భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, June 22, 2008

కాపలాదారు

కాపలాదారు కాఁవుడు కుర్చీలో కూర్చున్నాడు
కాపలా కాస్తున్న కార్యాలయం కాళీగానే వుంది
కఛేరి కాళీ చేస్తున్న జనాలకు రోజు ముగిసింది
కాఁవుడికి కొత్తగా వచ్చిన రాత్రితోఁ రోజు మొదలైంది

ఆఫీసు పనిని అక్కడే విడువలేక
బుఱ్ఱవెనుక పదిలంగా బధ్రపరచి
ఇంటికి తమగూడా ఎత్తుకెళ్ళారు
వారు వదిలిన కాళీకి కాఁవుడు కాపల

రేపు వచ్చే వారం వచ్చే మాసం వచ్చే ఏఁడూ
వస్తాయో రావో తెలియని వాటి కోసం
ఉద్యోగుల దగ్గర వున్నాయి ప్రణాళికలు
పిలవని వారు పిలిస్తే పలకడానికున్నాడు కాఁవుడు

అంతరాళంలోనికి ఎగిరిపోవాలని నిత్యం
ప్రాకులాడే వారి బ్రతుకులు ఇసుకలో
కూరుకుపోకుండా కాపాడడానికి అలికిన
చలనం లేని మైదానం వాడి జీవితం

కాఁవుడి తండ్రి మైసయ్య కాపలాదారు
మైసయ్య అయ్య సిద్దప్ప కాపలాదారు
మైసయ్య మైసూరు బ్యాంకును కాసాడు
సిద్దప్ప మహారాజ అరమనె కాసాడు

కాఁవుడికి వాడితాత కాసింది రాజుగార్నని తెలుసు
సిద్దప్పకి వాడి తాత కాసింది నంజుండేశ్వరుణ్ణననీ తెలుసు
వీరిద్దరికీ తెలియని కాపలాలు వేలల్లో వున్నాయి
వందలేండ్లుగా వీరి తాతలు కాస్తూనే వున్నారు

దేవాలయాలను దరిద్రులనుండి కాసారు
పరమేశ్వరుణ్ణి కాసారు వీరు నిష్ప్రయోజకత్వం నుండి
మహారాజభవనాల్ని మన్నుకాపుల నుండి కాసారు
రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి

బ్యాంకుల్ని బడుగుబ్రతుకుల నుండి కాసారు
ధనవంతుడిని కాసారు వీరు దానధర్మం నుండి
ఇన్‌ఫోసిస్ని ఇతరులనుండి కాఁవుడు కాసాడు
సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి

బ్రాహ్మల్ని కాసారు వైశ్యుల్ని కాసారు
దేవుణ్ణి కాసారు దానవుల్నీ కాసారు
డబ్బుగా దాయబడ్డ అక్రమాల్ని కాసారు
నీతిగా ముసుగు దాల్చిన అత్యాచారాన్ని కాసారు

తమని తాము సమానత్వం నుండి
తమ పిలల్ని చదువు సంస్కారం నుండి
తమవారిని ఐకమత్యం నుండి
తమ భయాల్ని ధైర్యం నుండీ కాసారు

ఒడాయారు రాజుగారు సిద్దప్పనెఱుగడు
ఆయని గుమస్తా ఎఱిగిన వంటవాడు మాత్రం ఎఱుగును
నారాయణ మూర్తిగారు కాఁవుడినెఱుగడు
ఆయన నియమించిన పెదకాపలాదారు మాత్రం ఎఱుగును
వీరి తాతలను వీరు సైతం ఎఱుగరు
ఆయనకే తెలియాలి ఆ నంజుండేశ్వరుడైనా ఎఱుగునో లేదో

తమనెరుగని వారిని తామెరగని వాటినుంచి కాసారు
మెదడులో వారికీ వీరికీ మధ్యలో గీతలు గీసారు
రూపును బట్టి వారికిచ్చే చూపులు మార్చారు
వేషం బట్టి వారితో సంభాషించే భాషను మార్చారు

కాసి కాసి కాలం కట్టిన గోడలలో ఇటకలైపోయారు
వేచి వేచి వానలో తడిసారు ఎండలో ఎండారు
సంస్కరణతో కూలిన గోడలతో పడుతూనే
కౌటిల్యం కట్టిన గోడలతో పైకి లేచారు

గోడవతలివారికి వీరు కానరారు
గోడివతలివారికి వీరు నచ్చరారు
ఆదర్శవాదులకు వీరు శత్రువులు
ఆచరణాత్ములకు వీరెందరైనా సరిపోరు

టోపీ పెట్టినా టై కట్టినా వీరు మాత్రం నిర్విరామంగా కాసారు
జీవితాలు గడచినా వ్యవస్థలు కూలినా వీరు ఇంకా కాస్తారు
మారుతున్న మార్పులో మారనిది వీరి కాపలా మాత్రఁవే
ఎవరిని ఎప్పుడు ఎందుకు కాసినా వీరు కాసింది వ్యవస్థను

తమని లోనికి రానివ్వని వ్యవస్థను
తమ ఉనికి ఎరుగని గాఢ నిద్రలను
తమను ప్రతిష్టించిన నిధులను
తమ ప్రాణంకంటే పదిలంగా
తమనుండి తమలాంటి
తమవారినుండి కాసారు

తమ నీడ అంతఃకొలనుపైఁ బడకుండా
తమ శబ్దం సెన్సెక్సు శ్రుతి తప్పించనీకుండా
తమ అభిమానం గోడెత్తుకు ఎదగకుండా

కాపలాదారు పై అనివార్యంగా ఆధారపడ్డ వ్యవస్థను
కాపలాదారు కులం నుండి కాపలాదురు కాస్తాడు


-------------
౧) అరమనె - మైసూరు ఒడయారు రాజుల ప్రఖ్యాతిగాంచిన రాజభవనం
౨) నంజుండేశ్వరుడు - మైసూరు దగ్గరలో నంజనగాడులో వెలసిన నీలకంఠేశ్వరుడు
౩) ఇన్ఫోసిసు - మైసూరువాసి నారాయణమూర్తిగారి ఇన్ఫోసిసు
సుందరమైన క్యాంపసు సుప్రసిద్ధం

9 comments:

  1. మొన్న మనసులో మాట లో గూర్ఖా..ఎండ్లూరి సుధాకర్. ఈ రోజు కాపలాదారా? ఏమిటి వీరిపై అకస్మాతుగా ఇంత ఆసక్తి? ఎవరికి ఎవరు కాపలా? ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం లోని ఈ మధుర గీతం వినండి,

    http://www.youtube.com/watch?v=QQZHGTw1Us8

    ReplyDelete
  2. రావు గారు, నమస్తే!
    గూర్ఖా కవిత నా సొంతం కాదు కదండీ! ఎప్పుడో పదిహేనేళ్ల నాటిదనుకుంటా! నేను అది పోస్ట్ చేసిన మరునాడే రాకేశ్వర రావు గారు ఈ కవిత రాయడం పోస్ట్ చేయడం యాధృచ్చికం అనుకుంటా!

    ఈ పాట సందర్భానుసారంగా బాగా పెట్టారిక్కడ.బాగుంది.

    ReplyDelete
  3. చాలా బావుంది రాకేశ్వరా.
    అంతర్గతంగా ఉన్న లయ బావుంది.
    ఇంగ్లీషు మాటల్లో తప్ప, ఎక్కడా పరుషమైన ధ్వనులు లేకూండా బాగా నడిపించావు.
    నాకు బాగా నచ్చిన విషయం .. ఆ కాపలావాడికి ఒక పేరు పెట్టి అస్తిత్వం కల్పించడం. అతన్నొక మనిషిని చెయ్యడం.రెండే సూచనలు.
    నిడివి చాలా ఎక్కువైంది. పునరుక్తి కూడా తెలిసి వాడినప్పుడే రాణిస్తుంది .. అతి కూడదు సుమా.
    భావం ప్రవాహంలో కొన్ని వాక్యాలు అడ్డుకట్టల్ళా తగుల్తున్నై ..
    ఉదా:రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి
    సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి
    .. ఇటువంటి వాక్యాల్తో ఇంఖేదన్నా పరమార్ధం సాధించేట్టుగా తెలివిగా వాడొచ్చునేమో ..
    కాదేదీ కవితకనర్హం అని మంచి పద్యం వెలయించావు.

    ReplyDelete
  4. @ రావుగారు, సుజాత గారు
    నేను ఈ పద్యాన్ని రెండు మూడు రోజులుగా వ్రాసాను, అందకే అనుకుంట అంత పొడుగు పారింది.
    ఇంకో కాకతాళీయం ఏంటంటే,
    నేను నిన్న పిబి శ్రీనివాస్ గారి సిడి కొని తెచ్చుకున్నాను, అందులో కూడా ఎవరికి ఎవరు కాపలా అనే పాట వుంది !

    @ గురువుగారు,
    నేను జోకుకంటే మీరు నిజంగానే వ్యాఖ్య వాస్రారు మీ శిష్యబృంద ప్రయోజనార్థం. :-)

    ఇంగ్లీషు మాటలు వాడక తప్పవన్నచోట్లలోనే ఒకటి రెంటిని వాడను. వాటిలో కూడా మీకు ప్రత్యేకించి ఏదో కనబడడం నాకు అర్థంకాలేదు. అంటే ఆంగ్లపదాల ప్రభావం అస్సలు వుండరాదని వ్రాసాను నేను. కానీ ఎక్కో ఏదో తప్పు జరిగినట్టుంది.

    ఇంక రెండు మూడు రోజులుగా కాగితం మీద వ్రాయబట్టి నివిడి పెరిగిపోయింది. తీరా టపా వేశాక అనుకున్నా అరే ఇంత పొడుగుందేఁవిటి అని.

    ఇక "రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి
    సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి" వంటి వాక్యాలు నా ఆలోచనలలో అతి కీలకమైనవి. అవి లేకుండా ఈ కవిత వ్రాసేవాడినే కాను. కానీ నా భావం వేరవ్వరికి వీటి ద్వారా అర్థమవ్వదని నేను ఇప్పుడే గ్రహిస్తున్నాను.
    గద్యం అయితే వివిరించవచ్చు గాని, పద్యం గాబట్టి అర్థమయ్యిన వారికి అర్థమయినట్టు అర్థమయినంత అని సరిపెట్టుకోవాల్సొస్తుంది. :-)

    విశ్లేషణకు కృతజ్ఞతలు. నిడివి విషయం బాగా గుర్తుపెట్టుకుంటాను.

    ReplyDelete
  5. @ సుజాత గారు,
    కాపలాదారుల మీద నిర్దాక్షిణ్యంగా వ్రాసినందుకు (మీకు నచ్చిన కవితతో పోల్చుకుంటే) క్షమించగలరు :)

    ReplyDelete
  6. నా మాటలకి నీ మరుమాటలు చదివి కొంచెం తప్పుగా అర్ధం చేసుకున్నావేమో ననిపించి ఈ వివరణ.
    ఆంగ్లపదాల వాడుకకి నేను అభ్యంతర పెట్తలేదు. వాడిన చోట్ల సందర్భోచితంగానే వాడావు.
    నిడివి - ఒక్కోసారి 5 పేజీల కవిత ఒక్క లైను కూడా ఎక్కువున్నట్టు అనిపించదు. ఇంకోసారి పేజీ దాటని కవితకూడా అబ్బో ఇంత పొడుగుందేవిటీ అనిపిస్తుంది. ఈ నిడివి ఎప్పుడూ విషయానికి సాపేక్షంగానే ఉంటుంది.
    కొన్ని వాక్యాల అంతరార్ధం .. ఆయా వాక్యాల అంతరారధం (వెరసి నీ కవి హృదయం) నాకు అర్ధమైందనే అనుకుంటున్నా. నా వ్యాఖ్య అల్లా .. పద్యంలో ఎక్కడెక్కడ వాటిల్ని నిక్షేపించావు అన్నదాని గురించి.
    ఏక్చువల్లీ .. మళ్ళీ చదివితే .. ఈ వాక్యాలు కూడా బాగా ఉపయోగించావనే తోస్తోంది.

    ReplyDelete
  7. ఒక రేంజి ఫిలాసఫీ గుప్పించావు బ్రదర్. కవిత నిడివి కాస్త పెరిగినట్టనిపించింది. కాకపోతే అరెమన నుండీ ఇన్ఫోసిస్ వరకూ ప్రయాణించాలి కాబట్టి ఆ మాత్రం అవసరమేమో! దేవుడ్ని నిష్ప్రయోజనం నుండీ కాపాడటం లాంటి ప్రయోగాలు అదుర్స్, అలాగే బ్యాంకుది కూడా.

    ReplyDelete
  8. ఇప్పుడే చూసాను ఈ కవితను. చాలా కాంప్రహెంసివ్ గా ఉంది.
    enjoyed it.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  9. @ బాబా గారు,
    బాబా గారు వస్తారు, నీ కవితని చీల్చి చండాడతారు, అసలే నివిడి ఎక్కువ అని అనుకున్నాను.
    కానీ చదివి, నివిడి ఎక్కువ అనే బదులు, కాంప్రిహెన్సివ్ గా బాగుంది అన్నారు.
    చాలా సంతోషం.

    వ్యాఖ్యానించిన చదువరుల స్ఫూర్తితో ఇంకొన్నెక్కువ కవితలు వ్రాయాలని నిశ్చయించుకున్నాను (అంటే ఇప్పటిలా మఱీ సంవత్సరానికి ఒకటి కాకుండ).

    ధన్యవాదాలు.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం