భాషందం, భువనందం, బ్రతుకందం

Friday, September 21, 2007

తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీ‌డేస్ నిజంగానే వస్తున్నాయా?

ఉపోద్ఘాతం
ఇది తెలుగు సినిమా పరిస్థితి శీర్షికతో వేస్తున్న టపద్వయంలో రెండవది. ఒకటే పెద్దది, వ్రాస్తే మీకు సోదనిపించవచ్చని రెండుగా విడదీయడమైనది. మొదటిది సినిమా పతనం గురించి, రెండవది, దాని పనరుత్కృష్టం గురించి మనము కనగలిగిన కలలకు కల కరాణాల గురించి వ్రాద్దామని నిశ్చయించాను. కానీ అలా చేసిన విభజనలో, నిరాశతో కూడినది ౯౦శాతం, ఆశతో కూడినది ౧౦శాతం గా కనిపించాయి! (దానిలో ఆశ్చర్యపడవలసినదేమీ లేదు). అందుకే రెండు సగాలుగా విభజింజడం జరిగింది. క్రిత టపాకి తరువాయిగా దీన్ని పరిగణించగలరు.

కాపీ రాజులు
నాకు భగవంతుడు పనికిరాని ప్రజ్ఞ ఒకటి పెట్టాడు. అది ఎఁవటంటే, ఒక సినిమాని అరనిమిషం చూసినా అది దేనినుండి కాపీ కొట్టారో, లేద దేనికది కాపీనో చెప్పగలను. మొన్న ఒక రోజు 'ఎ షాట్ ఇన్ ది డార్క్' చూస్తుంటే, అరే ఇది చంటబ్బాయే అని అనుకున్నాను. ఇన్స్‌పెక్టర్ జాక్వస్ క్లసో ని కొట్టడం ఎవరి తరమూ కాదు, మన చంటబ్బాయి తరం అసలు కాలేదు. అప్పటి వఱకూ చంటబ్బాయి మీద చాలా అభిమానవుండేది. కానీ ఆ రోజు, సాంటా క్లాజ్ లేడని అర్థవఁయ్యింది. చంటబ్బాయి పూర్తగా కాపీకాదులెండి, అందులోని చాలా మంచి భాగాలు మాత్రమే కాపీలు. మిగిలిన మెలోడ్రామా అంతా, మన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు రచించిన ఒక నవల మీద ఆధారం. నానా రకాలు కలిపితే కుడిత తయారైనట్టు, రెండు మూడు సినిమాలు కలిపి ఒక తెలుగు సినిమా తియ్యడంచాలా సార్లు జరుగుతుంది. అలాంటిదే ఇంకో ప్రయోగం 'మైఁ హూఁ నా' కి 'ది డిపార్టెడ్' కలిపితే వచ్చిన కషాయం 'ఖతర్నాక్'.

మీకో మలయాళీ మిత్రుడుంటే అడగండి, మలయాళంలో అతి మంచి సినిమా ఏదని? (మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి). చాలా మంది 'మణిచ్చిత్రత్తాೞು' అనే చెబుతారు. దాన్ని తెలగుతమిళాల్లో 'చంద్రముఖి'గా తీసి కంపుచేయడం జరిగింది. అసలు సినిమాలో మోహన్ లాల్ సినిమా సగంలో వస్తాడు, (రజనీలా ముందు వచ్చి మళ్ళీ వెళ్ళడం వుండదు). ఇప్పుడు అదే సినిమాని హిందీలో తీస్తున్నారు. అన్ని హిందీ సినిమాల్లోలాగ ఇందులో కూడా అక్షయకుమారు, విద్యాబాలన్ నటిస్తున్నారు. సినిమా పేరు 'బూలుబులయ్యా'. నాకు మామూలుగా సినిమా ప్రకటన చూస్తేనే అది దేని కాపీనో అర్థమవుతుంది, కానీ ఈసారి అలా జరగలేదు. దానికి కారణం. "హరే రాం, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రాం" అనే పాట వుంది ఆ సినిమాలో. అందులో, నిక్కర్లేసుకున్న ఫారిన్ అమ్మయుల వెనుక భాగం తూగుతూ చూపించబడినది. సినిమా కథకీ, సినిమా లోగోగా వాడుతున్న ఆంగ్ల భూతం బొమ్మకీ, పాటలో భగవన్నామ స్మరణకీ, మారుతున్న దుస్తులకీ, ఆ అమ్మాయిల వెనుకలకూ గల సంబంధం నాకు గోచరించలేదు.

కాపీ కొడితే తప్పేంటి ?
అందరూ అడిగే ప్రశ్న "కాపీ కొడితే తప్పేంటి? ఆఖరున సినిమా బాగుంటే" అని. చాలా తప్పులున్నాయి.
గమనికః హక్కులు కొని సినిమాని తీయ్యడం కాపీకాదు.

నైతికంగా
సినిమాలో కాపీ అనేది సంఘంలో కాపీకి ఒక నిదర్శనం మాత్రమే. ఈవాళ ఆంధ్ర దేశం నైతికంగా ఎంత దిగజారిపోయిందో, తెలియాలంటే, పెద్ద పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్లలో, పదో తరగతి పరీక్షల కిచ్చే శిక్షణ గురించి తెలుసుకోండి. కాపీ కొట్టమని చెప్పి మరీ పంపుతారు పిల్లల్ని. అలా ఆఖరుకి ఎవరైతే వ్యవస్థని వంచి, పెడదారి వెంట పిల్లలందరినీ పాస్ చెయిస్తారో వారే ఘనులు. అలా పాసైనోళ్లు, రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు, వారే కలక్టర్లు, వారే కాంట్రాక్టర్లు, వారే రాజకీయవేత్తలు, వైద్యులు, ఇంజనీర్లు, ఇంక చెప్పేదేఁవుంది ?
బొట్టూ బొట్టూ కలిస్తే వరదౌతుంది, ఆ వరదలో దేశం మునకెత్తుతుంది.
మన కంపు ప్రపంచమంతా ప్రసరిస్తుంది.

సృజనాత్మకత పరంగా
మన సృజనాత్మకత నుండి జనించిన కళ మనకు మనోరంజనం మాత్రమే కాదు. అది మర్త్యులైన మనము మన భావి తరాలకందించే సంపద. ప్రస్తుతము మన భావితరాలకి "మన ముందు తరాలవారు చేతగాక, ఇతర భాషలనుండి కాపీకొట్టి, మన సంఘానికి దర్పణం పట్టని సినిమాలు తీసార"నే భావం కలిగిస్తున్నాం. అది మీకు సమ్మతవైఁతే "అదృష్టవంతులు మీరు, వడ్డించిన విస్తరి మీ జీవితం".

సంఘానికీ సినీ దర్పణవేఁది
ఈ విషయ ప్రస్తావన మొదటి భాగంలో కూడా జరిగింది. నేటి సమాజంలో జరిగే రీతిలో ఒక్క విషయాన్ని కూడా తెరకెక్కించరు.
సంఘంలో చోటు చేసుకునే మార్పులు, విస్తరించిన అన్యాయాలు, వ్యాపించిన వ్యత్యాసాలు, బురదలోని పందుల మధ్య వికసించిన పుండరీకములు, సాధారణ జీవన అసాధారణందాలు, ధైర్యవంతుల అపజయాలు, మోసగాళ్ల అంతశ్శూన్యాలు. ఇలా ఎన్నింటి మీదైనా తీయవచ్చు. అవేవి లేవు.

కనీసం నిజ జీవితం లో జరుగు విధంగా 'మామూలు మనుషులు ధైర్యం వహించి, చివరకి ఏ ప్రయోజనం లేకుండ మట్టి కఱచిన వైనం' వంటివి కూడా సినిమాలలో లేవు. అలాంటివి తీసినా చూసే వారు లేరు. ఏ కేరళలోనో తప్ప. అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.
ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు. సంఘం మారే కొద్ది ఇవి కూడా మారతాయి.

మన గొప్ప సంస్కృతినీ, పురాణాలనీ వాడుకుని సినిమాలు తీయడం చేతకావట్లేదు. ఏ మైథాలజీ లేని పాశ్చాత్యులు మాత్రమ పైరేట్స్, హ్యారీ పాటర్ వంటివి విరివిగా తీసేస్తున్నారు.

ఏ లోకాలలో ఉంది కళా
తెలుగునాట ఏకైక కళన్నారు సినిమా. దేనిలోనైనా ఒక్కటి మాత్రమే మిగిలి ఉండండం వల్ల వచ్చే సమస్యేమిటంటే, కొంత సేపటికి ఏమీ లేకుండా పోతాయి!
సమాజంలో వెలసిన కళంటే, ఎవరో కొందరు ఒక నగరంలో కూర్చుని విరచించేది, రాష్టమంతటా దాన్ని చూచి ఆనందించేదీ కాదు. కళంటే, నిత్యజీవితంలో అందరూ పాలుపంచుకునేది. కళ జీవన విధానం. డబ్బు విలువకు సమాజంలో నిలకడైన అభిప్రాయవేఁర్పడినప్పుడు, నిజానందాల వేట ఫలించగా దొరకిన అమృత భక్షణం.
లాటినమెరికాలో అందరూ ఆడే సాంబాసాల్సాలు, హార్లెంలో హిప్‌హాప్, న్యూయార్లెన్సులో జాజ్, మనూళ్ళలో కోలాటం, జపానులో హైకూ పద్యాలు, పాకిస్థానులో షాయరీలు, వియన్నాలో పిల్లవాడు లెక్కలతోబాటు నేర్చుకునే పియానో, కొరియాకెనడాలలోఅమ్మయిలు నేర్చుకునే ఫిగరు స్కేటింగు, ఇంగ్లాండులో యుద్ధయోదులు సైతం నేరిచిన వాల్‌ట్సు!
కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరిసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వూరి పడుచులు పెట్టే ముగ్గు.

అన్ని సినిమాలూ, కొన్ని సినిమాలు

సమరసింహారెడ్డి
మంచి సినిమా, దీనితో నిర్మాతలకు, ప్రేక్షకాభిరుచుల విశ్వరూప దర్శనవైఁయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ వచ్చిన ప్రతి తెలుగు సినిమాలోనూ దీని ప్రభావం కనబడుతూనే వుంది. ప్రక్షకులకు తమలోని నీచత్వం సంఘమనే అద్దంలో కనిపిస్తున్నది. దానిపై కలిగిన అసహ్యాన్ని హింసతో దులుపేసుకునే ఒక సదుపాయం చూపించిందీ సినిమా. ప్రతి కథానాయకుడు ఈ కథతో ఒక సినిమానైనా తీసాడు. నరసింహ నాయిడు, ఇంద్ర, సింహాద్రి, మాస్, లక్షీ, పోకిరీ... చిన్న చిన్న బదలాయింపులతో (సీమకక్ష్యల బదులు మాఫియా, రాయలసీమ బదులు విశాఖపట్నం).

నువ్వే కావాలి, ఖుషీ
ఈ రెండూ తెలుగు నాట కొత్తగా వచ్చిన 'ప్రేమకీ, అన్నాచెల్లెల్ల సంబంధానికి మధ్య తూగే స్నేహ'మనే కొత్త అంశంమీద తీయబడ్డ సినిమాలు. అప్పట్నుంచి, వేలాది సినిమాలు వీటినుండి స్ఫూర్తి పొందాయి. ఇప్పటికీ కొత్త సినిమాలు, నిజజీవిత యువత యొక్క అంతర్లైంగిక సంబంధాలలోని వైవిధ్యాల కన్నా ఈ రెంటి సినిమాలనుండే ఎక్కువ 'స్ఫూర్తి' పొందుతున్నారు. చిత్రవేఁవిటంటే, ఒకటి మలయాళం నుండి, ఇంకొకటి తమిళం నుండి తీసుకోబడ్డాయి (అది తప్పేంకాదు). ఈ సినిమాలలో తెలుగు విశ్వవిద్యాలయ పంతుళ్లకు సరికొత్త అవతారమివ్వబడినది. విద్యాభ్యాసానికో కొత్త నిర్వచనం ఇవ్వబడినది.

పై రెండిటి ఛాయలూ లేని తెలుగు సినిమా ఈవాళ చాలా అరుదు.

ఇక సూపరు డైరెక్టరు శంకర్ సినిమాలు చూస్తే. జెంటిల్‌మాన్‌కి, శివాజీకి తేడా పెద్దగా ఎఁవ్ లేదు. ఆమాట కొస్తే రామాయణానికీ, శంకర్ సినిమాలైన భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు వంటివాటికీ పెద్ద తేడా లేదు. అదే ప్రజ, అదే అసుర (రావణుడి బదులు అవినీతి), అదే యుగపురుషుఁడు (రాముని బదులు రజినీ), అదే పూజించే ఆచారం. అమెరికా వ్యక్తిత్వవాదానికి, రష్యా సమానవాదం విరుద్ధం అంటారు. కానీ అవి రెండూ ఒకటే, వాటికి విరుద్ధం, తమలోని రాముని చూడలేని, నేటి భారతీయం. భౌతికవాదానికి, మిథ్యావాదానికీ మన జవాబు సంతృప్తివాదం, సర్దుకుపోదాం.

హ్యాపీ డేస్ నిజంగా వస్తున్నాయా ?
ఆఖరుగా చెప్పుకోదగ్గవి, బొమ్మరిల్లూ, శేఖర్ కమ్ముల.

బొమ్మరిల్లు
నేటి యువత యొక్క మారుతున్న ఆలోచనావిధానం మీద ఆధారపడిన మంచి సినిమా. మొదటి సగం మాత్రం, నేటి తెలుగు సినిమా భుజంగకోరలలో చిక్కుకున్న మూషికమే. అదే వెకిలి కాలేజీ హాస్యం, అదే ఉపాధ్యాయలపై హాస్యం. కాని రెండవ భాగం మాత్రం తెలుగు సినిమా చరిత్ర మొత్తం ఇప్పటి వఱకూ నడిచిన దారిలో వేసిన ఓ ముందడుగు. రేపటి సినిమాలకో దిక్సూచి.

కమ్ముల
తెలుగు సినిమాలో ఎన్నడూ లేని (కనీసం ఈమధ్య కాలంలో), "attention to detail" ని ప్రవేశ పట్టారు. బొమ్మరిల్లు తెలుగు సినిమా నడిచిన బాటలో ముందడుగైతే. ఇది తెలగు సినిమాలకే కొత్త తరం. నాటకాల నుండి సినిమాకి లభించబోయే పూర్తి విముక్తి!

బొమ్మరిల్లు కథా గోదావరి (అదృష్టఁవుంటే హ్యాపీడేస్) కథనం కలిసినపుడు, తెలుగు నాట మంచి సాంఘిక సినిమా అవతరిస్తుంది. కాని చిక్కేవిఁటంటే, వీటిని కాపీ కొట్టలేం. కానీ అయ్యో మన వరికొచ్చిందదొకటేగా !

ఇక హారీ పోటర్, పైరేట్స్ అఫ్ కరీబీయన్ లాంటి సినిమాలు తెలుగునాట తీయ్యాలంటే, దానికోసం, ఇంకో యాభై ఏళ్ల తరువాత ఏ శైలేశ్వరో, దినేశ్వరో వారి బ్లాగులో వేసే టాపా, 'తెలుగు సినిమా దుస్థితి' (౧౦భాగలలో ౭వది) చూడండి.

(సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఎ అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)

కొన్ని ప్రతిసూచనలు (రిఫరెన్సులు)
౧) నేటి సినిమాలలో వికృత పోకడలు - విపరీత ధోరణులు - కాలిపు కూర్మావతారం
౨) Interactivity in Art - కిరణ్ వారణాశి
౩) సంతోషం-మున్నాభాయ్-పోకిరి - వెంకట్ సిద్దరెడ్డి
౪) రీమేక్ సినిమాలు - కృష్ రేం

16 comments:

  1. "కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వురి పడుచులు పెట్టే ముగ్గు."
    ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం .. లేదా .. బాల వాక్కు బ్రహ్మవాక్కు! :-)
    (సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఎ అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)
    పొరబడ్డావు - చాలా అవుతుంది. త్రికరణ శుద్ధి అంటె .. మనసా, వాచా, కర్మణా .. మనసులో సంకల్పంగా అనుకున్నది ముందు ఇలా మాట రూపంగా బయటికొచ్చి అప్పుడు క్రియా రూపం ధరిస్తుంది. కానీ, మాటలు కానీ ముందు.
    గమనిక - ఆవేశం పాళ్ళు పెరుగుతున్నట్టున్నాయి, అప్పుతచ్చులెక్కువవుతున్నాయి.

    ReplyDelete
  2. వన్నాఫ్ యువర్ బెస్ట్! మళ్ళీ మళ్ళీ వాడుకోదగిన కొటేషన్సు ఇందులో చాలా ఉన్నాయి. చాలా నచ్చేసింది పో! ముందు టపా కన్నా అప్పుతచ్చులు తగ్గాయనే చెప్పాలి. ఐనా ముక్కు సంగతి కాస్త చూసుకుని ఆ తర్వాత ఆవేశపడితే బాగుండేది. పచ్చడైతే కష్టం కదా :)

    ReplyDelete
  3. పాళి గారు
    "ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం .. లేదా .. బాల వాక్కు బ్రహ్మవాక్కు! :-)"
    అవునండి నా ఆలోచన మీద శ్రీశ్రీ ప్రభావం పడకపోయినా, భాషమీద పడిపోతుంది :)
    బాలవాక్కు? ఎప్పుడో పోయింది లెండి బాల్యం!
    "పొరబడ్డావు - చాలా అవుతుంది."
    మీరిలాగే ప్రోత్సహిస్తే, నాకు ఉద్యోగం దొరికినట్టే.. తొందరలో బ్లాగబహిష్కారం చేసుకోవాలి. జీవితాన్ని చక్కదిద్దుకోవాలి.
    అచ్చుతప్పులు - ప్రితి టపాతోనూ, నా తెలుగు హద్దులను జరపప్రయత్నిస్తున్నాను, కాబట్టి తప్పులు తప్పవు (పురోగమన ప్రయాస). ఇంకో సారి ఈ టపా చదివి, నాకు కనిపించిన తప్పులు సవరించడం జరిగింది.
    కృతజ్ఞతలు.

    ReplyDelete
  4. వ్యాసం బావుంది. ఇళయరాజా సంగీతం (అంతా కాదు) కాపీ కొడతాడు అంటే జనాలు ఒప్పుకోలెదు - కాని, MJ పాటలు కొన్ని వినిపించిన తర్వాత....

    ReplyDelete
  5. @ శ్రీరామ్
    ఇక ఆవేశం బంద్ లెండి. ఇదే ఆఖరు. 'గొఱ్ఱెల మంద...' కూడా వేస్తానో లేదో?
    నాకు ఈ టపా చెత్త అనిపించినపుడు ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏఁవిటో వారి అభిరుచులు :)
    @ ఆదిత్య హృదయం గారు
    ఇళయరాజా సంగీతం పై రాక్ అండ్ రాల్ ప్రభావం కొట్టొచ్చినట్టుంటుంది. దానిలో సందేహం లేదు. కాని నాకెప్పుడూ ఈ పాట ఆ ఆంగ్ల పాటకి కాపీ అని అనిపించలేదు. కాబట్టి నేను కూడా ఒప్పుకోను :)
    ఎఁవైనా మీ బ్లాగు కనబడినందుకు సంతోషం. బ్లాగానికి స్వాగతం.

    ReplyDelete
  6. చాలా బాగా రాసారు. కానీ పైన చెప్పినట్టు అప్పుతచ్చులు కొన్ని పంటి కింది రాయిలా తగిలాయి. అవును మరి స్టాండర్డ్స్ పెంచుతున్నారుగా అనుభవించండి :)

    ఇక సినిమాల విషయానికొస్తే నాకు తెలిసి ఎలాంటి సినిమానయినా లెక్కపెట్టగల మూసలలో బంధించవచ్చు. అలాంటప్పుడు రిపిటీషన్లు తప్పవు. నా ప్రకారం కాపీలు కావు. అయితే ఇక్కడొచ్చిన చిక్కేమిటంటే కనీసం ఆ మూసలో ఉన్న పదార్థాన్ని కొత్తగా చూపించడానికి కూడా ప్రయత్నించకపోవడం.

    ఇక్కడ నా ప్రకారం విషయమేమిటంటే జనాలు సినిమాలని అంత సీరియస్‍గా తీసుకోరు. సినిమా ఎంతో కాలంగా ఓ వినోద మాధ్యమమే కానీ సమాజాన్ని ని మార్చే ఓ ఉపకరణం కాదు జనాలకు. ఎక్కువ జనాలు సరదాకి సినిమా చూస్తారు కానీ దాని నుండి ఏదో నేర్చుకోవాలని కాదు. కాబట్టి ఆ కొద్ది గంటల సమయం వారికి శృంగారం, నాట్యం, సంగీతం, హాస్యం, ఎమోషన్ అన్నీ కలగలిపి చూపిస్తే అంతే చాలు.

    అలా కాక సినిమాని నిజ జీవితంగా చూడగలగాలి అంటే ఆ తరహా విషయాన్ని కూడా ఆకట్టుకునే లాగా చూపించగలగాలి లేదా మన ఆడియన్సు ఆ లెవెల్ కి ఎదగాలి. నలభై యాభై శాతం ప్రజలు దారిద్ర్య రేక దిగువన ఉన్న ఇలాంటి దేశంలో సడన్ గా అలాంటి మార్పు రాదు.

    ReplyDelete
  7. చాలా వివిరంగా రాసారు సినిమాల గురించి. విశ్వనాథ్ గారి తరువాత అంతలా అడపాదడపా అయినా మంచి సినిమాలు తీసేవాళ్ళే కరువయ్యారు. శేఖర్ కమ్ముల కూడా విద్యావంతులనే నమ్ముకున్నాడు. ఏమైనా, కొంచం జిగేల్ జిగేల్ మనిపిస్తే తప్ప వ్యాపారాత్మకంగా పెట్టుబడికి తగ్గ డబ్బులు రావు కదా. వాటికి తగాట్లే సినిమాలున్నూ.

    ReplyDelete
  8. మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి...నిజమే! మీరు అడిగారా?:)

    ఇక మూడు సంగతులు...
    "అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు."- అందుకే ఆ తేడా!

    "రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు"-వీరిలో చాలా మంది మన దేశ అవినీతిపైన విరుచుకు పడుతూంటారు!

    "నాకు ఈ టపా చెత్త అనిపించినపుడు ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏఁవిటో వారి అభిరుచులు :)"-తెలుగు ప్రేక్షకులు కదా మరి:)

    ReplyDelete
  9. గోదావరి, బొమ్మరిల్లు మీకు నచ్చినట్లున్నాయి.

    నా దృష్టిలో అవి ఒక కొత్త రకమైన చెత్త పోగేయడానికి ఉపయోగపడేవి మాత్రమే!

    ReplyDelete
  10. అయ్యో, చూసారా మీరు ఒప్పుకొవట్లేదు! ఒక సారి ఇది తిలకించండి - http://teluguwebchannel.blogspot.com/

    ReplyDelete
  11. @ ప్రవీణ్
    మూస అంటే template ఆ ?
    కొన్నిటికి మీరన్నట్టు మూస-పోలిక ఉంటుంది. మున్నాభాయి కి, పాచ్ ఆడమ్స్ కీ ఉన్నట్టు. వాటిని క్షమించవచ్చు.
    కానీ, ఆట సినిమా లో mr. deeds ని, mr. bean ని కాపీ కొట్టడం, దూషార్హితం.
    "నలభై యాభై శాతం ప్రజలు దారిద్ర్య రేక దిగువన ఉన్న ఇలాంటి దేశంలో " అయ్యబాబోయ్ ఇవవై శాతమేనండీ ! మీరు పెంచేయవద్దు :D
    @ వికటకవి
    నిజమే.. చదువుకున్నవారా, పైరసీ చేసి ఇంటర్నెట్లో చూసేస్తూంటారు :(
    @ ismail గూరు
    "మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి...నిజమే! మీరు అడిగారా?:)"
    నిజమేనా ? కొంపదీసి మీరు గాని అడిగారా ? :)
    నేను రెండు సార్లు కేరళా ఎక్సుప్రెస్సు మిస్సయ్యా అందుకే అందరికీ చెబుతున్నా :(
    @ రాధిక గారు
    నేను పదేళ్ళ తెలుగు సినిమాలలో, నాలుగు సినిమాలు మంచివన్నాను, మీరు వాటిని కూడా నా నుంచి లాగేస్తారా :(
    వద్దండి తెలుగు సినిమా మీద నేను పెట్టుకున్న ఆశలు కాలరాయొద్దు :)
    @ ఆదిత్యహృదయం గారు
    ఇండియన్ థ్రిల్లర్ ఇళయరాజా మహత్యమా ?
    నాకు తెలియదులెండి. కానీ ఇళయరాజా కాబట్టి క్షమించవచ్చు. నిజంగానే శాంటా క్లాస్ లేదు :(

    ReplyDelete
  12. ఛా! అవును ఆవేశంలో రాసాను. తప్పే :)

    ReplyDelete
  13. రాధిక గారు .. మీరు మా స్నేహం కవితలు, అంతకటే ఎక్కువగా వ్యాఖ్యలు రాసే రాధిక గారు కాదనుకుంటాను. ఎందుకంటే ఆమె అయితే .. రాకేశ్వరుడు ఆ రెండు సినిమాల గురించీ ఇంత సున్నితంగా కట్టుకున్న ఊహల సౌధాన్ని ఇంత నిర్దాక్ష్ణ్యంగా కూల్చిఏయరు - అది ఆమె చేత గాదు. ఎనీవే .. ఆ సినిమాలు కొత్త రకం చెత్తకి మూలమని మీరెందుకనుకుంటున్నారో వినాలని బహు కుతూహలంగా ఉంది. మీరొక సోంత బ్లాగు మొదలెట్టి విపులంగా వివరంగా రాస్తే మరీ సతోషిస్తాం. నిజంగా!

    ReplyDelete
  14. అడిగాను కానీ మళయాళీ భామను కాదు...అచ్చ తెనుగు తెనాలి అమ్మాయిని...ఆ తర్వాత పెళ్లీ జరిగింది:( కొసమెఱుపు:ఆమె మళయాళీ భామ లాగే ఉంటుందని జనుల ఉవాచ:)

    ReplyDelete
  15. - రాధిక గారు,
    "ఆ సినిమాలు కొత్త రకం చెత్తకి మూలమని మీరెందుకనుకుంటున్నారో వినాలని బహు కుతూహలంగా ఉంది" నిజంగానే తెలుగు సినిమాల మీద మీ అభిప్రాయం ఎంటో ?
    - ఇస్మెల్ గారు,
    అదృష్టవంతులు మీరు :)

    ReplyDelete
  16. అక్కడ కామెంటు రాసిన రాధికను నేను కాను.నావరకు పాత సినిమాలను కూడా గొప్పవనలేము.రేపెప్పుడో ఇరవయ్యో శతాబ్ధం లో వచ్చిన సినిమాలు ఎంత గొప్పగా వుండేవో తెలుసా అంటూ ఆనంద్,గోదావరి,గ్రహణం,వనజ,శివ,ఇంద్ర లాంటి సినిమాలు ను ఉదాహరణగా చూపిస్తారు.పాత పాటల్లో మంచి సాహిత్యం ఎంత వుందో,చెత్త అంతకన్నా ఎక్కువ వుంది.కానీ మనం మంచిని చూపిస్తూ అలాంటిపాటలు రావట్లేదని బాధ పడుతున్నాము.అలాగే ఇప్పటి సిరివెన్నెల పాటల్లాంటివాటిని చూపించి తరువాతి తరాల వారు అలాగే అనుకుంటారు.ప్రస్తుతం ఎప్పుడు చాలామందికి ఆమోదయోగ్యం కాదు.గతమయ్యాకనే దానికి విలువ పెరుగుతుంది.మంచి చెడు అన్నవి కాలాన్ని బట్టి మారుతూ వుండడమే దానికి కారణమేమో?

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం