భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, September 16, 2011

కాళిదాసుని మేఘదూతములో అమోఘమైన ద్వంద్వార్థములు


అద్రేః శృఙ్గం హరతి పవనః కింస్విదిత్యున్ముఖీభి
ర్దృష్టోత్సాహశ్చకితచకితం ముగ్ధసిద్ధాఙ్గనాభిః
స్థానాదస్మాత్సరసనిచులాదుత్పతోదఙ్ముఖః ఖం
దిఙ్నాగానాం పథి పరిహరన్స్థూలహస్తావలేపాన్

పవనః - వాయువు
అద్రేః - (చిత్రకూట) పర్వతముయొక్క
శృఙ్గమ్ - శిఖరమును
హరతి కింస్విత్ - పెల్లగించి కొనిపోవుచున్నాఁడాయేమి
ఇతి - అని
ఉన్ముఖీభిః - మొగము ఎత్తికొన్న
ముగ్ధ - మూఢలయిన
సిద్ధాఙ్గనాభిః - సిద్ధలస్త్రీలచేత
చకితచకితమ్ - భయపడినయట్లుగా
దృష్ట - చూడఁబడిన
ఉత్సాహః - సంరంభముకలవాఁడవై
సరస - తడిగల
నిచుళాత్ - నెలప్రబ్బలి చెట్లుగల
అస్మాత్ స్థానాత్ - ఈచోటినుండి
పథి - (ఆకాశ) మార్గములో
దిఙ్నాగానామ్ - దిగ్గజములయొక్క
స్థూల - లావైన
హస్త - తుండముల యొక్క
అవలేపాన్ - విసరివేయుటలను
పరిహరన్ - తప్పించుకొనుచు
ఉదఙ్ముఖః - (అలకాపట్టణము ఉత్తరదిక్కున నుండుటచేత) ఉత్తరాభిముఖుడవై
ఖమ్ - ఆకాశమునకు
ఉత్పతత - ఎగురుము

తా - నీవు ఆకస్మికముగా ప్రయాణోత్సాహముతో కొండమీఁదినుండి ఆకాశములోనికి జరుగునప్పుడు నిన్ను కటకములలో విహరించుచుండు సిద్ధాంగనలు కని ఆకొండ శిఖరమును వాయువు పెల్లగించుకొనిపోవుచున్నది కాఁబోలు । అది తమనెత్తిమీఁద పడును కాఁబోలు అని (అట్టి శృంగము వని తలఁచి) నిన్ను బెదరి బెదరి చూతురు। నీవు సరసములయిన నేలప్రబ్బలిచెట్లున్న యీ చోటినుండి ఆకాశమున కెగసి దారిలో దిగ్గజములతొండపువిసరులను తప్పించికొనుచు ఉత్తరదిక్కును గూర్చిపొమ్ము।
{రాకేశ్వర వ్యాఖ్య - వెనుకటి కవుల ప్రకారము వాన యెట్లు కుఱుయుననగా। అష్టదిక్కుల యందు ఏనుగులు ఎనిమిది ఆకాశమును ఎక్కుపెట్టు చుండును। అవి వాటి తొండములతోఁ కడలినీటిని గైకొని వాటితో మేఘములను నింపును। ఆ మేఘములు నేలపై వర్షించును। కాబట్టి ఆ ఏనుగుల తొండములు తగలుటచే వాటిల్లు ముప్పు నుండి మేఘములు అప్రమత్తముగానుండవలెనని యక్షుఁడు, తన అమూల్య సందేశమును ఉత్తరదిక్కున అలకానగరముననున్న తన భార్యకై గైకొను, దూతయగు మేఘమునుకు గుర్తుచేయుచున్నాడు}

అంతరార్ధము -
సరస - రసికుఁడయిన
నిచుళాత్ - నిచుళుఁడనుకవియున్న (నిచుళుఁడను కవి కాళిదస సహాధ్యాయి, అతఁడు కాళిదాస ప్రబంధములపై ఇతరులు చెప్పిన దూషణములకు సమాధానములు చెప్పి పరిహరించినవాఁడు)
అస్మాత్ స్థానాత్ - ఈచోటినుండి
ఉదఙ్ముఖః సన్ - దోషలేమిచేత తల ఎత్తుకున్నవాడివై
పథి - దారిలో
దిఙ్నాగానామ్ - కాళిదాసుని ప్రతిపక్షియయిన దిఙ్నాగాచార్యునియొక్క
హస్తావలేపనాత్ - హస్త విన్యాస పూర్వకములయిన దూషణములను (అనగా దిఙ్నాగాచార్యుఁడు చేయు దూషణములను)
పరిహరన్ - తప్పించుచు
అద్రేః - పర్వతము వంటి వాడైన దిఙ్నాగాచార్యునియొక్క
శృఙ్గమ్ - ప్రాధాన్యమును
హరతి ఇతి - హరించుచున్నది అను హేతువు చేత
ముగ్ధ - అందముగలవారైన
సిద్ధ - సారస్వత సిద్ధులచేత (అనగా మహాకవులచేత)
అఙ్గనాభిః - స్త్రీలచేతను
దృష్టోత్సాహస్సన్ - చూడఁబడిన సంరంభము కలదానవగుచు (కలవాఁడవగుచు)
ఖమ్ ఉత్పత - ఉన్నతమవు (లేక ఉన్నతుఁడవు) గమ్ము, అని తన ప్రబంధమును గూర్చి గాని (తన్నుఁ గూర్చిగాని) కవి చెప్పుట।

తా- ఓ నా గ్రంథమా మేఘసందేశాఖ్యమా రసజ్ఞుఁడయిన నిచుళకవియున్న యీ తావునుండి బయలువెడలి సకలదేశములందును వ్యాపింపుము। దారిలో దిఙ్నాగాచార్యుఁడు చేయునట్టి దురాక్షేపములను సరకుసేయకుము, వానికెల్ల నా మిత్రము నిచుళకవి సమాధానముచెప్పునులే। ఆ సమాధానముల ముందు ఆ దురాక్షేపములు నిలువలేవు। అందుచేత నీ వలన శైలమువంటి యాదిఙ్నాగాచార్యునికి శృంగభంగము (అనఁగా అవమానము) కలుగును। అట్లు ఆతనికి నీవు శృంగభంగము కలుగఁజేయు హేతువు చేతను నీయందలి స్వారస్యమును బట్టియు నిన్ను మహాకవులును విదుషీ జనులును ఆచరింతురు। అట్లు ఆదృతమవై నిర్దోషమవగుటచేత నీవు పూర్ణోత్సాహముగా గొప్ప తావులకెల్ల వ్యాపించి కీర్తి పొందుము।
{రాకేశ్వర వ్యాఖ్య - దిఙ్నాగాచార్యుఁడు కాంచీపురమునకు చెందిన తిబెత్తుచీనాదులయందు సైతము సుప్రసిద్ధుఁడైన బౌద్ధ తత్త్వవేత్త।}

మూలము - కాళిదాసుని మేఘదూతకావ్యమునకు మల్లినాథుని సూరి వ్యాఖ్యానమునకు వేదం వేంకటరాయ శాస్త్రి కూర్చిన తెలుఁగు సేత నుండి సంగ్రహితము।

6 comments:

 1. దిఙ్నాగాచార్యుఁని కుందమాల ఆతని వికీలంకె లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆయనకూ, కాళిదాసుకు మధ్య ఆ గొడవేమిటి? మీ అయ్యవారేమైనా చెప్పారా దాని గురించి? తెలిస్తే చెప్పగలరు.

  ReplyDelete
 2. కాశిదాసునకూ ఆనాటి బౌద్ధతత్త్వవేత్తలకూ గొడవని నేను రాహుల్ సంకృత్యాయనం పుస్తకంలో కూడా చదివినట్టు గుర్తు।

  మా అష్టానుపోరుడు సంస్కృతం పంతులకు వేదం వారి పుస్తకం నుండి ఈ తంతు వివరించగానే ముఖము వెయ్యివాట్లబల్లులా వెలిగిపోయింది తన్మయత్వంలో। అంతకు మించి ఆయనకు మాటలు రాలేదు। :) ఆయన స్వయానా ఒక మాదిరి బౌద్ధుఁడనుకుంటాను॥

  ReplyDelete
 3. :)

  బౌద్ధుఁడైనా అయుండాలి, లేదా ఆధునిక చరిత్రకారుఁడు, లేదా ఆ చరిత్రకారుల ప్రేమికుఁడైనా అయి ఉండాలి. వాళ్ళకు మేఘధూతము కావ్యంకన్నా, ఇలాంటి పిట్టకథల పైన ఆసక్తి ఎక్కువ.

  గొడవ ఉందో లేదో, సాంకృత్యాయనం గారు మాత్రం కల్పించారు. అంతే. నేను నిన్ననే కుందమాల చదవడం కష్టపడి పూర్తి చేశాను. అందులో దిఙ్నాగాచార్యుఁడు హైందవం మీద పనిగట్టుకుని చెవాకులు వ్రాసినట్టు కనిపించలేదు.

  ఒక్క శ్లోకం మాత్రం దిఙ్నాగాచార్యుఁని వద్ద నుండి కాళిదాసు ప్రేరణ/కాపీ/కాకతాళీయమైన అనుసరణ చేసినట్టు ఉన్నది.

  ReplyDelete
 4. ఆయనకు తన్మయత్వం కలిగింది ద్వంద్వార్థం చేతఁ। మేము రసికులమండి రాజకీయం పట్టదు।

  ReplyDelete
 5. మళ్ళీ తిరగబెడుతున్నాను. అన్యథా భావించవద్దు.

  >>దిఙ్నాగానామ్ - కాళిదాసుని ప్రతిపక్షియయిన దిఙ్నాగాచార్యునియొక్క
  దిఙ్నాగః - రామ శబ్దం లా అనుకుంటే - (రామస్య రామయోః రామాణామ్) దిఙ్నాగానామ్ - బహువచనమ్ అవుతుంది. దిఙ్నాగుల యొక్క అంటే భూమిని మోస్తున్న ఏనుగుల యొక్క అనే అర్థం చెప్పుకోవలసి వస్తుంది. అప్పుడు ద్వంద్వార్థం అవదు కదా.

  మరో ముక్క. దిఙ్నాగాచార్యుఁడు చిత్రకూటము నుండి రామ టేక్ మధ్య దారిలో లేడు. అంతకన్నా క్రింద దక్షిణాన కాంచీపురంలో ఉన్నాడు.

  ReplyDelete
 6. తెలుఁగులో రాములోరి మహిమ (రామాణామ్ మహిమా) అంటాము, అంటే అనేక కల్పాలలోని అనేక రాములు అనే అర్థం రాదు। గౌరవార్థకంగా చెప్పుకోవాలి।
  మామూలు దిగ్గజాలు కూడా ఎక్కడినుండి వేఱెక్కడికి పోయినా ఆ దారిలో వుండనేవుండవు ఎందుకంటే అవి దిక్కుల అంతాలయందు వుంటాయి, కానీ వాటి హస్తాలు అన్ని చోట్లుకూ చేరుకొనగలవు। ఇదీ అంతే।

  రామాయణంలో పిడకలవేట వలదు। అదీ నాతోను। వేఱే గూదరులతో ఇలా వాదిస్తే తుగుతుందేమే। ఏరణ్డమవలమ్బ్య కుంజరం న కోపయేత్। శ్రీశ్రీ ఇందుకేనేమో సంపాదకుడికీ చింపాంజీకీ ప్రాసవేసింది।

  ఆ మాట కొస్తే మేఘానికి సందేశం ఇవ్వడమేమిటి మతి లేకపోతే అని కవిత్వాన్నంతటినీ కొట్టిపాఱవేయవచ్చు। లేద కోతులు సముద్రాలు దూకడమేమిటి అని రామాయణాన్ని కొట్టి పారవేయవచ్చు।

  రెండు రకాలుగా బ్రతకవచ్చుఁ, ఒకటి నిరంతరం అమ్మవారి వైభవానికి అబ్బురపడుచూ। నే చెప్పినట్టు మా సంస్కృతం పంతులుకి ఈ రెండో అర్థం చెప్పగానే మోము వెలిగిపోయింది ఆయన పిడకలు వెదకలేదు। ఆహా ఒకే పద్యానికి అదీ మన్దాక్రాన్తంలో రెండు అద్భుతమైన అలంకారబూయిష్టమైన అర్థాలు ఎలా తెప్పించాడా అనుకున్నాడు।

  తర్కానికి దిగాలంటే దిగవచ్చు, కానీ ఎక్కడ దిగాలో అక్కడే।

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం