భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, October 30, 2007

అట్లాంటాలో అప్పుడెప్పుడో

కొత్తపాళీ గారి టపాలో నృత్య ఫోటోలు చూసి నాకు అప్పుడెప్పుడో అట్లాంటాలో నే వెళ్ళిన ఒక నృత్య ప్రదర్శన గుర్తొచ్చింది.
అవి ఆడుతూ పాడుతూ తిరిగే రోజులు, లెక్క ప్రకారం ఉద్యోగం వెతుక్కోవలసిన రోజులు. కానీ వీసాలు రెండు రోజులలో అయ్యిపోయేసరికి, నాలా ఆదర్శాలెక్కువా చొ౨రవ తక్కువా వున్న వారికి, అనంతమైన శెలవలు వీసా లేమి రూపంలో నాఱుమళ్లపై వర్షంలా వచ్చి పడ్డాయి.

అలాంటి రోజుల్లో ఎక్కడ ఉచిత భోజనం దొరికితే అక్కడికి పరుగెత్తుకెళ్లడం చేసేవారం. అలానే కొన్నేళ్ల క్రితం మాహాచొ౨రవుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్ర కొద్దిగా చదివా. ఆయన కూడా కాలేజీ మానేసి కాళీగా కూర్చున్న రోజుల్లో ఎక్కడ ఉతిచ భోజనం దొరికితే అక్కడికి వెళ్ళేవాడంట. మనలా నాలుగూ పాయింట్ సున్నాల వెంట పడక, చ౨దువు సగంలో లోనే ఆపేశాడు. ఆలా అన్నదానభక్షణలో భాగంగా ప్రతి శనివారం దగ్గరలో వున్న హరేకృష్ణ మందిరానికి ఐదు మైళ్లు నడిచి వెళ్లేవాడంట. ఆయన అడుగుజాడల్లో నేను కూడా మా దగ్గరో వున్న హరేకృష్ణ మందిరంలో ఆనాడు అన్నదానం వుందని తెలిసి, నడుచుకు వెళ్దామని మా మిత్రులకు సూచించా. మా మిత్రులు "ఆఁ ఎంత గ్రాడ్ స్టూడెంట్లైతే మాత్రం ఒక రెండు డాలర్లు పెట్టి బస్సెక్కి వెళ్లలేమా" అన్నారు ఎయిడ్ వుందన్న గర్వంతో.

సరే అని అందరం బస్సు స్టాండుకు వెళ్లాం. అందరం బస్సుకూడా ఎక్కాం. నేను టికెట్టు డబ్బులు కట్టా. కానీ మా మిత్రులకు దేశీ చొ౨రవ ఎక్కువే, కాబట్టి టికెట్టు లేకుండా ప్రయాణం చేసే విధానం ఒకటి కనుగొని గమ్మున కూర్చున్నారు. ఎంట్రా అంటే, "నీలా మాకు ఆదర్శాలు లేవురా" అని మంచిగా మనవి చేసారు. తెలుగు సినామా హీరోయిన్ వంటిపై వుండీ-వుండని అంగ వస్త్రాల్లాగా నన్ను కప్పీ-కప్పని నా ఆదర్శాలను చూసి నాకు సిగ్గేసింది. అంతలో వారిలో తెలివైన వాడు, "ఆదర్శఁవనేది వుత్త భ్రమ" అని నన్ను భ్రమింప జేసి, హఠాత్ పవన వీచికతో అటే తొలగింపజేసాడు నా ఆదర్శాంగవస్త్రాలను.

ఇంతకూ గుడికి వెళ్లాం, ప్రార్థన చేసాం. "ఏంటీ ఇంకా ఘుమఘుమలు ఎక్కడ తగలట్లే"దని విచారిస్తే. భక్తులు దగ్గరలోని 'పీడుమాంటు పార్కు'లో జగన్నాథుని రథచక్రాలు కదిలిస్తున్నారని చెప్పారు. మొయిల్ దారిన బయల్ దేరిన జగన్నాథ రథచక్రాల్‌ని ఇలా పార్కులలో నిర్బంధించారని దుఃఖించినా, వాటినసలు అమెరికాలో దింపినందుకు సంతోషించాము.
రథచక్రాల్ లాగిన భక్తులు, వాల్వో చక్రాలపై రానేవచ్చారు. మంచి సాత్విక భోజనం పెట్టనే పెట్టారు. వారికి పుణ్యం బాగా అందాలనే సదుద్దేశంతో మేము రెండురెండు సార్లు పెట్టుంచుకొని మరీ తిన్నాము.

ఆ తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. వారు రాక్ మఱియు రోల్ శైలిలో భక్తి పాటలు పాడారు. పర్వాలేదని పించాయి. ఆ తరువాత ఒక ఉత్తర భారతాది తల్లితండ్రులు తమ బిడ్డల నాట్య ప్రావిణ్యాన్ని చూపించడానికి ఇదే అవకాశమని చెప్పి, ఆ పిల్లల్ని బలివితర్ది ఎక్కించారు, కానీ బలైంది మాలో కొందరు. కానీ పిల్లలు కదా నేర్చుకోవడానికి ఇంకా సమయం వుందిలే.

ఆ తరువాత వచ్చారు. ముగ్గురు అప్సరసలు.
వారిలో ముందు పొడుగమ్మాయి వచ్చింది. పొడుగ్గా చాలా బాగుంది. ఆమే ఒంటరిగా భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. తరువాత ముగ్గురూ కలిసి నర్తించారు. సాల్సానో రుంబానో ఖచ్చితంగా కనిపెట్టగలను గానీ, భరతనాట్యమో కదక్కో అంత ఖచ్చితంగా చెప్పలేను. కానీ తెల్ల బట్టలు వేయలేదు కాబట్టి మా మలయాళ మోహన 'మోహినీ ఆట్టం' అయితే కాదు. పళ్ళాలూ, చెం౨బులూ లేవు కాబట్టి మన కూచుపూడీ కాదు. ఇక తెలుగు, తమిళ, కన్నడ, సంస్కృత పాటలకు నర్తించారు కాబట్టి కదక్ మఱియూ ఒడెస్సీ అవ్వవు. "ఇది భరతనాట్యమే అయ్యివుండాలి" అని నిర్దారించాను.

నృత్యం అత్యద్భుతంగా వుంది. అప్పుడప్పుడూ మనకి అనిపిస్తుందిగా "వామ్మో వీళ్లు చాలా బాగా నర్తిస్తున్నా"రని, అలా అనిపించింది నాకు కూడా. ఇక ఇద్దరు చిన్న కవల పిల్లలైతే వేదిక ముందు బుడతనాట్యం చేయడం మొదులు పెట్టారు. ఎంతైనా చాలా మఱపు రాని అనుభవం. మీతో పంచుకోవాలని ఫోటోలు కూడా తీసాను. కాని అవి మా స్నేహితుడి కెమరా ఫోనులో వున్నాయి ఖండాంతరాన. కాబట్టి ప్రస్తుతనానికి నా అద్వితీయమైన వర్ణనా ప్రతిభ మీదే మీరు ఆధారపడి సరిపెట్టుకోవాలి.

సాంప్రదాయమైన భరతనాట్య దుస్తుల్లో వున్న వారు దేశీయులా అమెరికన్లా అని చాలా సేపు అనుమానపడ్డా. చూడడానికి పదహారణాల తెలుగమ్మాయిల్లావున్నారు. కానీ ఆఖరుకి వారు ఇద్దరు తెల్ల అమ్మాయిలూ, ఒక నల్ల అమ్మాయీ అన్న కఠువు నిజాన్ని దిగమింగుకున్నా. ఎంటో వోణీ వంటివి వేస్తే ఎవరైనా మన తెలుగమ్మాయిల్లానే వుంటారు. వారి గురువు ఓ తెల్ల ఆయన, ఆయన నిక్షేపంగా నిక్కరేసుకొచ్చారు, పైగా నెత్తిమీద బ్లాండు జుట్టు వుంది, కాబట్టి ఈయన నూరు సెంట్ల అమెరికన్ అని కొట్టొచ్చినట్టు తెలుస్తుంది. వారి పాఠశాల ఫ్లారిడాలో వుందిట.

అంతా అయ్యిపోయాక దక్షిణం(సరైన పదం తెలియదు) అడగడానకి దోసిళ్లతో ప్రేక్షకుల మధ్యకి వచ్చారు. చేతులు చాచని అమెరికాలో ఇలా అహంకారాన్ని చంపుకోవడం చాలా అభినందించవలసిన విషయం. ఆ అమ్మాయి దగ్గరకొచ్చి అడిగే సరికీ, 'ఆః' లో వున్న నేను జోబులో వున్న డబ్బంతా చేతికిచ్చేసా. మాజీ విధ్యార్థి, కొత్త నిరుద్యోగిని కాబట్టి, చిల్లరతో కలిపి ఐదు డాలర్ల కంటే ఎక్కువేం లేదు. కానీ ఇచ్చిన తరువాత తెలిసింది ఇంటి కెళ్ళడానికి బస్సు టికెట్ డబ్బులు కూడా లేవని.

మా మిత్రులేమో, భోజనం అయ్యిందిగా అని, నృత్య ప్రదర్శన కోసం ఆగక బస్సుకోసం రోడ్డు మీద నించున్నారు. అవకాశవాదులూ, దురదృష్టవంతులూ ఏం చేస్తాం. ప్రదర్శన అయ్యిన సమయానికి నాకు ఫొను చేసి "నీ కోసం బస్సు ఆపాం, తొందరగా రా" అని ఫొను చేసారు. నేను పరిగెత్తుకు వెళ్లి, షూలు ధరించి, మైదానాలు దాటి, అగడ్తలు దూకి, రోడ్లు లంఘించి, సిగ్నల్లు లక్ష్యపెట్టక, ప్రాణాలు పణంగా పెట్టి, నా కోసం ఆగిన బస్సెక్కి, నా కోసం ఆపిన బస్సారథికి ధన్యవాదాలు తెలిపి, ఊపిరందుకుని, తీఱికగా నా దగ్గర టికెట్టుకి డబ్బు లేదన్న విషయాన్ని గ్రహించాను.

డబ్బు లేని చోట ఆదర్శాల లేమి టిక్కెట్టు పెడుతుంది. అవి రెండూ లేనప్పుడు చొ౨రవ టిక్కెట్టు పెడుతుందన్నది వేదవాక్కు. కానీ అది కూడ లేని వాడికో? సిగ్గు లేమి టికెట్టు పెడుతుంది! తమ కోసం కూడా టికెట్టు తీసుకోని మా మిత్రులు నా కోసం రెండు డాలర్లు వెచ్చించారు. ఆ అనుభవం కూడా ఎంతో మఱపురానిది.

Saturday, October 13, 2007

నిరుద్యోగులు

అంతేలే, నిరుద్యోగ రెజ్యుమేలు !
కంచల్లే మ్రోగే ఖాళీ చెంబులు !
మానవ వనరుల భామల బల్లలపై,
పింగుపాంగులాడే కుంటి కుందేళ్లు !

అంతేలే, నిరుద్యోగ ఈమెయిళ్లు !
వ్యాకరణం వాడని తిరస్కారములు !
అసమర్ధ చితులుండే శ్మశానాల్లో
కాలని కళేబరాల పేలని పుఱ్ఱెలు !

అంతేలే, నిరుద్యోగుల అర్హతలు !
సిగ్గువిడిచిన సినిమా హీరోయిన్లు !
నత్తనడకన సాగే ఎకానమీకి,
నివాళులొసగు హారతి కర్పూరాలు !

అంతేలే, నిరుద్యోగ జీవితాలు !
జీతం పెట్టని మహోద్యోగాలు !
శోకమనే సెలయేటిలో కాగిన
పాకంపట్టని గులాబ్జామూఁలు !

అంతేలే, నిరుద్యోగ భోజనాలు!
పూరీలు, పరాటాలు, పులావులు,
పాల పాయసాలు, పెసరపప్పు చార్లు !
పర్సు కాళి గాని పేగు కనలనీరు !


లంకెలుః పేదలు, శ్రీశ్రీ, Les Pauvres, Emile Verhaeren

Sunday, October 07, 2007

బుక్కులు

వైరు లెస్సు,
లిప్పు కిస్సు,
సెక్సి మిస్సు-
కామంగా చూడకు దేన్నీ!
సోది మయమేనోయ్ అన్నీ!

బీరు బుడ్డి,
మఱుగు దొడ్డి,
ఎఱువు చెడ్డి-
నీ వైపే చూస్తూ వుంటాయ్!
తమనింకా ఏస్‌కో మంటాయ్!

ఉచ్చమల్లి,
పచ్చ కిల్లి,
వెచ్చ బుల్లి-
కాదేదీ బ్లాగు కనర్హం!
ఔనౌను టపాలనర్ఘం!

ఉండాలోయ్ బ్లాగావేశం!
కానీవోయ్ నస నిర్దేశం!
దొరకవటోయ్ హిట్లశేషం!
నోరంటూ వుంటే మెక్కి,
బ్లాగుంటే వ్రాసీ!

బ్లాగ్లోకమొక మురికి వరద!
బ్లాగడమొక తీరని దురద!


బ్లాగ్బహిష్కరణ చేసుకోవాలనుకున్నా కానీ, ఆముదము తాగిన వాడికి విరేచనం వచ్చినట్లు సృజన శక్తి పేగుల్లో దట్టిగా నిండి వుంది. 'విసర్జన' చేస్తే కాస్త అంత్రానలము చల్లారుతుంది, తెలుగు సాహిత్యానికి తీరని నష్టమూ తప్పుతుందని ఈ టపా వేస్తున్నాను! ఇంకో సారి చదివి మరీ ఆస్వాదించిండి.

ఈ కవనశిఖరాన్ని అధిరోహించడానికీ, పూర్తిగా ఆస్వాదించడానికీ కొన్ని లంకెలు
మహాప్రస్థానం, శ్రీశ్రీ, హ గణం, బ్రౌణ్యం
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం