తస్మిన్కాలే నయనసలిలం యోషితాం ఖణ్డితానాం
శాన్తిం నేయం ప్రణయభిరతో వర్త్మ భానోస్త్యజాశు
ప్రాలేయాస్రం కమలవదనాత్సోఽపి హర్తుం నలిన్యాః
ప్రత్యావృత్తస్త్వయి కరరుధి స్యాదనల్పాభ్యసూయః
తస్మిన్కాలే - ఆ సూర్యోదయకాలమందు
ఖండితానాం యోషితామ్ - ఖండిత నాయికలయొక్క (తన కాంతుఁడు మఱియొక కాంతంగూడెనని తెలిసి యీర్ష్యాకుపితయగు కాంత ఖండిత యనఁబడును)
నయనసలిలమ్ - నేత్రజలము (బాష్పము)
శాన్తిం నేయమ్ - శాంతి పొందింపఁదగినది (అనఁగా మాన్పఁదగినది)
అతః - ఆ హేతువువలన
భానోః - సూర్యునియొక్క
వర్త్మ - మార్గమును
ఆశు - త్వరగా
త్యజ - వదలుము (అట్లు తొలఁగనియెడల చెఱుపుగలదు। ఏమన)
సోఽపి - ఆ సూర్యుఁడును
నాళిన్యాః - తామరతీఁగ (యనెడు తనకాంత) యొక్క
కమల - తామరపువ్వను
వదనాత్ - ముఖమునుండి
ప్రాలేయ - మంచనెడు
అస్రమ్ - బాష్పమును
హర్తుమ్ - మాన్పుటకు
ప్రత్యావృత్థః - మరలవచ్చినవాఁడయి (సూర్యుఁడు దేశాంతరములో మఱియొక నిళినిని గూడినాఁడు గావున ఇచటినళిని ఖండితయైనది యని యభిప్రాయము)
త్వయి - నీవు
కర - కిరణములను
రుధి - అడ్డఁగా
అనల్ప - విస్తారమయిన
అభ్యసూయః - ద్వేషముగలవాఁడు
స్యాత్ - అగును
తా। - సూర్యోదయకాలమందు ఖండితనాయికల బాష్పములను నాయకులు వచ్చి తుడిచి మాన్పుట యావశ్యకము గావున సూర్యుఁడను నాయకుఁడు ఇచటి నళినిని వదలిపోయి దేశాంతరమందు నళినీసంగతిచేసి వచ్చియుండుటచేత ఖండితనాయికయైన యిచటి నళిని ఆ దుఃఖముచే మంచుమిషచే కమలమనుముఖమొల్ల బాష్పములుగా శోకించుచుండును। ఆ బాష్పములను తుడిచి ఆమె శోకమును మాన్చుటకు సూర్యుఁడు వచ్చి కిరణములనెడు హస్తములను చాఁపున। ఆ కరములకు నీవడ్డపడిన ఆ భగవంతుని కధిక ద్వేషము నీపైఁగలుగును, కావున ఆయన కడ్డపడక త్వరత్వరగా తొలఁగి పోవుచుండుము। సూర్యుఁడు నాయకుఁడుగాను నళిని ఖండితనాయికగాను కమలము ముఖముగాను మంచు బాష్పములుగాను కిరణములు చేతులుగాను కిరణములు కమలములపై ప్రసరించి మంచును కరఁగించి జాఱి పోఁజేయుట కన్నీళ్ళు తుడుచుట గాను వర్ణింపఁబడినవి॥
రాకేశ్వరవాఖ్య - ఈ పద్యము మేము మా సంస్కృత తరగతిలో చదివితిమి। భార్యావియోగముచే బాధింపఁబడు యక్షుఁడు తన భార్యకు సందేశముఁ బంప దూతగా మేఘుఁడను నియమించుకొనెను। వానికి యక్షుఁడు తన భార్యయుండు అలకానగరమునకు మార్గము చెప్పుచున్నాడు। అలా ప్రొద్దుపొడుపు వేళన నీవు ఆలస్యము చేసిన సూర్యభగవానుఁడు (పైన చెప్పిన కారణముచే) నీ పై కోపింతును కాన జాము చేయకుము అని చెప్పుచున్నాడు। ఏమి కౌటిల్యము యక్షునది। తన కార్యము బేగ సిద్ధించవలెనన మేఘుఁడు ఆలస్యము చేయరాదు। అందుకుగాను సూర్యుని కోపింతువని నెపముఁ బెట్టుచున్నాఁడు। "నాకు ఏ ఇబ్బందీ లేదు, కానీ ఆ సూర్యునికి కోపము వచ్చును। అహో ఏమి టక్కరి" అని నా ప్రవాసభవుఁడగు సహాధ్యాయి మెచ్చెను। పాశ్చాత్యయగు వేఱొక సహాధ్యాయిని ఏమి వెనుకకు భారతఖండములో మగవారు రాత్రి వేఱొక చేట గడిపి వచ్చి ప్రొద్దుట కాంతలకు నచ్చజెప్పిన సరిపోయెనా అని కాస్త కోపించెను। ఈమె స్త్రీవాది ద్రౌపది అభిమానురాలు కాబట్టి రోషము తగును। ఈమె తన నాలుగేండ్ల కళాశాలవిద్యకు సారాంశముగా ద్రౌపది మీద పెనువ్యాసము వ్రాయుచున్నది। భారతమున ఇటువటి యువతులు కొఱవడిరిగదా॥
మూలము - కాళిదాసుని మేఘదూతకావ్యమునకు మల్లినాథుని సూరి వ్యాఖ్యానమునకు వేదం వేంకటరాయ శాస్త్రి కూర్చిన తెలుఁగు సేత నుండి సంగ్రహితము।
అద్భుతం!!
ReplyDelete>>భారతమున ఇటువటి యువతులు కొఱవడిరిగదా॥
ReplyDeleteఎటువంటి యువతులు? స్త్రీవాదులా? వారలకు కొదవేమి! :-)
ద్రౌపది మీద పరిశోధనా వ్యాసములు వ్రాసిన యువతీమణులు కూడా పెక్కుమంది ఆంధ్రదేశమునందునే గలరు.
ఇంతకూ యీ శ్లోకమునందు, సూర్యుడొక చోట నస్తమించిన బిదప మరియొక చోట నుదయించి, యచటి నళీనీకాంతలతో సల్లాపుములాడుననెడి శాస్త్రీయ విషయముందని మీరుగాని మీ పాశ్చాత్య సహాధ్యాయులుగాని గుర్తించిరా?