భాషందం, భువనందం, బ్రతుకందం

Wednesday, May 27, 2009

త్రిశంకు స్వర్గం

ఈ పూటకి నేను మీ పాలిటి విశ్వామిత్రుడను, మీరు నా పాలిటి త్రిశంకు. మీరు మీ భౌతిక శరీరంలో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నారు. నేనంటాను, "అది కుదరదు నాయనా దానిబదులు ఏ బారుకో పోతే నీ కష్టాలను కొంత సేపు మఱచిపోతావు, రేప్రొద్దుట లేచాకా షరా మామూలే, కాబట్టి అది కూడా పెద్ద లాభం లేదు. అయినా ఇంకా వేఱే మార్గం ఏం లేదు" అంటాను. అయినా మీరు స్వర్గానికి తీసుకెళ్ళవలసిందేనని పంతం పడతారు. నేనిక త్రిశంకు కథ చెప్పి తీరాల్సివస్తుంది.

వెనకటికి మీ పూర్వీకుడు త్రిశంకు కూడా ఇలానే మారాం చేస్తే విశ్వామిత్రుడు (వశిష్టుని మీద వైరుధ్యం కొద్దీ) ఈయననకు స్వర్గానికి తోడ్కొని పోతూండగా, ఇంద్రుడు అలా కుదరదని మారాం చేసేసరికి, విశ్వామిత్రుడు ఇంకో కొత్త స్వర్గాన్ని సృష్టించి, అక్కడో కొత్త ఇంద్రుణ్ణి తయారు చేయబోతే ఇంద్రుడు మళ్ళీ మారాం చేస్తాడు. దేవతల దర్నాలను తట్టుకోలేక మొత్తానికి త్రిశంకు అలా స్వర్గానికీ వెళ్ళలేక, భూమి మీదనా వుండలేక, మధ్యలో వ్రేలాడుతూవుంటాడు. ఆయనకోసం విశ్వామిత్రుడు అక్కడే ఒక స్వర్గాన్ని తయారు చేశాడట. (కథ ఇక్కడ మఱియు ఇక్కడ).

అప్పుడు మీరు. అఱ్ఱె ఇది అచ్చు అమెరికా వెళ్ళిన మా పెదబాబుకొడుకు సత్తిగాడి కథ. వాడు కూడా ఇలానే మధ్యలే వ్రేలాడుతున్నాడు, అక్కడ బ్రతకలేక ఇక్కడికి రాలేక అని అంటారు. నేను అబ్బేకాదు మీ పూర్వీకునికి నిజంగా జరిగిందయ్యా రామనాథా అంటాను. అప్పుడు మీరు అయితే ఏది చూపీ ఆ త్రిశంకు స్వర్గాన్ని అంటారు.

మీ అదృష్టం పండింది.
ఇది జ్యేష్ఠమాసం. సూర్యుడు వృషభంలోనున్నాడు (Taurus). కాబట్టి పొద్దు క్రుంకే సరికి, పశ్చిమాన మిథునం (Gemini), దాని నెత్తిన కర్కాటకం (Cancer), దాని నెత్తిన సింహం (Leo) - ఆ సింహం హింగాలు దగ్గర ..అనానిమిషులు భయపడవద్దు.. శని, సింహం వెనుక కన్యా (Virgo) వుంటాయి, ఆ కన్యకు పిఱుదైన చిత్రా (Spica) నక్షత్రానికి ప్రక్కన దాని సవతి హస్తా (Corvus) వుంటుంది. పొద్దు పూర్తిగా పోయాక ఒక గంట సేపు ఆగితే మీకివన్నీ స్పష్టంగా కనబడే అవకాశం దేవుఁడు కల్పించాడు. కానీ మీరు త్రిశంకువులా పెద్ద స్వర్గానికని బయలుదేరి పెద్ద నగరాలలో చిక్కుకున్నారు కాబట్టి ఆ అవకాశం హైదరాబాదు పుట్టుపాతు మీది బీడి ముక్కలా కాల వ్రాయబడ్డిది.

ఆ అవకాశాన్ని వాడుకుంటున్న కొంత మందికీ హస్తా నక్షత్రయుగళము క్రిందన, అనగా దక్షిణాన చూస్తే (బాగా దక్షిణాన, అంటే ఇంక దక్షిణ దిక్కునకు కొద్దిగా పైన) అక్కడ మీకు కిరస్తవ శిలువ లాగా ఒక నాలుగు నక్షత్రాలు కనబడవచ్చుఁ. మీ వూరి దగ్గర కొబ్బరి చెట్లు వుంటే దక్షిణాన, మీరు మేడో నీళ్ళ స్తంభమో ఎక్కాల్సివుంటుంది. అలా దక్షిణాన హస్తానక్షత్రానికి అచ్చం క్రిందగా కనిపించే ఆ శిలువే త్రిశంకు.


ఇక్కడ ఉత్తరం పైకి దక్షిణం క్రిందకి తూర్పు ఎడమ వైపు. (దక్షిణాముఖంగా నిలబడి ఆకాశానికేసి చూస్తే ఎలా వుంటుందో అలా ఈ బొమ్మ వుంటుంది. అంతే గానీ కుడియడమవలేదు!)సింహరాశి పంచభుజం కనుగోవడం తేలిక. మఱియు చిత్ర, స్వాతి, ఉత్తర రల త్రికోణం కనుగొనడం తేలిక. అలానే దాని క్రింద హస్త చేతి ఆకారాన చతుఃభుజం. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి)

హస్త నుండి బాగా దక్షిణాన చూసినచో త్రిశంకు కనబడవచ్చు. త్రిశంకు కంటే ఆల్పాబేటా సాంచురై తేజోమయమైనవి. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి) (Microsoft World Wide Telescope వారి సౌజన్యంతోఁ)

ఈ త్రిశంకు మఱియు సాంచురై దక్షిణార్ధగోళంలో వున్న వారికి ప్రతి రాత్రీ కనిపించినా, మన ఉత్తరార్ధగోళంలో వున్నవారికి మాత్రం ఇంచు మించుగా పిబ్రవరి నుండి మే వరకూ కనిపించవచ్చు అందులోనూ మీరు భూమధ్యరేఖకు దగ్గరగా వుంటేనే. మీ వూరిలో లైట్లు తక్కువుంటేనే, మీ వూరిలో కరెంటు పోతేనే, మీ వూరికి దక్షిణాన పెద్ద నగరాలు లేకపోతేనే, మీ కంటి చూపు బాగావుంటేనే, అప్పుడు మబ్బు వేయకుంటేనే. అదీను రోజుకు ఇంచు మించు రెండు గంటలు మాత్రమే. ప్రత్తుతానికా రెండు గంటలూ ఎనిమిది గంటల దగ్గర.

నేను ఎప్పటి నుండో దీన్ని చూద్దామని పాగా వేసుక్కూచున్నాను, కానీ చివరకు నిన్న దర్శనమిచ్చింది. ఏప్రేలులోనైతే రాత్రి పదింటికి కనబడుతుందట. నిన్నరాత్రి, హస్తా నక్షత్రం క్రింద శిలువ నెత్తెము, ఎడమకొన కనిపించే సరికి అఱ్ఱె ఇది త్రిశంకు స్వర్గంలా వుందే అని చెప్పి, శిలువ కాలు కుడికొన వెదికితే ఎక్కడ ఏదోవుందనే అనిపించింది. వేంటనే కంప్యుటరు లో చూస్తే అదే! ఇంకే ముంది, వేంటనే కెమరా తెచ్చి అష్టకష్టాలూ పడి, దీనిని తీయడం జరిగింది.
(F3.5, Exposure 30secs.. అవును ముప్పై క్షణాలు!!!). స్టాండు కూడా లేకపోయేసరికి కష్టమయ్యింది. ఇక వచ్చిన బొమ్మ కూడా పెక్కు నల్లగా వుంది. దానిని Histogram Equivalize చేయవలసివచ్చింది Gimpఉనఁ. మీకు అచ్చం ఇలాగా ఇంత స్పష్టంగానూ కనబడుతుందనుకుంటే పప్పులో కాలు వేసినట్టే. అన్నట్టు ఆగ్నేయాన ఆ అగ్ని మా వూరి దగ్గర పోలవరం ప్రాజెక్టు తాలూకు కాలువల త్రవ్వకాల పనుల విధ్యుద్కాంతి. ఐనా కనబడడం మన అదృష్టం.

కొబ్బరి చెట్ల మధ్యన శిలువకు ఎడమ ప్రక్కనున్నవి ఆల్పా, బీటా సాంచురై. ఆల్పా సాంచురై సూర్యునికి అతి సమీపానున్న నక్షత్రమని మీకు చిన్నప్పటి గురుతు రావచ్చు. (పూర్తి బొమ్మకై దానిఁబై క్లిక్కండి)

ఇక ఇది శిలువ ఆకారంలో వుండడం వలన, బ్రేజిల్ ఆస్ట్రేలియా వంటి దక్షిణార్ధ దేశాలలో ఇదంటే మక్కువ, వారు దీనిని వారి జాతీయఝండాపై సైతం పెట్టుకున్నారు. అంతటితో ఆగక, సదన్ క్రాస్ చర్చి అని, అక్కడో కొత్త ఈశ్వరుణ్ణి సైతం సృష్టించారు. ఆస్ట్రేలియపు ఆదివాశి జాతులలో వేఱు వేఱు కథలు సైతం వెలసినవి మన త్రిశంకు కథలా.

మొత్తానికదీ నచ్చత్రం.. దాని బట్టి కత.. దాని బట్టి జాతీయం.
మీరు ఇప్పుడే బయటకు వెళ్ళి త్రిశంకు స్వర్గ దర్శనం చేసుకురండి. ఉత్తరార్ధగోళంలో వుండే మనకు దీని దర్శనం కలుగడం నిజంగా అదృష్టం.
ఈ బ్లాగు చదివే సగటు ౨౦౦ మందిలో,
ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం క్రింద వండే వారు ౧౦౦.
అందులో పల్లెల్లో వుండే వారి సంఖ్య ౧౦
అందులో మంచి కంటి చూపు కలిగిన వారు
అందులో బయటకు వెళ్ళి గమనించు చూచేవారు ౦.౧
అందులో గాలివానా వంటివి లేకపోయిన వారి సంఖ్య ౦.౦౧

ఏదేమైనా వేయడం నా బ్లాగుధర్మం (దేనిమీదనంటేదానిమీదఁ ఏలానంటేనలాఁ మా సిద్ధాంతం)

లంకెలు
దక్షిన శిలువ (ఆంగ్లాన), త్రిశంకు కథ, కథ (ఆంగ్లాన), నక్షత్రాణి, Gimp, Microsoft Worldwide Telescope

ఉంటాను మఱి
నా కోసం నా సతులు మఘ, పుబ్బ, ఉత్తర, స్వాతి, చిత్రా, హస్త, విశాఖానురాధాదులు ఏడి రాకేశ్వరుఁడు, రాడే, కుండీ ప్రక్కన మనకై జలకాలడడే.. అని ఎదురు చూసి, చివరకు నేను వచ్చి స్నానం చేస్తుంటే.....
నన్ను చూసి కిలకిల నవ్వి ఇలా అంటారు
చూడు వీడు, అందమైన వాడు, ఆనందం మనిషైన వాడు,
కలల పట్టు కుచ్చులూగుతూన్న కిరీటం ధరించాడు
కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు
ఎఱ్ఱని పెదవులమీద తెల్లని నవ్వుల వీణల్ని మీటుతున్నాడు
ఎవరికీ దొరకని రహస్యాల్ని వశపరచుకున్నాడు
జీవితాన్ని ప్రేమించినవాడు జీవించడం తెలిసినవాడు
నవనవాలైన ఊహావర్ణార్ణవాల మీద ఉదయించిన సూర్యుడు
ఇతడే సుమీ మన ప్రియుడు, నరుడు, మనకి వరుడు.. రాకేశ్వరుడు

5 comments:

  1. బహు చక్కగా వ్రాశారు. మీ సంభావ్యతా పరిధులను అతిక్రమించి నాకు త్రిశంకు కనిపిస్తుందేమో చూస్తాను!

    ఒక సవరణ:
    విశ్వామిత్రుడు త్రిశంకుని తోడ్కొని పోలేదు. ఆయన క్రిందనే ఉండి త్రిశంకుని మాత్రం పైకి పంపించాడు. మీరు మరోలా చెప్పాలంటే, H1B కన్సల్టెంటులాగా అన్న మాట.

    ReplyDelete
  2. హ్మ్మ్ చాలా కష్టపడి చదవాల్సొచ్చింది.

    ReplyDelete
  3. అమ్మో..మీ త్రిశంకు చక్రం లో చాలా ఇన్ఫర్మేషన్ వుందండీ బాబు ..

    ReplyDelete
  4. మీకు జ్యోతిష్యం కూడా తెలుసా...

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం