మహాభారతము వనపర్వము అధ్యయము ౧౩౯
తతోఽహం స్తూయమానస్తు తత్ర తత్ర మహర్షిభిః।
అపశ్యముదధిం భీమమపాం పతిమథాఽవ్యయమ్॥ ౧
తతః = పిమ్మట
ఋషిభిః = ఋషులచేఁ (ఇకారాంత పుఁల్లింగ తృతియా బహువచనము)
తత్ర తత్ర = సర్వత్ర
స్తూయమానః = ప్రశంసితుఁడనైన (ప్ర। ఏ।)
అహం = నేను
తు =
అపాం = నీళ్ళయొక్క (పకారాన్త నిత్యబహువచన అప్ శబ్దము సష్ఠి బహు।)
పతిం = పతిని (ద్వి। ఏ।)
అవ్యయం = నాశరహితుణ్ణి (ద్వి। ఏ।)
భీమం = భయంకరుణ్ణి (ద్వి। ఏ।)
ఉదధిం = సముద్రుణ్ణి (ద్వి। ఏ।)
అథా = అలా
అపశ్యమ్ = చూచితిని (దృశిర్ లఙ్ అనద్యతనభూతకాలము ఉత్తమపురుష ఏకవచనము)
భావము - పిమ్మట ఋషులచే సర్వత్ర ప్రశంసితుఁడనగు నేను జలముల పతి, అవ్యయుఁడు, భయంకరుఁడునగు సముద్రుఁడిని జూచితిని।
ఫేనవత్యః ప్రకీర్ణాశ్చ సంహతాశ్చ సముత్థితాః।
ఊర్మయశ్చాత్ర దృశ్యన్తే వల్గన్త ఇవ పర్వతాః॥ ౨
ఫేనవత్యః = ఫేనవతులు = నుఱగ గలిగినవి (స్త్రీలింగ వతీ ప్ర।బహు।)
ప్రకీర్ణాః = చిందరవందరగానున్నవి (ప్ర। బహు।)
సంహతాః= పరస్పరము తాకుచున్నవి (ప్ర। బహు।)
సముత్థితాః= మిక్కిల ఎత్తయినవి (ప్ర। బహు।)
ఊర్మయః= అలలు (ప్ర। బహు।)
అత్ర = ఇక్కడ
వల్గన్త= ఎగురుచున్న
పర్వతాః = పర్వతములు (ప్ర। బహు।)
ఇవ = వలె
దృశ్యన్తే = చూడఁబడుచున్నవి (ఆత్మనేపది దృశిర్ కర్మణి ప్రయోగము లట్ వర్తమానకాలము ప్రథమ పురుష బహువచనము)
భావము - నురగగలిగిన చిందరవందరగానున్న పరస్పరము తాకుచున్న మిక్కిల ఎత్తయిన, ఎగురుచున్న పర్వతములవలెనున్న ,అలలు ఇక్కడ కనబడుతున్నవి॥
నావః సహస్రశస్తత్ర రత్నపూర్ణాః సమన్తతః।
తిమింగిలాః కచ్ఛపాశ్చ తథా తిమితిమింగిలాః॥౩
తత్ర = అట
సమం తతః = అన్ని వైపుల
రత్నపూర్ణాః = రత్నభరితములు (ప్ర। బహు।)
సహశ్రసః = వేలకొలదులు (ప్ర। బహు।)
నావః = నావలు (ఔకారాన్త స్త్రీలింగ నౌశబ్దము ప్ర। బహు।)
చ = మఱియు
తిమింగిలాః = తిమింగిలములు (తిమిచేపలను మ్రింగునవి) (ప్ర। బహు।)
కచ్ఛపాః = తాబేళ్ళు (ప్ర। బహు।)
తిమితిమింగిలాః = తిమితిమింగలములు (పెక్కు తిములను మ్రింగునవి) (ప్ర। బహు।)
(దృశ్యన్తే = చూడబడుచున్నవి)
భావము - అట అన్నివైపులను రత్నభరితమైన వేలకొలది నావలు, తిమింగిలములు, తాబేళ్ళు మఱియు తిమితిమింగిలములు గోచరించుచుండెను॥
-=-
తిమింగిలగిల = తిమింగిలములను మ్రింగునది।ఆపటే నిఘంటువులో తిమింగిలము పదము క్రింద ఈ శ్లోకార్ధము ఉదహరించఁబడినది।
తిమిఙ్గిలగిలోఽప్యస్తి తద్గిలోఽప్యస్తి రాఘవః cf. Bv.1.55 ॥ (తిమిఙ్గిలగిలః అపి అస్తి, తత్ గిలః అపి అస్తి)
అనగా, తిమి మ్రింగెడిదానిని మ్రింగునదియును గలదు, అద్దానిని మ్రింగునదియును గలదు రాఘవ!
'అంతనికంటెఁ ఘనుఁడు ఆౘంట మల్లన్న' అన్న సామెత కంటెనొక అడుగు ముందుకు వేసిందిది।
మూలములు
౧) ఇవి పండిత దామోదర సాత్వలేకరుల సంస్కృతపాఠమాలనుండి గైకొనఁబడినవి। తప్పులుంటే అక్కడి అక్షరదోషముల వలనఁ గావచ్చు, లేదా నా తప్పులు కావచ్చు।
౨) నా నెయ్యఁడు అప్రాచ్యదేశాన పుట్టిపెరిగినవాఁడు కుమారుఁడు ఈ గూటిని వ్యవస్థాపించుచున్నాడు। చూచి సమర్థించగలరు।
౩) డెహలీలోని ఓ విశ్వవిద్యాలయం వారి ఈ గూడు కూడా దర్శనీయము (fut. pass. part.)
చాలా బాగుందండీ.వరుసగా వ్రాస్తూ ఉండండి.
ReplyDeleteinscript లో దీర్ఘం, ప్లుతం గుర్తు 2 కి,చకారానికి(పైన 2 గుర్తు ఉండేదాన్ని) ఎలా టైపాలో చెప్పండి.