భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, April 06, 2010

అమ్మమ్మ కబుర్లు ౧ - మాఁవయ్య వరస

"ఏంట్రా అది?"
- "ఇదిగోనే గోదారి, తిను అచ్చం చాక్లేటులా వుంది। "
"చిచ్చీ అదేం తినడంరా, అందంగా పళ్ళెంలో పెట్టుకుని తినడం మానేసి।"
- "చాలా బాగుందే, నెయ్య చాలా బాగా అంటుకుంది, బాగా మాడ్చకుండా లేతగా వుంది। ఇదే కొట్టులో కొంటే ఎంతో తెలుసా, ఈ మాత్రం ముక్కకి ఒంద రూపాయలంటాడు। అంతిచ్చినా దొరుకుతుందని లేదే।"
"నేను ఎంగిలి తిననురా।
ఒక సారి ఏమయిందంటే, నా పెళ్ళికి నేను చాలా చిన్నదాన్నిరా।
మా చింతాత అదే మా మాంగారు వచ్చి, మా అమ్మతోనే, అమ్మా మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి చెయ్యమ్మా, ఐదోవోడికి దీన్ని చేస్తే ఆరోవోడికేమో మా మనవరాలిని చేస్తాము। అన్నాడు।
మా అమ్మేమో ఇప్పుడే పెద్ద దాని పెళ్ళి చేశామండి మా తమ్ముడికి ఇంకా ఇదీ చిన్నపిల్లే దీనికి ఇప్పుడే చెయ్యమండీ అని మా అమ్మకేమో ఇంకా పెళ్ళి చేయడం ఇష్టం లేదు।
ఆయనేమో, లేదండి పెద్దదాన్ని మాఁవయ్యకిచ్చి చేసారు కాద, దీన్ని కూడా మాఁవయ్యకిస్తే సుఖపడతుంది। అన్నాడు।
మా అమ్మే అన్నీ చూసుకునేది మా పెళ్ళి విషయాలూ గట్టా, మా అయ్య కేమో పెద్ద తెలిసేది కాదూఽఽ।
అప్పుడేమో మా తాత ..."
- "అంటే మీ మాంగారు.."
"అపుడేమో ఆయన, మా అన్నమనవరాలు వుంది దాన్ని కూడా మాఁవోడికిచ్చి చేస్తామంటున్నారు, మాకేమో మీరైతేనే బాగుంటుందనుకుంటున్నాము। "
- "అంటే తాత పెదబాబు కూతురి కూతురు। "
"అవును। "
- "అంటే తాతకి నువ్వేమో పెత్తల్లి కూతిరి కూతురు, ఆవిడేమో పెదబాబు కూతిరి కూతురు। "
"అవును।"
- "ఇద్దరూ మేనగోడళ్లే।"
"అవును।
మా గంగరాజు మాఁవయ్యకేమే నన్ను వీళ్ళకిచ్చి చేసేద్దామనుండేది, మా అమ్మకేమో అప్పుడే ఎందుకనుకునేది।
గంగరాజు మాఁవయ్యంటే, అదే మా అమ్మ మార్టు తమ్ముడు, పెద్దవాడు। "
- "అంటే వెంకటరత్నంగారి అన్నయ్య।"
"అవును। "
- "అంటే మీ బావగారి అన్నయ్య।"
"అవును।
ఆయనేమో మా పిన్ని కూతుర్ని చేసుకున్నాడు। అంటే సొంత అక్కకూతుర్ని చేసుకున్నాడు। "
- "అయితే ఇప్పుడు మీ అమ్మ పెద్ద తమ్ముడేమో సొంత అక్క కూతుర్ని, మీ అమ్మ రెండో తమ్ముడు మీ అక్కని, అంటే మార్టక్క కూతుర్ని చేసుకున్నారు, మళ్ళీ తాతేమో మీ అమ్మకి పింతల్లికొడుకు నిన్నుచేసుకున్నాడు। దేశమ్మీద ఎవరూ లేనట్టు అందరూ అక్క కూతుళ్ళనేనన్నమట।"
"ఇంకా వుంది విను।
మా తాత, అదే మా మాంగారు ఇలా పలానా తారీఖున బల్లిపాడులో దినం వుంది మఱి, ఆనాడు వాళ్ళు, అందే మీ తాత పెదబాబు ఆళ్ళు అక్కడికి వస్తున్నారు, తాంబూలాలు పట్టుకొని, వారికంటే మీరు ముందు వచ్చి ఇస్తే మీకే ఇస్తాము। లేకపోతే సంబంధం వారికెళ్ళిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోయాడు।
మా గంగరాజు మాఁవయ్య ఆనాడు బల్లిపాడు వెళ్ళాడు, వాళ్ళు కూడా వచ్చారు, ఒక పక్క దినం జరుగుతుంటేనే, వాళ్ళు వీధి గుమ్మమమ్మటా వస్తుంటే, మా గంగరాజు మాఁవయ్య దొడ్డి గుమ్మమంటా వెళ్ళి తాంబూలం ఇచ్చేసి పెళ్ళి కాయం చేసేశాడు।
ఆ తరువాత వాళ్ళేమో ఆ పిల్లని చిడిపి ఇచ్చారు। "
- "అంటే గోదారి గట్టు మీద వూరు కదా?
అవును। వాళ్లూ బాగానే వుండేవారులే। ఇప్పుడు కాస్త చితికారు గాని।
ఆ తరువాత మా మరిదికి మా ఆడబడుచు కూతుర్ని అనుకున్నారన్నానుగా। "
- "అదే మీ మరిదంటే మీ మాఁవయ్య కూడా, తాత తమ్ముడు చివరతను కదా। "
"ఊఁ"
- "మీ ఆడబడుచంటే మీ పిన్ని, మీ పిన్ని కూతురు అనసూయత్తని ఆఖరు తాతకనుకున్నారా? "
"కానీ జరగలేదుగా, వీరమ్మమామ్మతో అయ్యింది ఆయన పెళ్ళి।
వీరమ్మ నాకంటే పెద్దదేగాని, కాపరానికి మాత్రం నా తరువాతే వచ్చింది, అదీ మా చుట్టమే అంతకు ముందే। "
- "అయితే మీ మాఁవయ్యలందరూ వరుసగా మీ అప్పాజెళ్ళెళ్ళని చేసుకున్నారు, మీ తమ్ముళ్ళేమో మీ కూతుళ్ళని చేసుకున్నారన్న మట। "
"అప్పట్లో మఱి మా అమ్మ ఆఱుగురి పెళ్ళిళ్ళు చేసింది, అందరం సుబ్బరంగా కాపురాలు చేసుకున్నాము। ఈ రోజుల్లో ఒకటి రెండు పెళ్ళిళ్ళకే కష్టపడిపోతున్నారు, చేసినా అయ్యి నిలవట్లేదు।
మా అప్పుడు ఇన్ని చూసేవారేంటి, మేమంటే జనాలు మంచోళ్ళని, అందరూ ఎగబడి చేసుకునేవారు। తాతాళ్ళు మంచోళ్ళని మా మాఁవయ్య కూడా మా పెళ్ళి కుదిర్చేశాడు।
ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే, అప్పుడేమో నాకు ఎందేళ్ళో ఎంతోరా, పెళ్ళయ్యాక గుడికి తీసుకెళ్తే గంట అందకపోతే, మా తాత "
- "అదే మాంగారు "
"ఆయన ఎత్తుకుని గంట అందించాడు।
అప్పుడు తాతకి పట్టించిన పానకం నాకిచ్చారు తాగమని, నాకేమో అసలు ఎంగిలి ఇష్టముండదు। నెత్తిమీదఁ సుడుపుడుకాయ వేసిందన్నమట, మా తాత దాన్ని ముట్టుకుంటే, కందిపోయిందని ఏడేసి మారాం జేసి తాగలేదు। అప్పుడెంత నేను, మీ బుజ్జక్క పిల్లలంత వుండేదాన్ని, తాతేమో నీలాగ వుండేవాడు, నీకంటే చిన్నోడేగాని, అంత పెద్దగా పొడుగ్గావుండేవాడు, నేనేమో ఇంతే వుండేదాన్ని। "
- "ఇంచక్కా నీ పెళ్ళయ్యి ఢబ్బై యేళ్ళయ్యాయి, నాకింకా అవ్వలేదే! "
"చేసుకోఽఽ, ఎవరొద్దన్నారు। ఎప్పుడూ పెళ్ళిపెళ్ళంటావు చేసుకోరాదా। "
- "ఊఁఽఽ ఎనిమిదయ్యింది పద టీవీలో భారతం వస్తుంది।"

3 comments:

  1. అబ్బో ఎన్ని వరసలో కదా మనకి, అంటే మీరు ట్యాగ్‌ చేసిన "భారతీయ జీవన శైలి"లో్. మా చుట్టాల్లో వరసలన్నీ నాకు పూర్తిగా వంటపట్టలేదు కానీ (నేను చాలా నయ్యం.. స్నేహితుల్లో చాలా మంది " అన్నయ్య భార్య చెల్లి నీకేమవుతుంది" అంటే "అబ్బో ఈ వరసల్లో నేను వీకు" అంటారు) మా తమ్ముడికి ఈ వరసలు-ఇంటిపేర్లు-ఊర్లు వగైర కనెక్షన్లంటే తెగ ఇది. నాకు 2-3-4 లింకులు వరకు ఫర్వాలేదు కానీ అంతకన్నా పైనైతే మధ్యలో కనీసం ఏదొక లింకు గుర్తుండదు. అక్కడ ఆ వరసలన్నీ వదిలేసి ఇక్కడ "select few friends" సాంగత్యంలో ఉంటూ సంవత్సానికో రెండేళ్ళకో ఇంటికెళ్ళినప్పుడు మొత్తం లింకులన్నీ flush in అన్నట్టుంటది.

    ఇంతకీ "గోదారి" అంటే గోకిడేనా? ఎంత బావుంటదో.. caramel తిన్నప్పుడల్లా నాకు ఈ గోకిడి గుర్తొస్తది.

    ReplyDelete
  2. అబ్బో చాలా చుట్టరికాలను తిరుగేసారు , మా అమ్మమ్మ చెప్పే సంగతులు గుర్తొచ్చాయి .

    ReplyDelete
  3. లెవల్ వన్ వరసలైతే పర్వాలేదు. తేలికే.
    లెవల్ టూ వరసలుంటాయి. అంటే మేనరికం చేసుకున్నవారికి. అమ్మమ్మా అత్తయ్యా ఒకళ్ళే అవుతారు అప్పుడు తికమకమొదలవుతుంది.
    కాబట్టి అలాంటివాటికి వర్తించే నియమాలు గుర్తుపెట్టుకోవాలి.
    అమ్మయ్య = మామయ్య = బావ, అయ్యయ్య = బాబాయి = అన్నయ్య, అమ్మమ్మ = అత్త = అక్క, అయ్యమ్మ = పిన్ని = వదిన.
    ఈమధ్య కాలంలో వదిననే ప్రయోగం చాలా తగ్గింది. అక్క సర్వత్రావాడేస్తున్నారు.


    గోకిడంటే, అచ్చంగా నేతిని కాగించాక గోకగావచ్చేది. దానిలో బెల్లం వేస్తే అది కారమెల్ లా తయారవుతుంది. దానిని మేము గోదారి అంటాం. ఈ గోదారికి గట్టుండదు.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం