భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, November 07, 2007

కందం, మందం, బావతో సరసం

కందం అంటే ఏంటో అందరికీ తెలిసిందే. తెలియదా ?
అయితే ఇక్కడ కందం గురించి చూడండి. కందానికి ముందు మీరు గురు లఘువుల గురించి నేర్చుకోవాలి. వాటికి లంకె. అబే లాభంలేదు, లంకెలిస్తే మాత్రం ఎవరు చదువుతారు అంటే, ఇకనేనే విన్నవించుకుంటా.

లఘువు (గుర్తు I)
సరళంగా, లిప్తపాటులో పలకగలిగే శబ్ధాలు ఉదా: అ, ఌ, ఎ, ఘి, పు, తృ, వఁ, ళొ వగైరా

గురువు (గుర్తు U)
క్లిష్టంగా రెండు లిప్తలకాలం తీసుకునేవి. ఉదా: ఈ, ఊ, ఐ, ఓ, ఔ, అం, కౄ, చా, డం, నః, రై వగైరా
ఒక అక్షరం తరువాత పొల్లక్షరం వస్తే అది కూడా గురువౌతుంది. ఉదా: అక్, విశ్, ముల్, నెన్ వగైరా

ఒక పాదం మఱియు దాని గురులఘువిశ్లేషణ
"శారికా కీరపంక్తికిఁ జదువు సెప్పు"
శాU రిI కాU కీU రI పంక్U తిI కిఁI జI దుI వుI సెప్U పుI
గమనించ వలసిందేంటంటే సెప్పులో సె గురువు ప్పు లఘువు!

కందం
పైన చెప్పినట్టు గురువులకు రెండు మాత్ర(లిప్త)ల కాలం, లఘువుకు ఒక మాత్రాకాలం పడుతుంది. అంటే లఘువుకి రెండింతల కాలం పడుతుంది గురువుకి. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ నిష్పత్తి ౧.౪౬౧౨౫ కి దగ్గరలో వుంటుంది. మీకు తెలుగు అంకెలు చదవటం రాదు కాబట్టి రెండని అనుకుందా.

కందం పద్యాన్ని నాలుగేసి మాత్రలగా విడగొట్టవచ్చు. నాలుగు మాత్రలంటే ప్రతి గణం
నల IIII
భ UII
జ IUI
స IIU
గగ UU
గణాలలో ఒకటై వుండాలి.

ఉదా:
ఎప్పటి కెయ్యది ప్రస్తుత
UII UII UII (భ భ భ)
మప్పటి కామాటలాడి - యన్యుల మనముల్
UII UU IUI - UII IIU (భ గగ జ - భ స)
నొప్పిం పక తా నొవ్వక
UU UII UII (గగ భ భ)
తప్పించుక తిరుఁగువాడె - ధన్యుడు సుమతీ
UU IIII IUI - UII IIU (గగ నల జ - భ స)

కందంలో ౩, ౫, ౩, ౫ గణాలతో నాలుగు పాదాలు రాస్తే చాలు.
కానీ అలా వుంటే మఱీ అందరూ వ్రాసేస్తారు, ఇక కవిత్వం అందరికీ వచ్చేస్తుంది, సమాజం బాగుపడిపోతుందని, కొందరు ఛాందసవాదులు ఇంకా చాలా అనవసర నియమాలు పెట్టారని కొందరి అభిప్రాయం. నేను దానితో ఏకీభవిస్తానా లేదా అన్నది అప్రస్తుతం, అప్రముఖం.
ఉదా- పై పద్యంలో ప్రతి పాదానికి రెండో అక్షరం 'ప్ప' వుంది. దీనిని ప్రాస నియమం అంటారు (ఇంకా ఇలాంటి నియమాలు చాలా ఇక్కడ వున్నాయి)

భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు, అరసం
వెనకటి రోజుల్లో చదువుకునే కాస్త మందీ, తెలుగొక్కటే చదువుకునే వారు. కాబట్టి వారికి క్లిష్టమైన ఛాందస నియమాలు పెద్ద లెక్కకాదు. కానీ తెల్లవాళ్లు లెక్కలు, తుపాకులూ చదువుకుని ఇతరులపై రాజ్యం చెయ్యడం చూసి, మనవారు కూడా తెలుగుని పక్కన పెట్టి లెక్కలూ, లైంగిక మనస్తత్వ శాస్త్రాలూ చదవడం మొదలు పెట్టారు. కాబట్టి నియమాలు పాటించడం కష్టమయ్యింది, భావాలకి ఛందస్సు అడ్డు పడడం మొదలయ్యింది.
అందుకే ౧౯వ శతాబ్ధం మొదట్లో భావ కవిత్వం, వచన కవిత్వం, మాత్రా ఛందస్సు వంటి ఉపాయాలు వేసారు కవులు రచయితలూ కనుగొన్నారు. ఆ కవుల సంఘాలే అరసం, విరసం వగైరా! నేను ఆఱునెలల క్రితమే తెలుగు చదవటం మొదులు పెట్టాను, కాబట్టి నాకు పెద్దగా వాటితో సంపర్కం(టచ్చి) లేదు. అందుకే మీరు తెలియ జెప్పుతారని లంకెలిచ్చా.

మాత్రా ఛందస్సు
ఇది మాత్రలమీద ఆధారపడి వుంటుంది. కందంలోని గణాల నియమాలు తప్ప ఇతర నియమాలు తీసేస్తే ఒక విధంగా మాత్రాఛందస్సు వర్తిస్తుంది.
ఇందులో గురువు U = ౨, లఘువు I = ౧ అని వూహించుకొని, ఒక పాదం పలకడానికి ఎన్ని మాత్రలు పడతాయే లెక్కవేసి, అన్ని పాదాలకూ ఒకే మాత్రా బరువుండేట్టు చూడాలి.
ఉదా:
ప్రతిజ్ఞ (పాదానికి నాలుగు నాలుగు మాత్రల గణాలు, అంటే పదహారు మాత్రలు)
పొలాలనన్నీ, హలాలదున్నీ, (జ గగ జ గగ)
ఇలాతలంలో హేమం పిండగ (జ గగ జ భ)
జగానికంతా సౌఖ్యం నిండగ (జ గగ జ భ)
విరామమెరుగక పరిశ్రమించే, (జ నల జ గగ)
బలం ధరిత్రికి బలికావించే, (జ భ భ గగ)
కర్షక వీరుల కాయం నిండా (భ భ గగ గగ)
కాలువకట్టే ఘర్మజలానికి, (భ గగ భ భ)
ఘర్మజలానికి ధర్మజలానికి, (భ భ భ భ)
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్‌! (భ భ ద గగ)

బావ కవిత్వం
కొత్త సహస్రాబ్ధిలో తెలుగు నేర్చుకునేవారు బాగా తగ్గిపోవడంతో, కవిత్వాలు రాయడం కష్టఁవవ్వడ్డంతో, నేను కొత్త కవితా విధానం కనుగొన్నాను. ఇది ఒక శతాబ్ధం క్రితం గుఱజాడ కనిపెట్టిన మాత్రాఛందస్సుకు అక్రమ సంబంధాల ద్వారా కలిగిన సంతానం. దాని పేరే

మందం
ఇందులో నాలుగు పాదాలు పాదానికి నాలుగు గణాలు గణానికి నాలుగు మాత్రలు! ౪ x ౪ x ౪= ౬౪
అఱవై నాలుగు మాత్రల అఱుదగు
నీలారవింద హారం మందం!
(స భ భ నల; గగ జ గగ గగ)
రెండు పాదాలున్న దీని అరమందం అంటారు. కావాలంటే మందం ఇంకా తగ్గించి పావు మందాలు కూడా వ్రాసుకోవచ్చు!

మందం ఉదా:
చదువెందుకు సంక నాకడానికి !
గురువెందుకు గుద్ద నాకడానికి !
పదిగోవులు కాసుకున్న, పాశము
దొరుకును గదరా ధరిలో సుమతీ!
(స స జ భ; స స జ భ; స స జ భ; స స స స)
దీని కన్నా పరమ సత్యం వుందా? ఎంత అద్భుతంగా వుంది పద్యం! చూశారా ఛందస్సుని కొద్దిగా తగ్గించి బావం మీద బుఱ్ఱపెడితే వజ్రాలు రాలతాయి!
వివరణ: ఇది వ్యవసాయ పొలాల్లో తరతరాలుగా వినబడుతున్న పద్యం. భూమిని నమ్ముకోవడంలోని ఆనందాన్ని, చదువు యొక్క అప్రయోజనాన్ని తెలిపే చాటువు.

గొప్ప తగ్గింపు
ఇంతకీ భావ కవిత్వానికీ బావ కవిత్వానికీ వున్న ముఖ్య వ్యత్యాసం చెప్పనేలేదు కదా. మా బావ కవిత్వంలో మీకు నియమాలు ఇష్టమైతేనే పాటింటవచ్చు. లేక పోతే మానేయ్యవచ్చు.
కాబట్టి, పైన చెప్పబడిన ౪x౪x౪ నియమాన్ని పాటించకపోయినా మీరు దాన్ని మందం అనిపిలుచుకోవచ్చు. కానీ మందం కొద్దిగా తగ్గుతుంది.

బుద్ధి మందం ఉదా:
చెండాలం చెంబులవాద్యం
సాయంత్రం సాంబారన్నం
పిల్లి తినని పిండాకూడూ
బల్లి వదిలిన తెల్ల తోకా
పందిఁ చంపిన పిల్ల బంటూ
కంది పప్పులో గుండ్రాయీ
- వద్దోయీ నవకవనానికి
(ప్రతి పాదానికి పద్నాలు మాత్రలు)

ప్రశంస
మా మందానికొచ్చిన ప్రశంసలు కొన్ని
"మందం is the modern day scalable alternative to మత్తేభం" - సాయంకాలం.నెట్
"మందం మన శతాబ్ధ కవిత్వానికే మేకప్ ఆర్టిష్టు" - ఆమాట.కామ్
"మందమా మందగామినా" - సృజనభంజని.ఆర్గ్
"మందగిస్తున్న మాడరన్ కవిత్వాన్ని మందాగ్నిలా తాకిందీ మందం" - పాతపెన్ను.బ్లాగుస్పాటు.కామ్
"మందమా! చాటంత దానందమా!" - కోడలి.ఆర్గ్
"సుమతీ పక్కకి తప్పుకో వచ్చేసింది మందమతీ" - చల్లెద.కామ్

బావతో సరసం
మీరూ మాలాగే మందాల అందాల అర్ణవాల లోతులు తీయ్యాలని ఆరాట పడుతున్నారా? ఆగలేకున్నారా? అయితే వెంటనే చేరండి "బావకవుల తోవలో సరదా రాసేవారి సంఘం" (బావతో సరసం)!

6 comments:

  1. రాకేశ్వరా,
    Your example was a bummer(శ్లేషింటెండెడ్).
    దాని బదులు,
    గురువెందుకు..

    (కోతి మూక గాడికి, కోతి బుద్ది గాడికి, గుడ్డి సాలె గానికి, గుడ్డి వాలకానికి, గొయ్యి తియ్యడానికి, గొయ్యి పాతడానికి, గుంట మున్‌గడానికి, గోల చేయడానికి, కోమలాంగి వేటకి, కోరు కోతిలాటకి) లాంటిదేదో పెట్టుంటే ఈ టపా R-rating నుంచి PG కి వచ్చేసేదేమో..

    saracasm hit the mark in other cases :)

    ReplyDelete
  2. @ S.S.
    blasphemous is more like it!

    @ గిరి గారు,
    పద్యం నాది కాదండి ఇష్టమొచ్చినట్టు మార్చడానికి.
    తరతరాలనుండి పొలాలలో వినపడుతున్నాదే.
    మా తాతలు మా అయ్యలకు వినిపించారు, మా అయ్యలు మాకు వినిపించారు, మార్చే హక్కులు మాకు లేవు. :)
    ఐనా నవీన దృక్పదం గల మన బ్లాగు జనులకు, అలాంటి పాతకాలపు hypocrisy లేదు.
    ఉదా: నేనొక టాపలో ఆంగ్లపదజాలం 'my ass' వాడినా ఎవరూ ఆక్షేపించలేదు!
    కొందరైతే ఆ పేరుతో ఒక టపా కూడా వెయ్యమన్నారు!

    ReplyDelete
  3. మన తెలుగు బ్లాగుల్లో hypocrisy based policing కొంచం ఎక్కువ లెండి. మీరు వ్రాయండి.

    ReplyDelete
  4. మరి మందం ఏమిటి? ముందుగానే ఉన్న ఒక పద్యానికి మీరు ఛందస్సు జోడించారా?

    ReplyDelete
  5. ముందుగానే వున్న పద్యం ఛందస్సు ఎత్తి చూపించాను అన వచ్చేమో...

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం