భాషందం, భువనందం, బ్రతుకందం

Monday, November 16, 2009

గూదరికం

నేను చూడ్డానికి నా వయస్సు కంటే చాలా చిన్నగా అనిపిస్తానఁట. అంటే చిన్నగా చిన్నగా కాదు, (Not small small కి తెలుఁగు అనువాదం) వయస్సులో చిన్నగా, మన అసలు ఒడ్డూ పొడుగూ కాస్తే ఎక్కువే.

నాలుగేళ్ళ క్రితం అమెరికాలో పీజీ (వాళ్ళ బాషలో వుత్త జీ) చేస్తున్నప్పుడు అందరూ అడిగేవారు నువ్వు ఎన్నో యేఁడు అని (అంటే యూజీలో ఎన్నోయేఁడని వాళ్ళ ఉద్ధేశం). ఒక నాడు యమరీ విశ్వవిద్యాలయంలో ఏదో ఆటపాటలకు వెళ్ళితే, అక్కడ నా నాట్య చాతుర్యం చూసిన ఒక కొత్త దేశీ విద్యార్థి, ముందు "నువ్వు మొదటి యేఁడా" అని అడిగాడు. అప్పటికే నాలుగేళ్ళు అయిపోయి, రెండేళ్ళు ఉద్యోగం చేసి వచ్చిన నాకు లోలో కాస్త ఆనందం వేసినా, పైకి ఆశ్చర్యం నటిస్తూ, ఛీ కాదు అన్నాను. అవును నువ్వు స్వింగు నేర్చుకున్నవాడిలా కనబడుతున్నావు కాబట్టి రెండో యేఁడు అయివుంటావు అన్నాడు. వాడు అప్పడే అమెరికా వచ్చిన మొదటి యేఁడు విద్యార్థి. నేనౌనన్నానో కాదన్నానో గుర్తులేదు కానీ, మనల్ని జనాలు గూదవాడిగా పరిగణిస్తున్నారని నాకు తెలిసింది. ఇది అనుభవం చాలా సార్లు జరిగింది. ప్రత్యేకించి జంటనృత్యశాలల్లో.

అప్పటిలో నా సహవాసి కూడా అనేవాఁడు, మాఁవా నువ్వు ఇఱవైనాలుగేళ్ళ వాడిలా వుండవు, గూదవాడిలానే వుంటావు, కానీ.. (ఈ కానీ చాలా ముఖ్యమైన కానీ) .. నువ్వు ఫిలాసఫీ మొదలు పెట్టినప్పుడు మాత్రం చాలా చాలా పెద్ద వాడిలా మాట్లాడతావు అని. అప్పుడు కూడా నాకు కాస్త సంతోషం వేసింది కానీ, అది త్వరలోనే బాధగా మారింది. ఒక ప్రక్కనేమో గూడవాడిలా ఆటాపాటా చూసుకోవాలని వుండేది. ఇంకోప్రక్క ప్రంపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే తపన. తెలుసుకున్న కొద్దీ పెరిగే బాధ. ఏసు ప్రభువు బైబిలిలో చెప్పినట్టుగా , ఎంత జ్ఞానం పెంచుకున్నవాడికి అంత దుఃఖమఁట. ఇది జరిగి మూఁడేళ్ళయ్యింది.

కాల చక్రం తిఱగడంతో ఆట వెనక్కి వెళ్ళి బాధ ముందుకొచ్చింది. చాలా చాలా తీవ్రంగా. నా రచనలు కూడా ఇలానే మారాయి. అప్పటిలో తోటరాముడు తరువాత అంతటివాడు అన్నారు బ్లాగ్లోకులు. ఇప్పుడు కత్తి మహేశు తరువాత అంతటి వాడు అంటున్నారు! నా మటుకు నాకు అది ఒక రకంగా మంచి పరిణామమే అనిపించినా, కుమ్మరి పొయ్యలో కాలిన ఉక్కులా ఈ మెటమార్ఫసిస్సు చాలా నొప్పి అనిపించింది.

మొన్న విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఉపాధ్యాయునిగా పనిచేశాను. పది రోజుల్లో పది మంది నన్ను విద్యార్థి అనుకున్నారు.
వెళ్ళీ వెళ్ళగానే, చేఱడానికి వచ్చాననగానే, ఎంటెక్కా బీటెక్కా అని అడిగారు. బీటెక్కు అందామనుకున్నాను కానీ, లేదు లెండి పాకల్టీ అన్నాను. ప్రక్క డిపార్టుమెంటుకు వెళ్ళినప్పుడల్లా, "ఊఁహూఁ మాష్టారుగారి చుట్టానివా? ఎంటెక్కా బీటెక్కా" అని అడిగేవారు. రెండూ చెప్తాను అనే వాడిని. "ఓహో. రెండూ ఎలాగా" అని అడిగేవారు. రెండిటికీ పాఠాలు చెప్పే పాకల్టీ అన్నాను. వారు ఆశ్చర్యపడేవారు. కొన్ని సార్లు చర్చలు కూడా జరిగేవి. ఇతను బ్యాగు వేసుకోవడం వల్ల అనే తీర్మానించారు కొందరు. ఈ కొత్త లెక్చరర్లతో నింతే అనేవారు ఇంకొందరు.

దారుణమైన పరాభవాలు ఎక్కడంటే. మన సూడో-ఫ్యూడలిష్టు దేశంలో.
గ్రంథాలయం దగ్గర. "హలో ఎక్కడికి" అనడిగాడు, "ఇక్కడ కంప్యూటర్లు వున్నాయా? జర్నల్లు ఎక్కడ వున్నాయి?" అని సమాచారం అడుగుతుంటే, చెప్పి, "ఎంటెక్కా బీటెక్కా" అని అడిగాడు. నేను పాకల్టీ అన్నాను. తోక తొక్కిన తాచులా లేచి నిలబడ్డాడు గ్రంథాలయఁపు అటెండరు. అవునా అండీ మీరా అండీ ఎ డీప్రార్టుమెంటండీ పలానా సబ్జెక్టుకు ఏం పుస్తకమైతే బాగుంటుందండి. అని నానా వినయతా ప్రదర్శించి తప్పును సరిదిద్దుకోడానికి ప్రయత్నిస్తుంటే, ఫ్యూడలిష్టు అవశేషభావాలు చేస్తున్న తాండవాన్ని చూసి అనందించాను నేను.

ఇక క్యాంటీనులోనైతే, మొదటి రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు.
రెండవ రోజు.. హలో హలో విద్యార్థలు ఇటు పక్కకాదు. ఇది పాక్లటీకి మాత్రమే అటు వెళ్ళు అటు వెళ్ళు. లాభం లేదని నేను కోపం నటించాను.
మూడవ రోజు.. హలో సార్ రండి. బాగున్నారా. ఎం తీసుకుంటారు?

కొందరైతే నన్ను ర్యాగింగు చేయడానికి కూడా చూశారు. ఏటీయంలో లోపలికి రాకూడదని గుర్తుచేసినందుకు ఇంకొకఁడు గొడవ కూడా పెట్టుకున్నాడు.

ఇక కన్నడ దేశంలో ఓదిత్తిద్దారా, ఓదిత్తిద్దారా, ఏను ఓదిత్తాయిద్దారె? అని తెలుఁగు దేశంలో చదువుతున్నరా చదువుతున్నారా ఏం చదువుతున్నారు? అని అడిగేవారు. కొన్ని సార్లు ఎంటెక్కు అనే వాణి, ఎందుకొచ్చిందిలే అని. లేదంటే, ఎం చేస్తున్నావు. పురుషుఁడు కాళీగా వుండకూడదు అని క్లాసు పీకుతారు. తత్త్వం తెలియని దద్దమ్మలు.


మొన్న హైదరాబాదులో,
భక్తి టీవీ వారింటికి వెళ్ళాను, నరసింహారావుగారి ఆముక్తమాల్యద దొరుకుతుందేమోనని, వెళ్ళాను. కాసేపు కూర్చోబెట్టాక ఒకావిడ వచ్చింది. ఇంచు మించు నా వయస్సేవుంటుంది. తెలుఁగులో యం.యే చేసి భక్తి టీవీలో పనిచేస్తున్నట్టుంది. అదృష్టవంతురాలు, యమ్మేకింకా ఆశ మిగిలివుంది అనుకున్నాను.
ఆముక్తమాల్యద 50 డీవీడీలు - 4వేలు
పాండరంగమాహాత్మ్యము 40 డీవీడీలు - 3 వేలు
కాళహస్తీశ్వర మాహాత్మ్యము 20 డీవీడీలు - రెండు వేలు
అని ఏవో రేట్లు చెప్పింది.
నా కోసమే అంటే కొంటరా అని అడుగుతుంది,అందమైన అమ్మయి అందునా యమ్మేచేసినావిడ ముందు పరువు నష్టం ఎందుకని చెప్పి, నా మిత్రులు అమెరికాలో వుంటారు వాళ్ళకి భక్తి టీవీరాదుగా వారి కోసం అడిగి తెలుసుకుంటున్నాను అని చెప్పాను. లోలోపల ఇంతిలా ఐతే వాళ్ళు సైతం కొనలేరేమోననిపించింది. నూటపది డీవీడీలకు 200డాలర్లు అంటే పర్వాలేదేమో.
ఇంకేమున్నాయి మీ దగ్గర అని అడిగాను, (మన స్థాయిలో ఏవైనా వుంటాయేమోనని) ఆవిడ, భక్తి టీవీలో కృష్ణుడి పాటలు వస్తాయి అవి ఒక డీవీడి ఐదు వందలు అన్నది. కృష్ణుడి మీదా? ఎప్పుడు వస్తాయి? అని అడిగాను.
మీరు భక్తి టీవీ చూస్తారా? అంది.
చూస్తాను.
అంటే మీరు చూస్తారా భక్తి టీవి.?
చూడకే రోజూ చూస్తాం.
అంటే 'మీరు' చూస్తారా రోజూ?
ఓహ్ అర్థమయ్యింది , యమ్టీవీ చూడవలసిన వయస్సులో భక్త టీవీ ఏంటని, భక్తి టీవి లో పనిచేసేవారికే అనిపిస్తే, మన సంస్కృతి గట్టెక్కినట్టే అనుకున్నా.

ఇది బయటి ప్రపంచం.
బ్లాగ్లోకంలో.
నేను నవతరంగంలో వ్రాసిన వ్యాఖ్యకు ప్రతిగా ఒకతను. ఈ పెద్దవాళ్ళకు నేటి యువత భావాలు అర్థంకాదు. అనవసరంగా వారి మీద ఆడిపోసుకుంటారు అన్నాడో పెద్దమనిషి. పేరులో ఫ్యాషనబుల్ గా కుమార్ పెట్టుకున్న అసలు పెద్దవాళ్ళ కంటే నా పేరులో రావు వుండడం నన్ను పెద్దవాణ్ణి చేసిందనుకుంట.

భక్తి టీవీ అనుభవం తరువాతి రోజు ఇంకో చోటికి వెళ్లాను, అక్కడొక బ్లాగరుని కలవడానికి. బ్లాగరుతోబాటు ఆయన యేజెంటు కూడా వుంటారు అక్కడ. ఈవిడా బ్లాగరే, ప్రస్తుతానికి మూసేసినట్టున్నారు కానీ నేను, తెరుస్తారని మాట తీసుకొనివచ్చాను. ఈవిడ కూడా రాకేశ్వర రావు అంటే చాలా పెద్ద వారయ్యుంటారనుకున్నానండీ. అంది. అంతే నండీ పేరు చూసి పెద్దాయన అనుకుంటారు అన్నాను. లేదండి, మీరు వ్రాసేదానిని బట్టి నేను అలా అనుకున్నాను అంది.

హారి దేఁవుఁడా ఇదేం చింపుడారా బాబూ. ఒక ప్రక్క శ్రీశ్రీ బాధ ఇంకో ప్రక్క Joie de vivre. జరాసంధుడిలా వుంది పరిస్థితి.

ఈ బ్లాగు చదవడానికి కన్నడ నుండి ప్రెంచి వఱకూ పలు భాషలు రావలసిరావడానికి చింతిస్తున్నాము. కానీ కమ్ముల శేఖరాని డాలర్ డ్రీమ్స్ లా మీకు వర్తిట్ అని అనిపిస్తుందని.

19 comments:

  1. ఈ మధ్యనే మీ టపా మేరీమాతా వందనం చూశాను. వెంటనే మరికొన్ని టపాలు చదివాను. రచనా విధానం చూసి ఈయనెవరో పెద్దాయనలాగున్నాడు అనిపించింది. ఇప్పుడు ఈ టపా చూశాక ఆశ్చర్యంగా తోచింది.

    ReplyDelete
  2. మీరు ఏమీ అనుకోకపోతే, గూదరికం/గూదతనం అంటే ఏమిటో చెప్తారా, వినడానికి బూతుల్లా అనిపిస్తున్నాయి (మొన్నటిటపాలో వాడిన సందర్భం కూడా అలానే అనిపించింది), కానీ ఈ టపాలో వాడిన సందర్భాన్ని బట్టి అలా అనిపించడంలేదు.

    ReplyDelete
  3. సీరియస్లీ ఫన్నీ గురూగారూ (గురూగారూ అన్నది గోరుచుట్టుపై రోకటి దెబ్బ అనుకునేరూ :) )

    ReplyDelete
  4. మీసాలేవన్నా అక్కరకొస్తాయేమో... పెంచి చూడండి :)

    ReplyDelete
  5. @ గిరీశం గారు
    అచ్చతెలుఁగు పదాలు వాడితే ఎప్పుడైనా బూతులవుతాయి ప్రత్యేకించి మధ్యతరగతి వాతావరణాల్లో, నగర వాతావరణాల్లో.

    లెక్క ప్రకారం సంస్కృత పదాలు వాడలి, ఉదా - రొమ్ములు స్తనములు.
    ఈ రోజుల్లో ఆంగ్ల పదాలు కూడా వాడవచ్చు. బ్రెష్టులు అని.

    ఉదా - పెళ్ళాము అంటే బూతు. భార్య అంటే బూతు కాకపోయినా చాదస్తం అవుతుంది. కాబట్టి మిస్సెస్సు, వైఫు అనాలి.
    ఇల్లాలు, ఆలి, పెండ్లాము, ఆవిడ, ఇంటామె, పెళ్ళం, గరిత, గృహిణి, భార్య, పత్ని, అర్ధాంగి, జీవితభాగస్వామి, సహధర్మచారిణి, జాని, జాయ, తల్పము, పాణిగృహీతి.
    ఇవన్నీ కాదు మిస్సెస్సు అనాలి. ఇంకానయ్యం మిష్ట్రేస్ అనలేదు.
    అన్నట్టు అచ్చమైన ఆంగ్లేయులు మిస్సెస్ అని ఎప్పుడూ అనడం నేను వినలేదు.
    -
    అలాగే గూద అనేది కూడా పల్లెటూరి కూలిల్లో చెడ్డపదం కాదు. మా మామ్మలు కూడా బాగానేవాడతారు. కానీ జనాలకి భాషమీద పట్టు జా౨రిపోతున్న ఈ రోజుల్లో ఏ మాటైనా బూతే!

    ReplyDelete
  6. మా వైపు చిన్నపిల్లొడు అని వాడటానికి గూదొడు అంటాం.. ఉదాహరణకి క్రికెట్ జట్టులొ అందరికన్నా చిన్నొడిని బేటింగ్ కి పంపాలంటే 'ఆ గూదోడి ని పంపండిరా ' అంటారు .. అది నాకు తెలిసి బూతేం కాదు.

    ReplyDelete
  7. అసలింతకీ గూదవాడు, గూదరికం అంటే ఏవిటి? సందర్భాన్ని బట్టి కొద్దిగానే అర్ధమయింది.
    వొచ్చిన గొడవేంటంటే, మనుషులకి తమతమ తెలివి తేటలమీద, ఎదుటివార్ని అంచనావేసే శక్తి మీద చాలా నమ్మకమెక్కువ. మనిషిని మనిషిలా చూళ్ళేరు, ఏదో ఒక ముద్ర (వీలైతే రేండో మూడో) వేసేస్తేనే గాని వాళ్ళకి తృప్తిగా ఉండదు.

    ReplyDelete
  8. కొత్తపాళీ గారు .. మీ వ్యాఖ్య లొ అఖరు మూడు లైన్లు అర్ధం కాలేదు.. :-( సడన్ గా ఇలా ఎందుకు రాసారా అని..

    ReplyDelete
  9. నావీ మీలాంటి అనుభవాలే! వచ్చిన చిక్కల్లా, అవి మీ టపా మొదటి పేరాల్లో లాంటివి కావు, చివరి పేరాల్లో లాంటివి :-( అదో తమాషా!

    ReplyDelete
  10. @కొత్త పాళి గారు
    గూద = juvenile, small
    గూదోడు గూదది వంటి ప్రయోగాలు వున్నాయి. గూదరికం అన్నది పెద్దగా వాడకపోయినా పెద్దరికంలా గూదరికం వుందనుకోవచ్చుఁ.

    @కామేశ్వర రావు గారు,
    మీ పేరూ మీ పాండిత్యం మీరు వ్రాసే అంశాలు (పద్యాలూ), చూసి ఎవరైనా అలానే అనుకుంటారు. నాకు మీ బెంగుళూరి బాబాయి చెప్పారు, మా అబ్బాయే పెద్ద వయసేముండదు అని. అయినా మీ ఇమేజి నా దృష్టిలో పెద్ద మారలేదనే అనాలి :)

    ReplyDelete
  11. పక్షపాతంతో అభాసు మాటలు మాట్టాడుతున్నారు కాబట్టి ఇది పక్షాభాసము అన్నామనుకోండి? .. :)

    సోపపత్తికంగా నిరూపించవచ్చును కూడానా? ఎలా? ఏమో? అయినా. అది తర్వాత. మానసిక సంతులనా సమన్వయక్రమం ఈయన విషయంలో శాస్త్రీయమో, అశాస్త్రీయమో చదువరులే చర్చించాలి. అయినా చపలం ఎంత చెడ్డదో అంత దొడ్డది కూడానూ. దాన్ని అదుపులో పెట్టటం అందరి వల్లా అయ్యే పనీ కాదు. అందులోనూ గూదరికం కల చిన్న, సన్న, కుఱ్ఱకారుకు తొందఱతనం లావడంత, కాకుంటే కొండంత.

    చూస్తుంటే సవతులందరూ సమానులే కాబట్టి అధస్సూచికలో స్థలం కలిపిస్తే పోతుందని ఆలోచించినట్టున్నారు వీరు.

    భాషలో చేదు భాషలు, పులుపు భాషలు, తీపిభాషలు అనేవి ఉండవు. అయితే ఒకటి మటుకు చెప్పాలె - భాషాభిమానం మంచిదే, భాషాదురభిమానం అత్యంత ప్రమాదకరం. అప్పుడెప్పుడో 500వ సంవత్సరంలో " స్వస్తిశ్రీ ఎరికల్ ముత్తురాజుల్ల కుణ్డికాళ్ళు నివబుకాను ఇచ్చిన పన్నస " ....ఇలాగున్న తెలుగు ఈనాటికి ఏ రూపం సంతరించుకుందో తెలీని గూదరి అని అనుకుంటే - తప్పు తప్పు మహాప్రభో " కొట్టంబున పాఱకు కుణ్డి కాళ్ళుల ఇచ్చిన పన్నస..." అనే రకం ఈయన అని హైదరాబాదులో చార్మీనార్ కట్టినప్పుడు చేసిన శాసనం మీద రాశారుట. అదండీ సంగతి.

    వెటకారం, బాధ, వ్యంగ్యం, నొప్పి కావాలంటే తాడిచెట్టు ఎక్కించి అద్గదిగో ఆ కొండల మీద ఉన్నదే అది ఓ గూదరీ అని చూపించొచ్చు. అలా ఒప్పుకోకపోతే ఎక్కిన తాడిచెట్టుకున్న మట్టతో ఒక్కటిచ్చి బైర్లూ కమ్మించవచ్చు. కానీ దానివల్ల ఎవరికి లాభమేమిటీ అని ఆలోచిస్తే లావడతనం బయటపడుతుందా ? అదయ్యా సంగతి ఓ గూదరీ.

    పొగపేసి అందులో వలపలగిలక ఇంచుక రాచ్చిప్పలో కూరి, ఒక్క జెల్ల కొడితే తత్సమం తద్భవం అవుతుందిట. కాబట్టి ...- మీ నాన్న వున్నాడా అన్నదానికి మీ అమ్మ మొగుడున్నాడా అంటే ఏమవుతుంది ? అలాటి సన్నివేశమే జరిగుండొచ్చు ఇక్కడ. కాబట్టి ఎవరి హద్దుల్లో వారు ఉండటం ఔచిత్యమనిపించుకుంటుంది. గుఱ్ఱం అంటే తురగం, సారంగం, ఘోటకం, అశ్వం అని పిత్తలిహాటకం మాటలూ మాట్టాడొచ్చు.

    తెలుగు, సంస్కృతంలాగా పూర్తిగా వ్యాకరణానికి లొంగి పడుండలా, అందుకే అది జీవద్భాష అయ్యింది. దాని జీవాన్ని కాపాడుకోవాలని చూసేవాళ్ళు అందరూ ఒకతాటిపైకి వస్తే బాగుంటుంది అంతే కానీ, పోచికోలు మాటలు, ఆపైన అక్కడెక్కడో చదివొచ్చామన్న అహంకారమున తామే విశాలభావాలు కలవాళ్ళమని చూపించుకోవటానికి జోగిరాజు ప్రయత్నాలు చేస్తే ఇట్టి లావడతనమట్టే ఉంటుంది.కాబట్టి సర్వేజనాస్సుఖినో భవంతు.

    వయస్సువల్ల ఒక గమ్యం లక్ష్యం ఏర్పరచుకోకుండా గాలికి తిరిగే పటంలా కాకుండా చేసే పనిని శ్రాద్ధం చెయ్యండి. శ్రాద్ధం అంటే - శ్రద్ధగా చేసేది అంటే కానీ చచ్చిపోయినోళ్ళ కర్మ కాండ కాదు. :)

    క్షితిమ్లేచ్ఛ భాషశ్రుతిగ
    ర్హితమగునట్లైన నా ధరిత్రిని దానిన్
    మతిరోసి విడువఁగూడదు
    సతతము వ్యవహార హాని సంధిలు కతనన్

    హేత్వాభాసము తత్త్వాన్వేషణంలో దుర్బలం, అనావశ్యం

    పైన రాసిన దానిలో అర్థం కానిదేదన్నా ఉంటే ఆ లావడంత గూదరికి ఇక చెప్పేదేమీ లేదు.

    ReplyDelete
  12. READ this

    "తెలుగు, సంస్కృతంలాగా పూర్తిగా వ్యాకరణానికి లొంగి పడుండలా, అందుకే అది జీవద్భాష అయ్యింది. దాని జీవాన్ని కాపాడుకోవాలని చూసేవాళ్ళు అందరూ ఒకతాటిపైకి వస్తే బాగుంటుంది అంతే కానీ, పోచికోలు మాటలు, ఆపైన అక్కడెక్కడో చదివొచ్చామన్న అహంకారమున తామే విశాలభావాలు కలవాళ్ళమని చూపించుకోవటానికి జోగిరాజు ప్రయత్నాలు చేస్తే ఇట్టి లావడతనమట్టే ఉంటుంది.కాబట్టి సర్వేజనాస్సుఖినో భవంతు."

    AS

    తెలుగు, సంస్కృతంలాగా పూర్తిగా వ్యాకరణానికి లొంగి పడుండలా, అందుకే అది జీవద్భాష అయ్యింది. దాని జీవాన్ని కాపాడుకోవాలని చూసేవాళ్ళు అందరూ ఒకతాటిపైకి వస్తే బాగుంటుంది అంతే కానీ, పోచికోలు మాటలు ఒకళ్ళు, అక్కడెక్కడో చదివొచ్చామన్న అహంకారమున తామే విశాలభావాలు కలవాళ్ళమని చూపించుకోవటానికిన్నీ, సందు దొరికింది కదా అని విషం కక్కటానికి తయారు అయిపోయేవాళ్ళున్నూ, ఒకళ్ళను మించి ఒకళ్ళు జోగిరాజు ప్రయత్నాలు చేస్తే ఇట్టి లావడతనమట్టే ఉంటుంది.కాబట్టి సర్వేజనాస్సుఖినో భవంతు.


    :) :) :) Confusion ? NO.. :) :)

    ReplyDelete
  13. నాకూ అలాగే అని పించిందండీ మంచు పల్లకీ గారు.

    ReplyDelete
  14. @ మంచుపల్లకీ .. సడన్‌గా రాయడం ఏమి లేదు. నేను సాధారణంగా గమనించిందే. అందరూ కాదనుకోండి, కొందరు అతితెలివి గాళ్ళుంటారు. అంతెందుకు, బ్లాగుల్లోనే చూడండి. ఏదన్నా కాస్త సీరియస్ విషయం రాస్తే, రాసిన విషయం అర్ధం చేసుకునే ప్రయత్నమేదీ లేకపోగా ఆ రాసిందాంట్లో ఏమి తప్పులెదుకుదామా, రాసినోడికంటే మనం తెలివైన వాళ్ళమని ఎట్లా చూపించుకుందామా అన్నట్టు ఉంటాయి కొన్ని వ్యాఖ్యలు.

    ReplyDelete
  15. ఇప్పుడు అర్థమయ్యింది గురువుగారు మీరు చెప్పేది.
    వ్యాఖ్యానించేటప్పుడు ఇంకో రెండు విషయాలు ఏం జరుగుతున్నాయంట,
    ౧ అంతర్జాలం అంటేనే ముసుగుల మూట అయినప్పుడు అందరూ వారి వారి ముసుగుల చాటు కూర్చుని వారి రా యమోషన్లకు ఆజ్యం పోసి మాట్లాడుతూంటారు.
    ౨ టపాని టపాగా చదువుతూంటారు చాలా మంది, ఈ మనిషి వ్యక్తిత్వం ఏంటి, ఇతని చరిత్రా యేంటి, ఈతని పూర్వాభిప్రాయాలు ఎటువంటివి అన్నది కూడా పరిగణించరు.
    ౩ నా ఉద్ధేశంలో వ్యాఖ్యానించడం చాలా తేలికయ్యే సరికి (వెనకటి టపాలకైతే తపాలావాడికి సొమ్ము ముట్టజెప్పాలని చెప్పి కొంత సంకోచం వుంటుంది) కాస్త విచ్చల విడిదనం వుంటుంది.
    ఈ నాలుగు పరిణామాలు కలసి కాస్త కంటెనషియస్ గా తీర్ఛిదిద్దాయి బ్లాగ్లోకాన్ని. కానీ ఇటాల్ కమ్స్ విద్ ద టెరిటరీ కదా..
    అవ్వా కావాలీ బువ్వా కావాలీ అంటే ఎలా?

    ReplyDelete
  16. రెండు విషయాలు జరుగుతున్నాయని మూడు నంబర్లేసి, నాలుగు పరిణామాలంటున్నారు, మరి ...:)

    పూర్వాభిప్రాయాలతోనూ, వ్యక్తిత్వాలతోనూ, చరిత్రతోనూ రాజ్యాలు, సామ్రాజ్యాలూ కూలిపోయాయండోయి. బ్లాగొక లెఖ్ఖా? ముసుగులు మటుకు నిజమే, వాస్తవమే. నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు అభినందనలు. కాకుంటే కృష్ణశాస్త్రినో, శ్రీశ్రీనో అనుకునేవారికే తప్పలా జరుక్కాయిలు. ఇక నిజమైన వారి పరిస్థితి ఏమిటి ? :) అందుకని...

    విషయంలో పస ఉండాలి, మనిషిలో పస ఉండాలి అర్థం చేసుకుందుకు - అది కామెంటయినా సరే, టపా అయినా సరే.... :) లేపోతే తెలివితేటలు సిరాలో ముంచుకోవటమే, తరువాత దేనితోనన్నా రాసుకోవటమే, సపోసు ఫర్ సపోసు గురువు గారికి అతితెలివి ఉందనుకోండి, శిష్యుడికి తెలివి ఉంటుందా, అతితెలివి ఉంటుందా ? అదేం ప్రశ్న? తమరి శ్రాద్ధం! - బోలెడు మతలబుల మతాబులు చుట్టొచ్చు - తెలివి అతితెలివిలతో వచ్చిన తిప్పలివి. అర్థం అయితే సంతోషం. :)

    అది కాదు కానీ ఇంకోమాట చెప్పు అంటే - చతుస్సూత్రాలు చెప్పటమే - శలవు..ఇప్పటికి.. :)

    ReplyDelete
  17. @ మగంటీ వంశీ గారు,
    మీ మొదటి రెండు కమెంటులూ నాకు అర్థంకాక ప్రక్కనచెట్టాను, అర్థమయినప్పుడు వ్యాఖ్యానిద్దామని. ఇలోపు ఇంకోటి!
    మీ వ్యాఖ్యల మాటతీరుని బట్టి మీరు రాజమండ్రి విజయవాడ మధ్యవారని పిస్తుంది. కొంపదీసి చాటపఱ్ఱు మాగంటోరో? ఎక్కడో చెబితే ఇక్కడిక్కడే పని మీద తిరుగుతూంటాను కాబట్టి, అటొస్తే కలవచ్చుఁ. అప్పుడు అర్థమయ్యేట్టు చెప్పవచ్చుఁ:, మీ కొన్ని మాటలు కంటెన్షియస్ గా వున్నాయనిపిస్తుంది కానీ కవర్ చూసి బుక్కు గుఱించి మాట్లాడకూడదు కాబట్టి ముఖాముఖి అవకాశం వున్నప్పుడు కలవడం బాగుంటుంది.

    ReplyDelete
  18. రాకేశ్వర రావు గారు, నా పై వ్యాఖ్య
    //ఇప్పుడు ఈ టపా చూశాక ఆశ్చర్యంగా తోచింది.

    ఈ టపాను, అభిప్రాయాలను నిరసించాలని కాదని మనవి. నా ఉద్దేశ్యం మీరు తక్కువ వయసు కలవారని ఆశ్చర్యం. కొత్తపాళీ గారు చెప్పినట్లు ఏదొక ముద్ర వేయకుండా ఉండలేరేమో జనాలు. వ్రాసినవి నచ్చినపుడు మంచి(పాజిటివ్) అభిప్రాయం కలగటం సహజం.

    ReplyDelete
  19. వెంకటరమణ గారు
    మీ వ్యఖ్యను నేను మంచిగానే తీసుకున్నాను. చాలా మంచిగా.. వయసుకు మించిన తెలివితేటలనిపిస్తే సంతోషమేగా :D

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం