భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, June 25, 2010

మావూరి కథ

మూఁడు వీదుల మా గ్లోబల్ విలేజిలో
దేశాలను విడదీశారు
మొదటి రెండవ మూడవ ప్రపంచాలుగా ॥

ఊరికొక్క షావకారు వెనకటికి ఋషులుగా బ్రతికినవారు
ఇంట్లోవారిచే చెప్పులు కుట్టించి పెరట్లో పెట్టి అమ్ముతున్నారు।
భార్యా పిల్లల రక్తాన్ని పాలుగా మలచి త్రాగారు
బాగా బలిశారు కాసులకు అలుసయ్యారు।
చచ్చిన నానా విశ్వకర్ములుఁ అందాకా చేసిన వ్యాపారాలు
యికమందు సాగడానికెన్నో యంత్రాలు నిలిపారు, చైనా వీరి పేరు ॥

ఊరిలోనొక కుఱ్ఱకారు ఊరందరికీ 'పెద్ద' దిక్కు
వ్యవసాయం తక్కువైన ఒట్టి చార్వాకుడు
సుఖాల తోటలో శయనించు మహాభోగి।
జనాలకు పనిలేకుండా పోకూడదని
అప్పు చేసి అన్నీ కొంటాడు, వాడుకుంటాడు।
హలాహలాన్ని నిత్యం మ్రింగేవాడు
అంతరంగం శూన్యమైనవాడు, వీడి పేరు అమెరికా॥

యువరాజుగారి ఆగడాలను
మావలూతాతలూ మేమేం తక్కువంటూ
అనుకరించి అపుడపుడూ భంగపడతారు
వీరి పేరు ఐరోపా।
మహాషావుకారితో పోటీపడుతూనే పడలేకే
చిల్లరవస్తువులమ్మే తోపుడుబళ్ళు
ఊరినిండా వారే మిగిలినవారు॥

అయ్యో ఒకనాడు అప్పుల్లో పడ్డాడు యువరాజు
ఆయన కొనకపోతే ఊరికే ఉద్యోగం లేదు।
పిల్లల్ని కాళీగావుంచలేక షావుకారు
యువరాజుకు అప్పిచ్చి సారాయి పోశాడు।
ఊళ్ళో అందరూ తలోచేయి వేసి
చేతనైనంత కల్లు దోసిట్లో పోసి
చిన్నయ్యగారిని ఆదుకున్నారు॥

ఊరిచుట్టూ కొండంతా పిండి, తోటంతా త్రవ్వి
చేయించిన ఆసనాలకూ, పండించిన గంజాయికీ
వ్యసన పడి, బానిసై, ప్రకృతి గుణాలకు పావైనాడు ।
వీడి శరీరంలో అణువణువూ అపుడోకొంతా ఇపుడోకొంతా
కొన్న షావుకారికి మిగిలిందీ జీవచ్ఛవం॥

క్షామకాలం మీదపడుతుండగా
రేపు రాబోయే పెనువిపత్తుకు
ఏర్పాట్లకు తీఱికలేని యాపారులంతా
ఎండుటాకుల్లా రాలినప్పుడు,
మిగిలిన ఆ నలుగురితో
మరుజనమెత్తనుంది మా వూరు।

తాగుమోతులా తాండవించి
పుఱ్ఱెలు కాలరాసే కాలానికి
మావూరు చూపిన చోద్యాలు ఎన్నో
వాటన్నిటిలోనూ ఇది ఒక్కటి మాత్రమే॥

* ముందుగా పొద్దు పత్రికలో కవికృతి(కవులవికృతిసమ్మేళనం) సందర్భంగా ప్రచురితం।

4 comments:

  1. బాగున్నదండి మీ కవిత. అభినందనలు.

    ReplyDelete
  2. మీకు ఈ చైనా ఫ్రెండు ఎవరండీ, ప్రతీ పోస్టులోనూ చైనా భాషలో మీకేదో రహస్యం చెప్తున్నట్టునారూ?

    ReplyDelete
  3. చేతన గారు, ముందుగా నాకు అర్థం కాలేదు, టపాలో చైనా వాడి గుఱించినేమో అనుకున్నా। ఈ కమెంట్లు పెట్టేవాడా? పెద్ద తలకాయనొప్పేనండి వీడు।

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం