భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, April 20, 2010

జల్లిసీమ


సీ।
సర్కారు నేనెక్కి ౘక్కగాఁ బోతుంటే,
భీమవరానెక్కెఁ భామయొకతె
అప్పటి వఱకును యక్కడే కూర్చున్న
అమ్మాయి కంటెను యందగర్తె
బీటేయు వయసిక దాటిపోయిందని
అఱచెనాత్మారాముడంతలోన
ధర్మసంకటమొచ్చెఁ కర్మయనుచు కిటి-
-కీఁ దెఱచిన్ జూడఁబోతె బయటఁ
గీ।
గాలి కూగేటి రెల్లుల కైకలూరు
బల్లపరుపుగా వరిచేల జల్లిసీమ
కోటి చెరువుల కలల కొల్లేటిసీమ
ఆడఁబడచుల కంటెను యందఁగర్తె

8 comments:

  1. నా బేసికన్ను(కెమరా) పాడయిపోయింది, క్షమించాలి ఫోటోలు లేవు :(

    ReplyDelete
  2. భాషందం, భువనందం, బ్రతుకందం - అతని బ్లాగే ఓ అందం - దానిలో జల్లిసీమ ఇంకా ఇంకా అందం. సెహభాస్ . కీపిట్ అప్.

    ReplyDelete
  3. సెబాస్సెబాస్సెబాస్ .. ఆ రైల్లో అమ్మాయంత వయ్యారంగా ఉంది నీ సీసం. బైదవే బీటేసే వయసు దాటింది నీకా ఆమెకా??
    జల్లిసీమ అని శ్రీపాద కథల్లో ఒకట్రెండు చోట్ల చదివిన గుర్తు - యేదో ఆయన మాటవరసకి ఆ పదబంధం వాడారని అనుకున్నాను. నిజంగా ఒక సీమ అని తోచలేదు. సో, జల్లిసీమ అంటే కోనసీమకి పగోజి ప్రతిబింబమా?

    ReplyDelete
  4. "బైదవే బీటేసే వయసు దాటింది నీకా ఆమెకా??"

    కొత్తపాళీగారూ మీరు మరీను! ఒకవేళ దాటింది ఆమెకైతే, అసలు ధర్మసంకటం వస్తుందా? ఇంత వయ్యారమైన సీసం వస్తుందా?!

    రాకేశా, మీకన్నా మీ ఆత్మారాముడు ముసలాడిలా అనిపిస్తున్నాడు, జాగ్రత్త :-) తేటగీతి సొగసుగా సాగింది!

    ఇక కొన్ని అరసికమైన విషయాలకి వస్తే:

    1. ఇందులో "అచల" సంధి చేసేసారు! అయినా పర్లేదు, పద్యమంతా వ్యావహారికంలోనే సాగింది కాబట్టి.
    2. వఱకును యక్కడే - వఱకును చివరన నుగాగమం వస్తుంది. వచ్చి అది "వఱకును నక్కడే" అవుతుంది.
    3. కంటెను యందగర్తె - ఇక్కడ కూడా నుగాగమం వస్తుందనుకుంటా. ఇంతకీ "అందగత్తె" "అందగర్తె" ఎలా అయింది? ముద్రారాక్షసమా?
    4. కీఁ దెఱచిన్ జూడఁబోతె బయటఁ - "కిటికీ" + "తెఱచి" సంధి చేసేరు కాబట్టి ప్రాసయతి చెల్లదు. "కిటికీ తెఱచి" అని ఉంచేస్తే సరిపోతుంది. "తెఱచిన్ " అంటే?

    ReplyDelete
  5. అందగర్తె పదాన్ని చాలామంది వాడుకభాషలో వాడుతుంటారు కదండీ.

    ReplyDelete
  6. @కొత్తపాళి,
    నాకునూ అచ్చంగా జల్లిసీమ అంటే ఎక్కడో తెలియదు గాని, నరసాపురం-పాలకొల్లుల నుండి మచిలీపట్నం-గుడివాడలవరకూ వుండే ప్రాంతంలో ఎక్కడైనా కావచ్చు। కొల్లేటి సీమ అయ్యే అవకాశం కూడా వుంది। మొత్తానికా బండి వెళ్ళే దారిలోనయితే వుంది।

    @ కామేశం గారు చాలా పేర్లే పెట్టారే,
    బీటేయు, సంకటమొచ్చె - అని 'అచల'(?) సంధులు చాలాచోట్లే పడ్డాయి, కానీ ఎంతో దగ్గరగా వెదికితేగాని తెలియవు, పైపెచ్చు పద్యం చెడలేదు కాబట్టి సర్దిపెట్టకుందాం :)
    అచల సంధి అంటే గుర్తుకువచ్చింది, 'వనము లన్నియు కామ రక్కసి కొండి పెట్టిరి అంధులై' - ఇక్కడైతే ఏకంగా యతికే వేసాను అచలం :)

    -
    వఱకును యక్కడే, కంటెను యందఁగర్తె అని గణాలకు వ్రాయవలసివచ్చింది కానీ, అసలు
    వఱకుఁ + అక్కడే - వఱకునక్కడే
    కంటెఁ + అందఁగర్తె - కంటెనందగర్తె।
    నాకుతెలిసినంతలోఁ వఱకునునక్కడే, కంటెనునందగర్తె అయితే అసలు అవవు।

    -
    నాకు తెలిసినంతలోఁ అందం + కర్తె = అందఁగర్తె, దానిని వాడుకలో అందఁగత్తె అనవచ్చు - తెలుగుకి సంయుక్తాలంటే పరాకు కాబట్టి।
    {వాడుకలోనయితే ఈ ప్రయోగం వుంది, కానీ మీ అభ్యంతరం చూసిన తరువాత నేను పొరఁబడ్డానేమోననిపిస్తుంది - కత్తె అచ్చతెలుగు ప్రత్యయమయివుండవచ్చుఁ - ఈ విషయం తేల్చుకొనవలసియుంది}

    -
    కిటికీఁ దెఱచిన్ - అంటే ప్రాస చెడుతుందని తెలిసికూడా అరసున్నా పెట్టే అవకాశాన్ని పోగొట్టుకోవడం ఇష్టంలేక పెట్టేసాను। అలా పెట్టకూడదన్న విషయం ఎఱిఁగినవారు దాని తీసేసి చదువుకోవడం ఎఱుఁగుదురనే నమ్మకంతోఁ:

    కిటికీఁ + తెఱచిఁ + చూడఁ + పోతె = కిటికీఁదెఱచిం జూడఁబోతె

    ReplyDelete
  7. పద్యము చాల బావుంది.
    అందగర్తె అనే ప్రయోగం క్రొర్తగా ఉండి నాకు నర్చింది :-)
    అరసున్నా వల్ల ప్రాస పోవడమొకటి, మొదటి పాదాంత గణము బోతుంటే పదము వల్ల తప్పడము మరొకటి - ఈ రెండూ సరిచూస్తే సరి

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం