భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, September 06, 2007

విశాలాంధ్రలో చివరకు కొన్న పుస్తకాలు

మొన్న విశాలాంధ్రకి వెళ్ళి వచ్చా, హజ్ కి వెళ్ళోచ్చినంత పనైంది. అనుకున్న రెండు నెలలకి వెళ్ళగలిగా. కానీ ఆలస్యం అవడమే మంచిదైంది. అంతకు ముందుంన్న జాబితా కంటే మంచి జాబితా తో వెళ్ళ గలిగా. హైదరాబాదులో బస్సెక్కి వెళ్ళడమంటే ఆషామాషీ కాదని అందరికీ తెలిసిందే. బస్సు ఎక్కే ముందూ, ఎక్కినతరువాత, దిగిన తరువాత ఒక వంద సార్లు తిట్టుకున్నా నగరాన్ని. ప్రపంచంలోని అతి చెత్త నగరం బహుమతి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సీరియస్‌లీ మరీ ఇంత అద్వాన రవాణా వ్యవస్థా ? ఏదేమైనా, వెళ్ళి రావడం గురించి వ్యంగ్యంగా దురుసుగా ఒ టపా వ్రాయొచ్చు, కానీ ఆ పుస్తకాలు కొన్న అనుభూతి బీరు తాగినంత కన్నా గొప్పగా అనిపించింది. కాబట్టి దాని మీదే ధ్యాస పెడదాం.

నేను కొన్ని పుస్తకాలు జాబితా
  • చివరకి మిగిలేది (బుచ్చి బాబు) ౯౦ (90)
  • గణపతి (చిలకమర్తి) ౬౦ (60)
  • కృష్ణపక్షము (కృష్ణ శాస్త్రి కవితలు) ౩౦
  • అసమర్ధుని జీవయాత్ర (త్రిపురనేని) ౪౦ (40)
  • కన్యాశుల్కం (గురజాడ) ౭౦ (70)
  • ఎకైక విప్లవం (జిడ్డు) ౧౨౦ (120)
  • మహాప్రస్ధానం (శ్రీశ్రీ) ౪౦
  • అమృతం కురిసిన రాత్రి (తిలక్) ౭౦
  • దర్గామిట్ట కతలు (ఖదీర్ బాబు) ౬౦
  • సలాం హైదరాబాదు (లోకేశ్వర్) ౯౯
  • మాలపల్లి (ఉన్నవ లక్షీనారాయణ) ౧౫౦ (150)
  • భారతంలో చిన్ని కథలు (ప్రయాగ రామకృష్ణ) ౧౫౦
  • అంపశయ్య (నవీన్) ౯౮ (98)
  • ఎంకిపాటలు (నండూరి సుబ్బారావు) ౨౫
మొత్తం వెల ౧౧౦౨ (తగ్గింపు ౧౦౨) = ౧000 .
అదన్న మాట మొత్తం వెయ్యి రుపాయలు, మామూలుగా అయితే, "ఇంకొంచెం తగ్గిస్తే మా స్నేహితులకు మీ కొట్టు పేరు చెబుతా" అని సోది కొట్టి ఇంకొంచెం బేరం ఆడే వాడిని (కాలీకట్‌లో ఆరీసీ అంటే పది శాతం తగ్గింపు ఇచ్చేవారు అన్ని చోట్లా). మా నానమ్మ దగ్గర నుండి వారసత్వం వచ్చిన ఏకైక గుణం - బేరాలాడడం. కానీ మొన్నటి దాకా ఆమెరకలో అడ్డమైన ఇంజనీరింగు పుస్తకాలు తలా ౧౫౦ డాలర్లకు కొని, ఇక్కడేమో పద్నాలుగు ఆణిముత్యాలకు వెయ్యే ఇచ్చా. ఇలా ఐతే తెలుగు సాహిత్యం ఎలా ముందుకు సాగుతుంది అని దిగులు పడ్డా. తగ్గింపు ఇవ్వకపోతే బాగుండును అనిపించింది. అభిమానం దుఃఖించినా, పేదరికం సంతోషించింది.

కొట్టలో కొన్న తీరు
సాహిత్యం గుంపులో చదవవలసిన పుస్తకాలు కొన్ని చెప్పమంటే, చాలా మంచి సూచనలు ఇచ్చారు, కానీ అందులో చాలా వరకూ కథల పుస్తకాలే ఉన్నాయి. ఆ తరువాత త్రివిక్రం గారి టపాలో మంచి నవలలు చూసి వాటిని కూడా నా లిస్టులో జేర్చి మరలా సాహిత్యం గుంపుకి పంపా, అందులో ఇచ్చిన సవరణలతో రెండవ కూర్పు తయారుచేసి దానిని ముద్రించి నాతో పట్టికెళ్ళా .

దుకాణానికి వెళ్ళిన తరువాత, బ్రౌజింగ్ మొదలెట్టా, ఎంత సేపున్నా ప్రయోజనం పెద్ద లేక పోయింది. ఒకతను నా చిట్టా చూసి, దాన్ని అందుకొని, చాలా మంచి పుస్తకాలు వ్రాసుకొచ్చారండి, అని ఒ పది సార్లు పొగిడి, ఒక దాని తరువాత ఒకదాన్ని కౌంటరు మీద పెట్టడం మొదలు పెట్టారు. అలా నా ముందు ఒ మూడు నాలుగు వెలు చేసే పుస్తకాలు పెట్టాడు. వాటిలోనుంచి, నాకు కావలసినవి ఎంచుకున్నా, క్రింద వివరించబడిన పద్ధతిలో.

కొనని పుస్తాకాలు
వెయ్యి పడగలు కొందామనుకున్నాకానీ మరీ ౪౦౦ అనేసరికీ వెనకాడింది నిరుద్యోగం. అలానే ఇంకా చాలా మంచి పుస్తాకాలు ప్రింటు బాలేదని కొనలేదు అందులో ఒకటి 'నవ కవితా సంకలనం'. అలానే భాగవతాన్ని కూడా నాలుగొందలనే సరికి, 'అన్నంముట్టించగానే ఆవకాయెందుకు' అని నిర్జీతం వాదించింది, వాదనలో గెలిచింది. కాని గట్టి బైండింగుతో చాలా బగున్నాయి భాగవతం రెండు పుస్తకాలు. వారి దగ్గర అముక్త మాల్యద లేక పోయే సరికి, కావ్యాలేవి కొనలేకపోయా.

నామిని కథలు కొందామనుకున్నాకానీ, ఒక పేజీ చూసా, రాయలసీమ మాండలికం, నాకేమో తెలుగు చదవడం అంత వేగంగా రాదు. రానారె వ్రాసినవే ఆయన దగ్గరుండి (జీటాక్‌లో) చదివిస్తే గానీ అర్థం కాలేదు. కాబట్టి వాటి బదులు దర్గామిట్ట ఎంచుకున్నా. అదీను ముస్లిం సాహిత్యం కూడా కొన్నట్టుంటుంది, ప్రింటుకూడా బాగుంది! అలానే మధురాంతకం కథలు, అత్తగారి కథలు కూడా కొనలేదు. సలాం హైదరాబాదులో కూడా ప్రింటు చాలా బాగుంది, అందుకే తీసుకున్నా. కొడవటిగంటి 'బెదిరిన మనుషులు', 'బ్రతుకు భయం' కొందామంటే రెండూ లేవు. 'చదువు' కొనాల్సిందేమో, ఎందుకో కొనలేదు.

అతను లిస్టులో ఉన్న 'అంపశయ్య' మరచిపోయాడు కానీ తరువాత ఊరికినే బ్రౌజు చేస్తుంటే తగిలింది. అలా తగిలిన మంచివి, 'ఎంకి పాటలు', 'కన్యాశుల్కం'. కొట్టతను 'భారతం లో చిన్ని కథలు' చాలా బాగుంటుందండి, ఇరవై సంవత్సరాల తరువాత వచ్చింది అన్నాడు. ప్రింటూ, బొమ్మలూ కూడా చాలా బాగున్నాయి. కాబట్టి కొనేశాను. 'బుడుగు', 'బాపు బొమ్మల' వంటి పుస్తకాలు కూడా కొన మన్నారు, కాని మళ్ళీ వస్తానండి ఇక్కడే ఉంటాను అని చాలా వరకూ పక్కకు తీసేసా. సారాంశం ఎంటంటే, నా లిష్టులోనివి కొన్ని వారి దగ్గర ఉన్నాయి, ఉన్న వాటిలో ప్రింటు, బొమ్మలూ చూసి ఎంపిక చేశాను.

కొట్టలో మనుషులు
కొట్టులో నాకు మార్గదరకం ఇచ్చినతని తో మాటలలో పడ్డాను.
ఎఁవటండీ, అమెరికా తీసుకెళ్ళడానికా ఇవన్నీ ? లేదండీ.
ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారా? లేదండి. మొన్ననే అమెరికాలో చదువు పూర్తి చేసుకొనొచ్చా.
MS ఆ ? అవునండి.
ఎందులో ? ఎలక్టికల్ ఇంజనీరింగ్.
ఇక్కడేక్కడ చదివావు? కేరళ ఆరీసి. అమెరికాకి వెళ్ళే ముందు బెంగుళూరులో పని కూడా చేసా ఒ రెండు సంవత్సరాలు.
మా అబ్బాయికి కూడా ఉద్యోగం వచ్చింది. టీసిఎస్ లో. (బాబోయ్ ఎక్కడ చూసినా వాళ్ళే, గాడిదల్లాగా) అవునా అండి, నేనూ పని చేసా టీసిఎస్ లో. మంచి కంపెనీ అండి. కాని ఐదు నెలలే చేశాను.
యా ఎందుకు ? ఇంకో కంపెనీకి మారాను. మూడు రెట్లు ఎక్కవ జీతం ఇస్తున్నారని, కానీ టీసియస్ చాలా మంచి కంపెనీ అండి. అక్కడ చేస్తే బాగుంటుంది. (బాగుంటుంది మై యాస్, ఇప్పుడు ఈయన ఇంటి కెళ్ళి ఆయని కొడుకుని కంపెని మారమని శావ దొబ్బుతాడేమో, అచ్చ తెలుగు నాన్న గారి లాగా)
ఇంతకూ అమెరికా నుండి ఎందుకు వచ్చాశావు ? ఉద్యోగం దొరకలేదా ? అవునండీ ఉద్యోగం రాలేదు.
ఎదోటి వస్తుందనుకుంటగా? వచ్చినా నాకు నచ్చినవి రాలేదండి.
(అప్పుడప్పుడూ గొఱ్ఱెల మందనుండి వైదొలగే నాలాంటోళ్ళు కూడా ఉంటారని, లోకులకి తెలియజెప్పడం నా ప్రస్తుత ప్రవృత్తిగా ఎంచుకున్నాను, అందులో భాగమే ఈ అమెరికాలో ఉద్యోగం సంపాదించడం చేతకాలేదనే ప్రచారం, లేక పోతే నన్నీ సాఫ్టువేరు-డబ్బుల అరాచకానికి చిహ్నంగా మార్చేసింది సంఘం. "ఆ అన్నయ్య చూడు ఇంచక్కా చదువు కున్నాడు, బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడు, అమెరికా లో చాలా మంచి యూనివర్సిటీలో చదువుతునానడు, ఇంకా బోలెడంత డబ్బు సంపాదిస్తాడు, నువ్వు కూడా చదువుకుంటే అలా అవుతావు". (బోలెడంత డబ్బు మై యాస్) దీని గురించి ఇంకా లోతుగా నా వచ్చే టపా 'గొఱ్ఱెల మంద, పుఱ్ఱెల వ్యాపారం' లో)

ఇప్పటికి చదివిన పుస్తకాలు
అసమర్థుని జీవ యాత్ర తో మొదలు పెట్టా, మొదట్లో చాలా వరకూ నా గురించే వ్రాస్తున్నాడేమో అని అనుమానం వచ్చింది. కాని సగం అయ్యింతరువాత ఆ భయం సందేహం తొలగి పోయాయి. చాలా బాగుంది పుస్తకం, ఆఖరున చాలా దుఃఖంగా, మాలాంటి అసమర్ధులకి చాలా నిరాశగా ముగించారు కథని. దాన్ని దిగమింగడానికి చాలా సేపు పట్టింది.

మధ్య మధ్యలో భారతంలో చిన్ని కథలు చదివా. చాలా బాగున్నాయి, మీరు కూడా వాటిని తప్పక చదవలి. చాలా మంచి నీతులు, మంచి కథలు, మంచి భాష వున్నాయందులో.

ఇక 'మహా ప్రస్థానం', 'అమృతం కురిసిన రాత్రి' అప్పుడప్పుడూ తిరగేస్తున్నాను. వాటి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీశ్రీ గురించి అందరికీ తెలిసిందేగాని. తిలక్ కూడా చాలా బాగున్నాయి. అదే చేత్తో ఎంకి పాటలు కూడా చూస్తున్నా. వాటి గురించి నేను చెప్పాదేముంది. నాకస్సలర్థం అవనిదల్లా కృష్ణ శాస్త్రి!

నిన్ననే అంపశయ్య పూర్తయ్యింది. నా ఆకాశంలో ఉన్న ఎక్సుపెట్టేషన్లకు ఎం తీసి పోలేదు. నవల మధ్యలో చాలా భారీగా ఉన్నా, ముగింపు చాలా ఆశాభరితంగా ఉంది. కాబట్టి మంచిగా అనిపించింది. ఈవాళ కన్యాశుల్కం మొదలు పెడతాను.

అంపశయ్య కాలం లోనే మా నాన్న కూడా డిగ్రీ చదివారు, కాబట్టి ఆ రోజుల్లో సర్వవ్యాప్తమైన చలం కథల పుస్తకాలలో ఒకటి 'యవనవ్వనం' మా ఇంట్లో ఉంది. ఈ పుస్తకాలు కొనే ముందు దానిని చదివా. బాగున్నాయి కథలు. 'యవనవ్వనం' బాగా నచ్చింది. 'భార్య', 'సుశీల' బాగున్యాయి. 'నాయిడు పిల్ల' బానే ఉంది. 'మధుర మీనాక్షి' లో ఆ రోజుల్లో కామం అంటే ఎంటో తెలయకుండానే పిల్లల్ని కనే ఆడవారుండే వారని తెలుసుకున్నాను :). 'రెడ్డి రంగమ్మ' అంతగా నచ్చలేదనాలి. కాని పాత సాహిత్యం చదవడానికి ఈ పుస్తకం మంచి పునాది అయ్యింది.

నేను కొన్నవి మరీ మంచి పుస్తాకలూ, మరీ భారీ పుస్తకాలలా ఉన్నాయి. ఏ Jane Austen లాంటివో P.G. Wodehouse లాంటివో చిక్కితే బాగుండునని పిస్తుంది. 'చివరకు మిగిలేది' తలచుకుంటేనే భయం గా ఉంది. అదృష్టవశాత్తూ 'కన్యాశుల్కం', 'గణపతి' ఉండనేవున్నాయి.

27 comments:

  1. చాలా మంచి సమాచారం అందచేసారు మీరు. ముందుగా థాంకులు.

    బెంగళూరులో రెండేళ్ళు ఉన్నవాళ్ళు హైదరాబాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని తిట్టడం చిత్రంగా ఉంది. బహుశః బెంగళూరులో బస్సులెక్కలేదేమో :)

    P.G. Wodehouse...hmm...కొంచెం వేగంగా చదవడం అలవాటయ్యాకా సాక్షి వ్యాసాలు కొనుక్కోండి. కాకపోతే ఖరీదు రూ.500 :)

    ReplyDelete
  2. You can also order same books from VedaBooks.com

    ReplyDelete
  3. చివరకు మిగిలేది చదవడానికి నువ్వనుకున్నంత కఠినమైనదేమీ కాదు..కానీ కథానాయకుడి చింతనలో పడి చాలాసార్లు సైడుట్రాకై బండి మెళ్ళగా సాగే అవకాశాలు మెండు..
    గొఱ్ఱెమందా..మైయాసు టపాకోసం వెయిటింగు :-)

    ReplyDelete
  4. అబ్బో అప్పుడే కొనడం, రెండుమూడు చదివయంకూడా జరిగిపోయిందన్నమాట. దాన్నిబట్టి నాకర్థమైందేమిటంటే, పుస్తకాలను చదవగా చదవగా వేగం అలవడుతుందని. ఒక్కో పుస్తకాన్ని చదివాక మీ స్టైల్లో వ్యాఖ్యానం చెబితే వింటాం. మొన్ననే డా.శివారెడ్డిగారి 'సిటిబ్యూటిఫుల్' నవలిక చదివాను. అందులో కథానాయకునికి 'ఇంబెసైల్ ...' అనేది ఊతపదం. ఎవ్వరిమీద కోపమొచ్చినా ఇంబెసైల్‌కొక తెలుగుపదం తగిలించి తిడుతుంటాడు/తిట్టుకుంటాడు. ఈ టపాలో 'మయ్యాఁ' చూసి గుర్తొచ్చింది. ఈ టపా మొత్తానికి పుస్తకాలంగడిలోని సంభాషణ బాగుంది. బహుశా ఏ మృదులాంత్రునికైనా ఇవే ప్రశ్నలు వినీవినీ విసుగొచ్చి ఉండాలి. అంతటితో ఆపేశాడు నయం, "నీ జీతమెంత, ఓస్ ఇంతేనా, ఎందుకలాగ, మాకు తెలిసినవాళ్ల అబ్బాయి/అమ్మాయి ఇంత సంపాదిస్తోందే, ఎందుకు ఈ కంపెనీనే పట్టుకొని వేలాడుతున్నావ్, ఓహో, ఎన్ని కంపెనీలు మారావ్, ...సో, ఇదన్నమాట నీ బతుకు, థూ!" అని ముగించలేదు.

    ReplyDelete
  5. అయ్యో, రాజారామ్ కథలు కొనుక్కోలేకపోయారా? మీకు త్వరలో ఉద్యోగ ప్రాప్తిరస్తు! బహు పుస్తక ప్రాప్తిరస్తు! విశాలాంధ్రలో ఇంతకుముందు ఒక membership card లాంటి పథకమేదో ఉండాలి. పాతికో, పరకో కట్టి ఒక సభ్యుడిగా చేరితే, విశాలాంధ్ర వాళ్ళు వేసిన పుస్తకాలకి ఇంచుమించు 20%, మిగతా వాటికి 10% (కాబోలు),(రష్యన్ అనువాద పుస్తకాలకి ఇంకా ఎక్కువ) రాయితీ ఇస్తారు. కార్డు మీద ఎవరి దివ్య సుందర విగ్రహాలూ (ఫోటోలు) ఉండవు కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా ఆ కార్డు వాడుకోవచ్చు.

    ReplyDelete
  6. BTW, Jane Austen, PG Wodehouse ఇద్దరు Project Gutenberg చిరంజీవులు. :-)
    ఉచితంగా download చేసుకుని మీ handheld లో పెట్టుకుని చదవచ్చు. అక్కడే
    వాటికి spoken word audio recordings కూడా ఉన్నాయి. happy reading!

    ReplyDelete
  7. శుభారంభం! చాలా సంతోషం!! పైన పద్మగారి ఆశీర్వాదాలనే నేనూ ప్రతిధ్వనిద్దును గానీ .. అటువంటి ఉద్యోగం వస్తే, మళ్ళీ కొన్న పుస్తకాలు చదివేందుకు తీరికే దొరకదేమో .. అందుకని "అభీష్టసిద్ధిరస్తు" అని మాత్రం ఆశీర్వదిస్తాను. నువ్వు కూకట్‌పల్లినించి వచ్చావు కాబోలు. బస్సుల గోల పడలేకే నేను తెలివిగా అన్నిటికీ నడక దూరంలో అందుబాటులో ఉండేట్టు బర్కత్పురాలో ఉండేవాణ్ణి :-)) విశాలాంధ్రలో క్రమం తప్పక కొన దల్చుకుంటే మెంబర్ కార్డు తీసుకోడం మంచిదే. నా దగ్గిర ఉండేది. అంపశయ్య చదివి చాలా రోజులైంది. తాజా చదివిన బుర్రతో ఒక మాంఛి టపా రాయి.

    ReplyDelete
  8. సిటీ బ్యూటిఫుల్ - డా. కేశవరెడ్డి వ్రాసింది కదా!

    ReplyDelete
  9. మీ లిస్ట్ లోని పుస్తకాలు బావున్నాయి.. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే తెచ్చుకుందామని, పెద్ద లిస్ట్ తయాఉరు చేసుకుని వెళ్ళాను.. కానీ అసలు వీలు పడలేదు.. విశాలాంధ్ర చుట్టూ పది సార్లు తిరిగాను కానీ లోపలికి వెళ్ళడానికి కుదరలేదు..!!

    అవును శ్రీరామ్ గారు చెప్పినట్లు బెంగళూరు లో బస్ ఎక్కలేదా..?!
    వీలుంటే అత్తగారి కధలు చదవండి.. బావుంటాయి..

    పద్మగారు చెప్పినట్లు విశాలాంధ్రలో, సభ్యత్వం తీసుకుంటే తక్కువకి వస్తాయి.. ఈ మధ్యే మా స్నేహితురాలు కూడా తీసుకుంది...

    ఈ వారం బెంగళూరులో, దక్షిణ భారత పుస్తక ప్రదర్శన జరుగుతోంది.. మీరు ఇచ్చిన లిస్ట్ లో నేను చదవనివి ఉన్నాయి.. దొరికితే తీసుకుంటాను..

    ReplyDelete
  10. ఉద్యోగం గురించి చింత అవసరం లేదు, మీకు రాకపోతే ఎవరికి వస్తుంది??? పీకలోతు కష్టాల్లో ఉన్నప్పుడు, ఒకసారి గై డి మపాసా (ఫ్రెంచి కథా రచయిత) సంకలనాన్ని వం..ద రూపాయలు పెట్టి కొన్నాను. అది హైదరాబాదు ఫుట్‌పాత్‌పై బతికి ఇప్పుడు అమెరికాలో బజ్జుంటుంది :) (పుస్తక) పఠనో రక్షతి రక్షితహ:

    నేను ప్రస్తుతం బల్లపై కూర్చొని విటుని కోసం ఎదురుచూస్తున్నాను... ఈ సారి హైదరాబాదులో ఎన్ని ఉత్తమమైన పనులు చేయవచ్చో ఉదాహరణతో సహా తెలిపినందుకు దండాలు.

    ReplyDelete
  11. Hmmm.... బానే కొన్నారన్నమాట :)
    వేయిపడగలు.... 400 పెట్టి కొన్నా కూడా మీరు తౄప్తి పడే అవకాశాలు తక్కువ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. :)

    ఇక... నేను ముందు చెప్పనివి, ఇప్పుడు చెబుతున్నా - నవీన్ కాలరేఖలు, చెదిరిన స్వప్నాలు, బాందవ్యాలు - కాలరేఖలు ట్రైలజీ అనొచ్చు. అవి బాగుంటాయి. ఇంకా, విశాలాంధ్ర వారి తెలుగు కథ సంకలనం. 108 తెలుగు కథలు..గత శతాబ్ది లో వచ్చినవి. ఆ పుస్తకం చాలా వాల్యుబుల్ కలెక్షన్. సలాం హైదరాబాద్ కొన్నారా... మంచిది.... అప్నా హైదరాబాద్ కథ మరి... చదూకోండి. Happy reading for u.

    ReplyDelete
  12. మీ పోస్టు చూసిన తరువాత నాకు కూడా మీరు తయారు చేసిన ఆ పుస్తకాలను వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది. కొనేసిన తరువాత చదవనేమోననే భయంతో ఒక్కోటే కొంటున్నాను ప్రస్తుతం నేను "అమెరికా తెలుగు కథ" అనే పుస్తకాన్ని చదువుతున్నాను, ఇందులో కథలు బాగున్నాయి.

    అలా మంచి పుస్తకాల చిట్టాను ఒకదానిని తయారుచేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. మీబోంట్ల వారికోసమేనా తెలుగు నిధి "ఉద్యోగ ప్రకటన"?

    ReplyDelete
  14. బాబోయ్ ఒక రోజూలో పదమూడు వ్యాఖ్యలే ! బ్లా.. బ్లా .. బ్లా ..

    @ శ్రీరాం
    బెంగుళూరులో బస్సెక్కే ఆఫీసుకి వెళ్ళెవాడిని, దానితో పోల్చుకుంటేనే, ఇది చాలా దారుణం అనిపించింది.

    @ రవివైజాసత్య
    అదేనండి, ఆ సైడ్ ట్రాకు చింతనా చైతన్య స్రవంతులలో కొట్టుకు పోయి, ఇక చాలు కొంత సేపు ఒక చోటుందాం అని. :)
    cather in the rye , అసమర్ధుని ..., అంపశయ్య ; మూడూ చై.స్ర పుస్తకాలేగా ..
    అన్నట్టు నే వ్రాయబోయే టపా - గొఱ్ఱెల మంద పుఱ్ఱెల వేలం

    @ రానారె
    "ఒక్కో పుస్తకాన్ని చదివాక మీ స్టైల్లో వ్యాఖ్యానం చెబితే వింటాం"
    గొప్ప వారి సృష్టించినవి అనుభవించివపుడు, వాటినుండి స్ఫూర్తి పొందాలే గానీ, వాటికి సమీక్షలు వ్రాయతలపరాదు అన్నది, నా నమ్మకం.

    విమర్శకుల మీద నాకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. కాని చదివిన వాటి మీద ఒక రెండు వాఖ్యాలు తప్పక వ్రాస్తా.
    "బహుశా ఏ మృదులాంత్రునికైనా ఇవే ప్రశ్నలు వినీవినీ విసుగొచ్చి ఉండాలి"
    నా 'గొఱ్ఱెల మంద పుఱ్ఱెల వేలం' టపాని మీరు లీక్ చేస్తున్నారు :)

    @ padma i
    దీవెనలకి ధన్యడను.
    "ఫోటోలు ఉండవు కాబట్టి మీ కుటుంబంలో ఎవరైనా ఆ కార్డు వాడుకోవచ్చు" మా కుటుంబమే, పుస్తకాలు కొనడమే, బాబోయ్ :)
    Austen అన్నీ చదివేశానండి ఇప్పటికే, కొన్ని రెండు రెండు సార్లు కూడా అయ్యిపోయాయ్. నేనంటే కంప్యూటర్లకు ద్వేషం కాబట్టి లైనుమీద చదవలేను

    :)

    @ కొ.పా
    చెప్పాను కదండి, నేను సమీక్షలు విసర్శలు అస్సలు వ్రాయలేను :(
    కావాలాంటే అంపశయ్య లాంటి నవల ఇంకోటి వ్రాయమంటే, మీబోటోరి సహాయంతో వ్రాయగలనేమో :)

    @ సిరి
    అవును డా. కేశవ రెడ్డి గారిదే సిటీ బ్యూటిఫుల్ (అని రానారె ఎక్కడో అన్నారు)

    @ మేధా
    నా లిస్టు ఇలా పది మందికి ఉపయోగ పడుతుండంటే, నాకు చాలా ..బ్లా బ్లా బ్లా ... :)
    కొట్టులో ఎవరైనా అప్పుడే కార్డు గురించి చెప్పి నాకు ఇప్పిస్తే అక్కడే నాకు గిట్టుబాటైపోయేది. అదే అమెరికాలో ఐతే చెప్పేవారే, ఎఁవిటో మనోరి వ్యాపార

    అశ్రద్ధ! పోనీలేండి, ౧౦౨ రూపాయల తగ్గింపు ఇచ్చారు గా పాపం అప్పటికే.

    @ నాగరాజా
    "మీకు రాకపోతే ఎవరికి వస్తుంది??? " ఈపాటికి ఈ మాట ఒ కోటి మందన్నారండి నిజంగా :)
    నా మిత్రులు బంధువులలో ఈపాటికి ఎవరికి కొద్దిగా సానుభూతి కూడా లేదు. "నీకు ఇస్తుంటే నువ్వే తీసుకోవట్లేదుగా " అని నన్నే ఆడి

    పోసుకుంటున్నారు. ఇమేజండీ ఇమేజు :)

    @ సౌమ్య
    "వేయిపడగలు.... 400 పెట్టి కొన్నా కూడా మీరు తౄప్తి పడే అవకాశాలు తక్కువ. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. :)"
    అదేఁవిటండీ బాబూ, అందరూ సూపరు సూపరు అంటుంటే మీరు తృప్తి పడే అవకాశాలు తక్కువంటున్నారు, పైగా "ఎందుకు చెప్తున్నానో అర్థం

    చేసుకోవాలా ?" ఎదుటివారు, అందునా ఆడవారు, ఎఁవనుకుంటున్నారో అంత తేలికగా అర్థఁవయిపోతే, ఇక్కడెందుకు ఉంటాం? :)
    కొత్త చూసనలకు కృతజ్ఞతలు

    @ ప్రదీపు గారు
    కొన్నాక చదవకుండే ప్రసక్తే లేదండి, అంత మంచివి పుస్తకాలు. మరీ ఒకటే కాకుండా, ఒ నాలుగు నవలలూ, రెండు కథ సంపుటలు కొంటే బాఁవుంటుంది.

    @ Anon
    బాగుందండి తెలుగు నిధి, ఆ వైపు ఒక రాయి విసిరి చూస్తే పోతుందేమో.. http://netijen.blogspot.com/2007/09/blog-post_04.html

    ReplyDelete
  15. కరణి నారాయణ రావు గారికి కృతజ్ఞతలతో..
    శత వసంత సాహితీ మంజీరాలు
    http://wowmusings.blogspot.com/2007/07/blog-post_26.html

    ReplyDelete
  16. పేజీ టైటిల్లో ముద్రారాక్షసం: విశాలంధ్ర అని పడింది.తప్పులెన్నడం నా సద్యోగాల్లో ఒకటి, అందుకు చెబుతున్నాను.

    ReplyDelete
  17. బాబు రాకేశ్వర ఒక బ్లాగు తుఫాను తీసుకొని వచ్చావు కదా

    ReplyDelete
  18. సిరిగారూ, థాంక్యూ. 'సిటీ బ్యూటిఫుల్' కేశవరెడ్డిగారిదే.

    ReplyDelete
  19. "కావాలాంటే అంపశయ్య లాంటి నవల ఇంకోటి వ్రాయమంటే, మీబోటోరి సహాయంతో వ్రాయగలనేమో :)"

    Now, there's an excellent idea. I think you are ideally suited .. and for the time being, in an appropriately suitable frame of mind.. to write a "stream of consciousness" novel. And best yet, don't have anything better to do. So, what are you waiting for?:-)

    ReplyDelete
  20. తెలుగులో వుడ్డుహౌసు తరహా కథలు ఎమ్బీయెస్ ప్రసాద్ ’అచలపతి కథలు’ పేరిట రాశారు. (హాసం ప్రచురణ) చాలా చాలా బాగుంటాయి. హాయిగా పగలబడి నవ్వుకోవచ్చు.

    ’బెదిరిన మనుషులు’, ’బ్రతుకు భయం’ నవలలు కుటుంబరావు సాహిత్యం 6వ సంపుటంలో ఉన్నాయి. డిటెక్టివు కేయాస్ ప్రధానపాత్రగా గల హపూర్వ హపరాద పరిశోదక కథలు, సీతప్ప ప్రధానపాత్రగా గల ఈ రెండు నవలలు కలిపి టి.వి.శంకరం నవలాత్రయంగా చెప్పుకోవచ్చునేమో?

    హైదరాబాదులో ట్రాఫిక్కే అధ్వాన్నం కానీ పబ్లిక్ ట్రాన్సుపోర్టు ఉత్తమం (బహుశా మరే భారతీయ నగరంలోనూ ఊహించలేనంత).

    ReplyDelete
  21. @ సుగాత్రి గారు,
    మీరందించిన సమాచారానికి కృతజ్ఞతలు.

    హైదరబాదు పబ్లిక్ ట్రాన్సుపోర్టు మీద మీకున్న మంచభిప్రాయం, మీకు మంచిది (అమెరికా లో good for you అని అంటారుగా అలా :)

    ReplyDelete
  22. విచిత్రంగా ఈ విషయం ఎవరూ ప్రస్తావించినట్లు అనిపించకపోవడం తో నేనే ప్రస్తావిస్తున్నా:
    మాలపల్లి (ఉన్నవ లక్షీనరసింహ) ౧౫౦ (150)
    - మాలపల్లి రాసింది ఉన్నవ లక్ష్మీనారాయణ కదా? కాదా?

    ReplyDelete
  23. అవును యస్ గారు,మాలపల్లి రచయిత,ఉన్నవ లక్ష్మినారాయణ,నేను మాలపల్లి గురించి(ఎవరూ అడగకపోయినా చెప్తున్నా)ఒక భారీ వ్యాసం రాసేందుకు ఒక వెబ్ పోర్టల్ వారికి బకాయి ఉన్నందున ఇక్కడ ఇంతకన్నా ఎక్కువ(ఇదే ఎక్కువేమో) రాయలేకపోతున్నాను.విశాలంధ్రలో ఇటీవల నేను కొన్న 36బూక్సు గురించి ఒక బ్లాగు రాసుకొనే అయిడియా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

    రాజేంద్ర కుమార్ దేవరపల్లి
    http://visakhateeraana.blogspot.com/

    ReplyDelete
  24. @S .
    అప్పుడే చెప్పేశారెందుకు?
    ఇంకో సంవత్సరం ఆగి చెప్పవలసింది :D
    కృతజ్ఞతలు

    @రాజేంద్ర గారు
    కొందరు బ్లాగర్లు తఱచూ వారు చదివిన సాహిత్యం సమీక్షిస్తూ టపాలు వ్రాస్తారు, నాకు సమయం లేక వ్రాయలేకపోతున్నాను. అంపశయ్య మీద ఎప్పటినుండో వ్రాద్దామని...
    మీ టపాలకోసం ఎదురు చూస్తూంటాం.

    ReplyDelete
  25. రాకేస్వర రావు గారూ,విమర్శకుల మీద మీ అభిప్రాయం చదివాక నేను ఒకరికి బాకీ ఉన్న వ్యాసం తాలూకు సారాంశాన్ని లీకు చేస్తానేమో అని భయమేస్తొంది.అలాగని అందరు విమర్శకులను అంతగా తీసిపారేయకూడదు,చీపురుతో తుడవాల్సిన వాళ్ళూ ఉంటారు.
    సోమర్సెట్ మాం ఈ చీపురు బాపతును ఒక పట్టు పట్టాడు ఆ రోజుల్లోనే.నా భారీ వ్యాసం పూర్తయ్యేదాకా అగలెక(అంటే ముందు ఆ చిత్తుప్రతి దొరకాలి దాన్ని ఈకొత్త మతంలోకి ప్రవేశపెట్టాలి) త్వరలో చిన్నయసూరీ మన్నించు అనంబడు ఒక బ్లాగును పాఠకలోకం మీదకు వదల బోతున్నాను.
    మీరు అన్నట్లు పుస్తకసమీక్ష అనలేను కానీ కొందరిని పరిచయం చేసే ఆలోచనవుంది.ముందుగా గొడ్లకాపరి వలె మీరు కూడా అనే చిన్నిపొత్తాన్ని మహాజనానికి పరిచయం చేద్దాం అనేది ఇప్పటికి నేపన్నుతున్న కుట్ర.

    ReplyDelete
  26. అమ్మో... ఇన్ని పుస్తకాలే! అన్నీ చదవటమైనదా రాకేశ్వరా?

    మంచి జాబితా. బాబ్బాబు... నాకు విశాలాంధ్ర ఎక్కడుందో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోవచ్చు కదూ?

    ReplyDelete
  27. సుగాత్రి,
    అచలపతి కథలు నాకంతగా నచ్చలేదు ఎంచేతో! బలవంతంగా నవ్వించే ప్రయత్నం చేసినట్టు అనిపించింది.

    రాకేశ్వర,
    ఇంతకీ మీకు మేఘదూతం పుస్తకం అందిందో లేదో చెప్పనే లేదు.(వద్దనుకుంటూనే అడుగుతున్నాను)

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం