భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, August 25, 2008

అందములోఁ పోతరాజుల కందములోః బొమ్మల చందములోఁ

కం. అందములొఁ పోతరాజుల
కందములోహొ సువివరముగఁ దెలుప బొమ్మల్
చందములోనన్ మీకై
పొందుపరచితి మరి నేర్చి పులకితులౌరీ

కందము గుఱించి నేర్చుకునే ముందు మనం గురులఘువుల గుఱించి తెలుసుకుందాం.

లఘువు(గుర్తు I)
సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు.
ఉదా: అ, ఇ, ఌ, ఎ, ఘి, చె, పు, తృ, వఁ, ళొ మొదలైనవి.
ఇంకో మాటలో చెప్పాలంటే గురువులు కానివి లఘువులు.

గురువు (గుర్తు U)
క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి.
ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, కౄ, చా, డం, నః, రై మొదలైనవి.
ధీర్ఘాచ్చులు లేదా వాటిని ధరించే హల్లులు గురువులౌను, అలానే ఒక అక్షరం తరువాత పొల్లక్షరం (సంయుక్తాక్షరం లేదా ద్విత్వాక్షరం) వస్తే అది కూడా గురువౌతుంది.ఉదా: అక్, విశ్, ముల్, నెన్ మొదలైనవి.

ఒక ఉదాహరణాత్మక పాదం మఱియు దాని గురులఘువిశ్లేషణ
"శారికా కీరపంక్తికిఁ జదువు సెప్పు"
శాU రిI కాU కీU రI పంక్U తిI కిఁI జI దుI వుI సెప్U పుI
గమనించ వలసిందేంటంటే సెప్పులో సె గురువు ప్పు లఘువు!

కందం
పైన చెప్పినట్టు పలకడానికి గురువుకు రెండు మాత్ర(లిప్త)ల కాలం, లఘువుకు ఒక మాత్రాకాలం పడుతుంది. అంటే లఘువుకు రెండింతల కాలం పడుతుంది గురువుకి. కందపద్యాన్ని నాలుగేసి మాత్రలగా విడగొట్టవచ్చు. నాలుగు మాత్రలంటే ఒక గణం క్రింద లెక్క. ఆ గణాలు ఈ రకంగా కలువు - నల IIII, భ UII, జ IUI, స IIU, గగ UU (U = ౨ I = ౧ మాత్ర కాబట్టి)

కందపద్యం ఉదా:
కం. ఎప్‌పటి కెయ్‌యది ప్రస్‌తుత
UII UII UII (భ భ భ)
మప్‌పటి కామా టలాడి - యన్‌యుల మనముల్
UII UU IUI - UII IIU (భ గగ జ - భ స)
నొప్‌పిం పకతా నొవ్‌వక
UU IIU UII (గగ భ భ)
తప్‌పిం చుకు తిరుఁగువాడె - ధన్‌యుడు సుమతీ
UU IIII IUI - UII IIU (గగ నల జ - భ స)

కందంలో ౩, ౫, ౩, ౫ గణాలతో నాలుగు పాదాలు రాస్తే చాలు. కానీ అలా వుంటే మఱీ కందంలో అందం పాళ్ళు తగ్గుతాయని కొన్ని నియమాలు విధించబడ్డాయి. ఉదా- పై పద్యంలో ప్రతి పాదానికి రెండో అక్షరం 'ప్ప' వుంది. దీనిని ప్రాస నియమం అంటారు (ఇంకా ఇలాంటి నియమాలు చాలా ఇక్కడ ఉన్నాయి). యత్రి పాస్ర నియమాలే కాకుండా కందంలో ఇంకా కొన్ని నియమాలున్నాయి - అవి ఏ గణం (నల,భ,జ,స,గగ లలోఁ) ఎక్కడ పెట్టవచ్చో ఎక్కడ పెట్టకూడదో నిర్ధేశిస్తాయి.

పైదంతా మనం ఇంతకుముందే మన అందమైన అందం బడిలో నేర్చుకున్నవే, కానీ మీరెవ్వరూ తమ తమ హోం వర్కులు చేయలేదు కాబట్టి తిరిగి చెప్పవలసివస్తుంది. ఇలా మరల మరల ఎవరు చెబుతారని చెప్పి నేను ఈ సాఱి కాస్త మెఱుగైన పద్ధతి వాడి మీకు కందం బోధింపదలచాను.

బొమ్మలతోఁ
కందంలో నాలుగు నాలుగు గణాలు వస్తాయన్నమాట నిజమే గాని, పైనచెప్పినట్టు, ఆ ఒక్క నియమాన్ని మాత్రం పాటిస్తే సరిపోదు. ఉదాహరణకు, బేసి సంఖ్య గణం జ గణం (IUI) అవడానికి వీలు లేదు. వికీలు ఏడుగా ఇవ్వబడ్డ నియమాలను నేను ఇక్క ఒక్క బొమ్మలో బంధించడానికి ప్రయత్నించాను. ఆ బొమ్మలను చూద్దాం.

క్రింద ఇవ్వబడ్డ బొమ్మల్లో,
౧) ఒక సమచతురస్రము(square) ఒక మాత్రతోఁ సమానము. అంటే లఘువుకు ఒక డబ్బా సరిపోగా గురువుకు మాత్రం రెండు ప్రక్క ప్రక్క డబ్బాలను కలపవలసివస్తుంది.
౨) రెండు డబ్బాల మధ్య డాటెడ్ లైన్ వుంటే వాటని కలుపుకోవచ్చు, అదే గట్టి లైను వుంటే వాటని కలపడానికి వీలు లేదు, గీతే లేకుంటే వాటిని కలిపి తీరాలి.



పై బొమ్మలో మీకు కందంలో వాడదగ్గ గణాలు ఏవి అని తెలిసివచ్చివుండాలి. ఇప్పుడు ఏ గణం ఎక్కడ వాడవచ్చు అన్నది చూద్దాం.



పై బొమ్మ నుండి మీకు అర్థమవ్వాల్సిందేటంటే,
౧) మొదటి పాదంలో మొదటి గణంలో రెండు మఱియు మూడు మాత్రలను (డబ్బాలను) కలపడానకి లేదు కాబట్టి అక్కడ జ గణం తప్ప వేరేదైనా పడాలని.
౨) రెండవ పాదంలోని ఆఖరు గణంలో గగ లేదా స నే వుండాలి (ఎందుకంటే ఆఖరు రెండు మాత్రల స్థానంలో గురువు మాత్రమే రాగలదు కాబట్టి).
3) సరిపాదాల్లో మధ్య గణంలోని డబ్బాల మధ్యఁ గీతల వైనం వల్ల అవి జగణం లేదా నల మాత్రమే అయివుండాలి.
పై బొమ్మ గుర్తుంటే వికీలో ఉన్న అన్ని నియమాలు మీకు వాటంతట అవే గుర్తుంటాయి. మీరు గుర్తుపెట్టుకోవసిందల్లా మొదటి పాదం గురువుతో మొదలైతే అన్ని గురువుతో మొదలవ్వాలి (అలానే లఘువుతో మొదలైతే అన్నీ లఘువుతోనే) అని.

ఈ బొమ్మ మీకు బాగా గుర్తుకు వున్న నాడు మీకు కందం వ్రాయడం తేలిక అవుతుందనడం రాజకీయనాకుని వాగ్దానం అవుతుంది. కానీ మీకు కందాలను చదివి వాటిని ఆస్వాదించే భాగ్యం మాత్రం తప్పక కలుగుతుంది!

కొన్ని కందాలు
దేవతలు దానవులు కలసి సముద్రాన్ని చిలికి అమృతం పొందారు అన్నది వట్టి కట్టు కథ అని ఆధునికి విద్యాబోధన చేసిన వారంటూంటారు. ఆ విషయం నాకు తెలియదు కానీ, కందాలు రూపంలో మన పోతన అమృతాన్ని సృజించి, పీనపయోధరములుగల అర్ధనగ్న అమ్మాయల చేత మనకు వడ్డించినంత పని చేసాడు. (ఇదే వాఖ్యాన్ని మీరు 'అమృతాన్ని దృఢకాయులైన అర్ధనగ్న అబ్బాయల చేత మనకు వడ్డించాడు అని చదువుకోండి - మీరు స్త్రీవాదులైతే - ఎవరినీ నొప్పించకూడదనేది కవులకు పరమపవిత్రమైన ఆచారం).

పోతన గారి నాలుగు కంద పద్యాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాను.

మొదటిది
మా గురువు గారు ప్రకారం ఇది అందరూ చనిపోయేముందు ఒక్క సారైనా తప్పక చదవదగ్గ కందం. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో రెండు గురువుల మినహా అన్నీ లఘువులేఁ! అలా ఉండడం నియమం కాదుఁగదా పైపెచ్చు అలా వ్రాయడం బహుకష్టం. మన బ్లాగర్లోలో ఆ అద్భుతాన్ని సాధించిన వారు లేకపోలేరు. మీ కోసం వారు వ్యాఖ్యలలో వారు వ్రాసిన 'సర్వలఘు'కందాలని మరల మనకు వినిపిస్తారనుకోండి సహృదయులు.
కం.
అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగడు నుడువడని నడయుడుగున్
వెడవెడ సిరిముడి తడబడ
నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్
(అనుప్రాస అద్భుతంగా వుందికదు)




రెండవది
మా రాఘవ ఇష్టకందం ఇది. కొన్ని రోజులు పోతే కందం ఎలా వ్రాయాలి అన్నది రాఘవ మీకు సువివరంగా వివరించనున్నాడు. ఇది దానికి టీౙరు మాత్రమే!
కం.
నీ పాద కమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాం
తాపార భూత దయయును
తాపస మందార నాకు దయసేయ గదే




మూడవది
ఇది పోతన గారి గజేంద్రమోక్షము నుండి తీసుకోబడ్డది. గజేంద్రమోక్షములో మొదటి పద్యంగా ప్రసిద్ధి.
కం.
నీరాట వనాటములకు
పోరాటం బెట్టు గలిగెఁ బురుషోత్తముచే
నారాట మెట్లు మానెను
ఘోరాటవిలోన భద్ర కుంజరమునకున్




నాల్గవది
ఇది కూడా గజేంద్రమోక్షములోనిదే. ఇది చాలా క్లిష్టమైన కందం. అనుప్రాసగా విశ్వ అని వచ్చేసరికి దీనిని వేగంగా చదవడం చాలా కష్టమవుతుంది. ఇలానే దీన్ని గణాలుగా విడగొట్టడం కూడా చాలా కష్టం.
కం.
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్ముని విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజుబ్రహ్మ ప్రభు
నీశ్వరునిన్ బరమపురుషు నే సేవింతున్



ఐదవది
బొమ్మలేకున్నా గజేంద్రమోక్షం నుండి ఇలాంటిదే ఇంకో మంచి కందం.
కం.
కలఁడందురు దీనులయెడఁ
కలఁడందురు పరమయోగి గణముల పాలన్
కలఁడందురన్ని దిశలన్
కలఁడు కలండనెడివాఁడు కలడో లేడో


ఇప్పుడు హోం వర్కు
౧) ఒక శుభదినాన పోతనగారు బ్లాగ్లోకాన్ని చూడడానికి వచ్చారు. పలు బ్లాగులు చూసారు ఆ తరువాత నవతరంగం చూసారు. ఆయన గుఱించి మంచిగా వ్రాసిన నా బ్లాగును చూసి, ఆ తరువాత ఆయనకి అసులు అర్థంకాని నా నవతరంగం వ్యాసాలు చూసారు (సినిమా అంటే ఆయనకు తెలియదుగాదా పాపం). ఆపై అనామిషుల గోల చూసి, అఱె ఈ రాకేశెవరు? రాకేశ్వర రావు ఎవరు? అనుకొని ఆయన సందేహాన్ని కందంలో వ్రాస్తే అది ఎలావుంటుంది.
జ) ఇవి లెక్కలు కాదు గాబట్టి ఎవరు జావాబు వారిది వుంటుంది. పక్కవారి నుండి చూచి వ్రాయడానికి లేదు. కాబట్టి నేను నా జవాబు ఇక్కడే ఇచ్చేస్తున్నాను !
కం.
రాకేశ్వరుఁడందమునన్
రాకేశ్వర రావుఁ నవతరంగమునతడేఁ
రాకేశ్వరుండు రాకేశ్
రాకేశ్వరుననెడివాఁడు రాకేశేనా?

లంకెలు:
౧) కందం, మందం, మొ||
౨) వికీ కందం
౩) పోతన భాగవతము
౪) వృత్తాల బొమ్మలు
౬) కందము పై బ్లాగ్చర్చ

31 comments:

  1. Quite Informative!! Timely article for me. Thanks a lot!!

    Did you by any chance read, Sri Sri's Anantham?

    ReplyDelete
  2. పలుకుపలుకునను, లయగని
    తెలుపదొడగ లఘుగురువులు "తెలుగుగురువు"వై
    తెలినగవుల,తెలియుడుపుల
    పలుకులకలికి గనియె శుభమనును,సుకవీ !

    ReplyDelete
  3. అరె! ఇంతబాగ కందపు
    పరిచయమున్ జేసితిరది పరికింపక, నే
    మరియొక పరి యటు కందం
    గురించి నాబ్లాగు పోస్టు గూర్చితిని కదా!

    ReplyDelete
  4. కం.
    వహవా! రాకేశా! మది
    మహదానందమునఁదేలె! పద్దియ కవితా
    గహనపు కుహరముఁజొరబడి
    సెహబా'సాచంట'వారి శిశువనిపించావ్!!


    ఎక్కడో విన్నట్టుందా? :-)

    ReplyDelete
  5. హన్నా రాకేశా... నేను కందపాఠం చెప్పబోతానని లీకు చేసి నన్నిరికించేశారూ.

    నేను అసలు చెప్పదలచుకున్న విషయం. ఒహట్రెండు (రాజకీయనాకుని లాంటి హాస్యపు) ముద్రారాక్షసాలు మినహాయించి కందం గురించి బొమ్మలతో మా బాగా చెప్పారు.

    ReplyDelete
  6. ఆవె.
    ఆశు కంద మూక వ్రాశారు, మాటలే
    కందములగు సుకవి చందురునకు,
    పాత కందమదియె పాడెను రానారె,
    అదుయు రాక నిత్తు నాటవెలది !

    @ రాఘవ,
    ముద్రారాక్షసాలు లేకుంటే (నాలాంటి) లఘువులకు (మీలాంటి) గురువులకు తేడా వుండదుగా ;-)

    ReplyDelete
  7. చాలా సేపు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కుదర్లే! బహుశా మరోసారి బెంగుళూరొచ్చినప్పుడు నిన్ను పక్కన కూర్చోబెట్టుకుని నేర్చుకోవాలేమో!

    ReplyDelete
  8. కందము కష్టము కాదని
    సుందర చిత్రాల అమరిక సులువే చేసెన్
    కందము అందెడి ద్రాక్షయె
    అందపు రాకేశు పాఠమదిగో కనుమా!

    ReplyDelete
  9. అందం, కందం, ఛందం, హృదయారవిందం, మకరందం, అమందానందం!
    బాగా చెప్పావు రాకేశా!!

    ReplyDelete
  10. కొత్తపాళీగారి దత్తపదికి నా పూరణ :-)

    కందము ఛందము బొమ్మల
    నందముగా చతురమతుల కతులామందా
    నందముగా చిందెను రా
    కేందుని హృదయారవింద మీ మకరందమ్!

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. కామేశ్వరరావుగారూ, కతులామందానందముగా ... ఇందులో కతులా అంటే ఏమిటండి?

    ReplyDelete
  13. రాకేశ్వరా, ఈ టపా శీర్షికలో పోతరాజుల కందములన్నారు, ఏమిటి విశేషం?

    ReplyDelete
  14. రాకేశ్వర రావు గారూ,
    'ఆచంట'వారి శిశువని రానారె గారన్నారు. ఆచంట జానకిరాం గారు మీ బంధువులేనా!

    రానారె గారూ,
    'కతులా' కాదు. చతుర మతులకు + అతుల + అమందానందముగా అని చదుకోవాలి. ఇలాంటి పదాల విరుపులు తెచ్చే కన్ఫ్యూజన్ గురించి నేనో పోస్టు వ్రాశాను. ఈ క్రింది లింకులో చూడవచ్చు:
    http://chandrima.wordpress.com/2008/08/03/%e0%b0%9c%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b5%e0%b0%b0%e0%b0%be%e0%b0%a7%e0%b0%ae%e0%b1%81%e0%b0%b2%e0%b1%82-%e0%b0%9c%e0%b0%b2%e0%b1%8d%e0%b0%b2%e0%b1%86%e0%b0%a1%e0%b1%81-%e0%b0%ae%e0%b1%8b/

    ReplyDelete
  15. చతుర మతులకు + అతుల + అమందానందముగా
    "అమందానందం"ని కందంలో ఇరికించాలంటే "అ" వేరే గణంలోనూ "మందా" వేరే గణంలోనూ వేసుకోవాలి. అలాచేస్తే నడక చెడుతుంది. అంచేత ముందున్న హ్రస్వ అకారాన్ని (సవర్ణదీర్ఘ)సంధిలో పెట్టి గురువు చేసాను.
    మరీ గ్రాంధిలవాదులైతే "మతులకు + అతుల" మధ్య ఉకారసంధి ఒప్పుకోరు, కాని నేను స్వతంత్రించాను :-)

    ReplyDelete
  16. @ వికటకవి గారూ,
    రెండో పాదంలో గణాలు కుదరలేదు. "సుందర చిత్రాల వరుస..." అంటే సరిపోతుంది.

    ReplyDelete
  17. @భై.కా.రా , చంద్రమోహన గార్లు
    చతురమతుల అంటే నేను squaresకి వేరే పేరేమో అనుకుని సరిపెట్టుకున్నాను. వివరించినందుకు బహు ధన్యవాదాలు

    @రానారె
    పోతన పూర్తి పేరు బమ్మెర పోతరాజు అని చదివినట్టు గుర్తు. అలా కాకున్న పక్షాన, ఆయనని నేనే కవి'రాజు' చేసాననుకోండి.

    @మోహన గారు
    నాకు జానకిరాం గారితో ఎటువంటి దగ్గరి చుట్టరికమూ లేదు. అలానే ఆచంట శరత్ కమల్ తో కూడా.. నాకు తెలిన ఆచంటోరిలో అందరికంటే ఫేమస్ నేనే ;-)

    ReplyDelete
  18. రాకేశా, అర్ధనగ్న అబ్బాయిల వాక్యం అదిరింది..నాకు కందంలో పద్యాలు వ్రాయాలని చాల ఉబలాటంగా ఉంది.

    ReplyDelete
  19. కామేశ్వరరావు, చంద్రమోహన్ గార్లకు, - వివరించినందుకు కృతజ్ఞతలు. అక్కడ సంధి వుంటుందనే పాటి ఆలోచన రాలేదు నాకు! ఈమధ్య నా మెదడు బాగా మొద్దుబారిపోయింది.

    రాకేశ్వరా, భైరవభట్లగారిలాగ స్వతంత్రించారన్నమాట. అలాగే కానివ్వండి. కవి నిరంకుశుడు కదా మరి :)

    ReplyDelete
  20. చంద్రమోహన్ గారూ, మీ బ్లాగును నేను చూళ్లేదండీ ఇన్నాళ్లూ - మొన్ననే మత్కుణ ప్రశస్తి చదివాను. గొప్పగా వుంది. ఒకసారి తీరిగ్గా మొత్తం టపాలన్నీ చదువుతా.

    ReplyDelete
  21. @ గిరి
    మీరింత వరకూ కందం వ్రాయలేదా.. ఔరా ఔరౌరా..
    కందము వ్రాసినవాడే కవి గాదా..
    అయినా వృత్తాలు వ్రాసేమీకు కందం ఎంత పని లెండి!
    @ రానారె
    నేను చెప్పినట్టు పోతరాజు అని చదివాను, లేక పోతే అంత స్వయం ప్రతాపం ఎక్కడిది?

    ReplyDelete
  22. ఇమ్మనుజేశ్వరాధముల కిచ్చి పురంబులు వాహనంబులున్
    సొమ్ములు కొన్ని పుచ్చుకొని, చొక్కి, శరీరము వాసి, కాలుచే
    సమ్మెట పోటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పె నీ
    "బమ్మెర పోతరాజొకడు" భాగవతంబు జగద్ధితంబుగన్."

    ReplyDelete
  23. This comment has been removed by the author.

    ReplyDelete
  24. ఓయి రాకేశ్వరా,
    చక్కటి కందము నొక్కటి
    ఠక్కున నుడువగ దలచితి, ఠారనె కోర్కెల్
    మిక్కుటమయ్యెను యెడ్డుము
    లెక్కడ చెప్పుదు కవనము, లెడ్డిమి మీరెన్

    ReplyDelete
  25. @ కామేశ్వర రావు గారు
    కృతజ్ఞతలు, ఈ పద్యాన్నే ఇంతకు ముందు చదివాను. చంద్రమోహన గారు కూడ జేశ్వరాధముల గురించి వ్రాసినప్పడు దీనినే ప్రస్తావించారు.

    @ గిరి,
    బాగుంది మీ మొదటి కందం, సర్వలఘు కందంలా 'సర్వ-భగణ' కందం ఏదైనా వుంటి అది ఇదేనని చెప్పాలి ;-) దాని వల్ల లయ బాగా వచ్చింది.

    ReplyDelete
  26. మంచి టపా. నాకు నచ్చినవి చాలా ఒకేచోట చేరేసరికి చాలా ఆనందం కలిగింది. నాకు కూడా, పోతన రాసిన కందాలే ఎక్కువ ఇష్టం. అడిగెదనని.... , నీరాట వనాట..... పద్యాలను ఉదాహరించినందుకు నెనర్లు. నాకు ఆ పద్యాలు భలేగా అనిపిస్తాయి....

    మరో రెండు పోతన కంద పద్యాలు నా తరఫు నుంచి.

    చిత్రంబులు, త్రైలోక్య ప
    విత్రంబులు, భవలతా లవిత్రంబులు, స
    న్మిత్రంబులు, ముని జనవన
    చైత్రంబులు, విష్ణుదేవ చారిత్రంబుల్

    మ్రింగెడి వాడు విభుండని
    మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
    మ్రింగుమనె సర్వ మంగళ
    మంగళసూత్రంబునెంత మది నమ్మినదో ।

    భైరవభట్ల కామేశ్వరరావు గారు "పోతరాజు" సంగతి వివరించేసారు. ఈ "రాజు" గురించే తెలుగునాట ఇంకో వాడుక... తెలుగు క్షేత్రాన్ని సుసంపన్నం చేసారు ముగ్గురు రాజులు: బమ్మెర పోతరాజు, కంచెర్ల గోపరాజు, కాకర్ల త్యాగరాజు... ముగ్గురూ రామభక్తాగ్రేసరులు కూడా !!!

    ReplyDelete
  27. చంద్రమోహన్ గారు,

    2,4 పాదాల్లో 3 గణం "జ" లేదా "నల" కదా. ఆ లెక్కన "అమరిక" ఒప్పే కదా? తప్పైతే తెలియపరచండి.

    ReplyDelete
  28. @ వికటకవి గారు
    సుందర చిత్ రా ల అమరిక - అన్నచోట ఒక మాత్ర ఎక్కువయ్యింది కద.

    @ హర్ష
    ఇంకో రెండు మంచి కందాలు అందించారు. నెనర్లు.
    అన్నట్టు పోతన కందాలన్నిటికి ఒక రకమైన శైలి తత్వం వుంటాయి అనిపిస్తుంది, చూడగానే దీన్ని పోతన వ్రాసాడు అని అనుమానించదగ్గట్టుగా వుంటాయి.
    పోతన మంచి గణితశాస్త్రవేత్త అయివుండేవాడని కూడా అనిపిస్తుంది నాకు.

    ReplyDelete
  29. చదూకొనే రోజుల్లో జెనిటిక్స్ లోని ట్రిప్లెట్ కోడ్ వచ్చినప్పుడు స్కూల్లో నేర్చుకొన్న గణ విభజన గుర్తొచ్చేది.
    ఇప్పుడు ఇక్కడ గణ విభజన చదూతుంటే, ట్రిప్లెట్ కోడ్ (Triplet code in protein synthesis) గుర్తుకు వస్తూంది.

    బహుసా రెంటికీ చెడ్డం అంటే ఇదే నేమో?

    బొల్లోజు బాబా

    ReplyDelete
  30. రాకేశ్వరా,
    అవునవును, అక్కడ తప్పులో కాలేసా. "చిత్రాల" బదులు "చిత్రపు" అని చదువుకోగలరు. మిగతా సూత్రాల్ని కూడా బొమ్మల్లో బంధించే ఉపాయమేదన్నా చూస్తే ఇక మేము బొమ్మలు చూస్తూ పద్యాలు రాసుకుంటాం :-)

    ReplyDelete
  31. Very interesting,good job and thanks for sharing such a good blog.your article is so convincing that I never stop myself to say something about it.You’re doing a great job.Keep it up

    idhatri - this site also provide most trending and latest articles

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం