భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, July 10, 2007

మరుగుదొడ్ల వ్యవహారం

అన్నంత పనీ చెసే బాలకృష్ణ అభిమానిని కాబట్టి క్రిత బ్లాగులో ఇచ్చిన మాట ప్రకారం ఈ శీర్షికతో ఈ టపా. కాని పెట్టాలిగా అని పెట్టలేదు. శీర్షికకు టపా న్యాయం చేస్తుందంటే నమ్మండి. శీర్షికకు ఉన్న అన్ని అర్థాలుకూ టపా న్యాయం చేస్తుంది.

అర్థము ౧
మరుగుదొడ్లను మూత్ర'ఆలయాల'ని ఊరికే అనలేదు. అవి శుభ్రానికి ఎంతో అవసరం, పైగా శుభ్రం భగవంతునికి మిక్కిలి ప్రీతిపాత్రం, కాబట్టి అలా అన్నారు. క్రిత టపాలో విసర్జన కొంత ఎక్కవయ్యింది కాబట్టి ముందుగా దానిని శుభ్రం చేద్దాం. ఉదాహరణకు హ999 అన్నారు కొందరైతే! దూషించడానికికూడా హద్దులు ఉండాలికదా, నాకు దాని అర్థం తెలియదుకాని, దానికి చాలా లోతైన అశ్లీలమైన అర్థం ఉంటుందని నా పేగుల భావన (gut feeling)! బ్లాగ్కుటుంబం మనది, తెలుగు తల్లి మనది. అది ఎంత క్లీషే అనిపించినా, మన శుభ్రానికి ఆ సెంటిమెంట్ ఎంతో అవసరం. అంటే తోటి బ్లాగరబ్లాగరీమణులు మనకు అయ్యల్లాగా, అమ్మల్లాగా, అన్నల్లాగ, మరదళ్ళాగా దాపురించాలే తప్ప, వారిని దూషించడం, వారి పరస్పర దూషణలను దూషించడం, చాలా దూషార్హితం. కాని నా దూషణా సిధ్ధాంతాలను ఉల్లంఘించలేను కాబట్టి వారిని దూషించలేను. అలాగే, ఎవరు ఎలాంటి వ్యాఖ్యానం చేసినా వారి వాక్స్వాతంత్రాన్ని గౌరవించి వాటిని తొలగించను, కాని ఆ ఘోరానికి కూడా ఒడిగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేనండి మా కుటుంబం, నేను ఒకసారి పక్కకు తిరిగితే, అందరూ కొట్టుకోవడం మొదలు పడతారు.
ఇంకో సవరణ: నేను నా బ్లాగులో ప్రస్తావించిన బ్లాగులన్నీ చాలా మంచివి. నేను హాస్యం కొరకే ఆ టపా వ్రాసాను. నాలాంటోళ్ళు ఎదో సందర్శకులను లెక్కేసుకుంటారు గానీ, నిజమైన బ్లాగర్లకు అది అసలు లెక్కుండదు. నాకు క్రితం టపా ఒ నాలుగొందల మంది దర్శించారన్న సంతోషంకన్నా ఒ నాలుగురు దూషించుకున్నారనే బాధే ఎక్కువ. (ఎదో పాత తెలుగు సినిమాలో వెన్నలాంటి మనసున్న కథానాయకుడి మాటలా లేదు?)

అర్థము ౨
నేను మొన్ననే అమెరికా నుండి వచ్చా. (ఎదో కొత్త తెలుగు సినిమాలో పొగరబోతు కథానాయిక మాటలా లేదు ?).
నాకున్న వ్యాపార దృక్పదం నాకు భారతదేశంలో ఎన్నో వ్యాపారావకాశాలు చూపించనది. అందులో ముఖ్యమైనది, మన రోడ్లు అమెరికాలోని రోడ్లతో పోల్చుకుంటే చాలా బాగుంటాయి కానీ, మన ఫ్లష్లు మాత్రం అక్కడి ఫ్లష్లకు ఎంతో వెనకబడి ఉన్నాయి. దానికి కారణం అక్కడ మలకలాచీల ముఖ్య గొట్టానికి ఒక తొండంలాంటి ఆకారం ఉండడం వల్ల suction బాగా కుదురుతుంది. కావాలంటే అమెరికాలో ఉంటున్న మన బ్లాగు మిత్రులను అడగండి, వారికి భాష నాకన్నా బాగా వచ్చు కాబట్టి ఇంకా మంచిగా వివరించగలరు.
ఇంతకీ విషయం ఎంటంటే, మనలో ఒకరు, అలా తొండం ఆకృతితో ఉన్న గొట్టాలని ఉపయొగించి, పింగాణీ మలకలాచి(toilet bowl)లను తయారు చేసి, వాటికి తొండందేవర పేరు పెట్టి (మన ఇన్సిపిరేషన్ ని ఎప్పుడు మరచిపోకూడదు), అమెరికా నుండి ఇప్పుడే దిగిన ఉపాయమని మార్కెట్ చేస్తే డబ్బే డబ్బు. మీరు నాకు రాయల్టీ పెద్దగా ఇవ్వక్కర్లేదు. కలాచికి పది పైసలిస్తే చాలు. మీకు సినిమా హీరో కష్టాలు ఉంటే అది కూడా మినహాయిస్తా.

అర్థము ౩
నేను ఉద్యోగం వెతుక్కోవాలి. హైదరాబాదు దుమ్ము పొగా చూసేసరికి, ఇంకా ప్రేరేపితమయ్యా. కాబట్టి నేను టపాలు వెయ్యడం బాగా తగ్గిచ్చేస్తున్నాను. ఇప్పటికే ఇంట్లోవాళ్ళు, నేను 'టాయిలెట్'కి 'మరుగుదొడ్డి' ఇంకా 'టైం'కి 'సమయం' అనేసరికి నన్ను వీలైతే మానసికవైద్యుల దగ్గరికి, కుదరకపోతే, భూతవైద్యుల దగ్గరకి తీసుకెళ్తామంటున్నారు. నాకు ఉద్యోగం లేకపోవడానికి అదే కారణమని భావిస్తున్నారు !

అర్థము ౪
నేను మొన్న రామోజి సినిమా నగరానికి వెళ్ళా. అక్కడ లోనికెళ్ళే ముందు ద్వారపాలకుణ్ణి అడిగా, "ఎవండి, లోపల మరుగుదొడ్లు ఉంటాయా" అని. అసలే నేను ఆరు జేబుల పాంటు, టెన్నిసు షూలు దరించి ఉన్నా, కాబట్టి అతనికి నేనేమడిగానో అర్థం కాలేదు. మళ్ళీ అడిగా మళ్ళీ అర్థంకాలేదు. మా అమ్మ, కన్నబిడ్డ పడుతున్న కష్టం చూడలేక, "టాయిలెట్ బాబు" అని వివరించింది. లోనికి వెళ్ళిన తరువాత కూడా ఇంకో ఉద్యోగితో ఇదే చిక్కు. ఈసారి పక్కన ఎవరూ లేక పోవడం వల్ల నేనే ఆ ఆరక్షరాల పదం అనవలసి వచ్చింది.

శ్రీరామచంద్రమూర్తికే తప్పలేదు కష్టాలు మనమెంత.

6 comments:

 1. మలకలాచినా ఈ పదం ఎప్పుడు వినలేదే వింతగా ఉంది. టాయిలెట్ బౌల్ ని కమోడు అంటారని, చనిపోయిన డయానా భర్త చార్లెస్ అబ్బిగానికి కమోడ్లను సేకరించే హాబీ ఉందని ఎప్పుడో ఈనాడు ఆదివారం సంచికలో గుర్తు (అందుకే కాబోలు...)

  ReplyDelete
 2. ఇంకా నయం ఇంట్లో వాళ్ళని, ఎవరింటికైనా వేళ్ళినప్పుడు ఆ ఇంటివాళ్ళని అయ్య అల్పాచమానం చేసుకొవాలి, చేసుకొనే ఏర్పాటు చూడండి అనికాని లేక నాకు దీర్ఘ శంక, లఘు శంక టిర్చు కోవాలి, అవి తీర్చు కొనే ఏర్పాటు చేయండి అని అంటే వేంటనే మీకు ఎర్ర గడ్డా ఆసుపత్రే గతి-- మాటలబాబు

  ReplyDelete
 3. మీరు కుళ్ళునికడగడానికీ మరీ ఇలా మరుగుదొడ్లతో ప్రారంభించడం కొంచెం అతి అయ్యి జనాలు జడుసుకుంటున్నారల్లే ఉంది.
  గడియారం, చొక్కా, పుస్తకం ఇలాంటి మాటలతో మొదలెట్టండి.

  ReplyDelete
 4. @ రవిగారు,
  http://en.wikipedia.org/wiki/Commode
  Commode అనేది ఆంగ్ల పదం రవిగారు. దానికి తెలుగు మల-కలాచి. కలాచి అనగా bowl , బ్రౌను నిఘంటువు ప్రకారం.

  @ మాటలబాబు
  మీరు వాడిన ఒక్క పదం కూడా నాకు అర్థం కాలేదు. :)

  @ sriram
  క్రిత టాపాలో ఈ శీర్షిక తో టపా వేస్తానని మాటిచ్చా, అందుకే వెయ్యాల్సివచ్చింది. :)

  ReplyDelete
 5. ఎందుకో తెలియదు కానీ అలా కమోడు గురించి ఆంగ్ల వికీలింకు తెరుస్తూ దేజావూ అనిపించింది. ఎవరైనా ఇంతకుముందు కమోడు గురించి టపా రాశారు. లేక ఇది నా నిద్రలేమి ప్రభావమా?

  ReplyDelete
 6. ఓహో! ఇప్పుడు తెలిసింది టపాలెందుకు తగ్గినాయో. ఇంత చమత్కారం మాకు కావాలన్నా, మాతృభాషమాట్లాడినాసరే నీ మానసికస్థితి మీద మీవాళ్లకు అనుమానం కలగకుండాలన్నా, నీ మాటలకు దక్కాల్సినంత గౌరవం ఉందరిదగ్గరా దక్కాలన్నా -- మీవాళ్లు కోరుకున్న ఉద్యోగం నీకు అర్జంటుగా దక్కాలని భగవంతుని ప్రార్థించాల్సిందే. "జయమ్ము నిశ్చయమ్మురా" సినిమాలో సుత్తివేలుతో పోటీపడి ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒంటికాలిమీద ఇన్‌స్టంటుగా ఘోరతపస్సు మొదలెట్టినట్లు నేనుకూడా ఇప్పుడే తపస్సు మొదలెడతున్నా ... ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ...ఓం నమఃశివాయ... అండ్ సో ఆన్ ...

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం