భాషందం, భువనందం, బ్రతుకందం

Sunday, November 27, 2011

రాక్ష్టా - ఓ చెత్త సినిమా

ద ఇమ్మోటల్స్ చూసి ఇంకా తేరుకోక ముందే ఇంకో దెబ్బ దగిలింది। అదే ఈ రాక్ష్టా। రెండిటిలో ఒకటి ఎక్కువా ఒకటి తక్కువా అని చెప్పలేము।

కట్ చేస్తే వారం రోజుల క్రితము మా స్నేహితుఁడు బాష్టను నుండి వచ్చాడు। మంచి తెలుఁగు కుఱ్ఱవాళ్ళలాగా మేమూ సినిమాకి వెళదామని నిర్ణయించుకున్నాము। మంచి వ్యక్తులుగా అది తెలుఁగు సినిమా కాకూడదని తీర్మానించుకొని, ఎంచుకొన జూస్తే రాక్ష్టా ద ఇమ్మోటల్స్ కనబడ్డాయి। రాక్ష్టా కు టిక్కెట్లు దొరక్క ద ఇమ్మోటల్స్ కు వెళ్ళాము। దైవాసుర సంహారం చూచి తరించుదామనుకున్నాను , కానీ సినిమా ఎం బాలేదు।

పౌరాణికంలో వుండవలసిన లోతు లేదు। పౌరాణికం అంటే కేవలం దేవుళ్ళ మాయలే కాకుండా మనిషి తన జీవితం గుఱించి ఆలోచించుకునేడట్టు చేయాలి। అందుకే మనవారు శ్మశాన, ప్రసవ వైరాగ్యాలజతన కథాకాలక్షేపవైరాగ్యం కూడా చేర్చారు। శ్మశానంలో మీకు ఎంత వైరాగ్యస్ఫూర్తి కలుగుతుందో రాములోరి కథ విని అంతే వైరాగ్యం కలగాలి లేక్కప్రకారం। ఏమో ఇది నా భారతీయ పెంపకప్రభావం అని కొట్టిపాఱవేసినా। ఈ సినిమా అటు సూపర్ హీరో చిత్రంలా లేదు। ఇటు పైరేట్స్ అప్ కరీబియన్ చిత్రాల్లానూ లేదు। యాక్షన్ చిత్రమా అంటే టరాంటినో పండించినట్టు జగుప్సారసాన్ని అస్సలస్సలే పండించలేదని చెప్పాలి। ప్రీడా పింటో నటన బాగానే చేసిందని చెప్పాలి। నాకు ఆమె ఈ సినిమాలోనుందని తెలియనే తెలియదు। ఏది ఏమైనా అటు స్పైడర్ మాన్ , ఇటు పైరేట్స్ ఇంకా ఇటు టెర్మినేటర్ వంటి ఏ చిత్రంతో పోల్చుకున్నా ఇది బాగాలేదు। నాకు నచ్చిందల్లా ఒక రెండంటే రెండేచోట్ల సినిమాటోగ్రాఫీ। నీళ్ళ కుండ నుండి సముద్రానికి కట్ చేయడం । అది మాయాబజార్ సినిమాలో చూసిందేగా అంటే నేనేమీ చెప్పలేను।।

ఈ వారాంతం అనగా శుక్రవారం రాత్రి ఎలిజబెత్తు , ఆమె మొగుడూ (మొగుడంటే ఈ దేశాన నానార్థాలు వున్నాయనుకోండి) వారి మిత్రుడొకనితో ద ఇమ్మోటల్స్ కు వెళ్ళారు। నేను ఎంత నచ్చజెప్పినా వినలేదు। అబ్బే ప్రీడా పుంటో ప్రీడా పుంటో అన్నాడు బెత్తమ్మ మొగుడు, బెత్తమ్మకు కోపం వచ్చే వరకూ। ఏది ఏమైతేనే వెళ్ళి వచ్చారు। తెగ నిరాశ పడ్డారు। ఏం బాబూ ఏమైందిరా అంటే సినిమా మధ్యలో ఎవడో ఫైర్ అలాం మ్రోగించాడు కాబట్టి ఆటని నిలిపేసి రేపు రమ్మన్నారు అన్నాడు। పోనీలే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేపు వేఱేమైనా సినిమాకు వెళ్ళండని చెప్పాను।

రేపు రానే వచ్చింది। రాకేశ్ నువ్వు కూడా రారాదు। ప్రీ టికెట్ ప్రీ టికెట్ అన్నారు। నాయినా ఆ సినిమా నేను ఉత్తనే చూపించినా చూడను। సరే మాతో పాటు రా, వేఱే సినిమాకు వెళుదూగాని అన్నారు। అలాగైనా మీ ఇద్దఱికే ప్రీ నా కడ నిన్నట్టి టిక్కెట్టు లేదు అన్నాను। అబ్బే పర్వాలేదు। పోయిందని చెబుదాం వాడే ఇంకోటి ఇస్తాడు అన్నారు। మఱీ ఇది దేశీబుద్ధిలావుంది, బాగుండదు మా దేశం పరువు కాపాడాలన్నా వినలేదు। అమెరికాలో గమ్మత్తు ఏంటంటే, మీరు ఇంకో ఇద్దరు తెల్లవాళ్ళతోఁ బాటూ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరకీ ఇచ్చింది మనకు ఇవ్వకపోతే, వర్ణవిచక్షణ అవుతుందేమోనని వారి భయం। తెల్లవాళ్ళు వెనకటికి మనల్ని తక్కువజాతి వారిని చేసి పరిపాలించినందుకు గాను వారికా పాపభీతి మిగిలిపోయింది। దాన్ని మనము ఇలా చెత్త సినిమాల రూపేణ క్యాష్ చేసుకోవాలన్నది నా మతం। నన్నడిగితే ఇంత కథ కూడా అవసరం లేదు। టిక్కెట్టు పోయిందంటే సరేనంటారు ఎవరికైనా సరేఁ। కానీ ఇలా పరదేశంలో నమ్మకాలని వమ్ముజేస్తే ఇది కూడా మనదేశంలా మారిపోతుందని ధర్మసంకటం గలిగింది। మా తాతలు వరిబస్తాలుగా కట్టిన పన్నులో కాస్త వసూలీ అని చెప్పి నేను ఆత్మారాముడికి ధర్మం సరిఁజెప్పుకున్నాను।

బెత్తమ్మా, మొగుఁడు ముందు సీట్లలో కూర్చొని నన్ను వెనకడ కూర్చోబెట్టి, బయలు దేరి వెళుతూంటే మధ్యలో నిన్న వాళ్ళ ఒక్క స్నేహితుఁడూ ఇవాళ మఱో ఇద్దర్ని తీసుకొచ్చాడు। ఒక్క కారులో ఆఱుగురం ఎలా వెళతామా అనుకున్నాను। ఏముంది సన్నగా వున్న అమ్మాయిని కాస్తా మిగతావాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది అని చాలా తొందరగా సర్ది చెప్పుకున్నారు మా వాళ్ళు। చిన్నప్పుడు మా చిన్నాన్న మమ్మల్ని హాష్టలు నుండి తీసుకొస్తున్నప్పుడు తెలిసినవాళ్ళ పిల్లల్లు ఎంత మంది కనబడితే అంత మందినీ మా కారులో ఎక్కించేసుకేవాడు। అప్పుడప్పుడూ ఇఱవై మంది పిల్లలం వుండేవాళ్ళం ఆ యాంబీలో। యాంబీ కాబట్టి లాగిందిగానీ ఏ మారుతీనో అయితే చతికిల బడేది। వెనకటికేంటో గానీ మఱీ హాష్టులు పిల్లల్ని శలవలకి తీసుకువెళ్ళడానికి ఎవరైనా వస్తున్నారో లేదో కూడా తెలిసేది కాదు। ఈ రోజుల్లో అయితే సెల్లులు కార్లు గట్ఱా। మొత్తానికి ప్రక్కనేనేమో సినిమా థియేటరీ అని బయలుదేరాం గానీ। మా వాడు ఒక మూఁడు మైళ్ళ తరువాత హైవే ఎక్కించాడు। ఏ ప్రక్కనుండి ఏ కాపు వచ్చి టిక్కెట్టు ఇస్తాడో అనుకన్నాను। ఊఱకనే సినిమా టిక్కెట్టు బదులు డ్రైవింగు టిక్కెట్టు వచ్చేట్టుంది।

మొత్తానికి థియేటరీకి వెళ్ళాము।

---------- ఈ వ్యాసార్ధం క్రితం వారం ఇదే సమయానికి వ్రాసాను, కానీ పని వత్తిళ్ళ వల్ల తరువాత వ్రాద్దామనుకున్న ద్వితీయార్ధం వ్రాయలేక పోయాను। అఱో కొఱో సఱే ననుకొని అచ్చు వేస్తున్నాను -------------

< ఇంతకీ జరిగిందేంటంటే నంట, ఎవరికో ఇమ్మోటల్స్ చూస్తూ గుండెపోటు వస్తే అలాం మ్రోగించారఁట, నేను ఇమ్మోటల్స్ చూసేసాను కాబట్టి ప్రక్కనే అడుతున్న రాక్ష్టాకు వెళ్ళాను। అబ్బో ప్రీగా వచ్చిన హిందీ సినిమా। అదీ మా వోడు రణవీరుడు అనుకుంటూ। చాలా చండాలంగా వుంది, ఎంత చండాలంగానంటే, మా వాళ్ళు మా సినిమా అయిపోయింది అని మధ్యలో టెక్స్టు పంపగానే నేను దూకి మఱీ బయటకు పోయాను। వాడి బాధ ఏమిటో నాకు బొత్తిగా బోధపడలేదు। >

3 comments:

 1. the immortals movie 3D లో ఎప్పుడో చూడటం జరిగింది, కానీ నాకు అందులో అవిశ్వాసి అయిన హీరో కి విశ్వసి అయిన తల్లి, నీ తల్లి విశ్వాసమే నీకు రక్ష అనే హీరోయీన్, తన వారిని రక్షించేందుకు తన ధర్మం తప్పి మరీ రక్షింప బూని తనే ఉనికి లేకుండా చేసుకున్న దైవ దూత, మానవులను మానవరూపంలో ఉన్న మహనీయుడే కాపాడ వలెను కాని మనం కాదని చెప్తూనే, మానవ బలం ఆగిన చోట
  దైవం తక్షణం Titan's గా ప్రత్యక్షం అయ్యే seen అద్భుతం. ఇక పోతే బ్రతికున్న వాళ్ళనే ఉడకబెట్టే violence పాళ్ళు, ఇంకా తనకోసం మాత్రమే మిగితా వాళ్ళు పుట్టినట్లు భావించి అందరిని తన బానిసలుగా మార్చే తరుణం లో నా నా రకాల హింసలు పెట్టె విల్లన్-ism బాగానే ఉంది, అలానే అతగాడిని చంపే ప్రయత్నం లో హీరో dedication యుద్ధం లో అందరిని ఉత్సాహ పరచినా తీరు ...
  ఇక పోతే 3D వైభవం మొత్తానికి highlight నేను ఈ మూవీని ఇలా చూసాను.
  ఒక్క ముక్కలో చెప్పాలంటే "మానవ బలం ఆగిన చోట దైవం సహకరిస్తుంది" అని గ్రహించాను. అది బాగా చూపించారు.
  మీరేమంటారు?
  నేను రాక్ష్ట చూడలేదు
  ?!

  ReplyDelete
 2. వర్ణ విచక్షణ కాదు. వర్ణ వివక్ష. ఎమైనా శ్లేష తో రాశారా?

  ReplyDelete
 3. వివక్ష అనేది వచ్ కి desiderative form. అంటే మాట్లాడాలనే ఆశ అని అర్ధం। తెలుఁగు వారు దాని అర్ధాన్ని ఖూనీ చేసారు। నా సంస్కృతాన్ని పాడుచేసుకోవడం ఇష్టం లేక దానిని వాడలేదు।
  విచక్షణ అంటే బాగుగా చూడడం అని। అసలైతే వైచక్షణ్యం అనాలనుకుంట।

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం