భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, March 23, 2009

ఇంసోమ్నియపు పద్యాలు

రోజూ రాత్రి పడుకునేముందు ప్రొద్దుటే ఆఱింటికి లేవాలి అనుకొని తొందరగా పడుకోవడం జరుగుతుంది. కానీ నిద్రపట్టిచావదు - వేడనో దోమలనో ఆలోచనలనో. అలా నిద్రకోసం వేచిచూస్తున్నంతసేపు, ప్రపంచ పరిస్థితిని బాగుచేయాలనే ఆలోచనల ఊబిలో పడకుండా కాపాడుకోవడానికి నిన్న రాత్రి రెండు వృత్తాలు వ్రాయఁబూనుకున్నాను. కాగితం కలం కంప్యూటరు కీబోర్డు లేకుండా బుఱ్ఱలోనిలా ..
చం॥
కవితలు మాని యీ యువత కాసులె లెక్కలు వేసుకొంటిరే ।
అవతల పేదజీవితము లాకలి కేకలు పట్టవేవి । పై
స విలువ యైన లేని జలసాలకు బోతిరి నాగరీకులై ।
సుమిమల సౌమ్య సుందరతఁ జూడక పోతిరి కామచారులై ॥

చంపకమాలంటే నజభజజజర అని కాకుండా తననన తాన తాన తన తానన తానన తానతానతా అని గుర్తు పెట్టుకంటే మంచిదని విని అలా పట్టాను. కాబట్టి ఈ పద్యంలో పదాల విఱుపులు కూడా అలానే వస్తాయి.


మ॥
కడుపా? అయ్యది ఖండవల్లి మడుగా? కాజాలు, లడ్డూలు, మీ
గడ బొబ్బట్లును, పప్పుచారు, పెరుగూ, కారాల పచ్చళ్ళు, మా
మిడి పళ్ళేమిటి, పాయసాలిఁక యిలా మీరెంత వడ్డించినా
మిడతంభొట్ల గణేశు గాడికసలేమీ చాలదంటే నిజం॥

కడుపా అయ్యది ఖండవల్లి మడుగా అన్నది శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారనే కవి వ్రాసిన "బొబ్బిలి యుద్ధం" నాటకం లోనిదఁట. ఖండవల్లి మడుగు ఇప్పుడో జాతీయంగా మారినా (ఖండవల్లిలోని ప్లాస్టిక్ చెత్తకి అది ఒక ముఱికి కూపంలా కూడా మాఱివుంటుంది లెండి అది వేఱే విషయం) ఆ మిగిలిన పద్యం ఎవరికీ తెలియదు. ఆ మత్తేభ విక్రీడితమెలా వుంటుందో నాకు తెలియదు గాని, ఇలావుంటుందేమో అన్నట్టుగా మీకోసం అచ్చమైన వాడుక తెలుఁగులో పూరించాను. ఆస్వాదించండి.

10 comments:

 1. చాలా బావున్నాయి. ఈ రెండేళ్ళలో మీరు చాలా ఆపోஉశన పట్టేశారు. అభినందనలు.

  ReplyDelete
 2. రాకేశా! భళి! బుఱ్ఱలోఁ దొలుత నారంభించి, యాలోచనా
  నేకానేకములం మరల్చి, నిదురన్ నిష్కర్షగాఁ ద్రొక్కి, మీ
  రీ కార్యంబును నెత్తికెత్తుకుని, యిట్లీ రీతిఁ బద్యాలఁ జె
  ప్పే కొద్దీ పదునెక్కు మేధ! కవితావిద్యన్ యశం బొందుడీ.

  ReplyDelete
 3. తాబాసు గారు, రాఘవ నేనర్లు.
  అన్నట్టు ఇప్పుడే గుర్తుకువచ్చింది ఇవి నా మొదటి చంపకమాల, మత్తేభాలు :)

  ReplyDelete
 4. "తననా"ల పద్ధతి కూడా మంచిదే. కానీ తెలుగు పద్యాలు బాగా రాయాలంటే - గ్రాంథికంలో మాట్లాడ్డం. ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. Spoken English course లా అన్నమాట.

  ReplyDelete
 5. చంపక మాలలో తమరు చక్కగ చెప్పిరి మీస్థితిన్‌ అహా
  నింపిరి నా మనంబునిక నిత్యము జేతును కృషి వృత్తమున్‌
  దెప్పిరిగా గణాధిపుని దెచ్చిన పాకములన్ని మెక్కగా
  మెప్పుల నందగా తగును మెత్తని చందము చెప్ప మీరికన్‌

  ఆహా నాచేత మొదటి ఉత్పల మాల చెప్పించారుగా.. ధన్యవాదాలు.

  ReplyDelete
 6. రెండో పద్యం భలే ఘుమగుమలాడుతోందండీ!

  ReplyDelete
 7. నిద్రాకాంతనుదవ్వుజేసిబిలువన్ నెయ్యంబుతో, హృత్ సువ
  ర్ణాద్రిపైనటనంబులాడ తవి నౌరా,రాన్,పద్యకాంతయే
  ముద్రల్ కంపడనయ్యకవితలం,మోదంబునేనొంద,ఆ
  హా!ద్రాక్షామధుపాకమన్ననిజమౌ,ఆచంటరాకేశ్వరా.

  ReplyDelete
 8. నిద్రాకాంతనుదవ్వుజేసిబిలువన్ నెయ్యంబుతో, హృత్ సువ
  ర్ణాద్రిపైనటనంబులాడ తవియుం,రాన్,పద్యకాంతామణే,
  ముద్రల్ కంపడనయ్యకవితలం,మోదంబునేనొంద,ఆ
  హా!ద్రాక్షామధుపాకమన్ననిజమౌ,ఆచంటరాకేశ్వరా.

  ReplyDelete
 9. నిద్రాకాంతనుదవ్వుజేసిబిలువన్ నెయ్యంబుతో, హృత్ సువ
  ర్ణాద్రింజేరియెనాట్యమాడతవియుం,రాన్,పద్యకాంతామణే
  ముద్రల్ కంపడనయ్యకవితలం,మోదంబునేనొంద,ఆ
  హా!ద్రాక్షామధుపాకమన్ననిజమౌ,ఆచంటరాకేశ్వరా!

  పై రెండిటిలో తప్పులున్నాయి కానీ, ఇది ఖాయం చేసుకొని, ఇందులో తప్పులుంటే చెప్పండి..

  ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం