భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, March 08, 2009

బృహన్ముంబయి - ౧వ భాగము

ప్యాంటులో పాసు పోస్తూ స్కూలు నుండి వీధిలోనికి పెరుగెడుతున్న ఆరేళ్ళ కుఱ్ఱాడిలా, కంగారు కంగారు గా బంబాయి వీధులలో పరుగెడుతున్న నీళ్ళ లారీ పై బృహన్ముంబయి మహానగర పాలికా, అని వ్రాసివుండడం చూస్తే మీకు మొదట అనిపించేదేఁవిటంటే,
బృహత్ + ముంబయి = బృహన్ముంబయి
, అనునాసిక సంధి బాగుంది అని.

ఆ తరువాత అనిపించేది, బృహత్ అంటే గొప్ప, మహా అన్నా గొప్పే, నగర అంటే గొప్పూరు, పాలిక అంటే మళ్ళీ రాజసూచికం. ఏఁవిటి వీళ్ళ గురించి వీరు ఇంత టాం వేసుకుంటున్నారు అనిపిస్తుంది. కానీ రోజు గడిచేలోపు బృహద్బృహన్ముంబయి అతిమహానగరం అని మీకు రూఢీగా తెలియవస్తుంది.

ముంబయి నగరానికి వెళ్ళడం ఒక త్రీడి వెర్చుయల్ రియాలిటి సినిమా చూడండలాంటిది. ఈ సినిమాలో గొప్పదనం ఏంటంటే, సినిమాలో పాత్రలు మీతో సంభాషించడం. మీ చేయి పట్టుకున్ని మిమ్మల్ని సినిమాలోపల నడిపించడం. నాకు ముంబయిలో పని పడింది. దానికి రెండు రోజులు ముందు వెళ్లి , పని అయన ఒక రోజు తరువాత వెనక్కి వచ్చాను. నేను అక్కడవున్నన్నాళ్ళూ వర్షం పడుతూనేవుంది. ప్రపంచంలో చాలా తక్కువ చోట్ల అంత కసిగా అంత సుధీర్ఘకాలం వర్షం పడడం సహజంగా పరిగణించబడుతుంది. నగరంలో కంపు చూసి దాన్ని శుభ్రం చేయబూనిందేమో వర్షం అని మీకు అనుమానం కలుగవచ్చు. ఆ అనుమానం బహుసహజం. కానీ సహ్యాద్రులకు పశ్చిమ పక్క నివసించిన ఎవరికైనా, ఈ వర్షం ఈ ప్రాంతాలలో ఈ కాలంలో ఇలానే పుడుతుందని తెలుసు. కేరళలో రవి నేల కానలేని కారడవులనుండి, కొంకణి నిర్మానుష్య సముద్రాల మీద వాన పడడం కోసం మాత్రమే పడుతూవుంటుంది. పడుతూనేవుంటుంది.

అలాంటి ఒక వాన ఆదివారం నాడు, రెండు కోట్ల జనులపై దయలేకుండా నగరంపై విరుచుకు పడ్డ వానలో ఉదయాన్నే ఆరున్నరకి బయలుదేరా నగరం మీదకు, నగరం లోనికి. సరిగా గంటన్నరలో చాలా దూరం వెళ్ళాలి.
వెళ్లాను రైలుమందిరానికి. పూజారి గారి పలుకుకోసం పడిగాపులుగా పురజనులు ప్రక్రమాలు కట్టారు. అక్కడ నించుంటే గంటన్నర కాస్త గట్టెక్కేస్తుంది, దానితోఁ బాటు నా అరవై వేలు కూడా, వెంటనే ఆటో కోసం వెదకి, ఇంకో రైలు స్టేషను దగ్గర దింపమన్నా, ఎక్కడ నుండి నేను వెళ్ళాల్సిన చోటుకు రైళ్ళు దొరుకుతాయో అలాంటి స్టేషను ఇంకొకటి కడ దింపమన్నాను. అతను ఎక్కించుకొని, కొంత దూరంలో ఉన్న ఒక కూడలి దగ్గర వదలి. అదిగో అక్కడ నీకు కావలసిన బస్సు దొరుకుతుంది అని చెప్పి డబ్బు తీసుకొని తుఱ్ఱుమన్నాడు. అక్కడికి వెళ్ళి నించున్నాను. నలుగురునీ అడగసాగాను పలానా స్టేషనుకు బస్సు వస్తుందా అని.

సకుటుంబ సమేతంగా బస్సు కోసం వేచివున్న ఒకాయన మీరు ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు, కాందివిలి అని చెప్పాను. అరె మేమూ అక్కడికే. ఇక్కడనుండి నేఱుగా బస్సులు దొరుకుతాయి, ట్రెయిను అవసరం లేదు. అన్నాడాయన. మాతోఁ బాటు రండి బస్సులో వెళ్దాం అన్నాడు. సరే బస్సు ఎప్పుడు వస్తుంది ఎంత సేపు పడుతుంది అని అడిగాను. ఇప్పుడు వస్తే గంటన్నర పడుతుంది అన్నాడు. నాకు నా అరవై వేలూ, దానితోఁబాటూ ఎన్నో చదువుతూ గడిపిన అర్థరాత్రులూ గుర్తుకువచ్చాయి.
సరె బస్సురావడానికో అనడిగితే.. "మేము ఇక్కడే అరగంట నుండి చూస్తున్నాము రాలేదు. కాబట్టి ఎప్పుడైనా రావచ్చు". హూఁ... అవునా, నాకు పదేళ్ళగా లాటరీ తగలలేదు కాబట్టి ఇవాళ తగలవచ్చు అన్నట్టుగానుంది జవాబు. గత్యంతరం లేక నేను నా అరవై వేలూ ఆయన బుట్టలో పెట్టాను. ఆ సమయంలో నేను మార్కావ్ ప్రాసెస్ల గురించీ, ఎక్సుపోనెన్షియల్ డిసట్రిబ్యూషణ్ల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నించాను. ఆయనట్టుగానే యాండ్రే మార్కావ్ ని వెక్కిరిస్తున్నట్టుగా బస్సు వచ్చింది. నా కొత్త మిత్రులు పెట్టెలతోఁ బస్సువైపు పరుగెడుత్తడానికి పూనుకున్నారు. వారికి ఒక సమాను ఎక్కువయ్యేసరికి. భయిసాబ్ కాస్త ఈ పెట్టి మోసుకెళ్ళండి అని నాకు ఒక పెట్టి పారేసారు. మొత్తానికి బస్సు ఎక్కి కూర్చున్నా. కాళీగానే వుంది. గంటన్నర ప్రయాణమట, టికెట్టు మాత్రం పద్నాలుగు రూపాయిలే. బస్సు వెళుతూ వుంది. నేను ఏ పరివారంలో భాగమయ్యానో వారు నాకు అభయ-చూపులు ఇస్తూండడంతో లేని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. నా అఱవై వేల గురించి ఆలోచించకుండా వుండడానికి ప్రయత్నిస్తూ.

తడిచి ముద్దైన ముంబయి రోడ్ల మీద చక్రాలున్న పడవా యిది, లేదా నీట ప్రయాణించే బస్సా ఇది అన్నట్టుగా శర వేగంతో దూసుకుపోతుంది బస్సు. మధ్యలో నాకెందుకో నేను వెళ్ళాల్సిన చోటు నుండి కొంత దూరంగా వెళుతున్నానేమో అని అనుమానం కలిగింది. మా కొంగ్రొత్త ఇంటిపెద్దకి చూపించా నేను వెళ్ళవలసిన చిరునామా ఇది అని. ఆయన దాన్ని కొంత బాధగా చూసి, నువ్వు వెళ్ళాల్సింది కాందివిలి తూర్పు, మేము పడమర. మన దార్లు త్వరలోనే విడిపోతాయి, అని చెప్పాడు. పుంతలు విడిపోయిన చోట నేను దిగాను. మా పెద్దాయిన నన్ను ఎంతో బాధతో చూస్తూనే వీడ్కోలు చెప్పారు. గంటన్నర పాటూ ఒక కుటుంబంలో భాగమై, వాళ్లు దిగేటప్పుడు వాళ్ళ పెట్టెలు ఎవరు దించుతారో అన్న సంశయంతోనే నేను దిగి కిటికోలోనుండి వీడ్కోలు చెప్పి ఆటోకోసం వెదక సాగాను.

ఒకళిద్దరు ఆటోవాళ్లు నేను రానన్ననారు. మూడో ఆయన ఎక్కు అన్నాడు. కానీ అతని ముఖంలో 'నీ వ్యాధి తీవ్ర స్థాయికి చేరుకుంది, దాని గురించి ఏం చేయాలో ఆలోచిద్దాం' అంటున్నప్పడు ఒక ఆత్మవిశ్వాసం గల వైధ్యుని ముఖంలో కనిపించే చూపు అతని ముఖంలో నాకు కనిపించింది. ఆటో కొంత కాలం తోలాక తీఱికగా అన్నాడు. ఇప్పుడు భారీవర్షాలవలన అవతలకు (తూర్పుకు) వెళ్ళవలసిన సురంగ రోడ్డు నీట మునిగింది. కాబట్టి మనం ఒక పని చేద్దాం. నేను నిన్ను రైల్వేటేషను ఇవతల వదులు తాను. నువ్వు దాన్ని దాటి అవతలకు వెళ్ళు. ఆవతలి పక్క షేర్డు ఆటో నీ కోసం ఉంటుంది అన్నాడు. నాకు మళ్ళీ నా అరవై వేలు నా దగ్గర నుండి దూరంగా పోతున్నట్టు అనిపించింది.

కొంత సేపటికి అలానే ఒక స్టేషను ఇవతల వదిలాడు. అవతల కెళడానికి దారి అదిగో అటు అని చూపి. అటు పోయి చూడగా, చాలా మంది రైలు పట్టాల ప్రక్కన దాట కూడని గేటు క్రింద నుండి దాటి, అవతలి ప్రక్కకు వెళ్ళడం చేస్తున్నారు. నేనూ అదే పని చేయబోయేటప్పుడు సరిగ్గా రైలు వచ్చింది. హూఁ జపానులో మూకుమ్మడి ఆత్మహత్యలంటారు, ఇలానే వుంటాయేమో.. అనుకున్నాను.

చివరకు ఎప్పుడో నేననుకున్న రైల్వేష్టేషను యొక్క అనుకున్న ప్రక్కకు రావడంతో నా జీవితం నేను వేసిన ప్లానుకు అనుగుణంగా వచ్చి చేరింది. మన నిజ జీవితాలలో కూడా ఇంతే, మీరు ఇఱవైకి నేను చదువు చించి పారేశ్తా, పాతికకి పెళ్ళాడతా, ముప్పైకి మూడు కోట్లు పోగుజేస్తా, నలభైకి నలుగురు పిల్లల్ని కంటా అని లెక్కలేస్తారు గదా. కానీ నిజంగా అలా ససేమిరా జరగదు. మీరు ఎంత తక్కువ అంచనాలు వేసినా అవి అనుకున్నట్టు జరిగే ప్రసక్తి లేదు. మీరు అనుకోనట్టు మాత్రం జరుగుతుంటాయి, అంటే మీరు పాతికకు పెళ్ళి చేసుకుంటాననుకున్నారనుకోండి. అది పాతిక బదులు ముప్పై అవుతుంది. అలాగే నేను నలభైకి నలుగురు పిల్లల్ని కంటా ననుకున్నారనుకోండి, అది ముప్పైకే జరిగిపోవచ్చు. నాకూ అలానే జరిగింది, నేను పావుతక్కువ ఎనిమిదింటికి కాందివ్లి స్టేషను బయట (తూర్పు పక్క సుమీ) ఉంటానని లెక్క వేశానా, కానీ నేను అక్కడికి చేరుకునే సరికి ఎనిమిది అయ్యింది.

ఏఁవైతేనే అవతలి ప్రక్కకు చేరుకొని ఆటోకోసం చూస్తుంటే, నాలాంటి ఇంకో నలుగురు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు.
కుఱ్ఱాళ్ళు అంటే ఒక మాట గుర్తుకువచ్చింది. ఇది అప్పుడు ఆ కుఱ్ఱాళ్ళని చూసినప్పుడు గుర్తుకురాలేదనుకోండి, కానీ ఇప్పుడిలా ఆ మాటని అక్షరాల్లో చూస్తుంటే నాకు గుర్తుకువచ్చింది, మా అమ్మ చిన్నప్పుడు, వాళ్ళ ఊళ్ళోకి పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చారఁట. ఆయన కుఱ్ఱాళ్ళోయ్ కుఱ్ఱాళ్ళూ అన్న పాట పడారట. చాలా బాగా పాడరు అని ఇప్పటికీ చెబుతూంటుంది. నేను ఆ పాట వినక పోయిన, నాకు కూడా ఆ పాట అంటే ఇష్టం. ఇప్పుడు నాకు ఏఁవనిపిస్తుందంటే, నాకు ఆ పాట నచ్చడానికి గల కారణం కుఱ్ఱాళ్ళు అనే మాటలో వరుసా వచ్చే బండి ర క్రింద బండి ర దాని వెనకే వచ్చే అళ క్రింద అళ. వాటిని బండి ర, అళ అనడం మంచిది కాదనుకోండి. ఱ ని ఱ అనాలి గాని బండి ర అంటే ఏం బాగుంటుంది. చూడడానికి ఎంత బండిలా వుంటే మాత్రము. ఉదాహరణకు మీ పేరే అయినాపురం కోటీశ్వరరావు అనుకోండి. మీరు బండగా వుంటారనుకుందాం. మిమ్మల్ని ఎవరైనా బండ కోటి అంటే ఏం బాగుంటుంది. మీ వూళ్ళో వీదికో కోటీశ్వరరావు ఉన్నాడనుకోండి, అందులో ఇప్పటికే చాలా మందిని కోటి అనే అంటున్నారనుకోండి. అయినా మీమ్మల్ని బండ కోటి అనడం మిమ్మల్ని నొప్పిస్తుందిగా. అందుకే ఱని బండీ-ర అనకుండా ఱ అనాలి. ళని అళ అని ఎందుకనకూడదో చెప్పాలంటే, మీ పేరు సత్తుపల్లి సీతాలు అనుకోండి, మీవూళ్ళో ఇంకా చాలా మంది సీలాళ్ళు వున్నారనుకోండి, ఇంతమంది సత్తుపల్లి సీతాళ్ళున్న ఈ సచ్చుపల్లి సత్తుపల్లిలో ఎన్నాళ్ళుంటామనిఁ దలచి, మీరు కన్నడనాడు వలస వెళ్ళారనుకోండి. అక్కడ మిమ్మల్ని అందరూ సత్తుహళ్ళి సీతాళు అనిపిలుస్తున్నారనుకోండి. అది చాలా భావ్యమే అయినా - ఎందకంటే కన్నడవారికి ళ అంటే మమకారం ఎక్కువ, పైగా వారికిఁ ను, వు, ళు, గళు ప్రథమా విభక్తి - అయినా మీకు మనసు నొచ్చుతుంది కాదా. అందుకనే ళ ని అళ అనకూడదు. అలానే ఙకి తమిళ కథ, ఞకి మలయాళీ కథ వున్నాయి, అవి మరెప్పుడైనా చెప్పుకుందాం. అప్పటివఱకూ ఱ,ళ,ఙ,ఞ లను ర,ల,న,న లగా పలక రాదని బండ గుర్తు మాత్రం పెట్టుకోండి.

ఇంతకీ టేషనీకి అవతల ప్రక్క ఏఁవ్ జరిగిందో నేను చెప్పనేలేదు కదా. అవతల ప్రక్కకు వెళ్ళగానే అక్కడ కొందరు కుఱ్ఱాళ్ళు కనబడ్డారు. వారు కూడా పరీక్ష వ్రాయడానికి వచ్చిన వారల్లే వుంటే నేను వెళ్ళి అడిగాను ఫలానా కాలేజీకి వెళుతున్నారా అని. వారు వేంటనే అవునన్నారు. నలుగురం కలసి ఆటో వెదకబోయాం. చాలా ఆటోలు వున్నాయి గానీ ఎవరూ రామన్నారు. ఒకతను పాతిక ఇస్తే వస్తాను అన్నాడు. సరే అయితే రెండు ఆటోలు తీసుకుంటాం చెరో ఇద్దరూ అన్నాడితను. ఆటోవాడికి అలాగైతే వాడికి పజ్ఞెండు రూపాయలే చిక్కుతానుకున్నాడో ఏఁవోగాని వాడు మనాచేశాడు. ఇంతకీ ఇతని ఉద్ధేశం మాత్రం ఇద్దరికే పాతిక ఇస్తామని. అక్కడ అరవై వేలు గాలిలో వ్రేలాడుతూంటే, ఇక్కడ వీడు పాతికలకు బేరాలేఁవిటా అనుకొని వుంటాడతను.

తరువాత ఇంకొకతను నలుగురినీ ఎక్కుంచుకుంటా కానీ నలభై ఇవ్వాలి అన్నాడు. కాస్త ఎక్కువ అడుగుతున్నాడన్న సిగ్గు ముగంలే కనిపించేడట్టే. పాపం వానికేం తెలుసు ఎక్కువ అడగడం గుఱించి. మీ మనీ మేనేజర్‌ని పరిచయం చేయండి అతనికి కొంతైనా బుద్ధివస్తుంది, మీ మనీ మేనేజర్ కి కాదు, ఈ ఆటోవాడికి.

----------------------------------------------
నేను ముంబయి వెళ్ళింది 6, జూను, 2008
పై టపా వ్రాసింది 8, జూలై, 2008 (అప్పటికి ఇంకా పేళుళ్ళు వంటివి జరగలేదు).
కథ ఇంకా సగం బాకీ వుంది. కానీ అది ఎప్పటికి వ్రాస్తానో తెలియదు. వ్రాసిన అందులో ఎంత నాకు బాగా గుర్తుందో కూడా తెలియదు. కాబట్టి ప్రస్తుతానికి ఇది రాకేశ్వర-రావు-అముద్రితాలు లోనికి వెళ్ళిపోకుండా కపాడడానికి దీనిని ఇక్కడే ఇప్పుడే టపా చేస్తున్నాను. త్వరలో వీలైతే తఱువాయి భాగం ప్రచురిస్తాను.

6 comments:

  1. ఏంటో "ఱ"య్యిమని దూసుకువెళుతున్న ముంబై బస్సులో నుంచి అమాంతంగా కిందికి తోసేసినట్టు టపా ని ఆపేసారు ?

    త్వరలో పూర్తి చేయగలరు.
    (నన్ను కూడా ఱా ఱమ్మంటుంది)

    ReplyDelete
  2. జర హట్ కే జర బచ్ కే యే బంబై మెరి జాన్‌
    ముంబాయా, మజాకా?

    ReplyDelete
  3. హేవిటో... నాకు బృహత్ బెంగళూరు పాలికె కనిపించింది.. ఇది కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది..! చదువరుల సంగతేమో కానీ, ఱ,ళ మాత్రం మీ టపా చూసి చాలా సంతోషించి ఉంటాయి..!!!

    ReplyDelete
  4. బృహన్ముంబయోపాఖ్యానం, బృహదక్షరోపాఖ్యానం (ఱ, ళ) రెండూ బావున్నాయి.

    పిడకలవేట : అన్నట్టు, "బండి ఱ" అనాలా, "బండి ర" అనాలా?

    ReplyDelete
  5. నాక్కూడా బృహద్బెంగళూరు మహా నగర పాలికె గుర్తొచ్చిందండీ రాకేశ్వరులవారూ! :)

    రవిగారూ, బండి-ర లేదా ఱ.

    ReplyDelete
  6. హృదయపూర్వకంగా చెబుతున్నాను. బృహదానందం కలిగించింది ఈ కథనం. రెండో భాగం తప్పకుండా వ్రాయండి.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం