భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, July 05, 2010

ఇంసోమ్నియపు పద్యాలు ౨ - నలదమయంతులు

నిన్న రాత్రి పడుకునే ముందు కవికోకిల
"జిలుగుం(౩) బంగరు రంగులుం(౩)గలుగు మే(౨)ల్చిన్నారి పూగుత్తి సొ-(౧)
మ్ములు గీలించిన తుమ్మకొమ్మలకు నీ(౨)వున్(౩) నీ సతీరత్న మూ-(౧)
యెల గీమున్(౩) దగిలించి రేఁబవలు హా(౨)యిం(౩)దూఁగరా గాడ్పు బి-(౧)
డ్డలు మీ కూడిగ మాచరింప గిజిగాఁ(౨)డా నీకు దీర్ఘాయువౌ"
పద్యము చదివి నిద్రపోఁబోతే, తెలుఁగులో శార్దూలాలూ మత్తేభాలూ ఎందుకు వాడతారో అని నాకు వెయ్యోసారి పరాకుగాననిపించింది।
ఒకటి(౧), వాడినవాటిలో సగానికి పైగా మత్తేభాలలో ఆఖగురువును తరువాతి పాదపు లఘువులతో కలిపేస్తారు, ఆ మాత్రం దానికి UII UUII UI UI IIU UII UII అని కడ గురువును ముందఱ చేర్చేయవచ్చుగా ఛందోరీతిలోనే।
రెండు(౨) యతిస్థానంలో పదంవిఱిచేవారు చాలా తక్కువ। యతికి అటూ యిటూ ఒకే పదభాగాలు వుంటాయి। ఈ రెండు నియమాలూ సంస్కృతంలోనైతే చెల్లవు। తెలుఁగులోనే ॥ ఈ తెలుగు నియమాలకంటే నాకు సంస్కృత నియమాలే నచ్చాయి। నేను శతకం వ్రాసినప్పుడు వాటికే ప్రాముఖ్యతనిస్తాను।
మూఁడవది(౩), పొల్లులు (జిలుగున్, రంగులున్, సిరికిన్, శంఖచక్రయుగమున్) అజంతభాషలో అన్ని పొల్లులు వాడి వృత్తపద్యం వ్రాయకపోతేనేం అనిపిస్తుంది। సీసాలో గీతాలో వ్రాసుకోవచ్చుగా।

ఏదేమైనా, పొల్లులు లేకుండా(౩), యతిస్థానే విఱుపు వచ్చేట్టు(౨), పాదం నుండి పాదం కలుపకుండా(౧) పద్యం వ్రాయడం అంత కష్టమా అనిపించి ఆలోచిస్తే, ఈ పద్యం వచ్చింది।

నల ఉవాచ-
మ। విధియో కాలఁపు వక్రదృష్టివలనో పేరాశ హెచ్చించెనో
మదిలో మూఢఁపు భావజాలమహిమో మత్కర్మ సంక్షిప్తమో
కద నేడీగతి నిద్దఱం వనములో నీవుఁనైనుఁ వనిలోకష్టాల పాలైతిమే
పదవే ముందుకు ధైర్యచిత్తముననో పద్మాక్షి చింతింపకే

ముందు రెండు పాదాలు వ్రాసాక ఇది నలునకు అన్వయించుకోవచ్చునని దానికి తగ్గటు మూఁడవ పాదము వ్రాసాను।

ఇప్పుడు పెద్దలు వచ్చి దిధీలకు ప్రాసచెల్లదంటారు!!!

ఇంసోమ్నియపు పద్యాలు ౧

12 comments:

 1. chala baga visleashimchaaru...

  ReplyDelete
 2. ద కార ధకారముల ప్రాసచెల్లించవచ్చు అనుకుంటానండీ .. లాక్షణికులమాటేమోగానీ, ప్రచారంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. మీ పద్యం బాగా వచ్చింది ...
  నాల్గో పాదంలో ననో దగ్గఱ ఒక నిముషం ఆగాల్సి వచ్చింది. మొదటి రెండు పాదలూ ఒక తూగులో ఉన్నాయి, తరువాతి రెండు ఒక తూగులో ఉన్నాయి - అనిపించాయి
  భవదీయుడు

  ReplyDelete
 3. అజంతమైన తెలుగుభాషలోనే రాస్తానని పట్టుబట్టి మళ్ళీ "మత్కర్మ" అంటూ సంస్కృత ప్రత్యయాల జోలికెందుకు వెళ్ళడం? అలానే "ఇద్దరము" అని కాకుండా చక్కగా మనం మాట్లాడుకొనే భాషలో "ఇద్దఱం" అని రాసి మళ్ళీ "నేడీగతి నిద్దఱం" అంటూ, నుగాగమాన్ని తేవడం ఎందుకు, "నేడీగతి ఇద్దఱం" అనవచ్చుగా. అలాగే పద్యంలో మిగిలిన గ్రాంథిక ప్రయోగాలూను.
  చక్కగా మనం మాట్లాడే తెలుగులో మత్తేభాన్ని రాసి చూడండి, ఆ గజగమనం ఎంతందంగా ఉంటుందో! :-)
  "ద" "ధ"లకు ప్రాస చెల్లుతుందనడానికి నన్నయ్యే మనకి సాక్ష్యం.

  ReplyDelete
 4. కద నేడీగతిన్+ఇద్దఱం
  తప్పొచ్చింది కదా ఇద్ధరం అని ఉండాలనుకుంటా, ఈ ధరను అనే అర్ధం లో అయితే
  ధర లో బండి ఱా ఉంటుందా అని నా సందేహం
  అలాకాక ఇద్దఱు అనే అర్ధంలో అయితే ఇద్దఱం గ్రామ్యంగా ఉన్నట్టనిపిస్తున్నది కదా.
  నా అభిప్రాయాలు సరియైనవో కాదో తెలియజేయ గలరు.

  ReplyDelete
 5. నాకు మత్తేభాలు, శార్దూలాలు రావు, కాబట్టి కామెంటడం చేయలేను. యతి స్థానంలో విఱుపు, పొల్లులు లేకపోవడం,పాదం పాదం కలువకపోవడం ఇవన్నీ సత్ లక్షణాలన్నమాట. నేనిన్నాళ్ళు ఏదో కాంప్లెక్స్ లో ఉండి అలా రాయడం ఉత్తమ లక్షణం కాదన్న భావంలో ఉన్నాను!

  ReplyDelete
 6. బాగుందండీ. సమయాభావం వల్ల వివరంగా వ్యాఖ్యానించలేక పోతున్నాను.

  ReplyDelete
 7. మీరు చెప్పిన మూడు విషయాలలోనూ, మొదటిది మూడవది పేలవంగా ఉన్నాయి. మార్పు తరువాత మీ పద్యం బావుంది

  ReplyDelete
 8. భైభ।కా।రా గారు,
  ను గాగమం వచ్చినంతన అజంతం కాకుండా పోతుందా। న్ పొల్లు పెట్టకుండా, అరసున్నానో ను కారమో వుంటే అజంతమేగా। మత్కర్మ సంక్షిప్తమా, ఏం జేస్తాం మత్తేభం వ్రాయాలంటే మత్కరం వలన అలాంటి పదాలు వాడవలసి వస్తుంది। :D

  మ।న।రా గారు,
  ఇద్ ధరన్ అనే ప్రయోగం చాలా బాగుంది, ఇప్పుడు దానిని వాడితే మీ దగ్గర నుండి కాపీ అవుతుంది :b

  రవి గారు, సల్లక్షణం అండి సంధి। మీకు తెలిసేవుంటుంది! వెల్ యర్

  కంది శంకరయ్యగారు,
  ఈ అంశమై, మీ అమూల్యమైన అభిప్రాయాలు వినడానికి ఎంతో వువ్విళ్ళూరుతున్నాను।

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. గిరిగారూ,
  నేను సులక్షణసారమూ, అప్పకవీయమూ చదవలేదు, చూడనూలేదు। అందరి బ్లాగర్ల లానే మిడిమిడి జ్ఞానంతో అభిప్రాయాలు వ్రాస్తూవుంటాను। బ్లాగ్విజయరహస్యాల్లో ఇదొకటి। దీనినే democratization of science అంటారేమో। ఎక్కువ మంది అభిప్రాయాలు ఎటు వుంటే అదే నిజమని।

  మొన్ననే చింతారామకృష్ణగారి ఇంట్లో జరిగిన ఆసక్తికర సంభాషణలో కవిత్వంలో ఛందస్రూపేణ ఛాందసం ఎంతవఱకూ వుంటే రుచిస్తుందో అన్నది వ్యక్తికీ వ్యక్తికీ మారుతుందని తీర్మానించుకున్నాం। కొందరికి తురంగబంధం వుంటే బాగుంటుంది (రామకృష్ణగారు), కొందరికి వృత్తాల వఱకూ చాలు(రాఘవ), కొందరికి గీతాలు చాలు(నాకు), కొందరికి మాత్రాఛందస్సు బాగుంటుంది(శ్రీశ్రీ), కొందరకవేమీ వుండకూడదు (ఠాగూరు, తిలక్)।

  ప్రమాణాల గుఱించి...
  యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః|
  స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే|| 3-21 ||

  ReplyDelete
 11. అన్యభాషాసమామప్రయోగమునకు క్షంతవ్యుడను ।
  democratization of science = శాస్త్రీయమందమన్యము అనుకోండి।
  దుష్టసమాసమునకు అంతగా క్షంతవ్యుడను కాను ॥

  ReplyDelete
 12. Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it 

  Telugu Academy Funds Fraud - this site also provide most trending and latest articles

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం