భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 26, 2007

నా దృష్టిలో "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం"

రవీయం అనే బ్లాగులో గడ్డం రవీంద్రనాథగారు వ్రాసిన "జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణం" టాపా చదివి దానికి నేను వ్రాయదలచిన వ్యాఖ్య మరీ పెద్దదయ్యే సరికి ఇలా ఇక్కడ టాపాగా వెస్తున్నా, ఎప్పటికైనా వుంటుందని. బ్లాగుల్లో ఇలాంటి 'విలువైన' టపా చదివి చాలా రోజులైంది. చదివిన తరువాత మనల్ని స్వల్పంగా ఆలోచింపజేసే టాపా (ఎక్కువ ఆలోచన మంచిది కాదు అ.నా.అ). ఒక నిర్దేశిత ఆలోచనా విధానంలో ఒక తాత్విక అంశం మీద బాగా వ్రాసారు. అలాంటి అంశాలమీద, ఎవరైన చర్చిస్తుంటే, నాకు చాలా సార్లు అర్థంలేని ప్రేలాపన అనిపించి ఎక్కువగా చర్చకి దిగను. ఈ టాపా అర్థంకావాలంటే అది చదవాలి మీరు.

"మరణభయాన్ని విశ్లేషించి చూస్తే , మరణించేటపుడు పొందవలసిన దేహ బాధ పెట్టే భయం కన్న , మరణం తరువాత నేను మిగలను అనే విషయం తెచ్చే భయమే ఎక్కువ అని తేలుతుంది."
ఈ విషయం నాకు తెలియనిది. నాకు స్వతహాగా మరణంలో వున్న బాధంటేనే భయం ఎక్కువ. నాకు పెద్ద మంచి జ్ఞాపకాలూ, అనుభవాలూ లేకపోవడం కారణం కావచ్చు. పెళ్లయిన వాళ్లు, పిల్లలున్న వాళ్లు, లేక తల్లిదండ్రుల పట్ల పెద్ద పెద్ద బాధ్యతలున్నవారికి ఇది బాగా వర్తిస్తుందనుకుంట.

"చాలావరకూ మన మతాలన్నీ ఆత్మ శాశ్వతమనీ , పునర్జన్మ అనీ , రకరకాల వివరణలు ఇస్తూ మనం శాశ్వతమనే నమ్మకాన్ని మనలో కలిగిస్తున్నాయి .....ఏదో విధంగా కొనసాగుతామని నమ్ముతూ మనలో ఉండే మరణభయాన్ని తగ్గించుకుంటాం... కానీ జిడ్డు కృష్ణ మూర్తి గారు మనం శాశ్వతమని నమ్ముతూ మరణభయం తగ్గించుకోవటం కాకుండా , ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు కాబట్టి మనమూ శాశ్వతం కాదు అని చెప్పడం ద్వారా మరణ భయాన్ని తగ్గించుదామని చూస్తాడు."
నాకైతే మనం శాశ్వతంకదా అనే నమ్మకం వలనే మరణభయం తగ్గింది. అంటే, ఆ ప్రక్రియ నాకు బగా పనిచేస్తుంది.


"శాశ్వతంగా కొనసాగుతూ ఉండటం అనే దానిలోనే కొత్తదేదీ రాకపోవటం అనే అర్ధం కూడా ఉంది కదా. "

ఒక జన్మతో ఇంకోదానికి భౌతికంగా నిమిత్తం లేకపోవడం వలన, కొత్తదనం వస్తూనేవుంటుందనవచ్చు. ఇక జన్మ జన్మకీ ఆత్మ అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో మనం 'నిష్కామంగా' ధర్మాన్ని ఆచరించవచ్చు. అంటే ఎలాగూ పోయేదానికి నిజాయితీగా వుండి ఏం లాభం, లేక భగవంతుడు ఉన్నాడో లేడో తెలియనపుడు నిజాయితీగా వుండి ఏం లాభం అనుకోకుండా. ధర్మబద్దంగా వుండడం నిర్వాణసోపానమధిరోహణముగా భావించవచ్చు. భౌతిక వస్తువులు మఱియూ అంశాలూ శాస్వతమని నమ్మడం మూర్ఖత్వం అని వివేకులకు ఎఱుకే. కానీ ఆత్మ శాశ్వతమనీ, అది పురోగమిస్తుందనీ నమ్మడం చెడు కాదు!

"మనకు గల నమ్మకాలనూ , జ్ణాపకాలనూ , అనుబంధాలను అంతమొందించటం వీలైతే , అంటే ప్రతిదినం వాటి పరంగా మరణించటం వీలైతే , ప్రతి రేపటి దినం పునరుజ్జీవనం సాధ్యపడుతుంది"
చాలా బాగా చెప్పారు. చాలా మతాల్లా, పై ఆదర్శాన్ని సాధించడానికి ఒకే విధానం వుంది అని చెప్పడం కంటే, ఎవరి విధానం వారినే చూసుకోమనడం ఇంకా గొప్ప!
ఇక ప్రతి రోజూ మరణించే విషయమై..
నేటి జీవితంలో, ప్రజలు పనిచేసేదంతా ఎప్పటీకీ రేపుగా మిగిలిపోయే రేపు కోసమే! పిల్లలు పుట్టినప్పటినుండీ వారు విశ్వసంపన్నులు కావాలన్న కలను వారిలోనికి పెద్దలు ఎక్కించి దాని వెనుక పరిగెత్తించుచున్నారు. ప్రతి దినం ఒకేలా వుండే వ్యవసాయం, పౌరోహిత్యం, ఉపాధ్యాయం వంటి అందమైన వృత్తులంటే, జనులకు ఆకర్షణ లేకపోగా చిన్నచూపు వుంది. ఇక ఠాగూరు మార్గాన శాంతినికేతనాలకూ, థోరో మార్గాన వాల్డెనులకూ ఎంతమంది వెళ్తున్నారు, అలా వెళ్లడం అభినందనీయమని ఎంతమంది భావిస్తున్నారీనాడు?

తిలక్ అమృత వాక్కు
అమృతం కురిసిన రాత్రి
అందరూ నిద్రపోతున్నారు
అలసి నిత్యజీవితంలో సొలసి సుషుప్తి చెందారు
అలవాటునీ అస్వతంత్రతనీ కావలించుకున్నారు
అధైర్యంలో తమలో తాము ముడుచుకుపోయి పడుకున్నారు
అనంత చైతన్యోత్సవాహ్వానాన్ని వినిపించుకోలేక పోయారు

అందుకే పాపం
ఈనాటికీ ఎవరికీ తెలియదు
నేను అమరుడనని!

6 comments:

  1. ఆలోచన ఆగదు. కాని నాకు "సమాధానం" దొరికినది ఈ విధంగా.
    "మన పుట్టుక మీద, చావు మీద మన control లేదు. మనం నియంత్రించలేము కనుక వాటి గురించి భయపడడం ఎందుకు అని." ఈ మాటలు ఎక్కడ విన్నానో / చదివానో గుర్తు లేదు.

    ReplyDelete
  2. చాలా విషయాలలో భవ బంధాలు లేనప్పటి అభిప్రాయాలు,వాటిలో చిక్కుకున్నాకా పూర్తిగా మారిపోతాయి. వాటిలో మరణం పై అభిప్రాయం మరీ ముఖ్యమైనది.రవి గారి టపాలో చెప్పిన విషయాలు బాధ్యతలు వున్నవారి అభిప్రాయాలకి దగ్గరా వున్నాయి.మీ టపా పెళ్ళికానివారి అభిప్రాయాలకి దగ్గరగా వుంది.లలిత గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.వాటిని నమ్మగలిగితే మరణ భయం వుండదేమో?

    ReplyDelete
  3. మీదృష్టి, జె కె దృష్టి ఒకే విధంగా వుండాలని రూలేమీ లేదు.
    మీరే(రూ) కరెక్ట్ కావచ్చు.
    జెకె గారు కూడా ఎప్పుడూ తనను అనుసరించమని చెప్పలేదు. శిష్యులని అంగీకరించలేదు.తనను తాను గురువు గా ఎక్కడా చెప్పుకోలేదు.
    ఏమైనా, నేను చెప్పాననుకున్నదానికీ, మీరు అర్ధం చేసుకున్న దానికీ కొంచం తేడావుందని నా అనుమానం.
    జెకె గారు ఎన్నో ప్రసంగాలలో చెప్పిన పేజీల కొద్దీ వచ్చే సంక్లిష్టమైన ఈ విషయాన్ని కొన్ని లైన్ల టపాలో చెప్పటానికి ప్రయత్నించటం లో వచ్చే ఇబ్బందే ఇది.
    మరొకసారి ఆయన వ్రాసిన The First and Last Freedam(బహుశా మీరు ఈపాటికే చదివి వుంటారు.) చదవమని కోరుతున్నా.
    ప్రపంచం మొత్తమ్మీద మార్క్సిజం ఇంచుమించుగా ఫెయిలయినా కార్ల్ మార్క్స్ గొప్పదనమేమీ తగ్గదు. అలాగే మీరూ , నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జెకె గారి గొప్పదనానికి వచ్చిన నష్టం ఏమీలేదు.
    ప్రపంచ మేధావులు, మహాపురుషులు కొత్త కొత్త ఆలోచనావిధానాలను ఆవిష్కరిస్తారు. అనుసరించాలా వద్దా అనేది సమాజం ఇష్టం.

    ReplyDelete
  4. రాకేశ్వర రావు గారు,
    చాల బాగ ఉ౦ది మీ అనిసికా.

    ReplyDelete
  5. your coment is not correct still you are in conditioning your thoughts are not free

    ReplyDelete
  6. I came here by searching in google, Today hi birthday...

    thanks

    ?!

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం