భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, April 18, 2008

పద్యాలు మొ||

నాలుగు నెలలుగా ఏం వ్రాయలేదు కదా. సరి ఇక్కడేదైనా నింపుదామని ఇలా...

పద్యాలు
ఈ నాలుగు నెల్లల్లో కొన్ని పద్యాలు వ్రాయవలసి వచ్చింది. వ్రాయకుంటే సమస్యల పాలవుతావని బెదిరిస్తే వ్రాయవలసివచ్చింది. వాటిని పొద్దులో అచ్చువేశారు. కానీ ఇక్కడ కూడా ఒక కాపీ వుంటే పోయిందేఁవుంది.
పద్యాలు అనగా మీరు బెదరాల్సిందేఁవీ లేదు. నా తెలుగు స్వల్పంగా యీకు కాబట్టి, పెద్ద పెద్ద పదాలేమీ వుండవు.

సమస్య - పూరణ
రాజ్యశేఖరుండు రాజ్యమేలెఁ
ఆవె. రాజకీయమిటుల రాష్ట్రముఁ జీల్చెను
ధరలుఁ దాకెఁ దివిని ధాత్రి వీడి
గుత్తెకాండ్లు గూడి గుళ్ళను దోచిరి
రాజ్యశేఖరుండు రాజ్యమేలెఁ
ప్రస్తుత రాష్ట్ర పాలన మీద వ్రాయాలంట. అదెంత సేపు. అందునా ఆటవెలది.

సమస్య - దత్తపది
కంచము, మంచము, పంచెలు, సంచులు
ఉ. కంచము కంచు దెందులకు కాయలు పండ్లును గ్రోలువానికిన్
మంచము మల్లె దెందులకు మంచి వనంబున నిద్రబోవుచోఁ
పంచెలు పట్టు వెందులకు వ్యాఘ్రపు దోలు ధరించు వానికిన్
సంచుల సొమ్ము లెందులకు సంకెలు దెంచిన యోగమూర్తికిన్
ఇది నా మొదటి వృత్తము. నర్సరీ పాటలా బానేవుంది. పెద్ద అలంకారాలేమీ లేవు కానీ, మొత్తాని ఈ జీవితంలో ఒక వృత్తం వ్రాసినందుకు సంతోషం. దీన్ని రానారె నోట వినగలరు కూడాఁ పొద్దలో అందులో ఆయన నాలుగో పాదంలో ఎందులకులో ల మరచిపోయారు కానీ మీకు అది అక్కడ వుండాలని తెలియదు కాబట్టి మీరు దాన్ని గమనించరులేండి.

సమస్య - దత్తాంశము
ఉగాది
సీ. కాలముతోనాయె కారులె తురఁగలు,
యంత్రము లొచ్చెను యడ్ల బదులుఁ
సూర్యుడు తారాయె సోముడు రాయాయె,
మాఱెను మా తిండ్లు మాఱెనిండ్లు
ఎన్ని మాఱిన యిలనన్ని మాఱిన గాని,
నీవు మాత్రము యిలా నెపమెఱుఁగక
శివమహా రాత్రికిఁ శ్రీరామ నవమికిఁ
నడుమనే వత్తువు నడుమ మాకుఁ

తేగీ. ఆశనే నమ్మిన జనుల కాశ నమ్ము
కొనెడి యో పబ్బరాజమా, గురుతు నీవు
మాఱు కాలానికే, మఱి మాఱుతువని
యునికి మాది నమ్ముటయెలా యో యుగాది
సీసం మఱియు తేటగీతి. ఇవి నా మొదటి సీసం మఱియూ తేటగీతులు. ఇలా యుగాది మీద వ్రాయడం బాకుదిరింది. చాలా చాలా బాగావచ్చిందని నాకు చాలా సంతోషంగా వుంది. ఇందులో ఱ లకు పెద్దలు చలా లోతైన అర్థాలు చెప్పారు. వాటిని ఇక్కడ చూవచ్చు. ఈ పాట రానారె నోట వింటే ఎలావుంటుందో అనిపించింది, కానీ ఉగాది మీద ఇంతకంటే మంచి పద్యాలు వుండడంవల్ల, ఆ వినబడే భాగ్యం వాటికి దక్కింది.

సమస్య - పూరణ
చ. అరవిరి యందగత్తెలు తన కానరు, యీడది వచ్చి పడ్డనూ
ఉరిమిళ నన్యు లిష్టపడె నొక్కడు మాత్ర మమీరుఁ గాంచెనే
మరి యొక నాడు నన్ను గని బల్కెను మోజుగ రామనాథుడున్
నరవర నిన్నుబోలు లలనామణి నెందును గానమీ యిలన్
నేను రాసానని చెప్పుకోకుడదుగాని. ఈ పద్యం తెలుగు సాహితీ చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. స్వలింగ సంపర్కం మీద వ్రాయబడ్డి తొలి వృత్తంగా. అదృష్టవసాత్తు దీని ముందు కంచము, మంచము అనుకుంటూ పద్యం వ్రాసాను కాబట్టి సరిపోయుంది, లేక పోతే నా మొదటి వృత్తం ఇది అయ్యేది. ఇక్కడ ఉరిమిళ అనగా సినీనటి ఊర్మిళ; మాత్రమమీరు అనగా మాత్రం + అమీరు (ఆమిర్ ఖాన్) అని అర్థం చేసుకోగలరు. ఇప్పటికీ అర్థం కాకపోతే మీది కల్మషం లేని మనస్సు అని సరిపెట్టుకోండి.

సమస్య - దత్తపది
చార్మి, భూమిక, జెనీలియా, ఇలియాన
సమస్య - పూరణ - రాజశేఖరుండు రాజ్యమేలెఁ
సమస్య - పూరణ - మందుతాగి మగువ మంచ మెక్కెఁ
సీ. చారు మీగడ గంజి జావలు సద్దన్న
-మవి వీడి మత్తుగ మందు గొట్టెఁ
భూమిక యెందుకు భోజనములకైనఁ
పావలా వడ్డీకి పైడి రాగఁ
ఆ జానపదు లేవి మోజె నీలి యసహ్య
చిత్రాల పై బడె సిగ్గు లేకఁ
గడనపడతి యొక్క కౌగిలి యానం
-మున కులపడతిని తాను మఱచెఁ

ఆవె. నమ్మి వాణ్ణి నీవు, అమ్ముకున్నావోటు
రాజశేఖరుండు రాజ్యమేలెఁ
సదువులేక బతుకు సతికిల బడ్డాది
మందు తాగి మతియె మందగించెఁ
ఇది చాలా చాలా బాగుంది అని చాలా మంది అన్నారు. నా ఇష్టసంతతి అయితే కాదు. చిన్నప్పటి నుండి చిక్కులు విప్పి విప్పి (పజిల్సు సాల్వు చేసి చేసి) ఇలా పదాల్ని అటూ ఇటూ చేసి ఇఱికించడం కళ కన్నా లెక్కల ప్రశ్నలా అనిపించింది. ఒక నాలుగు అర్థాలంకారాలు లేనిదే పద్యం పద్యం ఎలా అవుతుంది చెప్పండి. కానీ ఒక్క పద్యంలో మూడు సమస్యలు పూరించడం అందరికీ నచ్చివుండవచ్చు.

అలానే అప్పుడెప్పుడో బ్లాగేశ్వర బ్లాగులో వ్రాసిన రెండు ఆటవెలదులు. ఇక్కడ పొందుపఱచడానికై.
ఆవె. బాగ జెప్పినారు బ్లాగేశ్వరామీరు
గణములిమడగ సరిగ పదములలొఁ
ప్రాసయతులు కుదిరె బలె బాగుగానును!
వ్రాయుదు రిటులేన నాశ నాది.

ఆవె. శివుని ఆజ్ఞ లేక, చీమైన కుట్టదు
ఆజ్ఞ తోనె మనకు
, ఆటవెలది
ఎంత జెప్పు కున్న యీశ్వరుని గురించి

అంత మిగిలి యుండు
, నతని మహిమ


నవతరంగం సినిమా
నేను నవతరంగానికి వ్రాయడం మొదలు పెట్టాను. మీరు బ్లాగ్విజయాన్ని సాధించాక, మామూలుగా బ్లాగు పరమపదసోపన పఠములో ఒక నిచ్చెన ఎక్కుతారు. అది ఏంటంటే, ఏ మంచి పత్రిక వారో మిమ్మల్ని సంపాదకీయం వహించమనడం. మనకు అంత సీను లేదు.
కానీ వేంకట్ గారు మాత్రం నవతరంగంలో వ్రాయమని కోరారు పాపం. రెచ్చిపోయాను. నేను అక్కడ వ్రాసిన టపాల/వ్యాసాల సంగ్రహం. తారీకులతోఁ సహా ఇదిగో ఇంద. లెక్క ప్రకారం ఇంత కన్నా ఎక్కువే వ్రాయాయల్సి వుంది కానీ ప్రస్తుతానికి ఇంతే.

Conceptual Integrity - A case study of జల్సా Apr 16th, 08 | 10 Comments »
అమెరికన్ బ్యూటీలో అందమెంత ? Mar 30th, 08 | 12 Comments »
తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా? Feb 18th, 08 | 15 Comments »
తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి! Feb 14th, 08 | 20 Comments »
తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు Jan 28th, 08 | 4 Comments »
Menolippu Mombasaan Jan 18th, 08 | Post a comment »
Teeth of Love - ప్రేమ దంతాలు Jan 18th, 08 | 6 Comments »
చిత్రోత్సవం స్థూలదృష్టి Jan 14th, 08 | 1 Comment »

పై టపాలు తెలుగు సినిమా యొక్క అభ్యుదయానికి తోడ్పడాలి మఱి. హూఁ...

అన్నట్టు
నేను ఈ నాలుగు నెలల్లో పదిహేను పేజీల నాటిక (ప్రహసనం) లాంటిది ఒకటి వ్రాసాను. దానిని అప్పటినుండి అచ్చువేయించే ప్రయత్నంలో వున్నాను. అనుకోని కారణాలవల్ల కుదరట్లేదు. కాని నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఆధునిక ఆంధ్ర రచయితకై వుండనే వుందిగా అచ్చు అక్షయ పాత్ర అంతర్జాలం!! అంతగా అయితే ఇక్కడే ఈ వేదికపైనే మీ మీదే రుద్దగలను. :D

5 comments:

 1. (ఈ టపా )అందుకేనా ఈ రోజు సెలవు ప్రకటించావు. పద్యము అని అన్నానని టపా వేశావా నాయనా?

  ReplyDelete
 2. >>"వ్రాయకుంటే సమస్యల పాలవుతావని బెదిరిస్తే వ్రాయవలసివచ్చింది."

  వ్రాసినా వ్రాయకున్నా 'సమస్య'ల పాలయినట్టే కదా! :) ఱాఁకేశ్వరుఁడు సమస్యలపాలయ్యాకే ఈ పద్యాలన్నీ బయటపడ్డాయి.

  నర్సరీ రైము కాబట్టి ఆమాత్రం తప్పులు పలికితేనే అందం. :)
  అన్ని పద్యాలూ పాడి(కట్టించి) పంపించాను. సంపాదకుల చేతుల్లో కొన్ని వడగట్టబడి గొప్ప ప్రమాదం తప్పిపోయింది. ఎందుకంటే పద్యంలోని రసాన్ని గొంతులో పలికించగల జ్ఞానం లేకపోయింది. ప్రార్థన పద్యాల దగ్గరనుంచి అన్నీ ఒకే మూసలో పోసినట్టుంటాయి మీరు వింటే.

  ఏమైనా, మీ బ్లాగులో ఇంకో టపా వచ్చినందుకు చాలా సంతోషం.

  ReplyDelete
 3. కంచము, మంచము, పంచెలు, సంచులు పద్యం బాగుందండి.
  దత్తాంశం పద్యంలో హాయిగా "కారులే గుఱ్ఱాలు" అనొచ్చు కదా?
  సమస్యాపూరణలో "అరవిరి యందగత్తెలు తన కానరు" అన్నచోట ఒక అక్షరం ఎక్కువయ్యింది.
  "అరవిరి యందగత్తె లసలానరు" అంటే సరిపోతుంది.

  ReplyDelete
 4. @ కామేశ్వర రావు గారు,
  తప్పుల చెప్పినందుకు కృతజ్ఞతలు.

  తురఁగలే కారులాయే అని వచ్చేడట్టు రాద్దామనుకుని గుఱ్ఱాల బదులు అది వాడడం జరిగింది. ఆ తరువత పదాలను అటు ఇటు చేసినప్పుడు, అది అలానే వుండిపోయింది.
  ఇంకో విషయం ఏంటంటే, తురంగము - అంటే వాహనము అని కూడా వస్తుందిగా అని.

  మొత్తానికి పద్యం వ్రాసిన తరువాత ఒక రెండు మూడు సార్లు తిరిగి చూసుకుంటే సరిపోదన్నమట, ఒక పది సార్లైనా చూడాల్సిందే :)

  ReplyDelete
 5. ఆ తేనీరు షరాయిలకి కొన్ని పద్యాలద్దరూ?

  http://nagaprasadv.blogspot.com/2008/12/blog-post_16.html#comments

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం