంగా చూడడానికా అని. అలా కొంత సేపు ఆదర్శ ప్రపంచానికి ఉపాయాలు ఆలోచించి, ఏమీ తట్టక ఇంకొంత దుఃఖించా. ఆఖరికి ధైర్యం తెచ్చుకొని, బుద్ధి కూడా తెచ్చుకుని, మా తాయారుకి ఫోను చేయమని సందేశం పంపా. ఎండలో ఎం నిలబడతాంలే అని, "ఆమె ఫోను చేస్తుంది, అప్పటివరకూ మీ ఆఫీసులో కూర్చుంటా" అని వాడినడిగా. వాడు సరేనన్నాడు.

రానారె-ఆదులు నా బ్లాగు చదివి తమ గురించి తాము సంతోషపడినట్లు, నేను "బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!" అన్న శ్రీశ్రీ జీవిత చరిత్ర చదువుతూ "వీడికంటే నా పరిస్థితి నయ్యం" అని సంతోషించడం మొదలుపెట్టా. ఓ గంటసేపు చదివా. నా ముందున్న సెక్యూరిటీ అతను. "కాల్ సెయ్యొచ్చునుగా" అని అడిగాడు బెంగుళూరు తెలుగులో. ఆమె మీటింగులో వుంది, పదైదు నిమిషాల తరువాత ఫోనుచేస్తుంది అన్నా. సరే బ్యాగ్లో ఏముంది అన్నాడు. చూపించా, వీసా పాసుపోర్టు, ఇతరత్రా డాకుమెంట్లు, రెండు దేశాల డ్రైవరు లైసెన్సులూ వగైరా. మహా కవి శ్రీశ్రీ జీవితచరిత్ర చదువుతున్నాడు. సేల్సుమాను స్థాయికి దిగజారివుండడనుకొని నన్నులోనికి పొమ్మన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. కవిత్వం చదివేవారు. క్రెడిట్ కార్డులు అమ్మేవారు.
(అన్నట్టు మీకు తెలుసా శ్రీశ్రీని రెండుసార్లు పిచ్చాసుపత్రిలో చేర్చారని !)

స్కంధము ౪
లోపలికి వెళ్లి అలా అలా ఒక గంటసేపు తిరిగా. ఎంత సేపుకూ నా అలమేలుమంగ తాయారు ఫోను చెయ్యట్లేదు. ఇంతలో ప్రాంగణం అంతా ఒక రెండు సార్లు తిరిగిన నేను, వెళ్లిపోదామా లేదా అని అలోచిస్తూవున్నా. అసలే నేను మైసూరు వెళ్లాలి. దీపావళి రోజు, మా ఇంట్లో వాళ్లు ఎం సంబరాలు చేసుకుంటున్నారో ఏఁవో. కానీ మా తాయారుని కలవకుండా వెళ్లడానికి మనసొప్పలేదు. ఆవిడేమో, ఎవరితోనో టెలికాన్ లో వుంది. నేనైనా వేచివున్నా.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన అమ్మాయిలూ, చాలా అందంగా వున్న ఆ విషయం ఎరుగక వారి కోసమే చూసే బుద్ధిమంతులైన అబ్బాయిలూ.

ఆఖరికి ఆమె ఫోను చేసి నేను ఇంకొంత సేపులో వచ్చేస్తున్నా అని చెప్పింది. నేను మైసూరు వెళ్లాలన్న విషయం ఆమెతో చెప్పలేదు. ఇంకో గంటైనా ఇంకా అత్తా పత్తా లేదు. ఈ సారి నేనే ఫోను చేసా, ఏడవ్వచ్చు అంది. నాకు లేటవుతుందని నేను బయలు దేరతానని అన్నాను. పోనీలే తాయారుని కలవకపోయినా, మంగాపురం వచ్చాగా అని ఆత్మసంతాపం చేసుకొని వెనక్కి బయలు దేరా. బస్సు స్టాండులో నించుని. మెజెస్టిక్ వెళ్లే బస్సులు వస్తాయా అని అడిగా. వస్తాయన్నాడు. కొంత సేపటికి వాల్వో ఒకటి వచ్చింది. అది మహాతాంత్రిక బెంగుళూరులో మహాతాంత్రిక సిటీబస్సు. నా ప్రక్కతను, అదిగో బస్సన్నావుగా వచ్చింది అన్నాడు వెటకారంగా. వాల్వో సిటీ బస్సులలో రేటు రెండింతలుంటుంది. నేను అతనిని, సిగ్గు విడిచి, నా నిర్జీతాన్ని దాచుకోకుండా, టికెట్ ఎంతుంటుంది అనడిగా. తెలియదన్నాడు.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. డబ్బున్నవారు మఱియు లేనివారు, తమ దగ్గర డబ్బుందో లేదో తెలియని వారూ.

స్కంధము ౫
ఎక్కనే ఎక్కా. అట్లాంటాలో బస్సెక్కినట్టుంది అచ్చంగా. బయటేమీ కనిపించట్లేదు. అద్దాలకి నిండా పొష్టరుండడం వలన బయటేఁవీ కనిపించట్లేదు. దూరం పాతిక కిమీలు. టికెట్టు పదిహేనంట. మీకు కూడా పదిహేనని వినిపించిందా. కాదు యాభై. ఫిఫ్టీ! పోనీలే అని ఇచ్చా.
ఈ అమ్మాయిలని నమ్ముకోకూడదు, ఎప్పుడూ ఇలా నమ్మించి వంచిస్తారు.
ఉ. అంగన నమ్మరాదు తన యంకకు రాని మహాబలాఢ్యు వే
భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు... భాస్కరా
అదీను, నన్ను మానేసి నా పాత రూమ్మేటుని ప్రేమించిన వారిని అస్సలు నమ్మకూడదు!
అందుకే నేనంటాను. రెండేకులాలండి. అందమైన పరశురామక్షేత్రాంగనలను ప్రేమించిన మనము, వారిని షారూఖ్ ఖాన్ శైలిలో బుట్టలో పెట్టిన మన వంగదేశ రూముమేటులు.

ఇంతలోకే ఫోను మోగింది. "హలో ఎక్కడున్నావ్ ? నా టెలికాన్ అయ్యిపోయింది" అంది తాయారు. "అయ్యో నేను బస్సెక్కాసానే" అన్నా. అలా కొంత సేపు నేను నా పది దేశాలు తిఱిగిన యాసవున్న ఆంగ్లంలో; ఆమె తన బండీ ఱలతో, ళలతో అప్పుడప్పుడూ ೞలతో కూడుకున్న మలయాళీ యాసలో మాట్లాడుకున్నాం. ఇంతకీ అమెకి వాళ్ల దీపావళి అయిన గురువారం నరక చతుర్దశినాడూ, మనకు దీపావళి అయిన శుక్రవారం అమావాశ్య నాడూ రెండు రోజులూ శెలవులేనంట. కానీ పనుండి ఆఫీసులోనే వుండవలసి వచ్చిందంట.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. నిరుద్యోగులు, మన పండుగనాడు తెల్లవాళ్లకు బానిసలయ్యేవారూ.

తరువాత ఎఱ్ఱగౌడ బస్ స్టాండులో మైసూరు బస్సెక్కి, బెల్టు పెట్టుకున్నా. వాడు ౯౦కిమీ ప్రతిగంట వేగంతో తోలి రెండు గంటలలో ౧౩౦ కీమీలు దాటాడు. ప్రయాణంతో ప్రమాదం ఉచితంగా ఇచ్చి నన్న మైసూరులో దించాడు. అప్పటికే మావారందరూ దీపావళి జరుపుకుని నిద్రపోవడానికి సిద్ధవఁయ్యారు. నేను వరుసగా లెక్క మఱచి పోయినన్నేళ్లు దీపావళి జరుపుకోనందుకు సంతోషించి, నాలుగేళ్ల క్రితం అదే ITPLలో పని చేసే వేరే పరశురామక్షేత్రాంగని తో దీపావళి నాడు బ్ససులో తిరగడం గుర్తుతెచ్చుకొని, నిద్రలోకి జారుకోవడానికి ప్రయత్నించా.

జీవితం మొత్తం మీద మూడ నాలుగు దీపావళులకన్నా ఎక్కువ ఎప్పుడూ జరుపుకోలేదేమో. దానికి తోడు ఈ మధ్య భూవాతావరణ ప్రేమ ఒకటి అపారంగా పుట్టుకువచ్చింది. అప్పుడెప్పుడో దగ్గర దగ్గర పన్నెండేళ్ల క్రితం దీపావళికి మందులులేవేంటి అని అడిగితే, మా అమ్మ డబ్బులిచ్చి, మాలపల్లి పంపించి, కొనుక్కు తెచ్చుకోమన్న విషయం గుర్తొచ్చి, తెలియన బాధ చాలా వేసింది. చాలా దీపావళులతో పోలిస్తే ఈసారి దీపావళి బాగానే అయినట్టే.
అందుకే నేనంటాను. రెండేకులాలండి. దీపావళిని సంతోషంగా జరుపుకునే వారు, మానసిక వైద్యుల అవసరం వున్నవారు.

గుఱజాడ వాక్కుః రెండే కులాలు. వివేకులు, అవివేకులు.

16 comments:

  1. భలే నవ్వొచ్చింది. ఒకరి కష్టాలు మరొకరికి నవ్వులాట అని అనిపిస్తుందా....
    అవునండీ రెండే కులాలు, కష్టపడే వారు వారిని చూసి నవ్వే వారు.

    అన్నట్టు పరీక్షా వ్యాఖ్యతో స్టార్టర్ కూడా మీరే పెట్టేసారే... :)

    అదీను ఈ కింది వాక్యంలో ఏదో తేదా గా తోస్తుందేంటో చెప్మా...???
    రెండేకులాలండి. డబ్బున్నవారు మఱియు లేనివారు, తమ దగ్గర డబ్బుందో లేదో తెలియని వారూ.

    మీరు బెంగుళూరు కొచ్చి భామల వెంట గంటలు వృధా చేసి మమ్మల్ని కలవకుండా వెళ్ళినందుకు మాత్రం క్షమించను...

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. @ ప్రవీణ్
    బ్లాగు మూసలు మారుస్తున్నా అందుకనే పరీక్షా వ్యాఖ్యలు వ్రాయవలసివస్తుంది.
    ఇక భామల వెంటంటారా...
    నెయ్యములల్లో నేరేళ్ళు
    వొయ్యన వూరెడి వువ్విళ్ళూ
    వుండే మంగతాయార్ల వెనక బడక ఏం చేస్తాం :)

    @ రానారె
    మీ వ్యాఖ్య అస్సలు అర్థం కాలేదు :(

    ReplyDelete
  4. నిజమే. రెండేకులాలండి.
    1. అహం గలవారు
    2. మొదటికులంవారి అహాన్ని తృప్తిపరచే వారు

    ReplyDelete
  5. ఆ మాత్రం అర్థమయ్యింది కానీ. దాని వెనక దాగున్న లోతైన భావం గోచరింపలేదని నా ఉద్దేశం..

    ReplyDelete
  6. పెద్దగా లోతేమీలేదు. :) ఈ టపాల్లోని రకరకాల "రెండే కులాల"ను చూసి నేనూ రెండు కులాలను తయారు చేశా. మనుషులందరూ ఈ రెండు కులాలనూ అవసరాన్నిబట్టి మార్చుకుంటూ వుంటారన్నది నేను గమనించిన సంగతి. "రానారె-ఆదులు" కూడా ఇందుకు మినహాయింపు కాదని భావము. :)

    ReplyDelete
  7. Excellent narration. Too good.

    ReplyDelete
  8. "కమ్మ కేరళందు కొంచమై యుండదా"
    వాడి సిలికాన్-లోయ ఉద్యోగం కంటే వాడి రెడ్డత్వమే విలువైందని!
    --Bravo!!
    (మొన్నే ఒకడికి మా అమ్మ పాములు పట్టేవారు, మా అయ్య చేపలు పట్టేవారు అని చెప్పా).
    - Remember "August, English!"?
    పరశురామక్షేత్రాంగన = Kerala girl? How??

    ReplyDelete
  9. చక్కటి కథనం!

    "మొన్నే ఒకడికి మా అమ్మ పాములు పట్టేవారు, మా అయ్య చేపలు పట్టేవారు అని చెప్పా"

    నాకు కులపిచ్చి లేదు. ఎదటి వాడిది ఏ కులమయ్యుంటుందబ్బా అని ఆలోచించను గానీ 'నేను ఫలానా కులం' అనే స్పృహ మాత్రం ఉంటుంది. అందుకేనేమో కులం పట్ల మీరు చూపించినటువంటి నిరపేక్ష నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే మీకు అభినందనలు. (అది అభినందనీయమని మీకు అనిపించకపోవచ్చు గానీ, నాకనిపిస్తోంది!)

    ReplyDelete
  10. పరశురామక్షేత్రాంగన = South Canara / dakShiNa kannaDa girl.

    Generaly South Canara used to be known as (or, they call it as) parasuraama kshetra

    ReplyDelete
  11. భలే ఉంది మీ రెండు కులాల క్లాసిఫికేషన్!

    ReplyDelete
  12. రాకేశా! మీ కులాల వర్గీకరణ బహు బాగుంది.రానారె అన్నట్లు అవసరాన్ని బట్టి,అవకాశాన్ని బట్టి కులాల సమీకరణ మారుతుంటుంది...ఇంతకీ పై కులాలలో ప్రస్తుతం మీదే కులం? :)

    గురజాడ వారి వాక్కులో నేను రెండవ కులానికి చెందినవాడిని,మహిశాసుకరమర్ధిని అంటే ఏమిటో అర్ధం కాలేదు :(
    -నేనుసైతం

    ReplyDelete
  13. పరశురామక్షేత్రం - పరశురాముడు గొడ్డలి విసిరి సముద్రాన్ని వెనక్కి పంపించి సృష్టించిన ప్రదేశం.
    ఇందులో కేరళ, తీర కర్ణాటక, గోవా, దక్షిణ తీర మహారాష్ట్ర ప్రాంతాలు వున్నాయి.
    నేనిక్కడ వాడింది.. మలబారీ అమ్మాయి అని అర్థంలో.

    @ పాళీ
    మీరు మరీ remember అని బెంగాలీ ఆంగ్ల నవలని పేర్కొంటే, మాకెలా తెలుస్తుంది ? :(

    @ చదువరి
    నిరపేక్ష బాగుంది పదం.

    @ సౌమ్య
    ఏదో మీ దయ.

    @ నేను సైతం
    చెప్పాగా మా అమ్మవాళ్లు ఆంగ్లో ఇండియన్లు, మా అయ్యవాళ్లు ఫ్రెంచి ఇండియన్లు... :D
    నా వాలుపేపర్ మహిషాసురమర్దిని. క అచ్చుతప్పు.

    ReplyDelete
  14. కళ్ళు తెరిపించారు .సూపరు.

    ReplyDelete
  15. రాకేశ్వరా, పరశురామ క్షేత్రము కన్యాకుమారి నుండి గోకర్ణ వఱకే నని నేను అనుకొంటున్నాను. ఏడు పరశురామ క్షేత్రాలు ఉన్నాయి తెలుగు వికీపీడీయాలొ ఆ వివరాలు లభిస్తాయి.

    ReplyDelete
  16. @ రాధిక
    నెనర్లు
    @ బ్లాగేశ్వర
    గోవా కొంకను (దక్షిణ తీర మహారాష్ట్ర) లలో ని జనులు (సారస్వత బ్రాహ్మలు) కూడా పరశురాముడే వారికి భూమి ఇచ్చాడని చెబుతారు, కాబట్టి వారిని కూడా జతచేసాను.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం