భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, June 14, 2007

కందం పై కందం పై కందం

నా బ్లాగుని జెమిని టీవీ సీరియల్ గా తలచి ఫాలో అవ్వని జనుల కోసం చిన్న రీక్యాప్ !
నేను మొన్ననే తెలుగులో పద్యాలు రాయాలని రానారె స్పూర్తితో రాయడం మొదలు పెట్టా. మా గురువు కొత్తపాళీ. మొన్ననే ఒక కందం కూడా రాసా. కాని అది గురువు గారికి నచ్చక మరలా రాయమన్నారు. అది వివరిస్తూ ఒక కందం.

కందము పై కందము నే
అందము వర్ణింప గోరి వ్రాసితి గానీ
అందులెలగెన్సు లేదని
చిందులు దొక్కేను గురువు సింగని వోలే

బైట్ దాట్ మాస్టర్ కోపా ! ఎలగెన్సు తగ్గిందన్నందుకు గానూ, ఎలగెన్సు లేనేలేని పద్యం :)
ఇక్కడ నృసింహుడితో పోల్చడం అతిశయోక్తి అలంకారమనమట :) అలాగే 'వోలే' ఉపమాలంకారము :)
దయచేసి నా మీద ఆశ వదలొద్దు :)
పైన 'వ్రా'ముందు వచ్చిన 'రి' గురువవదని నాకు గట్టిగా అనిపిస్తుంది. కాని నేను తప్పయ్యిండవచ్చు.

అసలు విషయానికి వస్తే, ఇదిగో నా రెండో ప్రయత్నం.

అరవైనాలుగు మాత్రల
అరుదగు నీలారవింద హారము కందం
ఉరకగిది కృష్ణవేణిల
పరమశివునిదైనను మది పరవశమవదా

ఇది గురువుగారిని, పాఠకులని, మెప్పిస్తే సరే సరి లేక పోతే ...
ఎందుకైనా మంచి, ఈ పద్యంలో రెండు రూపకాలున్నాయని గుర్తుచెయనియ్యండి. అలాగే ఇందులో ప్రాసయతి కూడా కుదిరింది. (౨ లో అరు - హార; ౪ లో పర - పర)

నేను కందాల గురించి ఆలోచించీచించీ, రాత్రి నిద్రకూడా తక్కువయ్యింది. ఎంతగా కందాల గురించి ఆలోచిస్తున్నానంటే, నేను వ్రాసిన నాలుగు కందపద్యాలూ కందాల మీదే. ఈ విషయం మీద ఇంకో కందం.

అల్లుతువున్నా కందం <భ గగ గగ>
మెల్లగ మెల్లగను నేను, మేడిన్ చైనా <భ భ జ గగ గగ>
చిల్లర పరికరములవలె <భ నల నల>
అల్లటపెట్టుటకు మిమ్ము యట్లాగైనా <భ భ జ గగ గగ>

కొద్దిగా ఎక్కువైనట్టుంది కందమందు నాకూ మీకూ. ఐతే మీకో సుభవార్త. కందం కష్టమనిపిస్తుంది నేనింకా తెటగీతో, సీమమో నేర్చుకుంటా. కొద్దగా నేర్పరితనము వచ్చాక కందానికి వస్తా.

త.రా : అన్నట్టు కవిత్వం ఆశక్తి ఉన్నవారు ఈ-మాటలో ఈ వ్యాసం తప్పక చదువగలరు.

4 comments:

  1. అదరగొట్టారు పొండి...మీరిదే ఊపులో కొనసాగిస్తే సీసాలూ గీతాలే కాదూ, మాలలూ మత్తేభాలూ కూడా మిమ్మల్ని వరిస్తాయి :)

    మంచి వ్యాసాన్ని పరిచయం చేసారు కూడా..ధన్యవాదాలు.


    Sriram
    sreekaaram.wordpress.com

    ReplyDelete
  2. ఏంటో ఈ మధ్య కందం చిందులేస్తుంది ఎక్కడ చూసినా. బాగున్నాయి మీ కందాలు.

    -- ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  3. చెప్పలేనంత సంతోషంగా ఉంది. వృద్ధిలోకొచ్చే లక్షణాలు మీకు చాలా ఉన్నాయి. కొట్టడం కొట్టడమే కుంభస్థలాన్ని (కందాన్ని) కొట్టిన మీకు మిగతా పద్యరీతులు తప్పక లొంగుతాయి. శుభమస్తు. పద్యాల్లో ఆంగ్లపదాలు సహజంగా అమర్చడంవంటి చమత్కారాలతో పద్యాన్ని రాయడంలో మీకంటూ ఒక శైలికూడా ఉంది. చిందులు దొక్కేను -- దొక్కేను కాదు దొక్కెను -- కదా!? ఈ టపా మళ్లీ చదవాలి. ఇప్పుడు కాస్త తొందరలో ఉన్నాను. మళ్లీవస్తా.

    ReplyDelete
  4. కం.బాగుంది మీ ప్రయత్నం
    సాగించాలని తమరిక ఛంద-ప్రయాణం
    ఆ గీర్వాణిని కోరెద
    బ్లాగుల్లో తెలుగుభాష భవితను గనుచూ.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం