భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, July 04, 2007

బ్లాగ్విజయానికి పది ఉపాయాలు

తెలుగు బ్లాగర్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇది మంచి వార్త అని పెద్దలు మిమ్ము నమ్మింప జేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ మనం తెలుగు వారం, మనకు పోటీ గురించి చిన్నప్పట్నుంచి మన పెద్దలు తెగ నూరిపోసారు. ఎనక ఉగ్గు పాలతో విధ్యలు పెట్టేవారు, కాని మనకిప్పుడు ‘పోటి అంటే భయం’ మాత్రమే పెడుతున్నారు. ఆపోటిని తట్టుకుని మీ బ్లాగు బ్లాగెంసెట్ లో వందలోపు రావాలంటే మా ఒకటో రకం బ్లాగు నుండి కొన్ని బ్లాగ్విజయ రహస్యాలు.

'కష్టే ఫలే' అన్నారు ఆర్యులు. కాని అవి అంతర్జాలం లేని రోజులు. అట్టి నిరాడంబర సూక్తులు ఇప్పుడు పనికి రావు. ఇప్పుడంతా ‘నెట్టే ఫలే’. ఈ జాబితా లో క్రిందకి వెళ్ళే కొద్దీ ఉపాయాల నాణ్యత పెరుగుతుంది. ప్రతి ఉపాయం క్రింద అది ఎంత కష్టమన్నది, దాని వల్ల ఎంత ఫలితమన్నది ‘ఞ’ల ద్వారా తెలుపబడ్డాయి. ఉపాయాలు బాగా వంట బట్టడానికి వాటిని వాడే వారి ఉదాహరణలు కూడా ఇవ్వబడ్డాయి.

ఉపాయం ౧౦ : మేధస్సు
“ఇది చాలా బాగా పనిచేస్తుంది” అనుకుంటే, అది మీ తప్పుకాదు. కానీ, అంతర్జాలంలో మీరింకా శిశువులే అని మాత్రం తెలుస్తుంది. మేధస్సులో చాలా వర్గాలున్నాయి. కొందరు చాలా చమత్కారంగా, హాస్యభరితంగా వ్రాసి ప్రఖ్యాతి గాంచారు. ఈ మేధస్సు వర్గంలోనే ఇంకో ఉపవర్గం తెలుగులో ప్రావీణ్యం. ఈ మేధస్సు మీద ఆధారపడినవారి జాబితా చాలా పెద్దదే, కానీ భయం నాస్తి, ఇది అన్నిటికంటే సార్థకము లేని ఉపాయం.
ఉదా - తోటరాముడు, విహారి, తాడేపల్లి, కొత్తపాళీ, జ్యోతి, రానారె, దీప్తి ధార, రాఘవ , నాగరాజా, వగైరా వగైరా
కష్టే - ఞఞఞఞఞ
ఫలే - ఞ

ఉపాయం ౯ - ఉత్ప్రేక్ష
“ఈ ప్రపంచంలో దేనినీ దేనితోనూ నిరూపించలేం, ఎ తత్వశాస్త్రం తీసుకున్నా అందులో లోపాలుండక తప్పవు” అని మీరు నమ్మే వారైతే, మీకు చాలా ఎక్కవ తెలుసు, కాబట్టి వెఱ్ఱి బాగుల వారు మీ బ్లాగు చదవరు. అంటే ఎవరూ మీ బ్లాగు చదవరు.
కాబట్టి ఒక పనికి మాలిన అంశం తీసుకోండి. దానికి మీ అభిప్రాయం తెలుపండి, దానకి మీ ఉపాయాలు కూడా తెలుపండి. ప్రస్తుతం వేడిగా ఉన్న అంశాలు ‘తెలుగు చచ్చిపోతుంది’, ‘భాషను బ్రతికించుకోండి’, ‘భాషను అధునీకరంచండి’, ‘భాషను మొత్తం చంపేయండి’, ‘భాష మీ-ఇష్టం-వచ్చింది-ఇక్కడ-పెట్టుకోండి’.
ఇలాంటి ఇంకా విషయాలే రాజకీయాలు, దేశపరిస్థితి, సాఫ్టవేరోళ్ళ జీవితం, మావవ హక్కులు, భూగోళ ఊష్ణీభవం, వగైరా వగైరా.
కాని మీరు ఎది వ్రాసినా మీకే అంతా తెలుసు అన్నట్టు వ్రాయాలి, వితండవాదం తప్పదు, ‘నేను తప్పుయ్యిండొచ్చు’ లాంటివి చెల్లవు.
ఉదా: మీ బ్లాగులో చాలా టపాలు, అంభానాథ్, మా గోదావరి, భట్టిప్రోలు, రాకేశ్వర, వగైరా వగైరా
కష్టే : ఞఞఞఞఞ
ఫలే: ఞఞ

ఉపాయం ౮ – రివ్యూలు
దీనికీ పైదానికీ పెద్ద తేడాలేదు. ఇక్కడ, మీరు “చదవకపోయినా నష్టంలేదు”, “చూడకపోతే పాపం కాదూ” అనిపించే పుస్తకాలూ, సినిమాలూ, ఎంచుకొని, వాటిని ‘కొద్దిగా’ చదివి. వాటిమీద “ఈ పుస్తకం చదవని వారి ఉద్యోగం పోతుంది”, “ఈ సినిమా చూడనివారు నరకానికెళతారు”, అన్నట్టుగా ఒక వ్యాసం వ్రాయాలి. అలా చేస్తే మీరు పెద్ద తోపు అనుకుని మీ బ్లాగుకి మళ్ళీ మళ్ళీ వస్తారు.
ఉదా: ౨౪ కళలు, కృష్ రేం, సౌమ్య , గార్లపాటి, వగైరా
కష్టే : ఞ నుండి ఞఞఞఞ (ఫుస్తకంలో ఎన్ని పేజీలు చదివారు అన్నదానిబట్టి )
ఫలే: ఞఞ

ఉపాయం ౭ – చావా లేదా వీవెన్
దీనికి మీరు చావా అయినా వీవెన్ అయినా అయి ఉండాలి. అంతే!
ఉదా : చావా కిరణ్ , వీవెన్ , వైజాసత్య, నేను. అంతే!
కష్టే : ఞఞఞఞఞ
ఫలే: ఞఞఞ

ఉపాయం ౬ – లంకెలు ఇవ్వండి
ఇందులో రెండు రకాలు, సింహ నైజం, నక్క నైజం.
సింహ నైజం, నాలాగా ఇలా బ్లాగు వ్రాసి ఒక పది మందికి బ్లాగులకి లంకె ఇవ్వండి. అలా అందరూ అందరికీ లంకె ఇస్తారు, అలా మంచి బ్లాగులు పైకి వస్తాయి.
నక్క నైజం, పక్కవారి బ్లాగుకి వెళ్ళి , “మీరు చెట్లపై టపా చాలా బాగావ్రాసారు, నేను చెట్ల క్రింద ఉండే ఆవులు వేసే పేడపై టపా వ్రాసాను తప్పక చదవగలరు” అని మీ టపాలకి లంకెలు అక్కడ ఇవ్వండి !
పోటీ గురించి తెలిసిన ఏ తెలుగింటి వెంకాయమ్మనైనా అడగండి మీకు రెండో ఉపాయం మే మంచిదని చెబుతుంది.
ఉదా : నేనూ, మీరు (ఇక్కడ ఒనమాలు లో వచ్చే క్రమంలో ప్రస్తావించా నంతే )
కష్టే : ఞఞఞఞ
ఫలే : ఞఞఞ

ఉపాయం ౫ – కూడలి పంచాంగం
మీ వూరి పంతులు గారి దగ్గరికి వెళ్ళి మీ బాధ చెబితే , వారు పంచాంగం చదివి, మీకు మీ టపాలని ఎప్పుడు ప్రచురిస్తే శుభం కలుగుతుందో చెబుతారు. మీరు పంతుళ్ళలోనూ పంచాంగాలలోనూ నమ్మని రాకాలైతే, మీ వూరి మరాఠీ దగ్గరకి వెళ్ళి మీ బ్లాగుకి పోటివచ్చే బ్లాగుల యుఆర్ఎల్ అతనికి ఇవ్వండి, అతను చేతబడి చేసి వాటిని క్లిక్ చేసి చదివినా వారి గణాంకాలు పెరగకుండా చేస్తాడు.
ఉదా : నా బ్లాగుకి ఎవరో దుష్టులు చేతబడి చేసారు, కాబట్టి మీరు నా బ్లాగు గణాంకాలన్ని పదితో ‘మల్టిప్లైని తెలుగులో ఎఁవంటారో’ అది చేసి, అది అసలు సంఖ్యగా భావించండి, (అరె నేను మొన్ననే లక్షక్లిక్లాదికారుల సంఘంలో చేరానైతే, ఎదో మీ ఎముక లేని మూషికం ఒక్క దయా, నా ప్రాప్తి)
కష్టే : ఞఞఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౪ – కూడలి ఎత్తుపల్లాలు
చరసాలగారు పై ఉపాయం చదివి, ఎంటి ఈ చాదస్తం, జ్యోతిష్యులూ, చేతబడులూ చిరాకుగా అనుకుంటున్నారు, కాబట్టి ఇది ఆయన కోసం. మీరు వీవెన్ దగ్గరనుండి కూడలి లో జనాలు ఎప్పుడు టపాలు వేస్తున్నారు, ఎప్పుడు టాపాలు చదవడానికి వస్తున్నారు అన్నవిషయాల ‘గ్రాఫుకి తెలుగు ఎఁవైతే అది తీసుకుని’. వాటిని పరిసీలించండి.
ముందుగా మీకు అర్థమయ్యే విషయం ఎంటంటే, టపాలు వ్రాసే ప్రతి పది మందికీ చదివేవారు మాత్రం ఒక్కరే ఉంటారని. (కాబట్టి క్రింది పటంలో క్రింద ఉన్నది చదివేవారి సంఖ్య, పైనున్నది వ్రాసేవారి సంఖ్య).

స్టాకుల్లో పెట్టుబడులు ఉన్నవారు పటం చూసి చెప్పగలరు, "మిధునం, మకరం, వృషభం రాశులు అనుకూలించును బ్లాగర్లక"ని. అలాగే ఎవో తెలియని కారణాలవల్ల పారిస్, టోక్యో ల నుండి వ్రాసేవారికి గ్రహ సహకారం బాగా ఉంటుంది.
ఉదా : రాజ మల్లేశ్వర్(లంకె తెలియదు), వారణాశి, రేపట్నుండి మీరందరూ
కష్టే : ఞఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౩ – అబద్దాలు ఆడకూడదు
మీరు మీ గణాంకాలు లెక్కించే యంత్రాన్ని గానీ, వాటిని చూపించే అదృష్టాంశాన్ని (software కి తెలుగు) గాని అబద్దాలాడెడట్టు చెయ్యవచ్చు. వెంకాయమ్మ ఎంచెప్పినా ఇది మంచి పద్ధతి కాదు. కారణం:అబద్దాలు పక్క వారికే చెప్పగలం. కాని మీ బ్లాగుకు ౯౯శాతం మీరే వస్తారు కాబట్టి, మీ ఒత్తులను కూడా లెక్కించేటట్టు చెయ్యవచ్చు. ఇది వెంకాయమ్మకి బాగా నచ్చినా, మంచి పద్ధతైతే మాత్రం కాదు.
ఉదా : నేనైతే వాడను
కష్టే : ఞ
ఫలే:

ఉపాయం ౨ – శీర్షిక
మీరు "మరుగుదొడ్ల వ్యాపారం" అని శీర్షిక పెట్టి ఒక పసలేని అంశం మీద వ్యాసం వ్రాయండి. ఒత్తులే ఒత్తులు!
ఉదా : నా తరువాతి టపా
కష్టే : ఞఞ
ఫలే: ఞఞఞఞ

ఉపాయం ౧ – అమ్మాయే చెత్తగా
‘శక్తి తార’ పవన్ కల్యాణుకి నేపధ్యగానం ఇచ్చిన ఉదిత నారాయణుడిని అడగండి చెబుతాడు.
"అమ్యాయే చెత్తగా అర బ్లాగే బ్లాగినా మత్తబ్బి కుర్రాళ్ళే మూషికాలపై పడ్డారే ". ఇంకేం చెప్పాలి.
పురుషోత్తముడు నందమూరి వెయ్యాగా మదనమోహినీ వేషం నిమిత్తమాత్రులం మనమెంత.
ఉదా : నాకు అమ్మాయిగా ఇంకో బ్లాగు ఉంది, అందున ఈ బ్లాగుకంటే పది రెట్లు ఎక్కువ ఒత్తులు ఉన్నాయి కూడా. కానీ అది ఎంటో ఎవ్వరికీ ఎప్పటికీ తెలియదు.
కష్టే : ఞ
ఫలే: ఞఞఞఞఞ

ఉపాయం ౦ – ఆరంభసూరత్వం
ఆరంభంలో ఎవరో ఆంధ్రులు ఎంతో సూరత్వంతో అన్నారు “ఆంధ్రులకు ఆరంభసూరత్వం ఎక్కవ”ని. బ్లాగర్లు ఆ సూరత్వాన్ని కొత్త బ్లాగర్లని ప్రోత్సహింసించడంలో చూపిస్తారు.
ఆ రోజులు గుర్తున్నాయా మీకు? మీరేదో “అయ్యో నాకు సిగ్గు బాబూ, నేనెప్పుడూ ఇలా నలుగురు ముందు టపాలు విప్పలేదు” అని వ్రాసిన రెండు వాక్యాల మొదటి టపాకి, పది పేజీల వ్యాఖ్యానాలు వచ్చాయి ఇలా....
“బ్లాగ్లోకానికి బ్లాగ్-స్వాగతం, చాలా బ్లాగుంది మీ బ్లాగావరణ, బ్లాగావతారం ఎత్తి బ్లాగవతం బ్లాగండి. బ్లాగ్విజయీభవ” – బ్లాగావేశి
అని ఎదో బ్లాగ్వాంతి తెప్పిచ్చే వ్యాఖ్యానాలు ఒ ఇరవై వచ్చాయి.
అదే మీ బ్లాగ్జీవితంలోని మొదటి మరియు ఆఖరిసారి ఎవరైన మీ బ్లాగు చదవడం.

బ్లాగ్విజయ బహుబ్లాగోపాయాలు నే బ్లాగగా మీరు అబ్లాగారుగా, ఇకైతే బ్లాగండి మీ బ్లాగ్విస్వరూపం బ్లాగ్దరించగా.
(ఈ దెబ్బతో మాటలబాబు తో బాటు ఓ పది మందికి వాంతి రావడం కాయం)

29 comments:

  1. అదిరింది. హ999. అంటే తెలుసుగా!? తెలీకపోతే విహారిని అడగండి చెబుతారు.

    ReplyDelete
  2. కళ్ళకు నీళ్లొచ్చేంతలా నవ్వాను ఈ టపా చూసి..శెభాష్..మీ బ్లాగు నా ఫీడ్లకి జతచేసుకున్నాను.
    ౬,౧,౦ ఉపాయాలు అదుర్స్, ౫,౪ కొంత చూచాయగా అర్ధమైనా అంత స్పష్టంకాలేదు. చివర్లో వాంతి చురక బాగుంది.

    ReplyDelete
  3. నేను కమెంటు చేయడానికి రాలేదు, కృష్ణమూర్తి.. హ2..
    నన్ను మేత‌ఆవుల వర్గానికి చేర్చి, ఒక్క -ఞ- ఇచ్చినందుకు థాంక్స్.

    ReplyDelete
  4. అదుర్స్! మీ ఉపాయాలు ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి...ముఖ్యంగా చివరి మూడు..."అమ్మాయె చెత్తగా" హైలైట్...

    ReplyDelete
  5. నాకైతే నిజంగా నే వాంతి వచ్చినంత పని అయ్యింది , అర్ధ గంట నవ్వితే రాదా మరి .... అదిరి పోయింది పోస్ట్ సూపర్ ... lmao. :)

    “ఈ సినిమా చూడనివారు నరకానికెళతారు” ... ఈ లైన్ ఎదో బావుందే ... ఇప్పటినుంచి ఇది కూడా వాడేస్తా ... ;)


    బై ద వే ... ఇంతకీ ఈ పోస్ట్ ఏ కాటగిరీ కిందికి వస్తుంది ?? ;)

    ReplyDelete
  6. ధైర్యం గా,కామెడీగా బాగారాసారు.కానీ నాకు కొన్ని అర్దం కాలేదు.

    ReplyDelete
  7. మొత్తానికి అలా డిసైడ్ చేసేసారన్నమాట. భలే ఉంది టపా...
    (ఈ వ్యాఖ్య ఏ టైపులోకీ రావటం లేదు కదా !?)

    ఇంతకీ ఈ టపాతో ఎన్ని హిట్లు వెనకేశారేంటీ ;)

    ReplyDelete
  8. ఉపాయాలు బాగున్నాయి. :-)
    ఇది మాత్రం నా అవుడియాలకు మక్కీకి మక్కీ కాపీ :-)

    ఇది రాయాలంటే ధైర్యం ఉండాలి. ఇలా బ్లాగుల పేర్లు చెప్పేస్తే మీరు డమాల్. ఎప్పుడో ఓ సారి మీ బ్లాగు పేరు చెప్పి ఉతుకుడు డమాల్. బ్లాగు ఓనర్లు ఒకటి ఊహించుకుంటూ రాస్తే మీరొకటి చెబితే అవి వాళ్ళ ఆలోచనలకు డమాల్.

    ఇంకా చెయ్యకూడని ఉపాయాలు ఉన్నాయి. అవేంటంటే ఇలా బ్లాగుల పేర్లు చెప్పకూడదు. చెప్పాల్సొస్తే ఆ తెల్ల చొక్కా వాడు అని చెప్పలి.


    -- విహారి

    ReplyDelete
  9. హ హ్హ హ్హా!
    నా అతితెలివితో నిన్ను డూప్ చేశా!
    ఎడాపెడా లంకెలు పెట్టేసి పది నుంచి ఆరుకి జంప్ చేసేశా!
    కావాలంటే ఇక్కడచూడు
    http://vinnakanna.blogpost.com
    :-))

    ReplyDelete
  10. అయ్యా! బ్లాగు బాగా నవ్వించింది కానీ ప్రత్యేకం నాకోసం అంటూ చెప్పిందే నాకర్థం కాలేదు :(
    నా బ్లాగు లంకె ఎక్కడ ఏ వర్గంలో పెట్టాలో తెలియక అక్కడ అలా పెట్టేశారా?
    ఇంతకీ మీ వుపాయంతో బోలెడన్ని క్లిక్కులు కొట్టేశారు. :)

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  11. బాగుందండి. ఇంక నేను ఆ పనిలో వుంటా మరి.

    ReplyDelete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  13. అంబానాథ్ గారూ, మీ ఆవేదన, అభిప్రాయం అర్ధం చేసుకోగలం..కానీ మీ వ్యాఖ్యలో "హాస్యానికి కొన్ని పరిమితులున్నాయి" అన్న దగ్గరే ఆపేసుంటే బాగుండేది..వ్యాఖ్య వ్యక్తిగతమయ్యేది కాదు కదా. మీలాంటి పెద్దలకిది భావ్యమా.

    ReplyDelete
  14. ఇక్కడ కామెడీ ఎక్కడుంది?
    ఈ బ్లాగరుడు అంత సీరియస్ గా, ఛర్నాకోల పుచ్చుకుని చురకలేస్తుంటే, 'అబ్బే ఉత్తినే నవ్వుతాలకులే' అనుకుంటా పోతే ఎలాగబ్బా?! జర ఆలోచించుండ్రి!
    ఉదాహరణల్లో ఇచ్చిన బ్లాగులన్నీ నే చదవలేదు. పుస్తక సమీక్షల గురించి ఇచ్చిన బ్లాగుల్లో ఒక బ్లాగును ఇంతకు మునుపు చదివి నేనూ ఈ బ్లాగర్ మాదిరే అనుకున్నా...పుస్తకమంతా చదివి, ఆలోచన చేసి, సమీక్ష రాసినట్టనిపించలా! అయినా, ఎవరి బ్లాగు వాళ్ళిష్టం కాబట్టి వాళ్ళను కష్టపెట్టే కామెంటు రాయడమెందుకని , గమ్మున ఇంకో బ్లాగు కెళ్ళా...చదవడానికి మంచిగా ఏమన్నా దొరుకుద్దేమోనని!

    ReplyDelete
  15. గిరి గారు:
    మీరు చెప్పినదానితో నేను ఏకీభవించలేను. ఇది సీరియస్ గా అయితే నా ప్రకారం ఇందులో చెప్పినది సగం కూడా సరి కాదు. (నా బ్లాగు సంగతి వదిలెయ్యండి.)

    రానారె, తోటరాముడు, విహారి, కొత్తపాళీ, శోధన, దిల్ - వీరి టపాలు, బ్లాగులకు ఆదరణ లేదని ఎవరినయినా చెప్పమనండి. వీరి వల్ల ఎన్నోవిశేషాలు తెలుస్తాయనడం లో నాకెలాంటి సందేహం లేదు. అదంతా వారికి ఫలమే.

    ఇక్కడందరూ ఎవరి అభినందనల కోసమో, క్లిక్కుల కోసమో రాస్తున్నారనుకుంటే మీరు తప్పు. ఇతరుల కామెంట్లు, క్లిక్కులు ప్రోత్సాహం ఇస్తాయి అని ఒప్పుకుంటాను కానీ అదే బ్లాగుల పరమావధి అన్నట్లుగా మాట్లాడితే అది సరి కాదు నా మటుకయితే. ఎవరి బ్లాగు వారి ఆలోచనల ని ప్రతిబింబిస్తుందని నా నమ్మకం.

    ఏదయినా బ్లాగు ప్రకారం ఏదయినా సరిగా లేదు అనిపించినప్పుడు వారికి చెప్పండి. వారికి సరి అనిపిస్తే మార్చుకుంటారు.

    ReplyDelete
  16. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. బ్లాగ్విజయీభవ!
    ambaanath gaaru moderate your self.
    mr.shravan restrain yourself.
    enjoy the spirit.
    :)

    ReplyDelete
  19. ప్రవీణ్ గారు-
    ఇక్కడందరూ ఎందుకు రాస్తున్నారో మీకు తెలుసా! అయితే వండర్ ఫుల్!!
    నేనింతకు ముందు కామెంట్లో చెప్పింది...ఈ పోస్ట్లో చెప్పిన విషయాలు సీరియస్ గా ఆలోచించదగినవని. ఈ పోస్ట్ చదివి, ఉదాహరణ కిచ్చిన బ్లాగులు చూస్తే (అన్నీ కాదు, కొన్ని మాత్రమే) నాకలా అనిపించింది.
    మీరు అలా కాదూ, 'అంతా కామెడీనే ' అనుకుంటే నాకు ఎల్లాంటి అభ్యంతరమూ లేదు.
    ఈ విషయమ్మీద (Comedy vs. Serious)వాదోపవాదాల వల్ల పెద్దగా ఉపయోగముంటుందని నాకనిపించడం లేదు.

    ధన్యవాదములు
    గిరి

    ReplyDelete
  20. గిరి గారు:
    లేదండీ ఇంకా మీకు తెలిసినంతగా తెలీలేదు!

    మీ అభిప్రాయం వెల్కం.
    ఇంక పొడిగించడం నాకు కూడా ఇష్టం లేదు.

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete
  22. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  23. ఒక చిన్న సందేహం...
    పుస్తకం పూర్తిగా చదవనపుడు రాసింది రీవ్యూ ఎలా అవుతుందండీ?
    (courtesy: మీరు ఈ టపా లోనే రాసిన వాక్యం)

    ReplyDelete
  24. అరరరే... ఇక్కడ నానా కండాలం జరిగిందే!! మిగతావారంతా ఎలా రాస్తున్నా ఎందుకురాస్తున్నా, రాకేశ్ మాత్రం ఏదో సరదాగా రాశాడు అని నాలుగు నవ్వులు విసిరేసి మళ్లీ మన పనిలో మనం పడకుండా వ్యాఖ్యలు రాయడం, కొట్టేయడం, కొట్టేసేలా రాయడం ... ప్చ్! ఎండాకాలపు వేడి తగ్గుముఖం పడుతోంది, మనమింకా వేడిగానే ఉంటే ఎట్లా!? జనాలు ఈ టపా చదవగానే మన మీదున్న అభిప్రాయాలు మారిపోవుకదా! ప్రతిష్టలు అంత తేలికగా దెబ్బతినవుకదా!

    ReplyDelete
  25. @ రానారె
    బ్లాగ్విజయానికి అతి పెద్ద ఉపాయం నేనింకా చెప్పలేదు.
    అది- controversy
    ఒకరికి చిర్రేత్తేలాగా ఒక వాక్యంవ్రాస్తే, వారేదో వ్యాఖ్యానిస్తే, దానికి ఇంకెవరో ప్రతివ్యాఖ్యానించి వగైరా వగైరా, ఇక బ్లాగుకి క్లిక్కులే క్లిక్కులు :)
    పైపెచ్చు, ఆ controversy ని సరిదిద్దడానికి ఇంకో సంచలనాత్మకమైన టపా వేస్తే ఇంకా క్లిక్కులు !

    ఈ టపా పక్కవారికి క్లిక్కలు తెప్పించడానికి ఉపయోగపడుతుందనుకుంటే, అది నా బ్లాగుకే ఎసరు పెట్టింది. :)
    హేపి బ్లాగింగ్

    ReplyDelete
  26. అందరికీ " టోపీలు బంద్"

    ReplyDelete
  27. మీ ఊహే ఒక అధ్బుతం అనుకుంటే, దాని అక్షరరూపం పరమాధ్బుతం. అభినందనలు.


    'ఉపాయం ౮ – రివ్యూలు' విభాగంలో, (మన త్రివిక్రమ్ గారి బాటలొ)
    "వాటిని ‘కొద్దిగా’ చదివి" అనే బదులు, వాటిని 'పూర్తిగా ?' చదివి అనీ,
    అలాగే

    "మీరు పెద్ద 'తోపు' అనుకుని" అనే బదులు, "మీరు పెద్ద కత్తి (మీరు తోపో, కత్తో కొద్ది రోజుల్లో వారే తెలుసుకుంటారు :-) :-( అనుకుని"

    అని ఉంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. (ఇలా నాలా చెప్పటం చాల తేలిక లెండి అందరి వ్యాఖ్యలు చదివిన తరువాత ;-))

    ReplyDelete
  28. రాకేశ్వరా! "దేనిమీద వ్రాయమంటే దాని మీద, ఎలా వ్రాయమంటే అలా" రాయగలరు మీరు!!

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం