భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, March 27, 2009

సింహరాశి అనానిమిషులు - 'సింహవిరోధి' సపోర్టు గుంపు

నేను ఏదో పుస్తకాల కొట్టు కెళ్లి ఏవో పుస్తకాలు కొంటే వాడు పోనీలే పాపం అని నాకు ఒక పంచాంగం బహుకరించాడు. అది తిఱగవేస్తూ ఈ ఏఁడు ఏ రాశి వారికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, వ్యయం ఎంత అవమానం ఎంత అని చూస్తూండగా. నా రాశి అయిన సింహరాశికి వచ్చే సరికి వ్యయానికి(౫) రెండితల ఆదాయం(౧౧), అవమానానికి(౩) రెండితల రాజపూజ్యం(౬) చూసి తెగ సంబర పడిపోయాను. అలాగే మేష రాశివారి ఫలితాలు జూసి చాలా జాలివేసింది. ఆదాయం రెండయితే వ్యయం ఎనిమిదఁట, రాజపూజ్యం ఒకటైతే అవమానం ఏడఁట! అయ్యోపాపం అనుకుని వారి ఫలితాలు చదవగా "ఈ రాశి వారికి ఈ సంవత్సరము అనుకూలము" అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఓహో ఈ అంఖెల్లో ఏం లేదన్నమట! అయితే ఒక సారి సంహిరాశిలోకి వెళ్ళి మన ఫలితాలు ఎలా వున్నాయో సువివరంగా తెలుసుకుందా అని చదవడం మొదలు పెట్టాను.


ఈ రాశి వారికి గురుడు 30-7-09 వరకు షష్టస్థానమైన మకరమునందు తదుపరి సప్తమస్థానమైన కుంభరాశిలో లోహమూర్తిగాను, 30-7-09 నుండి 19-12-09 వరకు వక్రనడకతో షష్టమరాశియైన మకరరాశిలోను తదనంతరము సప్తమస్థానమైన సహింహరాశిలోనూ పిమ్మట ద్వితీయ రాశియైన కన్యరాశి యందు రజితమూర్తిగాను సంచారము. రాహువు 19-11-09 వరకు షష్టమస్థానమైన మకరరాశి యందు తదనంతరము పంచమస్థానమైన ధనస్సునందు లోహమూర్తి గాను, కేతువు 19-11-09 వరకు వ్యయస్థానమైన కర్కాటకరాశియందు, అనంతరం లాభస్థానమైన మిథునరాశి యందు లోహమూర్తి గాను సంచారము.

ఈ రాశివారికి ఏలినాటిశని ప్రభావము ప్రబలముగా వుంటుడ వలన, గురుని యెక్క బలము సామాన్యముగా యుండుట వలన ఈ సంవత్సరము ఇబ్బందికరముగా యుండును.
ఆర్థికముగా వెనుకబడుట, అనారోగ్యము, మానసికంగా బలహీనత, కోర్టువ్యవహారములలో చిక్కుకొనుట, ప్రమాదము ఏర్పడుట, నిస్త్రాణనిరాశలు, మిత్రులు శత్రువులగుట, స్థిరాస్తుల విక్రయము, ఋణములు చేయుట జరగే అవకాశములు గలవు.

వ్యపార రంగమలోని యీ రాశివారికి జాయింటు వ్యాపారము వలన నష్టపోవుట జరిగే అవకాశము గలదు. ఆర్థక లావాదేవీలతో సమస్యలు ఏర్పడును.
రాష్ట్ర కేంద్ర ప్రయివేటు రంగములలోని ఉద్యోగస్తులకు వత్తిడి ఎక్కవగుట, కొన్ని పరిస్థితులలో సస్పెండు అయ్యే అవకాశములున్నవి. కావున అతిజాక్రత్తగా మసలు కొనుట మంచిది.
విద్యార్థులకు మొదటి ఛాన్సులో కంటే రెండవ ఛాన్సులో చక్కని ఫలితం లభిస్తుంది.
రైతులకు పంటల దగుబడి తక్కువగా వచ్చును. తద్వారా ఆర్థిక పరమైన నష్టము కలుగును.
కాంట్రాక్టుదారులకు టెండర్లు కలసివచ్చనప్పటికీ, ప్రభుత్వపరమైన ఒత్తిడుల వలన కష్టనష్టముల పాలగుట జరుగును. ఫైనాన్సు వారికి లాభదాయకము.
వృత్తిపనివారలకు, టీవి మఱియు సినీకళాకారులకు శ్రమకు తగ్గ ఫలితం లభించదు.
ఆదాయము కంటే ఖర్చు తక్కువగా వున్నప్పటికి అప్పుడప్పుడు ఆర్థికమైన ఇబ్బందులు కలుగును.
రాజకీయనాయకులైన యీ రాశివారికి తగినంత ప్రోత్సాహకరమైన కాలముకాదు.
ఈ రాశి స్త్రీలకు తమమాట చెల్లుబాటుకాదు. వ్యతిరేకత ఎక్కువ. చోరభయం, ఉదర సంబంధమగు వ్యాధులు, తలపోటు, జ్వరములు వచ్చుట సంభవించును.
అవివాహితులకు వివాహము జాప్యమగును.

ఈ రాశివారి అదృష్టసంఖ్య ౧. అనుకూల సంఖ్యులు ౨,౩,౯. రాశ్యాధిపతి రవి గావున కెంపు ధరించుట, మఖానక్షత్రమువారు వైఢూర్యము పుబ్బవారు వజ్రము ను ధరించుట మంచిది. ఈ రాశి వారు గురు శనులకు జపదానములు చేయుంటకొనుట, నలమహారాజు చరిత్ర పఠించుట మంచిది. నీలిరంగు పువ్వులు నల్లని వస్తువులు నువ్వులనూనె దానంగా ఇవ్వండి. ఎఱుపురంగు పూలమొక్కలను తూర్పుదిశలలో పెంచండి. శుభం జరుగుతుంది.

===========================================

"*&^) మ్యాన్, ఈ ఏఁడు బాగా *&^% పోయినట్టున్నాం" అనుకున్నాను. వీడు ఇంత సువివరంగా వ్రాయడం మానేసి, "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.

వ్యాపారం చేద్దామంటే నష్టపోతామంట. ఉద్యోగం చేయబోతే అది కాస్తా ఊడిపోతుందఁట. పోనీలే మళ్ళీ పైచదువులకు పోదామంటే, అవీ కుదరవఁట. రాజకీయం, వ్యాపారం, వ్యవసాయం కళారంగం అబ్బే ఎక్కడా లాభం లేదు. పోనీలే పెళ్ళి చేసుకుంటే పోతుంది అని అనుకుంటే, ఆ భాగ్యమూలేదు. పెపెచ్చు అనారోగ్యం కూడానఁట. కాబట్టి ఈ ఏఁడు కూడా ఇలా నిస్త్రాణ నిరాశలతో గడిపేయాలఁట. (నిస్త్రాణ nis-trāṇa. n. Weakness.).
పోనీలెండి, ఈయనెవరో ముందే చెప్పి మనల్ని మానసికంగా సిద్ధంగా వుంచాడు. ఇప్పుడు నాకు ఏంజరిగినా, "అఱె ఆ రోజు పలానా నామాని వారి పంచాంగంలో అచ్చం ఇలాంటిదే జరుగుతుందని వ్రాసారే" అనుకోవచ్చు. అలానే అడ్డమైన ప్రయత్నాలలో శ్రమ, డబ్బు ఖర్చు మానుకోవచ్చు. ఇంచక్కా కాళీగా కూర్చుని బ్లాగులు చదువుకోవచ్చు.

===========================================


ఏమిటి రాకేశ్, ఇంతా చదువుకొని నువ్వు కూడా ఇలాంటి మూడనమ్మకాలు పెట్టుకంటావా?
ఆఖరికి ఇంతకి దిగజారిపోయావా?
ఇవన్ని సోది మాటలు రాకేశ్, పొట్టగడుపుకోవడానికి వ్రాస్తారు, వాటిని నమ్మకూడదు.
అసలే స్టాటిస్టికల్ అనలిష్టువి, వెయ్యమందిలో ఒకఁడికి పది సార్లు టాసు వేస్తే వరుసగా పదిసార్లూ బొరుసే రావడం సహజం అని తెలిసినవాడివి. మానవకృషి యొక్క విలువ తెలియకపోవడమేమిటి?
ఇలాంటి మాటలు మీరు అంటూవుండవచ్చు.

అవును నిజమే, నేను చాలా చదువుకున్నాను. లెక్కల నుండి ఛందస్సు వఱకూ, ఆర్థిక శాస్త్రం నుండి మానసిక శాస్త్రం వఱకూ. ఆచార్యుని అద్వైతం దగ్గర నుండి ఐనిస్టీను రిలేటివిటీ వఱకూ చాలా విషయాలు చూచాయిగా పరిచయం కూడా వున్నాయి. ఏన్నో పరీక్షలు కష్టపడి వ్రాసాను, పలుదేశాల్లో పలు రంగాల్లో పనికూడా చేశాను.

నేనూ రెండేండ్ల క్రితం వఱకూ మీలాగానే ఆలోచించాను. తుస్ ఈ జాతకాల్లో ఏం లేదని. ఇదే ఏలినాటి శని గుఱించి మీరు నాకు రెండేళ్ళ క్రితం అనగా ౨౦౦౭ ఉగాదిలో చెప్పుంటే. "తుస్ శనీ లేడు గినీ లేడు, నా రాశిలో కొస్తేనేం, వెనుకభాగం మీద తంతే, వీధవతల పడతాడు" అనేవాడిని. అలా ౨౦౦౮ ఉగాదిలో చెబితే, "వెల్... అంటే... ఇలాంటివి నమ్మకూడదనుకో... కానీ చెప్పలేం.. ద యీనివర్స్ కెనోన్లీ బీ సో రేణ్డమ్ కదా... దానీకీ దీనికీ స్టాటిస్టికల్ కోరిలేషన్ వుండడం పెద్ద ఆశ్చర్యమేముంది. గత ఏఁడాది నేను అనుకున్నట్టుగా ఒక్కటీ జరగలేదు చూడండి. మా బామ్మ కూడా 'జాతకం బాలేదురా అందుకే అమెరికానుంచి వచ్చేసావు' అనంది" అని అనేవాడిని.

ఇక ఈ ఏటికి వచ్చేసరికి పంచాంగం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాను. "శని ఎలా వున్నాడు, అతనికి అన్ని మర్యాదలూ జరుగుతున్నాయా, ఇంకెన్నాళ్ళుంటాడు మన రాశిలో" వంటివి తెలుసుకుందామని. వాళ్ళు "పర్వాలేదు, ఈ ఏఁడు బానేవుంటుంది" అనంటే నా పనులు నేను చూసుకుందామని, లేకుంటా - ప్రస్తుతం ఉన్నట్లుగా కాళీగానే వుందామని నిర్ణయించుకున్నాను.

మొన్నటి వఱకూ ఎవరైనా "వూళ్లోనేం చేస్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు?" అనడిగితే మార్చనో మాఘమనో ఏదో చెప్పేవాడిని. ఇప్పుడేమో ఆ శ్రమంతా లేక "ఇక్కడే వుంటున్నా ఎక్కడికీ వెళ్ళట్లేదు" అని చెబుతున్నాను. ఇఁక మొన్నొకసారి ఒక హస్తజ్యోతిష్యుని దగ్గర చెయ్య చూపించుకుంటే, "అఱ్ఱె ఈపాటికే నువ్వు ఆసుపత్రిలోనుండాలే" అన్నాడు. "వెల్ డ్యూడ్ యు గాటే పాయింట్" అనుకున్నాను మనసులో. అలా ఆ డ్యూడ్ పాయింటుతో అప్పటికే బలంగానున్న నా నమ్మకం ఇంకా బలపడింది.

పోనీ లెండి నల్లమబ్బుకి తెల్లంచు అన్నట్టు. ఫైనాన్సులో వున్నవారికి లాభదాయకం అన్నాడు. కాబట్టి నేను ప్రస్తుతం చేస్తున్న డెరివేటివ్ ట్రేడింగ్ . కొనసాగిస్తే సరిపోతుందిదేమో. అసలే రెండు నెలలుగా లాభాలువస్తున్నాయి. అలలే ఇవాళ అచ్చంగా నా కోసమే అన్నట్టు నిఫ్టీ 3050 పైన ఆగింది. కాని నా స్నేహితురాలు తన తరఫున కూడా పెట్టుబడి పెట్టమంటుంది. "నా పంచాంగంలో జాయింటు వ్యాపారం వల్ల నష్టాలు వస్తాయనుంది, కాబట్టి నీ రెండు లక్షల పెట్టుబడీ నువ్వే వుంచుకోవమ్మా" అని చెప్పేశాను.

===========================================

"ఈ టపా చదువుతున్న సింహరాశి సోదరసోదరీమణులు, బావమరిది మరదలాదులు, నిస్త్రాణ నిరాశ పడవలసిన అవసరం లేదు" అని నేనంటే, నేను మీ సగటు తెలుఁగు రాజకీయవెత్త కంటే దుష్టుడనైపోతాను. కాబట్టి నిస్త్రాణ నిరాశ పడదాం, కానీ అది ఉమ్మడిగా పడదాం. యద్భవిష్యులమై కూర్చోకుండా, మనం సింహరాశి అనానిమిషులు అని ఒక సపోర్టు గుంపు ఏర్పఱచుకుందాం.

ప్రతి శని వారం, అలానే ప్రతి నెలలోనూ మన అదృష్ట సంఖ్యలైన ౧, ౨, ౩, ౯ అలానే ౧౧, ౧౨, ౧౩, ౧౯, ౨౧, ౨౨, ౨౩, ౨౯, ౩౧ తేదీలలో కూడలి వారి కబుర్ల గదిలోఁ కలసి మన దగ్గరున్న వజ్రవైడూర్యకెంపులను పంచుకుందాం. మఱి నాలాంటి నిరుద్యోగులకు వజ్రం కొనుక్కోవాలంటే కష్టమేకదా. శని గురువులకు జపదానం చేద్దాం, వాళ్ళైనా పాపం ఇంటింటీకీ ఏం వెళతారు. మన రాశి లోకి శని అప్పుడప్పుడూ వచ్చి వెళ్తూంటాడు. కానీ పాపం శనిని శని ఎప్పుడూ పీడిస్తూనేవుంటుంది. అలానే నేను నలమహారాజు చరిత్ర కాపీ చేస్తాను మీరు పేస్టు చేసుకోండి.

మీరందఱూ నాకు తలో ఐదువేలు నగదు పంపండి, నేను మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయంలో శనిత్రయోదశినాడు మీ పేర్ల మీదఁ లక్షనామజపదానం చేయిస్తాను. సరేనా మఱి. అప్పటి వఱకూ ఈ బరాకేశ్వర మంత్రం గుర్తుపెట్టుకోండి.
ఆ॥
కద్దు కటిక రాత్రి పొద్దు పొడుపు ముందు
ఇట్టు యీసు గోన గెట్టు వర్సు
బీఫొరిట్టు గెట్సు బెటరు! సో టేక్కేరు
విశ్వదాభిరామ వినుఁ బరాక!

18 comments:

  1. "ఈ ఏఁటికి ఈ రాశి వారి కర్మ గుడిసెటిది" అని క్లుప్తంగా వ్రాసివుంటే ఆయనకీ నాకూఁ కాస్త శ్రమ తగ్గేదిగా.

    కేక. భలే చెప్పారు. "మీరేపని చేసినా xyz నాకిపోతుంది" అని చెప్పడానికి ఇంత సోది ఎందుకు అనిపిస్తుంది నాక్కూడా అలాంటివి చూస్తే

    ReplyDelete
  2. అయితే ఈ సంవత్సరమంతా అందానికి మెరుగులు దిద్దుతూ తెనుగు భాషా పోషణేనన్నమాట....Lucky youu! :)

    ReplyDelete
  3. బ్లాగ్వ్యాపారంలో ఎలాఉంటుందో రాయలేదా పంచాంగంలో?
    సెబాసు బరాకేస్సరా

    ReplyDelete
  4. కొత్తపాళీ గారు, మీరడిగింది పంచాగంలో ఉండదనుకుంటా:-)!

    రాకేశ్వరా,
    నాకు తెలిసి సింహరాసి వాళ్ళు సీతయ్యలు, సీతమ్మలూనూ! ఎవ్వరి మాటావినరు. మా కుటుంబంలో ముగ్గురున్నారు. మా అన్నయ్యా, మావారి అన్నయ్యా, మా చెల్లెలూనూ! వీళ్ళకి పంచాగంతో పని లేదు మరి!

    మీ పోస్టు మాత్రం అదిరింది.

    అన్నట్లు నాక్కొన్ని టిప్స్ కావాలి షేర్ల విషయంలో!

    ReplyDelete
  5. ఉగాది రోజే అచ్చుతప్పు! పంచాంగం అని రాయబోయి...

    ReplyDelete
  6. సింహరాశి గురించి చెప్పి భయపెట్టినా పోస్టు మాత్రం బాగుంది.
    @సుజాతా, సింహరాశి వాళ్ళు సీతయ్యలు, సీతమ్మలూనూ! భలే నిజం చెప్పారు.

    ReplyDelete
  7. Thanks for making my day. నాది కూడా సింహరాశే :(

    ReplyDelete
  8. అవివాహితులకు వివాహము జాప్యమగును

    నాకన్నిటికంటే పైన విషయమే బాధ కలిగించింది. గుండె దిటవు చేసుకో రాకేశా. నీ పరశురామాంగన ఎక్కడో వెయిటు చేస్తూనే ఉంటుంది. ప్చ్ ...

    ReplyDelete
  9. ఇంతకీ మీది సూర్యమానమా లేక చంద్రమానమా?

    ReplyDelete
  10. @ కోపా తెరసా గార్లకి, కళారంగం వారికి కూడా బాలేదన్నాడు కాబట్టి అందులో బ్లాగులు కూడా వస్తాయని లెక్కేసుకున్నాను.

    @ సుజాత గారు,
    ఎంత సింహం అయితే మాత్రం బోనులో పెట్టి శని దేవుఁడు మాంసం పెట్టకుండా పస్తు పెడుతుంటే - సింహం మేకై కూర్చోదు :)
    అన్నట్టు అచ్చు తప్పులనేవి ఈ బ్లాగు జన్మహక్కు - పాఠకులకు కూడా ఇది వర్తిస్తుంది.

    @ రాశేగా గారు,
    మీకు ఈ ఏఁడాది ఏకైనా, కనీసం ఈ ఒక్క రోజు మేకైనందుకు సంతోషం.

    @ ప్రవీణ్
    పరశురామక్షేత్రాంగన. పరశురామాంగనని ఎత్తుకొత్త వచ్చి గొడ్డలితో తలనరికిపారేస్తాడు. అన్నట్టు పరశురామకేత్రం నుండి కోనసీమక్షేత్రానికి మార్చబడ్డది రేడారు :)
    అయినా రేడారుకు ఒక ఏఁడు శలవు ప్రకటించడం జరిగింది :)

    @ అనానిమిషులు
    ఏమిటి మీరు కూడా సింహరాశి అనానిమిషులా ?
    చంద్రమానమేలెండి. మన పంచాంగాలన్నీ చంద్రమానమేగాఁ...

    ReplyDelete
  11. రాకేశ్వరా, ఇరగదీశారు. మీ టపాలు చదవడం గొప్ప సరదాగా ఉంటుంది.

    కోనసీమ క్షేత్రానికి రాడారు మార్చారా!! అసలే ఏల్నాటి శని నడుస్తోంది, జాగర్త బాబూ!!

    ReplyDelete
  12. ఉగాది శుభాకాంక్షలండీ రాకేశ్వరులవారూ. ఇంతకీ కోనసీవఁలో ఎక్కడుందేవిఁటండీ మీ రేఁడారు?

    ReplyDelete
  13. పరశురామక్షేత్రాంగన??

    ReplyDelete
  14. @ నాగమురళి గారు, అసలే బిక్కు బిక్కు మంటుంటే, మీరు జాగ్రత్త అని వెనక్కి లాగేస్తున్నారు. "లేదు రాకేశ, ఏలినాటి శని లేదు ఏం లేదు, ధైర్యంగా ముందుకు సాగు" అంటే బాగుండేది. అసలే కోనసీమ అంటేనే శనీశ్వరుని క్షేత్రం కదూ.

    @ రాఘవ, రేడార్ల విషయమై, ఏదో మీరు నాగమురళి గారు వంటి మంచి వ్యక్తులు మాలాంటి 'యోగ్యుల' గుఱించి మీ సీమలో కొన్ని మంచి మాటలు చెబితే, మీరే ఆ రేడార్లఱేళ్ళు :)

    @ బుజ్జిగారు,
    పరశురామక్షేత్రాంగన

    ReplyDelete
  15. కేక.

    గుడ్డిలో మెల్ల, రాకేశ్వఱ రావు గారు, ఎందుకంటే మీకు పెళ్ళవలేదు.

    పంచాంగంలో నాకు, మా ఆవిడకు ఇద్దరికీ అన్యాయంగా రాశారు. పోయినేడు, నాకు వ్యయమెక్కువ, మా ఆవిడకు ఆదాయమెక్కువ అని రాసుండింది. (వ్రాసుండింది) ఇది రాయాల్సిన అవసరం లేదు. Universal గా జరిగేదే అనుకోండి. ఈ సారి నాకూ, మా ఆవిడకు ఇద్దరికీ అన్యాయం చేశారు.

    కష్టము + కష్టము = అష్టకష్టము
    కష్టము + నష్టము = ముదనష్టము

    నా పాలిటి విరోధి రెండవది. ఆర్థిక మాంద్యం మా ఇంట్లో కూడా మొదలయింది.

    ReplyDelete
  16. మీ గుంపుకు శీర్షికా గీతం
    సింహ రాశి మనది
    నిండుగ మునుగురాశి మనది" అని పెట్టుకోవచ్చు ...
    దీనికి కూడ లెక్కలున్నాయి
    ముందు జనమ నక్షత్రం చుసుకోవలి.. అది నప్పక పొటే నామ నక్షత్రం చూసుకోవాలి..
    అది నచ్చకపోతే పంచాంగం మార్చాలి.. ఆ కొట్టు వాడినే ఫలానా రాసికి బావుంది అని రాసిన పంచాంగం ఇవ్వండి అంటే ఇస్తాడు..
    ఐనా.. డెరివేటివ్ ట్రాడింగ్ లో లాభాలంటే, సింహ రాసే(విటీ, సింహమే మీరు

    ReplyDelete
  17. @Rakesh:
    భలే రాసారండీ. నా రాశి ఫలాలు కూడా ఇలాగే ఉన్నాయి...కానీ కొంత యావరేజీగా ఉన్నాయి లెండి కొన్ని నెలల్లో...మొత్తం నా కర్మంతా ఇలా ఉందేంటీ ఖర్మ! అనుకోనక్కర్లేదు నేను. కొంత ఆశపడొచ్చు.
    Nice post. మీ టపాల కోసం మళ్ళీ ఎదురుచూపులు మొదలు.

    ReplyDelete
  18. hi ivvale mee blog choodatam jarigindi ...chooste pedda vidyavanthulu la unnaru ..election time lo oorlo undo voteyyatam enti anukonnaaa....sare bavarse ga (not working) ayithe intha blogging how possibleeaaa ani ....ikkada ardham ayyindi tamaru businesss magnet ani (trading) ...mee pani super ....

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం