భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, November 12, 2009

మేరీ మాతా వందనం

తెలుఁగు వారి ఆత్మాభిమానాన్ని (లేదా దాని లేమిని), వారి నిజాయితీని(లేదా దాని లేమిని) బయటపెట్టిన ఓ మేరీ మాతా వందనం.

అసలెవరీ మేరీ మాత?
స్కూల్ టీచరా? క్షమించాలి బడిపంతులా?
లెక్కలు చెబుతుందా? ఇంకేమైనా చెబుతుందా?
క్రైస్తవురాలా? మాలా? మాదిగా? మఱింకేమైనానా?
తెలుఁగింటామా? తెలుఁగు ద్వేషా?
ఆంగ్లింటామా? ఆంగ్లమసలు వచ్చా?
క్రూరురాలా? క్రమశిక్షణాపరురాలా?
క్రమశిక్షణాపరాయణురాలా?
అమాయకురాలా? దోషా?
బలిసిన బడిపంతులా? లేక, బతకలేక బడిపంతులా?
లేదా ప్రలోభమే మూలమైన ఈ బృహద్యంత్రంలో ఒక మఱ మాత్రమేనా?
తాము చేసే తప్పుకు తమను తాము నిందించుకోలేక, జాతి జాతి మొత్తమే వెదుక్కున ఒక బలిపశువా?
ఇలాంటి మేరీలను బ్రతకనియ్యాలా లేదా బలివ్వాలా?

* * *

అసలు ఈవిడ కొత్తగా చేసినదేఁవిటి? ఏఁవిటి ఈవిడ చేసిన తప్పు?
ఆంగ్లమాధ్యం బడిలో ఆంగ్లం మాట్లాడాలని చెప్పడమా?
మాతృభాషని అవమానించడమా?
క్రూరంగా ప్రవర్తించి వేయరాని శిక్ష పిల్లలకు వేయడమా?
లేదా పిల్లల తల్లిదండ్రుల ఆశయాలను ప్రాణం కంటే ఎక్కువగా పరిగణించడమా?

మెడలో పలకలు అనాదిగా ఈ నాట ఈ ప్రజ తగిలిస్తూవస్తున్నదే, తొలుత పశువుల మెడలలో. గత ఇఱవయ్యేండ్లగా పిల్లల మెడలలో. పిల్లల ఆత్మలకు శారీరికంగా మానసికంగా గొలుసులు అనాదిగా వేసిన కుటుంబ వ్యవస్థ సృష్టించిన బడిలో ఉద్యోగం చేయడమా ఈమె తప్పు? దానికి సంత జోసపు పేరుండడమా?

తెలుఁగులో మాట్లాడినందుకు దండించడమా ఈమె తప్పు?
తెలుఁగు బళ్ళు కాదనుకొని, ఆంగ్ల మాధ్యమం బళ్ళలో వేసి, అందులో పిల్లలను చేర్చి అందులో వారు నేర్చిన పరభాషా ప్రావీణ్యతని చూసి మురిసిపోయే తల్లిదండ్రులున్న రాష్ట్రాన ఏఁవిటి ఈవిడ తప్పు?
“ఉరేయ్ అసలు వాళ్ళ స్కూలులో తెలుఁగు మాట్లాడనీయ్యరులా, ఒక స్టిక్కువుంటుంది, అది ఎవరు తెలుఁగులో మాట్లాడితే వాడి చేతిలోకి వెళుతుందన్నమట.. అడిగో మావాడు.. ఓయ్ బేబీ యువ్వు కమ్ము హియరు.. ఓయ్ యువ్వోల్నీ అయామ్ టెల్లింగ్ నో...”

* * *

అవును ఈవిడ తప్పుచేసింది.
కార్తీక సోమవారం పౌర్ణమి వచ్చి మహాపవిత్రతను తెచ్చిపెట్టినట్టు.
ఈమె మెడలో పలకలను తగిలించి, దానికి కారణంగా తెలుఁగు మాట్లాడడం చూపించడం మహాపాపత్వం తెచ్చిపెట్టింది. అందునా ఉదయానే కలుషిత ప్రపంచంయొక్క మలిన వాసనలను పీల్చడానికి ఎంతో ఆత్రుతగా పత్రికలు తెఱిచే ప్రజలకై, ఆ మలినాన్ని సేకరించి సంపాదకీయమొనర్చి వారికందించి పొట్టగడుపుకునే ధన్యజీవుల కంట పడడము ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ఇంతకంటే పెద్ద తప్పు ఈమె సంత జోసపు పాఠశాలలో పనిచేయడం. దాని బదులు ఎమ్మెల్లే పెద్దయ్య రెడ్డినాయుడు గారి బావమఱిది నడిపే మై టెక్నో టాలెంట్ శ్రీ సిల్వర్ జూనియర్ ఛాంపియన్ యనర్జీ స్కూల్ లో పనిచేయకపోవడం ఈమె చేసిన అతిపెద్ద తప్పు.

ముప్పై వార్తా స్రవంతులను ఆదరించి వాటి రొచ్చు నెత్తిన గుప్పించుకునే రాష్ట్రంలో ఇంకా వీరిని కంపించేంతట పని చేసావంటే నువ్వు సామాన్యురాలివికావు.

* * *

ఈ ప్రలోభ జాతికి తమ తప్పును ఇంత అమాయకంగా చూపించేయడం ఈమె చేసిన తప్పు!

ఇంటర్ మీడీయెట్ హాస్టళ్ళలో పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడ్డప్పుడు, వీరి వీర్యం నిద్రపోయింది. అప్పుడు రెడ్డినాయుని డబ్బుకీ వాని బావ మబ్యపెట్టుడికీ లొంగిన పత్రికలవాడు నిద్రపోయాడు.
అంతేనా..
ఏఁవీ ఎఱఁగనట్టు మళ్ళీ అదే జూనియర్ ఐఐటి అకాడమీ విత్ యంసెట్ అండ్ ఎఐఇఇఇ కోచింగు అకాడమీలకు తమ పిల్లపశువులను తోలారు పురజనులు.

అయ్యో మొన్నే అదే హాస్టలులో ఒక అబ్బాయి అద్దంలోనుండి దూకి చచ్చిపోయాడుగా..
“అబ్బే మా అబ్బాయి బ్రతికేవున్నాడండీ.’
ఇంటిలో దొరకని అవాజ్యప్రేమకై కుఱ్ఱాళ్ళు అమ్మాయిల వెంట పడి వేదిస్తున్నారు కదండి. కాస్త వారి సక్సెస్ పేరిట వారిపై పెట్టే వత్తిడి తగ్గించవచ్చుకదండీ.
“అబ్బే మా అబ్బాయి మేము చెప్పిన సంబంధమే చేసుకున్నాడండీ, మా కాలనీలో ఎవరమ్మాయినో ఎవడో బాగా వేధించాడు కానీ, మాకు అమ్మాయిలు లేరులెండి బ్రతికిపోయాము”
ఆ రెసిడెంషియల్ పాఠశాలలో చదివిన మావాళ్ళు చాలామంది ఇప్పటికీ తీవ్ర మానసిక వత్తిళ్ళకూ ఇబ్బందులకూ లోనౌతున్నారండి. వాళ్ళకి నాయకత్వ లక్షణాలు అబ్బట్లేదండీ.
“అబ్బే అక్కడే చదివిన మా అన్నయ్యగారి తోడల్లుడిగారబ్బాయి ఇప్పుడు అమెరికాలో సిస్కో కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడే.
అయినా అలాంటి వాటికి బయపడి , అబ్బాయిని బంగారు గుడ్లు పెట్టే కోడిగా మార్చడాన్ని మానుకుంటామా యేంటి. “
అంటే మీరు బంగారం కోసం కోడినే చంపుతున్నట్టుంటేను.
“వీడెక్కడ దొరికాడండీ, నాయనా నువ్వు ఈడి మాటలు వినకు, వీడు పూర్తిగా చదివేసుకుని ఇలా మట్లాడుతున్నాడు”

* * *

దేఁవుఁడు తమకు ఏటియమ్ముల బదులు రక్తమాంసాల ముద్దను ఇచ్చాడేయని బాధపడిన వీరు, వెంటనే అతని తప్పు సరిదిద్దడానికి ఏర్పరచుకున్న ప్రతిదేఁవుఁడే ఈ విద్యావ్యవస్థ. పిల్లలు లోపలికెళ్ళి బయటకు వచ్చేది కీలు గుఱ్ఱాలు. కనీసం సదుపాయాలు అందించలేని ఈ వాణిజ్య ప్రభువులు , తమ బావమరుదుల స్కూళ్ళ కోసం ప్రజల బళ్ళను గొడ్ల సావిళ్ళ కంటే హీనంగా తయారు చేశారే. ప్రభువుల అండతో యంత్రం పరుగులు తీసిందే.

మనిషన్నవాడెవడూ తమ తమ బిడ్డలను ఇంత ఘోరంగా శిక్షించుకోలేడు. అవునవును. కాబట్టే బడి వుంది.
అక్కడో మూర్ఖుడు విద్యాశిఖామణి, వాడి దృష్టిలో ఉదయం నుండి రాత్రి వఱకూ పిల్లల్ని రుద్దనిదే, వాడి టెల్గులో మాట్లాడితే శిక్షించనిదే వాడికి నిద్రపట్టదు. ఆత్మవంచనకు భయపడి స్వయానా తమ తమ పిల్లల్ని ఇలా దండించుకోలేక, ఆ పనిని ఎంతో డబ్బు కట్టబట్టి, ఆత్మ లేని ఒకడికి అప్పగిస్తారు వీరు.
“ఉరేయ్ మావాడు ఇంటికాడుంటే అస్సలు మాట వింటలేదురా, వీణ్ణి హాస్టలులో వేసేయాలి.”

* * *

తల్లీ మేరీ మాతా,
వీరి గుండెల్లోని విషాన్ని వీరికే ఇలా తొందరపాటులో ఎత్తిచూపడం ఎంత వెఱ్ఱిదనం.

వీరి భాషలో వాలుకి పెయింటు వేస్తారు.
వీరి భాషలో పేడెత్తి ఒళ్లో పెట్టుకుంటారు.
వన్నూ టూఊ త్రీయీ వీరి అంకెలు.
టూ డేస్ కోసారి షాప్ కెళతారు.
వీళ్ళ బేబీస్ థరడు మంతులో ఆడతారు,
ఎయిత్తు మంతులో పాకుతారు,
వన్నియఱ్లో నడుస్తారు.

వీరు గుడ్డుని అప్రిషియోట్ చేస్తారు.
వీరు అప్పుడప్పుడూ వెరయిటీగా చూస్తారు, ప్రవర్తిస్తూంటారు.

వీరు ఒకే దెబ్బతో అటు ఆంగ్లమధర్కి ఇటు తెలుఁగమ్మతల్లికీ నెత్తురు కక్కిస్తారు.

* * *
అయినా నువ్వు చేసిన తప్పు ఏఁవిటి నాకు ఇంకా అర్థం కాలేదు.

I NEVER SPEAK IN TELUGU. అని వారి చేత వ్రాయించి మెళ్ళకు కట్టావు. వీరికి దొరల భాష ఆంగ్లము సరిగా రాదు క్షమించమ్మా. వీరి భాషలో simple present tense అనేది ఎక్కడో నలిగి చచ్చిపోయింది.

దీని అర్థము. నాకు తెలుఁగులో మాట్లాడే అలవాటు లేదు. లేదా నేను తెలుగు గతమున, వార్తమానాన, భవిష్యత్తున మాట్లాడలేదు, మాట్లాడబోను. అని వారికి తెలియదు.

The Sun never rises in the west అని వీరికి చెప్పినా దాని అర్థము, “సూర్యుడు ఇంకెప్పుడూ పశ్చిమాన ఉదయించడు” అని కాదని వీరికి తెలియదు పాపం.

* * *
వీరు like this only. వీరు different different varieties ని try చేస్తూంటారు.

అయినా మేరీ మాతా నువ్వేమీ భయపడకమ్మా నీ భవిష్యత్తుకీ ఏఁ ఢోకా లేదు. ఇప్పుడు కూడా ఎవరో నలుగురు వారి బ్లాగుల్లో నీ మీద దుమ్మెత్తి పోసి, హిట్లు లెక్కేసుకోవడం తప్ప ప్రజానీకం చేసేదేంలేదు.
ఫలానా సంత జోసపు బడిలో తెలుఁగులో స్పీక్ చేసినందుకు ఇంత కఠినంగా శిక్షిస్తారని తెలిసిన ప్రజలు తండోపతండాలుగా మీ బడికి తమ పిల్లల్ని తోలకపోతే వట్టు. నా మాట విని నువ్వే సొంతగా ఒక బడి పెడితే ఎంతో ఆదరణ లభిస్తుంది. ఆత్మలేని అసురులు రాజ్యమేలే కాలాన నీవే తల్లి మహారాణివి. పూర్వం నీ పేరు పెట్టుకొన్నయోకావిడ ఎంతో దయఁజూపించిందఁట. ఇక నీ శ్రమ తప్పిందిగా!

అయినా నేను దేని గుఱించి మాట్లాడుతున్నాను. వార్తా స్రవంతుల వరద రొచ్చులో కొట్టుకుపోయిన వీరి బుఱ్ఱలకి ఇంకా నువ్వెవరో గుర్తుంటేనేగా...

No comments:

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం